May 1, 2024

అమ్మ మనసు

రచన:- పి.లక్ష్మీ వసంత

 

అమ్మా! అంటూ తనయ్ పరుగులు పెట్టుకుంటూ వచ్చి ఒళ్ళో వాలి పోయాడు, “అబ్బా! అలా మీద పడిపోకురా బాబూ! “ఎంత పెద్ద వాడైపోతున్నాడు, అంటూ ముద్దుగా విసుక్కుంటూ లేచాను. వాడికే దోటి చేసి పెట్టాలి. సాయంత్రం ఉపహారం ఇప్పుడు ఈయన మటుకు ఈయన చేతులూపుకుంటూ ఉదయమూ, సాయంత్రమూ  నడక  అంటూ  ఇంట్లోంచి పారిపోతారు,  తనకి  తప్పదు  కదా! చంటివాడు ఎదుగుతున్న పిల్లాడు ఇంకా నాలుగో తరగతి ఇపుడు,ఎప్పటికి తేరేను? తీరేను? నాబాధ్యతలు అంటూ మోకాలు మీద చేయాంచి లేస్తూ, ఈ రమణమ్మ ఇవాళ కూడా వనిలోకి రాలేదు, తన కష్టాలు తనవి. మొగుడు  తాగి వచ్చి కొట్టాడు అంటూ చూపిస్తుంది, నువ్వూ తిరిగి కొట్టు, ఓ కర్రపుచ్చుకుని అంటే “అమ్మో! చంపేస్తాడు” అంటుంది.  నాలుగిళ్ళల్లో పని చేస్తూ పోషిస్తున్నది తనే, ఓపిక ఉంటే, తాగని రోజు పనిలోకి వెళతాడుట, లేకపోతే  ఇంట్లోనే  తాగి  పడుకుంటాడుట, తాగి వచ్చిపడుకున్నా ఫరవాలేదు, ఏదో ఒంక పెట్టి నా వీపు మీద గుద్ది చెయ్యి మెలి పెట్టితన్నకుంటే చాలు అని దణ్ణం పెట్టుకుంటుంది …ఆడవాళ్ళు అందరూ ఇంతేనా? కష్టాలలోనే సుఖాలు వెదుక్కుంటూ ఉంటామా?”.

ఇడ్లీ పిండి తో ఓ ఊతప్పం చేసి పెడితే ఆవురావురమని తిన్నాడు, అదొద్దు ఇదొద్దు అంటూ ఒక్క నాడూ వంకలుపెట్టడు. అమ్మా, అమ్ముమ్మా అంటూ ఎలా తోస్తే అలా పిలుస్తాడు వీడికి అమ్మ పోలిక రాలేదు నయం .. అపర్ణ వీడి వయసులోనే ఎంత అల్లరి చేసేది, వేడిగా దోసలు పోస్తే పూరీలు అనేది, ఇప్పటికిప్పుడు ఎలా వస్తాయే అంటే, ఆయన పోనీ లెద్దూ, పిల్ల నోరు తెరిచి అడిగింది ఆ మాత్రం చేసి పెట్టలేవా? నీకింకేం పని చెప్పూఇంట్లో, ఉన్నమా ఇద్దరికీ రుచి గావేళకి చేసి పెట్టడమేగా? అంటూ వత్తాసు పలకడం ఒకటి. తండ్రీ కూతురూ ఎంత ఆడుకున్నారు తనతో తల్లిగా ఓ మంచి మాట చెపితే చాలు, వెక్కిరించడం.

ఇంకా ఏ కాలంలో ఉన్నావు నువ్వు…ఇప్పుడు అమ్మాయిలు విమానాలు నడుపుతున్నారు అంటూ ఒక్కగా నొక్క పిల్లని అంత దూరం ఎందుకండీ చదువులకి అన్న నా మాట పెడ చెవిన పెట్టారు. తన కూతురికే నా స్వతంత్రం? నాకేది? అంటూ నిలదీసి ఎందుకో మరి తను అడగలేక పోయింది. ఈనాడు ఇలా ఉన్నారు కానీ వయసు మీద పడి పెళ్ళి అయిన మొదలూ ఎంత సేపూ రుచుల యావ ఆవపెట్టి ఆనపకాయ వండూ ముక్కల పులుసులో ముక్క బాగా ఉడకాలి అంటూ ఎన్నిరకాలు చేయించుకునేవారు ఏనాడూ ఒక్కమంచి మాటలేదు..ఎంత సేపూ వంకలు పెట్టడమే…..అతనికి నచ్చినట్టు వంటలు చేసి పెట్టడమే నా ఉద్యోగం నాకంటూ మరో వ్యాపకం లేదా? అని ఒక్క నాడూ నోరు విప్పి అడగలేదు తను. అడగందే అమ్మ అయినా పెట్టదు అని సామెత, తనదేనా తప్పు?

అపర్ణ అదే కదా అంది, అమ్మా…నువ్వు ఎప్పుడూ నాన్న మాట ఎందుకు వింటావు…నీ ఇష్టం అంటూ ఏమీ లేదా? అని. రెండు ఊతప్పాలు గబ గబా తిని, తిన్న కంచం వంటింటి సింక్ లో పడేసి, అమ్మా! కింద కెళ్ళి ఆడుకుంటాను, వచ్చి చేస్తానులే హోంవర్క్ అంటూ తుర్రుమన్నాడు తనయ్. అబ్బ! ఎంత తేడా తల్లీ కొడుకులకి ఇవాళెందుకో అపర్ణ చాలా గుర్తువస్తోంది కోరుకున్నది చేతిలోకి వచ్చి పడిపోవాలి అనేది

కూతురి లక్షణం. అలా గడిచిపోయింది తనకి.

ఇప్పుడు ఎంతయిందో సమయం ఆ అమెరికాలోఏమిటో ఎన్ని సార్లు చెప్పినా ఆ గంటల తేడా

తన బుర్రలోకి ఎక్కదు.. అంత దూరమ్లో ఉంది పిల్ల అని బాధ వల్లనో, ఏమో!

బెంగుళూరులో బీ టెక్ అంటూ వెళ్ళింది అప్పుడే అమ్మో ఎంత దూరం లో చదువా అని మనసుకి కొంచం

బెరుకు కలిగింది, ఇంకా చిన్న పిల్ల కదా, ఎవరి ఆకర్షణలో పడిపోతుందో ఆ వయసు ఉద్రేకం వేడి తనకి తెలియనివా! నీదంతా ఇంకా పాత చింత కాయ పచ్చడి చాదస్తం అంటూ తండ్రీ కూతురు కలిసి తన మాటలని వేళాకోళం చేసారు. అదేమిటో నా పట్ల అంత పాత కాలం నాటి మొగుళ్ళ ఆధిపత్యం చూపించే ఆయన కూతురి మీద మటుకు అవ్యాజ ప్రేమ చూపిస్తూ సర్వ స్వతంత్రాలూ  ఇచ్చేసారు . తల్లిగా తను ఏవో నాలుగు మంచి మాటలు  చెప్పినా కొట్టి పడేసే మొండితనం అపర్ణకి ఎవరు ఇచ్చారు .. ఈయనేగా!

ఒక బాధ్యత అయింది అని ఊపిరి పీల్చుకుని కాస్త విశ్రాంతిగా ఉందాం అనుకునే సమయానికి తనకి మళ్ళీ మొదటికి వచ్చినట్టయింది … ఈ పిల్లాడిని తెచ్చి తన ఒళ్ళో పడేసింది.

అపర్ణ ఈ రోజు వచ్చి, అమ్మా నా పిల్లాడినివ్వు, నే తీసుకు వెళిపోతాను అంటే తనకి గుండె గొంతులోకి రాదూ, ఎంత ముద్దుల మనవడు తన తనయ్, తల్లి పోలిక ఎందులోనూ లేదు, అమ్మమ్మా! కూర్చో నేను పెడతాలే కంచాలు బల్లమీద అంటాడు, ఎవరు చెప్పారని? తనకి ఆమాటకే కళ్ళమ్మట నీరు గిర్రున తిరుగుతాయి ఎందుకో అంత బేలగా ఉంటుంది తన మనసు తన కూతురి స్వతంత్ర భావాల్లో తనకి ఆవగింతైనా ఉంటే బాగుండేది కదా! ‘అపర్ణా! నీకు నచ్చిన వాడిని మొండి పట్టు పెట్టి పెళ్ళి చేసుకున్నావు సరే,  మూడేళ్ళు తిరక్కుండావాడికీనాకూ పడదు అంటూ , పొరపాటు జరిగింది ,ఆలోచించలేదు ఇప్పుడు నాకు మూడో నెల ఉంచుకోనా, తీయించుకోనా? అంటూ అమ్మ ని అడిగావు, మీ నాన్న నీ మాట అడగలేదే! ‘అంటూ తను నిలదీసేది కదా! అలాఅనలేకపోయిందితను. అదేమిటే, పసివాడి ప్రాణాల ఉసురు కూడా పోసుకుంటావా? నేను లేనూ! అని అనేసింది ఆవేశంగా, దాని ఫలితమే ఈ వయసులో మళ్ళీ బడికి లంచ్ డబ్బాలు కడుతూ వాడిని పెంచడం. పవన్‌ ఎంత బుద్ధిమంతుడు, తనకి చదువులో ఎంతో సాయం చేసేవాడు అంటూ ఎన్ని కబుర్లు చెప్పేది సెలవులకి వచ్చినప్పుడల్లా, అప్పుడే తనకి అనుమానం వచ్చింది. ఈ స్నేహం ఎలా మలుపులు తిరుగుతుందో అని, ఈయన ఒక్కమాట కూడా అడిగేవారుకాదు,  అందుకే కాలేజ్ కబుర్లన్నీ ఆయనకే చెప్పేది, తనువెళితేచాలు మాట మార్చేసేది , ఎంత చిన్న బుచ్చుకునేది తను, పోనీ ఈయనైనా అమ్మకీ చెప్పు, నీబెంగుళూరుకబుర్లు అని ఒక్క మాట అనే వారు కాదు అదేమిటో తనని చూస్తేనే వాళ్ళిద్దరికీ లోకువ .

నిన్నటికి నిన్న చాలా బడలికగా ఉండి, ఉదయమే లేవ లేక పోయింది, మీరు ముందు లేస్తారు కదా, ఈ పూటకి ఆ నడక మాని, తనయ్ కి కాస్త డబ్బా సర్ది పెడతారా? నాకు చాలా ఒళ్ళునొప్పులూ భారంగా ఉంది అంటే, ఏమన్నారు? ఆ వంటింట్లో ఏవెక్కడ ఉన్నాయో నాకేం తెలుసు, ఎలాగో ఓపిక చేసుకుని నువ్వే లేచి ఆ డబ్బా కట్టేసి వాడినిపంపించేయ్, వాడేం చిన్న పిల్లాడు కాదు, నువ్వేం వాడికి నీళ్ళూ పోయాలా? బట్టలు వేయాలా? అంటూ తన మటుకు తాను వెళ్ళి పోయారు. ఉక్రోషం తో కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి ..ఏం చేస్తుంది, తప్పదు కదా, లేచి వాడిని పంపించి వచ్చి పడుకుంది.  తనకీ ఓపిక తగ్గిపోతోంది? ఎన్నాళ్ళు వాడిని చూడగలనో?

అపర్ణ లాగా తను కూడా తన మనసులో మాట ధృఢంగా ఎందుకు చెప్పలేక పోతోంది, మనవడి బాధ్యత తన ఒక్కర్తిదేనా?

ముందు ఎమ్మెస్ అంటూవెళ్ళింది, అదయ్యాక, మంచి ఉద్యోగం రావాలంటే పీ హెచ్ డీ చేయాలి నాన్నా! అని ఆయనతో ఒక్క మాట చెప్పేసి ఆ చదువు మొదలు పెట్టింది. ఈ లోపల కలిసి పని చేస్తున్నాం అంటూ జేంస్ అనే అమెరికన్‌ అబ్బాయిని ప్రేమిస్తున్నాను, మా ఇద్దరికీ కుదురుతుందో లేదో అని ముందు చూసుకుని ఆ తరవాతే పెళ్ళి చేసుకుంటాం, మొదటిసారి లాగ కాదు, ఆ పవన్ ఒట్టి … అంటూ మరో బాంబ్ పేల్చి, ఈసారి ఈయనకీ కోపం తెప్పించింది.

సప్త సముద్రాల అవతల ఉంది, తన సంపాదన తనకి ఉంది, ఏం చెప్పగలం తనకి ఈయన కొంచం కుంగి పోయారు ఈసారి, తనకూతురుచెప్పిన ఆ మాటకి. తనయ్ కైతే వాళ్ళ అమ్మ ఊసే పట్టదు, హాయ్ అమ్మా! అంటాడు ఫోన్‌ చేస్తే, అమ్ముమ్మ తో మాట్లాడు అంటూ నాకిచ్చేసి పారిపోతాడు, పెద్ద వాడవుతున్నాడు, వాడి మనసులో ఏం ఉందో? ఎంతైనా అమ్మా నాన్నసరితూగగలమా ?

ఈరోజు ఉదయం లేచిన మొదలూ అపర్ణ ఆలోచనలే, ఎన్ని సార్లు తలచుకున్నానో, ఎలా ఉందో ఏమిటో ?

సాయంత్రం నడక అయింది, దీపాలు పెట్టే వేళకి ఈయనా ,తనయ్ ఇద్దరూ వచ్చారు, పొద్దున్న తడిపి పెట్టుకున్న పిండితో మాకు ఓనాలుగు పుల్కాలూ, ఏదో ఓ కూర ,వాడికి కాస్త అన్నం పడేయాలి,  ఏ పూటకా పూట వంట అలవాటు మాన లేక పోతోంది.

ఇన్నాళ్ళు చేస్తున్న పనులే ఇప్పుడు భారం అనిపిస్తున్నాయంటే తనశరీరం ఇస్తున్న సూచనలు పటించు కోవాలి తప్పదు … ఆ రోజే రాత్రి ఫోన్‌ అపర్ణ నుంచి, అమ్మ ఉందా ! అంటూ నన్ను పిలిచి నాతో మాట్లాడింది అమ్మా! నీ మీద పెద్ద భారం పడేసాను, నాకు తెలుసు, నా మంచి కోసం నువ్వు చెప్పబోయే మాటలన్నీ నీ గొంతులోనే ఆపేసాను, ఈ జేంస్ తోకూడా నాకు సరిపడేటట్టు లేదు ఈ పీ హెచ్ డీ అవగానే నేను మనదేశం వచ్చి ఏదో మంచి ఉద్యోగం చూసుకుని తనయ్ ని నాతో తీసుకు వెళతాను అమ్మా!మీరు కూడా ఇంక వచ్చినా దగ్గరే ఉండొచ్చు .. నీ ఆరోగ్యం జాగ్రత్త అమ్మా! అంటూ మాట్లాడే సరికి నాకు కళ్ళల్లో నీళ్ళు గిర్రున తిరిగాయి .. పిచ్చి పిల్ల అంటూ!

తరం తరం నిరంతరం అమ్మ మనసులు మటుకు ఒక్కటేనేమో! తమ వారిని కడుపులో పెట్టుకుని చూసుకోవడం, మేం ఉన్నామని ఎంత నమ్మకంతో వదిలి వెళ్ళింది తన కొడుకుని మా దగ్గర.

అపర్ణ మాటలు ఇచ్చిన ధైర్యంతోనే కాబోలు మర్నాడు నేను మంచం మీద నుంచి మెలకువ

వచ్చినా కదలలేదు … ఏమోయ్ సుభద్రా! లేస్తావా! ఇంకా మేలుకొలుపులు పాడాలా? అంటూ హాస్యాలు ఆడుతున్నకృష్ణారావు అంటే మా ఆయనకి స్పష్టం గా చెప్పాను” మీ మనవడి మంచి చెడ్డా, ఆకలీ అనుపానం చూడాల్సింది మనం ఇద్దరం,  ఇక నుంచీ అది నా ఒక్కర్తి వల్ల అయే పని కాదు, నా మాట పెడ చెవినపెట్టి, మీ అమ్మాయిని ముద్దు చేసి, గారాబం చేసి, బాధ్యత తెలియకుండా పెంచారు,  అయినదేదో అయింది ఇప్పుడువీడి భారం మోయడం నా ఒక్కర్తి వల్లా కాదు, నేనూ నా ఆరోగ్యం సంగతి చూసుకోవాలీ, ఉదయం నడక మొదలు పెట్టాలి, మీరు ఒప్పుకుంటే ఓ వంట మనిషిని పెట్టుకుందాం ,కాదూ కూడదు అంటే మీరూ నాకు సాయం చేయాలి వంటింట్లోకి వచ్చి ఏవి ఎక్కడ ఉన్నాయో ఒకట్రెండు రోజులు చూస్తే అదే అర్ధం అవుతుంది, మీ ఆఫీసు లో ఫైల్స్ అవీ ఎలా తెలుస్తాయో, ఇదీ అంతే, ఏం బ్రహ్మ విద్యా ఏమిటి? “నా కంఠం లో ధృఢత్వం నాకే ఆశ్చర్యం కలిగించింది ..

అలాగే, అలాగే అలాగే చేద్దాం … ఏదో నువ్వు సాగుతున్నావు కదా అని నేనూ ఆ మాట అనలేదు, నీ ఇష్టమే వంట మనిషిని పెట్టుకుందాం, ఈ డబ్బంతా మనం ఏం చేస్తాం? అపర్ణ నెల నెలా వాడి పేరు మీద కొంత

పడేస్తోంది, నా అకౌంట్ లో ,ఏం చేయాలి ఆ సొమ్మంతా! వాడి కోసమైనా మనం ఇద్దరం ఆరోగ్యం గా ఉండాలి, అలాగే కానీ సుబ్బూ! అనేసరికి … ఆశ్చరానందాలతో నా మతి పోయింది.

 

అడగందే అమ్మ అయినా పెట్టదు .. .అంటారు అందుకే.

 

14 thoughts on “అమ్మ మనసు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *