May 1, 2024

సామాజిక మాధ్యమమా? మాజాకానా?

 రచన:  – వెంకట్ యస్. అద్దంకి

సామాజిక మాధ్యమమా మాజాకానా అనిపిస్తుంది ఒకొక్కసారి. ఎక్కడెక్కడి వారో స్నేహితులు అయిపోతారు, కొన్ని స్నేహాలు వివాహబంధం గా మారుతున్నాయి. కొన్ని స్నేహాలు హత్యలకు, మానభంగాలకు దారితీస్తున్నాయి.. ఎందుకు అంటే “మన బంగారం మంచిదైతే ఎవర్నో తప్పు పట్టక్కరలేదని” సామెత. ఎవరైనా తమ మనసు, బుద్ధిని బట్టే నడుచుకుంటారు. అంతర్జాలంలో నిక్షిప్తమయి వున్న విజ్ఞాన పరిజ్ఞానం ఒకరినుండి ఒకరికి, ఒక చోట నుండి మరో చోటకి రవాణావ్వడానికి సామాజిక మాధ్యమాలు అవసరమే. కానీ ఆ విజ్ఞాన పరిజ్ఞానం పూర్తిగా మనకందుబాటు లోకి రావడానికీ, మనకవగతమవ్వడానికీ కొంత సమయం పడుతుంది. ఎందుకంటే మన దేశం అంత అభివృద్ధి చెందిన దేశం కాదు. అటువంటప్పుడు, ఆ విజ్ఞాన పరిజ్ఞానాన్ని వాడుక లోకి తీసుకునేటప్పుడు చాలా విషయాలు ఆలోచించాలి. కోతికి కొబ్బరికాయ దొరికితే ఎంత ఆనంద పడుతుందో మన చేతిలోకి వచ్చేసరికి మనమూ అంతే ఆనంద పడతాం ఎందుకంటే మన మూలాలు అక్కడి నుండే కదా.

ఇందులో ఉన్న ఒక ఉపయోగం మన స్నేహితులని ఈ మాధ్యమాల ద్వారా కలుసుకోవడం, క్రొత్త వారితో స్నేహాలు, కొన్ని సమాజసేవా పనులు, మనలో ఉన్న ప్రజ్ఞా పాటవాలకి గుర్తింపు రావడం, జీవితంలో కొంత పేరు సంపాదించు కోవడానికీ ఉపయోగపడుతున్నాయి. కానీ అదే సమయంలో మన మనసుని అదుపులో ఉంచుకోక పోవడం, అదే పనిగా వీటికి అతుక్కుని ఉండి పోవడం వల్ల కొంత మంది శతృవులని తయారుచేసుకోవడం, మోసాలకి గురికావడం, మనతో బాటూ మనవారికి కూడా ఇబ్బందులు తీసుకు రావడం ఈ మాధ్యమాల యొక్క దుష్ప్రయోజనాలనీ తెలుపుతోంది.

వీటి అన్నిటికీ కర్త, కర్మ, క్రియ మన మనస్సు…. మనస్సాక్షి మాత్రమే. ఉచితానుచితాలు, కష్టనష్టాలు సరైన రీతిలో ఆలోచించకపోవడం తరచి చూడక పోవడం లాంటివి చాలా సమస్యలు సృష్టిస్తున్నాయి.  ఇందులో ఆర్ధికంగా నష్టపోవడం తో బాటూ, ఒకొక్కసారి శీలాన్ని కోల్పోతున్న వ్యవహారాలు కనబడుతున్నాయి. మన భారతీయులకి జాలి, దయా ఎంత ఎక్కువో, ఉక్రోషం, ఆవేశం, వీరాభిమానం తో బాటూ, ఏదో సాధించాలి నలుగురూ మనలని గుర్తించాలన్న తపనా ఎక్కువే. ఈ విషయాలే చాలా మందికి సమస్యలు తెచ్చి పెడుతున్నాయి. తీరా “చేతులు కాలాక ఆకులు పట్టుకున్న” చందాన ఎంత ఏడ్చి ఎంత మొత్తుకుని లాభం ఏముంది? ఇంతకు ముందు ఏ మనిషైనా ఏ విషయం మీదైనా తన వంతు ఆలోచన చేసేవాడు లేదా స్నేహితులనో, బంధువులనో లేక ఇంట్లో పెద్దలనో కొంత సలహా అడిగి తెలుసు కొనేవాడు. ఈ సామాజిక మాధ్యమాల పై మానసికంగా ఆధారపడిపోయి తనకు తోచినది, ఆ సమయంలో ఏది అనిపిస్తే అదే చేస్తున్నాడుగానీ పెద్దవారి మనోభావాలకు విలువనిచ్చి ప్రవర్తించడము, సంప్రదించడము లేదా తనకు తాను కుదురుగా తనకు ఏది మంచో అది ఆలోచించడము లాంటివి చేయకపోవడంవల్ల ఈ రకమైన సమస్యలకి మూల కారణం. సంప్రదించినా మరీ చిన్న పిల్లలలాగ మంకు పట్టుతో స్వల్పమయిన ఆనందాలకు, వినోదాలకు పోయి తను అనుకున్న దారిలోనే వెళ్ళి జీవితాన్నినరకప్రాయం చేసుకుంటున్నాడు. కొంతమంది విషయంలో ఇది హత్యలకు, ఆత్మహత్యలకు కూడా దారి తీస్తున్నది.

ఈ విషయాలలో ఉదాహరణలు చాలా చక్కగా కనపడుతున్నా ఇంకా చాలామంది తమ పై తమకున్న నమ్మకాన్ని కొం చెం ఎక్కువగా చేసుకుని బోల్తా పడడం సాధారణం అయిపోయింది. ఉదారహరణ కి మన ముంబై ప్రాంతానికి చెందిన యువకుడు ఒక పాకిస్థానీ అమ్మాయితో స్నేహంచేసి ఆ అమ్మాయి ఏదో సమస్యలో ఉందనగానే ఇక్కడినుండి అక్కడకి వెళ్ళి అదీ పాస్పోర్ట్  లేకపోయినా  దొంగదారులలో చేరుకుని అక్కడ జైల్ కి వెళ్ళాడు. కొడుకు ఉన్నాడో లేదో తెలియక ఇన్నిసంవత్సరాలనుండి తల్లడిల్లిన ఆ తల్లితండ్రులు అక్కడ జైల్ లో ప్రాణాలతో ఉన్నాడనే సరికి కొంత ఊరట పొందినా వాడి కోసం బాధ పడకుండా ఉండలేరు కదా. అలాగే మన హైదరాబాదు లో ఒక సైనిక సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగిని ఎవరో పాకిస్థానీ అమ్మాయి ప్రేమ పేరుతో ముగ్గులోకి దింపి మనదేశ రహస్యాలను అడిగితే, తను ఎవరూ, ఏమిటి దానివల్ల నాకు నావారికీ జరిగే నష్టం ఏమిటీ అన్న విచక్షణ వదిలేసి ఆ వివరాలు అందిస్తూ ఇంటెలిజెన్స్ కి దొరికాడు. అలాగే బెంగళూరులో పనిచేస్తున్న అమ్మాయి ఒక హర్యానా కుర్రాడితో స్నేహం చేసి వాడిని తన రూముకి ఆహ్వానిస్తే కేవలం 5000 రూపాయలు ఇవ్వలేదన్న కారణంతో ఆమెని హత్యచేసాడు. ఇక ఆ మధ్య భోపాల్ లో ఒక వివాహిత తను అవివాహితను అని చెప్పుకుంటూ ఒక యువకుడితో స్నేహం మొదలుపెట్టి ప్రణయంగా మారితే వారి వ్యవహారం తెలుసుకున్న ఆమె మరిది ఆ యువకుడి మీద పట్ట పగలు ఏసిడ్ తో దాడిచేయ్యడం తో కళ్ళు పోగొట్టుకున్నాడు. అలాగే ఈ ముఖ పుస్తక మాధ్యమంగా స్నేహితులైన యువతీ యువకులు ఇద్దరూ కలిసి విహారానికి వెడితే, అక్కడ వారిద్దరినీ ఒంటరిగా చూసి కొందరు యువకులు వారిపై దాడి చేసి, ఆ యువతిని సామూహిక మానభంగం చేసారు. మరలా వెనక్కి వచ్చిన తరువాత ఆ అమ్మాయి పోలీసులకి ఫిర్యాదు చెయ్యడానికి వెళ్ళినప్పుడు, నీతో వచ్చిన యువకుడి వివరాలు చెప్పమంటే ఆ పిల్ల ఈ ముఖపుస్తక పరిచయాన్ని బహిర్గతం చేసి అంతకన్నా నా దగ్గర వివరాలు లేవు అంది. ఆ యువకుడిని వెతికి పట్టుకుందుకు పోలీసులకి 4-5 రోజుల సమయం వృధా అయ్యింది. ఇంకో ప్రక్క ఒక అమ్మాయి పెద్దగా చదువుకోక పోయినా, ఆర్ధికంగా స్థోమత లేకపోయినా ఒక స్థితిమంతులైన కుటుంబ యువకుడితో ప్రేమలో పడితే అతని తల్లి తండ్రులు కూడా ఒప్పుకుని ఖర్చులు అన్నీ వారే భరించి వివాహం చేసారు. ఆ తరువాత వాళ్ళిద్దరూ విదేశాలకు వెళ్ళిపోయారు.

ఇక మన తెలుగు వారి విషయానికొస్తే ఇక్కడ మన పరిస్థితి, జరుగుతున్నవి వింటుంటే నిజంగా దేశం మొత్తం మీద తెలివి తక్కువ జాతి,  ఆవేశకావేశాలు,  అన్ని రకాల సెంటిమెంట్స్ మిళితమైన జాతి. ఇక్కడ ఈ ముఖ పుస్తక మాధ్యమంగా … ఎవరో బయటివాళ్ళూ కాదు మనవాళ్ళే మనవాళ్ళను మోసం చెయ్యడం, బెదిరించ డం, కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, కొన్ని అనుమానాస్పద హత్యలు కూడా జరుగుతున్నాయన డానికి కూడా ఆధారాలున్నాయి. మరి అంతే విధంగా మంచిపనులు, సాహిత్య గోష్టులు, పుస్తక ఆవిష్కరణలు, కొంతమంది సినిమాలకు సంబంధించివాళ్ళూ ఉండడంతో అదొక ఊపు. అన్నిటికీ మించి, రాజకీయ వైషమ్యా లు, కులాల విద్వేషాలు, మతాల కీచులాటలు ఒకటేమిటి అన్నిరకాలు కనపడుతున్నాయి. బహుశా నా పరిధి పెద్దది కాదేమో, ఇంతకన్నా ఘోరంగా వేరే చోట్ల జరగవు అని గానీ జరిగే అవకాశం లేదు అనిగానీ అనను అనలేనూ కూడా అయినప్పటికీ బావిలో కప్పలాగ నా దృష్టికి రావడంతో ఒక సాటి తెలుగువాడిగా బాధపడడం మామూలే. అలా అని నేనేదో మహా మేధావిని అని అనుకోవటం కాదు. నేను అటు మంచి పనులలోనూ ఉపయోగపడలేకపోతున్నాను, అలాగే చెడుపనులకి దూరంగా ఉంటున్నాను. ఇక్కడ ప్రదర్శించే ఏ ఫీలింగ్ అయినా ఇక్కడివరకే ఉండాలి గానీ అది నిజ జీవితానికి ప్రోత్సాహకరం కాకపోయినా పరవాలేదు గానీ ప్రతి బంధకం మాత్రం కాకూడదనే నా అభిప్రాయం. ఇక్కడ ఆడా మగా అని తేడా లేకుండా స్నేహాలు అందరితోనూ అవుతాయి అలాగే వాగ్యుద్ధాలు అందరితో నడుస్తాయి. మనం అభిమానించే హీరోనో, రాజకీయ నాయకుడినో అవమానించేలా పోస్ట్ పెట్టారనో లేక మనతో అసంబద్ధ వాదనలు చేస్తున్నారనో వ్యక్తిగత ఘర్షణలకు దిగడం అన్నది  దిక్కుమాలిన మనస్తత్వానికి ఒక పరాకాష్ట. నిజం నిప్పులాంటిది అది ఎప్పుడో ఒకప్పుడు బయట పడుతుంది అలా బయటపడినప్పుడు ఎంతగానో అభిమానించిన వాళ్ళూ చీకొట్టడం ఖాయం. ఆ పరిస్థితులు తెచ్చుకోకూడదు అనుకున్నప్పుడు మన పరిధులు మనం గీసుకుని జీవించాలి. ఎప్పుడో జరిగిన సంఘటన స్కూల్ రోజుల్లో స్నేహితులు, ఈ ముఖపుస్తకం ద్వారా మళ్ళీ కలిసారు. మాటల్లో ఒకరు మంచి పొజిషన్లో ఉన్నారని తెలిసింది. మంచి పొజిషన్లో లేను అని చెప్తే స్నేహం చెయ్యడేమో అని తను ఏదో మంచి పొజిషన్లో ఉన్నట్లు,  లేనివి ఉన్నవి చెప్పి కొన్నాళ్ళ తరువాత అర్జెంట్ సహాయం చెయ్యమంటే స్నేహితుడే కదా అని అప్పిచ్చి తరువాత వాడొట్టి పోరంబోకు అని తెలియడంతో ఆ డబ్బు మీద ఆశ వదిలేసుకున్న వాళ్ళని చూసాను.

క్రితం సంవత్సరం రెండు మూడు సంఘటనలు అందులోని వారెవరూ నా స్నేహితుల సమూహంలో లేకపోయినా, నా స్నేహితులద్వారా వచ్చినవి చాలా బాధాకరమైన విషయాలు. రెండు సార్లూ ఆడవారిని అవమానించే లాగ జరిగినవే. ఇందులో కారణాలు కేవలం మగవాళ్ళూ అనే కాదు, అందులో ఆడవారి తప్పులు కూడా ఉన్నాయి కాబట్టి ఇలాంటి విషయాలు గొడవలుగా మారుతున్నాయి. షరా మామూలే వెధవపని చేసేవాళ్ళూ తెలివిగా కొందరితో అతి మంచి తనంతో, ఎంతో వినయంతో ఆడవారిని ఒక దేవతలా చూసే వారిలా ఉండి, వేరే ఆడవారు కొంచెం ఫ్రీ గా మాట్లాడతారు అనుకునే వారిని తక్కువగా అంచనాలు వేసి వారితో అసభ్యంగా మాటలు మాట్లాడడమో లేక అతిగా ప్రవర్తించడమో చెయ్యడం తో గొడవ బయటకి వచ్చినా వెనుక సానుభూతి పరులు దన్ను కూడా అంతే గట్టిగా ఉండడాన్ని బట్టి అవతలివాడు ఎంత తెలివిగా ఉన్నాడో తెలుస్తుంది. ఇలాంటి అవకాశం ఇవ్వడం ఆడవారికైనా, మగవారికైనా తప్పే.

ఆడవారు ఒకవేళ అతిగా అనవసరమైన విషయాలు మాట్లాడుతుంటే మగవారికి ఇష్టం లేకపోతే అక్కడికక్కడే నిలువరించకపోతే ఆ తరువాత మనకే తలనెప్పులు, అదే ఆడవారూ అలాగే అనవసరమైన విషయాలలోకి వస్తుంటే ఇదేదో ప్రగతి అనుకుని మీ వ్యక్తిగత విషయాలు కూడా వారికి తెలియజేస్తే దాన్ని ఎలా వాడుకుంటా రు అన్నది తెలియదు, రేపు అతడు అవి పబ్లిగ్గా బయటపెడితే మన ఇంట్లోవాళ్ళే మనలని అనుమానిస్తారు. ఈ మధ్య రాజమండ్రి లో పట్టుబడిన ఒక వ్యక్తి దగ్గర 300 మంది అమ్మాయిల నగ్న చిత్రాలు ఉన్నాయి అంటే  ఏమని అర్ధం చేసుకోవాలి? తల్లితండ్రులు ఒక పక్క ఆడపిల్లలపట్ల పెరుగుతున్న అత్యాచారాలకు భయపడి, కనీసం ఎక్కడన్నా ఆపదలో ఉంటే తెలియజేస్తారు అని వేలకు వేలు పోసి స్మార్ట్ ఫోన్లు కొనిస్తే ఆ సామాజిక మాధ్యమాల ద్వారా ఎవరో ముక్కు మొహం తెలియని వ్యక్తులతో స్నేహాలుచేసి వాళ్ళు చూపించే ప్రేమకి కరిగిపోయి వాళ్ళేమడిగితే ఆవిధంగా ఎక్కడో ఉన్నాడులే ఫోటోనే కదా చూసేది, శరీరాన్ని ముట్టుకోవట్లేదు కదా అన్న ధైర్యంతో నగ్నంగా చిత్రాలు తీసుకుని పంపితే వాటిని రకరకాల ఆన్లైన్ సంస్థలకి అమ్ముకుని సొమ్ము చేసుకోవడమే కాకుండా ఈ పిల్లలని లొంగ దీసుకుందుకు కూడా వాడుతున్నారు. పిల్లలకి ఒక వయసు వచ్చిన తరువాత శారీరికమార్పులు అర్ధం అవుతున్న తరుణంలో తల్లో, తండ్రో చొరవతీసుకుని వారికి ఇటువంటి నష్టాలు తెలియజెయ్యకపోతే మరిన్ని సంఘటనలు జరగకమానవు. అవసరానికి మించి డాబూ దర్పం చూపించుకోవడానికి ఏభైవేల పైన ఖరీదు ఉన్న మొబైల్స్ కొనిస్తున్నారు.

మొన్ననే నా శ్రీమతికి రైల్ లో ఇద్దరు అలాంటి అమ్మాయిలే తగిలేరు. వాళ్ళవస్తువులు మరచిపోయి దిగిపోతుంటే ఆపి అన్నీ తీసుకోమని చెప్పి పంపించింది. ఆఖరికి వాళ్ళు తమ వాచ్ వదిలేసి వెళ్ళిపోయారు. వారిద్దరి మాటలు , ప్రవర్తనా చూసి నా శ్రీమతి భయపడింది. వాళ్ళ మాటల ప్రకారం ఒకమ్మాయి వద్దంటుంటే, రెండో అమ్మాయి ఉత్తర్ ప్రదేశ్ కి చెందిన ఒక వ్యక్తిని పిలిచిందిట రమ్మనమని ఇలా సామాజిక మాధ్యం స్నేహం అట. ఆ తరువాత ఏమి జరిగినా ఎవరిది బాధ్యత? పైగా వాడు వచ్చినప్పుడు ఇంట్లో కాలేజీ కల్చరల్ ప్రోగ్రాం ప్రిపరేషన్ అని చెప్తారుట, అందుకు ఒక వారం బయట ఉంటారుట. తెలివి తేటలు ఉపయోగించడం ఒక ఎత్తైతే, వాళ్ళ పట్ల వాళ్ళ అమ్మా నాన్నలకి ఉన్ననమ్మకాన్ని వమ్ము చేయడం ఒక ఎత్తు. ఆ తల్లి తండ్రులు కూడా పిల్లల నడవడిక మీద కన్నువేయకుండా వదిలెయ్యడం అతి పెద్ద తప్పు.

అందుకే అంటారు మన దేశంలో కొత్తొక వింత పాతొక రోత అని. ఏదన్నా కొత్తది అందుబాటులోకి వస్తే చాలు దాన్ని ఉపయోగించుకుని మనం ముందుకు ఎలా సాగుదాం జీవితం లో మంచి పేరు ఎలా సంపాదించుకుందాము అని కాకుండా, దాన్ని వినియోగించుకుని ఎన్ని తప్పులు చెయ్యొచ్చు అని చూస్తాం అందుకే మనలాగే వెనుకబడిన దేశాలకి మనకన్నా వెనుకగా ఈ పరిజ్ఞాన ఫలాలు అందినా వారు పరిణితి సాధించడంలో మనకన్నా ముందుంటారు.

నా మనసులో ఉన్నది ఒక్కటే ఏ రకాల ప్రలోభాలకి లొంగకుండా మన పరిధులు మనం తెలుసుకుంటూ, మనకి ఇష్టంలేని దాన్ని కావాలనో లేక చూద్దాం అనో ఎంతవరకు వెడితే అంతవరకూ లాగడంగానీ లేక మన వ్యక్తిగత విషయాలను అజ్ఞాత వ్యక్తులకి చేరవెయ్యడం గానీ చెయ్యకుండా సామాజిక మాధ్యమాన్ని సామాజిక వికాసంకోసం వాడుకున్నంతవరకూ ఏ విధమైన ఇబ్బందులూ రావు. కాదు మనం ఏది ఏమైనా తేల్చుకోగలము మనకి అంత సమయం ఉంది లేక మన ఇంట్లో వాళ్ళు మనకి అండగా నిలబడగలరు అని అనుకుంటే కూడా కొన్నింటిని మనం ఒప్పుకున్నంత సులువుగా మన ఇంట్లో వాళ్ళూ హర్షించరు. భర్త వేరొక ఆమెతో అన్ని విషయాలూ మాట్లాడడంగానీ, లేక భార్య వేరొక వ్యక్తితో వ్యక్తిగత విషయాలు మాట్లాడడంగానీ హర్షించరు.

కొన్ని జంటలు ఒకరికొకరు చెప్పుకుంటూ, చేయూతనిచ్చుకుంటూ కలిసిగట్టుగా ఉండి అన్నిపనులు చెప్పుకొని చేస్తూ ఎదుటివారినే ఫూల్స్ ని చేస్తారు.  అలాంటి సమయాలలో ఇద్దరూ కలిసి బయటవాళ్ళని ఫూల్స్ నీ చెయ్యగలరు లేదా బయట నుండి ఫూల్స్ కాకుండా తమని తాము కాపాడుకొననూ గలరు.

అలాగే సామాజిక మాధ్యమాల ద్వారా ఎవరికైనా ఆర్ధికంగా సహాయం చెయ్యాలనుకున్నా ఒకటికి రెండుసార్లు ఆలోచించి చెయ్యండి. అనాలోచితంగా అధిక మొత్తాలలో సహాయాలు చేసి తరువాత బాధపడేకన్నా తమ శక్తికి మించి సహాయాలు చేద్దాం అనుకోవడమో లేక అలాంటి సహాయాలను ఆర్జించి వేరొకరి చేతిలో పెట్టి వారు మోసం చేస్తే పాడయ్యేది మనపేరే అన్న జ్ఞానం కూడా మనకే ఉండాలి. అందరూ తప్పుడుగా ఉంటారు అని కాదు అలా అని మనకి పరిచయం అయ్యేవాళ్ళందరూ మంచివాళ్ళూ అనికాదు. ముందు మనం మంచిగా ఉంటే, మన పరిధులు మనం తెలుసుకుంటే వేరే వారికి చెప్పగలం మనకే తెలియకపోతే మనమూ పడతాము, ఎదుటివాడికీ తలనెప్పులు తెస్తాము.

అందుకే నా మనోగతం ఎప్పుడూ చెప్పేది సామాజిక మాధ్యమాలా మజాకానా, వాటిని నమ్మకుండా ఉండడమే  మంచిది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *