May 11, 2024

ఈ జీవితం ఇలా కూడా వుంటుందా? 9

రచన: అంగులూరి అంజనీదేవి

అంకిరెడ్డి ఆఫీసు నుండి ఇంటికి రాగానే సతీష్‌చంద్ర ఫోన్‌ చేసినట్లు మాధవీలతతో చెప్పాడు. ఆమె మాట్లాడకుండా మౌనంగా విని ”సరే! మీకు కాఫీ తెచ్చిస్తాను” అంటూ అక్కడ నుండి కావాలనే లేచి వెళ్లింది.
భార్య కాఫీ తెచ్చేంత వరకు ఖాళీగా కూర్చోకుండా లాప్‌టాప్‌ ఓపెన్‌ చేసి కొత్తగా వచ్చిన వెబ్‌సైట్లు చూసుకుంటూ కూర్చున్నాడు.
”ఊ… ఇదిగోండి కాఫీ” అంటూ ఆయనకు నాలుగు అడుగుల దూరంలో వున్నప్పుడే అంది.
”దగ్గరకి రా! అక్కడ నుండే ఇస్తావా?”
”దగ్గరకి వచ్చాక ఏం జరుగుతుందో నాకు తెలుసు. మీకు కాఫీ యివ్వటం కాదు, త్రాగిస్తూ నిలబడాలి. అంత ఓపిక నాకెక్కడిది? ఉదయం నుండి పనంతా నేనే చేస్తున్నాను”
”ధృతి వుందిగా!”
”ఎక్కడుంది? పడకేసి గదిలోనే వుంది. బయటకొస్తేగా!”
ఆయన వెంటనే లేచి ధృతి కోసం వెళ్లాడు.
ధృతి గది బయట నిలబడి ”అమ్మా! ధృతీ!” అంటూ పిలిచాడు. తలుపు తియ్యలేదు. తలుపు మీద కొట్టి పిలిచాడు. ఈసారి ఆమె కదిలినట్లు గాజుల చప్పుడు విన్పించింది. కానీ తలుపు తియ్యలేదు. మళ్లీ తలుపుకొట్టి గట్టిగా పిలిచాడు. తలుపు తీసి ఎదురుగా వున్న అంకిరెడ్డి వైపు నీరసంగా చూస్తూ ”ఏంటి మామయ్యా?” అంది.
ఆమెను చూసి ఉలిక్కిపడ్డాడు అంకిరెడ్డి. తిండి తిని ఎంతో కాలమైన దానిలా, ముఖమంతా పీల్చుకుని పోయి వుంది.
”ఏంటమ్మా అలా వున్నావ్‌? ఒంట్లో బాగాలేదా?”
”బాగానే వుంది మామయ్యా! పడుకున్నాను. అంతే! వెళ్తాను. వెళ్లి వంట చేస్తాను” అంటూ ఆయన పక్కన దారి చేసుకుంటూ వెళ్లబోయింది.
ఆమెను చూస్తుంటే హృదయమంతా నలిపేసినట్లు బాధగా వుంది అంకిరెడ్డికి.
కంగారుపడి ”వద్దులేమ్మా! పడుకో! వంట మీ అత్తయ్య చేస్తుంది. నీకు అంత బాగున్నట్లు లేదు” అని ధృతిని మళ్లీ గదిలోకి పంపి ఆయన వెళ్లిపోయాడు.
వంట మాధవీలత చేసింది.
రాత్రికి భోజనాల దగ్గర ”ధృతికి ఏమైనా పెట్టారా తినటానికి?” అని అడిగాడు అంకిరెడ్డి భార్యవైపు, మోక్ష వైపు చూసి.
”నేను ఇప్పుడే ఆఫీసు నుండి వచ్చాను మామయ్యా!” అంది మోక్ష.
”నేను వంట చేస్తూ ఖాళీగా లేను” అంది మాధవీలత.
”ఇంట్లో ఇంతమంది వుండి కడుపుతో వున్న మనిషిని ఏమాత్రం పట్టించుకోవటం లేదంటే మిమ్మల్ని ఏమనాలి?”
”ఏమీ అనకండి నాన్నా! ఎవరి పనుల్లో వాళ్లున్నారు. నేను కూడా ఇప్పుడే వచ్చాను ఆఫీసు నుండి… అంతో ఇంతో ఆఫీసు నుండి ముందొచ్చేది నువ్వే” అన్నాడు.
ఆయన ఇంకేం మాట్లాడలేక ”మధూ! నువ్వు వెళ్లి వేడిగా ఒక గ్లాసు పాలు తీసికెళ్లి ధృతికి ఇవ్వు…” అన్నాడు.
ఆమె విసుగ్గా తింటున్న ప్లేట్లో చెయ్యి కడిగేసి ”కోడలికి అత్తగారి చేత సర్వీస్‌ చేయించాలని చూసే మామను మిమ్మల్నే చూస్తున్నానండి! ఇలా ఎక్కడా వుండరు” అంటూ ఆమె గదిలోకి వెళ్లింది. ఆమె మొహం ఎందుకంత చిరాగ్గా, ఏవగింపుగా పెట్టిందో ఆయనకు అర్థం కాలేదు. ఇదేమంత పని అని, అదే తారమ్మ ఎంత గొప్పది, సౌమ్యకి ఎంత గొప్పగా సేవ చేసింది అనుకున్నాడు మనసులో.
ఆమె వెళ్లాక మోక్షను కదిలించాడు- ”నెలనెలా హాస్పిటల్‌కి తీసుకెళ్తున్నారా దృతిని?” అన్నాడు.
ఆనంద్‌ అది విని ప్లేట్లో వున్న అన్నాన్ని మొత్తం నాలుగు ముద్దలుగా చేసి, పెద్దగా నోరు తెరిచి గబగబ తినేశాడు. వాష్‌బేసిన్‌ దగ్గరకెళ్లి చేయి కడుక్కుని ”తినేసిరా!” అన్నట్లు మోక్షవైపు చూసి గదిలోకి వెళ్లాడు.
”రెండో నెల రాగానే తీసికెళ్లాను మామయ్యా! ప్రెగ్నెన్సీ కన్‌ఫం అన్న సంగతి అప్పుడే తెలిసింది. మళ్లీ తీసికెళ్లలేదు”
”ఎందుకని…?”
”ముందురోజు అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఒక రోజంతా ఓ.పి.లో కూర్చోవాలి. అంత టైమంటే నాకు ఆఫీసులో వీలుకావడం లేదు. అత్తయ్యతో ఈ విషయం చెప్పాను. ఆమె విని పట్టించుకోలేదు. అలాగే గడిచిపోతున్నాయి రోజులు. ఇంకో రెండు రోజులైతే తనకి ఏడో నెల వస్తుంది. ఇది మీకు తెలియదా మామయ్యా?” అంది మోక్ష.
ఆయనకు ఏం సమాధానం చెప్పాలో తెలియలేదు.
”ఇలాంటివి ఆడవాళ్లు మీరుకదా చూసుకోవలసింది” అన్నాడు అసహనంగా.
”సరే! మామయ్యా!” అంది మోక్ష.
”సరే కాదు. నువ్విప్పుడు దృతి దగ్గరికి వెళ్లి పాలు తాగించు. రేపు హాస్పిటల్‌కి తీసికెళ్లు” అన్నాడు.
అప్పటికే ఆమె తినడం పూర్తి చేసి లేచింది. వాష్‌బేసిన్‌ దగ్గర చేయి కడుక్కుని నాప్‌కిన్‌తో చేయి తుడుచుకుంటూ ”ఇప్పుడు పాలు ఇవ్వటం నా వల్ల కాదు మామయ్యా. ఇప్పటికే నేను బాగా అలసిపోయి వున్నాను. మా ఆఫీసులో ఇద్దరమ్మాయిలు లీవ్‌ మీద వెళ్లారు. వర్క్‌ పెరిగింది. వాళ్ల పెండింగ్‌ వర్క్‌ కూడా నేనే చెయ్యవలసి వస్తోంది. వాళ్లు తిరిగి ఆఫీసుకు రావానికి వారం రోజులు పడుతుంది. ఇలాంటప్పుడు దృతిని హాస్పిటల్‌కి తీసికెళ్లటం నాకు కుదరదు మామయ్యా! సారీ!” అంది మోక్ష.
ఆయనకు మాట్లాడానికేం దొరకలేదు.
అంకిరెడ్డి మాట్లాడకపోవటంతో మోక్ష మౌనంగా తల వంచుకొని తన గదిలోకి వెళ్లింది. ఆమెకు నేనిలా అబద్దం చెప్పి తప్పు చేస్తున్నానని కొంచెం కూడా అన్పించలేదు. అంకిరెడ్డి లేచి చేయి కడుకున్నాడు. నేరుగా వంట గదిలోకి వెళ్లి పాలు తీసుకొని దృతి గదిలోకి వెళ్లాడు. అంకిరెడ్డి దృతి గదిలోకి వెళ్లటం మాధవీలత కర్టెన్‌ చాటున నిలబడి చూసింది. ఆమెకు కసిగా వుంది, రోషంగా వుంది. కోపంగా వుంది. కానీ ఏం చెయ్యలేక వెళ్లి పడుకుంది.
ధృతిని లేపి ఆమె చేత పాలు తాగించాడు అంకిరెడ్డి.
ధృతిని చూస్తుంటే ఆయనకు చాలా బాధగా వుంది. ఇన్నిరోజులు నా షెడ్యూల్‌ నేను కరెక్ట్‌గా చేసుకుంటే చాలనుకున్నాడు కాని, ఇంట్లో ఇలా ఒకరినొకరు పట్టించుకోవడం లేదని గమనించలేదు. ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా వున్నారనుకున్నాడు కాని ఒకరిపట్ల ఒకరు ఇంత నిర్లక్ష్యంగా వున్నారనుకోలేదు. ఇంటి పెద్దగా రోజుకి పావుగంట సమయాన్ని కూడా కుటుంబ సభ్యుల కోసం కేయించకపోవడం తనది కూడా తప్పే అనుకున్నాడు.
ధృతి పాలు తాగాక ”మీకెందుకు మామయ్యా శ్రమ. నేను లేచాక వెళ్లి తాగేదాన్నిగా!” అంది మొహమాట పడుతూ.
”నువ్వెప్పుడు లేవాలి… ఎప్పుడు తాగాలి. ఎంతగా నీరసించిపోయి వున్నావో చూడు… ‘నాకు ఒంట్లో బాగుండలేదు మామయ్యా!’ అని ఒక్కమాట నాతో చెప్పి వుంటే హాస్పిటల్‌కి తీసికెళ్లేవాడినిగా! వాళ్లంటే పనుల్లో వున్నారు” అన్నాడు.
”మీరు కూడా ఖాళీగా ఏం లేరుగా మామయ్యా! జ్వరమేగా! తగ్గిపోతుంది.” అంది.
ఆయన వెంటనే తన గదిలోకి వెళ్లి జ్వరం టాబ్లెట్ తెచ్చి ధృతి చేత మింగించాడు. అది కూడా చూసింది మాధవీలత.
ఏ కుటుంబ సభ్యులైనా ఆ ఇంటి స్త్రీ గర్భవతిగా వుంటే చాలా సంతోషపడతారు. ఇష్టమైనవి తెచ్చి పెడతారు. డబ్బులు లేకపోయిన గవర్నమెంట్ హాస్పిటల్‌కి తీసికెళ్లి పరీక్షలు చేయించి మందులు తెచ్చి వాడమంటారు. మంచి ఆహారాన్ని శ్రద్ధగా తినిపిస్తారు. బాబో పాపో పుట్టే వరకు ఆత్రుతగా ఎదురు చూస్తారు.
”పడుకో తల్లీ! రేపు నేను నిన్ను హాస్పిటల్‌కి తీసికెళ్లి డాక్టర్‌కి చూపిస్తాను. అన్ని చెకప్‌లు చేయిస్తాను. సతీష్‌ ఫోన్‌ చేస్తే మామయ్య ఇలా చెప్పాడని చెప్పు. వాడు ధైర్యంగా వుంటాడు” అన్నాడు. ఆ చిన్న మాటకే కరిగి నీరైపోయింది ధృతి. కన్నీళ్లు కారుతుండగా అంకిరెడ్డికి రెండు చేతులెత్తి దండం పెట్టింది. ”అలాగే మామయ్యా!” అంటూ తల వూపింది.
అంకిరెడ్డి తన గదిలోకి వెళ్లిపోయాడు.
మాధవీలత ఆయన్ని చూడగానే ”అయ్యాయా సేవలు?” అంది.
”ఇవి సేవలు కావు. పనులు”
”నాకెప్పుడైనా అలా చేశారా?”
”చెయ్యాల్సిన అవసరం వచ్చివుండదు. వస్తే ఎందుకు చెయ్యను. మనుషులం కదా! మనుషులకి మనుషులే చెయ్యాలి. పశుపక్ష్యాదులు చెయ్యవు”
”అంటే మీ ఇద్దరే మనుషులు. మేమంతా పశుపక్ష్యాదులమా?”
”పడుకో మధూ! ఓపిక లేదు. ఎందుకంత వ్యతిరేకంగా ఆలోచిస్తావు? అయినా అదేమంత పెద్ద పని! ఎందుకింత రాద్ధాంతం? అయినా ధృతి ఏం చేసిందని ఆమె పట్ల నువ్వింత నిరసనగా వున్నావ్‌?”
”ఏదో చేసిందిలెండి! అవన్నీ ఇప్పుడెందుకు?”
”చెప్పరాదు”
”అలాంటివన్నీ చెప్పే సందర్భమా ఇది. సమయం రానివ్వండి చెబుతాను” అంది.
ఏదో జరిగిందని అర్థమైంది అంకిరెడ్డికి.
”సరే! చెప్పకు. కానీ మనం చేసే ప్రతి పనిని దేవుడు చూస్తూనే వుంటాడుట. మంచి చేస్తే మంచి…. చెడు చేస్తే చెడు… మంచి చేస్తే మంచే జరుగుతుంది. కానీ చెడు చేస్తూ నాకేం కాదులే అని మాత్రం అనుకోకూడదు. మనం చెడు చేసిన వెంటనే మన పతనాన్ని మన వెనకాలే పంపిస్తాడట. ఎందుకంటే కర్మ చేయించేది ఆయనే, దాన్ని ఫలితాన్ని చూపించేది ఆయనే… ఆయన క్యాలిక్యులేషన్‌ చాలా పర్‌ఫెక్ట్‌గా వుంటుందట” అన్నాడు అంకిరెడ్డి.
ఆమె లేచి కూర్చుని ”అంటే నేనేదో చెడు చేసినట్లు నాకు చెడు జరుగుతుందని నా భవిష్యత్‌ను బొమ్మగీసి చూపిస్తున్నారా? నాకు చెడు జరగాలని కోరుకుంటున్నారా?” అంది.
”అలా కోరుకుంటే చెడు జరుగుతుందా మధూ! ఇవాళ వాకింగ్‌లో ఈ మాటల్ని ఎవరో అంటుంటే విని గుర్తు పెట్టుకొని చెప్పాను. నువ్వు కూడా వీటిని గుర్తు పెట్టుకొని నలుగురికి చెప్పు. ఆ నలుగురు ఇంకో నలుగురికి చెబుతారు. మంచి మాటలెప్పుడు చెయిన్‌లా వ్యాపించిపోవాలి” అన్నాడు.
”ఇవేమైనా అంత మంచిమాటలా చెప్పటానికి. వినగానే భయపడి చచ్చేమాటలు” అంది.
”భయం దేనికి? మనమేమైనా చెడు చేస్తే కదా భయపడి చావానికి… నువ్వు చాలా మంచిదానివి మధూ! భయపడాల్సిన పనులెప్పుడూ చెయ్యవు. పడుకో!” అన్నాడు.
ఆమె పడుకోలేదు. ”ఎక్కడో సైన్యంలో వుండేవాడికి పిల్లలెందుకు?” అంది. ఆయన అదిరిపడి చూశాడు.
”ఏం మాట్లాడుతున్నావ్‌ మధూ! అప్పుడేమో వాడికి చదువులేదు. చెప్పుకోదగిన క్యాడర్‌ లేదు. సైన్యంలోనే వుండనివ్వండి అన్నావ్‌! ఇప్పుడేమో సైన్యంలో వుండే వాడికి పిల్లలెందుకు అంటున్నావ్‌! ఇదేమైనా బావుందా?” అన్నాడు.
”బాగుండక ఆవిడ గారు పడుకొని వుంటే పనులెవరు చేస్తారు? పడుకోబెట్టి చెయ్యటానికి, పురుళ్లు పొయ్యటానికి తల్లిదండ్రులేమైనా వున్నారా? లేక ఆవిడగారి అన్నగారేమైనా వచ్చి చేస్తారా?” అంది వ్యంగ్యంగా.
మాధవీలత, అంత వ్యంగ్యంగా మాట్లాడటం ఆయనెప్పుడూ చూడలేదు. అందుకే ఆమెను కొత్త మనిషిని చూసినట్లు చూశాడు. ఆశ్చర్యపోతూ చూశాడు. నువ్వు నువ్వేనా అన్నట్లు చూశాడు.
”నువ్వే ఇలా మాట్లాడితే బయటవాళ్లింకెలా మాట్లాడతారు? అయినా తల్లిదండ్రులు లేని ఆడపిల్లలకి మనదేశంలో పురుళ్లు పొయ్యరా? ధృతికి అమ్మ లేకుంటేనేం అమ్మకన్నా ఎక్కువగా నువ్వున్నావుగా” అన్నాడు.
”అలా అని నేను మీకేమైనా రాసిచ్చానా?” అంది గయ్యిమంటూ.
ఇదేదో తేడాగా వుందనుకున్నాడు అంకిరెడ్డి. వాదించి లాభం లేదనుకున్నాడు… ఆ తర్వాత ఆమె మాట్లాడలేదు. ఆయన మాట్లాడలేదు.
*****
ఉదయం పది గంటలు దాటింది.
అంకిరెడ్డి ధృతి హాస్పిటల్‌కెళ్లి నెంబర్‌ తీసుకుని ఓ.పి.లో కూర్చున్నారు. ఒక గంట గడిచాక డాక్టర్‌ గారు పిలుస్తున్నారని నర్స్‌ వచ్చి చెప్పగానే ధృతి నీరసంగా లేచింది. నెమ్మదిగా నడుచుకుంటూ డాక్టర్‌గారి గదిలోకి వెళ్లింది. అక్కడ డాక్టర్‌ లేదు.
డాక్టర్‌ వేరే పేషంటును చూసి వచ్చే లోపల నర్స్‌ ధృతిని తీసికెళ్లి ఒక బల్లను చూపించి ”ఈ బల్లపై పడుకోండి! డాక్టర్‌ గారొస్తారు” అని అనేలోగానే డాక్టర్‌గారొచ్చారు. ధృతి బల్లపై పడుకుంది. డాక్టర్‌ నవ్వుతూ ధృతి దగ్గరకి వచ్చి ”ఎలా వుంది ఆరోగ్యం” అంటూ రెండు చేతులతో పొట్టను నెమ్మదిగా నొక్కుతూ
”ఏడో నెలనా?” అని అడిగింది.
”అవును మేడమ్‌!” చెప్పింది ధృతి.
డాక్టరేం మాట్లాడకుండా ”బేబీ అండర్‌ డెవలప్‌డ్‌” అనుకుంటూ అక్కడే వున్న వాష్‌ బేసిన్‌ దగ్గర చేతులు కడుక్కొని నాప్‌కిన్‌తో తుడుచుకొని వెళ్లి తన సీట్లో కూర్చుంది. ఈ లోపల ధృతి కూడా వచ్చి ఆమెకు ఎదురుగా కూర్చుంది.
”నీతోపాటు ఎవరైనా వచ్చారా?”
”మా మామగారు వచ్చారు మేడమ్‌! బయట వున్నారు”
”ఆయన్ని లోపలికి పిలువు” అని డాక్టర్‌ అనగానే నర్స్‌ వెళ్లి అంకిరెడ్డిని పిలిచింది. ఆయన లోపలకొచ్చి ”నమస్తే మేడమ్‌!” అంటూ డాక్టర్‌కి ఎదురుగా కూర్చున్నాడు.
ఆయన డోర్‌ నెట్టుకొని లోపలకి వస్తున్నప్పుడే ఆయన వైపు ఎగాదిగా చూసినందువల్లనో ఏమో మళ్లీ ఆయన వైపు చూడకుండా పాత చీటీని చూస్తూ
”మిమ్మల్ని చూస్తుంటే చదువుకున్నవాళ్లలా కన్పిస్తున్నారు. ఈమె విషయంలో ఎందుకింత నిర్లక్ష్యం చేశారు? ప్రెగ్నన్సీ కన్‌ఫం అయిందని తెలిశాక మళ్లీ ఇప్పుడా తీసుకురావటం…” అంది కోపంగా డాక్టర్‌.
”అదీ మేడమ్‌!” అంటూ నసిగాడు అంకిరెడ్డి.
ఆమె అంకిరెడ్డి వైపు చూడకుండా ధృతి వైపు చూసి ”అప్పుడు నీతో వచ్చినావిడ ఎవరు?”
”మా తోడికోడలు మేడమ్‌!” అంది ధృతి.
అది వినగానే డాక్టర్‌ అంకిరెడ్డి వైపు చూసి ”ఆమెతో నేనా రోజు క్లియర్‌గా చెప్పాను. మూడో నెలలో ఒకసారి, ఆరు నెలలు దాక నెలనెలా స్కాన్‌ తీయించాలని… ప్రెగ్నెన్సీ కన్‌ఫం అయినప్పటి నుండి ఐరన్‌ ఫోలిక్‌యాసిడ్‌, క్యాల్సియమ్‌ టాబ్లెట్లు వాడాలని… న్యూట్రీషియస్‌ ఫుడ్‌ పెట్టాలని… కానీ మీరు ఇవేమీ చెయ్యలేదు. ఆమె భర్తను ఒకసారి పిలిపిస్తారా?” అంది డాక్టర్‌.
”ఇక్కడ వుండడు మేడమ్‌! సైన్యంలో వుంటాడు…”
”అయితే రాలేడా?”
”రాలేడు మేడమ్‌! ఏమైనా ఉంటే నాతో చెప్పండి”
”ఏముంది చెప్పడానికి. కనిపిస్తూనే ఉందిగా మీరెంత నిర్లక్ష్యం చేశారో. ఆమెను ఇన్నిరోజులు హాస్పిటల్‌కి తీసుకురాకుండా, మందులు వాడకుండా, పోషకాహారం ఇవ్వకుండా, స్కాన్‌ తీయించకుండా… ఇది మీకెలా అన్పిస్తుందో కాని, నాకు మాత్రం క్షమించరాని చర్యలా వుంది. అతను మిమ్మల్ని నమ్మే కదా ఆమెను మీ దగ్గర వుంచాడు”
”అవును మేడమ్‌!”
”అలాంటప్పుడు ఇలాగేనా చూసేది? లోపల బేబీ పొజిషన్‌ చాలా బ్యాడ్‌గా వుంది. ఇప్పుడేం చేయమంటారు?”
”ఏదో ఒకటి మీరే చెయ్యాలి మేడమ్‌!”
”’ఆలస్యంగా తీసుకొచ్చి ఏదో ఒకటి చెయ్యమంటే ఎలా! ఆమె మామూలు మనిషి కాదు. ఏడు నెలల గర్భిణి స్త్రీ… లోపల శిశువు పెరగలేదు. ఇలాంటప్పుడు లోపల బేబీ చనిపోయినా తెలియదు” అంది డాక్టర్‌ కోపంగా.
”ఓ… గాడ్‌!” తల పట్టుకున్నాడు అంకిరెడ్డి.
”ఇదంతా మీ ఫ్యామిలీ మెంబర్స్‌ నిర్లక్ష్యం వల్లనే జరిగింది. అతనెక్కడో సైన్యంలో వున్నాడని ఈమెను మీరు సరిగా పట్టించుకోలేదు. ఇప్పుడు తల పట్టుకుంటే ఏం లాభం?”
”ఎంత ఖర్చు అయినా పర్వాలేదు. లోపల బేబీ పెరిగేలా చూడండి డాక్టర్‌!” అంటూ అభ్యర్థించాడు అంకిరెడ్డి.
”మోడరన్‌ సొసైటీలో వుండి కూడా కొడుకు సైన్యంలో ఉన్నప్పుడు కోడల్ని ఇలాగే చూస్తారా సర్‌! సరిగా పట్టించుకోరా? అయినా ఒక ప్రెగ్నంట్ లేడీని ఇంత నెగ్లెక్ట్‌గా చూడడమేంటి? ఇప్పుడేమైనా జరిగితే ఎవరు బాధ్యులు?” కోపం తగ్గించుకుంటూ అడిగింది డాక్టర్‌.
ఆ మాటలకి అంకిరెడ్డి తేరుకున్నాడు. ”ప్లీజ్‌! మేడమ్‌!” అన్నాడు రిక్వెస్ట్‌గా
డాక్టర్‌ ధృతివైపు చూసి ”వాళ్లంటే సరే! నీకేమైంది? నిన్ను నువ్వు కేర్‌గా చూసుకోలేవా? నీ కడుపులో వుండే బిడ్డను నీ అంతట నువ్వే చంపుకుంటావా? అలా జరిగితే! అది తెలిసి జరిగినా, తెలియక జరిగినా ఒక రకంగా క్రైమ్‌ లాంటిదే! నీలాంటి కేసుల్ని చూసి బాధ పడటం తప్ప మాలాంటి వాళ్లం చెయ్యగలిగింది ఏం లేదు” అంది.
ధృతి తల వంచుకుంది. అంకిరెడ్డి డాక్టర్‌ ఫైనల్‌గా ఏం చెబుతుందా అని ఆత్రంగా చూస్తున్నాడు.
”సరే! వెళ్లి స్కాన్‌ తీయించుకురండి!” అంది. ఆమె అలా అనగానే వెళ్లి స్కాన్‌ తీయించుకొచ్చారు.
డాక్టర్‌ వాళ్లు తెచ్చిన స్కాన్‌ రిపోర్ట్స్‌ చూస్తూ ”బేబీ బరువు వుండాల్సిన దానికన్నా చాలా తక్కువగా వుంది. స్టెరాయిడ్‌ వాడాలి. అది చాలా ఖర్చుతో కూడిన పని.”
”ఎంత ఖర్చయినా పర్వాలేదు మేడమ్‌!” అన్నాడు అంకిరెడ్డి. ఆయన ఇప్పుడు కాస్త వూపిరి పీల్చుకున్నాడు. అంతవరకు లోపల బేబీ చనిపోయి వుంటుందనే కంగారు పడుతున్నాడు.
”అది కూడా నా ప్రయత్నం నేను చేస్తాను. ఎందుకంటే ఏడు నెలలు దాక లోపల బేబీ గ్రోత్‌ అంతగా వుండదు. తిండి వల్ల, మందుల వల్ల మానసిక ప్రశాంతత వల్ల బరువు పెరిగే అవకాశాలు వుంటే వుండొచ్చు. పెరగకపోతే ముందుగానే సిజేరియన్‌ చేసి బేబీని బయటకు తీసి బరువు పెరిగేలా చెయ్యాలి.” అంది డాక్టర్‌.
అంకిరెడ్డి, ధృతి ఆమె చెప్పే మాటల్ని ఉత్కంఠతో వింటున్నారు.
”అప్పుడు కూడా నేను బేబీకి గ్యారంటీ ఇవ్వలేను. ఎందుకంటే తల్లి కడుపులో పెరగాల్సిన బేబీని మనం ముందుగానే బయటకి తీసి బరువు పెంచబోతున్నాం. ఎంత ఇంటెన్సివ్‌కేర్‌లో వుంచినా ఇన్‌ఫెక్షన్స్‌ వచ్చే ఛాన్సెస్‌ ఎక్కువగా వుంటాయి”
”లేదు మేడమ్‌! అంతదాకా రాకపోవచ్చు. ఈ విషయం నా భార్యకు తెలిస్తే తల్లడిల్లిపోతుంది. జాగ్రత్తగా చూసుకుంటుంది” అన్నాడు అంకిరెడ్డి.
”సరే! మందులు రాసిస్తున్నాను. వారం రోజుల తర్వాత వచ్చి కన్పించండి! అప్పుడు మళ్లీ స్కాన్‌ తీయవలసి వస్తుంది. ఎప్పటికప్పుడు చెకెప్‌ అవసరం అవుతుంది” అంటూ మందులు రాసిన ప్రిస్కిప్షన్‌ వాళ్ల చేతికి ఇచ్చి
”నెక్ట్స్‌…” అంది. ఇక మీరు వెళ్లొచ్చు అన్నట్లు చూసింది.
అంకిరెడ్డి, ధృతి లేచి డోర్‌వైపు కదిలే లోపలే ఇంకో పేషంట్ వచ్చి డాక్టర్‌ ముందు కూర్చుంది.
అంకిరెడ్డి, ధృతి మెడికల్‌ షాపులో మందులు కొని కారెక్కారు. దారిలో కారు దిగి ధృతికోసం పండ్లు కొన్నాడు అంకిరెడ్డి. పండ్లు కారులో పెట్టి కారులో కూర్చుని కారుని రివర్స్‌ తీసుకుంటూ నీకు ‘ఇలా వుందని మీ అన్నయ్యతో చెప్పలేదా!’ అని అడిగాడు.
”నేను బాగానే వున్నాను మామయ్యా! మా అన్నయ్యతో చెప్పాల్సినంత బాధలేం నా ఒంట్లో లేవు. అంతా నార్మలే!” అంది.
నిజానికి ఆమె మనసులో వుండేది అదికాదు. ఆమెకు ఆ ఇంట్లో సతీష్‌ వెళ్లిన కొద్దిరోజుల నుండే అసౌకర్యం మొదలైంది. పనిమనిషిని తీసెయ్యటం పెద్ద ఇబ్బంది కాదు గాని, అదే పనిగా ఆనంద్‌ చేసే కామెంట్స్ ని తట్టుకోలేకపోయేది. అలా అని తిట్టరు, కొట్టరు. తిండి తినబుద్ది కాకుండా మాటలతోనే కొట్టేవాళ్లు. ముఖ్యంగా ఒకరోజు ఏమైందో ఏమో ‘ప్రవీణ్‌ ఇలా, ప్రవీణ్‌ అలా, అసలు ప్రవీణ్‌ అంటే ఇదీ, ప్రవీణ్‌ అంటే అదీ’ అంటూ ఆమె ముందే ఆమె అన్నయ్యను చాలా హీనంగా తీసేస్తూ మాట్లాడాడు. ”అసలు ప్రవీణ్‌లాంటి వాళ్లను ఇంటికి రానివ్వకూడదు. వాళ్ల ఇంటికి వెళ్లకూడదు” అన్నాడు. అప్పుడు దృతి వూరుకోలేదు. ఏదో ఒకటి అనకపోతే ఆమె మనసు వూరుకునేలా లేదు. అందుకే అంది. ”మా అన్నయ్యకు ఓ ఇల్లంటూ లేదు. ఎలాంటి వాళ్లు బడితే అలాంటి వాళ్లు ఆయన ఇంటికి వెళ్లటానికి… ఇల్లు వుండేవాళ్లు కదా ఆలోచిస్తారు ఎలాంటి వాళ్లను ఇండ్లకు పిలవాలో! పిలవకూడదో!” అని…. అప్పటి నుండి ఆనంద్‌ డైనింగ్‌ టేబుల్‌ దగ్గర ఆమెతో అతిగా మాట్లాడటం తగ్గించేశాడు. కామెంట్స్ కూడా లేవు. చాలా ప్రశాంతంగా అన్పించింది. రోజూ ఇలా వుంటే ఎంత బావుండు అనుకుంది. అలా ఓ వారం రోజులే గడిచింది. ఆ తర్వాత ఆమెను చూడగానే ముఖం అదోలా పెట్టుకుని ‘నువ్వంటేనే మాకు నచ్చటం లేదు’ అన్నట్లుగా మాధవీలత, మోక్ష వుంటున్నారు. అలా ఎందుకుంటున్నారో ఎంతకీ అర్థం కాలేదు.
”ఇలా వుంది అన్నయ్యా ఇక్కడ పరిస్థితి. నేను వుండలేక పోతున్నాను. నువ్వొచ్చి నన్ను తీసికెళ్లు” అని ప్రవీణ్‌కి ఫోన్‌ చేద్దామని ఎన్నోసార్లు అనుకుంది కానీ ఒక్కసారి కూడా చెయ్యలేదు. చేస్తే ఏమవుతుంది? బాధపడతాడు. తీసికెళ్లి నేరుగా హాస్టల్లో వుంచుతాడు. అలా హాస్టల్లో వుంచి తన ఒక్కదానికి పెట్టే డబ్బుతో ఎటూ కదలలేని వికలాంగుల కడుపు నింపొచ్చు. దాన్నెందుకు దూరం చెయ్యాలి. పైగా తను వెళ్లి హాస్టల్లో వుండేకన్నా అత్తగారింట్లో వుంటేనే అన్నయ్య సంతోషిస్తాడు. పగలంతా ఎక్కడ తిరిగినా రాత్రివేళ హాయిగా నిద్ర పోతాడు. అందుకే అన్నయ్యతో చెప్పలేదు.
అంకిరెడ్డి అడిగినప్పుడు ”ఇందుకే చెప్పలేకపోయాను మామయ్యా!” అని అంకిరెడ్డితో చెప్పలేదు ‘అంతా నార్మలే’ అని రెండు చేతులు ఒడిలో పెట్టుకొని కుదురుగా, అలసిపోయిన కుందనపు బొమ్మలా కూర్చుంది.
….మాట్లాడకుండా కారు నడుపుతున్న అంకిరెడ్డి మధ్యమధ్యలో ధృతివైపు చూస్తున్నాడు.
”నీకింత నీరసంగా వుందని కనీసం సతీష్‌కైనా చెప్పావా?”
”చెప్పలేదు మామయ్యా!”
”ఎందుకు చెప్పలేదు?”
”దేశ రక్షణ కోసం కందకాల్లో పడుకొని ఆయన వంతు బాధ్యతను ఆయన నిర్వహిస్తున్నాడు. ఆయన్నెందుకు మామయ్యా కదిలించటం? ఇప్పుడు ప్రేమకన్నా బాధ్యత ఎక్కువా, బాధ్యతకన్నా ప్రేమ ఎక్కువా అన్నది ప్రధానం కాదు. నా ఒక్కదాని నీరసం కోసం అంత గొప్ప దేశభక్తితో వున్న ఆయన్ని నీరసించిపోయేలా చెయ్యాలని నాకెప్పుడూ అన్పించలేదు. అందుకే ఎప్పుడు కాల్‌ చేసినా ‘నేనిక్కడ ఓ.కె’ అనే చెబుతాను. లేకుంటే ఆయన అక్కడ ప్రశాంతంగా వుండలేరు. అక్కడ వాతావరణం ఎలా వుంటుందో ఆయన నాకు చాలాసార్లు ఫోన్లో చెప్పాడు” అంది.
”ఏమని చెప్పాడు?” అడిగాడు అంకిరెడ్డి.
ఆమెకు వెంటనే తన భర్త తనతో చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. అస్సాం నుండి అరుణాచల్‌ప్రదేశ్‌కు వెళ్లే దారి కొండల మధ్యలో నుండి ఎత్తు పల్లాలతో కూడి ఉంటుంది. దట్టమైన అడవి కూడా ఉంటుంది. ప్రయాణం కష్టతరమే. చుట్టూ దట్టమైన అడవి, మనుషులు చాలా తక్కువగా ఉంటారు. భారత భూభాగంలోకి తరచూ చైనా సైన్యం చొరబాటు చేస్తూ, మన సైనికుల పహారా లేకుంటే ఆక్రమించుకోవడం కూడా జరుగుతుంటుంది. అరుణాచల్‌ ప్రదేశ్‌లో చాలా భాగం మన సైనిక పహారా లేకపోవటం వలన చైనా దురాక్రమణ చేసి భారత భూభాగాన్ని ఆక్రమించుకుంది. సైనికులు అప్రమత్తంగా ఉండి మన భూమిని ఎల్లవేళలా కాపాడుతూ ఉంారట.
”ఏంటమ్మా ఆలోచిస్తున్నావు?” అన్నాడు.
ధృతి వెంటనే తేరుకొని ”ఏం లేదు మామయ్యా! ఉదాహరణకి జమ్మూ నుండి శ్రీనగర్‌ వరకు కొండచరియలు విరిగి పడినప్పుడు రహదారి చెడిపోయినప్పుడు, వంతెనలు కూలబడిపోయినప్పుడు ఆర్మీ ఇంజనీర్స్‌ కొండచరియల్ని తొలిగించి రేయింబవళ్లు నిరాటకంగా వంతెన నిర్మాణానికి గాను టాన్స్‌మ్‌పెనల్‌ లాంటి పరికరాలను ఉపయోగించి త్వరత్వరగా ప్రజలకు రహదారిని వేస్తారట. అలాంటప్పుడు సైనికులు అజాగ్రత్తగా వుంటే వికలాంగులయ్యే ప్రమాదాలే ఎక్కువగా వుంటాయట. అలాంటి స్థితిలో వున్న ఆయనకు నేను నా బాధల్ని చెప్పుకుంటే అక్కడ ఆయన తన డ్యూటీని సరిగా చెయ్యగలరా? అందుకే చెప్పలేదు మామయ్యా!” అంది.
”మంచిపని చేస్తున్నావమ్మా! కానీ సతీష్‌ కాల్‌ చేసి చెప్పేంత వరకు నీ గురించి ఆలోచించాలని కాని, నీ వైపు చూసి ఎలా వున్నావో తెలుసుకోవాలని కాని నాకు అన్పించలేదు. నాది కూడా బాధ్యతా రాహిత్యమే!”
”ఇప్పుడు మీరు నన్ను బాధ్యతగానే చూశారు. ఇంతకన్నా ఎవరూ చూడలేరు!”
”కానీ నువ్వు బాగా తినాలమ్మా!”
”తింటాను మామయ్యా!” అంది.
కారు రోడ్డుమీద నెమ్మదిగా వెళుతోంది.
అదే సమయంలో మోక్ష పనిచేస్తున్న ఏర్‌టెల్‌ ఆఫీసులో ఆమె ఊహించని ఒక సంఘటన జరిగింది.
మోక్ష పక్కసీట్లో వున్న అమ్మాయి వాళ్ల ఎం.డి బయటకి వెళ్లగానే తన మొబైల్‌లో వుండే వీడియోను ఆన్‌ చేసింది. ఆ టైంలో కస్టమర్లు రారు. ఆ వీడియోలోంచి డి.జె. మ్యూజిక్‌ విన్పిస్తోంది. సౌండ్‌ కాస్త తగ్గించి వీడియోలో కన్పిస్తున్న డాన్స్‌ చూస్తూ ఎంజాయ్‌ చేస్తోంది. ఆమెతో పాటు మరో ఇద్దరమ్మాయి మొబైల్లోకి తొంగిచూస్తూ ఆ డాన్స్‌ చూస్తున్నారు. ఇక మోక్ష ఒక్కతే చూడలేదు. డిజె మ్యూజిక్‌ ఎవరికైనా ఉత్సామాన్ని పుట్టిస్తుంది. అదేంటో చూద్దామని మోక్ష కూడా లేచి పక్కసీట్లోకి తొంగిచూస్తూ కాస్త వొంగి నిలబడింది. అందరి తలలు ఒకేచోటుకి చేరాయి. వాళ్ల చూపులు వీడియోని అతుక్కుపోయాయి. వీడియో ఆగకుండా ప్లే అవుతోంది.
ఆ వీడియోలో ముగ్గురు అమ్మాయిలు అత్యుత్సాహంతో డాన్స్‌ చేస్తున్నారు. ఒక్క సెకెన్‌ కూడా వాళ్లలో జోష్‌ తగ్గటం లేదు. అప్పుడప్పుడు మెడ చుట్టూ వున్న చున్నీని ముందుకి లాగి రెండు చేతులతో పట్టుకుని మ్యూజిక్‌కి తగ్గట్లుగా అడుగులేస్తున్నారు. చేతులు కదిలిస్తున్నారు. వాళ్ల అడుగుల్లో లయ తప్పటం లేదు. వేగం తగ్గటం లేదు. ముగ్గురూ ముగ్గురే అన్నట్లు పోటీపడి చేస్తున్నారు.
”ముగ్గురూ చాలా బాగా చేస్తున్నారు కదూ! ఈ మధ్యన మా చెల్లెలు కూడా వాళ్ల కాలేజిలో జరిగిన ఫ్రెషర్స్‌ పార్టీలో ఇలాగే చేసింది. ఐతే ఆ మ్యూజిక్‌ వేరు, ఆ పాట వేరు. కానీ చాలా బాగా చేసింది” అంది వాళ్లలో ఒకమ్మాయి.
మోక్షకి అర్థంకాక ”ఇప్పుడు వీళ్లెక్కడ చేస్తున్నట్లు? బ్యాగ్రౌండ్‌ చూస్తుంటే కాలేజీలాగా లేదే! అసలు వీళ్లెవరూ? మీ చెల్లెలు ఫ్రెండ్సా లేక నీ ఫ్రెండ్సా!” అని అడిగింది.
”నా ఫ్రెండ్స్‌ కారు, మా చెల్లెలు ఫ్రెండ్స్‌ కారు. ఇదిగో ఈ లైట్ ప్యారట్ కలర్‌ చున్నీ పిల్ల మా ఇంట్లో ఒకప్పుడు పని పిల్ల. దానిపేరు అంజు. మీరు క్లియర్‌గా చూడండి ఇప్పుడు ఈ అంజు ఎవరో మీకే తెలిసిపోతుంది” అనగానే వెంటనే పక్కనున్న అమ్మాయి పరిశీలనగా చూసి
”నేను గుర్తుపట్టాను. ఈ మధ్యనే మోడల్‌గా చూశాను” అంది.
”కరెక్ట్‌! ఈ డాన్స్‌ చూశాకనే పనిపిల్ల కాస్త మోడల్‌ అయింది” అంది.
”అదెలా సాధ్యం? ఎవరు చూశారు? ఏమా కథ?” వేరే అమ్మాయి ఆసక్తిగా అడిగింది.
”ఈ డాన్స్‌ రోడ్డుమీద చేస్తున్నారు. వినాయకుని నిమజ్జనం రోజు దేవుడిని నిమజ్జనం చెయ్యానికి తీసికెళ్తూ రోడ్డుమీద ఆపినప్పుడు డాన్స్‌ చేస్తున్నారు. అదిగో ఆ కన్పిస్తున్న బిల్డింగ్‌లో లేడీస్‌ హాస్టల్‌ వుంటుంది” అంటూ ఆగింది.
”ఆ… వుంది బోర్డ్‌ కన్పిస్తోంది. లేడీస్‌ హాస్టల్‌” అంది మోక్ష దాన్నే చూస్తూ.
”అక్కడ అంజు కాక ఆ ఇద్దరమ్మాయిలు ఆ హాస్టల్‌ అమ్మాయిలే… అంజు వేస్తుంటే వాళ్లు కూడా సరదాగా దిగివచ్చి వేస్తున్నారు. వాళ్లతోపాటు చాలామంది అమ్మాయిలు ఆ హాస్టల్లోంచి కిందకి దిగారు. అదిగో వాళ్లంతా డాన్స్‌ చూస్తూ నిలబడి వున్నారు. ఆ విగ్రహం మెడికల్‌షాపు వాళ్లది. ఆ కాలనీలో వాళ్లే ఎప్పుడైనా వినాయకుని బొమ్మను పెద్దగా పెడతారు. అంజు మా ఇంట్లోనే కాదు మెడికల్‌ షాపువాళ్ల ఇంట్లో కూడా పనిచేసేది. చుట్టూ నిలబడిన మగవాళ్లంతా ఎంత హైసొసైటీకి చెందినవాళ్లో చూస్తున్నారుగా. వాళ్లలో ఒకాయన టీ.వి. ఛానల్‌ డైరెక్టరట. అంజుని తెల్లవారే తనతో తీసికెళ్లి అక్కడే వుంచుకున్నాడు. మోడల్‌ని చేశాడు” అంది.
ఆ మాటలు వింటూ అటే చూస్తున్న మోక్షకి డాన్స్‌ చేస్తున్న ఆ ముగ్గురిలో ఒకరు దృతిలా అన్పించింది. ఒక్కక్షణం షాక్‌ తిని తిరిగి తేరుకుని ”ఈ ఎల్లో కలర్‌ చున్నీ అమ్మాయి మా దృతిలా వుంది కదూ!” అంది.
”లా వుండటమేంటి! ధృతినే!” అన్నారు వాళ్లు.
”ధృతినా!!!”
ఫ్లాష్‌… ఫ్లాష్‌… ఫ్లాష్‌…!!! మోక్ష మెదడులో ఫ్లాష్‌ లాంటి ఆలోచన వచ్చి హుషారుగా కదిలింది. తన మొబైల్‌ని చేతిలోకి తీసుకొని ”ఒక్క నిముషం. ఈ వీడియో క్లిప్‌ని నా మొబైల్‌లోకి ట్రాన్స్‌ఫర్‌ చెయ్యవా?” అంది.
”ఎందుకు? ధృతికి చూపిస్తావా?”
”కాదు”
”ఇంకెందుకు?”
”చెబుతాను కదా ట్రాన్స్‌ఫర్‌ చెయ్యి” అంది.
ఆ అమ్మాయి మెల్లగా మోక్ష మొబైల్‌ని అందుకొని తన మొబైల్‌లో వున్న వీడియో క్లిప్‌ని మోక్ష మొబైల్‌లోకి ట్రాన్స్‌ఫర్‌ చేసింది.
మోక్ష దాన్ని చేతిలోకి తీసుకొని ”నేను ఇంటికెళ్లి ఇప్పుడే వస్తాను. మన ఎం.డి గారు వచ్చేలోపలే వస్తాను” అంది.
”ఏయ్‌! మోక్షా! ఇది తీసికెళ్లి మీ అత్తగారికి చూపించకు. ఇలాంటివి మనం రిసీవ్‌ చేసుకున్నంత సరదాగా పెద్దవాళ్లు చేసుకోరు. ఇలాంటివి ఇప్పుడు కామన్‌”
”కామనా!!”
”అవును. అనుకోకుండా జరిగిపోయే యాదృచ్చిక సంఘటనలు ఇవి. ఇలాంటివి ఎవరైనా ఆ క్షణంలోనే మరచిపోతుంటారు. కాకుంటే ఆరోజు వినాయకుని విగ్రహం దగ్గరకొచ్చిన అబ్బాయిలెవరో ఆ డాన్స్‌ను వీడియో తీసివుంటారు. అది అందరికి ట్రాన్స్‌ఫరై అలా అలా స్ప్రెడ్‌ అయింది. అంతే! ఇదికూడా నాకు నా క్లాస్‌మేట్ పంపాడు. అంజూని చూడమని!” అంది.
”నేను కూడా ధృతిని చూడమని మా అత్తగారికి చెబుతాను. ఇదికూడా మీ క్లాస్‌మేట్ నీకు చెప్పినట్లే చెబుతాను. తప్పేంటి?”
”అనుకుంటే అన్నీ తప్పులే! అనుకోకుంటే ఏం వుండవు. మా ధృతి కూడా ఒకసారి మా ఇంటికొచ్చిన తారమ్మతో నా డ్రస్‌ల గురించి చెత్తగా కామెంట్స్ చేసిందని మావారు విని నాతో అన్నారు. అదేమైనా నేను తప్పుపట్టానా? ఇది కూడా అంతే! జస్ట్‌ ఫన్‌! దీన్ని తీసికెళ్లి మా అత్తగారికే చూపిస్తాను. మనం చూసినట్లే ఆమె కూడా తన చిన్నకోడలి డాన్స్‌ రోడ్డు మీద ఎంత బాగుందో చూస్తుంది” అంది.
జెట్ స్పీడ్‌తో ఇంటికెళ్లింది మోక్ష.
ఇంటికెళ్లగానే అత్తగారి మొబైల్లోకి ఆ వీడియో క్లిప్‌ని ట్రాన్స్‌ఫర్‌ చేసింది.
”ఇది చూస్తూ ఉండండి అత్తయ్యా! చూశాక ఇలా అంటే ఆగిపోతుంది” అని చెప్పి వెంటనే ఆఫీసుకెళ్లింది. ఆమె దాన్ని చూసి షాక్‌ తిన్నది.
*****
….ధృతిని తీసుకొని హాస్పిటల్‌కి వెళ్లిన అంకిరెడ్డి తిరిగి ఇంటికి వచ్చే వరకు మాధవీలత అలాగే కూర్చుని వుంది.
ఆయన నేరుగా మాధవీలత దగ్గరికి వెళ్లి హాస్పిటల్లో డాక్టర్‌ గారు ఏమన్నారో చెప్పి, ధృతికి చేసిన టెస్ట్‌ల గురించి చెప్పాడు. ఆమె ఎలాంటి జాగ్రత్తలు, ఎలాంటి ఆహారం తీసుకోవాలో చెప్పి వెంటనే పనిమనిషిని కూడా పెట్టమని చెప్పాడు.
ధృతి కారులో వున్న పండ్లను తెచ్చి ఫ్రిజ్‌లో పెడుతోంది. ఆ ఇంట్లో ప్రస్తుతం ఆనంద్‌ లేడు, మోక్ష లేదు. వాళ్లు ముగ్గురే వున్నారు. ఫ్యాన్లు తిరుగుతున్న శబ్దం తప్ప అంతా నిశబ్దంగానే వుంది.
మాధవీలత చేతిలో మొబైల్‌ పట్టుకొని రొప్పుతోంది. అంకిరెడ్డిని తినేసేలా చూస్తోంది. ఆయన చెప్పిన మాటలు ఆమె వినటం లేదు.
ఆయనకేం అర్ధం కాక ”ఏంటి మధూ! అలా వున్నావ్‌?” అన్నాడు ఆమెనే చూస్తూ అంకిరెడ్డి.
”దయచేసి ఎక్కువగా మాట్లాడించొద్దు. చిన్నకోడలిని మాత్రం నా కళ్లముందుంచొద్దు. వెంటనే పంపించెయ్యండి!”
ఆయన షాక్‌ తిని ”ఏంటి మధు అలా అంటున్నావ్‌?” అన్నాడు.
”కడుపున పుట్టిన కొడుకే ఎక్కడో వున్నాడు. ఇలాంటి చెత్త రకాలను ఇంట్లో పెట్టుకొని ఏం బావుకుందామని… దాని అన్నేమో ఆ పని చేస్తాడు, ఇదేమో ఈ పని చేస్తుంది. ఒక్కరిలోనన్నా కుటుంబ లక్షణాలు వున్నాయా?”
”ఏం జరిగింది?” అన్నాడు.
”ఏం సంబంధం తెచ్చి చేశారండీ! వాడికి పెళ్లి చెయ్యకుండా వున్నా బాగుండేది. చేశాక వాడు వెళ్లాక ఒక్కరోజు అన్నా మనశ్శాంతిగా వున్నానా? ఏదో పోనీలే అనుకుంటే ఇప్పుడిదొకటి…” అంది. ఆమె రొప్పుతూనే వుంది.
”ఏంటది?” అన్నాడు అంకిరెడ్డి.
”ఇది చూడండి!” అంటూ మొబైల్‌ ఆన్‌ చేసి వీడియో క్లిప్‌ను చూపించింది.
ఆయన చూశాడు. గణపతి విగ్రహం ముందు అమ్మాయిలు డాన్స్‌ చేస్తున్నారు. చుట్టూ నడివయసు మగవాళ్లు ఇంకా కొంతమంది అబ్బాయిలు అమ్మాయిలు ఆ డాన్స్‌ చూసి కేరింతలు కొడుతున్నారు. దారిన వెళ్తున్న అబ్బాయిలు కూడా అది చూసి ఆగి డివైడర్‌ మీద నిలబడి ఆ డాన్స్‌ను తమ మొబైల్‌లలో వీడియో తీస్తున్నారు. లేడీస్‌ హాస్టల్‌ బిల్డింగ్‌ అప్పుడప్పుడు కన్పిస్తోంది. డాన్స్‌ చేస్తున్న అమ్మాయిల్లో ధృతి వుంది. అది చూసి
”అయితే తప్పేంటి ?” అన్నాడు అంకిరెడ్డి.
”అలా అనడం పెద్ద గొప్పనుకుంటున్నారా? ఇలాంటి వాటిల్లోనా గొప్పతనం?”
”నేనలా అన్నానా?”
”డాన్స్‌ చెయ్యాలనిపిస్తే రోడ్డు మీద చెయ్యాలా? అదేమైనా రికార్డ్‌ డాన్సరా రోడ్డుమీద వెళ్లే ఉత్సవ విగ్రహాల దగ్గర, పెళ్లి కార్లముందు, ఫంక్షన్‌ హాళ్లలో డాన్స్‌ చెయ్యటానికి….” అంది ఆమె ఆవేశంగా.
”అందరూ చేస్తుంటే చేసి వుంటుందిలే. బలవంతంగా పిలిచి వుంటారు. వెళ్లి వుంటుంది. అలా అని వాళ్లంతా రికార్డ్‌ డాన్సర్లవుతారా? అలాంటివి మనం ఎన్ని చూడటం లేదు”
”నేను చూడలేదు. మీరు చూసారేమో! అయినా ఇవేం పద్ధతులు”
”హాస్టల్లో వుండే పిల్లలకి ఇలాంటివి పద్ధతి కాదని ఎలా తెలుస్తుంది. ఎవరేది చేస్తే అదే చెయ్యాలనిపిస్తుంది. ఇది చెయ్యాలి, అది చెయ్యకూడదు అని వాళ్లకు ఎవరు చెబుతారు? అయినా ఇప్పుడు ఇలాంటి డాన్స్‌లు మామూలైపోయాయి. ఫ్రెషర్స్‌ పార్టీలలో అమ్మాయిలు డాన్స్‌ చెయ్యటం లేదా?” అన్నాడు.
”అది వేరు. విద్యార్థులు, విద్యాధికుల మధ్యలో చాలా గుట్టుగా చేసే డాన్స్‌ అది. అదేమైనా రోడ్డా! ప్రతి అడ్డమైన వెదవా చూసి వీడియోలు తియ్యటానికి… అమ్మాయిలు అమ్మాయిల్లా వుండొద్దా! అదేం అంటే పెళ్లికి ముందు ఎలా వుంటే మీకేం అంటారు. అలా అనడం పద్ధతా?” అంది ఆమె రొప్పుతూనే.
”ఇలాంటివి మరీ అంత లోతులకెళ్లి ఆలోచించకు మధూ! కొన్ని చూసి వదిలెయ్యాలి. కొన్ని చూడకుండా వదిలెయ్యాలి. కోడలు ఇప్పుడు ప్రెగ్నెంట్. పైగా ఒంట్లో జ్వరం కూడా వుంది. ఇలాంటివి మనసులో పెట్టుకొని వేధించటం తగదు” అన్నాడు.
”తగదా? ఏం మాట్లాడుతున్నారండీ మీరు. సమర్థిస్తున్నారా? ఇలాంటి దాన్ని ఇంట్లో పెట్టుకుంటారా?”
”పెట్టుకోక ఏం చేయాలో చెప్పు! ధృతి నీకు చిన్నకోడలు. చిన్న కోడల్ని దూరం చేసుకుంటావా”
”హా… దూరం చేసుకోక, అయినా అదెప్పుడో నాకు దూరమైంది. కొత్తగా అయ్యేదేం లేదు. అయినా ఇలాంటిది నాకు ఎందుకు. మోక్ష లేదా?”
”మోక్ష వుందా? ధృతి వద్దా! అదేనా నువ్వు చివరగా చెప్పేది?”
”నేను చెప్పేది ఏముంది. వాడు ఆనంద్‌లా వుండివుంటే ఇలాంటిదాన్ని చేసుకోవలసిన కర్మ పట్టేదా? అదేం అంటే మీరు కూడా అమ్మాయిలకు ఇలాంటి రోడ్డు మీద డాన్స్‌లు మామూలే అని అంటున్నారాయె! నేనెందుకిక మాట్లాడటం… అయినా అలా ఎంతమంది అమ్మాయిలు రోడ్డు మీద డాన్స్‌ చేస్తున్నారు? అబ్బాయిలు డాన్స్‌ చెయ్యాల్సిన చోట అమ్మాయిలు డాన్స్‌ చెయ్యొచ్చా? అదేం ముద్దండీ! ఆడపిల్లలు ఆడపిల్లల్లా వుండొద్దా! అబ్బాయిలతో సమానంగా వుండడమంటే ఇదేనా?” అంది. ఆమె రొప్పుతూనే ఉంది.
”లోతులకెళ్లి మాట్లాడొద్దని నీకు ముందే చెప్పాను. అదే నీ కూతురే అలా చేస్తే ఏం చేస్తావ్‌?” అన్నాడు.
”నా కూతురైతే అలా చేస్తుందా?”
”చేస్తుందని ఏ తల్లీ అనుకోదు. చేసేవాళ్లంతా నీలాంటి తల్లులు వున్న వాళ్లు కాదా? అదేదో పెద్ద అత్యాచారం లాగ, అనాచారం లాగా మాట్లాడుతున్నావ్‌! ఇలాంటివి పొరపాట్లే! కాదని ఎవరంటారు? ఎంత ఉత్సాహంగా వుంటే మాత్రం రోడ్డుమీదకెళ్లి అమ్మాయిలను డాన్స్‌ చెయ్యమని చెబుతామా! ఆ దేవుడు కూడా ఆడపిల్లల్ని ఆడపిల్లల్లాగే వుండమని ఆశీర్వదిస్తాడు. అలా వుంటేనే ఆయన ఆనందిస్తాడు. కానీ వాతావరణ ప్రభావం అనేది మనుషుల్ని ఒక్కోసారి ప్రకోపింప చేస్తుందని నువ్వు వినలేదా? దేనికీ ఎవరూ అతీతులు కారు మధూ… ఇంతెందుకు ఒక తల్లికి కలెక్టర్‌ పుట్టొచ్చు, దొంగ పుట్టొచ్చు. కలెక్టర్‌ని కొడుకని చెప్పుకొని, దొంగని కొడుకని చెప్పుకోని తల్లి వుంటుందా? అలా వుంటే తల్లి తనాన్ని అంత గొప్పగా ఎందుకు చెప్పుకుంటాం! కానీ నువ్వు ఆనంద్‌ ఒక్కడినే కొడుకుగా ధైర్యంగా చెప్పుకుంటావు. అలా అని దేశం నిండా నీ లాంటి తల్లులే వున్నారా? నువ్వు కొడుకుగా చెప్పుకోలేని సతీష్‌చంద్ర నీ కడుపునేగా పుట్టాడు. అలా అని నువ్వు మంచి తల్లివి కావా?” అన్నాడు.
ఆమె దానికేం మాట్లాడకుండా ”ఆడపిల్లలు ఎలా బడితే అలా వుండొచ్చని మీరే అంటున్నప్పుడు నాతో పనేముందిక” అంది.
”అలా అని నేనన్నానా?”
”కుదిరితే ఇలా వుండొచ్చు. కుదరకపోతే అలా అయినా వుండొచ్చు. ఎలా వున్నా ఒకటే అనేగా మీరనేది….”
అంకిరెడ్డి మౌనంగా చూశాడు.
ఆమె లేచి ”ఈ ఇంట్లో నేను వుండను” అంది.
కంగారు పడ్డాడు అంకిరెడ్డి.
ఆమె తన గదిలోకి వెళ్లి వెంటనే బయటకొచ్చి ”నేను వెళ్తున్నా” అంది.
అంకిరెడ్డి ఆమె చేతిని గట్టిగా పట్టుకొని ఆపుతూ
”ఈ వయసులో ఇదేం తెగింపు మధూ?”
”ఆ వయసులో రోడ్డుమీద ఆ డాన్సేంటి అని దాన్ని అడిగారా? తెగించానికి ఏ వయసైతేనేం?” అంది. ఆమె గొంతు మామూలుగా లేదు. ఆడపులి గర్జనలా వుంది.
”అడుగుతాను నువ్వు లోపలకి వెళ్లు” అంటూ ఆమెను నెమ్మదిగా నడిపించుకుంటూ గదిలోకి పంపి తలుపు పెట్టేశాడు అంకిరెడ్డి.
ధృతి ఆ చుట్టుపక్కల ఎక్కడా లేదు. అంకిరెడ్డి అక్కడే గంభీరంగా నిలబడి ఆలోచిస్తున్నాడు.
ఈ రోజుల్లో కొంతమంది అమ్మాయిలు పెళ్లికాక ముందు ఎలా వున్నా ఏం చేసినా ఎవరు చూస్తారులే అన్నట్లుంటారు. పెద్దవాళ్లు చూడరు కాబట్టి ఏం చేసినా పర్వాలేదనుకుంటారు, ఏమైనా చెయ్యొచ్చు అనుకుంటారు. చెయ్యలేకపోతే వెనకబడినట్లు నిశ్శబ్దంగా కూర్చుని విచారిస్తారు. ఆమాత్రం చెయ్యటానికి కూడా నేను పనికిరానా అని బాధ పడతారు. చుట్టూ వున్నవాళ్లు కూడా అంతే! ‘నువ్వు పనికి రానిదానివే!’ అన్నట్లు చూస్తారు. ఎవరెలా చూసినా తనకంటూ ఒక సొంత చూపు వుండాలి. సొంత నడక వుండాలి. సొంత ఆలోచన వుండాలి. ఎదుటివాళ్ల నడక తన నడక కాకూడదు. ఎదుటివాళ్ల ఆలోచన, అభిరుచి, అలవాటు, ఆత్మవంచన, అంతరంగం తనవి కాకూడదు. తను కూడా వాళ్లలాగే వుండాలని అనుకోకూడదు. ఏ రోజుల్లో అయినా వర్షం ఆకాశం నుండి నేలమీద పడుతుందంటే నమ్మాలి కాని మన జనరేషనల్‌లో నేలమీద నుండి ఆకాశం మీద పడుతుందంటే నమ్మకూడదు. ఇలా ఎంతమంది అమ్మాయిలు కానీ, అబ్బాయిలు కానీ ఆలోచిస్తున్నారు? ఇప్పుడెలా? ఏం చేయాలి? భార్యను ఇంట్లోంచి పంపించివేయాలా? ధృతిని పంపించివేయాలా? ఎవరిని ఇంట్లో వుంచుకోవాలి? ఎటూ తోచడం లేదు అంకిరెడ్డికి…
సతీష్‌చంద్రకి ఫోన్‌ చేసి జరిగింది మొత్తం చెప్పాడు.
”తప్పేముంది నాన్నా!” అన్నాడు సతీష్‌చంద్ర.
అంకిరెడ్డి ”నేను కూడా మీ అమ్మతో అదే అన్నానురా! వినడం లేదు. దృతి మీద రోడ్డు మీద డాన్స్‌ చేసిందన్న తప్పు పెట్టి ఇంట్లోంచి పంపించెయ్యమంటోంది” అన్నాడు.
”అనవసరంగా దీన్ని పెద్ద రాద్ధాంతం చేస్తున్నట్లుంది నాన్నా అమ్మ. ఊరేగింపులకి, ఉత్సవాలకి, పెళ్లికి, చావుకి రోడ్డే కద నాన్నా వేదిక. దాన్ని ఇంత సీరియస్‌గా తీసుకుంటారా? అయినా అబ్బాయిలు రోడ్డుమీద డాన్స్‌ చేస్తే లేని తప్పు అమ్మాయిలు చేస్తే వుంటుందా? అలా అని ఫంక్షన్లలో, పార్టీలలో ఎంతమంది అమ్మాయిలు డాన్స్‌లు చేస్తున్నారు? మీకు తెలియందేముంది చేసేవాళ్లు తక్కువ చూసేవాళ్లు ఎక్కువ! ఏదో చూసి ఆ కొద్దిసేపు ఆనందించాలి కాని రోడ్డు రోడ్డు అంటూ ఇంతగా తప్పుపడతారా? అయినా ఒక భర్తగా నాకేం అది తప్పులా అన్పించటం లేదు” అన్నాడు.
”కావొచ్చు సతీష్‌! కానీ మీ అమ్మ మొండికేసినట్లు ఒకటే వాదిస్తోందిరా! ఇప్పుడు జీవితం ఇలాగే వుంటుందని ఎంత చెప్పినా వినటం లేదు. ఏం చేయను చెప్పు? పాడటంలాగే, రాయడం లాగే డాన్స్‌ కూడా ఒక కళ అని ఎంత చెప్పినా వినడం లేదు. అయినా నువ్వన్నట్లు ఇలాంటి డాన్స్‌లు ఎంతమంది చేస్తున్నారు? ఎక్కడో ఎప్పుడో అలా డాన్స్‌ చేసినవాళ్లంతా తప్పు చేసినట్లు కాదని కూడా చెప్పాను. ఏం చేయను సతీష్‌” అన్నాడు అంకిరెడ్డి.
సతీష్‌ మాట్లాకుండా ఆలోచిస్తున్నాడు.
”ఇప్పటికే ధృతి తిండి సరిగా తినకనో ఏమో బిడ్డ లోపల వుండాల్సినంత బరువు లేదట. మంచి ఆహారం తీసుకోవాలి. మానసింగా సంతోషంగా వుండాలి. ఇలాంటి స్థితిలో దృతిని మన ఇంట్లో వుంచుకోవటం అంత సేఫ్‌ కాదేమోననిపిస్తోంది… ప్రవీణ్‌తో చెప్పనా?”
”వద్దు నాన్నా!” అన్నాడు వెంటనే సతీష్‌చంద్ర.
”కడుపుతో వున్న పిల్లను అంతకన్నా ఏం చెయ్యగలం సతీష్‌! అదే కరక్ట్‌ అన్పిస్తోంది నాకు” అన్నాడు.
”అదెలా కరెక్టవుతుంది నాన్నా! ప్రవీణ్‌కేమైనా పెళ్లి అయ్యిందా? అమ్మ వుందా? ఎవరు చూస్తారు ధృతిని…? అసలే తన హెల్త్‌ కండిషన్‌ బాగాలేదని నువ్వే అంటున్నావ్‌!”
”బాగవుతుందిలే సతీష్‌! నువ్వేం టెన్షన్‌ పెట్టుకోకు”
”టెన్షన్‌ ఎందుకుండదు నాన్నా! మన ఇంట్లోనే దృతిని చూసుకోానికి ఇద్దరు ఆడవాళ్లు వుండి కూడా ఎవరూ లేనట్లే మాట్లాడుతున్నావ్‌! దృతిని తల్లిలా చూసుకోవలసిన అమ్మనే అలా మారిపోయినప్పుడు నేనిక్కడ టెన్షన్‌ పడకుండా ఎలా వుండగలను?”
”దృతికి ఏం కాదు. నేనున్నాను కదా!”
”మీరేం చెయ్యగలుగుతారు నాన్నా?”
”ఏదో ఒకటి చెయ్యాలిగా సతీష్‌!”
”అంతేగాని అమ్మకు నచ్చచెప్పలేవా!”
”ఆడవాళ్లను అర్ధం చేసుకోవటం కష్టంరా సతీష్‌! చూస్తుంటే వాళ్ల ముగ్గురిలో చాలా రోజులుగా ఏవో చిన్నచిన్న తేడాలు మొదలైనట్లున్నాయి. మీ అమ్మ అలా మారటానికి ఈ ఒక్క కారణమే ప్రధానంగా నాకు అన్పించటం లేదు. అయినా ఇప్పుడు వాటి గురించి ఆలోచించటం అనవసరం…”
”ఇప్పుడేం చేద్దాం నాన్నా?”
”మీ అమ్మ ఇంట్లోంచి వెళ్లిపోతానంటుందిరా! ఆ వీడియోని ఎవరు చూసినా దృతి మన కోడలని గుర్తుపట్టరా అంటుంది. గుర్తుపడితే నేనీ కాలనీలో ఎలా తిరగాలి అంటోంది. ఇది వినటానికి చిన్నదే అయినా మీ అమ్మకు పెద్ద గాయాన్నే చేసింది సతీష్‌! ఈ పని వల్ల ధృతి సామాజిక హద్దుల్ని దాటినట్లు భావిస్తోంది”
”పిల్లల్ని క్షమించలేరా నాన్నా! ఇంత చిన్న విషయాలనే క్షమించలేనప్పుడు ఆడవాళ్లకి భద్రత ఎక్కడ నుండి వస్తుంది? ఇంట్లోవాళ్లే పరాయివాళ్లలా ప్రవర్తిస్తుంటే ధృతి లాంటి వాళ్లకి దిక్కెవరు? నేను అక్కడ లేకపోవడం వల్లనేగా ధృతికి ఇన్ని బాధలు?”
అంకిరెడ్డి మాట్లాడలేదు.
సతీష్‌చంద్ర తండ్రితో మాట్లాడటం కట్ చేసి వెంటనే నరేంద్రకి ఫోన్‌ చేశాడు. తండ్రి తనతో ఏం మాట్లాడాడో దాచుకోకుండా చెప్పాడు… ”ధృతి వుంటే మా అమ్మ ఇంట్లోంచి వెళ్లిపోతానోంటందట నరేంద్రా! ఇప్పుడేం చేద్దాం?” సలహా అడిగాడు.
నరేంద్ర కూడా జవాబు చెప్పలేనట్లు మౌనంగానే వున్నాడు.
”ఇలాంటి స్థితిలో ధృతిని మా ఇంట్లోనే వుంచితే పరిస్థితి దారుణంగా వుంటుందేమో! నాకెటూ తోచడం లేదు” బాగా డిప్రెషన్‌లోకి వెళ్లి మాట్లాడుతున్నాడు సతీష్‌చంద్ర.
”ఛ…ఛ ఎందుకలా బాధపడుతావ్‌? వేరే ఇంకేమైనా సొల్యూషన్‌ ఆలోచిద్దాంలే! నువ్వేం వర్రీ కాకు…” ధౌర్యం చెప్పాడు నరేంద్ర.
”ఏమో నరేంద్రా! ధృతిని వాళ్లంతా కలిసే ఇలా చేశారేమో అన్పిస్తుంది”
”నెగివ్‌గా ఆలోచించకు సతీష్‌! ఎంతయినా వాళ్లు నీ ఫ్యామిలీ మెంబర్స్‌!”
”ఫ్యామిలీ మెంబర్స్‌ అయితే ఇలా జరిగేదా నరేంద్రా…?”
నరేంద్ర మాట్లాడలేదు.
”ఒక్కటి చెప్పు నరేంద్రా! నేనక్కడ వుండి వుంటే దృతిని వాళ్లంతా అలా చూసేవాళ్లా! అలా చూడొద్దనే కదా అంతంత డబ్బు పంపాను”
… ఎంత డబ్బు పంపినా భర్త దగ్గర లేకుంటే ఏ భార్య పరిస్థితి అయినా అంతే! దీనికెవరూ అతీతులు కారు. ముఖ్యంగా చాలామంది సైనికులకు ఇలాంటి స్థితి అనుభవమే… అయినా కన్నవాళ్లను నమ్మని వాళ్లెవరుంటారు? తల్లి పక్షి పొడుస్తుందని పిల్లపక్షులు వూహిస్తాయా? అందుకే నరేంద్ర మాట్లాడలేదు.
సతీష్‌చంద్రకి బాధగా వుంది. ఆ బాధలో తన కుటుంబ సభ్యులపై కోపం తప్ప ప్రేమ కలగడం లేదు. కనిపిస్తే నోటికొచ్చినట్లు తిట్టాలనివుంది. అదే ఒకప్పుడైతే నిజంగానే తిట్టేవాడు. ఇప్పుడు మిలటరీలో నేర్చుకున్న క్రమశిక్షణ, సంస్కారం అడ్డొచ్చి ఆగిపోతున్నాడు.
”కనీసం డబ్బు పంపినందుకైనా ధృతిని జాగ్రత్తగా చూసుకోవద్దా? అసలు వాళ్లు నా కుటుంబ సభ్యులేనా?” అన్నాడు సతీష్‌చంద్ర ఆవేశంగా
”కూల్‌ కూల్‌ సతీష్‌!”
”ఎలా వుండమంటావు కూల్‌గా! లోపల బేబి ఒక్క కిలో బరువు మాత్రమే వుందట స్టెరాయిడ్‌ వాడాలన్నారట” అన్నాడు.
”అవెందుకు?” నరేంద్ర అడిగాడు.

ఇంకా వుంది…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *