April 26, 2024

తేనెలొలుకు తెలుగు – తెలుగు అంతర్జాల పత్రికలు

రచన: తుమ్మూరి రామ్మోహనరావు

గతనెల తెలుగు ముద్రిత పత్రికలను గురించి ముచ్చటించుకున్నాం. దానికి కొనసాగింపుగాఈ నెల అంతర్జాల పత్రికల గురించి నాకు తెలిసిన నాలుగు మాటలు.

మా చిన్నతనంలో స్విచ్చు వేయగానే లైటు వెలగటమే ఓ గొప్ప కింద భావించేవాళ్లం. దాని తరవాత రేడియో. గ్రామ్ ఫోన్ రికార్డ్, మైకు, ట్రాన్సిస్టర్, టెలిఫోన్ ఇలా ఒకటొకటి చూస్తూ ఆశ్చర్యపడే రోజులు.

ఆకాశంలో విమానం శబ్దం వినపడగానే బయటికి వచ్చి ఆకాశంలో చిన్నగా కనిపించే విమానాన్ని చూస్తూ సంబరపడే రోజులు. అలాంటి దశనుండి ఈ రోజు చేతిలో ఫోన్లోనే అనేక విచిత్రాలను చూస్తూ విస్మయపడే దశకు చేరుకున్నాం. సాంకేతిక విప్లవాల్లో విద్యుచ్ఛక్తి తరువాత మళ్లీ అంత స్థాయిలో వచ్చింది చరవాణి అనవచ్చు. ఇప్పుడొక చరవాణి చేతులో ఉంటే అదే ఫోన్, అదే టార్చ్ లైటు, ఆదే గడియారం, అదే కెమెరా, అదే పోస్ట్ బాక్స్, అదే క్యాలెండర్, అదే దిక్సూచి, అదే గణనయంత్రం, అదే టైప్రైటర్, అదే లైబ్రరీ, అదే డిక్షనరీ, అదే బ్యాంకు, అదే రికార్డర్, అదే రికార్డ్ ప్లేయర్, అదే వీడియో ప్లేయర్, అదే టీవీ, అదే రేడియో, అదే ఆస్ట్రాల్జర్, డాక్టర్, ఇంజనీర్, లాయర్, పబ్లిక్ ఎనౌన్సర్, ప్రచారసాధనం, వ్యాపారం, వంటశాల… ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా చాలా ఉన్నాయి.
ఇప్పుడు దాదాపు అన్ని పత్రికలు ముద్రణా రూపంలోనూ ఆన్ లైన్లోనూ వస్తున్నా, కేవలం అంతర్జాలంలో మాత్రమే నిర్వహించబడే పత్రికలు ఉన్నాయి. మొదటగా నేను చూసిన అంతర్జాల పత్రికలు ఒకటి కిరణ్ ప్రభగారు కాలిఫోర్నియా నుండి నిర్వహించే‘కౌముది’. రెండవది ‘ఈమాట’. కౌముది సచిత్ర మాసపత్రిక అనేక శీర్షికలతో ముఖచిత్రంతోపాటు లోపల కూడా అవసరాన్ని బట్టి చిత్రాలుండటమే గాక పేజీలు కాలమ్స్ ఉండి ముద్రిత పత్రికలానే ఉంటుంది. చిత్రాలకు వ్యాఖ్యలు రాయటంతోనే తన రచనావ్యాసంగానికి శ్రీకారం చుట్టుకున్న కిరణ్ ప్రభ గారు దశాబ్దానికిపైగా ఇప్పటికీ ఆ ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. ఈమాట సాహిత్య ప్రధానమైన పత్రిక. లబ్ధ ప్రతిష్టుల సాహిత్య వ్యాసాలు కవితలు అందులో చోటు చేసుకుంటాయి.

ఆ తరువాత అఫ్సర్ గారు ‘సారంగ’ప్రారంభించారు. అందులో అనేక ప్రక్రియలు ప్రోత్సహించబడు తున్నాయి. ఇటీవల వెబ్ మ్యాగజైన్ల సంఖ్య చాలా పెరిగింది. వారివారి దృక్పథాల ననుసరించి పత్రికలు రూపు దాలుస్తున్నాయి. శ్రీమతి జ్యోతి వలబోజు గారు వారి పుస్తక ముద్రణా బాధ్యతతో పాటు ‘మాలిక’ పత్రికను తెస్తున్నారు. అలాగే నాకు హ్యూస్టన్లో పరిచయమైన శ్రీమతి తీగవరపు శాంతిగారు చైతన్యం సంకల్పబలం అనే సచిత్రస వీడియో మాసపత్రికను గత ఎనిమిది సంవత్సరాలుగా నడిపిస్తున్నారు. అలాగే విహంగ, రాస్తా, అడుగువంటి పత్రికలు చాలా ఉన్నాయి. అలా అంతర్జాల పత్రికల వల్ల అనేక మందికి రాసే అవకాశం లభిస్తున్నది.

ఇక పోతే ఇటీవలి కాలంలో ఒక పెద్ద సంచలనం ఫేస్బుక్ అనటంలో సందేహంలేదు. ఫేస్బుక్ ను నిరంతర నిర్విరామ పాఠక భాగస్వామ్య అంతర్జాతీయ సర్వభాషా సచిత్ర సదృశ్య మాధ్యమ పత్రిక అని చెప్పాల్సి వస్తుంది అందులో కూడా సాహిత్యసంబంధమైన అనేక గ్రూపుల వల్ల చాలామంది భాషా వినిమయాన్ని చేస్తున్నారు. నిజం చెప్పాలంటే అది చాలామందిని స్నేహితులుగా మార్చింది. అది అందరికీ అనుభవైకవేద్యమైనది కనుక ఎక్కువ చెప్పనవసరం లేదు. ఫేస్ బుక్ లో కవిసంగమం ఒక సంచలనం. అలాగే గజల్ కవుల వేదికలు, పద్య ప్రియుల వేదికలు, కథా ప్రియుల వేదికలు, ఛందస్సుకు సంబంధించిన వేదికలు చాలా ఉన్నాయి. ఆలాగే ఇటీవల ఊపందుకున్న వాట్సప్. అదీ అలాగే ఇష్టానుసారమైన బృందాలతో అలరారుతున్నది. చాలామంది తెలుగు భాషగురించి అనవసరంగా భయపడుతున్నారు కానీ అంతర్జాలం భాషాభివృద్దికి చాలా తోడ్పడుతున్నది. అంతేగాక చాలా మంది అనేక సమాచారాలను అంతర్జాలంలో నిక్షిప్తం చేస్తుండంతో అంతర్జాలం రెడీ రెకనర్ అయ్యింది. దానికి గూగుల్ పెట్టింది పేరు.

ఏది ఏమైనా అంతర్జాలం ఒక మహా జాలం. మాయాజాలం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *