December 3, 2023

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 41

విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య

 

అన్నమయ్య శ్రీనివాసుని ఘనతను గురించి మనకు వివరిస్తున్నాడు. శ్రీమహావిష్ణువే అన్నిటికీ మూలము అని ఎలుగెత్తి చాటుతున్నాడు భక్త హృదయాలకు. వివరాలను కీర్తనలో చూద్దాం.

 

కీర్తన:

పల్లవి: అన్నిటి మూలం బతఁడు

వెన్నుని కంటెను వేల్పులు లేరు                         || అన్నిటి ||

.1. పంచభూతముల ప్రపంచ మూలము

ముంచిన బ్రహ్మము మూలము

పొంచిన జీవుల పుట్టుగు మూలము

యెంచఁగ దైవము యితఁడే కాఁడా                           || అన్నిటి ||

.2. వెనుకొని పొగడేటి వేదాల మూలము

మునుల తపములకు మూలము

ఘనయజ్ఞాదుల కర్మపు మూలము

యెనలేని దైవ మితఁడే కాఁడా                               || అన్నిటి ||

.3. అగపడి సురలకు నమృత మూలము

ముగ్గురు మూర్తులకు మూలము

నగు శ్రీవేంకటనాథుఁడే మూలము

యెగువ లోకపతి యితఁడే కాఁడా                          || అన్నిటి ||

(రాగం: రామక్రియ, సం.3 సంకీ.491)

 

విశ్లేషణ:

పల్లవి: అన్నిటి మూలం బతఁడు

వెన్నుని కంటెను వేల్పులు లేరు

సర్వ సృష్టికి మూలస్తంభము శ్రీ వేంకటేశ్వరుడే! శ్రీ మహావిష్ణువుకన్న ఘనమైన దైవమీ యిలలోలేదు. ఆయన శరణు వేడండి. కైవల్యప్రాప్తిని సులభంగా పొందండి అని ఉద్భోదించడం కీర్తనలోని సారాంశం

 

.1. పంచభూతముల ప్రపంచ మూలము

ముంచిన బ్రహ్మము మూలము

పొంచిన జీవుల పుట్టుగు మూలము

యెంచఁగ దైవము యితఁడే కాఁడా

            పంచభూతములు అనగా మనిషి ప్రతి అడుగుకూ ఆధారభూతమైన భూమండలం, మనిషి జన్మించినదాది మరణించే వరకూ ఊపిరినిచ్చే వాయువు, మనిషి దాహాన్ని తీర్చి సేదనిచ్చే నీరు, మనిషిని జీవితాంతం తల్లి గర్భంలా కాపాడే ఆకాశము, జీవించడానికి శక్తినిచ్చే అగ్ని,  ఇవన్నీ కూడా ప్రపంచాన్ని నడిపిస్తున్నాయి. కానీ పంచభూతాలకు మూలము శ్రీనివాసుడు. ఆయనే చతుర్ముఖుడైన బ్రహ్మ, సృష్టికి మూలమైన వానికి కూడా మూలమితడే. ఇతని యందే బ్రహ్మ జన్మించాడు. మరి మనము నిత్యము నిరతము తలచవలసినవాడు శ్రీమహావిష్ణువే కదా! అన్య చింతనలెందుకు? ఆయన్ను సదా సేవించి ముక్తులవండి అంటున్నాడు అన్నమయ్య.         

  

.2. వెనుకొని పొగడేటి వేదాల మూలము

మునుల తపములకు మూలము

ఘనయజ్ఞాదుల కర్మపు మూలము

యెనలేని దైవ మితఁడే కాఁడా      

          చతుర్వేదముల ఘనతను మనకు తెలిపి వేద విహారుడై వేదాలలో విహరించే మహావిష్ణువితడే! సర్వ ముని, ఋషి జన సమూహములకు మూలమితడే! సమస్త సృష్టి ఇతని వలననే జనియించి లయిస్తున్నది. యజ్ఞ యాగాదులకు కర్త కర్మ క్రియ ఇతడే! యజ్ఞకర్తకు మించిన దైవము సృష్టిలో మరొకడు గలడా! అన్నిటికీ ఆది, అంత్యము యితడే! శరణు శరణని పాప పంకిలాన్ని పటాపంచలు గావించుకొనండి అంటున్నాడు అన్నమయ్య.

 

.3. అగపడి సురలకు నమృత మూలము

ముగ్గురు మూర్తులకు మూలము

నగు శ్రీవేంకటనాథుఁడే మూలము

యెగువ లోకపతి యితఁడే కాఁడా 

 

          ఒకనాడు క్షీరసాగర మధనంలో శ్రీమహావిష్ణువు సురాసురులకు మోహినిగా అగుపించి సురలకు అమృతపానం గావించిన ఘనమైన దేవుడు శ్రీమహావిష్ణువే కదా! బ్రహ్మ విష్ణు మహేశ్వరులన్న భేదం లేక  ముగ్గురికీ మూలమైన మూలపురుషుడు మహావిష్ణువే కదా! ఏడు ఊర్ధ్వలోకములైన భూలోకము, భువర్లోకము, సువర్లోకము, మహర్లోకము, జనలోకము, తపోలోకము, సత్యలోకములకు అధిపతి యితడే కదా! ఈతని మించిన దైవము చతుర్దశభువనములలో లేడు. ఆయన పదకమలాలను పట్టుకొని సేవించి సుగతులను పొందండి అని మనకు సందేశమిస్తున్నాడు కీర్తనలో అన్నమయ్య.

ముఖ్యమైన అర్ధాలు: మూలము = వేరు, ఊడ, మొదలు, సమీపము అనే అర్ధములున్నప్పటికీ ఇక్కడ ఆధారభూతము అనే అర్ధంలో గ్రహించదగును; వెన్నుడు = విష్ణువు; వేల్పు = దైవము, దేవత; పొంచిన = దాగిఉన్న; పెనుకొను = విలువ తెలుసుకొనుట; అల్లుకొనియుండుట; ఎగువలోకపతి = ఎగువనున్న అన్ని లోకములకు అధిపతి.

                                                                                                                          -0o0-

2 thoughts on “అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 41

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe to మాలిక పత్రిక

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

ఇటీవలి వ్యాఖ్యలు

కొత్త టపాలు

Categories

Archives

September 2019
M T W T F S S
« Aug   Oct »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30