April 26, 2024

కలియుగ వామనుడు 2

రచన: మంథా భానుమతి

ఈళ్లేం సెయ్యలా.. బానే ఉంది. అమ్మయ్య అనుకుంటూ, మూల తలుపు కేసి సైగ చేశాడు కొత్తవాడు.
టింకూని తీసుకుని ఆ తలుపు తోసుకుని లోపలికి వెళ్లాడు చిన్నా. టింకూ ఇంకా వెక్కుతూనే ఉన్నాడు. వాడిని కూడా తీసుకుని లోపలికెళ్లి తలుపేసేశాడు.
బాత్రూం, లెట్రిన్ కలిపే ఉన్నాయి. ఇద్దరూ ముక్కు మూసుకుని నడిచారు. ఎవరూ శుభ్రం చేస్తున్నట్లు లేదు. చిన్న పిల్లలు భయానికి, ఎలా వాడాలో తెలిసినా నీళ్లు పొయ్యట్లేదనుకున్నాడు చిన్నా.
టింకూ, తనూ రెండు పనులూ ముగించుకుని, బకెట్లో నీళ్లు మగ్గుతో పోసి, శుభ్రం చేసి బయటకు వచ్చాడు చిన్నా.
అమ్మయ్య.. కాస్త తేరుకున్నారిద్దరూ.
బాత్రూంలోనే టింకూకి, ఎవరో తమనెత్తుకొచ్చారని.. తను గ్రహించిందంతా చెప్పాడు. ఎవరైనా ఉన్నప్పుడు తను మాట్లాడనని చెప్పాడు. తనకి మాటలు రావన్నట్లు ఉంటానని.. టింకూ తనని పలకరించ కూడదని చెప్పాడు.
చిన్నా చెప్పింది తూ.చ తప్పకుండా చెయ్యడం అలవాటే టింకూకి.
బుద్ధిగా బుర్రూపాడు.
ఎలాగైనా ఇక్కడి నుంచి తామిద్దరూ వెళ్లిపోయేట్లు ప్లాన్ వెయ్యాలనీ, ప్రతీ విషయం జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలనీ కూడా చెప్పాడు.
అంతా విని..
“నన్నెత్తుకొచ్చారా.. అమ్మ కావాలి. ఏదీ.. అమ్మా..” గట్టిగా ఏడుపు మొదలెట్టాడు టింకూ.
మంచిదే అనుకున్నాడు చిన్నా. తను కూడా ఏడవాలి.
“ఆ.. ఆ..” ఆకలేస్తోందన్నట్లు కడుపు చూపిస్తూ తను కూడా గట్టిగా ఏడువ సాగాడు.
అమ్మ.. అమ్మ అంటూ టింకూ ఉధృతం చేశాడు ఏడుపు.
“అరేయ్.. ఈళ్ల సంగతి సూడండ్రా! సార్ వస్తనని పోన్ చేశాడు. అప్పటికి తగ్గించాలి ఏడుపు. ఏంచేస్తారో నాకు తెల్దు.” గుబురు మీసాలవాడు, గరగరా శబ్దం చేస్తూ ఒక సారి చిన్నాని లేపి గాల్లో ఎగరేసి పట్టుకున్నాడు.
చిన్నా కింద పడబోయి నిలదొక్కుకున్నాడు.
“సెబాస్ రా బుడ్డోడా. తేలిగ్గున్నవ్. బాలన్సింగ్ కూడ బానే ఉంది. ఇట్టగే మైంటైనింగవాల.” గాండ్రించినట్టు చెప్పి చక్కా పోయాడు.
“అంకుల్! మమ్మల్నెందుకు తీసుకొచ్చారు? అమ్మ దగ్గరకీ పంపెయ్యండి. ఆకలేస్తాంది..” టింకూ వెక్కుతూ అడిగాడు.
చిన్నా మిడుకూ మిడుకూ చూస్తున్నాడు.
వాడికి పక్కాగా తెలిసి పోయింది. తమని ఇంటికి పంపరని. టీచరు వార్నింగ్ ఇచ్చినప్పుడే నెట్ లో చూశాడు. పిల్లలని ఎత్తుకు పోయి రకరకాలుగా వాడుకుంటారని.
వీళ్లేం చేస్తారో?
దొంగతనం నేర్పించి దొంగలుగా చేస్తారా? బిచ్చగాళ్లుగా..
తలుచుకుంటే ఒళ్లు జలదరించి గట్టిగా ఏడుపు మొదలెట్టాడు. గుడ్డోళ్లని, కుంటోళ్లనీ చేసేస్తారా?
స్కూలు దగ్గర సిగ్నల్ లైటు రెడ్డయినప్పుడు చూస్తుంటాడు.. తన వయసు పిల్లలే.. చేతులు చాపుతూ అడుక్కోవడం. కొందరు కుంటి వాళ్లు.. వాళ్లలాగే తమకి కూడా కాళ్లు విరిచేస్తారా?
కొంతమంది పిల్లలని కర్మాగారాల్లో వాడుకుంటారుట.. వాచీలు అవీ చేసే దగ్గర. చిన్న చిన్న వేళ్లతో కానీ కొన్ని పనులు చెయ్యలేరుట.. అందుకనీ, డేంజరస్ రసాయనాలని పిల్లల చేతులతో పూయిస్తారట, బుల్లి బుల్లి మిషన్ పార్ట్ లలో.
కొండల్లోకి తీసుకెళ్లి రాళ్లు కొట్టిస్తారా?
రకరకాల ఆలోచనలు ముసురుకున్నాయి చిన్నా బుర్రలో.
“జుట్టంకుల్.. అమ్మ..”
“ఆగండెహే..” ఒక్క కసురు కసిరాడు.
రెండు బుల్లి టూత్ బ్రష్ లు జేబులోంచి తీసి, వాటి మీద పేస్టు వేసి చేతుల్లో పెట్టాడు. టింకు బ్రష్ చూసి ఏడుపాపేశాడు. వాడికెప్పట్నుంచో బ్రష్షు పేస్టులతో పళ్లు తోముకోవాలని ఆశ. జానీ ఎప్పుడూ బొగ్గుపొడి తోనే తోముకోమంటుంది అందరినీ.
“పళ్లు తోముకోని రండి. చాయ్ పోస్తా. ఆకలనేడస్తన్నారుగ..”
చిన్నా చేయి పట్టుకుని బాత్రూంలోకి తీసుకెళ్లాడు టింకూ.
నిజవే.. కాస్త కడుపులో ఏదన్నా పడ్తే బుర్ర పన్చేస్తుంది. కానీ.. ఇక్కడే ఉండాలా.. తప్పించుకోవడమనేది కుదురుతుందా?
ఏమాత్రం కుదరదనే అనిపించింది చిన్నాకి.
అమ్మ, నాయన ఎట్లున్నారో? నాయనమ్మ గోలెట్టేస్తుంటాది. చిన్నాకి ఏడుపొచ్చేసింది. పళ్లు తోముకుంటూనే కన్నీళ్లు కారుస్తున్నాడు.
ఏడుస్తూనే ఇద్దరూ పళ్లుతోముకుని, వాళ్ల అమ్మలు చెప్పినట్లుగా మొహాలని చల్లటి నీళ్లతో కడుక్కునొచ్చారు.
జుట్టంకుల్ రెండు కప్పుల్లో టీ, మేరీ బిస్కట్లు నాలుగు తెచ్చిచ్చాడు.
“బిస్కట్లు నంచుకుని చాయ్ తాగండి. ఇయాలో రేపో మీకు బట్టలు తెత్తారు. అప్పుడు తానాలు సెయ్యచ్చు.”
చిన్నాకి చాయ్ సయించదు. నాన్నమ్మ వాడికి కాఫీ డికాక్షన్ లో వేడి నీళ్లు కలిపి ఇస్తుంది. అది కూడా చక్కెర తక్కువేసి. పాలు పోస్తే బరువు పెరుగుతాడని డాక్టర్లు వద్దన్నారు.
బిస్కట్లు రోజూ కాఫీలో ముంచుకుని లెక్కగా రెండు తింటాడు. బిగ పట్టుకుని ఎలాగో చాయ్, బిస్కట్లు కానిచ్చాడు.
టింకూ గబగబా తినేసి తాగేశాడు. వాడికి రోజూ చాయ్ అలవాటే. బిస్కట్లే ఎప్పుడో కానీ దొరకవు.
జుట్టంకుల్ ఖాళీ కప్పులు పట్టుకుని వెళ్లి పోయాడు. తలుపుకు తాళం వేసిన శబ్దం వినిపించింది.
చిన్నా లేచి గదంతా కలియ తిరిగాడు.
లైట్లు ఆర్పకుండా వెళ్లిపోయారు అంకుల్సు. కావాలనే.. పిల్లల ఆరోగ్యం పక్కాగా ఉండాలి వాళ్లు చెయ్యబోయే పనులకి. భౌతికంగా, మానసికంగా కూడా..
ఎక్కడా ఒక కుర్చీ కానీ స్టూలు కానీ లేదు. కిటికీలు అసలే లేవు. పొడుగు వాళ్లకి కూడా అందనంత ఎత్తులో వెంటిలేటర్లున్నాయి. అకాశంలో ఉందా అన్నట్లు ఒక ఫాన్ తిరుగుతోంది.
రేడియో, టివీ వంటివి మొదలే లేవు.
ఏం చెయ్యాలీ?
డాక్టరుగారు చెప్పిన వ్యాయామాలు గుర్తుకొచ్చాయి చిన్నాకి. టింకూ చేత కూడా చేయిస్తే.. కాస్త మర్చి పోతాడేమో అమ్మని.
గదంతా నిశ్శబ్దంగా ఉంది. టింకూ ఏడీ? చిన్నా గాభరాగా గదంతా చాశాడు. ఒక మారు మూల కాళ్లు ముడుచుకుని, నోట్లో వేలేసుకుని పడుక్కున్నాడు టింకూ.
మత్తు ప్రభావం ఇంకా పోయినట్లు లేదు. పైగా ఏడిచి ఏడిచి నీరసం కూడా వచ్చుంటుంది.
టింకూని చూస్తుంటే కడుపులోంచీ దుఃఖం తన్నుకొచ్చింది చిన్నాకి. తనే పెద్దవాడిలా, వాడి బాధ్యతంతా తనదేలాగ అనిపించ సాగింది. తన సంగతెలా ఉన్నా. వీడిని మాత్రం వాళ్లమ్మ దగ్గరికి చేర్చాల్సిందే.. గట్టిగా నిర్ణయించేసుకున్నాడు.
అవసరమైతే.. వాడు చేసే పని కూడా తనే చేసేస్తానని చెప్పాలి.
“బాబా! ఎక్కడున్నావు.. రోజూ పువ్వులు తుంచి ఇస్తుంటానా.. రోజూ, బేరాలు తక్కువున్నప్పుడల్లా గుడికి వస్తుంటానా.. ఆ సాయి బాబానే చూసుకోవాలి. నేనున్నా మీకు.. అని చెయ్యి చూపిస్తాడు కదా! ఎందుకు చూసుకోడు?” చిన్నా దుఃఖాన్నంతా అదిమి పెట్టాడు, బాబాని తలుచుకుంటూ..
టింకూ కదిలి.. కళ్లిప్పి చూసి మళ్లీ పడుక్కున్నాడు. చిన్నా, వాడి దగ్గరగా వెళ్లబోయి ఊరుకున్నాడు.
సాయిరాం, సాయిరాం.. అంటూ, గది గోడల వెంట పరుగు పెట్ట సాగాడు చిన్నా.. మధ్య మధ్య ఆగి, కాళ్లు చేతులూ సాగ దీస్తూ.
అరగంట పరుగెట్టాక, ఆయాసంతో ఆగి పోయాడు. గోడకి చేరబడి కూర్చుని రొప్పుతూ.. ఆయాసం తీర్చుకుంటున్నాడు.
పైన వెంటిలేటర్లోంచి పడుతున్న వెలుగు చూసి, మధ్యాన్నం పన్నెండు దాటుంటుందని అనుకున్నాడు. ఆ వెలుగు తీక్షణంగా ఉంది. వెంటిలేటరుకున్న ఊచల నీడలు చాల పొట్టిగా ఉన్నాయి.
సరస్వతీ టీచర్ చెప్పిన పాఠాలు గుర్తుకు తెచ్చుకున్నాడు. సూర్యుడు నడినెత్తికి వస్తుంటే నీడ పొట్టిదవడమే కాక ఆకారంలో కలిసిపోతుంది.
ఏం చెయ్యాలి?
ఏడుపు రాబోయింది మళ్లీ. గట్టిగా ఊపిరి పీల్చి ఆపుకున్నాడు.
టింకూ కదిలాడు. లేచి కూర్చుని అయోమయంగా చూడ సాగాడు.
“చిన్నా! ఆకలేస్తోంది. దప్పికైతోంది.”
నిజమే.. దాహమేస్తే ఎక్కడా తాగడానికి నీళ్లు లేవు. బాత్రూంలో.. అడుగు పెడ్తేనే వాంతొస్తోంది. అక్కడి నీళ్లు తాగాలంటే.. తప్పకపోతే, ప్రాణం నిలవాలంటే అవే తాగాలి. దోసిలి పట్టి.. ఇద్దరి చేతులూ చిన్నవే. ఎన్ని నీళ్లు పడ్తాయి?
టింకూ దగ్గరగా వెళ్లి భుజం మీద చెయ్యేసి దగ్గరగా పొదవుకున్నాడు.
“అంకుల్ వస్తాడు. ఏదో తినడానికి తెస్తాడు. కొంచెం ఓర్చుకో టింకూ..”
చిన్నా మాట పూర్తి కాకుండానే తలుపు చప్పుడయింది. తోసుకుని వచ్చారిద్దరు. జుట్టంకుల్ తో పాటు ఇంకొకడు.. తెల్లని లాల్చీ పైజామా. కనుబొమ్మల మధ్య కుంకం బొట్టు. నవ్వుతున్నట్లున్న మొహం. అతన్ని చూడగానే ధైర్యం వచ్చింది పిల్లలిద్దరికీ.
“అంకూల్..” భోరుమని ఏడుస్తూ వెళ్లి కాళ్లు పట్టేసుకున్నారిద్దరూ.
“ఏడవకండి. నేనున్నా కదా! ఆకలేస్తోందా?” వంగుని ఇద్దరి మొహాల్లోకీ చూస్తూ అడిగాడు.
“అవును. అంకుల్ మీరు గుడ్ కదా! మా అమ్మ దగ్గరికి పంపేస్తారా?” టింకూ అడిగాడు, ఆశగా చూస్తూ.
“అలాగే. తప్పకుండా పంపుతా. ముందు మీరు లంచ్ తినండి. తిన్నాక, స్నానం చేసి ఈ బట్టలేసుకోండి. అప్పుడు మాట్లాడ్తా.” ఎంతో సౌమ్యంగా అన్నాడు గుడ్ అంకుల్.
జుట్టు వాడు, సంచీ లోంచి పొట్లాలు, ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసులు మంచినీళ్ల సీసా తీశాడు. ఆ పొట్లాలు చూడగానే చిన్నాకి ఆకలి ఎక్కువైంది.
పొట్లాలిప్పి, మూడేసి ఇడ్లీలు, పచ్చడి పళ్లాలలో వేసి పిల్లల ముందు పెట్టాడు.
గబగబా తినేసి, నీళ్లు తాగేశారు. కడుపు నిండాక అమ్మ ఇంకా గుర్తుకొచ్చింది. కళ్ల నిండా నీళ్లు తిరిగాయి.
“బాత్రూంలోకి వెళ్లి స్నానం చేసి రండి. మీరు చెయ్యగలరా నే చేపించాలా?” జుట్టువాడు అడిగాడు కరకుగా, సబ్బు, తువ్వాలు ఇస్తూ.
“మేం చేసొస్తాం అంకుల్..” భయంగా చూస్తూ బాత్రూం లోకి వెళ్లాడు టింకూ.. చిన్నా వాడి వెనుకే..
నీళ్లు చాలా చల్లగా ఉన్నాయి. ఒక మగ్గు నీళ్లు మీద పడగానే కెవ్వుమని కేకేశాడు టింకూ. తినడానికి వెతుక్కోవలసి వచ్చినా, నీళ్ల గోలెం ఎండలో పెట్టి, గోరువెచ్చని నీటితోనే పోస్తుంది జానీ బేగం.
చిన్నాకయితే చెప్పనే అక్కర్లేదు.. ఇంట్లో ఉన్న ముగ్గురూ వాడి బాగోగులుకోసం పాటు పడేవారే.
చెయ్యి ముంచి.. శరీరానికి చలి అలవాటు చేసి, టింకూకి స్నానం చేయించి, తను కూడా చేశాడు చిన్నా. ఒళ్లు తుడుచుకుని, తువ్వాళ్లు చుట్టుకుని ఇద్దరూ బయటికొచ్చారు.. ఒణుకుతూ.
తువ్వాలు విప్పదీసి చిన్నా చేతులనీ, శరీరాన్నీ పరీక్షగా చూసి, బట్టలిచ్చాడు గుడ్ అంకుల్. ఫరవాలేదు.. చెల్లుతాడు. ఒళ్లు గట్టిగా ఉంది. కొంచెం శ్రద్ధ తీసుకుంటే సరిపోతుంది.
చిన్నా ముడుచుకు పోతూ, వింతగా చూస్తూ బట్టలేసుకున్నాడు. అలా ఎందుకు తడిమాడు అంకుల్..
టింకూని కూడా తడమబోతే వాడు చేతికందకుండా పరుగులు పెట్టాడు.. తువ్వాలు చుట్టుకునే.
“చీ.. ఛీ. కితకితలు అంకుల్. షేమ్ షేమ్. ఎందుకలా ముట్టుకుంటావు? మేం బట్టలేసుకోగలం.”
వాడి పరుగు చూసి, తృప్తి చెందాడు గుడ్ అంకుల్. వీడు కూడా గట్టిగానే ఉన్నాడే.. బానే తింటున్నారన్నమాట. మరి ఎందుకమ్మేశారో? ఎందుకైతే తనకెందుకు? కావలసింది పిల్లలు.. అదీ కొనే వాళ్లు అడిగిన సైజులో, వయసులో ఉన్న వాళ్లు.
“గుడ్ బాయిస్. హాయిగా నిద్రపోండి. లేచాక మాట్లాడుకుందాం.” తను కూడా నవ్వుతూ అన్నాడు.
“పడుకుని లేచాక తీసుకెళ్తారా?”
టింకూ అమాయకత్వం చూసి కొద్దిగా జాలి పడ్డాడు జుట్టు వాడు. అది గ్రహించి, వెంటనే అతని భుజం మీద చెయ్యేసి బైటికి నడిపించాడు గుడ్ అంకుల్.
తాము విప్పేసిన బట్టలు తీసుకెళ్లి బాత్రూంలో ఉతుక్కొచ్చాడు చిన్నా. వాడికి అర్ధమైపోయింది.. తమని ఇంక ఇంటికి పంపరని.
ఇంటికి పంపడానికా ఎత్తుకొచ్చిందీ..
ఉతికిన బట్టలని నేల మీదే, చేత్తో తుడిచి ఆరేశాడు.
టింకూని పడుకో బెట్టి, తను కూడా నేల మీద వాలాడు.
పిల్లల్నెత్తుకొచ్చి ఏమేం చేస్తారో మళ్లీ ఒక సారి బుర్రలో తిరగేశాడు. ముష్టి వాళ్లగా చెయ్యడానికైతే కాదు.. దాని కైతే, తమ శరీరాలని తడిమి, సరిగ్గా ఉన్నారా లేదా అని చూడరు కదా..
ఏదో పని చెయ్యడానికే..
ఏం పనై ఉంటుంది?
చిన్నా చిన్ని బుర్రకి ఎంత ఆలోచించినా తట్టలేదు. కళ్లు వాలిపోయి నిద్దరొచ్చేసింది.. అంతలోనే. పక్కకి తిరిగి కళ్లు మూసేశాడు.
గుడ్ అంకుల్ పేరు ఆనంద్.
మధ్యవర్తి ద్వారా ఒకానొక అంతర్జాతీయ ముఠాకి పిల్లలని సరఫరా చెయ్యడం అతగాడి వృత్తి.
బైటికి మాత్రం.. అంతర్జాతీయ ఫార్మా కంపనీలకి, హెర్బల్ మందుల కోసం తాము అడవుల్లో ఆకులని, వేళ్లనీ మూలికల కోసం సేకరిస్తామనీ.. తమది ఎక్స్ పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్సనీ చెప్తాడు.
ఊర్లో బాగా పేరున్న పేటలో పెద్ద భవనం అతగాడిది. ఇంటి ముందు ఆర్భాటాలేవీ ఉండవు.
‘సంజీవినీ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్ పోర్ట్స్’ అని చిన్న బోర్డ్ ఉంటుంది. లోపలికి వెళ్తుంటే.. పొడవాటి వరండాలో కట్టలు కట్టి ఉంటాయి రకరకాల మొక్కలు. అక్కడ అడుగు పెడుతుండగానే రకరకాల మూలికల వాసన వేస్తుంటుంది.
వరండా అంతా శుభ్రంగా ఉంటుంది. సింహద్వారానికి వెళ్లే దారిలో తీర్చి దిద్దిన ముగ్గులు, స్వాగతం పలుకుతుంటాయి.
ఇంటి బైటనున్న తోటలో కూడా కలబంద వంటి మొక్కలు, అనేక రకాల తులసి మొక్కలు ఉంటాయి.
ఆ తోటలో ఇద్దరు మాలీలు పని చేస్తుంటారు. వాళ్లు ఆవరణలోనే ఒక మూలగా ఉన్న ఒంటి గది ఇళ్లలో ఉంటారు. ఆ ఇళ్లకి వేరే దారి ఉంది రోడ్డు మీది నుంచి. ఇళ్ల చుట్టూ ముళ్ల చెట్ల ఫెన్సింగ్. పెద్ద ఇంట్లోకి, పనికి తప్ప రావలసిన పని లేదు.
ప్రాకారం లోపల, ఐదడుగులివతల చుట్టూ వేప చెట్లు. వేప పూలని ఏరి బాగుచేసి ఎండబెడుతుంటారు మాలీల భార్యలు. ఇద్దరు మాలీలకీ ఇద్దరేసి ఆడపిల్లలు. బళ్లో చదువుకుంటున్నారు.
తోటలోనే ఒక మూలగా చిన్న వినాయకుడి గుడి. ప్రతీ రోజూ శుభ్రం చేసి, పూజ చేసి, ప్రసాదం లోపల ఇచ్చి వెళ్తుంటారు ఒక పూజారిగారు.
మొక్కలు, ఆకులు, వేర్లు, బెరళ్లు తీసుకెళ్లడానికి ఎవరో ఒకరు ఎప్పడూ వస్తూనే ఉంటారు. ప్రతీదీ వేరుచేసి, పేర్లు రాసి పెడుతుంటారు ఇద్దరు ఆయుర్వేద వైద్యం చదివిన యువ డాక్టర్లు.
ఆనంద్ భార్య పేరు ఇందుమతి. ఇద్దరు మగపిల్లలు. బోర్డింగ్ స్కూల్లో చదువుతున్నారు. అతగాడి వృత్తికీ, వ్యక్తిగత జీవితానికీ పోలికే లేదు.. అచ్చు ముత్యాలముగ్గు సినిమాలో కాంట్రాక్టరు లాగ.
కానీ, ఇందుమతి, సినిమాలో సుర్యకాంతం లాగా ఇతగాడిని ఆరాధించదు. తనకి తెలియకుండా ఏదో తప్పుడు వ్యాపారం నడుస్తోందన్న అనుమానం ఉంది. అదేమిటో చెప్పమని, సందర్భం దొరికినప్పుడల్లా సతాయిస్తుంటుంది.
“ఈ ఆకులలములకి ఇంత ఆదాయం ఉంటుందా? నేన్నమ్మను. ఏం చేస్తున్నారో చెప్పండి. ఏదో స్మగ్లింగ్.. డ్రగ్సా?”
“కాదని చెప్తున్నాగా.. మన పిల్లలమీదొట్టు. డ్రగ్స్ స్మగ్లింగ్ ఎప్పుడూ చెయ్యలేదు, చెయ్యను.” ఆనంద్ గట్టిగా చెప్పాడు. అతని వరకూ అతను నిజమే చెప్పాడు మరి.
ఎంత అడిగినా, ఎన్నిసార్లు వేధించినా బైటపడ లేదు. ఇందుమతి అనుమానంగా చూస్తూనే ఉంటుంది. తను చేసే సంఘసేవ చేస్తుంటుంది. రెండు అనాధాశ్రమాలలో ట్రస్టీ సభ్యురాలు. ధన సేకరణ, వారం వారం చెకప్ లకి డాక్టర్లని ఏర్పాటు చెయ్యడం వంటి పనులు చేస్తుంటుంది.
తన వృత్తికోసం, వేరుగా, ఎయిర్ పోర్ట్ కి దగ్గరగా ఉన్న పోష్ కాలనీలో ఒక ఇల్లు కట్టించాడు ఆనంద్.
దూరం దూరంగా ఉండే ఇళ్లు.. పక్కింట్లో ఏం జరుగుతోందో పట్టించుకునే తీరుబడిలేని వ్యాపారస్థులు, రాజకీయ నాయకులు ఉండే ప్రాంతం.
ఏవేవో కార్లు ఇరవై నాలుగ్గంటలూ వస్తూ పోతుంటాయి. ఆ కాలనీ స్టిక్కర్ కారు మీదుంటే, గేటు దగ్గర ఎవరూ ప్రశ్నించరు, ఆపరు.
నెలకి పదిమంది వరకూ పిల్లలని సేకరిస్తుంటాడు ఆనంద్. అందరూ మగ పిల్లలే. చాలా రాష్ట్రాలలో సాగుతుంటుంది అతని సేకరణ. తీసుకొచ్చిన పిల్లలని ముఠా వాళ్లు వచ్చి, చూసి తీసుకెళ్లే వరకూ ఆ ఇంట్లోనే ఉంచుతాడు.
పిల్లల ఆకారాలు, ఆరోగ్యం, మానసిక స్థితి.. అన్నీ ప్రత్యేకంగా ఉండాలి.
పిల్లలు ఐదారేళ్ల లోపు వయసులో ఉండాలి. ఆ వయసు పిల్లలు ఉండాల్సిన బరువు కన్నా ఒకటి రెండు కిలోలు తక్కువే ఉండాలి.
ఏరోజు కారోజు అన్నీ చెక్ చెయ్యడానికి శిక్షణ పొందిన ఆహార నిపుణుడు వస్తుంటాడు. అతడు చెప్పిన ఆహారాన్నే ఇవ్వాలి.
అవసరమైన వ్యాయామాలు చేయిస్తుండాలి. అవి చేయించడానికొక ట్రయినర్..
అక్కడి నుంచి పిల్లల్ని మరలించడానికి రెండు నెలలు పైన పడుతుంది. ఆ రెండునెలలూ వాళ్లని జాగ్రత్తగా కాపాడ వలసిన బాధ్యత ఆనంద్దే.
పిల్లలు ముఠా వాళ్లు అనుకున్న చోటికి చేరే వరకూ.. వాళ్లకి ఖర్చు పెట్టే డబ్బు మాత్రమే ఇస్తారు. పిల్లలు చేరాక.. ఒక్కో పిల్లవాడికీ లక్షల్లో ఉంటుంది ఆదాయం.
కానీ.. ఏ ప్రశ్నలూ వెయ్య కూడదు. ఎక్కడికి తీసుకెళ్తున్నారో.. ఏం చేస్తారో!
అటువంటి కుతూహలం చూపించిన సరఫరా దారుల పని ఏమయిందో వీడియోలో చూసి.. ఆనంద్కి ఒళ్లంతా చెమటలు పట్టాయి. గొంతెండిపోయి, నాలుక బైటికొచ్చేస్తుందేమో అనిపించింది.
తమ కింద పనిచెయ్యడానికి ఒప్పుకున్న వాళ్లకి ముందుగా ఆ వీడియోలు చూపించడం ఆ ముఠా ఆనవాయితీ.
అందుకే.. చెప్పిన పని చెయ్యడం తప్ప ప్రశ్నలు వెయ్యాలన్న ఆలోచనే రాదు ఎప్పుడూ ఆనంద్కి.
పిల్లలకోసం సౌండ్ ప్రూఫ్ గదులు ఆరున్నాయి మేడ మీద. గదుల్లో లోపల గోడలన్నీ చెక్కలతో తాపడం చేసి ఉంటాయి. కిటికీలుండవు. కొంచెం పెద్దగా ఉన్న వెంటిలేటర్లలోనుంచి వెలుతురు.. ఫాన్ల నుంచి గాలి వస్తాయి.
చిన్న పిల్లలు ఎలాగా అంత ఎత్తు అందుకోలేరు. గదికి ఇద్దరు పిల్లల కన్నా ఎక్కువుండరు.
అంతా పకడ్బందీగా ఉంటుంది వ్యవహారం. ఆ విధంగా ఎన్నాళ్లు సాగుతుందో.. కాలమే తేల్చి చెప్పాలి.

ఎవరో తట్టి లేపినట్లనిపించింది చిన్నాకి.
“నాయనమ్మా!” అంటూ లేచాడు.
“చిన్నా! మీ నాయనమ్మ వచ్చిందా? మనిద్దరినీ ఇంటికి తీసుకు పోతుందా?” టింకూ గాడు.. ఆనందంగా అడుగుతున్నాడు. వాళ్లిద్దరూ పార్క్ లో ఆడుకుంటూ, ఎప్పటికీ ఇంటికి రాకపోతుంటే చిన్నా నాయనమ్మ వచ్చి తీసుకెళ్లడం అలవాటే వాడికి.
తల విదిలించాడు చిన్నా.
తామిద్దరూ ఎక్కడున్నారు? తలంతా దిమ్ముగా ఉంది.
ఒక నిముషం తీసుకున్నాడు టింకూ అడిగింది అర్ధం చేసుకోడానికి.
“లేదు టింకూ! మనల్ని ఎత్తుకొచ్చారని చెప్పాగా! ఎక్కడికి తీసుకెళ్తారో.. మనల్ని ఏం చేస్తారో తెలీదు. మనం మాత్రం ధైర్యంగా ఉండాలి. అస్సలు డీలా పడకూడదు. నేనున్నా కదా.. నీకేం భయం లేదు. సరేనా?” బుద్ధిగా తలూపాడు టింకూ.
“ఏడవకుండా ధైర్యంగా ఉంటే అమ్మ దగ్గరికి వెళ్లి పోవచ్చా?”
“మన ప్రయత్నం మనం మనం చేద్దాం. ఏడుపొచ్చినప్పుడు ఏడుద్దాం. అమ్మ గుర్తుకొస్తే ఏడవకుండా ఎట్టా?”
“ఆకలేస్తోంది చిన్నా! ఉస్సు చేసొస్తా.” టింకూ బాత్రూంలోకెళ్లాడు.
ఎవరైనా ఏదైనా తెస్తేనే తినగలిగేది. అప్పటి వరకూ నీళ్లే..
ఎన్ని రోజులిలా?
టింకూ రాగానే, తను కూడా బాత్రూంకెళ్లొచ్చి, సీసాలో నీళ్లు ప్లాస్టిక్ గ్లాసులో పోసి ఇచ్చాడు టింకూకి. తను సీసా ఎత్తి తాగేశాడు.
కొంచెం ఆకలి తగ్గినట్లనిపించింది.
టింకూ గోడ దగ్గరకి వెళ్లి నోట్లో వేలు పెట్టుకుని కూర్చున్నాడు.
చిన్నాకి ఏం చెయ్యాలో తోచడం లేదు.. టైమెంతయిందో!
వెంటిలేటర్లోంచి వెలుతురు రావట్లేదు. చీకటి పడిపోయుంటుందా? అంతే అయుంటుంది.
ఇంటిదగ్గరేం చేస్తున్నారో? పోలీసు రిపోర్టిచ్చుంటారు. కానీ వీళ్లని కనుక్కోవడం ఎలా? తను చూసిన సినిమాలు గుర్తుకు తెచ్చుకున్నాడు..
వాటిల్లో బోలెడు డబ్బులిమ్మని కిడ్నాప్ చేస్తుంటారు.
తమ ఇళ్లల్లో.. అమ్మా నాన్నల దగ్గరేం డబ్బు ఉంటుంది? ఎక్కడికో పంపడానికే.. తమ చేత ఏవేవో పన్లు చేయించడానికే అయుంటుంది. అట్టాంటప్పుడు అమ్మా వాళ్లకి ఏ ఫోన్లూ రావు.
తాము ఎక్కడున్నారో.. ఆ బ్రహ్మకి కూడా తెలీదు.
బ్రహ్మంటే గుర్తుకొచ్చింది..
కళ్లు మూసుకుని సాయి జపం చేస్తూ కూర్చున్నాడు.
చిన్నాని చూసి, టింకూ కూడా, తను విప్పేసి.. ఆరేసిన చొక్కా నేల మీద పరిచి, తండ్రి చేసినట్లుగా నమాజు చెయ్యడానికి కూర్చో బోతూ అడిగాడు..
“చిన్నా! ఇక్కడ తూర్పెటుందీ?” చిన్నాకి అన్నీ తెలుసని వాడి అభిప్రాయం.
చిన్నా కళ్లు తెరిచి, పొద్దున్న ఎండ ఎటుపడిందో గుర్తు తెచ్చుకోడానికి ప్రయత్నించాడు.
ఉహూ.. గుర్తు రాలేదు.
కనిపించిన గోడ కేసి చూపించాడు.
టింకూ బుద్ధిగా నమాజుచెయ్యడం మొదలు పెట్టాడు.
చిన్నాకి ఎంతో ముద్దొచ్చేశాడు వాడు.
వీడి చేత ఏ పని చేయిస్తారో.. ఎన్నో సారి అనుకుంటున్నాడో.. లెక్కే లేదు.
తలుపు తెరిచిన శబ్దం..
కళ్లు తెరిస్తే జుట్టంకుల్. నవ్వుతూ లోపలికొస్తున్నాడు. చేతిలో బుట్ట. బుట్టలో కారియర్. పళ్లాలు, గ్లాసులూ..
చపాతీ, కూర పళ్లాల్లో పెట్టి కింద కూర్చుని పిలిచాడు. ఆకలేస్తోంది.. కానీ, అమ్మ లేకుండా.. మళ్లీ ఏడుపు..
“రండి. ఇవి తింటే మీ అమ్మకి హాపీ అవుతుంది. తినేసి పడుకోండి హాయిగా. రేపు బోలెడు పనుంది. మిమ్మల్ని చూట్టానికి ఎవరో వస్తారు.”
“మా ఇంటికి తీసుకెళ్తారా?” టింకూ వెంటనే అడిగాడు.
“తీసుకెళ్తారేమో.. నాకు అంత తెలీదు. ముందు తినేశాక, రేపు వాళ్లెవరో వచ్చాక కదా తెలిసేది..” జుట్టువాడన్నాడు.
ఒకోసారి డాక్టర్లు సర్టిఫై చెయ్యకపోతే, ఇంటి దగ్గర వదిలేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ అవి తక్కువ. సాధారణంగా, తీసుకొచ్చిన రెండునెలల లోపే పట్టుకు పోతారు పిల్లల్ని.
చిన్నా తినడం మొదలు పెట్టాక, టింకూ కూడా వచ్చి పళ్లెం తీసుకున్నాడు. ఇద్దరూ తినేశాక, గ్లాసులో మజ్జిగ ఇచ్చి, కారియర్, పళ్లాలు బుట్టలో పెట్టాడు జుట్టంకుల్.
రెండు మడత చాపలు, దుప్పట్లు ఇచ్చాడు.
“చలేస్తే కప్పుకోండి. నేను తలుపు బైటే ఉంటా.. అవసరం ఐతే తలుపు కొట్టండి. వెంటనే వస్తా. మీకేం భయం లేదు. ఎవరూ రారు.”
ఇంకెవరొస్తారు.. మీరే కదా వచ్చి ఎత్తుకొచ్చారు.. మనసులో అనుకున్నాడు చిన్నా.భయం లేదుట.. వణికి చస్తుంటే.
అలాగే అన్నట్లు తలూపారు ఇద్దరూ.
“లైటు, ఫాను అలాగే ఉంటాయి. సరేనా”
తలుపేసుకుని వెళ్లిపోయాడు జుట్టువాడు.
చిన్నా చాపలు పరిచాడు. ఇద్దరికీ ఒకళ్ల పక్కన ఒకళ్లు పడుకోడం అలవాటే.. అందుకే అంత సమస్య అనిపించలేదు.
“నే చెప్పింది గుర్తుంది కదా! బెంబేలు పడకూడదు టింకూ. మనం ఒకరికొకరం ఉన్నాం. కాస్త నయం కదూ? భయం వేస్తే నా చాప మీదికొచ్చెయ్యి.”
టింకూకి ధైర్యం చెప్పాడు కానీ చిన్నాకే బెంగగా ఉంది.
రేపెవరొస్తారో.. ఆ గుడ్ అంకుల్ వస్తే బాగుండు. ఇంటికి పంపెయ్యమని గట్టిగా అడగాలి. అసలు స్కూలుకెళ్లకుండా, ఆడుకోకుండా ఇక్కడేం చెయ్యాలి? టి.వీ కూడా లేదు.
ఇవాళంటే.. మత్తులో ఉన్నారు కనుక గడిచి పోయింది.
పాపం.. నాన్నకి పూలు ఎవరందిస్తారు?
గట్టిగా ఏడుపు మొదలెట్టాడు. వాడిని చూసి టింకూ కూడా..
ఏడిచేడిచి అలిసి పోయి, నీళ్లు తాగి పడుకున్నారు.. వెక్కుతూ.

“జుట్టంకుల్! ఎవరో వస్తారన్నారు కదా? ఎప్పుడొస్తారు?” ఇడ్లీ, పచ్చడిలో నంచుకుని తింటూ అడిగాడు టింకూ.
అప్పటికి నాలుగు సార్లు పిల్లలు లేచారా అనిచూసి, ఉండబట్టలేక లేపేశాడు, టింకూ జుట్టంకుల్ అని పిలిచే ‘తాన్యా’.
తాన్యా తూర్పు గోదావరి జిల్లాలో, రంపచోడవరం కోయజాతికి చెందినవాడు. మారేడుమిల్లి దగ్గర అడవుల్లో విహారానికి వెళ్లినప్పుడు ఆనంద్ కి తగిలాడు.. అక్కడ అన్నీ వివరిస్తూ, గైడ్ లాగ.
రెండురోజులు తన కూడా తిప్పుకున్నాడు.
తండాల్లో చిన్న పిల్లల్ని అమ్మడం సాధారణమేనని చెప్పాడు తాన్యా, మాటల మధ్యలో. బీదరికం.. ఎంత పనైనా చేయిస్తుందని కూడా విశ్లేషించాడు.
తాన్యా వివరాలన్నీ సేకరిస్తుంటే తెలిసింది.. ఎవరికీ చెప్పనని మాటతీసుకుని మరీ చెప్పాడు. తనే తండాలు తిరిగి, పిల్లల్ని అమ్ముతుంటానని. కానీ బ్రోకర్లు చాలా డబ్బు కొట్టేసి తనకి చాలా తక్కువిస్తారని వాపోయాడు. అందులో సగం మాత్రం తల్లిదండ్రుల కిస్తాట్ట తను.
అప్పుడే ఆలోచన వచ్చి, తాన్యాని తన వ్యాపారంలోకి తీసుకున్నాడు. పిల్లలని మచ్చిక చేసుకోవడంలో బాగా అనుభవం ఉన్నవాడు. పట్టణాలలో పని వాళ్లలాగ వంకర తెలివి ఉన్నట్లు కనిపించలేదు.
“నువ్వు చేసేది ప్రమాదకరమైన పని కదా.. నాకు ఎందుకు చెప్పావ్? పోలీసులకి పట్టిస్తే ఏం చేస్తావ్?”
“మిమ్మల్ని చూడగానే తెలిసింది సార్.. నేను ఈ వ్యాపారంలో ఉన్నవాడినే కద.. ఏమననంటే చెప్తా..మీరు ఫోన్ లో మాట్లాడుతుంటే ఒక సారి విన్నా. మీరైతే కోడ్ లోనే మాట్లాడారు. కానీ అవే కోడ్ లు మేం కూడా వాడతాం.” తాన్యా సమాధానం విని కంగు తిన్నాడు ఆనంద్.
ఎంత అపాయం? చుట్టుపక్కల గమనించకుండా వాగడం తప్పు కదూ! అంత కేర్ లెస్ గా ఎలా ఉన్నాడు..
వాళ్లకి గాని తెలిసిందంటే.. వెన్నెముక లోంచీ వణుకు పుట్టుకొచ్చింది. మొహం నల్లబడి పోయింది.
“ఏం భయం లేదు సార్.. ఇంకెవరికీ తెలీదు.. అర్ధం కాదు. నేనూ అలాంటి వాణ్ణే కనుక..” గ్లాసులో మంచినీళ్లిచ్చి ఓదార్చాడు.
నెలకి పదివేలు మించదు తన ఆదాయం అని చెప్పాడు.
“ఎంత సార్.. ఇద్దరు పిల్లల్ని సప్లై చేస్తే గొప్ప. అందుకే ఈ గైడు పని కూడా పెట్టుకున్నా. లేపోతే సరి పోదు.”
“పిల్లల్ని చూసుకోగలవా? వాళ్లకి కావలసిన సరిపోయే తిండి, ఏడుస్తుంటే ఊరుకో బెట్ట్డటం వంటివి..”
“బాగా చేస్తాను సార్. వాళ్లని ఆడిస్తా కూడా.. బోర్ కొట్టకుండా.”
రెండునెలలు గడవకుండా తాన్యాని పనిలోకి తీసుకున్నాడు. నెలకి పాతిక వేలు జీతం. ఒక్క సారిగా అంత డబ్బు కంట పడుతుంటే మారు మాటాడకుండా ఒప్పుకున్నాడు.
ఇంకొక ఉపయోగం కూడా తాన్యాతో.. తనకున్న లింకులతో అప్పుడప్పుడు పిల్లల్ని కూడా తెస్తుంటాడు.
“ఈ వయసులో తక్కువే దొరుకుతారు సార్. మా వాళ్లు పుట్టగానే అమ్మేస్తుంటారు. ఐదారేళ్లొచ్చేవరకూ పెంచరు. అప్పుడమ్మాలంటే తల్లులు గోలగోల చేస్తారు.”
నిజమే అనుకున్నాడు ఆనంద్.
కానీ చంటిపిల్లల్ని తెచ్చి, వాళ్లని పెంచడం.. మాటలు కాదు. అందుకే కిడ్నాప్ చేసే వాళ్లతో కనెక్షన్ పెట్టుకున్నాడు. అదీ మగపిల్లలంటే మరీ డేంజర్. అంత జాగ్రత్త తీసుకుంటాడు కనుకనే తన సామ్రాజ్యం ఇంచుమించు దేశం అంతా విస్తరించింది.
కొండల్లో కోనల్లో పల్లెల్లో.. బస్తీల్లో, పట్టణాలలోని వాడల్లో. ఇక్కడా అక్కడా అని లేదు. ఒకచోట ఒకసారి చేస్తే.. మళ్లీ కొన్నేళ్లు ఆ పక్కకి వెళ్లరు.
“రోజూ ఇడ్లీయేనా జుట్టంకుల్?” టింకూ అడిగాడు.
“మరేం కావాలి?” జుట్టంకుల్ అన్నందుకు చిరాకు పడుతూ అడిగాడు తాన్యా. నయం కొందరైతే జులపాలంకుల్ అని పిలుస్తారు.
“ఆమ్లెట్, బ్రెడ్..”చిన్నా చిన్నగా అన్నాడు వత్తి పలుకుతూ.
“అబ్బో.. నీకు మాటలొచ్చే! రేపు అరేంజ్ మెంటు చేస్తామండీ దొరగారూ..” వ్యంగ్యంగా అన్నాడు తాన్యా.
“నాకు ఐస్ క్రీమ్ కూడా..” వ్యంగ్యం అర్ధం కాని టింకూ అడిగాడు.
“అల్లగల్లగే..”
“ఎవరో వస్తారనీ..” మళ్లీ టింకూ.. ఎవరైనా కొత్త వాళ్లొస్తే అమ్మ దగ్గరికి తీసుకెళ్తారేమో..
చిన్నా ఎంత చెప్పినా వాడి చిన్ని బుర్రకి అర్ధం కావడం లేదు.
“వస్తారు కాసేపట్లో. మీరీలోగా స్నానాలు చేసి, ఈ బట్టలేసుకోండి.” కొత్త బట్టల పాకెట్ ఇచ్చాడు.
“మేం నిన్నటివి ఉతికారేసుకున్నాంగా.. ఇవి ఇంకెరికైనా, మా తరువాత వచ్చే వాళ్లకి ఇవ్వండి.” ఉలిక్కిపడ్డాడు తాన్యా, టింకూ అమాయకంగా అన్న దానికి. తమ వృత్తి తెలిసి పోయిందా ఈ పిల్ల వెధవలకి..
“ఫరవాలేదు.. ఇవి కూడా ఉండనీండి. చక్కగా తయారయి రండి. హాల్లోకి వెళ్దాం.”
చిన్నా, టింకూ బాత్రూంలోకి వెళ్లగానే ఆనంద్ కి ఫోన్ చేశాడు తాన్యా.
“సార్.. ఈ పిల్లలని హాల్లోకి తీసుకెళ్తున్నా. డాక్టర్ గారు వస్తారు కదా.”
“————”
“ఏడుపు మానారు. తొందర్లో ఇంటికి పంపేస్తారనుకుంటున్నారు. నెమ్మదిగా అలవాటవుతుంది లెండి. హాల్లోకా.. తీసుకెళ్లచ్చు.. ఏం ఫరవాలేదు.”
తలుపు చాటునుండి విన్న చిన్నా గుండె డబడబ లాడింది. అనుమాన పడ్డదే అయినా.. అనుకున్నదే అయినా నిర్ధారణ అయ్యే సరికి, ఒంట్లో ఉన్న రక్తం అంతా ఎవరో తీసేసినట్లయింది. నీరసంగా కదిలి, టింకూకి స్నానం చేయించి పంపి, తను కూడా చేసి బయటకొచ్చాడు.
నిన్నటి లాగా పరీక్ష చెయ్యకుండా బట్టలేసుకోనిచ్చాడు తాన్యా.
జేబులోంచి దువ్వెన తీసి ఇద్దరి తలలూ దువ్వాడు.
“మీరిద్దరూ కవలలేరా?”
చిన్నా అవునన్నట్లుగా, టింకూ కాదన్నట్లుగా తలలూపారు.
నవ్వుకుని, తలుపు తీసి హాల్లోకి తీసుకెళ్లాడు తాన్యా.
అక్కడ అప్పటికే నలుగురు పిల్లలు కూర్చుని ఉన్నారు. అందరూ టింకూ వయసు వాళ్లే. సన్నగానే ఉన్నారు, ఒకడు తప్ప. వాడు కొంచెం బొద్దుగా ఉన్నాడు.
“అంకుల్.. భూక్ లగ్రే..” తాన్యాని చూడగానే అరిచాడు.
“శామ్ తక్ కుఛ్ నయీ.. ఛుప్ ఛాప్ బైఠో..” కసిరి, టివీ స్విచ్చేశాడు.
కార్టూన్ నెట్ వర్క్..
పిల్లలంతా కుదురుగా కూర్చున్నారు. ఒక్క బొద్దూ తప్ప. వాడికి ఇచ్చిన మూడిడ్లీలూ పంటి కిందిక్కూడా రాలేదు. తాన్యా దగ్గరికి వచ్చి ప్లీజ్, ప్లీజ్ అంటూనే ఉన్నాడు.
“నీ.. ఏం పెట్టేదిరా మీ అమ్మ? నువ్వెంతున్నావు.. ఆ తిండేంటి?” తిట్లు తిడుతూ.. కొడ్తానని బెదిరించి, సోఫాలో కూలేశాడు. కళ్లు నులుముకుంటూ కూర్చున్నాడు వాడు.
చిన్నా కొత్త పిల్లలకేసి చూసి నవ్వాడు.
కానీ.. వాళ్లెవరూ వీడి మొహవన్నా చూడలేదు. నలుగురూ నాలుగు భాషలు. ఒకరు చెప్పేది ఇంకోరికి అర్ధం అవదు.
కార్టూన్లు మాత్రం అందరికీ అర్ధం అవుతాయి.
తాన్యా ఇంటిలోపలికి వెళ్లాడు, ఇప్పుడే వస్తానని.
చిన్నా లేచి టివీ ఛానల్ మారుద్దామని చూశాడు. ఓ కన్ను, తాన్యా వస్తున్నాడేమో అని తలుపు కేసి వేసి. న్యూస్ లో ఏమైనా చెప్తారేమో.. తమ గురించి.. అమ్మా వాళ్లెవరైనా కనిపిస్తారేమో!
ప్చ్.. టివీలో కార్టూన్లు తప్ప ఏం రావట్లేదు. మిగిలినవన్నీ బ్లాక్ చేసేశారు. అంత జాగ్రత్త తీసుకోకుండా ఉంటారా? ఈ రోజుల్లో రెండు మూడేళ్ల పిల్లలకి కూడా, సెల్ ఫోన్లు, టివీలు వాడడం వచ్చు కదా. ఇక్కడికి తీసుకొచ్చే పిల్లలకి కంప్యూటర్లు తెలియక పోవచ్చేమో కానీ.. టివీలు గుడిసెల్లో కూడా ఉంటాయి.
అందుకే జుట్టంకుల్ ఏం పట్టించుకోకుండా లోపలికెళ్లాడనుకున్నాడు చిన్నా. నిశ్సబ్దంగా వెళ్లి సోఫాలో కూర్చున్నాడు.
తాన్యా రెండు చేతులతో ఆరు చిన్న కప్పులు ఐస్క్రీమ్ తీసుకొచ్చి అందరికీ ఇచ్చాడు.
పిల్లల ముఖాలు వికసించాయి, చిన్నాది తప్ప.
చిన్నా గ్రహించేశాడు, మచ్చిక చేసుకుంటున్నారని.
కానీ.. ఇంకేదైనా దారి ఉందా అది తప్ప. చిన్నా కూడా మాట్లాడకుండా కప్పు తీసుకుని తినడం మొదలు పెట్టాడు.
అందరూ గంభీరంగా కార్టూన్లు చూస్తూ ఐస్క్రీమ్ తింటున్నారు.
అక్కడ ఐదారేళ్ల పిల్లలున్నట్లు లేదు.. క్రమశిక్షణతో ఉన్న సైనిక శిబిరం వాతావరణం కనిపిస్తోంది.
ఇద్దరు పిల్లలు, తింటూనే నిద్ర పోతున్నారు.
తాన్యా మధ్య మధ్య తలుపు తీసి చూస్తున్నాడు. ఆ ఇంటికి బెల్ ఉంది కానీ అది కొన్ని గదుల్లోనే మోగుతుంది.. తాన్యా, ఆనంద్ ల గదుల్లో.
రెండు కార్టూన్ షోలయ్యాక, తాన్యా నిరీక్షణ ఫలించింది. పోర్టికోలో కారు వచ్చి ఆగింది. బొద్దుగాడు లేచి ఇంకో ఐస్ క్రీమ్ అడుగుదామనుకుని ఊరుకున్నాడు. తిట్లు తప్ప ఇంకేవీ దొరకవని వాడికి తెలుసు.
తలుపు తీసి నవ్వుతూ, వచ్చిన వాళ్లని ఆహ్వానించాడు తాన్యా.
లోపలికి వస్తున్న వాళ్లని చూడగానే టింకూ లేచి పరుగెత్తాడు..
“అంకుల్! అమ్మ కావాలీ.. ఇవేళ పంపుతానన్నావుగా? తీసికెల్తున్నావా? నా బట్టలు వేసుకుని, జుట్టంకుల్ ఇచ్చిన బట్టలు అక్కడ పెట్టేస్తా.” ఆనంద్ కాళ్లు పట్టేసుకున్నాడు.
మిగిలిన పిల్లలు కదలను కూడా లేదు.
చిన్నాకి మాత్రం ఆనంద్ తో వచ్చినతన్ని చూస్తుంటే కాళ్లు వణికాయి.
అతను డాక్టరని చూస్తేనే తెలిసి పోతోంది. ఒకవేళ తన వయసు తెలుసుకుంటే.. వెనక్కి పంపేస్తారా? చంపేస్తారా.. తను చచ్చి పోయినా ఫరవాలేదు కానీ.. టింకూ వంటరి వాడై పోతాడు.
ఏం మాట్లాడకుండా కూర్చున్నాడు.
ఆనంద్ టింకూని లేపి ఎత్తుకుని బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు.
“తప్పకుండా తీసుకెళ్తా. ఈలోగా నువ్వు డాక్టర్ గారు చెప్పిన మాట వినాలి. సరేనా?”
“ఓ.. అలాగే..” టింకూ కిందికి జారి పరుగెత్తాడు.
డాక్టర్ మొదటగా టింకూని పక్క గదిలోకి తీసుకెళ్లాడు. బట్టలు విప్పి మొత్తం పరీక్ష చేశాడు. ఎత్తు బరువూ కొలిచాడు. రక్తం తీసుకున్నాడు పరీక్ష చెయ్యడానికి. ఎముకలన్నీ మెత్తని సుత్తితో కొట్టి చూశాడు.
ఆనంద్ ని చూసి తల నిలువుగా ఊపాడు.
“బ్లడ్ టెస్ట్ రిజల్ట్ తెలిశాక పూర్తి రిపోర్ట్ ఇస్తా.” నెక్స్ట్..
ఆనంద్ టింకూకి బట్టలేసి, బైటికి తీసుకొచ్చాడు. తాన్యా చిన్నాని లోపలికి తీసుకెళ్లాడు.
లోలోపల బెదురుగా ఉన్నా చిన్నా ధైర్యంగానే వెళ్లాడు. ప్రతీ నెలా డాక్టర్ల పర్యవేక్షణలో పెరుగుతున్నాడు చిన్నా. బుల్లి మనుషులకి వచ్చే ఎముకల సమస్యలింకా దరి చేర లేదు.
ఒక సంవత్సరం ఆగి వెన్నెముకకి, ఆ తరువాత చేతులకి కాళ్లకీ ఆపరేషన్లు చేస్తా మన్నారు, చిన్నాని క్రమం తప్పకుండా చూసే డాక్టర్లు.
ఆ ఆపరేషన్లు ఎందుకో కూడా అప్పడే వివరిస్తామన్నారు. దానికి అందరూ మానసికంగా తయారవుతుండగానే ఈ కిడ్ నాప్..
చిన్నాని కూడా బట్టలు విప్పి పరీక్ష చెయ్యడం మొదలు పెట్టాడు డాక్టరు. అంతలో అతని ఫోన్ మోగింది.
ఫోన్ లో మాట్లాడుతూనే, కొలతలన్నీ ముగించి, మెత్తని సుత్తి తీసి ఎముకలని పరీక్ష చేస్తున్నాడు. వెన్నెముక మీద కొడుతూ చూస్తుంటే కొద్దిగా నొప్పనిపించింది చిన్నాకి. అయినా కదలకుండా అలాగే పడుక్కున్నాడు.
ఫోన్ లో మాట్లాడ్డం ఐపోయాక, రక్తం తీసి, అప్పుడే వచ్చిన ఆనంద్కి అంతా సరే అన్నట్లు బొటనవేలు ఎత్తి చూపాడు.
తరువాత, ఒక్కొక్కళ్లనీ.. పిల్లలందరినీ చూశాడు డాక్టర్.
వెళ్తూ వెళ్తూ.. ఎవరెవరికి ఏమేం ఆహారం ఎంతెంతివ్వాలో కాగితం మీద రాసిచ్చాడు, తాన్యాని పిలిచి.
“ఆ కుర్రాడు ఇంకా నాలుగు కిలోలు తగ్గాలి. ఇందులో రాసిచ్చినట్లు.. కొంచెం కూడా మార్పు లేకుండా ఫాలో అవాలి.” బొద్దుగాడిని చూపించి గట్టిగా చెప్పాడు.
“ఎప్పుడూ ఆకలని చంపుతుంటాడు డాక్టర్. ఏం చెయ్యాలో తోచట్లేదు. మిగిలిన పిల్లలు బానే ఉన్నారు కదా!” తాన్యా మొత్తుకున్నాడు.
“కీరా దోసకాయలు ఇచ్చి నముల్తుండమను. రేపు థైరాయిడ్ టెస్ట్ చేసి చూస్తా. అప్పుడు ఏం చెయ్యాలో చూద్దాం. మిగిలిన వాళ్లు ఓకే.”
డాక్టర్ని పంపించి ఆనంద్ లోపలికి వచ్చాడు.
“రోజూ రెండుగంటలు అందరి చేతా డ్రిల్ చేయించు. పరుగులు, ఆటలు.. వ్యాయమం తప్పని సరిగా ఉండాలి. మీ ఇంటికి డబ్బు పంపాను ఇవేళ. చెప్పక్కర్లేదుగా.. ఏం చెయ్యాలో! సాధ్యమైనంత వరకూ ఒకళ్లతో ఒకళ్లు మాట్లాడకుండా చూడు.” తాన్యాకి ఆదేశాలిచ్చాడు.
“పిల్ల నాయాళ్లు. అంత తెలివేం ఉంటాది. తింటం కూడా తిన్నగా రాదు. పైగా భాషలు వేర్వేరు. ఏంచేస్తారు సార్?”
“ఏమో.. ఏం చెప్పగలం? మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఇంకా నెల పైన పడుతుంది డిస్పాచ్ చెయ్యడానికి.” ఆనంద్ జాగ్రత్తలు చెప్తుండగానే, తాన్యా తలుపు తియ్యడానికి పరుగెత్తాడు. సన్నగా బెల్ మోగినట్లైతే.
కామెరా చేత్తో పట్టుకునున్న ఒక పాతికేళ్లబ్బాయిని తీసుకొచ్చాడు. అతను ఒక్కొక్కళ్లనీ పిలిచి అందరికీ ఫొటోలు తీసి వెళ్లాడు.
“అంకుల్! అమ్మ..” టింకూ ఏడుపు మొదలెట్ట బోయాడు. వెంటనే తాన్యా వాడిని లోపలికి తీసుకెళ్లాడు.. చిన్నా కూడా వాళ్ల వెనుక పరుగెత్త బోతే ఆనంద్ పట్టుకుని ఆపేశాడు.
“ఏం చెయ్యడులే.. ఏడుపు తగ్గాక తీసుకొస్తాడు. ఇప్పుడు మీరందరూ వాడిని చూసి వర్సగా ఏడుపందుకుంటే కష్టం. టివీ చూస్తుండండి. ఇంక మీ అమ్మలనీ నాన్నలనీ మర్చి పోవాలి. తెలిసిందా!” చిన్నాని రెండు చేతులతో ఎత్తి, కళ్లలోకి చూస్తూ ధృడంగా చెప్పాడు.
నెమ్మదిగా చెప్పినా, గుడ్ అంకుల్ మాట్లాడుతుంటే భయం వేసింది చిన్నాకి. వణుకుతూ కిందికి జారి పోయాడు.
గదిలోకెళ్లగానే ఠపీమని ఏడుపాపేశాడు టింకూ. జుట్టంకుల్ ఏం చెయ్యలేడనీ, గుడ్ అంకుల్ దగ్గర పన్చేసే వాడనీ వాడికి తెలిసి పోయింది.
తాన్యా, టింకూలు హాల్లోకి తిరిగొచ్చాక.. మళ్లీ జాగ్రత్తలు చెప్పి ఆనంద్ వెళ్లి పోయాడు.

పరుగులు, ఆటలు అంటే గ్రౌండుకో, పార్కుకో తీసుకెళ్తారేమో అనుకున్నాడు చిన్నా. అక్కడి నుంచి పారిపోడానికి తోవ దొరక్క పోతుందా? ఎవరైనా కనిపించక పోతారా? అమ్మా నాన్నలకి వార్త పంపచ్చేమో..
మధ్యాన్నం భోజనాలవ్వగానే బయల్దేర దీశాడు తాన్యా పిల్లలందరినీ. టీవీ చూస్తూ కూర్చున్నా, నిద్ర పోయినా.. నాయాళ్లంతా బరువెక్కి పోతారు.. తాన్యాకి తిట్లు పడతాయి.
చిన్నా హుషారుగా టింకూ చేయి పట్టుకుని నడుస్తున్నాడు. కొత్త వాళ్లు కనిపిస్తే జుట్టువాడి కళ్లు కప్పి ఎలా మాట్లాడాలా అని..
అలాంటి వ్యాపారం చేసే వాళ్లు పకడ్బందీగా ఉండరా.. అంత సులభంగా దొరికి పోయేలాగుంటారా? అది తెలుసుకునే వయసు లేదు చిన్నాకి.
ఇంట్లోనే.. కాంపౌండ్ లో, వెనుక భాగం అంతా ఆట స్థలం కింద చేశారు. చిన్నపిల్లలు వ్యాయామం చెయ్యడానికి అనుకూలమైన పరికరాలన్నీ ఉన్నాయక్కడ. కబడి ఆడచ్చు. క్రికెట్ ఆడచ్చు. రన్నింగ్ రేస్ కి కావలసిన ట్రాక్స్ కూడా ఉన్నాయి.
అన్నీ ఐదారేళ్ల పిల్లలు కసరత్తులు చెయ్యడానికి వీలైనవే.
వెనుక పక్క మెట్లు దింపి తీసుకెళ్లాడు తాన్యా.
చుట్టూ చూశాడు చిన్నా.
జైలు గోడల్లా.. పెద్ద వాళ్లు కూడా దూకలేనంత ఎత్తుగా ఉన్నాయి. గోడలమీద గాజుపెంకులు ఎండలో మెరుస్తున్నాయి. కాంపౌండ్ వాల్ దగ్గరగా ఎక్కడా ఒక్క చెట్టు కూడా లేదు.
చెయ్యగలిగిందేవీ లేదు.
అంకుల్స్ చెప్పిన మాట వినడం తప్ప. తామందరినీ ఇందుకే పుట్టించాడేమో దేవుడు. ఎందుకు? ఏం చేయించాలని? ఏమో.. ఏం జరగబోతోందో వేచి చూడాల్సిందే అనుకున్నాడు చిన్నా.
జుట్టంకుల్ టింకూ ఏమేం చెయ్యగలడో చూస్తుంటే, నెమ్మదిగా బొద్దుగాడి దగ్గర చేరాడు చిన్నా. హిందీలో సంభాషణ మొదలెట్టాడు.
“ఏ ఊరు? నీ పేరు?”
“ఔరంగా బాద్. నా పేరు కిషన్. ఏడు రోజులయింది ఎత్తుకొచ్చి.” హిందీ వచ్చిన తోటి పిల్లవాణ్ణి చూసి ఏనుగెక్కినట్లు సంబర పడ్డాడు వాడు.
“ఎందుకెత్తుకొచ్చారో తెలుసా? డిస్పాచ్ అంటున్నారు. మనల్నేగా.. ఎక్కడికి పంపుతారో ఏమన్నా..”
తెలీదన్నట్లు అడ్డంగా తలూపాడు.
“నాకు మరాటీ కూడా అర్ధ మవుతుంది. ఎప్పుడూ సాయిబాబా గుడి దగ్గరుంటాను. పువ్వులమ్ముతాము. అక్కడికి మరాటీ వాళ్లు వస్తుంటారు కదా.. అందుకే!”
కిషన్.. ఆనందంతో గెంతులేశాడు.. చిన్నాకి దూరంగా వెళ్లి.
ఇసకలో పల్టీలు కొట్టాడు. లావుగా ఉన్నాడు కానీ, వాడి శరీరం చెప్పినమాట బాగానే వింటోంది.
“మనిద్దరం ఒక దగ్గర ఉన్నట్లు కనిపించ కూడదు. మాట్లాడ కూడదు. స్నేహం చెయ్య కూడదు. ఒకట్రెండు మాటలు కూడా..” పరుగెత్తుతూ వచ్చి చెప్పేసి మళ్లీ వెళ్లిపోయాడు.
చిన్నాకి అంతా అయోమయంగా ఉంది.
“కిషన్..మిగిలిన పిల్లలు.. ఎక్కడినుంచి వచ్చారు? అందర్నీ ఎవరు తీసుకొస్తారు?” తనుకూడా వాడు చేసినట్లే అటూ ఇటూ గెంతుతూ మధ్య మధ్య మాట్లాడ్డం మొదలెట్టాడు.
“వాళ్లంతా వేర్వేరు భాషలు. తమిళ్, కన్నడం మళయాళం. ఎవరికీ హిందీ రాదు. వాళ్ల భాష తప్ప.”
“ఇంగ్లీష్ వచ్చేమో?”
“నీకొచ్చా ఇంగ్లీష్?” ఆశ్చర్యంగా అడిగాడు కిషన్.
“ఆ.. నేను ఇంగ్లీష్ మీడియం. బాగా వచ్చు. కంప్యూటర్ కూడా ఆపరేట్ చెయ్యడం వచ్చు.” కిషన్ కి కొంచెం దూరంలో గుంజీలు తీస్తూ అన్నాడు చిన్నా.
ఇద్దరూ నెమ్మది నెమ్మదిగా జరుగుతూ తాన్యాకి వీలయినంత దూరంగా వెళ్లి మాట్లాడుతున్నారు.
“మీ అమ్మా నాన్నా వీళ్లకెందుకిచ్చారు మరీ? అంత మంచి స్కూల్ కి కూడా పంపుతున్నారు కదా?” కిషన్ కి మరింత ఆశ్చర్యం..
“అమ్మా నాన్నా ఇవ్వడం ఏంటీ.. ఎత్తుకొచ్చారు నన్నూ, టింకూనీ. అర్ధరాత్రి నిద్ర పోతుంటే. క్లోరో ఫామ్ ఇచ్చి మరీ. అమ్మా వాళ్లూ ఎంత కంగారు పడుతున్నారో. ఎంత ఏడుస్తున్నారో. మా నాన్న నాకోసం ఊరంతా తిరుగుతూ ఉంటాడు. నేనంటే ప్రాణం మా వాళ్లకి.” చిన్నాకి ఏడుపొచ్చింది. ఆగకుండా కన్నీళ్లొస్తున్నాయి. పాపం.. నాయనమ్మ ఏం చేస్తోందో!
“అవునా! నన్ను మా అమ్మా నాన్నానే వీళ్లకిచ్చేశారు. అన్ని పైసలు తీసుకుని. వీళ్లు చెప్పిన మాట వినాలనీ.. బాగా చదివిస్తారనీ, రోజూ ఐస్క్రీమ్ పెడతారనీ, ఏడవ కూడదనీ చెప్పి పంపేశారు.” చేతులు రెండూ బార్లా చాపి అన్నాడు. వారం రోజులయింది వాడు వచ్చి.
ఈసారి ఆశ్చర్యపోవడం చిన్నా వంతయింది.
తాన్యా మిగిలిన పిల్లలకి ఏమేం చెయ్యాలో చెప్పి, కిషన్, చిన్నాల దగ్గరకి వచ్చాడు, అనుమానంగా చూస్తూ.
కిషన్ ఆయాస పడుతూ నేల మీద కూర్చుండి పోయాడు.. నిజంగా ఆయాసం రాకపోయినా!
“ఏం చేస్తున్నారు మీరిద్దరూ?”
చేత్తో సైగ చేశాడు కిషన్.. తాను పరుగు పెడుతున్నట్లుగా.
చిన్నా అమాయకంగా చూశాడు.
“ఏం చెయ్యమంటావంకుల్? నాకు క్రికెట్ నేర్పించవా? ఈ కడ్డీ పట్టుకుని పైకి లేద్దామని చూస్తున్నా..”
“నీకు హిందీ వచ్చా?”
“రాదంకుల్.”
“టింకూ ఏమవుతాడు నీకు?”
“ఏమవడంగుల్. పక్కింటి పిల్లగాడు. అంతే.”
“అమ్మయ్య.. ఒకే ఇంటి నుంచి ఎత్తుకు రాలేదు కదా! నయమే.” మనసులో అనుకుని గట్టిగా నిట్టూర్చాడు.
చిన్నాని పుషప్స్ చెయ్యమని, కిషన్ ని గ్రౌండ్ చుట్టూ పరుగెట్టమని చెప్పి, తను టింకూ దగ్గరకెళ్లాడు. వాడు చాలా సున్నితంగా కనిపిస్తున్నాడు.. బాగా గట్టి పర్చాలి. ముందుగా గుంజీలు తియ్యమన్నాడు.

కొంచెం దూరంగా అందరూ కనిపించేలాగ చెట్టు కింద కూర్చుని, బీడీ వెలిగించాడు తాన్యా. బీడీ వెలిగించగానే పెళ్లాం గుర్తుకొచ్చింది.
బీడీలు చుట్టి చుట్టి దాని వేళ్లు ఎంత నల్లగా మారిపోయాయో.. ఆ వేళ్లు కనిపించాయి కళ్ల ముందు.
“థూ.. ఎదవ జల్మ. అదక్కడ, నేనిక్కడ. ఎందుకొచ్చిన పాట్లు?” రోజుకి ఇరనై సార్లన్నా అనుకుంటాడు.. తిట్టుకుంటాడు.
కానీ.. వదిలేసి వెళ్లటానికి లేదు. ఇక్కడ దొరికేది పాతిక వేలు. అదీ, తిండీ తిప్పలు, ఆ బాబే చూసుకుని పోషిత్తన్నాడు. తమ ఊళ్లో దొరకదు. పిల్లగాళ్లు కూడా.. ఏడాదికొకరు దొరుకుతే గొప్పే.
అర్ధాకలితో మాడాల్సిందే.
అదలా ఉంచుతే, పీక లోతు కూరుకు పోయాడు ఊబిలో. బైటికి రాగల అవకాశమేలేదు. తను లేకపోతే పిల్లలని చూసుకునే వాళ్లు లేకపోవడం ఒక కారణం.. అన్నీ తెలిసిన తనని ఆనంద్ వదుల్తాడా అనేది డౌటే. వదల్నే వదల్డు. మరీ పట్టు పడ్తే చంపేసినా చంపేస్తాడు.
ఇలాంటి వ్యవహారాల్లో, తనలాంటి వాళ్లు వెళ్ల దల్చుకుంటే పైకెళ్టవే.. వేరే దారి లేదు. ఒళ్లంతా పులిసిపోయినట్టుంది. పొద్దున్న లేచినప్పట్నుంచీ.. ఒకటే పని. కాస్త కూచోడానిక్కూడా లేదు.
పిల్లల్ని కాయటం ఏమంత మాటలు కాదు.. పైగా గాజు బొమ్మల్ని చూసినంత జాగ్రత్తగా!
కొత్త కూనలు రాత్రంతా నిద్రపోనీరు. ఏడుత్తానే ఉంటారు. వాళ్లని చూస్తుంటే.. ఎంత కరడు కట్టిందైనా తన మనసు కూడా అప్పుడప్పుడు పీకుతుంటుంది. ఆనంద్ బాబు లాగ ఉండగల్గితే..
ఆలా ఆలోచిస్తుంటే చిన్నగా కునుకు పట్ట బోయింది తాన్యాకి. పైనుంచి చిరు ఎండ గోరువెచ్చగా తగుల్తోంది. చల్లని గాలి. చెట్టు కానుకుని కళ్లు మూసుకున్నాడు.
తాన్యానే కనిపెట్టి చూస్తున్న చిన్నా పరుగెత్తుతూ కిషన్ పక్కకి చేరాడు.
“నిజంగా.. మీ అమ్మా, నాన్నా నిన్ను అమ్మేశారా?”
ఇద్దరూ, గోడ నానుకుని, నీడ పట్టున, తాన్యాకి కనిపించకుండా కూర్చున్నారు.
“అవును. వాళ్లందరినీ కూడా..” మిగిలిన పిల్లలని చూపించాడు.
“అందుకే మా కోసం ఎవరూ వెతకరు. వెతుకు తారని మేం అనుకోము. మాకు అంతా చెప్పే పంపారు. అందుకే మేం ఎవరం అమ్మా నాన్నల కోసం ఏడవం ఎప్పుడూ.”
“ఎందుకమ్మారు?”
“మేం ఇంట్లో చాలా మంది ఉంటాం కదా? చార్ భాయీ, చార్ బహిన్. అందరికీ పేట్ నిండాలంటే మమ్మల్ని అమ్మెయ్యాలి కదా! నా అన్నలిద్దరినీ కూడా అమ్మేశారు. ఇంట్లో.. ఇల్లంటే ఫుట్ పాత్ మీద గోడ నానుకుని టార్పాలిన్ కప్పిన జాగా. ఇంత పెద్ద ఇల్లు చూట్టం, ఇంట్లో ఉండటం ఇదే.” చాలా సాదాగా, అభావంగా చెప్పాడు కిషన్..
“అందుకేనా మీరెవరూ ఏడవటం లేదు.” చిన్నాకి ఇంకా వింతగానే ఉంది.
“మేం వచ్చి వారం రోజులయింది కదా! ఏడుపులన్నీ ఐపోయాయి. మా అందరికీ తెలుసు ఎక్కడికీ వెళ్లలేమని. వీళ్లే దిక్కనీ.” మామూలుగా అన్నాడు కిషన్.
చిన్నాకి తమ బస్తీకి దగ్గర్లో, గుడారాలేసుకుని ఉండే తండా గుర్తుకొచ్చింది. రోడ్ల మీదే వంట, అక్కడే అన్నం తినడం. ఐనా అందరూ నవ్వుతూనే ఉంటారే.. వాళ్లు కూడా అమ్మేస్తారా వాళ్ల పిల్లల్ని?
“మీరెక్కడుంటారు? నీతో ఉన్న ఆ అబ్బాయెవరు?” కిషన్ కొంచెం కుతూహలంగా అడిగాడు.
తమ గురించి చెప్పాడు చిన్నా. తను ఒక్కడే కొడుకునని, ఇంట్లో అందరికీ తనంటే ఇష్టమనీ చెప్పగానే కిషన్ కళ్లు అసూయతో ముడుచుకోవడం గమనించాడు. కానీ వెంటనే.. మామూలుగా అయిపోయాడు.
“మరి టింకూ?”
“మావి గవర్న్ మెంట్ కట్టిచ్చిన ఇళ్లు కదా.. మాకూ టింకూ వాళ్లకీ ఒకటే వరండా..” జానీ ఆంటీ గురించీ, మస్తానంకుల్ ఏంచేస్తాడో.. తాగి వచ్చి అందర్నీ ఎలా కసురుకుంటాడో.. అన్నీ చెప్పాడు.
కాసేపు ఆలోచిస్తూ ఉండి పోయాడు కిషన్.
“అయితే మీ మస్తానంకుల్ టింకూని అమ్మేసుంటాడు. వాళ్లు నిన్ను కూడా ఎత్తుకొచ్చారు.” చిన్నా సందేహాన్నిట్టే తేల్చేశాడు కిషన్.
పుట్టినప్పట్నుంచీ ప్రతీ మెతుక్కీ వెతుక్కుంటూ, పోరాటం చేస్తుంటే ఆ తెలివి అనుకోకుండా వచ్చేస్తుంది. ఐదేళ్లలోపే బాల్యం అంతరించి పోతుంది.

1 thought on “కలియుగ వామనుడు 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *