April 26, 2024

28. అనుబంధాల అల్లికలు

రచన: కురువ శ్రీనివాసులు

 

“వంశీ… నాన్నా వంశీ…”

“వస్తున్నా తాతయ్య…… ఏమిటి తాతయ్య…”

“నాన్నొచ్చారా…?”

“ఆ… ఇందాకె వచ్చారు తాతయ్య….”

“అలాగా… ఓసారి మీ నాన్నమ్మను పిలు”

మనసులో ఎదో తెలియని కలవరం… తెచ్చుంటాడా…? తెచ్చేవుంటాడ్లే..

మూడు నెలలుగా ఎదురుచూస్తున్నానని తెలుసుగా వాడికి…

నా కొడుకని కాదుగాని…అబ్బాయి రాజేష్ చాలా మంచివాడు…

ఒక్క దురలవాటు లేదు… ప్రైవేట్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్… నిజాయితీగా ఉంటాడు… వాడికి తగ్గట్టే మంచి భార్య దొరికింది…  పేరు వసుంధర… తనూ ఓ సంస్థలో చిన్న ఉద్యొగం చేస్తోంది… వాళ్ళకు ఇద్దరు సంతానం …  పల్లవి, వంశీ.. చురుకైన వాళ్ళు…నా విషయానికొస్తే …నన్ను నారాయణ రావు అంటారు  … వయసు 68 నేనుకూడా ఓ ప్రైవేటు సంస్థలో చిన్న ఉద్యొగం చేస్తూ పదేళ్ళ క్రితం రెటైరయ్యాను… భార్య సుగుణ.. పేరుకు తగ్గట్టే సుగుణవతి… అందరూ మాది హాపీ హోం అంటూంటారు..

ఆప్టిక్ నెర్వ్ ప్రాబ్లం వల్ల ఎనిమిదేళ్ళ క్రితం చూపు పోయింది.. వయో భారానికి తోడైన అంధత్వం నన్ను పడక గదికే పరిమితం చేసింది… సుగుణ ఇంటి పనులతో బిజీ గా ఉంటుంది… కొడుకూ కోడలు ఉద్యోగాలకు వెళతారు… పిల్లల భాద్యత సుగుణమీదే ఎక్కువగా ఉంటుంది కాబట్టి నన్ను పలకరించే సమయం  అంతగా ఉండదు… నాతో గడిపే ఒకే ఒక్క నేస్తం నా రేడియో ట్రాన్సిస్టర్.. అదే నాలోకం… వార్తలు చెబుతూ నా చెవులకు ప్రపంచాన్ని చూపించేది… పాత పాటలతో జోల పాడేది… మూడు నెలల క్రితం చేయిజారి క్రింద పడి పనికిరాకుండా పోయింది… ఆ క్షణం నేను అనుభవించిన బాధ మాటల్లో చెప్పలేను… ఆత్మీయుణ్ణి కోల్పోయినట్టనిపించింది… ప్రాణంలేని వస్తువైనా నన్ను ఆప్యాయంగా పలకరించినట్టనిపించేది…దాన్ని తడిమి చూస్తూ మౌనంగా రోధించాను…

“పోతే ఫొయిందిలే నాన్నా … దానికన్నా మంచిది తెద్దాం” అంటూ నన్ను సముదాయించాడు రాజెష్. కొంత ఊరట కలిగింది…  బహుషా నెలాఖర్లో తేవచ్చు అనుకున్నాను… స్కూలు ఫీజులు అవి ఇవి అన్నీ ఒక్కసారిగా రావడంతో ఆ నెల తేలేక పోయాడు… నెక్స్ట్ మంత్ పండగొచ్చిపడింది బంధువుల రాకపోకలు, విందులూ వినోదాలు… ఆ నెల కూడా కుదరలేదు…

ఇప్పుడు మూడో నెల వచ్చేసింది … నేను నోరు తెరిచి అడగలేను… రెండు మూడు రోజుల్లో తెస్తానన్నాడని  సుగుణ చెప్పింది… అదే ఎదురుచూస్తున్నాను..

ఇంతలో “పిలిచారా “ అంటూ సుగుణ వచ్చింది…

“అదేనే .. అబ్బాయి రేడియో తెస్తాడన్నావు… కనుక్కున్నావా…”

“చేతిలో ఏదో పేకెట్ పట్టుకొచ్చాడండి… అదేనేమో…కొద్దిసేపు ఆగి అడిగి చూస్తాను…”

“ఆ అలాగే.. అలసిపోయుంటాడు ఇప్పుడు వాణ్ణేమి విసిగించకు… గంటాగి అడిగి తెలుసుకో…”

“సరేనండి … కాస్త పనుంది మళ్ళీ వస్తాను…” వెళ్ళి పోయింది…

మనసులో తెలియని సంతోషం…నా నేస్తానికి మళ్ళీ ప్రాణమొచ్చి పలకరించ బోతోంది…  ఈ రోజు ఎక్కువసేపు మేలుకొని తనివితీరా రేడియో వినాలి… ఎన్నో సంవత్సరాల ఎడబాటు ముగియబోతోంది అన్నట్టుగా ఉంది…    చిన్నప్పటి రోజులు గుర్తుకొచ్చాయి.. ఐస్క్రీం షాపుకు వెళుతూంటె తరగని దారిపై వచ్చిన కోపం… నీకు స్వీట్స్ కూడా తెస్తానని మాటిచ్చి మార్కెట్ కు వెళ్ళిన అమ్మ రాకకోసం ఎదురుచూసిన మధుర క్షణాలు… దీపావళికి టపాకాయల సంచీ తో వచ్చే నాన్న తొందరగా రావాలని చేసిన ప్రార్థనలు… అన్నీ  గుర్తుకొస్తున్నాయి… అందుకే అంటారేమో వయసు మళ్ళాక మళ్ళీ పిల్లలవుతారని..

నిమిషాలు గంటల్లా అనిపిస్తున్నాయి… సుగుణ రాదేమిటి..

చాలాసేపటికి అడుగుల చప్పుడు…  సుగుణ వస్తోంది… ప్రాణం లేచొచ్చినట్టయింది..

“సుగుణా ….తెచ్చావా…”

“ముందు భోంచెయండి…”

“అబ్బా… ముందు ట్రాన్సిస్టర్ ఇవ్వు…”

“అది ట్రాన్సిస్టర్ కాదండి… వంశీ కోసం తెచ్చిన బొమ్మ”

ఒక్కసారిగా నీరసం ఆవహించింది…

“మరచిపోయాడేమో…ఓసారి గుర్తుచేయకపోయావా… రేపైనా తెచ్చేవాడు…”

పెగలని గొంతు మాట తడబడేలా చేస్తోంది…

“అడిగాను”

“ఏమన్నాడు”  చిగురంత ఆశ…

“వంశీ పుట్టినరోజొస్తోందిగా… ఈ సారైనా వాడి కోరిక తీర్చడానికి టీవి వీడియోగేం సెట్ కొనాలి… దానికే బోలెడంతయ్యెలావుంది… ట్రాన్సిస్తర్ మళ్ళీ చూద్దాం లేమ్మా.. తొందరేముంది అన్నాడు…”

నాకు నోట మాట రాలేదు..

నా మౌనం చూసి… “మీరు కూడా చిన్న పిల్లాడిలా బాధపడతారేమిటండి… పాపం వాడు మాత్రం ఏంచేస్తాడు…  పిల్లలతో పాటు ఖర్చులూ పెరుగుతున్నాయి… “

నేను షాక్ లోనుండి తేరుకోవడానికి చాలా టైం పట్టింది…

“వాడి కష్టాలు వాడికున్నాయి…ఇక ఆ ట్రాన్సిస్టర్ కోసం వాణ్ణి విసిగించడం మానేయండి…”

“హు… “

నిజమే… వాడూ నాలాగె పిల్లల సంతోషంలోనె తన సంతోషాన్ని వెతుక్కుంటున్నాడు… దాన్ని  స్వార్థమనుకుంటే  మరి నేను చేసిందేమిటి… వాడి సంతోషంలోనే నా సంతోషాన్ని వెతుక్కోలేదా…

ఈ ఆలోచనల పరంపరలో ఒక సంఘటన గుర్తుకొచ్చింది… రాజెష్ కు అయిదేళ్ళుంటాయేమో… కారు బొమ్మ కావాలని మారాం చేసాడు… సరే ఆఫీసు నుండి వచ్చేప్పుడు తెస్తానని మాటిచ్చాను… ఆ రోజు పని ఎక్కువగా ఉండటంతో ఆఫీసునుండి బయట పడటానికి రాత్రి ఎనిమిదయ్యింది… పరీక్షకు ఆ రోజే పెద్ద వర్షం..  షార్ట్ కట్ లో వెళితే ఇల్లు చేరడానికి 14 కిలోమీటర్లు దూరం… కానీ కారు బొమ్మ తెస్తానని మాటిచ్చాను… దానికోసం వెళ్ళాలంటే సిటీలోకెళ్ళి రావాలి… ఇల్లుచేరడానికి సుమారు 20 కిలొమీటర్లు అవ్వచ్చు… తప్పదు.. వాణ్ణి నిరాశపరచడం నాకిష్టం లేదు… తడుస్తూనే బయలుదేరాను… గాలివాన జోరుకు సైకిలు ముందుకు కష్టంగా కదులుతోంది… ఎలాగైతేనెం కారు బొమ్మతో సుమారు రాత్రి 10 గంటల ప్రాంతంలో ఇల్లు చేరుకున్నాను… వాడింకా మేలుకొనే ఉన్నాడు…

“బొమ్మ తెస్తానన్నారుగా… ఇక వాడికి నిద్దరెలా పడుతుంది”  సుగుణ అసహనం …

కారు బొమ్మను చూసిన వాడి మొహంలో సంతోషం ఎప్పటికీ మరచిపోలేనిది…

ఇప్పుడు వాడూ అదే చేసాడు… తనకొడుకు మొహంలో సంతోషం చూడాలని …. తప్పేముంది…

మనసును మరోసారి ఓదార్చి సరిపెట్టుకుంటె సరి…. అలవాటైన పనేగా…

రాజెష్ పుట్టినప్పుడు పాల డబ్బాల కోసం నా సిగరెట్టు స్థాయిని తగ్గించుకొని బీడీలతో సరిపెట్టుకోలేదా…

వాడి చదువుకోసం ఓవర్ టైం వర్క్ చేసి,  చాలీచాలని నిద్రతో సరిపెట్టుకోలేదా..

రెటైరయ్యాక వచ్చిన డబ్బును నా కంటి ట్రీట్మెంట్ కు వాడకుండా వాడి ప్రేమ వివాహం ఘనంగా చేసి,  కంటికి కటిక చీకటితో సరిపెట్టుకోలేదా…

సుగుణకు ఆరోగ్యం బాగాలేని రోజుల్లో, కాఫీ కోసం విసిగిస్తానని, పిలిచినా పలకకుండా, అమ్మ    బయటికెళ్ళిందని పిల్లలతో అబద్దం చెప్పించినప్పుడు, నాకు కళ్ళులేకపోయినా గుసగుసలను పసిగట్టే  చురికైన నా చెవులు తన ఉనికిని తెలియజేస్తాయని తెలుసుకోలేకపోయిన కోడలి అమాయకత్వానికి నవ్వుతో సరిపెట్టుకోలేదా

షుగర్ వ్యాధి ఆకలిని రెచ్చగొట్టి అలమంటించేలాజేసినా, టైం కు తినడానికి ఇవ్వమని అడిగి    విసిగించడం తప్పని మంచినీళ్ళతో సరిపెట్టుకోలేదా…

ఒకే ఇంట్లో ఉంటూ నెలకు ఒక్కసారైన పలకరించని కొడుకు పని ఒత్తిడిలో ఉండి అలాచేసాడని సరిపెట్టుకోలేదా…

ఇంటి ఆర్థిక విషయాల్లొ తలదూర్చి అవమానించిన  వియ్యంకుడిని కొడుకు వెనకేసుకొస్తూంటే, ప్రేమ వివాహం కదా తన మామ గారి పై మమకారం కొంచెం ఎక్కువే ఉంటుందని  సరిపెట్టుకోలేదా…

అలాగే మరోసారి సరిపెట్టుకోలేనా… మనసును బుజ్జగిస్తూ తినకుండానే కలత నిద్రలోకి జారిపోయాను….

వంశీ పుట్టినరోజు రానే వచ్చింది… ఇల్లంతా సందడి… కిల కిల నవ్వులు సంతోషాలు…

ఫంక్షన్ బాగా జరిగింది… రాత్రి పడుకునే సమయంలో… “తాతయ్యా” వంశీ గొంతు వినబడింది…

“రా నాన్నా… ఏమిటి.. ఇంకా పడుకోలేదా…?

“నాన్న వీడియో గేం కొనిచ్చాడు తాతయ్యా… ఇదిగో జాయ్ స్టిక్…”  చేతిలో ఏదో వస్తువు పెట్టాడు… వాడి  గొంతులో  సంతోషం నాకు రాజెష్ కారు బొమ్మను చూసినప్పుడు కనిపించిన దృష్యాన్ని కళ్ళముందుకు  తెచ్చింది..

ఆ వస్తువును తడిమి చూశాను… “నీ ట్రాన్సిస్టర్ మిత్రుడు నిన్ను చేరుకోకుండా అడ్డుకుంది నేనేనని  కోపగించుకోకు” అని అది నాతో అంటున్నట్లుగా అనిపించిది.. నవ్వొచ్చింది..

“వంశీ… దీనితో హాపీ గా ఎంజోయ్ చేయి నాన్న……” రెప్ప పాటులో దాన్ని లాక్కొని సంతోషంగా పరుగుతీసాడు …

కంట్లో వెలుగు ఆగినా నీళ్ళు ఆగవుగా… చెమ్మరిల్లిన కళ్ళను తుడుచుకుంటూ

పక్క మీదికి వాలిపోయాను…

 

1 thought on “28. అనుబంధాల అల్లికలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *