March 4, 2024

39. నాలుగు చక్కెర రేణువులు

రచన: కృష్ణమూర్తి కడయింటి

 

సమయం సాయంత్రం ఐదు గంటలయ్యింది.

చేసే పనిని ప్రక్కన పెట్టి స్నానానికి లేచాను. సంధ్యా దీపం వెలిగించి “సంధ్యా దీప నమోస్తుతే”

అని ఒక నమస్కారం పెట్టుకుని సంధ్యా వందనానికి కూర్చోబోతూ అక్కడే తిరుగాడుతున్న రెండు చీమలను చూసి వాటిని పై పంచెతో దూరంగా

తోసి వేయ బోయాను. మరుక్షణంలో అవి తిరుగాడడంలో ఏదో ఆదుర్దా కనిపించడంతో కొంచెం పరిశీలనగా చూశాను. ఓ చీమ అక్కడ అచేతనంగా పడి ఉంది. దాని చుట్టూనే నేను మొదట చూసిన రెండు చీమలు అదుర్దా పడుతూ తిరుగుతున్నాయి. ఆ పడి ఉన్న చీమ ప్రాణంతో ఉందో లేక ప్రాణాలు కోల్పోయి ఉందో తెలియడం లేదు. వాటిని తోసి వేయాలనే సంకల్పం విరమించి ఆ చీమల అదుర్దాకు హడావిడికి కారణం తెలుసుకునే ప్రయత్నం చేశాను. ఈలోగా ఆ రెండు చీమలు ఆ అచేతనంగా ఉన్న చీమకు రెండు ప్రక్కలా చేరి ఒకటి నెట్టడానికీ రెండోది లాగడానికీ ప్రయత్నం చేశాయి. వాటి వల్ల కాలేదు. అంతటితో ఆ ప్రయత్నం విరమించాయి.

తిరిగి రెండూ మధ్యకు వచ్చి ఏవో మంతనాలు జరిపాయి. తర్వాత వేగంగా చెరో వైపుకి పరుగులు తీశాయి. అవి అలా వెళ్ళగానే నేను కూడా అంతే వేగంగా వెళ్ళి నా సులోచనాలు తెచ్చుకున్నాను. ఇప్పుడు పరిశీలనగా చూస్తే ఆ అచేతనంగా ఉన్నచీమ ముందు కాళ్ళు కాస్త కదలడం గమనించాను. అంటే ప్రాణంతో ఉందన్నమాట. ఈ చీమ ఏ కారణం చేతనో గాయ పడడమో లేదా అనారోగ్యానికి గురి కావడమో జరిగిందనీ, అది చూసిన ఆ రెండు చీమలూ ఈ చీమకు సాయం చేసే ప్రయత్నంలో ఉన్నయనీ గ్రహించాను.

ఈ లోగా ఎడమ వైపు వెళ్ళిన చీమ దారిలో కనిపించిన చీమల కేదో చెప్పడం ఆ విన్న చీమలు పరుగున వచ్చి ఆ అచేతనం గావున్న చీమను పరిశీలనగా చూడడం జరుగుతోంది. నేను గమనించలేదుగానీ కుడి వైపు వెళ్ళిన చీమ కూడా అదేపని చేస్తూ ఉంది. వీలయినన్ని చీమలకు సమాచారం తెలియజేసి దానికి తగిన వైద్యం చేయించాలని అవి పడే ఆదుర్దా నాకు కొంచెం ఆశ్చర్యమూ, ఏం జరుగుతుందో చూద్దామన్న ఆసక్తీ కలిగాయి.

పనిలో పనిగా ఆ చీమలకు నామకరణాలు చేసేసింది నామనసు. ఆ అచేతనం గా ఉన్న చీమకు ‘యమపోరి’ అని పేరు బెట్టింది. తర్వాత మొదటి రెండు చీమలలో ఎడమవైపు వెళ్ళిన దానికి కరుణ అనీ రెండో దానికి కారుణ్య అనీ పేర్లు ఖాయం చేసేసింది. నేనూ బాగున్నాయి అని కితాబిచ్చాను. ఈ కరుణ, కారుణ్యలను కలుసుకున్న చీమలన్నీ హడావిడిగా వచ్చి ఆ యమపోరిని పరిశీలనగా చూడడమూ వాటిలో అవి చర్చించుకోవడమూ ఎవరో తరుము కొస్తున్నట్లు వెళ్ళి పోవడమూ చేస్తున్నాయి. ఓ రెండు చీమలు మాత్రం మహా గంభీరంగా చర్చించుకోవడం కనిపించింది. ఈ సందడిలో నా తలలోకి ఓ ఆలోచన వచ్చింది. పాపం అవి అలా తిరగడం ఆహారానికై అయి ఉంటుందేమో అని. వెంటనే ఆ చీమలు కొంచెం దూరంగా జరగడం చూసి నా చేతికి అందు బాటులో ఉన్న చక్కెర సీసా మూత తీసి నాలుగైదు రేణువులు వాటికి దగ్గరగా వేశాను. నా కళ్లు మెఱిసాయి. నా ఆలోచన నిజమే లాగుంది. అవి ఆ చక్కెర రేణువుల్ని గమనించాయి. వెంటనే ఓ రేణువును తరలించడానికి ప్రయత్నించాయి. వాటి వల్ల కాలేదు. నా తల మళ్లీ పని జేసింది. ఆ చీమలు దూరం వెళ్లడం గమనించి నా గోటితో ఆ చక్కెర రేణువుల్ని చిదిమాను. అన్నట్లు ఆ రెండు చీమలకు అన్నపూర్ణ అనీ విశాలాక్షి అనీ నేను పేర్లు పెట్టాను. అన్నపూర్ణ ఆ చిదిమిన చక్కెరను చూసి విశాలాక్షిని తీసుకొచ్చి చూపించింది. తర్వాత అవి వాదులాడుకున్నాయి. తర్వాత విశాలాక్షి మరో చక్కెర అణువు దగ్గరకెళ్ళి చూసి తర్వాత అన్నపూర్ణకు చూపించి ఏదో నచ్చ జెప్పినట్లు నాకు తోచింది. తర్వాత విశాలాక్షి అన్నపూర్ణకు ఏదో సలహా ఇస్తున్నట్లుగా కూడా నాకు అనిపించింది.

అన్నపూర్ణ ఆ సలహాకు అంగీకారం తెలిపి పనిలోకి దిగింది. ఆ రెండో చిదిమిన చక్కెర నుంచి ఒక్కొక్క చిన్న రేణువును తీసుకెళ్ళి యమపోరి నోటికి అందించసాగింది అన్నపూర్ణ. ఈలోగా విశాలాక్షి మరొక చీమకు కూడా ఇదే పని పురమాయించింది. అది కూడా ఒక్కొక్క చక్కెర అణువును తీసుకెళ్ళడం యమపోరికి అందించడం చేయసాగింది. అవి మొదటి చక్కెర రేణువు(చిదిమిన) దగ్గరకు వెళ్ళడం లేదు. కారణం ఏమయి ఉంటుందా అని ఆలోచించాను. అవి వాదులాడుకోవడం లోని కదలికలు నాకు ఇలా తోచాయి. ఈ రేణువును ఎవరో మనం తరలించడానికి ప్రయత్నం చేసిన తర్వాత చిదిమారు. వారికి ఏమయినా దురుద్దేశ్యం ఉందేమో? లేదా ఏమయినా కలిపారేమో అన్న సందేహం వెలిబుచ్చింది విశాలాక్షి. అన్నపూర్ణ అందుకు అంగీకరించక పోయినా ఎందుకు అనుమానంతో ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడం అనుకొని, విశాలాక్షి మరో మార్గం (చిదిమిన చక్కెర) చూపిస్తానంటోందిగా అక్కడికే వెళ్లడమే మంచిది అని ఆమె అభిప్రాయానికి విలువనిచ్చి అనుమానం లేని ఆహారాన్ని యమపోరికి అందించడానికి పూనుకుంది.

నా అవగాహన సరైనదే అన్నదానికి ఋజువుగా మొదటి చక్కెర రేణువుల దగ్గరకు మరే చీమా వెళ్ళలేదు.

యమపోరికి ఆహార సమస్య కొంతవరకు తీరింది. నేను గమనించిన ఇంకో విషయం ఏమిటంటే అక్కడ మూడు నాలుగు చోట్ల చిదిమిన చక్కెర ఉన్నా విశాలాక్షి చూపిన చక్కెరనే అవి తీసుకుని వెళ్తున్నాయి. మిగతా చోట్లను అవి వచ్చి ఓ సారి వాసన చూచి వెళ్లాయే గానీ వాటి చుట్టూ మూగలేదు. ఈలోగా కరుణ, కారుణ్య చెరి రెండు మొత్తం నాలుగు చీమలను వెంటబెట్టుకుని వచ్చాయి. అవి వచ్చి యమపోరిని చాలా జాగ్రత్తగా పరిశీలించాయి. తమలో మంతనాలు జరుపుకున్నాయి. అవుననీ కాదనీ కావచ్చు అనీ వాదులాడుకుని ఏకాభిప్రాయానికి వచ్చే ముందు  విశాలాక్షిని ఏమిటేమిటో వివరాలడిగాయి. వారడిగిన వివరాలు వారికి తెలియజేసి తర్వాత అందులో రెండు చీమలను తీసుకుని వచ్చి అన్నపూర్ణ మరో చీమ తో కలిసి చేసే పనిని చూపించింది. అవి కూడా ఆ చిదిమిన చక్కెర ను పరీక్షించాయి. తిరిగి వెళ్ళి వాటితో కూడా వచ్చిన చీమలకు తాము చూసి వచ్చిన  విషయాన్ని వివరించాయి. చర్చించుకున్నాయి. మళ్ళీ యమపోరి దగ్గరకు వెళ్ళి విశాలాక్షికీ కరుణకూ, కారుణ్యకూ ఏవో సలహాలిచ్చాయి. ఆ సలహాలు విన్న వెంటనే కరుణ కారుణ్య ఎక్కడికో పరుగులు తీశారు. విశాలాక్షి మరో చీమ కలిసి యమపోరితో ఏదో చెప్పడమో అడగడమో చేస్తున్నారు. నాకు అవగతం కాలేదు గానీ ఆ మాటలు వింటున్నప్పుడు యమపోరి తన కదులుతున్న ముందు కాళ్ళను మరింత వేగంగా కదిలించడం గమనించాను. విశాలాక్షి తర్వాత యమపోరిని ఏదో బ్రతిమలాడుతున్నట్లుగానూ,  ‘చెబితే వినిపించుకోదూ’ అని మరో చీమతో చెబుతున్నట్లుగా నాకు అనిపించింది. నేనేమయినా కల్పించుకుని సాయం చేద్దామా అంటే నాకు చీమల భాష రాదాయె. ఒక వేళ వాటికేమయినా నా భాష వస్తుందేమో అన్నసందేహం వచ్చి ఏదో అనబోయాను. మళ్ళీ నా తల పని చేసింది. నా భాష అర్థం అయినా కాకపోయినా నోరు తెరిచి మాట్లాడితే వచ్చే గాలికో తుంపర్లకో వాటి పనికి అంతరాయం కలిగితే పాపం ఆ యమపోరికి సాయానికి బదులు మరింత హాని చేసినట్లవు తుందని అనిపించి ఆ ప్రయత్నం మానుకున్నాను.

ఈలోగా కారుణ్య వచ్చింది. అప్పుడు విశాలాక్షి ఆమెతో యమపోరి  ఆ వచ్చిన వారు చెప్పినది కాదంటున్నాదనీ బ్రతిమలాడినా ససేమిరా అంటున్నదనీ చెప్పింది. ఈ మాటలు విన్న యమపోరి కారుణ్యను పిలిచింది. కారుణ్య వెళ్ళి యమపోరి చెప్పింది విని విశాలాక్షితో “ఈమె ఏమంటున్నాదంటే ఇంతకుముందు ఇదే అనారోగ్యం వస్తే ఆ వైద్యం వికటించిందనీ మళ్లీ ఎవరో వేరే వాళ్లు వచ్చి క్రొత్త మందులిచ్చారనీ అప్పుడు బాగయిందనీ చెబుతున్నాది” అని సర్ది చెప్పింది. విశాలాక్షి కూడా అందుకు సమ్మతించింది. ముందు వైద్యం పట్ల రోగికి నమ్మకం కలగాలి గదా అనుకుంది. అప్పుడు కరుణ వచ్చి విశాలాక్షిని దూరంగా పిలిచి యమపోరికి వినిపించకుండా వైద్యాలయానికి వెళ్ళి వచ్చాననీ వారు వెంటనే రోగిని తీసుకుని రమ్మన్నారనీ చెప్పింది. కానీ ఎలా తీసుకుని వెళ్లడం అనే విషయం పైన తర్జన భర్జనలు గావించాయి. అప్పుడు విశాలాక్షి “ఇప్పుడే వస్తానుండండి” అని కరుణకూ కారుణ్యకూ చెప్పి ఏదో ఆలోచిస్తూ బయలుదేరింది. కొంచెం దూరం వెళ్ళి ఎవరో ఎదురొస్తే వారినేదో అడిగింది. వారి పేరు సహాయం అని పెట్టాను నేను. ఆ సహాయం వచ్చి యమపోరిని చూసి తల పంకించి కరుణతో కాసేపు మంతనాలాడి విశాలాక్షికి ఒక్క నిమిషంలో వస్తాను అనిచెప్పి వేగంగా వెళ్ళి పోయాడు. అలా వెళ్ళిన సహాయం మరో చీమను వెంట బెట్టుకుని వచ్చాడు. ఆ వచ్చిన వాడు యమపోరిని రెండు ప్రదక్షిణలు చేసి చూసి కారుణ్యతో ఏదో ఖరాఖండిగా చెప్పాడు. వాడి పేరు పాదరసం అని చెప్పారు వారు. ఆ పాదరసం ఖరాఖండిగా చెప్పినది ఈ యమపోరిని వైద్యాలయానికీ తీసుకుని వెళ్ళవలసినదే కానీ ఇక్కడ వైద్యం కుదరదు, ఆలస్యం అసలు కుదరదు అన్నట్లుగా నాకు అర్థం అయ్యింది. కావలిస్తే నేను వీపు మీద మోసుకెళ్ళడానికి సిద్ధం అని కూడా చెప్పినట్లు నాకు తోచింది.

తర్వాత విశాలాక్షీ కారుణ్య కరుణ అన్నపూర్ణ నలుగురూ తలలు చేర్చి చర్చించారు. ఒక అంగీకారానికి వచ్చిన తర్వాత కారుణ్య ఆ కొత్త చీమ పాదరసాన్ని వెంట బెట్టుకుని ఎక్కడికో వెళ్ళి తిరిగి తీసుకుని వచ్చింది. ఈ లోగా సహాయం మరో వస్తాదు లాంటి చీమను పిల్చుకొచ్చాడు. వాడు కాస్త గంభీరంగా ఉన్నట్లు అనిపించింది నాకు. సహాయం ఆ వస్తాదుతో చేయవలసిన పని వివరించాడు. జాగ్రత్తగా చేయాలి సుమా అని హెచ్చరించాడు. అన్నింటికీ వాడు తమ ఆజ్ఞ అన్నట్లు తల పైకీ క్రిందికీ ఊపాడు. తర్వాత ఆ వస్తాదు తన నైపుణ్యం అంతా చూపిస్తూ యమపోరికి ఏ మాత్రం బాధ కలగని రీతిలో పైకి లేవదీసి పాదరసం వీపు మీద జాగ్రత్తగా పడుకో బెట్టాడు. సహాయం కరుణా కారుణ్య అతనికి సాయం చేశారు.   అంతా అయింతర్వాత బొటన వ్రేలు ఎత్తి ఆడించాడు వస్తాదు. అంతే, పాదరసం విడిచిన బాణంలా ఇంతకు మునుపు కారుణ్య చూపించిన చోటికి పరుగులు తీశాడు. ఆ వేగాన్ని నా కళ్లు అందుకోలేక పోయాయి. అన్నపూర్ణా విశాలాక్షీ, కరుణా, కారుణ్యా అంతా తృప్తిగా ఊపిరి పీల్చుకున్నారు. అన్నపూర్ణ విశాలాక్షిలు తమ ఒప్పందం మేరకు సహాయానికీ, వస్తాదుకీ చిదిమిన చక్కెర లను అప్పగించారు. పాదరసం సంగతి తాము చూసుకుంటామని వస్తాదూ సహాయం చెప్పారు . కరుణా కారుణ్యా అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అన్నపూర్ణా విశాలాక్షీ వచ్చి కరుణా కారుణ్యల వీపులు తట్టారు. యమపోరికి మంచి వైద్యం అందుతుందనీ ప్రక్కరోజుకి మనలాగే తిరుగుతుందనీ భరోసా యిచ్చారు. కరుణ కారుణ్యల కళ్లు తడి అయ్యాయి. వారిని సాగనంపి యమపోరి అప్పటి వరకూ పడుకుని ఉన్న స్థలాన్ని ఇద్దరూ కలిసి శుభ్రం చేసి వెళ్తూ వెళ్తూ సహాయానికీ వస్తాదుకూ చేతులూపి యమపోరి దగ్గరకు బయలుదేరారు.

ఆచమనం దగ్గరే ఆగిపోయిన నా సంధ్యా వందనాన్ని కొనసాగించాను. కొనసాగిస్తూ ఆలోచించాను. అనారోగ్యమో, ప్రమాదమో, ఒక గాయపడిన చీమను అదుకోవడానికి అల్ప జీవులని మనం భావించే చీమలు ఎంత ఆదుర్దా పడ్డాయి. ఎవరికి తోచిన సాయం వారు చేసి ఆ చీమను కాపాడాయి. కేవలం కాపాడడం కాదు, అవి పడిన ఆందోళన ఆదుర్దా  అవి చేసిన చర్చలూ విషయ సేకరణా ఆలోచనలూ గమనిస్తే మనం ఎందుకు బ్రదికి ఉన్నట్టు? అన్న అనుమానం రావట్లేదూ.  తీపి ఇష్ట పడే చీమలు తమచుట్టూ పడి ఉన్న చక్కెర రేణువులను కూడా పట్టించుకోలేదు. తమకు సాయం చేసిన సహాయానికీ వస్తాదుకూ ఆ చక్కెర రేణువుల్ని అప్పగించాయి. ఈ కార్యక్రమంలో అన్నీ కలిసి పది పదిహేను చీమలయినా పాలు పంచుకున్నాయి. నిస్వార్థంగా.

అప్పుడు నా తల కాస్త పైకి లేచింది. ఆ సాయంలో నా పాలు కూడా ఉందిగా. అవును ఉంది. “నాలుగు చక్కెర రేణువులు”.

ఈ ఆలోచనతో నా సంధ్యా వందనం తృప్తిగా ముగించి యమపోరి ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ ఓ పాతిక సార్లు గాయత్రీ మంత్రం జపించి లేచాను.

ఇంతకూ ఆ యమపోరికి కరుణ, కారుణ్య, విశాలాక్షి, అన్నపూర్ణలు బంధువులా, తెలిసినవాళ్ళా, స్నేహితులా కనీసం “వాళ్ల” వాళ్లా?

ఏమో?? ఆ ఆరాలన్నీ ‘మనుషు’ లమైన  మనకు గదా!!!!

స్వస్తి.

 

**********oOo************

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *