April 26, 2024

25. లాస్ట్ డే

రచన: సౌజన్య కిరణ్

 

అప్పుడే కార్ పార్క్ చేసి దిగిన నాకు దూరం గా వస్తున్న రమ్య కనిపించింది .నేను తనను పిలిచేలోపే తాను నన్ను చూసి గట్టిగా “హాయ్ ..సీత “అని తానే పరుగు లాంటి నడకతో నా దగ్గరకు వచ్చింది.నేను ఎదో అడిగేలోపే తను “ఏంటి …ఈవాళ నువ్వు డ్రైవ్ చేసుకుని వచ్చావు ….రామం గారు ఎక్కడ ? ” అంది రమ్య

“రామం కి వాళ్ళ ఆఫీస్ వాళ్ళు తనకు సెండాఫ్ పార్టీ ఇస్తున్నారు అందుకే ప్రొద్దున్నే వెళ్లిపోయారు రాత్రికి కానీ రారు .పిల్లలు రేపు వస్తారు .మాతో నాలుగు రోజులు ఉండి మళ్ళి   వాళ్ళు వాళ్ళ దారి మేము మా దారి .అందుకు నాకు డ్రైవ్ చేయక తప్పింది కాదు ” అన్నానేను.

“ఇరవై ఏళ్ల తరువాత మళ్ళీ ఇండియా వెళ్లిపోవడం అంటే జీవితం లో చాలా పెద్ద చేంజ్ కదా ?ఇక్కడికి వచ్చిన ప్రతివాళ్ళు నాలుగు రాళ్లు వెనకేసుకొని వెళ్ళిపోదామని వస్తారు కానీ అలా వెళ్లిపోయే వాళ్ళు చాలా తక్కువ.అలా అనుకున్న పని అయిన వెంటనే వెళ్లిపోతున్ననిన్ను చూస్తూనే చాలా ఆనందం గా ఉంది సీత “.

“మేము ఇక్కడికి వచ్చిన పని అయిపొయింది రమ్య ….బరువులు భాద్యతలు తీరిపోయాయి .పిల్లలు వాళ్ళ వాళ్ళ ఉద్యోగాలలో సెటిల్ అయ్యారు .ఇంకేం కావాలి చెప్పు జీవితానికి ………నువ్వు అన్నట్టు ఎదో నాలుగు రాళ్ళూ వేనేకేసుకోవడానికి ఇక్కడికి వచ్చాము కానీ లేకుంటే  ఈ దేశం లో మాకు ఎవరున్నారు ?కానీ ఒక్కటి నేను నీకు ఎప్పటికి రుణ పడిపోయాను .నువ్వే కనుక ఈ ఉద్యోగం గురించి చెప్పక పోయిఉంటే మా భాద్యతలు మేము ఇంత త్వరగా పూర్తి చేయగలిగే వాళ్ళమే కాదు.

నేను, రామం ……నీది భాస్కర్ గారి మేలు ఎప్పటికి మరువలేము  .రామం రోజులో ఒక్కసారన్నా ఈ విషయం గుర్తుచేసుకుంటారు.ఇన్ని రోజులు ఇక్కడ మీతో అలవాటు అయిపోయి మిమ్మల్ని వదలి వెళ్ళాలి అంటే చాలా భాద గా ఉంది.ముఖ్యం గా నిన్ను రమ్య నాకు నా అక్కాచెల్లళ్ళ కన్నా నువ్వు ఎక్కువ అయిపోయావు  .నీలాంటి మనిషి స్నేహం నాకు దొరికినందుకె  అందరిని వదలి ఇక్కడికి వచ్చి ఇంత కాలం ఉండగలిగాను .నీ స్నేహం మరువరానిది “.

“చాల్లే సీత నా దండకం …టైం దొరికితే చాలు మునగ చెట్టు ఎక్కిస్తావు .నువ్వు మాథ్స్ చెప్పే పద్దతి నాకు చాలా నచ్చింది అందుకే నేను నిన్ను రికమండ్ చేశాను ..నువ్వు ఎక్కువ జీతం వచ్చే సాఫ్ట్ వెర్ జాబ్ వదులుకుని ఈ టీచర్ ఉద్యోగమే కావాలని చేరావు .నేను పెద్ద గా ఏమి చేశాను “.  ఈ మాటల్లో ఉండగానే దూరం గా బెల్ మోగిన శబ్దం తో మా మాటల  లోకం నించి బయటకు వచ్చి స్కూల్  వైపు నడిచాము.

నాకు ఫస్ట్ పీరియడ్  క్లాస్ లేదు.అందుకే నా రూమ్ లో కూచున్నాను. ఈ రోజు ఈ స్కూల్ లాస్ట్ డే .నా ఉద్యోగం కు లాస్ట్ డే .వచ్చే వారం ఈ పాటికి ఇండియా లో నా వాళ్ళ దగ్గర ఉంటాను.రామం తో నా పెళ్లి అయ్యేనాటికి వాళ్ళ ఇంట్లో ఒకరు కూడా స్థిర పడలేదు .పెద్దకొడుకు గా అందరిని ఒక దారిలో పెట్టె భాద్యత తన మీదే ఉందని పెళ్ళికి ముందే చెప్పారు పాపం .ఇండియా లో మా ఇద్దరికీ వచ్చే జీతం తో ఎనిమిది మంది కి అన్ని చేయాలంటే చాలా కష్టం అనుకుంటూ ఉండంగానే దేవుడు పంపినట్టు రామం స్నేహితుడు ఇక్కడ తమ కంపెనీ లో ఉద్యోగాలు ఉన్నాయి అనే తానే అన్ని దగ్గర ఉంది చూసుకుని ఇక్కడికి రప్పించారు.ఇక్కడికి వచ్చాకా నాలుగు ఇళ్ల అవతల  ఉన్న రమ్య పరిచయం అయ్యింది.తాను అప్పుడే స్కూల్ లో ఉద్యోగం మొదలుపెట్టింది.నేను ఎం.స్సీ మాథ్స్ చేశాను అంతకు ముందు టీచర్ గా పని చేసానని తెలిసి నన్ను వాళ్ళ స్కూల్ లో ఉద్యోగానికి  రెకమండ్ చేసింది.ఇద్దరూ ఉద్యోగాలు చేయబట్టి ఆడపడచుల పెళ్లిళ్లు అన్ని త్వరగా చేయగలిగాము.పిల్లలను సెటిల్ చేసాము .టీచర్ ఉద్యోగం నాకు ఇండియా లో చిన్న ఇల్లు ఇంటి చుట్టూ గార్డెన్, పుస్తకాలు  చదువుతూ శేష జీవితం గడిపేస్తే చాలు ఈ జీవితానికి అంత కన్నా వేరే ఆశ లేదు  .

నాకు ఇక్కడికి వచ్చిన కొత్తలో ప్రతి విషయనికి ఎంత భయం గా ఉండేదో రమ్య నాకు అన్ని చెప్పి నాకుండే భయం పోగొట్టింది.రామం ఎప్పుడు జోక్ చేస్తారు “నా అమాయకమైన   సీతను  డెర్యసాహసాలు కల  ఝాన్సీ లక్ష్మి బాయ్ చేసారండి రమ్య మీరు “అని.

ఇంతలో ఫస్ట్ పీరియడ్ అయిపోయినట్టు మోగిన బెల్ నన్ను మళ్ళీ ఈ లోకం లోకి తెచ్చింది.

క్లాస్ లోకి అడుగు పెట్టిన వెంటనే ఎందుకో కుడికన్ను అదిరింది.ఒకవైపు నేను ఇవి అన్ని వదిలేసి వెళ్ళిపోతున్నానని భాద గా ఉంది.కుడి కన్ను అదరడం చెడుకు సంకేతం అంటారు ఏమవుతుందో  ఏమో ?వెంటనే రామం మాట గుర్తుకు వచ్చింది “అమెరికా వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా ఇంకా నువ్వు ఆ పల్లెటూరు సీతా మహా లక్ష్మివే  ….ఒక్కో సారి విటమిన్ డెఫిసిఅన్సీ ఉంటె, స్ట్రెస్  ఉంటె కూడా అలా కన్ను అదురుతుంది “అని ఒక నవ్వు నవ్వేస్తారు.స్ట్రెస్ వల్ల కూడా అయిఉండచ్చు అని నన్ను నేను సమాధానపరచుకుని క్లాస్ లో అడుగుపెట్టాను .పిల్లలందరూ ఒక్కసారి “గుడ్ మార్నింగ్ మిస్సెస్ రామం “అన్నారు.

ఇక్కడ పిల్లలు టీచర్స్ ని పేరు పెట్టి పిలుస్తారు .నన్ను నా పేరు కాకుండా మా వారి పేరు పెట్టి పిలవడం చాలా వింత గా అనిపించేది .ఆ పిలుపు అలవాటు కావడానికి చాలా సమయం పట్టింది.

ఇండియా కి ఇక్కడికి చదువు చాలా తేడా ఇక్కడ పిల్లలను కొట్టడం లాంటివి చేయకూడదు కానీ చదువు చెప్పడం ఎక్కడయినా ఒక్కటే క్లాస్ లో రకరకాల పిల్లలు ఉంటారు ఒక్కొక్కరికి ఒక్కోరకం గా ఉంటారు వాళ్లకు అర్థం అయ్యేలా చెప్పడం ఒక సవాలు అది నాకు చాలా ఇష్టం .

ఇది సీనియర్ క్లాస్ వీళ్ళు వచ్చే సంవత్సరం కాలేజీ కి వెళ్ళిపోతారు .చాలా మందికి మంచి మంచి కాలేజీలలో సీట్స్ వచ్చాయి .ముగ్గురు నలుగురికి హార్వర్డ్ ,కొలంబియా లాంటి మంచి కాలేజ్ లో సీట్స్ వచ్చాయి.వాళ్ళు వచ్చి ఆ విషయం చెప్తే ఏంటో సంతోషం అనిపించింది.ఈ క్లాస్ తో నాకు ఉన్న అనుభందం వీళ్ళు ఈ  స్కూల్ లో చేరిన రోజు నించి మొదలు అయింది  వీళ్ళు ఒక్కో క్లాస్ పెరిగే కొద్దీ వాళ్లతో పాటి నాకు ప్రమోషన్స్ వచ్చి వాళ్ళ క్లాస్ కె వచ్చేదాన్ని అలా వాళ్ళు పెరగడం నేను చూస్తూనే ఉన్నాను..వీళ్ళు నా పిల్లల లాగానే అనిపిస్తారు .ఈ రోజుతో ఈ అనుబంధం తీరిపోతుందంటే చాలా భాద గా ఉంది.

ఈ రోజు వీళ్ళ కి  లాస్ట్ క్లాస్  ఈ స్కూల్ లో నాకు లాస్ట్ క్లాస్ ఈ స్కూల్  అంతా విడిపోయేముందు సరదాగా గడుపుదామని డిసైడ్ చేసాము .ప్రతి సంవత్సరం లాస్ట్ డే మాథ్స్  క్విజ్ పెట్టి గెలిచినా వాళ్లకు మంచి గిఫ్ట్ ఇస్తానని చెప్పాను అందుకే అందరు చాలా ఉత్సహం గా ఉన్నారు .నేను క్లాస్ లో అందరి పిల్లలను నాలుగు జట్టులు గా విభజించి ఆట మొదలుపెట్టాము .పిల్లలు చాలా ఉత్సహం గా  ఆడుతున్నారు .ఇంతలో బయట “థడ్…..థడ్ ….థడ్ “అని చెవులు చిల్లులు పడేలా పెద్ద శబ్దం వినిపించింది.అందరికి విపరీతం గా భయం వేసింది.ఈ మధ్య జరుగుతున్న సంఘటనలు అలాంటివి .కానీ మేము ఉన్న సిటీ చాలా ప్రశాంతం గా ఉంటుంది.ఇక్కడ ఒక కార్ ఆక్సిడెంట్ జరగడమే పెద్ద విషయము . అలాంటిది  ఇప్పుడు ఇలా ఏమయిఉంటుంది .వెంటనే నా టేబుల్ పక్కనే ఉన్న అలారం మోగించాను .అలా మోగిస్తే స్కూల్ అంతా లాక్ డౌన్ లోకి వెళ్ళిపోతుంది.ఈ మధ్య ఈ దేశం లో జరుగుతున్న సంఘటనల వల్ల అది తప్పకుండా చెయ్యాలి .

పిల్లలు ఆ శబ్దం విని అటు ఇటు పరుగులు పెట్టె లోపు నేను వాళ్ళను వాళ్ళు ఉన్న చోటి నించి కదలొద్దని సైగ చేసి తలుపు లాక్ చేయడానికి అటు వైపు వేగం గా  అడుగులు వేసాను  నేను రెండు అడుగులు వేసానో లేదో అంతలోనే తలుపు ధడాలున తెరుచుకుంది .ఒక వ్యక్తి వేగం గా లోపలికి వచ్చి తలుపు మూసి లాక్ చేసాడు.తన చేతిలో ఒక పెద్ద గన్ ఉంది .అది  ఏ రకం గన్ అనేది నాకు తెలియదు.గన్ ఏ రకంది అయినా దాంట్లో నించి వచ్చే బులెట్ ప్రాణాలు తీస్తుంది కానీ ప్రాణాలు నిలబెట్టదు కదా  అది చాలు కదా మనిషి లో భయం నింపడానికి .తన భుజాలకు ఇరువైపులా తూటాలు దండ లా వేలాడుతున్నాయి .ముఖానికి చుట్టూ నలుపు చారలు పూసుకుని భయంకరం గా కనిపించడానికి ప్రయత్నం చేసాడు కానీ ఆ ముఖం లో పసిదనపు ఛాయలు పోలేదు .కొంచెం పరీక్ష గా చుస్తే అప్పుడు అర్థం అయ్యింది ఆ అబ్బాయి పోయిన సంవత్సరం  వరకు ఈ పిల్లలతోనే చదివి అటెండన్స్ లేదని అదే క్లాస్ లో ఉండిపోయాడు. పేరు ఆడమ్ .ఈ మధ్య కాలం లో నేను తనను చూడనే లేదు.ఇప్పుడు ఇలా ఇక్కడ ?.

నేను ఈ ఆలోచనలో ఉండగానే “ఈ రోజు ఇక్కడ ఉండే ఎవరు బ్రతకరు ….అందరు నా చేతిలో చావాల్సిందే.కాలేజీ కి వెళ్ళిపోతాము అని చాలా సంతోషం గా ఉన్నారేమో ? అది మటుకు జరగదు .నేను మిమ్మల్ని చదవనివ్వను .” అన్నాడు గట్టిగా అరుస్తూ.

నావైపు చూసి “మిస్సెస్ రామం ….మీతో నాకు ఎలాంటి శత్రుత్వము లేదు …మీరు బయటకు వెళ్లిపోవచ్చు .ఇక్కడే ఉంటె ఈ 36  మందితో పాటు మీ ప్రాణాలు పోవడం మాత్రం సత్యం .మీకు రెండు నిముషాలు టైం ఇస్తాను .డిసైడ్ చేసుకోండి” అనేసరికి నాకు ఏమి చేయాలో అర్థం కాలేదు .ఒకసారి చుట్టూ చూసాను.నా కళ్ళ ముందు పెరిగిన పిల్లలు వీళ్ళను వీళ్ళ ఖర్మకు వదలి  ఎలా వెళ్ళగలను .కళ్ళ ముందు బంగారం లాంటి భవిష్యత్తు ను ఉహించుకుంటన్న వీళ్ళ జీవితం ఈ రోజు తో ముగిసిపోకూడదు నా పిల్లలే ఈ స్థానం లో ఉంటె నేను వాళ్ళను నా ప్రాణం అడ్డుపెట్టి అయినా కాపాడుకుంటాను కదా .

పిల్లలను తల్లితండ్రులు గురువు అనే వ్యక్తి కి ఎంతో గౌరవం ఇచ్చి తమ పిల్లల భాద్యత అప్పగిస్తారు .వాళ్ళు అంత నమ్మకం నా మీద ఉంచితే నేను దాన్ని ఎలా వమ్ముకానివ్వగలను.అది  నేను చేస్తున్న ఉపాధ్యాయ వృత్తికే అవమానం .ఒక అమ్మ గా నేను పిల్లలను ఈ రాక్షసుడి బారి నించి కాపాడాలి .నేను వీళ్ళను ఎలా అయినా రక్షించాలి .నేను వెళ్లి నా చైర్ లో కూర్చున్నాను.అది చుసిన పిల్లలు ముఖంలో ఒక రకమైన రిలీఫ్ . ఆడమ్ ” అయితే మీరు వీళ్ళతో చావడానికే సిద్ధం అయ్యారా వెరీ గుడ్ ? ఇంత మందిని చంపడానికి సిద్ధపడ్డ నాకు మీరో పెద్ద లెక్క కాదు.కొన్ని గంటలలో అందరు కలసి ఒకే చోటుకు వెలుదురులే” అని తన గన్ మరోసారి పేల్చాడు .

అప్పటికి వరుకు గన్ చూసి భయపడుతున్న పిల్లలు ఆ శబ్దం  వినేసరికి ఏడుపు మొదలు పెట్టారు కొందరు…. కొందరు పారిపోదామని ప్రయత్నాలు మొదలు పెట్టారు.తమ తమ ఫోన్స్ లో తెల్సిన వాళ్లకు మెసెజ్ లు పంపారు .వాళ్ళచేతుల్లో ఫోన్స్ చూసి చాలా కోపం వచ్చి   వాళ్ళ ప్రయత్నాలు ఆపడానికి ఆడమ్ గాల్లోకి రెండు తూటాలు పేల్చాడు .దాంతో పిల్లలందరూ ఎక్కడివాళ్ళు అక్కడ ఉండిపోయారు .అప్పటివరకు ఇదేదో ప్రాంక్ అని ఉన్న కొద్దో గొప్పో ఆశ అడగారిపోయింది.అందరి ముఖాలలో చావు భయం స్పష్టం  గా కనిపిస్తోంది అది చూసి ఆడమ్ గట్టిగా నవ్వాడు.ఆ నవ్వు ఎంత పైశాచీకంగా ఉందంటే చిన్న పిల్లలు వింటే దడుసుకుని ఏడుపు మొదలుపెడతారు.

అందరి దగ్గరా ఫోన్లు తీకుని ఒక బాగ్ లో వేసేసి పక్కన పడేసాడు .నా ఫోన్ మటుకు తన దగ్గర పెట్టుకున్నాడు.ఆ గన్ పట్టుకుని క్లాస్ అంతా తిరిగాడు.అలా ఆడమ్ వెళ్లి ఎవరి పక్కన నిల్చుంటే వాళ్ళు వణికిపోతున్నారు.పోయిన వారం అందరు పిల్లలు తాము తమ జీవితంలో ఏమి సాదించాలనుకున్నారో ? ఒక్కొక్కరు ఐదు నిముషాలు పాటు చెప్పారు ఆ మాటలు ఇంకా నా చెవులలో వినపడుతున్నాయి.వాళ్ళ భవిష్యత్తు  వరకు ఎందుకు వీళ్ళు రేపు సూర్యోదయం అన్న చూస్తారో లేదో ? వీళ్ళ మీదే తమ ఆశలు ,తమ ప్రాణాలు పెట్టుకున్న వీళ్ళ తల్లితండ్రుల పరిస్థితి ఏమవుతుంది.ఎలాగయినా ఆడమ్ చేతిలోంచి గన్ తీసుకోవాలి .గడిచే ఒక్కో నిముషం  చావు కు దగ్గరఅవుతున్నాము .

ఒక అరగంట గడిచింది భారం గా తన దగ్గర పెట్టుకున్న నా ఫోన్ గట్టిగా మోగింది దానికోసమే ఎదురుచూస్తున్నట్టు ఠక్కున ఫోన్ ఎత్తాడు.అవతల వాళ్ళు ఏం మాట్లాడారో వినిపించలేదు కానీ ఆడమ్ మటుకు నాకు మిలియన్ డాలర్లు కావాలి అని అడిగాడు.అటు వైపు వాళ్ళు ఎదో మాట్లాడారు .ఆడమ్ “నేను మీకు గంట టైం ఇస్తున్నాను ….ఆ తరువాత రెండు నిముషాలకొకరిని కాల్చేస్తాను .ఆ తరువాత మీ ఇష్టం” అని ఫోన్ పెట్టేసాడు.ఒక్కో నిముషం ఒక్కో యుగం గా గడుస్తోంది .హఠాత్తు గా  చావు వస్తే ఎవరు భయపడరేమో కానీ చావు వస్తుందని తెలిసి దాని కోసం వెయిట్ చేయడం చావు కన్నా భయంకరం.”నేను వాళ్ళను డబ్బులు అడిగానని మిమ్మల్ని వదలిపెట్టేస్తానని కలలు కనొద్దండి..మిమ్మల్ని చంపడం ఖచ్చితం కానీ వెంటనే చంపేస్తే ఎలా? మీరు కొద్దో గొప్పో భాద పడాలి కదా ….మెల్ల గా ఒక్కొకళ్ళని చంపుతా “అని గన్ గాల్లోకి పేల్చాడు.

ఇంకో అరగంట భారం గా గడిచింది. ఆడమ్ తన గన్ పక్కన కూడా పెట్టకుండా గట్టిగా పట్టుకొనే ఉన్నాడు.బయట హెలికాఫ్టర్ సౌండ్ వినిపించింది.ఆ సౌండ్ విని ఆడమ్ చాలా ఇరిటేట్ అయ్యాడు .ఆ ఇరిటేషన్ లో ఎం చేస్తాడో ఆని భయం వేసింది.ఎదో ఒకటి చేయాలి లేకుంటే కష్టం .బయట ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉందొ ?గన్ శబ్దం విన్నప్పుడల్లా ఎవరికీ ఏమైందోనని ఎంత భయపడుతున్నారో?.

హఠాత్తుగా అక్కడ ఉన్న టీవీ ఆన్ చేసాడు.టీవీ లో స్కూల్ న్యూస్ చూపిస్తున్నారు.ఆడమ్ ఫోటో కూడా వేస్తున్నారు .నాలుగు ఐదు  ఛానెల్స్ మార్చి చూసాడు అన్నిట్లోనూ అదే చూపిస్తున్నారు .ఒక పది నిముషాలు అదే చూస్తూ ఉండిపోయాడు .హఠాత్తు గా డయాస్ మీదకు వెళ్లి ఫస్ట్ బెంచ్ లో ఉన్న మరియా వైపు గన్ పాయింట్ చేసాడు నాకు తన ముఖం చుస్తే తానూ ఈ సారి నిజ్జం గానే మరియాను షూట్ చేస్తాడు అనిపించింది .

తాను ట్రిగ్గర్ మీద చేయి పెట్టాడు నేను చైర్ లోనించి లేచి లేచి తన వైపు పరుగుపెట్టాను .బులెట్ మరియా వైపు వేగం వస్తోంది బులెట్ కంటే నేను నేను తన ముందుకు వెళ్లి అడ్డం  నిలబడ్డాను బులెట్ వచ్చి నా భుజం లోకి దూసుకువెళ్లింది .ఎర్రగా కాల్చిన ఇనుపకడ్డీ లోపలికి వెళ్లినట్టు విపరీతమైన నొప్పి,మంట.నాకు చాలా కోపం వచ్చింది .భుజం నించి  ఆగకుండా కారుతున్న రక్తాన్ని కూడా లెక్క చేయకుండా నేను మరియా దగ్గరికి వచ్చినంత  వేగం తోనే ఆడమ్ వైపు పరిగెత్తాను నాకు తగిలిన దెబ్బను చూసి ఒక్క నిముషం ఏమరుపాటు పడ్డ ఆడమ్ చేతిలో ఉన్న గన్ నా చేత్తో పైకి పెట్టి ఇంకో చేత్తో నా పూర్తీ బలం పెట్టి వెనుకకు తోసాను .నా బలం తన కన్నా తక్కువ అయినా తాను నేను ఆ పని చేస్తానని ఉహించకపోయేసరికి తాను వెనుకకు పడిపోయాడు .జరిగింది అర్థం అయినా పిల్లలు ఆడమ్ లేచేలోపు  తన చేతులు కాళ్ళు పట్టేసుకున్నారు.నేను తన చేతిలో ఉన్న గన్ తీసేసుకున్నాను .వెళ్లి తలుపు తీసాను .బయట ఉన్న పోలీసులు లోపలి వచ్చారు దూరం గా ఉన్న రామం కనిపించారు .ఆయన కళ్ళలో నీళ్లు నా మీద ఉన్న ప్రేమ ఆయన కళ్ళలో కనిపించింది.నేను గట్టిగా “ఎవ్వరికి ఏమి కాలేదు .అందరూ బాగున్నారు ” అని చెప్పాను. నేను స్పృహ తప్పాను.ఆతరువాత ఏం జరిగిందో తెలియదు.

నాకు రెండు రోజుల తరువాత మెలుకువ వచ్చింది  హాస్పిటల్ లో .చుట్టూ చూసాను చాలా ఫ్లవర్ బొకేలు ఉన్నాయి.అక్కడే చైర్ లో రామం కూర్చుని తూగుతూఉన్నారు.ఇంకో వైపు పిల్లలు సోఫా లో కూర్చునిఉన్నారు.నేను పిలిచేలోపే తనకు మెలుకువ వచ్చి నా దగ్గరికి వచ్చి నా తల నిమురుతూ “నువ్వు ఎంత పెద్ద సాహసం చేసావో తెలుసా?ముప్పయి ఆరు ప్రాణాలు కాపాడావు .వాళ్ళ తల్లి తండ్రులు గుండెకోతకు గురికాకుండా కాపాడావు.నువ్వు నా సీతవు అయినందుకు చాలా గర్వం గా ఉంది”.”అమ్మ నువ్వు పెద్ద హీరో అయిపోయావు  తెలుసా?”అన్నారు పిల్లలు .

“హీరో లు ఎక్కడినించో పుట్టరు మనలోంచే పుడతారు .ఒక వ్యక్తి స్వార్ధానికి ముప్పయి ఆరు ప్రాణాలు బలి అవుతాయి అంటే చూస్తూ ఎలా ఉరుకుంటాను.మీరు నాకు ఎంతోవాళ్ళు అంతే రా “.

“నీ  ఆ పిల్లలు  నిన్ను చూడాలని రెండు రోజుల నించి ఇక్కడే ఉన్నారు .ఉండు లోపలి పంపుతాను.నువ్వు ఇంకో వారం ఇక్కడే ఉండాలి.దెబ్బ బాగా లోపలికి  తగిలింది.ఇంకో రెండు నెలలు మన ప్రోగ్రాం పోస్టుపోన్ చేసాను.నువ్వు నాకు దక్కావు అది చాలు నాకు” అని రామం  బయటకు వెళ్లారు.

పిల్లలు అందరు లోపలికి వచ్చారు .”మిసెస్ రామం మా హై స్కూల్   లాస్ట్ డే ని మా జీవితం లో లాస్ట్ డే కాకుండా మమ్మల్ని కాపాడారు .మీకు మేము ఎప్పడికి రుణపడిపోయాము .మీకు థాంక్స్ చెప్పి మీరు చేసిన పనిని తక్కువ చేయము కానీ మీకు ఒకటి మటుకు ప్రామిస్ చేస్తాము .మీరు మళ్ళీ మాకు ఇచ్చిన జీవితాన్ని సద్వినియోగం చేస్తాము.ఇది మా అందరి మాట” అన్నారు ఏక ఖంఠం తో.

ఒక టీచర్ గా నా జీవితానికి ఇంత కన్నా సార్ధకత ఏముంటుంది.వాళ్ళు అన్నది నిజమే మా స్కూల్ లో లాస్ట్ డే జీవితం లో లాస్ట్ డే కాకుండా దేవుడే కాపాడాడు.

 

 

 

4 thoughts on “25. లాస్ట్ డే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *