May 10, 2024

బాధ్యత కలిగిన రచయితను ఎవరూ శాసించలేరు!

రచన:-​ టీవీయస్.శాస్త్రి 

​(నహుషుడి కధ !)​
నాకు తెలిసినంతవరకూ రచయితలనే వాళ్ళు ఎలా ఉంటారో చెబుతాను. రచయిత కేవలం వెన్నెల కురిపించే చంద్రుడే అనుకునే వారు ఎవరైనా ఉంటే, అది పూర్తి పొరపాటని చెప్పదలుచుకున్నాను. అప్పుడప్పుడూ చండ్రనిప్పులు కురిపించే సూర్యుడి లాంటి వాడు కూడా రచయిత అంటే. తన చుట్టూ  జరుగుతున్న సంఘటనలనూ, అన్యాయాలనూ ఖండిచక పోవటం రచయితగానే కాదు, ఒక సంఘజీవిగా కూడా మన బాధ్యతను పూర్తిగా విస్మరించినట్లే! అందులో ఏ మాత్రం సందేహం లేదు. నిర్లిప్తంగా కూర్చోవటం, అన్యాయాలను సమర్దించినట్లే! అందులో ఏమాత్రం సందేహం ఉండనవసరం లేదు. ఎన్నో సభలకు వెళ్ళుతాం. అక్కడ పనికి మాలినవారు చెప్పేవన్నీ అసత్యాలనీ మనకు తెలుసు.అయినా సరే మనం నోరు మెదపం! కారణం ఆ సభా నిర్వాహుకులతో మనకున్న’పనికిమాలిన బంధాలు’. అటువంటి పనికిరాని వారితో పెంచుకునే ఇనుప సంకెళ్ళ లాంటి బంధాలను తెంచుకోవటం ఎంతో కష్టం! వ్యక్తిగత రాగాలకు, బంధాలకు బానిసలైన కొంతమందికి రచయితలు నిప్పులు చెరగటం ఇష్టముండదు. అటువంటివారికి ఇష్టం లేనంత మాత్రాన, రచయిత తన బాధ్యతను విస్మరించలేడు. అటువంటి వారి మెప్పుకోసం తాపత్రయం కూడా పడడు. ఇతరుల మెప్పుకోసం ఎట్టి పరిస్థితిలోనూ వ్రాయడు.

మనకు ఇష్టం లేదు కదా అని సూర్యుడు వేడిగా ఉండకుండా మానుతాడా? అది సూర్యుని స్వభావానికే పూర్తి విరుద్ధం. అలా మండే సూర్యుడే, సకల జీవులకూ ప్రాణ ప్రదాత. రచయితలు కూడా అంతే! మీకు ఇష్టమైనవే రచయిత వ్రాయడు, రచయితకు ఇష్టమైనవే వ్రాస్తాడు. రచయిత నిరంకుశుడు మరియూ స్వేచ్చాజీవి! ఎవరి అభిరుచిని బట్టి వారు ఆయా రచయితలు వ్రాసినవి చదువు తుంటారు. ఆ మధ్య శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఒక టెలివిజన్ ఇంటర్వ్యూలో చెబుతూ తాను ఒక కమర్షియల్ రైటర్ ను మాత్రమేనని, అసలు రచయితలంటే శ్రీ విశ్వనాధవారు, కృష్ణశాస్త్రి గార్లే నని నిజాయితీగా ఒప్పుకోవటం ఎంతో సంతోషించతగిన విషయం. కవులనూ, రచయితలనూ గౌరవించటం మనం నేర్చుకోవాలి. ఎందుకంటే భగవంతుడు వారికి ప్రసాదించిన ‘మనోనేత్రం’ మనల్ని ఎప్పుడూ గమనిస్తుంది, మంచి దారి చూపిస్తుంది, ఆత్మ విమర్శ చేసుకోవటానికి అవకాశం కల్పిస్తుంది. అన్నిటినీ మించి మనం తప్పుదారిలో వెళుతుంటే తల్లిలా, గురువులా మందలిస్తారు కవులు. మనకోసం కోకిల పాడదు, దానికి కోరిక కలిగినప్పుడే అది పాడుతుంది. ఆ పాటలో విషాదముందో,ప్రమోదముందో తెలిసేది మరో కోకిలకే! మనం నిజాయితీగా కనపడటం కన్నా నిజాయితీగా ఉండటం చాలాముఖ్యం.

కొంతమంది అనుకుంటారు- నేను నిజాయితీగా ఉన్నాను, మిగిలిన విషయాలు నాకెందుకని అనుకుంటారు. వీరిలో మరోరకం వారు ఉంటారు. వారు తాము​ మాత్రమే నిజాయితీ పరులమనీ, మిగిలిన ప్రపంచమంతా అవినీతిమయమని భావిస్తుంటారు.ఈ సందర్భంలో ఒక చిన్న కథ చెబుతాను. కథ మీకందరికీ తెలిసిందే! పూర్వం ఒక పతివ్రత ఉండేది.ఆమె ఇంటికి ఎదురుగా ఒక వ్యభిచారిణి కూడా ఉండేది. ఈ పతివ్రత రోజూ వాకిట్లో నిలబడి ఆ వ్యభిచారిణి ఇంటికి ఎవరెవరు వస్తున్నారు, ఎంతమంది వస్తున్నారు అనే దాని మీదనే ఆమె దృష్టి అంతా ఉండేది. వారిద్దరూ చనిపోయిన తరువాత ఆ వేశ్య స్వర్గానికి వెళ్ళుతుంది, పతివ్రత మాత్రం నరకానికి వెళ్ళుతుంది. కారణం, వేశ్య తన వృత్తిపట్ల నిజాయితీగా ఉంది, పతివ్రత మానసిక వ్యభిచారం చేసి వేశ్య కన్నా హీనమైన బతుకు గడిపింది. సమాజం పట్ల బాధ్యతగల వాళ్ళు అలాంటి ‘మానసిక వ్యభిచారం’ చేయరు. వేమన వేసిన దెబ్బలు ఏ మాత్రం మార్పు తేలేదని తెలిసి కూడా వీరేశలింగంగారు నిర్లిప్తంగా ఉన్నారా? గురజాడ వారు ఊరుకున్నారా? నాకు తెలిసిన ఒక అధికారి ఎక్కడికైనా ఇతర ఊర్లకు అధికార పనుల మీద వెళ్ళుతున్న ప్పుడు తన వెంట పాలూ, కొబ్బరి బొండాలూ ​తీసుకొని వెళ్ళేవాడు.వెళ్ళిన చోట ఆతిథ్యానికి ఎవరైనా శీతల పానీయాలు ఇవ్వబోతే వాటిని తిరస్కరించి “నేను నిజాయితీ పరుడను, ఎవరి వద్ద ఏమీ  ఆశించను” అని కొంత అహంభావంతో చెప్పేవారు. వెంటనే నేను అన్నాను,”మీరొక్కరే కాదు నిజాయితీ పరులు, ఈ దేశంలో 90 శాతం మంది ప్రజలు నిజాయితీ పరులే! అందుకే రిక్షా వాళ్ళు రిక్షాలు తొక్కి కష్టపడి సంపాదించుకుంటున్నా రు, దొంగతనాలకు పాల్పడకుండా!” అని చెప్పాను.

ఆ తరువాత కొంతకాలానికి వారు మరో ప్రత్యేక బాధ్యత మీద వేరే చోటుకు వెళ్ళారు. అక్కడ, ఆయనమీద వచ్చిన అవినీతి ఆరోపణలకు అంతు లేదు. భమిడిపాటి రాధాకృష్ణ గారు ఒక సినిమాలో ఇలా అంటారు,”ప్రతి మనిషికీ ఒక రేటు ఉంటుంది. ఒకడు వెయ్యి రూపాయలకు లొంగితే,మరొకడు లక్షకు లొంగుతాడు, అంతే తేడా!”  అని. అసలు అవినీతికి లొంగని వారినే మనం ‘మహాత్ములు’గా గుర్తించాం.జాతికి ఒక్కడుంటేనే మన దేశానికి ఎంత గొప్ప పేరు వచ్చిందో మనందరికీ తెలుసు కదా!అసలు అవినీతికి బీజం ​’భావదాస్యం’ నుండి మొలకెత్తి పెరిగి’ఆశ్రిత పక్షపాతం’ అనే పెద్ద ఊడలు నేలకు దిగిన పెనువృక్షంగా మారుతుంది. భావదాస్యం అనే బీజాన్ని మొగ్గలోనే త్రుంచి వేస్తె, అవినీతి సమూలంగా కాకపోయినా కొంతవరకు నశిస్తుంది .మనం ఇలా మాట్లాడితే, మన భార్య ఏమనుకుంటుందో ప్రక్కవాళ్ళు ఏమనుకుంటారో, అలా సూటిగా చెప్పటం ‘సంస్కారం’ కాదనో, ఇంకా ఎన్నో కారణాల వల్ల మనం మౌనంగానే ఉండటానికి ఇష్ట పడతాం .అదే సంస్కారం అని భావిస్తుంటాం. అటువంటి ‘సంస్కారమే’ అవినీతి కి పునాది.

అవతలి వ్యక్తి పొరపాటు చేస్తున్నప్పుడు,తెలిసికూడా చెప్పకపోవటం ఎన్ని అనర్ధాలకు దారి తీస్తుందో, మీకు చెప్పటానికి చాలా కథలు ఉన్నాయి .అందులో ‘నహుషుడి’కథ ఒకటి.ఈ కథను సందర్భాను సారంగా నా బాణీలో చెబుతాను. స్వర్గలోకంలో ఒకరోజు దేవేంద్రుడు మధుపాన మత్తులో ఉండి అక్కడికి వచ్చిన బృహస్పతిని గౌరవించకపోగా కనీసం ఉచిత ఆసనం కూడా ఇవ్వలేదు. పరిస్థితిని గ్రహించిన బృహస్పతి గౌరవం, గుర్తింపు లేని చోట ఉండకూడదని నిశ్చయించుకొని, స్వర్గలోకాన్ని వీడి తపోవనానికి వెళ్ళుతాడు. మత్తు దిగిన తరువాత ఇంద్రుడుకి బృహస్పతి విలువ తెలు స్తుంది. మంత్రాంగం, సద్బుద్ధి చెప్పేవాడు దూరమయ్యాడు. విలువైనవి పోగొట్టుకున్న తరువాత గాని వాటి విలువ తెలుసుకోలేరు మూర్ఖులు. విలువైన వాటిని జాగ్రత్తగా భద్రపరచుకుంటారు వివేకులు. సరే, కధలోకి వద్దాం. ఇంద్రుడు గబగబా పరుగెత్తికెళ్ళి విష్ణుమూర్తికి జరిగినదంతా చెప్పి, తన పొరపాటుకు మన్నించి, మంత్రాంగం చెప్పటానికి మరొక వ్యక్తిని సూచించమని ప్రార్ధిస్తాడు. అప్పుడు విష్ణుమూర్తి ఇలా అంటాడు, “నీకు అతి బుద్ధిశాలి అయిన ఒక యువకుడిని అప్ప చెబుతాను. అతనిపట్ల గౌరవ మర్యాదలతో ప్రవర్తించి,మళ్ళీ ఇటువంటి పొరపాట్లు చేయవద్దు” అని చెప్పి మందలించి పంపుతాడు. ఈ కొత్త యువకుడి తండ్రి రాక్షసులకు గురువు. ఇంద్రుడి మనసులో ఒకటే ఆందోళన. అది ఏమిటంటే! ఈ యువకుని తండ్రి రాక్షస కులగురువు. తండ్రీ కొడుకులిద్దరూ ఏకమై ఎప్పుడైనా తనకు ద్రోహం చేయొచ్చుఅనే అనుమానం పెనుభూతమై, ఒకరోజు ఆ యువకుడు నిద్రించే సమయంలో ఇంద్రుడు తన వజ్రాయుధం చేత ఆ కుర్రవాని శిరస్సును నరికి వేస్తాడు. కుమారుని వద్దనుండి ఎంతకాలానికీ కబురు రాకపోవటం చేత ఆ రాక్షస గురువు దివ్యదృష్టితో పరిస్థితిని తెలుసుకొని, ఉగ్రుడై తన జటాఝూటం నుండి ఒక చిన్న వెంట్రుకను తీసి నేలమీద వేస్తాడు. దానిలోంచి ఒక భయంకర రాక్షసుడు ప్రభవించి లోకాలన్నిటినీ నాశనం చేస్తుంటాడు. వాడి ధాటికి ఎదురు నిలువటం ఎవ్వరితరం కావటం లేదు. ఇంద్రుడు భీతిల్లి అణుమాత్ర రూపుడై ఎవ్వరికీ కనపడకుండా పారిపోతాడు. అప్పుడు దేవతలందరూ విష్ణుమూర్తి వద్దకు వెళ్లి జరిగినదంతా చెప్పి, తమకు ఒక ప్రభువుని ఏర్పాటు చెయ్యమని వేడు కుంటారు. అప్పుడు విష్ణుమూర్తి భూలోకం నుండి నహుషుడనే చక్రవర్తిని ఇంద్ర పదవికి అర్హుడిగా నిర్ణయిస్తాడు. నహుషుడు ఇంద్ర పదవిని ఆలంకరిస్తాడు. దేవతలందరూ మంచి స్వాగత సత్కారాలు ఏర్పాటుచేస్తారు. రంభా,ఊర్వశుల​ నృత్యాలు, మధుపానీయాలు ,ఇలాంటి ఏర్పాట్లకు ఎంతో మురిసిపోయాడు నహుషుడు. ఇంద్రపదవి అంటే అందరికీ ఎందుకు వ్యామోహమో అర్ధమయింది నహుషుడికి. పై అధికారుల మెప్పుకోసం కొంతమంది ఇప్పుడు కూడా ​ ఇటువంటి స్వాగతాలు ఏర్పాటు చేస్తుంటారు. . పైగా అడుగుతారు, ఏర్పాట్లన్నీ తృప్తిగా ఉన్నాయా అని కూడా! మానసిక దౌర్బల్యం వచ్చిన మనిషికి కావలసిన ఏర్పాట్లే అవి, తృప్తిగా లేక చస్తాయా! అలా రోజూ దేవతలు నహుషుడి తృప్తి కోసం, మెప్పుకోసం చేయవలసిన వెధవ పనులన్నీ చేస్తుంటారు. ఒకరోజు నహుషుడిని అడుగుతారు,”అన్నీ బాగున్నాయా? వేరే ఏమైనా కావాలా?” అని.

​అప్పుడు నహుషుడు తన మనసులోని మాటను ఇలా వెళ్లబుచ్చుతాడు,”ఇంద్రుని భార్య అయిన శచీదేవి గొప్ప సౌందర్యవతి అని విన్నాను, ఆ సుందరిని రాత్రికి నా మందిరానికి పంపే ఏర్పాటు చెయ్యండి” అని వారిని ఆజ్ఞాపిస్తాడు. అందులో ఒకరిద్దరు నసుగుతూ,” ఆమె పతివ్రత, ఈ పని తప్పేమో!” అని అంటారు. చూడండీ! తప్పని వారికి తెలిసికూడా, తప్పు అని నిర్భయంగా చెప్పలేరు …”తప్పేమో” అన్నారు. ఇలాంటి వారే సమాజానికి చీడ పురుగులు. వారితో నహుషుడు ఇలా అంటాడు,”ఇంద్రుడు అహల్యను మానభంగం చేసినప్పుడు, ఎవరైనా నోరెత్తి ‘ఇది తప్పు’ అని చెప్పారా? ఇప్పుడు నాకెలా చెబుతున్నారు, నాకు చెప్పటానికి మీకు ఉన్నఅర్హత ఏమిటి? అలా వీలు లేదు, నాకు శచీదేవి కావలసినదే! నోరు మూసుకొని చెప్పింది చెయ్యండి” అని నహుషుడు వేసిన ఆజ్ఞను వారు శచీదేవికి చేరవేస్తారు. ఇటువంటి వారినే ఆంగ్లంలో  “సైకోఫేంట్స్ (Sycophants)” అని అంటారు. వీరు పై అధికారుల మెప్పుకోసం, ఎంత నీచమైన పని అయినా చేస్తారు). ఆమె భోరున విలపిస్తూ విష్ణుమూర్తిని వేడుకుంటుంది. విష్ణుమూర్తి ఆమెను ఊరడించి, ఇలా చెబుతాడు, “పతనం ప్రారంభం కావటం మొదలైతే, అది ముగియటం కూడా అంత త్వరగానే ముగుస్తుంది. పర స్త్రీ వ్యామోహంలో పడ్డవాడు మరీ తొందరగా పతనం చెందుతాడు. సప్తర్షుల చేత పల్లకీ మోయించుకొని రమ్మను. వాడు అందుకు ఒప్పుకుంటాడు.అదే వాడి పతనానికి మార్గం” అని శచీదేవి అలానే నహుషుడికి కబురు చేస్తుంది. పర స్త్రీ వ్యామోహంలో ఉన్న నహుషుడు అందుకు అంగీకరించి, సప్తర్షుల చేత పల్లకీ మోయించుకుంటూ శచీదేవి వద్దకు పయనమయ్యాడు. పల్లకీని ముందువైపు మోస్తున్న అగస్త్యుడు పొట్టివాడు. అందుచేత త్వరగా నడవలేకపోతున్నాడు. మగువ మత్తులోనున్న నహుషుడు అగస్త్యుని ఎడమకాలితో తన్ని’సర్పః సర్పః’ అని అంటాడు. సంస్కృతంలో సర్పః అంటే త్వరగా అని అర్ధం. సంస్కృత పదాలన్నీ ధాతువునుండి వచ్చినవే! అందుకే ప్రతి పదానికీ అర్ధం కూడా అర్ధవంతంగా ఉంటుంది. పాము త్వరగా వెళ్ళుతుంది కనుక దానికి ‘సర్పం’ అనే పేరు వచ్చింది. జలజలా ప్రవహిస్తుంది కాబట్టి నీటిని ‘జలం’ అని అంటాం. అప్పుడు అగస్త్యునికి తన శక్తి గుర్తుకు వచ్చి, నహుషుడిని పెద్ద సర్పమై పొమ్మని శపిస్తాడు. నహుషుడు పెద్ద సర్పమై ఒక అడవిలో పడిపోతాడు. ఈ కథను ఇక్కడితో వదలి వేద్దాం. సైకోఫేంట్స్ వల్ల ఎటువంటి దారుణాలు జరుగుతాయో పై కథ వల్ల మనం తెలుసుకున్నాం కదా! ఈ కథ మహాభారతంలోనిది.ఈ కథ ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, సమాజాన్ని నాశనం చేసేది ఈ సైకోఫేంట్స్ చీడ పురుగులే!
ఎక్కడ మొదలు పెట్టామో, ఎక్కడ అంతం అయిందో చూసారా! ‘భావ పరంపరలు’ ఇలానే ఉంటాయి. వ్రాస్తూ పోతే వీటికి అంతు ఉండదు.

బాధ్యత కలిగిన రచయితను ఎవరూ శాసించలేరు,ఎందుకంటే అతను మీనుంచి ఏమీ ఆశించడు కనుక!

 

 


 

29 thoughts on “బాధ్యత కలిగిన రచయితను ఎవరూ శాసించలేరు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *