March 19, 2024

గరుడ పురాణం

రచన: శారదాప్రసాద్

వేదవ్యాస మహర్షి రాసిన అష్టాదశ పురాణాల్లో గరుడ పురాణం కూడా ఒకటి. గరుడుడు(గరుత్మంతుడు)పక్షులకు రాజు. అంతేకాదు శ్రీ మహావిష్ణువు వాహనం కూడా!ఈ పురాణంలో అనేక కధలు కూడా ఉన్నాయి. ఇవి విష్ణువుకు, గరుడుడికి జరిగిన సంభాషణ రూపంలో ఉంటాయి. విష్ణుమూర్తి వాహనమైన గరుత్మంతునికి ఒకసారి మరణానంతరం జీవుడు ఎక్కడికి వెళతాడు? ఆ జీవుడికి ఏయే గతులు కలుగుతాయి. తదితర సందేహాలు కలిగాయట. వాటన్నింటికీ విష్ణువే సమాధానాలు చెప్పి, గరుడుని సందేహ నివృత్తి చేశాడట. గరుడుని కోసం చెప్పింది కాబట్టి దీనికి గరుడ పురాణం అని పేరొచ్చింది. కొన్ని విషయాలను పాపాలని గరుడ పురాణం చెబుతోంది. అవి. . బ్రహ్మహత్య, శిశుహత్య, గో హత్య, స్త్రీ హత్యలతోబాటు గర్భపాతం చేసేవారు, రహస్యంగా పాపపు పని చేసేవారు, గురువులు, పండితులు, దేవతలు, స్త్రీ, శిశు ధనం హరించేవారు కూడా నరకంలో శిక్షలను అనుభవించక తప్పదంటుంది. ప్రతిమనిషికి భయం ఉండాలి. అది దైవభీతి కావచ్చు, పాపభీతి కావచ్చు. ఏదైనా.. ఆ భయం లేకుంటే మనిషికి, మృగానికి భేదం లేకుండా పోతుంది.
గరుడ పురాణంలో 19000 శ్లోకాలున్నాయి. ఇది రెండు భాగాలుగా ఉంటుంది. మొదటిది పూర్వ ఖండం, రెండవది ఉత్తర ఖండం. ఈ పురాణంలో చాలా విషయాలు చెప్పబడ్డాయి! ఖగోళం, వైద్యం, ఛందస్సు, రత్నాలను గురించిన విషయాలు . ఇలా చాలా విషయాలను గురించి ఇందులో చెప్పటం జరిగింది. ఉత్తర ఖండంలో మనిషి చనిపోయిన తర్వాత నుంచి మళ్ళీ మరో జన్మ ఎత్తేవరకూ జరిగే అన్ని విషయాలను శ్రీ మహా విష్ణువు వివరించాడు. ఈ పురాణాన్ని మొదట గరుడుడు కశ్యప మహర్షికి చెప్పాడు. గరుడుడు చెప్పిన కధలు కాబట్టి దీనికి గరుడ పురాణం అనే పేరు వచ్చింది కూడా. ఇవి ప్రతివారూ చదివి తెలుసుకోదగినవి. హిందువుల సంప్రదాయం ప్రకారం ఎవరైనా మరణిస్తే, వారి ఇంటిలో కర్మకాండలు చేస్తున్నవారికి సాధారణంగా పురోహితులు ఈ పురాణాన్ని చదివి వినిపిస్తారు. పురోహితులకు వీలుకాకపోతే కర్మలు చేసేవారు తామే చదువుకోవచ్చు!చనిపోయినవారి 13 రోజుల లోపు దీన్ని చదివి వినిపిస్తారు. దీన్ని వైష్ణవ పురాణంగా కూడా భావిస్తారు. భాగవత పురాణం , విష్ణు పురాణం, పద్మపురాణం, నారద పురాణం, వరాహ పురాణం మిగిలిన వైష్ణవ పురాణాలు.
గరుడ పురాణాన్ని సత్వ పురాణం అని కూడా అంటారు. అందులో నీతిని గురించి చెప్పటం వలన దానికి ఆ పేరు వచ్చింది. చనిపోయిన తర్వాత ప్రేతాత్మ అనుభవించే వివిధ నరక బాధలను గురించి ఇందులో చెప్పారు. భూమి మీద మనిషి చేసిన పాపకర్మల ఫలితమే ఈ బాధలు!అందుచేత గరుడ పురాణం ముఖ్యంగా చెప్పేది ఏమిటంటే , పాపాలు చెయ్యకుండా బతకమని! మృతుని బంధువులు , దేహ సంబంధీకులు మృతుని మరణం తర్వాత వారు చేయవలసిన ధర్మకార్యాలను కూడా ఇందులో వివరించపడ్డాయి. ఇటువంటి అశౌచికమైన విషయాలను గురించి ఈ పురాణంలో చెప్పటం వలన , సాధారణంగా దీన్ని ఎవరూ ఇళ్ళల్లో ఉంచుకోరు. అది ఒక భయం మాత్రమే! అంతమాత్రం చేత ఇందులోని పవిత్రమైన శ్లోకాలు ఎట్టి పరిస్థితులలోనూ అపవిత్రం కాలేదు, కావు! మానవుడు జనన మరణ శాఖాచక్రం నుండి విముక్తుడయి , మోక్షాన్ని యోగం ద్వారా ఎలా పొందాలో ఇందులో వివరించబడింది. మిగతా పురాణాల కన్నా దీనిలో ఇటువంటి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి.
మానవుని జనన మరణాలను గురించి, మరొక జన్మను గురించి గరుడుడు విష్ణువును చాలా విపులంగా అడిగాడు. శ్రీ మహా విష్ణువు కూడా వాటన్నిటికీ వివరంగా, విపులంగా సమాధానాలు చెప్పాడు. గరుడ పురాణాన్ని చదివిన వారు, ఇతరులకు చదివి వినిపించిన వారు తప్పక మోక్షాన్ని పొందుతారని హిందువుల నమ్మకం. మృతజీవికి తిరిగి ప్రాణాన్ని ఇచ్చే కొన్ని అద్భుతమైన శ్లోకాలు కూడా ఇందులో ఉన్నాయట!ఆ శ్లోకాలను చదివి గరుడుడు, కశ్యపుడు అలా చాలామందిని బతికించారట!గరుడపురాణం మనిషిని సన్మార్గంలో నడిపించడానికి మన ఋషులు రాసిన ఒక మహత్తరమైన గ్రంథం. గరుడ పురాణం చదివిన వారికి గరుడుడి దయ పూర్తిగా లభిస్తుంది! మనిషి మనిషిగా బతకాలంటే గరుడ పురాణం చదవాలని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు. గరుడపురాణం ఇంటిలో ఉండటం కూడా మంచిది కాదని జరిగే ప్రచారాలలో ఏమాత్రం యథార్థం లేదని పండితులు చెబుతున్నారు.

9 thoughts on “గరుడ పురాణం

  1. తెలియని విషయాలను తెలియచేసినందుకు ధన్యవాదాలు!

  2. గరుడపురాణాన్ని గురించి ఉన్న అపోహలను తొలగించినందుకు ధన్యవాదాలు!

  3. ఆసక్తికరమైన విషయాలను గురించి తెలిపినందుకు ధన్యవాదాలు!

  4. Maro…saari….Maro….janma…paapa…punyalu
    Aatma…yatra….gurtu..chesaru
    Sailee….Silpam…prasamsaneeyam
    Dhanya…vaadamulu

  5. “పాపాలు చెయ్యకుండా బతకమని! ”
    ప్రస్తుతపు పరిస్థితి : పాపాలు చేసి డబ్బు సంపాదించటమే ప్రజల ధేయం. నిజాయితి అనేమాటను  డిక్షనరీలో  తీసేస్తే మంచిదేమో . చక్కటి వ్యాసానికి ధన్యవాదాలు శారదా ఫ్రసాద్ గారు 
    నాగయ్య 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *