పార్శీయులు

రచన: టీవీయస్.శాస్త్రి


(పార్శీల మత చిహ్నం)

2004 గణాకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా జొరాస్త్రియన్ల సంఖ్య 1, 45, 000 నుండి 2, 10, 000 వరకూ ఉన్నది. 2001 భారత్ జనగణన ప్రకారం 69, 601 పార్శీలు భారత్ లో గలరు. క్రీస్తు శకం తరువాత జొరాస్త్రియన్లు కొన్ని వందల సంఖ్యలో భారతదేశంలో ఉన్న గుజరాత్ రాష్ట్రంలోకి అడుగుపెట్టారు. వీరినే పార్శీయులు అని అంటారు. కుస్తీ యజ్ఞోపవీతము(ఒడుగు / జంధ్యం) ధరించే ఆచారము వీరిలో కూడా ఉన్నది. భారత దేశంలో జోరాస్త్ర మతమునకు పార్శీ మతమని కూడా పేరు. హైదరాబాద్ నగరంలో పార్శీల సంఖ్య రెండు వేల లోపే! అయితేనేం! వ్యాపార రంగంలో మాత్రం వారి ప్రభావం అధికంగానే ఉంటుంది. ఇంతకీ పార్శీలు నగరానికి ఎప్పుడు వచ్చారన్న దానికి చారిత్రక ఆధారాలు లేనప్పటికీ, అప్పటి నిజాం సాలార్‌జంగ్‌ కోరిక మేరకు ఇక్కడ స్థిరపడ్డారన్నది ఒక కథనం. ఇక, నగరంలో ఉంటున్న వారిలో దాదాపు 90 శాతం సికింద్రాబాద్‌లోనే నివసిస్తున్నారు.

ఇటీవలి కాలంలో వీరి సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. కారణం, తమ కమ్యూనిటీలోని వాళ్లను పెళ్లిచేసుకోవడానికి యువత అసక్తి చూపించడం లేదట! వీరు పూజించే దైవం అగ్ని. 111 ఏళ్ల నాటి అగ్ని దేవాలయం అత్యంత పవిత్రాలయం. అతి ముఖ్యమైన పండుగ నౌరోజ్‌. నూతన సంవత్సరాదిని వేడుకగా జరుపుకొంటారు. అవి కాకుండా జొరాస్ట్రి‌యన్‌ పుట్టినరోజునూ కర్టోడ్‌ సాల్‌గా జరుపుకొంటారు. ఏడాదిలో చివరి ఐదు రోజులను పటేలీగా చేసుకోవడం ఆనవాయితీ. నిజాం కాలంలో పరిపాలన వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించినా, ప్రస్తుతం రాజకీయాలకు వారు దూరం. నిజాం కాలంలో ఇరానీ దేశం నుంచి పార్శీలు వ్యాపార నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చారు . పార్శీలు ఆ రోజుల్లోనే ఉన్నత చదువులు చదువుకొని సంపన్నులు కావడంతో హైదరాబాద్‌ లో వ్యాపారం చేసుకునేందుకు నిజాం రాజులు వారిని ఆహ్వానించారని మతపెద్దలు చెబుతుంటారు. వీరు ప్రత్యేకమైన ఆచార, వ్యవహార పద్ధతులను పాటిస్తుంటారు. వీరు పూర్తి శాకాహారులు. భూమిలో పండే వాటిని కూడా తినరు. ఉదా-ఉల్లిగడ్డలు, వేరు శనగలు. . . ఇక వారి ఆచారాల్లో అతి ముఖ్యమైనది దోక్మా (టవర్‌ ఆఫ్‌ సైలెన్స్‌)! చనిపోయాక కూడా నలుగురికి ఉపయోగపడాలని భావించే పార్శీలు, గద్దలు, రాబందులకు ఆహారంగా వారి మృతదేహాలను దోక్మాపై వదిలేస్తారు. దోక్మాలు పార్శీగుట్ట, బోయగూడల్లో ఉన్నాయి. ఇటీవలి కాలంలో కరెంట్‌ ద్వారా దహనసంస్కారాలు నిర్వహిస్తున్నారు. ఒక వ్యక్తి చనిపోయాడంటే ఆ మృతదేహాన్ని కాల్చడమో పాతిపెడ్డడమో చేస్తుంటారు. కానీ పార్శీలు మాత్రం అందుకు విభిన్నంగా అంత్యక్రియలు చేసేవారు. చనిపోయిన వారి మృతదేహాలను పాతిపెట్టకుండా, కాల్చకుండా గద్దలు, ఇతర పక్షులు తినేలా ఏర్పాట్లు చేసేవారు. అలా చేస్తే చనిపోయిన వారికి స్వర్గప్రాప్తి కలుగుతుందని వారి నమ్మకం. చనిపోయాక కూడా పరోక్షంగా మృతదేహం ఉపయోగపడాలనే ఆనవాయితీ ఉండేదని ప్రతీతి.

నిజాంలకు పార్శీలు అత్యంత సన్ని హితులుగా ఉండడంతో వారి మృతదేహాలను పక్షులకు పడేసేందుకు ఒక బావిలాంటి గదిని సికింద్రాబాద్‌ నుంచి పద్మారావునగర్‌ వైపు వెళ్లే మార్గంలో ఎత్తైన ప్రదేశంలో నిర్మించారు. అక్కడ కేవలం పార్శీలకు మాత్రమే అంత్యక్రియలు చేస్తుండడంతో దానికి పార్శీగుట్ట అనే పేరు వచ్చింది. పార్శీగుట్ట 4 ఎకరాల స్థలంలో నిర్మితమై ఉంది. అందులో ఉద్యానవనాన్ని కూడా ఏర్పాటు చేశారు. కాలగమనంలో వస్తున్న మార్పులు, ఆ గుట్ట చుట్టుపక్కల కాలనీలు ఇళ్లు నిర్మించుకొని ఉండడంతో పార్శీలు కూడా వారి అంత్యక్రియ పద్ధతులను మార్చుకోవల్సివచ్చింది. మృతదేహాలను బావి దగ్గరకు తీసుకెళ్లి పడేస్తే గద్దలు వచ్చి స్థానికులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. దీంతో వారు మృతదేహాలను ఖననం చేసేందుకు సోలార్‌ సిస్టమ్‌ను వాడుతున్నారు. మృతదేహాలను నేరుగా బావిలా ఉండే గదిలో పడేయకుండా ఊచలతో తయారు చేసిన కమ్మీలపై ఉంచుతారు. ఆ తరువాత కమ్మీల ద్వారా విద్యుత్‌ ప్రవాహాన్ని జరపడంతో మృతదేహం కాలి బూడిదవుతుంది. ఈ ప్రాంతాన్ని చూడడానికి ఎవర్నీ అనుమతించరు. ఒక వేళ చూడాలనుకుంటే అక్కడ ఉన్నటువంటి మత పెద్ద ద్వారా అనుమతి తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. నిజాం కాలంలో వలస వచ్చిన పార్శీల ఆచార వ్యవహారాలకు పార్శీగుట్ట అద్దంపడుతోంది. గుజరాత్ లో పార్శీల కోవెల ఉన్నది. వారి అర్చనా స్థలము ఈ “అగ్ని ఆలయము”. పార్శీల మతము జొరాష్ట్రియన్. జొరాష్ట్రియనులు ముష్కరుల దండయాత్రల వలన పర్షియా దేశాన్ని వదలి హిందూదేశానికి వలస వచ్చారు. వారి సాగర యానములో తుఫాను వచ్చింది. అప్పుడు “అగ్నిదేవ” ను నెలకొల్పి, కొలువవలెనని తలచారు. పార్శీల పూజలు అందుకునే నిప్పు దైవము ” ఆతాష్ బహ్రా మ్” హైదరాబాద్‌లోని ఒక ధార్మిక సంస్థ, ఒక్కర్ని కంటే రూ. ఐదు వేలు. . ఇద్దర్ని కంటే రూ. 10 వేలు. . ముగ్గుర్ని కంటే రూ. 20 వేలు. . ఈ బహుమతులను అందజేస్తోంది.

ఇరాన్‌లో పుట్టి శాఖోపశాఖలుగా విస్తరించిన పార్శీలు ఒకప్పుడు బలమైన ప్రభావిత సమూహం. ఇప్పుడు అత్యంత క్షీణదశను అనుభవిస్తోన్న పార్శీ సమాజం తన అస్తిత్వాన్ని, మనుగడను కాపాడుకొనేందుకు చేస్తోన్న ప్రయత్నం ఇది. నిజాం జమానా నుంచే భాగ్యనగర సంస్కృతిలో భాగమైన పార్శీ జాతి ప్రమాదంలో పడింది. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో పార్శీ జనాభా క్రమంగా క్షీణిస్తోంది. అది హైదరాబాద్‌లో మరింత ఆందోళనకరంగా ఉంది. నిజాం పాలనలో తమ మేధోసంపత్తితో కీలక పదవులు అలంకరించిన పార్శీలు ఇప్పుడు తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి తాపత్రయపడుతున్నారు. ఒకప్పుడు భాగ్యనగరంలో వేల సంఖ్యలో ఉన్న వీరి జనాభా ఇప్పుడు పదకొండు వందలకు పడిపోయింది. తమ జాతిని పునరుజ్జీవింపజేసేందుకు పార్శీ మత సంస్థలు, ధార్మిక సంస్థలు, పెద్దలు నడుం బిగించారు. ఈ తరం దంపతులు ఎక్కువ మంది పిల్లలను కనేవిధంగా ప్రోత్సహిస్తున్నారు. ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నారు. సంతానోత్పత్తికి నోచని దంపతులకు వైద్య సహాయాన్ని అందజేస్తున్నారు. మిరాసన్ ట్రస్టు రూ. 20 వేల నుంచి రూ. 40 వేల వరకు అందజేస్తోంది. కానీ ఈ రెండు సంస్థలు కలసి ఆరేళ్లలో 25 జంటలకు మాత్రమే ఇలాంటి సహాయాన్ని అందజేశాయి. అలాగే బాంబే పార్శీ పంచాయత్, కేంద్రప్రభుత్వ ‘జియో పార్శీ’ పథకం కింద లబ్ధ్ది పొందుతున్న వాళ్లూ తక్కువ మందే ఉన్నారు. చాలా మంది ఒక్క సంతానానికే పరిమితమవుతున్నారు. ఇద్దర్ని కనేవాళ్లు చాలా తక్కువ . ఇక హైదరాబాద్‌లో ముగ్గురు పిల్లలను కన్న జంటలు మూడంటే మూడే ఉన్నాయి. పార్శీ దంపతులు ఎదుర్కొంటున్న మరో సమస్య సంతానరాహిత్యం. రక్త సంబంధీకుల మధ్య జరిగే పెళ్లిళ్లు అబార్షన్‌లకు దారితీస్తున్నాయి. నగరంలో ఉన్న పార్శీల్లో 55 ఏళ్ల నుంచి 100 ఏళ్లలోపు పెద్దవారు 540 మంది ఉంటే 30 నుంచి 39 ఏళ్లలోపు వాళ్లు కేవలం 182 మంది ఉన్నారు. 2012 నుంచి ఇప్పటి వరకు హైదరాబాద్‌లో 11 మంది పిల్లలు మాత్రమే పుట్టారు. కానీ ఇదే సమయంలో 46 మంది వయోధికులు కాలం చేశారు. ఏటా సగటున 18 మంది చనిపోతుంటే ఇద్దరు మాత్రమే జన్మిస్తున్నారు. అగ్నిని, నీటిని దైవంగా ఆరాధించే పార్శీ జాతి తనను తాను కాపాడుకొనేందుకు, మతాంతర వివాహాలను నియంత్రించేందుకు ‘చారిటబుల్ బ్లాక్'(మతపరమైన కట్టుబాటు)ను విధించింది.

అబిడ్స్, నాంపల్లి, సికింద్రాబాద్‌ల లోని విశాలమైన ఫైర్ టెంపుల్స్ ప్రాంగణాల్లోనే పార్శీ కుటుంబాలు సకల సదుపాయాలతో జీవించేందుకు ఏర్పాట్లు చేశారు. అతి తక్కువ ధరలకే విశాలమైన ఇళ్లను అద్దెకు ఇచ్చారు. అన్ని రకాల మతపరమైన కార్యక్రమాల్లో, ప్రార్థనల్లో పాల్గొనేవిధంగా ప్రోత్సహిస్తున్నారు. అయినా నేటి యువత మతపరమైన కట్టుబాట్లను అధిగమించి తమకు నచ్చిన వారిని పెళ్లి చేసుకొనేందుకు ఏమాత్రం వెనుకాడటం లేదు. పార్శీ జాతి ఇప్పుడు పెద్ద ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది. ఈ తరం అమ్మాయిలు, అబ్బాయిలు స్వతంత్రంగా ఆలోచించడం, ఆర్థిక స్వాతంత్య్రాన్ని కోరుకోవడం మంచిదే కానీ చారిత్రక బాధ్యతన విస్మరించొద్దు. ఇంతగా అభివృద్ధి చెందిన సమాజంలో కట్టుబాట్లలో బతకాలనడం కరెక్ట్ కాదు అని కొందరి అభిప్రాయం! వీరు చాలా నిజాయితీపరులు. భారత దేశంలో ప్రముఖులైన పార్శీలలో దాదాభాయి నౌరోజీ, జమ్సేట్జి టాటా, ఫిరోజ్ షా మెహతా, ఫిరోజ్ గాంధీ, జుబిన్ మెహతా, అర్దెషీర్ ఇరానీ, నానీ పాల్కీవాలా, పీలూ మోడీ, గోద్రెజ్ కుటుంబం, వాడియా కుటుంబం, టాటా కుటుంబం వగైరాలు.

8 thoughts on “పార్శీయులు

  1. ఈ వ్యాసం ద్వారా తెలియని ఎన్నో విషయాలను తెలుసుకున్నాను.

  2. చాలా మంచి విషయాలను తెలియచేసినందుకు ధన్యవాదాలు.

  3. తెలియని విషయాలు బాగా చెప్పావు మిత్రమా. అభినందనలు

  4. పారశీల పట్ల నాకెంతో ఆత్మీయత. చాలా బాగుంది వ్యాసం. మెహర్ బాబా పార్శీ. వారు ఏలూరులో మా తాతగారింట్లో అడుగుపెట్టారు. వారు మౌనం వహించారు. బాబా వల్ల మేమెంతో ప్రభావితులమయ్యాం. చాలా మంచి విషయాలు తెలిశాయి. ఎలా అయినా తెలుగులో చదివితే ఆ ఆనందమే వేరు. టీవీకే శాస్త్రి గారికీ, మాలిక పత్రికకీ ధన్యవాదాలు.

  5. పరిశీల గురించి ఎన్నో తెలియని విషయాలు ఈ వ్యాసం ద్వారా తెలుసు కున్నాం.వారి నిజాయితీ,వ్యాపార దక్షత గురించి ఎంత చెప్పినా తక్కువే అనే వారు.అలాటి వారి జాతి ప్రమాదపు అంచుల్లో పడటం విచార కరం. మంచి వ్యాసం అందించిన మీకు అభివాదములు సర్

  6. అల్పసంఖ్యాకులైన పార్సీలు ఎక్కడా తమకిది కావాలని డిమాండ్ చేసిన దాఖలాలు లేవు. శ్రమనే నమ్ముకుని దేశానికి తమవంతు సహకారం అందిస్తున్న పార్సీల గురించి వ్రాసిన మీ వ్యాసం బావుంది.

    • పార్శీయుల గతచరిత్రతో పాటు ప్రస్తుత పరిస్థితులను కళ్ళముందు కదిలాడేలా వివరించిన వ్యాసరచయిత టివియస్ శాస్త్రిగారికి ధన్యవాదాలు.

Leave a Comment