April 27, 2024

26. మరో సరికొత్త ఫేషన్

రచన: పెయ్యేటి శ్రీదేవి

 

‘ఊ……రైట్ తీసుకో, లెఫ్ట్, మళ్ళీ రైట్ తీసుకో…….మళ్ళీ లెఫ్ట్.  యూ టర్న్ తీసుకుని మళ్ళీ లెఫ్ట్, తరవాత రైట్ తీ………..’

‘ఇక మలుపులు చెప్పకండి మేడమ్.  డెడ్ ఎండ్ కొచ్చేసింది.’ అంది అసిస్టెంట్.

‘అయితే అక్కడ కలిపేసి, బారుగా దువ్వేసి, అటు ఇటు పొట్టిగా మధ్యన కట్ చేసి, నుదుటిమీద కొంచెం కట్ చేసి, చెంపలమీద కొచ్చేలా జుట్టు దువ్వి వదిలెయ్.’ అంటూ అసిస్టెంటుకి చెప్పింది బ్యుటీషియన్.

శోభన బ్యూటీపార్లర్ కి వెడితే తలకి వంకర టింకర పాపిడి తీయమని అసిస్టెంటుకి చెప్పటానికి రైట్ తీసుకో, లెఫ్ట్ తీసుకో అంటూ పాపిడికి మలుపులు ఎలా తిరగాలో చెప్పింది అసిస్టెంటుకి.

కొత్తగా తీయబోయే ‘సరికొత్త ఫేషన్’ సినిమాకి కొత్త హీరోయిన్ శోధనకి హెయిర్ ఎలా వుండాలో చెప్పింది ఫేషన్ డిజైనర్ సుహాని.  ఆమెది చాలా ఒత్తైన పొడుగు హెయిర్.  విగ్ పెట్టడం కుదరదని జూట్టంతా కట్ చేసి పడేసారు.

ఇంతలో హీరోయిన్ శోధనకి వేసే డ్రస్సులు కుట్టి తెచ్చాడు టైలర్ వీరాసామి.  అతనికి 75 ఏళ్ళు.  చిన్నప్పట్నించి, పాతతరం పెద్ద హీరోయిన్ల దగ్గర్నించి, ఇప్పటి కొత్త హీరోయిన్ల వరకు కాస్ట్యూమ్స్ అన్నీ వీరాసామే కుడుతున్నాడు.  పైగా అతని చేత కుట్టిస్తే సినిమా హిట్టవుతుందన్న సెంటిమెంట్ నిర్మాతలకు బాగావుంది.  కాస్ట్యూమ్ డిజైనర్ రత్నకిష్టం లేకపోయినా సెంటిమెంట్ వల్ల అతను ఎలా కుట్టినా ఊరుకోవల్సి వస్తోంది.  రత్న తండ్రి, తాత కూడా కాస్ట్యూమ్ డిజైనర్లుగా చేసారు.  తల్లి జూనియర్ ఆర్టిస్ట్ గా చేస్తోంది ఇప్పటికీ.  తండ్రి రాఘవులు అప్పటి హీరోలకి డూప్ గా వేసేవాడు.  ఒక సినిమాలో ఫైట్ చేస్తూంటే నడుం విరిగింది.  అప్పట్నించీ అతను మంచానికే పరిమితమయాడు.  అన్న ఈశ్వర్ కెమెరామన్ గా చేస్తున్నాడు.  అన్న మరో జూనియర్ ఆర్టిస్ట్ కనకమ్మని వివాహం చేసుకున్నాడు.  మొత్తానికందరూ హీరో హీరోయిన్లు. హాస్యనటులు కాకపోయినా సినిమాఫీల్డుకి సంబంధించిన వాళ్ళే.  అందరూ ఒకే యింట్లో సఖ్యతగా జీవిస్తున్నారు.  తండ్రి మాత్రం ఇంటోనే వుంటాడు.  అందరూ సినిమాకి సంబంధించిన పనులకి బైటికెళిపోయేవాళ్ళే. రాఘవులికి తిండి దగ్గర్నించి అన్నీ అమర్చి వెడతారు.

రత్న సినిమాలో వేసే కాస్ట్యూమ్స్ అన్నీ వీరాస్వామి ఎలా కుట్టాడోనని ఒకటొకటే పరిశీలించి చూస్తోంది.
ఒక పొడవాటి గౌను చుట్టూ ఎంబ్రాయిడరీ చేసి అందంగా వుంది.  మరో గౌనూ ఇంచుమించు అలాగే వుంది.  ఈ మోడలు నే చెప్పినట్లు లేదే అనుకుంటూ, జీన్సు ఫేంటు చూస్తూ, ‘ఇదేంటిలా రెండుకాళ్ళూ పొడుగ్గా కుట్టావు?  ఒక కాలు పొట్టి, ఒక కాలు పొడుగు కుట్టాలన్నాగా?  మోకాలి మధ్యలో కన్నాలు పెట్టాలన్నాగా?  పైన ఈ టీషర్టు రెండుచేతులు సమంగా కుట్టావేమిటి?  ఒక చెయ్యొక్కటి కుట్టి, రెండోవైపు బుజం దిగేలా మెడ వుండాలన్నాగా?’

‘దేవుడు రెండు చేతులు సమానంగా ఇచ్చాడు కదమ్మా?  ఒక చెయ్యే కుడితే అవకరంగా వుండి, చూసేవాళ్ళ దృష్టి కూడా అవకరంగా వంకరగా వుంటుంది కదమ్మా?  అందుకే ఇలా కుట్టానమ్మా.’

‘ఏమయ్యా, కాస్ట్యూమ్స్ డిజైనర్ నేనా, నువ్వా?  నీ మాట నే వినాలా?  నా మాట నువ్వు వింటావా?  ఇదిగో, ఈ ఫ్రాక్ ఏంటి ఇలా కుట్టావు?  చుట్టూ నలభైఐదు చీలికలు పెట్టమంటే ముఫ్ఫైయే పెట్టావు.  నడుం చుట్టూ పది కన్నాలు పెట్టమంటే నాలుగే పెట్టావు. మెడ లేకుండా, చేతులు దిగేలా పెట్టి కుట్టమన్నాను.  ఇలా కుట్టావేంటి?  అసలే మన సినిమా ‘సరికొత్త ఫేషన్’ సినిమా.  ఈ సినిమా చూసి అందరూ సరికొత్త ఫేషన్ అంటూ ఈ డ్రస్సులే వెయ్యాలి.’

‘అది కాదమ్మా.  అలా కుడితే అప్పడాలపిండి ముద్దకి బట్టలతికించినట్టుంటుంది.  అలా చిరుగులు, చిల్లులు పెడితే బుడబుక్కల వాళ్ళ లాగానో, బొంతలు కుట్టే వాళ్ళలాగానో, బట్టల స్టాండుకి బట్టలు తగిలించినట్టు గానో వుంటుందమ్మా.  శరీరమంతా కనబడుతే ఏం బాగుంటుంది చెప్పండి?  చేతులు, కాళ్ళు, శరీరం బట్టలలో పడుండాలి కనిపించకుండా.  బట్టలబైటికి కనిపించకూడదు.  పాతకాలం హీరోయిన్లు అలాగే వుండేవారు కదమ్మా?’

‘ఇక నీకు చెప్పలేను గాని, నేను మరొకళ్ళని పెట్టుకుంటాను గాని నువ్వొద్దులే.  అవునూ, ఆ పొడుగు గౌను ఫ్రిల్సున్నది, నేను చెప్పలేదే, అదెందుకు కుట్టావు?’

‘ఇది మరో సినిమాకి కాస్ట్యూమ్.  పొరబాటున ఇందులో కలిసింది.’ అన్నాడు వీరాసామి.

‘ఎవరిదా సినిమా?’

‘విశ్వం నిర్మాతగా, రామబ్రహ్మం గారి దర్శకత్వంలో అదీ ‘సరికొత్త ఫేషన్’ పేరే అనుకుంటా, సరిగా వివరం తెలియదు.’

‘అదేమిటి, మా సినిమా పేరు అదే కదా?  మళ్ళీ వాళ్ళు ఈ సినిమా టైటిల్ పెట్టుకోవడం ఏమిటి?  వేరే పేరు మార్చుకోమని చెప్పు.’ అంది రత్న.

‘మీరూ మీరూ చూసుకోండమ్మా.  మధ్యన నాకెందుకు?  నే పోతా.  డబ్బులియ్యండమ్మా.’

‘నేనివ్వనయ్య.  నే చెప్పినట్టు ఒక్కటీ సరిగా కుట్టలేదు.’

‘ఇలాగియ్యండమ్మా ఆ బట్టలు.’ అంటూ ఆవిడ చెప్పిన ప్రకారం కన్నాలు, చీలికలు చేసాడు.  జీన్ ఫేంటుకి మోకాళ్ళ దగ్గర కత్తెరతో చింపాడు.  ‘ఇదిగోమ్మా, మీరు చెప్పిన సరికొత్త ఫేషన్.’ అంటూ డబ్బు తీసుకుని వెళిపోయాడు గొణుక్కుంటూ.

ఆ రాత్రి టి.వి. చానెల్లో ‘సరికొత్త ఫేషన్’ సినిమా ఫంక్షన్ జరిగింది.  కాస్ట్యూమ్ డిజైనర్ రత్న, నిర్మాత కుంజన్ మౌళి తో చెప్పింది, ఇంకొకళ్ళు కూడా ఇదే పేరుతో సినిమా తీస్తున్నట్టు.  పేరు మార్చుకోమని ఇద్దరూ వాదులాడుకున్నారు.  పేపర్లు, టి.వి. చానెళ్ళలో ఇదే విషయం చర్చనీయాంశమైంది.  మేం రిజిస్టర్ చేయించుకున్నాం అని కుంజన్ మౌళి వాదించాడు.

తర్వాత ఫిల్మ్ ఛాంబర్ కి వెళ్ళి రిపోర్టిచ్చాడు.  ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు వినోద్ కుమార్ తో నిర్మాతలిద్దరూ ‘సరికొత్త ఫేషన్’ టైటిల్ ముందర నేను పెట్టానంటే నేను పెట్టానని గొడవ చేసారు.  ఎవరైతే ముందర నాకు కంప్లైంట్ చేసారో వారి సినిమా టైటిల్ ‘సరికొత్త ఫేషన్’ గానే వుంచి, విశ్వం నిర్మాతగా ఉన్న సినిమాకి ‘మరో సరికొత్త ఫేషన్’ అని పేరు పెట్టమన్నారు.  ఇదేదో బాగుందనుకుని నిర్మాతలిద్దరూ శలవు తీసుకుని వచ్చేసారు.

నెలరోజుల్లో రెండు చిత్రాలూ ఒకేసారి విడుదలయ్యాయి.  ‘సరికొత్త ఫేషన్’ చిత్రం ముందర బాగా ఆడినా, తర్వాత వెనకబడింది.  ‘మరో సరికొత్త ఫేషన్’ చిత్రం అన్నీ కేంద్రాలలో విజయవంతంగా ప్రదర్శింపబడి సూపర్ డూపర్ హిట్టయింది.

అప్పటికే కొన్ని మార్పుల తేడాతో ‘సరికొత్త ఫేషన్’ డ్రస్సులు వేస్తున్న యాంకర్లు, హీరోయిన్లు, కాలేజీ అమ్మాయిలు ‘మరో సరికొత్త ఫేషన్’ డ్రస్సులు వేసుకుని మురిసిపోతున్నారు.

లంగా, ఓణి, చీర, లైనుగా పాపిడి తీసిన పొడవాటి జాడ, జడకుప్పెలు, చేతులకి నిండుగా గాజులు, నుదుట బొట్టు, ఇంకా పొడవాటి సిండ్రిల్లా గౌన్లతో  ‘మరో సరికొత్త ఫేషన్’ సినిమాలో వున్నాయి.  మార్కెట్లోకి కూడా మరో సరికొత్త ఫేషన్ డ్రస్సులు వచ్చేసాయి.

చేతులు, కాళ్ళు కనబడేలా చిల్లులు, ఎగుడు దిగుడు డ్రస్సుల కన్నా ఈ ‘మరో సరికొత్త ఫేషన్’ డ్రస్సులు అందరికీ ఎంతో నచ్చాయి.  ఎక్కడ చూసినా అవే డ్రస్సులు.  ఇన్నాళ్ళూ తెలియని అజ్జానంతో, అదే నాగరికమనుకుని, అనాగరికంగా తమ శరీర భాగాలను,తమ అందాలను అందవికారమైన డ్రస్సులతో పారబోసినందుకు యాంకరమ్మలు, నటీమణులు ఎంతో దిగులు చెందారు.

తమ ‘సరికొత్త ఫేషన్’ సినిమా జత దినోత్సవం అయితే, ‘మరో సరికొత్త ఫేషన్’ శతదినోత్సవం చేసుకుని విజయ ఢంకా మోగించింది.

కాస్ట్యూమ్ డిజైనర్ రత్న చాలా బాధ పడింది.  వీరాసామి కుట్టి తెచ్చిన దుస్తులు సరికొత్త ఫేషనంటూ ఇంకా చిల్లులు, చీలికలూ పెట్టలేదేమని అడిగింది.  ఇదే మీరనుకున్న సరికొత్త ఫేషనంటూ ఇంకా కన్నాలు పొడిచి మరిన్ని చీలికలు చేసాడు.  జీన్ ఫేంటుకి అమెరికా ఫేషనంటూ మోకాళ్ళ దగ్గర అడ్డంగా చింపేసాడు.  అతను మరో సరికొత్త ఫేషన్ సినిమాకి కుట్టి తెచ్చిన చుట్టూ ఫ్రిల్సున్న పొడవాటి సిండ్రిల్లా గౌను నిజానికెంతో బాగుంది.  ఇప్పుడా గౌన్లు మార్కెట్ లో బాగా అమ్ముడు పోతున్నాయి.

ఉన్నట్లుండి రత్న పన్నెండేళ్ళ కూతురు శ్రావ్య మరో సరికొత్త ఫేషన్ లంగా ఓణి వేసుకుని తిన్నగా లైనుగా పాపిడి తీసుకుని పొడుగ్గా జడకుప్పెలు వేసుకుని, తలలో కనకాంబరాల మాల వేసుకుని, తల్లి రత్న దగ్గరకొచ్చి, ‘అమ్మా!  ఈ ‘మరో సరికొత్త ఫేషన్’ డ్రస్సు ఎలా వుంది?  ఇవాళ నా పుట్టినరోజు కదా, అమ్మమ్మ కొంది.’ అంటూ రత్న కాళ్ళకి దణ్ణం పెట్టింది.  రత్న ఎప్పుడూ చూడని తన కూతురు అందాన్ని ‘మరో సరికొత్త ఫేషన్’ డ్రస్సులో చూసి మురిసిపోయింది.

తాత, అమ్మమ్మ కాళ్ళకి నమస్కారం చేస్తూ, ‘ఎలా వుంది తాతయ్యా, ఈ ‘మరో సరికొత్త ఫేషన్ డ్రస్సు?’ అని అడిగింది శ్రావ్య.

తాతయ్య నవ్వేస్తూ, ‘ఈ డ్రస్సు కొత్తదేం కాదమ్మా.  ఇరవైఏళ్ళ క్రితం నాటిదే.  అప్పుడందరూ ఇవే వేసుకునేవారు.’ అన్నాడు.

‘మరేంటి, ‘మరో సరికొత్త ఫేషన్’ డ్రస్సు అన్నారు?’

‘బాగా మొట్టమొదటి ఆదిమానవుడు బట్టలు లేని కాలంలో ఆకులు, అలములు చుట్టుకుని బతికాడు.  తరవాత్తరవాత అన్నీ కనిపెట్టడం నేర్చుకుని బట్టలు తయారు చేసి ఒంటినిండుగా బట్టలు కట్టుకోవడం మొదలు పెట్టాడు.  ఇంకొంచెం బాగా తయారవాలని పంజాబీ డ్రస్సు, చేతులకి బుట్టచేతులు కుట్టించుకున్నారు.  ఇంకొంచెం ముందరకొచ్చి రకరకాల అందమైన ఫేషన్లు వచ్చాయి.  అవీ అందంగానే వుండేవి.

ఇంకొంచెం ముందరకొచ్చి అమెరికా, ఆస్ట్రేలియాలు వెళ్ళిరావడాలు ఎక్కువై, అక్కడ సినిమా షూటింగులు ఎప్పుడైతే మొదలయ్యాయో, అక్కడి డ్రస్సులు చూసి అక్కడ కన్న ఎక్కువగా ఫేషన్ పేరుతో అనేకరకాల డ్రస్సులు వచ్చాయి.  రానురాను పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు ఈ ఫేషన్లు ఇన్ని వెర్రితలలు వేస్తోందంటే ఉన్న రెండు చేతులు, రెండు కాళ్ళకి చేతులు దిగేలా గౌన్లు, మోకాళ్ళు కనబడేలా పొట్టి డ్రస్సులు, చీలికలు, పీలికలు, కన్నాల డ్రస్సులు వెయ్యడం మొదలుపెట్టారు.  ఇవేం ఫేషన్లమ్మా?  అందమైన చీర కట్టుని కూడా అపభ్రంశం చేసి కడుతున్నారు.  ఉండవలసిన చోట పమిట ఉండదు.

మనిషికి నిండుగా బట్టలుంటేనే హుందాతనం, గౌరవం, ఆరాధనాభావం కలుగుతుంది.  ఫేషన్ పేరుతో బొట్టు లేకుండా, జుట్టు కత్తిరించి విరబోసుకుని, పీలికల డ్రస్సులు వేసుకుంటే చూసేవాళ్ళకీ వికృతమైన ఆలోచనలు కలుగుతాయి.  ఫేషన్ గా ఉండడం తప్పు కాదు.  ఫేషన్ అంటే ఏమిటో, ఎలా వుండాలో తెలీకుండా, ఫేషన్ పేరుతో దాచుకోవలసిన శరీరభాగాలు బయటకు కనిపించేలా చీలికలు,  పీలికలు, చిల్లులు, కన్నాలు ఉన్న దుస్తులు ధరించి అసభ్యంగా తయారయినందువల్ల చూసేవాళ్ళ మనోభావాలు దెబ్బతిని,వాళ్ళమీద ఏమాత్రం గౌరవభావం లేకుండా, వికృతమైన ఆలోచనలు కలుగుతాయి.

ఒకప్పుడు బట్టలు లేక, కొనుక్కునే స్తోమత లేక పేదవాళ్ళు చిరుగుల బట్టలు వేసుకునేవారు.  ఇప్పుడు బాగా డబ్బున్నవాళ్ళు, సినిమావాళ్ళు చాలా ఖరీదు పెట్టి చిరుగుల బట్టలు వేసుకుంటున్నారు.  ఎందుకమ్మా ఈ వెర్రిమొర్రి ఫేషన్లు?

అందుకే ఈ ‘మరో సరికొత్త ఫేషన్’ లో చాలా అందంగా వున్నావు శ్రావ్యా.  ఇంక ఈ ఫేషన్ మార్చకు.  ఇలాగే వుండు.’ అంటూ శ్రావ్య తాతయ్య సందేశాత్మకంగా చెప్పాడు.  కాస్ట్యూమ్ డిజైనర్ రత్నకూడా తండ్రి మాటలు శ్రధ్ద్ధగా వింది.

ఇకనుంచి సినిమాలకి ఇలాంటి ‘మరో సరికొత్త ఫేషన్’ కాస్ట్యూమ్స్ డిజైన్ చెయ్యాలనుకుంది రత్న.

 

———————–

 

 

1 thought on “26. మరో సరికొత్త ఫేషన్

  1. కధ చాలా బాగుందమ్మా… భూమి గుండ్రంగా ఉండును అన్నట్లుగా తిరిగి తిరిగి ఆనాటి బట్టలు, నగలే మళ్ళీ మన తళుకుల తారలకు, ఏంకరమ్మలకు నచ్చే రోజు త్వరలోనే వస్తుంది. సందేహమే లేదు. ఇప్పటికే అప్పటి వారు వాడిన తరహా నగలు వాడడం మొదలైపోయింది. ఆ దారిలోనే బట్టలు కూడా త్వరలోనే ధరిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *