May 2, 2024

3. చైతన్య కుసుమాకరం

రచన: GSS కళ్యాణీ సచీంద్ర

 

“తాతయ్యా .. నాకొక కథ చెప్పవా?”, అంటూ రాత్రి భోజనాలు ముగిశాక తాత మాధవయ్య పక్కలోకి చేరి గారాబంగా అడిగాడు అయిదేళ్ల చింటూ.

“ఓ అలాగే! నీకొక మంచి కథ చెప్తాను విను. ఒకప్పుడు రాము అని ఒక బాలుడుండేవాడు. వాడు ప్రతి రోజూ సూర్యోదయంకన్నా ముందే  లేచి చక్కగా స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని భగవంతుని పట్ల నమ్మకము, భక్తి కలిగిఉండి బడికెళ్ళి గురువుకు నమస్కరించి, చక్కగా చదువుకుంటూ పెద్దలను గౌరవిస్తూ తల్లిదండ్రులకు మంచి పేరు తెస్తూ ఉండేవాడు. రామూకి బడికెళ్లేటప్పుడు రోజూ వాళ్ళ అమ్మ తినడానికి కొన్ని చిరుతిళ్లు ఇచ్చేది.  ఒక రోజు రాము బడికెడుతూ ఉంటే ఒక ముసలి తాత ఆకలితో కనిపించాడు. రాము తన దగ్గరున్న చిరుతిళ్ళు ఆ తాతకుపెట్టి వాళ్ళ ఇల్లెక్కడో కనుక్కుని మరీ వాళ్ళింట్లో తాతను జాగ్రత్తగా దిగబెట్టి బడికి ఆలస్యంగా వెళ్ళాడు. దాంతో వాళ్ళ మాస్టారు ఆలస్యంగా ఎందుకొచ్చావని రామూని కోప్పడ్డారు. నిజాయితీగా అసలు సంగతే చెప్పాడు రాము . రాము మంచి గుణాన్ని వాళ్ళ మాస్టారు ఎంతో మెచ్చుకుని తోటి విద్యార్థులకి రాము ప్రవర్తనను ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు. రాము పెద్దవాడయ్యే కొద్దీ అందరూ మెచ్చుకుంటూ ఉండేసరికి పొగరు పెరిగి దుర్మార్గులతో స్నేహం చెయ్యడం మొదలుపెట్టాడు. దాంతో రామూకి కొన్ని దురలవాట్లు అయ్యాయి. దానివల్ల ఆరోగ్యం పాడయ్యేసరికి తన తప్పు తెలుసుకుని తిరిగి మంచి మార్గంలోకి వచ్చి చదువును చక్కగా పూర్తి చేసి జీవితంలో ఉన్నతంగా స్థిరపడి తన మంచి పేరు నిలబెట్టుకున్నాడు రాము”, అని ఆపాడు మాధవయ్య.

“దుర్మార్గుడంటే ఎవరు తాతయ్యా?”, అడిగాడు చింటూ.

“దుర్మార్గుడంటే చెడ్డ దారిలో వెళ్ళేవాడు. అంటే పెద్దలను గౌరవించని వాడూ, అందరినీ ఏదో ఒక విధంగా పీడించేవాడూ, దొంగతనం వంటివి చేసేవాడూ,దుర్గుణాలు ఉన్నవాడూ, ధర్మాన్ని ఆచరించని వాడూ, అధర్మాన్ని భయం లేకుండా చేసేవాడూ  “, అన్నాడు మాధవయ్య.

“మరి దురలవాట్లు  అంటే?”, ఇంకో ప్రశ్న వేసాడు చింటూ.

“దురలవాట్లు  అంటే మన ఆరోగ్యానికి హాని కలిగించేవి, ఇతరులకు, సమాజానికి కూడా కొంత కీడు చేసేవీ అన్నమాట. ఉదాహరణకు పొగ తాగటం, మద్యం సేవించడం చెడు అలవాట్లు. వాటి వల్ల ఆ అలవాటున్న వారి ఆరోగ్యం త్వరగా పాడవుతుంది” , సమాధానమిచ్చాడు మాధవయ్య.

అర్థం అయినట్టు తల ఊపాడు చింటూ.

“మరి రామూ లో మార్పు అంత తొందరగా ఎలా వచ్చిందీ?”, మళ్ళీ అడిగాడు చింటూ.

“చిన్నప్పుడు రాము అలవరచుకున్న భగవద్భక్తీ, క్రమశిక్షణ పెద్దయిన తరువాత కూడా ఉపయోగపడ్డాయి. మంచి అలవాట్లు చిన్నప్పుడే చేసుకుంటే అవి మనము చెడు మార్గం వైపు పోకుండా మనల్ని ఎప్పుడూ కాపాడతాయి. ఒక వేళ దారి తప్పితే సరైన దారిలోకి సులభంగా వచ్చేలా చేస్తాయి“, చెప్పాడు మాధవయ్య.

చాలా శ్రద్ధగా విన్న చింటూ ఇంకా ఏవో కబుర్లు మాధవయ్యతో చెప్తూ నిద్రలోకి జారుకున్నాడు.

* * *

మాధవయ్య తమ స్వగ్రామమైన శ్రీహరిపురంలోని పాఠశాలలో ఉన్నతోపాధ్యాయుడిగా పని చేసి పదవీ విరమణ పొందాడు. ఆయనంటే గ్రామంలో అందరికీ ఎంతో గౌరవం. అందరూ ఆప్యాయంగా మాధవం మాస్టారూ అని పిలుస్తూ ఉంటారు. ఎందరో పిల్లలను చదువులో ప్రోత్సహించి , వారికి చక్కటి విద్యాబుద్ధులు నేర్పి, ఉన్నతులుగా తీర్చి దిద్దిన ఘనత మాధవయ్యకు ఉంది. అంతేకాకుండా ఆయన పలు మార్లు ఉత్తమ ఉపాధ్యాయుడిగా కూడా సత్కారాలు అందుకున్నాడు.

ఆయన  కుమారుడైన రఘు వైద్యవిద్యను అభ్యసించినప్పటికీ తన తల్లిదండ్రులపైన, ఆ గ్రామంపైనా ఉన్న మమకారంతో అక్కడే ఒక వైద్యశాలను ఏర్పాటు చేసుకుని తమ ఊరి వారందిరికీ వైద్యం చేస్తూ  మంచి పేరు సంపాదించాడు. రఘు భార్య మీనాక్షి ఇంటి పని చేసుకోవడంలోనూ , అత్తమామలకు కావలసినవి సమకూర్చడంలోనూ  ఎప్పుడూ క్షణం తీరిక లేకుండా ఉంటుంది. మాధవయ్య, ఆయన భార్య అన్నపూర్ణలు మాత్రం చింటూ పుట్టేంతవరకూ ఎక్కువ సేపు భగవద్ధ్యానంలో గడిపేవారు. చింటూ పుట్టిన తరువాత వాడే వాళ్ళ లోకమైపోయాడు. వారి రోజంతా చింటూని ఆడించడంలోనూ, వాణ్ణి చదివించడంలోనూ వాడి అవసరాలన్నీ చూడటంలోనూ గడిచిపోతూ ఉంటుంది.

***

ఒక రోజు చింటూ బడి నుండీ వస్తూనే టీవీ లో ఏదో మంచి చలనచిత్రం ప్రసారమౌతోందనీ, అది చూడటానికి తన తోటి వారంతా ఇళ్లకు పరుగు పరుగున వెళ్ళారనీ చెప్పి తాను కూడా అది చూస్తానని చెప్పాడు. అది ఒక అగ్ర కధానాయకుడి చిత్రం కావడంతో మీనాక్షి, అన్నపూర్ణ, మాధవయ్య కూడా చింటూ తో పాటూ చలనచిత్రం చూడటం ప్రారంభించారు.

ఆ చలనచిత్రం మొదలుకాగానే మొట్ట మొదటి సన్నివేశంలో కథానాయకుడు తన స్నేహితులతో కలిసి గుప్పు గుప్పున పొగ వదులుతూ మద్యం సేవించడం చూపించారు.

“తాతయ్యా.. వాళ్ళు చేస్తున్న పనులు దురలవాట్ల కిందకి వస్తాయి కదా? మరి ఎందుకు చేస్తున్నారు?”, అడిగాడు చింటూ.

“మొత్తం కథ చూస్తే కానీ కథానాయకుడు అలా ఎందుకు చేస్తున్నాడో తెలియదురా “, అన్నాడు మాధవయ్య.

మొదటి సన్నివేశమే అలా ఉండటం పెద్దవాళ్ళెవ్వరికీ నచ్చలేదు. కానీ విజయవంతం అయిన చిత్రం కావడంతో ఓపికగా చూడసాగారు. రెండవ సన్నివేశంలో కథానాయకుడు తన స్నేహితులతో కలిసి కళాశాలకు వెళ్లి అక్కడి తరగతి గదిలోకి ప్రవేశించి వారికి పాఠం నేర్పుతున్న గురువును కించ పరిచే విధంగా మాట్లాడటం మొదలు పెట్టాడు. ఉపాధ్యాయుడిగా పని చేసిన మాధవయ్యకు ఆ సన్నివేశం కోపం తెప్పించింది. తదుపరి సన్నివేశంలో కళాశాలనుండి బయటకొచ్చిన కథానాయకుడు ఒకరిద్దరితో ఏదో విషయంపై గొడవపడి వారిని నెత్తురోడేలా కొట్టడం ప్రారంభించాడు.

ఇవ్వన్నీ చూస్తున్న చింటూ చిట్టి బుర్ర ప్రశ్నలతో నిండిపోయింది.

అంతలో కథానాయిక సరైన దుస్తులు ధరించకుండా రంగ ప్రవేశం చేసింది. కథానాయకుడు, కథానాయికల మధ్య తీసిన శృంగార సన్నివేశాలను పెద్దవాళ్ళే చూడలేకపోయారు.

“అబ్బా! ఇంక ఈ చిత్రం చాలు”, అని మీనాక్షి అనగానే అదే సరైన నిర్ణయం అని ముక్త కంఠం తో ఏకీభవించారు మాధవయ్య అన్నపూర్ణలు.

“ఎందుకు?”, అడిగాడు చింటూ.

“నువ్వు బడి నుండి వచ్చాక ఏమీ తినలేదు కదా? నీకోసం నీకిష్టమైన ఫలహారం చేశా. తిందువుగాని రా”, అని చింటూ ని వంటగదిలోకి తీసుకెళ్లింది అన్నపూర్ణ. మీనాక్షి కూడా వారిననుసరించింది.

చలన చిత్ర ప్రభావం వల్ల  మాధవయ్యకు మనసు చిరాకుగా అనిపించింది. కాసేపు పాటలు వింటే కొంత ప్రశాంతత కలుగుతుందని తన గదిలోకి వెళ్లి రేడియో లో పాటలు ప్రసారమయ్యే కేంద్రం పెట్టాడు మాధవయ్య. అందులో కొత్త పాటల కార్యక్రమం వస్తూ ఉంది. ఆ పాటలకున్న సంగీతం కానీ వాటి సాహిత్యం కానీ మాధవయ్యకు ఎంత మాత్రమూ నచ్చలేదు. ఆ సంగీతం వింటే గుండెల్లో ఏదో దడ పుడుతున్నట్లు అనిపించింది. సరేనని ఆ రోజు దినపత్రిక చదువుదామని చూస్తే దాని ముఖచిత్రమే భయంకరంగా తోచింది మాధవయ్యకు. ఎందుకంటే ఆ రోజు ఒక ప్రమాద సంఘటనకు సంబంధించిన చిత్రాలను రంగులలో ప్రచురించారు ఆ పత్రికవారు. మిగతా వార్తలన్నీ కూడా చాలా మేరకు వివిధ ప్రాంతాలలో జరిగిన దొంగతనాలూ, హత్యలూ , మానభంగాలవంటి అతి నీచమైన విషయాల గురించే ఉన్నాయి. మాధవయ్య మనసంతా అల్లకల్లోలం అయ్యింది. “ఎటు పోతున్నదీ ప్రపంచం”, అని అనుకున్నాడు.

మనశ్శాంతి కోసం తమ ఊరిలోని గుడికి వెడదామని అనుకున్నాడు మాధవయ్య. అనుకున్నదే తడవుగా బయలుదేరాడు. గుడికెళ్ళి చాలా రోజులయ్యింది అనుకుంటూ వెళ్లిన మాధవయ్యకు గుడి తలుపులు మూసిఉండటం ఆశ్చర్యం కలిగించింది. తన చిన్నప్పుడు ఆ గుడి ఎప్పుడూ తెరిచే ఉండేది మరి. విషయం కనుక్కుందామని చుట్టూ చూసిన మాధవయ్యకు పక్కనే కొబ్బరి కాయలు, పూజా సామగ్రి అమ్మే దుకాణం కనిపించింది. అక్కడికి వెళ్లి ఆ యజమానిని చూసి నిర్ఘాంతపోయాడు మాధవయ్య. ఎందుకంటే ఆ దుకాణం యజమాని పేరు నారాయణమూర్తి. ఆయన హరికథలు చెప్పడంలో దిట్ట. ఆ గ్రామంలో మాధవయ్య తరంలో వారందరికీ ఆయన సుపరిచితులు. ఒకప్పుడు గుడి లో తరచూ హరికథలు చెప్పేవారు. వాటిని వినడానికి పక్క గ్రామాలనుండి కూడా జనం వచ్చే వారు. ఇప్పుడాయన ధరించిన మాసిపోయిన బట్టలు, పెరిగిన గడ్డం చూస్తేనే ఆయన పరిస్థితి బోధపడింది మాధవయ్యకు. ఆయన ముఖ వర్చస్సు మాత్రం ఏమాత్రం తగ్గలేదు అనుకుని “నమస్కారమండీ. మిమ్మల్ని నేనెరుగుదును. మీరు ఇలా ఈస్థితిలో ఎలా?”, అంటూ తన కొచ్చిన సందేహాన్ని నారాయణమూర్తి ముందు బయటపెట్టాడు మాధవయ్య.

“ఏం చెప్పనండీ? ఒకప్పుడు ఈ ఆలయానికి బోలెడు మంది భక్తులు వచ్చి నేను చెప్పే హరికథలు వింటూ సాయంత్రాలు ఎక్కువగా ఇక్కడే కాలక్షేపం చేసే వారు. నేను బీద వారికి దానం చెయ్యగలిగేటంత ధనం నాకు అప్పట్లో వచ్చేది. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. సాంకేతికత బాగా పెరిగిన తరువాత అందరూ చరవాణులతోనూ, లాప్ టాప్ లతోనూ కాలక్షేపం చేస్తున్నారు. లేదంటే ఇళ్లల్లో టీవీ లు పెట్టుకుని అందులో వచ్చే చలనచిత్రాలు చూడడానికే ఇష్టపడుతున్నారు. హరికథలు వినడానికి కాదు సరికదా గుడికి వచ్చేవారు కూడా బాగా తగ్గిపోయారు. ఏదోఒకటి చెయ్యకపోతే జీవనాధారం ఉండదని ఈ దుకాణం పెట్టుకున్నా. ఈ ఆలయ పూజారికి కూడా ఇదివరకు దక్షిణ రూపంలో కొద్దో గొప్పో వచ్చేది. ఇప్పుడది రాకపోయేసరికి పట్నం వెళ్లి పెళ్లిళ్లు, పేరంటాలు, వ్రతాలు చేయిస్తూ డబ్బు సంపాదిస్తున్నాడు. పట్నం వెళ్ళినప్పుడల్లా గుడి ఆలస్యంగా తెరుస్తాడు”, అని చెప్పాడు నారాయణమూర్తి.

ఈ సమాధానం విన్న మాధవయ్యకు చాలా బాధ అనిపించింది. కాసేపు ఏకాంతంగా కూర్చోవాలనిపించి ఆ ఊరిలోని ఉద్యానవనానికి వెళ్ళాడు మాధవయ్య.

***

ఎప్పుడూ పిల్లలతో కళకళలాడే ఉద్యానవనం ఇప్పుడు పిల్లలు పెద్దగాలేక బోసిపోయినట్టుగా తోచింది మాధవయ్యకు. దూరంగా అరుగుపైన ఎవరో తెలిసిన వారిలా కనబడుతూఉంటే ఎవరా అని చూసాడు మాధవయ్య. “ఎరా మాధవా? ఎలా ఉన్నావ్?”, అంటూ ఎంతో చనువుగా ఆప్యాయంగా పిలిచాడు ఆ వ్యక్తి. అప్పుడు మాధవయ్య ఆ వ్యక్తి కృష్ణమూర్తి అని గుర్తు పట్టాడు. మాధవయ్య, కృష్ణ మూర్తి చిన్ననాటి ప్రాణ స్నేహితులు. ఇద్దరూ కలిసి చదువుకున్నారు. కలిసి ఆడుకున్నారు. ఒకరినొకరు అరేయ్ ఒరేయ్ అని పిలుచుకునేటంత దగ్గరి బంధం. చదువు పూర్తయిన తరువాత కృష్ణమూర్తి పట్నం వెళ్ళిపోయి అక్కడ వ్యాపారం చేసి చాలా ఆస్తి సంపాదించాడు. తన ముగ్గురు కొడుకులలో ఇద్దరు అమెరికాలో స్థిర పడ్డారు. మూడో కొడుకుకి తన వ్యాపార బాధ్యతను అప్పజెప్పి శేష జీవితం తన స్వగ్రామంలో గడపాలని శ్రీహరిపురం లో ఇల్లు తీసుకుని, తన భార్య రుక్మిణితో కలిసి ఉంటున్నాడు కృష్ణమూర్తి.

“నేను బాగానే ఉన్నాను కృష్ణా. నువ్వేమిటి చాలా రోజులకి కనబడ్డావ్?”, అడిగాడు మాధవయ్య.

“మొన్ననే పట్నం వెళ్లి వచ్చాను. ఏదో కాస్త చల్ల గాలి కోసం ఇక్కడ కూర్చున్నాను. అవును నువ్వేమిటి ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టున్నావ్? వచ్చేటప్పుడు నిన్ను గమనించాను. కొంచెం దిగులుగా కనబడుతున్నావేమిటా అని అనుకున్నాను. అంతా బాగానే ఉంది కదా?”, అడిగాడు కృష్ణ మూర్తి.

“అదేరా! భావి తరాల భవిష్యత్తు గురించి ఆలోచిస్తే చాలా ఆందోళనగా ఉంది”, అన్నాడు మాధవయ్య.

“ఇప్పుడేమయ్యిందని?”, అడిగాడు కృష్ణమూర్తి.

“మన రోజుల్లో మన పెద్దవాళ్ళు మనకు నీతి కధలు బోధిస్తూ , ధర్మాన్ని ఆచరించడం యొక్క ప్రాముఖ్యత ను తెలుపుతూ ఎన్నెన్నో విషయాలు చెప్పేవారు. ఈ కాలం పిల్లలకు అటువంటి మంచి విషయాలు చెప్పేందుకు పెద్దవారికి బొత్తిగా తీరిక దొరకడంలేదు. అందుకు కారణం రకరకాల ఇతర వ్యాపకాలు రావడమే! ఒకప్పుడు కాలక్షేపం అంటే గుడికెళ్ళి హరికథ వినడం. దానివల్ల మనసుకు హాయి కలగడమే కాక మనిషికి అవసరమైన జ్ఞానం వచ్చేది. పురాణాలు, ఇతిహాసాల వల్ల ఎటువంటి సమస్యనైనా ఎదుర్కోగలిగే మానసిక స్థితి మనకు కలిగేది. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకోవడంతో మానవ సంబంధాలు బాగుండేవి. కానీ ఇప్పటి పరిస్థితి అందుకు భిన్నంగా మారుతోందని అనిపిస్తోంది”, అని అన్నాడు మాధవయ్య.

“ఔను! నువ్వు చెప్పేది నిజమే!”, అని కృష్ణ మూర్తి అంటూ ఉండగా దూరంగా ఎవరో ఇద్దరు పిల్లలు కొట్టుకుంటూ కనిపించారు.

“అరెరే! ఏమిటీ అలా కొట్టేసుకుంటున్నారూ?”, అని మాధవయ్య, కృష్ణమూర్తి ఆ పిల్లల దగ్గరకు గబా గబా వెళ్లారు.

“ఏం బాబూ? ఎందుకు ఆ పిల్లాడిని అలా కొట్టేస్తున్నావ్?”, కొడుతున్న పిల్లాడిని గట్టిగా అడిగాడు మాధవయ్య.

“నీకెందుకు తాతా? వాడు నా బంతి తీసుకున్నాడు. అందుకే కొడుతున్నా”, అన్నాడా పిల్లాడు.

“అయితే మాత్రం? ఇవ్వకపోతే మీ అమ్మకో నాన్నకో చెప్పాలి. అంతేగానీ అలా కొడతారా?”, అడిగాడు కృష్ణ మూర్తి.

“మా పెద్దవాళ్ళందరూ ఇంట్లో చలన చిత్రం చూడటంలో లీనమై ఉన్నారు. ఈ విషయం చెప్పినా పట్టించుకోరు. అయినా మొన్నొచ్చిన చిత్రంలో నాకిష్టమైన కథానాయకుడు ప్రతి నాయకుడిని ఇలాగే కొడతాడు”, అన్నాడు పిల్లాడు.

“తప్పు నాయనా. అలా కొట్టుకోకూడదు”, అంటూ ఇద్దరినీ విడదీసి సర్దిచెప్పి వాళ్ళ ఇళ్లకు పంపించి మళ్ళీ కూర్చున్నారు మాధవయ్య, కృష్ణమూర్తులు.

“నువ్వు చెప్పింది అక్షరాలా నిజం మాధవా! ఈ పిల్లలను ఇప్పుడే సరిదిద్దకపోతే పెద్దవారైన తరువాత చాలా కష్టం. సమాజానికి హాని చేసేవారౌతారనడంలో అతిశయోక్తి లేదేమో”, అన్నాడు కృష్ణమూర్తి.

“అవును కృష్ణా. నా చుట్టూ ఇంత జరిగిపోతున్నా నాకిన్నాళ్ళూ తెలియక పోవడం నన్ను చాలా బాధిస్తోంది. కనీసం ఇప్పటికైనా తెలిసింది. కానీ మార్పు రావాలంటే అది చాలా కష్టమైన పని. దాదాపు అసాధ్యంగా తోస్తోంది. ఇంత బాధ్యత ఎవరు తీసుకుంటారు ? ఇంతటి పనిని ఎవరు చెయ్యగలరు?”, అన్నాడు మాధవయ్య.

“మార్పు ఖచ్చితంగా రావాలి. నా ఉద్దేశంలో అది నీ వల్లే సాధ్యం”, అన్నాడు కృష్ణమూర్తి.

“నా వల్లా? నాలో ఆ శక్తి లేదనుకుంటున్నాను. చూస్తున్నావుగా! వృద్ధుణ్ణి అయిపోయాను. నేను ఇప్పుడు మొదలుపెట్టినా ఖచ్చితంగా పూర్తి చెయ్యలేను. నా ఆయుష్షు ఇంకెన్నాళ్లో నాకు తెలియదు కదా?” , అన్నాడు మాధవయ్య.

“మాధవా! ఎందరో విద్యార్థులను సన్మార్గంలో పెట్టిన అనుభవం నీకుంది. అంతే కాదు ఎందరో జీవితాలను కూడా చక్కదిద్దావు. నువ్వే ఈపని చేయగలవు. ఆలోచించు. ఇంక వయసు సంగతి అంటావా? సత్సంకల్పానికీ వయసు కీ సంబంధం లేదు. మనసుకీ వయసు కీ  కూడా సంబంధం లేదు. చిన్నప్పుడు మనం చదువుకున్న రాజు, ముసలివాడు కథ గుర్తుందా? టెంక నాటుతున్న ముసలివాడిని రాజు ఎందుకని ప్రశ్నిస్తే తన భావి తరాలకు మంచి ఫలాలు దక్కాలని సమాధానమిస్తాడు ముసలివాడు. ఇదీ అంతే. అలోచించి ఏమి చేస్తే బాగుంటుందో చెప్పు”, అని అన్నాడు కృష్ణ మూర్తి.

కృష్ణ మూర్తి మాటలు మాధవయ్యలో నమ్మకాన్ని, తనపై తనకు విశ్వాసాన్నీ కలిగించాయి. తానే సమాజంలో మంచి మార్పు కోసం ఏదన్నా చెయ్యాలన్న ధృడ సంకల్పంతో ఇల్లు చేరాడు మాధవయ్య.

***

రాత్రి భోజనం ముగిశాక ఎంతకీ నిద్ర పోకుండా ఏదో ఆలోచిస్తున్న భర్తను “ఏమిటండీ విషయం. ఎందుకలా ఉన్నారు?”, అని అడిగింది అన్నపూర్ణ. జరిగిందంతా చెప్పాడు మాధవయ్య. “పిల్లలను సరైన దారిలో పెట్టగలిగే వారు ఇంట్లో తల్లిదండ్రులు, బడిలో పాఠాలు బోధించే గురువులు. మీరేమైనా చెయ్యాలి అంటే ఈ రెండు మార్గాలలో ఒకటి ఎంచుకోవాలి. సరే ఆలోచించండి. సత్సంకల్పానికి ఆ భగవంతుడి సహాయం ఎప్పుడూ ఉంటుంది”, అని పడుకుంది అన్నపూర్ణ.

భార్య మాటలలో తాను ఆలోచిస్తున్న సమస్యకు పరిష్కారం కనబడింది మాధవయ్యకు. దాని ఆధారంగా ఒక ఉపాయం తట్టింది. వెంటనే హుషారుగా అన్నపూర్ణతో ఆ ఉపాయం గురించి చెబితే “శుభం! మీరు ఏదన్నా ముఖ్యమైన కార్యం తలపెడితే నా పూర్తి సహకారం మీకుంటుంది. ఇంక ఆలస్యమయింది. పడుకోండి”, అంది అన్నపూర్ణ.

మరుసటి రోజు తెల్లవారుతూనే కృష్ణమూర్తి దగ్గరకు వెళ్ళాడు మాధవయ్య.

“కృష్ణా! మా ఆవిడతో విషయం చెప్పిన తరువాత నాకొక మంచి ఆలోచన వచ్చింది. నీకు కూడా నచ్చితే ఆచరణలో పెడదాం”, అన్నాడు మాధవయ్య.

“ఏమిటది?”, అడిగాడు కృష్ణమూర్తి.

“నేను ఒక కార్యక్రమం మొదలుపెడతాను. ఆ కార్యక్రమంలో చేరిన పిల్లలకు మామూలు చదువుతో పాటూ మనిషిగా ఉత్తమ వ్యక్తిత్వంతో పెరగడానికి అవసరమైన జ్ఞానాన్ని ఇచ్చే అంశాలు నేర్పుతాను. ఉదాహరణకు భక్తిని అలవరచడం, మన గ్రంధాలపై అవగాహన కలిగించడం, మన పురాణాల గురించిన విశేషాలూ, అలాగే మన చరిత్ర నుండి తెలుసుకోవలసిన మంచి విషయాలు, మన సంప్రదాయాల ప్రాముఖ్యతల గురించి వివరించి చెప్పడం, భగవద్గీత, రామాయణం వంటివి ఈ కాలానికనుగుణంగా ఎలా ఉపయోగపడతాయో తెలియపరచడం వంటివన్నమాట. ఇందులో ఒక్క పిల్లలకే కాదు, ఆ పిల్లల ఇంట్లో ఉన్న పెద్దలకూ కొన్ని బాధ్యతలుండేలా చూస్తాను”, అన్నాడు మాధవయ్య.

“ఆహా! అద్భుతమైన ఆలోచన! మరి ఆ కార్యక్రమం పేరూ?”, అడిగాడు కృష్ణమూర్తి.

“ఇంకా ఏమి అనుకోలేదు. ‘చైతన్యం’ అని పెడితే బాగుంటుందేమో” , అన్నాడు మాధవయ్య.

“పిల్లలు పువ్వులవంటివారు. కాబట్టి అలా పెడితే ఎలా ఉంటుంది?”, అన్నాడు కృష్ణమూర్తి.

“అవును. నేను చేపట్టే ఈ కార్యక్రమం, మోడులకు కొత్త చిగుళ్లు వచ్చే వసంతం లాగా మన సమాజంలో పూర్వమును పోలిన కొత్త మార్పును తీసుకురావాలి. పువ్వులవంటి చిన్నారులకు సంబంధించినది కాబట్టి ఈ కార్యక్రమం పేరు ‘చైతన్య కుసుమాకరం’ అని పెడదాం. కానీ దీనికి కావలిసిన డబ్బు సమకూర్చడం ఎలా అని ఆలోచిస్తున్నాను”, అన్నాడు మాధవయ్య.

“ఆ విషయం నాకొదిలేయ్.నేను జీవితాంతం చాలా డబ్బు సంపాదించాను. నీక్కావలసిన మొత్తం నేను ఇస్తాను. మన గ్రామానికి ఎంతో కొంత చేసి నా ఋణం తీర్చుకోవాలని నాకు ఎప్పట్నుంచో ఉంది. సరైన అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. ఇప్పుడొచ్చింది”, అన్నాడు కృష్ణమూర్తి.

మాధవయ్య ఆనందానికి అవధులు లేవు. తాను తలపెట్టిన కార్యక్రమానికి కావలసినవన్నీ కొద్ది రోజుల్లోనే ఏర్పాటు చేసేసుకున్నాడు. విషయం తెలిసిన మీనాక్షి, రఘులు కూడా తమ వంతు సహాయం అందించడానికి ముందుకు వచ్చారు.

ఇక ఈ కార్యక్రమం గురించి అందరికీ తెలియబరచడానికి టీవీ నే సరైన మార్గమని భావించి దాని గురించి చలనచిత్రం మధ్యలో ఒక ప్రకటన వేయించాడు మాధవయ్య. వివరాల  కోసం తనను సంప్రదించమని ఆ ప్రకటనలో ఇచ్చాడు. ప్రకటన ఇచ్చిన రెండు రోజుల వరకూ ఎవ్వరూ రాలేదు. మాధవయ్య ఏమిచెయ్యాలా అని అనుకుంటూ ఉండగా ఒక రోజు ఇద్దరు వ్యక్తులు తనను కలవడానికి వచ్చారు. వారిని చూస్తూనే వారు వెంకటేశం, నరసింహం, అని గుర్తు పట్టాడు మాధవయ్య. వారు తనవద్దే చదువుకుని ఆ గ్రామంలోనే ఉంటూ ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు.

“మాధవం మాస్టారూ! నమస్కారం. మేము మీరు చేపట్టిన కార్యక్రమం గురించి  విన్నాము. మీ దగ్గర చదువును నేర్చుకుని మేము జీవితంలో స్థిరపడగలిగాము. మా పిల్లలను మీ చేతిలో పెడితే వారిని గురించిన చింత మాకుండదని మరో ఆలోచన లేకుండా మీ కార్యక్రమంలో వారిని చేర్పించాలని నిర్ణయించుకుని వచ్చాము”, అని వారు మాధవయ్యతో అన్నారు.

“చాలా సంతోషం. ఈ కార్యక్రమం నియమనిబంధనలు, తక్కిన వివరాలూ ఈ కరపత్రం లో  ఉన్నాయి. చదివి ఒక మంచి రోజు చూసుకుని మీ పిల్లలను తీసుకురండి”, అంటూ కరపత్రాలను వారికిచ్చాడు మాధవయ్య.

 

ఆ కరపత్రంలో ఇలా వ్రాసి ఉంది:

“ఈ కార్యక్రమానికి మీకూ మీ పిల్లలకూ స్వాగతం. పిల్లలకు అవసరమైన విద్యతో పాటూ వారు సత్జ్ఞానాన్ని పొందుతూ సన్మార్గంలో సాగేందుకు వారి తల్లిదండ్రులు , ఇంట్లో ఉన్నవారూ పాటించవలసిన నియమనిబంధనలు:

  1. ఉత్తమ విజయాలు సాధించడానికి క్రమశిక్షణ చాలా అవసరం. అందుకు పిల్లలను సూర్యోదయానికన్నా ముందే లేపాలి. సమయపాలన అలవాటు చెయ్యాలి.
  2. పిల్లలచేత ప్రతిరోజూ కొంతసేపు యోగ, సంగీత సాధన చేయించి, భగవంతుడికి వారు కొంత సమయం కేటాయించేలా చూడాలి.
  3. పిల్లల చుట్టూ ఉన్న పెద్దలు వారికి మంచి కధలను వినిపిస్తూ, పిల్లలలో మంచిని పెంచే ప్రయత్నం చెయ్యాలి. ఇతరులకు ఆనందం కలిగించడం, సహాయపడటం వంటివి పెద్దలు చేసి పిల్లలకు మార్గదర్శకంగా నిలవాలి.
  4. హింసాత్మకంగా ఉన్న దృశ్యాలను చూడటంకానీ, చెడు విషయాలు గురించి చదవటం కానీ , చర్చించటం కానీ పిల్లలముందు పెద్దలు చెయ్యరాదు.
  5. ప్రతి శనివారం సాయంత్రం రెండు గంటలపాటు విధిగా సాంకేతిక పరిజ్ఞానం వాడే వస్తువులను (ఉదా. చరవాణులూ, టీవీ లూ, లాప్ టాప్ వంటివన్నమాట) పక్కన పెట్టి ఇంటిల్లుపాదీ కలిసి సమయం గడపాలి. గుళ్లకు, ఉద్యానవనాలకు వెళ్లడం మనసుకు ఆరోగ్యకరమైన ఆహ్లాదం కలిగిస్తుందన్న విషయం తెలుసుకోవాలి. “

 

“కార్యక్రమం యొక్క ప్రణాళిక చాలా బాగుంది మాస్టారుగారూ! మరి మేమెంత రుసుము చెల్లించాలి?”, అడిగాడు వెంకటేశం.

“కేవలం సమాజ అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని మేము ఉచితంగానే అందిస్తున్నాము. మీకు తోచినంత విరాళం ఇవ్వచ్చు. అందుకు బలవంతమేమీ లేదు”, అన్నాడు మాధవయ్య.

“ఇంత మంచి కార్యానికి మా స్థోమతను బట్టి ఎంతోకొంత తప్పకుండా ఇస్తాము. వెళ్ళొస్తాము మాస్టారుగారూ”, అన్నాడు నరసింహం.

ఒక మంచి రోజు చూసి తమ పిల్లలను మాధవయ్య దగ్గరకు పంపటం ప్రారంభించారు వెంకటేశం, నరసింహంలు. పిల్లల ప్రవర్తనలో వచ్చిన మార్పు చూసి వారి చుట్టుపక్కల వారు కూడా తమ పిల్లలను మాధవయ్య తలపెట్టిన కార్యక్రమానికి పంపటం మొదలుపెట్టారు. క్రమేణా ఒకరి నుండి ఒకరికి ‘చైతన్య కుసుమాకరం’ యొక్క లాభాలు తెలిసి వారి వారి పిల్లలను ఆ కార్యక్రమంలో చేర్పించారు. కొంత కాలానికి గ్రామంలోని పిల్లలంతా మాధవయ్య చేపడుతున్న కార్యక్రమం లో సభ్యులైపోయారు.

తాను చేపట్టిన కార్యం విజయవంతం కావడంతో మాధవయ్యను అభినందించడానికి ఒక రోజు కృష్ణమూర్తి మాధవయ్య ఇంటికి వచ్చాడు. ఇద్దరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ గుడివైపు నడిచారు. దారిలో కనబడిన ఉద్యానవనం మునుపటి వలె కాకుండా పిల్లలతో కళకళలాడుతూ కనబడింది. వారికెదురొచ్చిన పిల్లలూ, పెద్దలూ మాధవయ్యకు గౌరవంగా నమస్కారం చెయ్యటం గమనించి కృష్ణమూర్తి , “అబ్బో! మాధవా ! నీ కార్యక్రమం మనముండగానే సత్ఫలితాలనిస్తోందే!” అన్నాడు.

“అవును కృష్ణా! ఇంతత్వరగా మార్పు వస్తుందని నేను కూడా అనుకోలేదు”, అంటూ గుడిలోకి ప్రవేశించాడు మాధవయ్య.

గుడి కూడా భక్త జనం తో నిండి ఉంది. నారాయణమూర్తి పూర్వం వలె గుడి ఆవరణలో హరికథ చెప్తూ కనిపించాడు. మాధవయ్య కనబడగానే పలకరింపుగా చిరునవ్వి నవ్వి కూర్చోమని సైగ చేసాడు నారాయణమూర్తి. హరికథ పూర్తయిన తరువాత మాధవయ్య వద్దకు వచ్చి, “మీ పుణ్యమా అని మా పూర్వీకులు నా కిచ్చిన సంపదను కాపాడుకునే భాగ్యం నాకు మళ్ళీ కలిగింది. మన ఊరి వారికి హరికథలో ఉండే మాధుర్యం రుచి తెలిసింది”, అన్నాడు నారాయణమూర్తి.

“అంతా ఆ భగవద్కృప”, అన్నాడు మాధవయ్య.

***

మెల్లిగా ‘చైతన్య కుసుమాకరం’ గురించి చుట్టుపక్కల గ్రామాలకు తెలిసింది. వారు వచ్చి మాధవయ్యను కలిసి ఆ కార్యక్రమాన్ని వారి వారి గ్రామాలలో కూడా ప్రారంభించారు. సమాజంలో చూస్తూ ఉండగా గొప్ప మార్పు కనబడింది. పెద్దవాళ్ళందరూ కార్యక్రమంలో నియమాలకు కట్టుబడి, తమ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని  హింసాత్మకంగా ఉన్న చిత్రాలకు వెళ్లడం మానుకున్నారు. దానివల్ల కొత్త చలనచిత్రాలు నీతిని, సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా రావడం మొదలుపెట్టాయి. దిన పత్రికలలో గ్రామ ప్రజల విజయగాధలకు ప్రాముఖ్యతను ఇవ్వడం మొదలు పెట్టారు.జనంలో భక్తి భావన, మానవత్వం, నీతి పెరిగాయి.

అలా నలభైఏళ్ళు గడిచిపోయాయి. మాధవయ్య తరం వారంతా లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. కానీ ‘చైతన్య కుసుమాకరం’ మాత్రం ఇంకా విజయవంతంగా సాగుతూనే ఉంది.

***

ఒక రోజు శ్రీహరి పురం గ్రామస్థులు ప్రముఖ శాస్త్రజ్ఞుడిగా పేరుపొందిన శ్రీవత్స వేణుమాధవ్ యొక్క సన్మాన కార్యక్రమం నిర్వహిస్తూ  ఆయనను మాట్లాడవలసిందిగా కోరారు.

వేదిక పైన నిలబడ్డ వేణు గొంతు సవరించుకుని ” అందరికీ నమస్కారం. మీకు నేను వైద్యరంగంలో పరిశోధనలు చేసిన శాస్త్రజ్ఞుడిగా పరిచయం. కానీ నేను ఈ ఊరిలో మాధవయ్యగారి మనవడుగా మీ అందరి మధ్యా పెరగడం నా అదృష్టం. మా తాతగారు నా చిన్నతనంలో ఎన్నో నీతి కథలను బోధించేవారు. ఆ కధలలో నేను నేర్చుకున్న నీతి, నిజాయితీలు నాకిప్పటికీ నన్ను నేను నిరూపించుకోవడంలోఉపయోగపడుతూనే ఉన్నాయి. ఆయన చేపట్టిన ‘చైతన్య కుసుమాకరం’ అనే కార్యక్రమంలో పాల్గొనడం వల్లే నాకు ఈ రోజు ఈ కీర్తి లభించిందని నేను గర్వంగా చెప్పగలను. మన గ్రామంలోనే కాకుండా మన చుట్టూ పక్కల గ్రామాలలో కూడా ఎంతో మంది ఈ కార్యక్రమంలో పాల్గొని నాలాగా వివిధ రంగాలలో పేరుప్రతిష్టలు సంపాదిస్తున్నారు. ఈ ‘చైతన్యు కుసుమాకరం’ యొక్క పరిమళాలు ఇప్పుడు దేశమంతటా వ్యాపించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ కార్యక్రమం యొక్క విశేషాలు ప్రపంచ దృష్టిని కూడా ఆకర్షిస్తున్నాయి. ఇది మన గ్రామానికి ఎంతో గర్వకారణం. ఈ సమయంలో ఆనందం పంచుకోవడానికి మనమధ్య మా తాతగారు కూడా ఉంటే చాలా బాగుండేది “, అంటూ తన కన్నీటిని తుడుచుకున్నాడు.

అంతలో అక్కడున్న జనంలోంచీ రమేష్ అనే యువకుడు నిలబడి, “బాధ పడకండి వేణు గారు. మీ తాతగారు మీకు మాత్రమే మంచిని నేర్పి ఉంటే ఈ సమాజం ఎంతో నష్టపోయేది. కానీ మాధవయ్య గారు ఈ గ్రామంలో ఉన్న పిల్లలందరినీ తన సొంత పిల్లలల్లే చూడటంవల్ల అందరినీ సరైన దారిలో పెట్టాలనే ఆలోచన  ఆయనకు వచ్చింది. అందువల్ల ఆయన మొదలు పెట్టిన కార్యక్రమంలో చేరిన వాళ్ళందరమూ ఆయన పిల్లలమే! ఆయన ఆశయం నెరవేరేలా చూడటం మా అందరి బాధ్యత. మా మనసులలో ఆయన ఎప్పుడూ సజీవంగానే ఉండి మాకవసరమైన ప్రోత్సాహాన్ని అందిస్తూనే ఉన్నారు. ‘చైతన్య కుసుమాకరం’ ఎప్పటికీ వాడని కుసుమం”, అని అన్నాడు.

ఆ మాటలకు అక్కడి వారు చేసిన కరతాళ ధ్వనులతో ఆ ప్రాంతమంతా మార్మోగిపోయింది. వారందరి మనసులూ ఆనందంతో నిండాయి. సభా కార్యక్రమం ముగిసింది. అంతర్జాతీయంగా ‘చైతన్య కుసుమాకరం’ విజయవంతం కావడానికి తాను ఏ విధంగా సహాయపడగలనా అని ఆలోచిస్తూ ఇంటిదారి పట్టాడు వేణు.

*****

 

 

1 thought on “3. చైతన్య కుసుమాకరం

  1. చి.ల.సౌ. కళ్యాణి రాసిన ‘చైతన్య కుసుమాకరం’ కథ చాలా బాగుంది. కథా వస్తువు నేటి సమాజంలో రావలసిన మార్పుకు సంబంధించినది కావటం వల్ల, ఆహ్వానించతగ్గ కథగా గుర్తింపు పొందుతుంది. కథలోని మాధవం మాస్టారువలె సంఘంలోని ప్రతి వ్యక్తీ తన బాధ్యతను గుర్తెరిగితే, నవసమాజ స్థాపన సుసాధ్యమే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *