April 26, 2024

38. తోడు

రచన: బి.వి. శివప్రసాద్

 

స్నిగ్ధకంతా అయోమయంగా ఉంది. నాయనమ్మ చనిపోయి రెండు వారాలైనా ఆ అమ్మాయికి దుఖ్ఖమాగడంలేదు. ఒకటా రెండా పన్నెండు సంవత్సరాల అనుబంధం. ప్రతి మనిషి చనిపోవాలని, కొందరు ముందు, కొందరు వెనుక, చివరకందరూ తమకైన వాళ్ళకు, కొందరు కానివాళ్ళకు గుడ్ బై చెప్పవలసిందేనని ఆ అమ్మాయి వాళ్ళ అమ్మా, నాన్నల ద్వారా కొంత మటుకు, మరికొంత సినిమాలు, టీవీ, ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకుంది. కానీ ఆ చేదు వాస్తవం తనకు ప్రియాతి ప్రియమైన నాయనమ్మ విషయంలో ఎదురవ్వడంతో ఆ లేత మనసు తట్టుకోలేక పోతూ ఉంది.

చివరికి బాల్కనీలో, అపార్ట్మెంట్ బయటా ఉంచిన పూలు, ఆకు కూరలు, తులసీ మొక్కలు ఉన్న కుండీలు అన్నీ పెద్దామె స్పర్శ కోసం తహ తహలాడుతున్నాయి. ఓపిక చేసుకుని ప్రతిరోజూ ఉదయమో, సాయంత్రమో అన్నీ మొక్కల తొట్లలో నీరు పోసేది. కొన్ని కుండీలలో మట్టి మార్చేది. బంతి, చేమంతి, గులాబి పూలు కూడా ఆమె చేయి తగిలితే పులకరించి నోళ్ళు విప్పి మనసారా నవ్వుతున్నట్లుండేది. ఆమె తుది శ్వాస విడిచిందగ్గర్నుంచి, మొక్కలు శ్వాసించడం మానేసి జీవకళ కోల్పోయి మోడుబారిపోయాయి.

#

ఆ రోజు మామూలుగా తెల్లవారలేదు. ప్రతి దినమూ స్నిగ్ధకంటే ముందే లేచి పూజకోసం పువ్వులు కోసుకోవడానికి అపార్ట్మెంట్ సెల్లార్లో కెళ్ళే నాయనమ్మ ఇంకా తన పక్కన పడుకునే ఉంది. సమయం ఆరున్నరయ్యింది. “నాయనమ్మా లే” అంటూ స్నిగ్ధ పిలిచింది. ఎప్పుడైనా ఒంట్లో బాగులేని రోజు నిస్త్రాణగా పెద్దామె పెందలకడే లేవకుండా పడుకుండిపోతుంది. ఆమెకు జ్వరమొచ్చిందేమోనని స్నిగ్ధ ఆమె మెడ కింద చెయ్యి పెట్టి చూసింది. ఐతే ఆమె ఒళ్ళు చల్లగా తగిలింది. “నాయనమ్మా లే” అంటూ పెద్దామెను అటూ ఇటూ ఊపింది. ఆమె అమాంతం నేలమీద పడింది. ఆ అమ్మాయికి పెద్ద అనుమానమే వచ్చింది. “అమ్మా” అని అరుస్తూ కిచెన్ వేపుకు పరుగెట్టింది. అరుణ అప్పటికే లేచి వంట పనులు ప్రారంభించింది.

అరుణ, ఆనంద్(స్నిగ్ధ వాళ్ళ నాన్న) ఆఫీసులకు, స్నిగ్ధ స్కూలుకు వెళ్ళాలి కాబట్టి ఆమె ఉదయం అల్పాహారం తయారు చెయ్యడం, ముగ్గురికీ లంచ్ బాక్స్ లు సర్దడంతో సతమతమౌతూ ఉంటుంది. పెద్దామె మామూలుగా ఐతే తను పూలు కోసుకొచ్చింతర్వాత, వంట పనిలో అరుణకు సహాయపడుతూ ఉంటుంది. ఆరోజు ఆమెకు అలసటగా ఉందేమోనని అరుణ అనుకుంది. కానీ స్నిగ్ధ అరుచుకుంటూ రావడంతో ఏదో తేడా ఉన్నట్లు ఆమెకర్ధమయ్యింది.

“ఏమయ్యిందో చూద్దాం పద” అంటూ బెడ్రూంలోకి వడివడిగా వెళ్ళింది. నేల మీద పడి ఉన్న పెద్దామెను చూడగానే అనుమానం వచ్చి ఆనంద్ తో “ఏమండీ ఒక్క సారి థర్డ్ ఫ్లోర్లో ఉన్న డాక్టర్ గారిని పిలుచుకొస్తారా?” అంది. ఆనంద్ అప్పుడే బాల్కనీలో మొక్కలకు నీళ్ళు పోసి లోపలికొచ్చాడు. అమ్మకేదో అయ్యిందన్న విషయం అర్ధమై వెంటనే డాక్టర్ గారి కోసం పరుగెట్టాడు. ఈలోపల అరుణ అత్తగారిని తట్టి లేపడానికి ప్రయత్నించింది. శరీరం చల్లగా తగిలింది. ముక్కు దగ్గర వేలు పెట్టి చూసింది. శ్వాస ఆడుతూ ఉందో లేదో నిర్ధారణ కాలేదు. వెంటనే గుండె దగ్గర చెయ్యి పెట్టి అది కొట్టుకుంటూ ఉందో లేదో చూసింది. అంతలో డాక్టర్ శ్రీనివాస్ వచ్చారు. స్టెత్ తో పరీక్షించి “ఆంటీ చనిపోయారు. మూడు, నాలుగు గంటల క్రితం మాసివ్ హార్ట్ అటాక్ వచ్చినట్లుంది” అన్నాడాయన.

“హాస్పిటల్ కు తీసుకు వెళితే ఏమైనా చెయ్యగలరా సార్?” ఆనంద్ ఆదుర్దాగా అడిగాడు. “ఐ డోంట్ థింక్ దేర్ విల్బి ఎనీ యూజ్. ఇట్సాల్ ఓవర్ ఆనంద్ గారూ” ఒకింత బాధగా అన్నడతను. ఆ ఇంట్లో దుఖ్ఖం వరదలా పొంగింది. కావలసిన వాళ్ళు, రావలసిన వాళ్ళు వచ్చారు. జరగవలసిన కార్యక్రమాలు పూర్తయ్యాయి.

#

ఆనంద్, అరుణ పెద్ద వాళ్ళు కాబట్టి దుఖ్ఖాన్ని లోలోపలే దిగమింగుకుంటున్నారు. స్నిగ్ధ అలా చెయ్యలేక పోతూ ఉంది. రోజూ ఉదయం తను లేచి బాత్రూంకెళ్ళి రాగానే అమ్మ తనకు పాలు కలిపి ఇస్తుంది. సగం కప్పు పూర్తవ్వంగానే “నాయనమ్మా ఇంకా ఎంతసేపు? నాకు టైమవుతోంది జడెయ్యాలి తొందరగా రా” అంటూ అరుస్తుంది. ఆమె

“కొద్దిసేపాగమ్మా. మీ అమ్మకు ఈ బెండకాయలు తరిగిచ్చి వస్తాను” అంటే స్నిగ్ధ వెంటనే ఏడుపు లంకించుకునేది. ఆ అమ్మాయికి తను పాలు తాగీతాగంగానే తనకు జడవేసే కార్యక్రమం మొదలవ్వాలి. లేదంటే చాలా ఆలస్యమై పోయిందని ఏడవడం మొదలెడుతుంది. అరుణ అసలే పని హడావిడిలో ఉండడం వల్ల గట్టిగా అరుస్తుంది. చిన్న పిల్ల కొంచెంసేపయ్యాక కుయ్యిమనడం ఆపుతుంది. స్నానం చేసింతర్వాత స్నిగ్ధ టిఫిన్ కార్యక్రమం పూర్తవుతుంది. వెంటనే నాయనమ్మా, మనవరాలు ఒకరినొకరు తొందర పెట్టుకుంటూ అపార్ట్మెంట్ కిందకు లిఫ్ట్లో దిగుతారు. పెద్దామె పిల్లను స్కూల్ బస్సెక్కించి ఇంటికి తిరిగి వస్తుంది. మళ్ళీ మధ్యాహ్నం నాల్గింటికి స్కూల్ బస్సులోంచి స్నిగ్ధను దింపుకుని ఇంట్లో ఆ అమ్మాయికి కొసరి, కసిరి భోజనం తినిపిస్తుంది.

స్నిగ్ధకిదంతా విసుగ్గా ఉంటుంది. ముఖ్యంగా ఆ అమ్మాయికి పెరుగన్నం తినటమంటే ఇష్తం లేదు. పిల్ల తినదు. పెద్దామె వదలదు. “నాకొద్దు. పెరుగన్నం వాసనంటే అసహ్యం” అంటుంది స్నిగ్ధ. “కడుపులో చల్లగా ఉండాలంటే తిని తీరాల్సిందే” పెద్దామె మంకు పట్టు పడుతుంది. అలా వాళ్ళిద్దరూ టాం అండ్ జెర్రీలా, అత్తా, కోడళ్ళలా, పాత సినిమాల్లోని సూర్యకాంతం, చాయాదేవిలా పోట్లాడుకునే వారు. అన్నం తినడం, తినిపించడం అనేది ఒక రచ్చతో కూడిన ప్రహసనంలా ఉండేది. దాని ప్రభావంతో అది పూర్తయ్యాక గంట, గంటన్నర వరకు వాళ్ళిద్దరి మధ్యన మాటలుండేవి కాదు. తర్వాత మళ్ళీ మామూలే. రాత్రయ్యిందంటే చాలు స్నిగ్ధ ఆమె పొట్టలో దూరి “కధ చెప్పు” అంటూ ఆమెను శాశించేది.

“సరే విను. సీతాదేవిని రావణుడెత్తుకెళ్ళింతర్వాత ఆమె అశోక వనంలో దిగులుగా రాముణ్ణి తలుచుకుంటూ ఉండేది. ఎప్పుడు ఆయనొచ్చి తనను కాపాడుతాడా అని ఆత్రంగా ఎదురు చూసేది. అలా చాలా రోజులు గడిచిన తర్వాత హనుమంతుడు లంకకు వచ్చాడు. సీతాదేవి దగ్గరకు వచ్చి ఆమెకు చూడామణిని ఇచ్చి, ధైర్యం చెప్పి, తర్వాత లంకా దహనం చేశాడు” అంటూ వర్ణించి రామాయణం, మహాభారతం, భాగవతం పిట్ట కధలుగా చెప్పేది. వింటూ వింటూ, ఊ కొడుతూ స్నిగ్ధ మధ్యలోనే బుల్లి గురకలు పెడుతూ నిద్రపోయేది.

ఇప్పుడు మాట్లాడడానికెవరూ లేరు. మరీ ముఖ్యంగా తనతో పోట్లాడటానికి సమఉజ్జీ అసలే లేదు. స్నిగ్ధ అమ్మా, నాన్నలిద్దరూ ఉద్యోగస్తులు కావడం వల్ల వాళ్ళతో తను గడిపే సమయం తక్కువ. ఆ అమ్మాయికి నాయనమ్మా, స్నేహితురాలు, శత్రువు అన్నీ పెద్దామే. ఆమె బతికున్నప్పుడు స్నిగ్ధకి ‘తోడు’ విలువ తెలియలేదు. ఇప్పుడు పెద్దామె లేని లోటు స్పష్టంగా తెలుస్తూ ఉంది. గతంలో జరిగిన ఒక ముఖ్యమైన సంఘటన ఆమెకు జ్ఞాపకానికొచ్చింది.

ఒక రోజు స్నిగ్ధతో తన క్లాస్మేట్ హరిణి “నేను కొత్తగూడెంలో జరిగే బాలోత్సవ్ కు వెళుతున్నాను. మా అమ్మా, నాన్నలు నాతో వస్తున్నారు” అంది. “అక్కడేం జరుగుతుంది?” స్నిగ్ధ. “లలిత కళల్లో చాలా పోటీలుంటాయట. మంచి బహుమతులిస్తారు. నేను సింగింగ్, డాన్స్ లో పాల్గొనబోతున్నాను” అంది. అది విన్న స్నిగ్ధ ఒక రకమైన ఉద్విగ్నతకు లోనయ్యింది. ఆరోజు సాయంత్రం ఆనంద్ తో “నాన్నా నేను కూడా బాలోత్సవ్లో పాల్గొంటాను” అంది. “ఆ టైంలో నాకు ఆఫీసు పనులుంటాయమ్మా. మనం వెళ్ళ లేక పోవచ్చు” అన్నాడు. “నాకదంతా తెలీదు. ఎలాగైనా నేను పాల్గొనాలి” మారాం చేసింది స్నిగ్ధ. ఆనంద్ సరేనని బాలోత్సవ్ తాలూకు దరఖాస్తు పూర్తి చేసి పంపించాడు. బాలోత్సవ్ రానే వచ్చింది. ఆనంద్, అరుణ ఇద్దరికీ తమ ఆఫీసుల్లో మీటింగులు, పనులు అడ్డం వచ్చాయి.

అప్పుడు పెద్దామె రంగంలోకి దిగింది. ఆ సమయంలో ఆమెకు కొంచెం నలతగా కూడా ఉంది. ఐనా “నానీ నువ్వేం బాధ పడకు. నిన్ను నేను తీసుకెళతాను. నువ్వు ప్రాక్టీసు మీద దృష్టి పెట్టు” అని అంతులేని భరోసా ఇచ్చింది. అన్నట్లుగా ఆ రోజు బస్టాండుకు స్నిగ్ధను తీసుకుని బయలుదేరింది. ఇక కొత్తగూడెంలో అన్నీ తానే అయ్యి స్నిగ్ధను సంతోషంగా వివిధ పోటీల్లో పాల్గొనేలా చేసింది. ఇప్పుడు స్నిగ్ధకు ఆ విషయాలన్నీ గుర్తుకొస్తున్నాయి. కూతురు పడుతున్న బాధ చాలా ఎక్కువగా ఉంది. ఆనంద్ కేం చెయ్యాలో పాలు పోవటం లేదు.

#

స్నిగ్ధ  పరిస్థితి అలా ఉంటే ఆనంద్ స్థితి అంతకంటే దారుణంగా ఉంది. తనకు చిన్నప్పుడే నాన్న యాక్సిడెంట్లో చనిపోయారు. ఇల్లు చుక్కాని లేని నావలా తయారయ్యింది. కొన్ని నెలలు అన్నిరకాలుగా ఇబ్బంది పడ్డ తర్వాత అమ్మకి కంపాషనేట్ గ్రౌండ్స్ లో డిపార్ట్మెంట్లో ఉద్యోగంవచ్చింది. దగ్గరి బంధువులు కొంతమంది

“పిల్లవాడు చిన్న వాడు. నువ్వు వయసులో ఉన్నావ్. మళ్ళీ పెళ్ళి చేసుకుంటే మీ ఇద్దరి జీవితం సాఫీగా సాగిపోతుంది” అన్నారు. అనడంతో ఆగక రెండేళ్ల క్రితం క్యాన్సర్ వ్యాధితో భార్యను పోగొట్టుకున్న శ్రీనివాసరావ్ అనే దూరపు బంధువు సంబంధం కూడా తెచ్చారు. అందుకు ఆమె

“వద్దండి, నేనిప్పుడు హాయిగానే ఉన్నాను. ఆయన వల్ల వచ్చిన ఉద్యోగం ఎలాగూ ఉంది. తన జ్ఞాపకాల్తోటి బతుకుతూ ఆనంద్ ను పెంచుకోగలననే నమ్మకముంది. నాకేదైనా అవసరమైతే మిమ్మల్ని తప్పకుండా అడుగుతాను” అని ధీమాగా అంది. అనడమే కాదు. ఆనంద్ కు అన్నీ తానై, అతనికి నాన్న లేని లోటు తెలియనీయక కావలసినవన్నీ సమకూర్చిపెట్టింది. ఆనంద్ కింకా గుర్తుంది. చిన్నప్పుడు తనతో ఆటలాడుతూ, సబ్జెక్ట్స్లో తనకి తెలియని విషయాలు ఒక స్నేహపాత్రమైన ఉపాధ్యాయురాలిలా బోధిస్తూ(ట్యూషన్ల జోలికి పోక), తననప్పుడప్పుడూ మంచి సినిమాలకు తీసుకెళుతూ, ఒక స్నేహితునిలా పెంచింది. తను ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు ఝాన్సీ లక్ష్మిలా ధైర్య సాహసాలు ప్రదర్శించింది. తనని సీనియర్లు రాగింగ్ చేస్తున్నారు. తను పైకి చెప్పుకోలేని చిత్రహింసననుభవించాడు. కళాశాల యాజమాన్యం పెద్దగా పట్టించుకోలేదు. ఒక దశలో సీనియర్ల పైశాచిక ప్రవర్తన వల్ల విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుందామనుకున్నాడు. అమ్మ తన అంతులేని ఆవేదనను పసిగట్టింది. కళాశాల వాళ్ళతో

“మా ఆనంద్ మీ కళాశాలలో రాగింగ్ వల్ల చాలా నలిగిపోతున్నాడండి. పరిస్థితి చెయ్యిదాటక ముందే మీరు తక్షణ చర్య తీసుకోవాలి” అంది. ప్రిన్సిపల్

“రాగింగ్ అనేది ప్రొఫెషనల్ కాలేజీల్లో కామన్ అండి. దాన్ని ఈజీగా తీసుకోవాలి” అన్నాడు.

“ఇది ఈజీగా తీసుకునే విషయం కాదండీ. సీనియర్లు ఆనంద్ తో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. మొన్న నగ్నంగా అతన్ని గ్రౌండ్ చుట్టూ పరుగెత్తించారట. ఇంకా పైకి చెప్పుకోలేనివి చాలా జరుగుతున్నాయి. రేపేదైనా జరగరానిది జరిగితే మీరేం చేస్తారు?” అని ఘాటుగా, గట్టిగా వాదించింది. యాజమాన్యం విచారణ చేసి తప్పు చేసిన సీనియర్లను కాలేజీ నుంచి కొన్ని రోజులు సస్పెండ్ చేసింది. అందు వల్ల ఆనందే కాక మిగతా జూనియర్లందరూ ఊపిరి పీల్చుకున్నారు. అప్పుడే కాదు తనకు ప్రతి సందర్భంలో ఆసరా ఇస్తూనే ఉంది. తన అన్ని విజయాలకు, సంతోషానికీ ముఖ్య కారణం ఆమే.

అరుణకు కూడా అత్తయ్యతో అనుబంధం గాఢమైనదే. ఆనంద్ తో పెళ్ళయ్యింతర్వాత అరుణ వాళ్ళ తల్లిదండ్రులు రైలు ప్రమాదంలో చనిపోయారు. అప్పటినుంచి అత్తయ్యే ఆమెకు అమ్మయ్యింది. సాధారణంగా కుటుంబాల్లో అత్తా, కోడళ్ళ మధ్యన ఉండే అంతర్లీనమైన సంఘర్షణ వాళ్ళ మధ్య లేదు. దానికి బదులుగా వాళ్ళిద్దరి నడుమ ఒక గాఢమైన అనుబంధం ఏర్పడింది. అలాంటి అమూల్యమైన తోడును అరుణ ఇప్పుడు కోల్పోయింది.

#

ఒక రోజు రాత్రి స్నిగ్ధ నిద్రలో కలవరిస్తూ “జడెయ్యమంటుంటే ఆలస్యం చేస్తావేంటి? స్కూల్ కి టైమైపోయింది. నువ్వెప్పుడూ ఇంతే” అంటూ ఏడుపు లంకించుకుంది. ఆ శబ్దానికి ఆనంద్, అరుణ నిద్ర లేచారు. పెద్దామె పోయిన దగ్గర్నుంచీ స్నిగ్ధ వాళ్ళిద్దరి మధ్యన పడుకుంటోంది. చాలా సేపటిగ్గానీ ఆ అమ్మాయి దుఖఃమాగలేదు. ఇంకోరాత్రి “నేను పెరుగన్నం తిననే దెయ్యం. నువ్వేం చేస్తావో చేసుకోపో” అంటూ లేచి కూర్చుంది. దాదాపు ప్రతి రాత్రి అలాగే జరుగుతూ ఉంది. ఆనంద్, అరుణ మధన పడుతూనే ఉన్నారు. స్నిగ్ధ సర్వం కోల్పోయినదానిలా ఉంటోంది.

ఒక రోజు ఆనంద్ సాయంత్రం తనతోబాటు ఒక బుజ్జి కుక్క పిల్లను ఇంటికి తీసుకొచ్చాడు. అది ముద్దు మూతితో, అమాయకమైన కళ్ళతో బెదురు బెదురుగా చూస్తూ ఉంది. స్నిగ్ధ స్కూల్ నుంచి రాగానే హాల్లో అది కనిపించింది. ఆమెకు దాన్ని చూడగానే చాలా ముచ్చటేసింది. ముందు తనే దాని దగ్గరకెళ్లి నెమ్మదిగా మచ్చిక చేసుకుంది. స్పూకీ అని దానికి ముద్దు పేరు పెట్టుకుని అల్లారు ముద్దుగా చూసుకుంటోంది. రోజూ ఉదయం దానికి పాలు తాగించడం, భోజనం తినిపించడం, దాన్ని టాయిలెట్ కు తీసుకెళ్ళడం లాంటి బాధ్యతలు తీసుకుంది.

పెద్దామె బ్రతికున్నప్పుడు స్నిగ్ధను సంగీతం నేర్చుకోమని పోరు పెట్టేది. ఆమెకు అన్నమయ్య, రామదాసు కీర్తనలు, త్యాగరాజ కృతులంటే చాలా ఇష్టం. ఐతే అప్పుడు ఆనంద్ ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఆమె పోయిన తర్వాత అతనికి ఆ విషయం గురించి ఆలోచన ఎక్కువయ్యింది. స్నిగ్ధను సంగీతం క్లాసుల్లో చేర్పించాడు. ఆ అమ్మాయి మొదట్లో కొంత సణిగినా నెమ్మదిగా పాటలంటే ఇష్టపడటం మొదలయ్యింది.

ఆనంద్ కు ఒక రోజు వాళ్ళ పెదనాన్న ఫోన్ చేశాడు. ఆయన గుజరాత్ లో వాళ్ళబ్బాయి వినోద్ దగ్గర ఉంటున్నాడు. వినోద్ అహమ్మదాబాద్ లో ఒక ఫార్మసీ కంపెనీలో పనిచేస్తున్నాడు. అతని భార్య కూడా ఉద్యోగే. వినోద్ వాళ్ళమ్మ కొన్ని సంవత్సరాల క్రితం క్యాన్సర్ వ్యాధితో చనిపోయింది. పెదనాన్న ఫోన్లో “ఆనంద్… వినోద్…” అన్నాడు. అతను ఆపైన మాట్లాడలేకపోయాడు. గొంతు గద్గదంగా ఉంది. “ఏంటి పెదనాన్నా. ఏం జరిగిందో చెప్పు” లాలనగా అన్నాడు ఆనంద్. “వినోద్, అతని భార్య విమల, వాళ్ళబ్బాయి తేజ మూడు రోజుల క్రితం ఢిల్లీ వెళ్ళారు. తిరుగు ప్రయాణంలో వాళ్ళెక్కిన  వోల్వో బస్సు నిన్న రాత్రి మంటల్లో చిక్కుకుని పూర్తిగా కాలిపోయింది. బస్సులో ఉన్న అందరు ప్రయాణీకులు సజీవ దహనమయ్యారు. బూడిద మాత్రమే మిగిలింది” అంటూ బావురుమన్నాడు.

ఆనంద్ హుటాహుటిన అహమ్మదాబాద్ చేరుకున్నాడు. జరగవలసిన కర్మకాండ జరిపించి, పెదనాన్నను తనతో బాటు వాళ్ళ ఊరికి తీసుకు వచ్చాడు. అప్పటి నుంచి పెద్దాయన వీళ్ళతోనే ఉంటున్నాడు. అరుణకు కూడా ఆయన రాక ఒకింత ఊరట కలిగించింది. వాళ్ళ కుటుంబానికి ఒక పెద్ద తోడు దొరికింది. స్నిగ్ధకు తాతయ్య మంచి నేస్తమయ్యాడు.

స్నిగ్ధ ఇదివరకటిలా హాయిగా నవ్వడం మొదలయ్యింది. అంతేకాక ఇప్పుడు బాల్కనీలోని పూల మొక్కలకూ, తులసీ మొక్కకూ ఆమె ఆత్మ బంధువైపొయింది. అవి పెద్దామె ఆత్మీయతను ఆ అమ్మాయి స్పర్శలో అనుభవిస్తున్నాయి. నాయనమ్మ లేనిలోటు పూడ్చలేనిదైనా ఇప్పుడు కొత్త బంధాలు, వ్యాపకాలు స్నిగ్ధకు తోడయ్యాయి. నాయనమ్మ మరణంతో ఏర్పడిన కుదుపువల్ల గాడి తప్పిన వాళ్ళ జీవితమనే రైలు ప్రయాణం మళ్ళీ పట్టాలెక్కి కొత్తదారిలో సాగిపోతూ ఉంది.

***

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *