August 11, 2022

అర్చన 2020 – కలుపు మొక్క

రచన: ఉపేంద్ర రాచమళ్ల

బావిలోకి జారిపోతున్న బకెట్టులా… ఆలోచనల్లోకి దూరిపోతున్నాడు రామయ్య. ఆకలి మీద ధ్యాస లేదు… నిద్ర ఊసు అసలే లేదు. కూతురి వాలకం చూసినప్పటినుండి తనలో తానే కుమిలిపోతున్నాడు.
అటుమెసిలి ఇటు మెసిలి కళ్లు మూసుకున్న భార్య చటుక్కున లేచింది. భర్త అటు తిరిగి పడుకున్నప్పటికి మెలకువగానే ఉన్నాడని ఇట్టే గ్రహించింది. ”ఏమండి.. మీకు ఎంత బాధగా వుందో… నాకు అలాగే ఉంది. రేపు ఎలాగైనా అమ్మాయిని అడిగి విషయం తెలుసుకుంటాను. ఒంటికి నిద్ర లేకపోతే ఆరోగ్యం పాడవుతుంది. కాసేపైనా నిద్రపోండి..” బతిమాలింది.
”గల గల మాట్లాడే గంగ మూగనోము పట్టడం… చిట్టితల్లి చిరునవ్వులతో సంతోషాలు విరబూసే ఇల్లు నిశ్శబ్దంగా మారడం తట్టుకోలేక పోతున్నాను. నాకెందుకో భయంగా వుంది సీత” అతని చెంపలపై నుండి కారుతున్న కన్నీళ్లను బేడ్ షీట్ తాగుతోంది.
– – –
రెండు రోజుల తర్వాత ఒళ్ళు విరుచుకుంది వంట గది. వేడి వేడి టిఫిన్తో కూతురి గదిలోకి అడుగు పెట్టింది సీత. మంచంలో పడుకుని దిగులుగా కూర్చుంది కూతురు. ”నా బంగారు తల్లివి కదూ, లేమ్మా! ముఖం కడుక్కొని టిఫిన్ తిందువు గానీ, ఏదైనుంటే నాతో చెప్పాలిగానీ, ఇలా నీలో నువ్వే బాధపడితే ఎలా…. లేమ్మా! నాన్నైతే పిచ్చివాడిలానే చేస్తున్నాడు.” సీత గొంతు జీరబోయింది.
నాన్న మాట విన్పడగానే కంగారు పడింది. ”నాన్నకు ఏమైందమ్మా? ఎందుకలా చేస్తున్నాడు?” గంగలో ఆతృత పెరిగింది.
”మాటా, ముచ్చట లేకుండా, గంత అన్న మన్న తిన్నకుండా నువ్విలా ఉంటే, మేం మంచిగెలా వుంటం. నిన్ను కన్నతల్లిని నేను. నీ గురించి నాకు తెలవదా. ఏదో జరగరానిది జరిగితేనే ఇలా ఉంటావు. ఐనా తల్లిదండ్రులం మాకు చెప్పకపోతే ఎవరికి చెపుతావే” అన్నది సీత.
తల్లి మాటలు విన్న తరువాత కొంచెం తేలికపడింది. బ్రష్ చేసి, కొద్దిగా టిఫిన్ తిన్నది. కాసేపటికి ఆ రోజు రాత్రి జరిగిన ఘటన చెప్పసాగింది.

”నేను ఎప్పటిలానే రాధ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. హౌమ్ వర్క్ ్స అన్ని కంప్లీట్ చేశాము. తను పుట్టిన రోజు కోసం తీసుకున్న డ్రెస్ టైలర్ షాపులో ఉందంటే తీసుకురావడానికెళ్ళాం. మేము వెళ్ళే సరికి డ్రస్ పని ఇంకా పూర్తి కాలేదు. కంప్లీట్ అయ్యే వరకు అక్కడే కూర్చున్నాం. అప్పటికే రాత్రి పది అయింది. తిరిగి ఇంటికి బయలుదేరాం. చౌరస్తా నుండి ముందుకు వచ్చిన తరువాత పార్క్ దాటుతున్నాం అంతే! మేం ఊహించని షాక్ తగిలింది. ఎవరో ఒకతను హఠాత్తుగా రాధను పార్కుకు ఆనుకొని వున్న పెద్ద చెట్టు వెనక్కు లాక్కుపోయాడు. క్షణ కాలం కాళ్ళూ, చేతులు ఆడలేదు నాకు. భయంతో రాధ కేకలేస్తోంది. పార్కు మూసేయడంతో జనాలు కూడా ఎవరు లేరూ. అటూ ఇటూ చూశాను. వీధిలైట్లు కూడా వెలగడం లేదు. చుట్టంతా చీకటిగా వుంది. వెతుకులాడు తుంటే చేతికి ఒక కర్ర దొరికింది. దాన్ని పట్టుకుని అతని మీదకు పోయాను. బాగా తాగివున్నాడు కాబోలు వాసన గుప్పుమంటోంది. గట్టిగా ఒక్క దెబ్బ వేశాను. ఠక్కున వెనక్కి తిరిగి, నా జుట్టు పట్టుకుని దూరంగా విసిరేశాడు. నా కళ్ళు గిర్రున తిరిగాయి. కాసేపు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. పది నిమిషాలు గడిచాయి. మెల్లగా లేచి కూర్చున్నాను. అప్పటికే ఘోరం జరిగిపోయింది. ”ఏమవుతుందో ఏమోనని భయంగా వుందమ్మా! పోలీసులు వస్తారా? నన్ను వివరాలు అడుగుతారా… నీకు తెలుసుకదా… చిన్నప్పటినుండి నాకు పోలీసులంటే చచ్చేంత భయం” గంగ కళ్ళల్లో కన్నీటి ధారలు పొంగుతుంటే తల్లిని వాటేసుకుని భోరుమంది.
”అయ్యో! దేవుడా ఎంత పని జరిగింది. బంగారం లాంటి బిడ్డ జీవితాన్ని కుక్కలు చింపిన విస్తరి చేసాడే… వాడు మనిషా… గొడ్డా… వూర్కోమ్మా! నీకేం కాదు. మేము ఉన్నాముగా. రెండ్రోజులు మూగదానిలా ఉంటే నికేమయ్యిందోనని గుబులు గుబులు అవుతున్నాము” అన్నది సీత.
ఈ లోపు గదిలోకి వచ్చిన రామయ్య జరిగింది తెలుసుకుని హడలిపోయాడు. ‘తిండీ, తిప్పలు లేకుండా నా కూతురి గురించి నేనే ఇంతలా ఆలోచించానే, పాపం రాధ తండ్రి పరిస్థితి ఎలా వుందో?’ అనుకున్నాడు. వారిని పరామర్శించాలనే ఆలోచన కలిగింది. క్షణమాలస్యం చేయకుండా భార్య, కూతురితో రాధ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు.
కళ, కాంతి కోల్పోయిందా ఇల్లు. రామయ్య కుటుంబాన్ని చూసే సరికి రాధ తల్లికి ఎన్నడు లేని దు:ఖం తన్నుకొచ్చింది. ”నా కూతురికి చూడమ్మా ఏ గతి పట్టిందో… ఇకపై దాని బతుకెట్ల తెల్లారుతుందో… దేవుడు ఎంత అన్యాయం చేసాడు” గోడలు పగులుతాయా అన్నట్లు రోదిస్తుంది. రాధ వాళ్ళ నాన్న అయితే జీవచ్ఛవంలా మారిపోయాడు. రామయ్య కాస్త చొరవ తీసుకుని రాధ తండ్రిని కదిలించాడు.
”ఏం చెప్పమంటారు మా దరిద్రాన్ని… పోలీసులకు ఫిర్యాదు చేసి మూడు రోజులు కావొస్తోంది, నా కూతురు భవిష్యత్తును నాశనం ఆ దుర్మార్గుడు ఎవరో ఇంతవరకు తెలియలేదు. జన సంచారం తక్కువ వుండే పార్కు ఎంచుకొని అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పశువులా ప్రవర్తించిన వాడికి రెండింతలు శిక్ష పడితే బాగు. పెనుగులాటలో పైగా చీకటి కావడంతో రాధ ఆ నీచుని పోలికలు కూడా చెప్పలేకపోతుంది” నిరాశగా ముఖం పెట్టాడు.
ఈ లోపు పోలీసు కానిస్టేబుల్ వచ్చాడు. రాధను దగ్గరకు పిలిచాడు. ”చూడమ్మా… వూరికే ఏడుస్తూ కూర్చుంటే ఎలా… నీకు ఏం కాదు… ధైర్యంగా వుండు. ఆ రోజు నీతో పాటు మీ ఫ్రెండ్ ఉందని చెప్పావట కదా… ఆమెను ఎంక్వరీ చేయమని ఎస్.ఐ. గారు నన్ను పంపించారు” అంటుండగానే…
”తను మా అమ్మాయేనండి” అన్నాడు రామయ్య.
”మీరేం చేస్తున్నారిక్కడీ” కోపంగా చూసాడు కానిస్టేబుల్.
”పరామర్శించడానికి వచ్చాము సార్” అన్నాడు రామయ్య.
”ఓహో! అలాగా” అన్నట్లు తలూపి గంగను ఆరా తీశాడు. నన్ను దూరంగా విసిరేయడంతో స్ప హ తప్పాను. అంతకు మించి నాకు ఏమీ తెలవదని చెప్పింది. గంగ చెప్పిన దానిని పేపర్ మీద రాసుకుని వెళ్ళిపోయాడు.
కానిస్టేబుల్ వెళ్లిన తరువాత రాధను చూడగానే రామయ్య మనసు కకావికలమైంది. ”రాధా నిన్ను చూస్తుంటే.. నా ప్రాణం తరుక్కుపోతుందమ్మా. నా కూతురులాంటి దానివి. నీకీ గతి పట్టించినవాణ్ణి విడిచిపెట్టేది లేదు. నాకు తెలిసిన ఎస్.ఐ. ఒకతను వున్నాడు. వాడి సాయంతో నా వంతు ప్రయత్నం నేనూ చేస్తాను. దిగులు పడకు” అంటూ ఓదార్చి ఇంటికి బయలుదేరాడు రామయ్య.
– – –
రాత్రి అయింది. స్నేహితురాలికి జరిగిన అన్యాయం పదే పదే గుర్తుకొస్తుండటంతో తట్టుకోలేకపోతుంది. ఏదో తప్పు చేస్తున్నాను అనే భావన తనలో. నిజం చెపితే ఏం జరుగుతుందోననే భయం ఓ పక్క. ఎటూ తేల్చుకోలేక సతమతమవుతుంది గంగ.
నెత్తి మీద బరువు దించుకుంటే పోతుంది. గుండెలో బరువు… ఎదుటివారితో పంచుకుంటేనే తగ్గుతుందని అనుకుంది. మెల్లగా తల్లిదండ్రుల దగ్గరకు పోయి ఆ రోజు అత్యాచారం చేసిన వ్యక్తి తనకు తెలుసని చెప్పింది. కూతురి మాటలకు నిర్ఘాతపోయారు. అసలు విషయం రాధ వాళ్ళకు చెప్పాలా? వద్దా? ఎంతకీ తేలడం లేదు వాళ్ళకు.
”ఆ పిల్ల కూడా చూడలేదనే అంటుంది కదా… మనకెందుకండి… కోర్టులు, సాక్ష్యాలు అంటూ మన పిల్లను నలుగురిలో నిలబెడదామా?? వదిలేద్దామండీ” నోరు తెరిచింది సీత.
తీవ్రమైన ఆలోచనలో మునిగాడు రామయ్య. నిజం తెలిసినా చెప్పకపోతే జీవిత కాలం వెంటాడుతుంది. శాశ్వత కాల బాధ కంటే తాత్కాలిక ఇబ్బందులు ఎదుర్కోవడమే మేలనిపిస్తుది. ”ఇంత దుర్మార్గం చేసిన నీచుడెవరో తెలిసిన తర్వాత కూడా వూరుకుందామా? అదే మన కూతురైతే వదిలేస్తామా?” అనడంతో సీత ఎదురు చెప్పలేకపోయింది.
కోర్టులో ఎలాంటి వాతావరణం ఉంటుంది. అక్కడ ఎలా మసలుకోవాలో సూచనలిస్తూ… సాక్ష్యం చెప్పేందుకు గంగను మానసికంగా సిద్ధపరిచాడు. రామయ్య రాధ తండ్రికి ఫోన్ చేయడం, పోలీసులు ఆ కామాంధుడిని అరెస్ట్ చేయడం గంటల్లోనే జరిగిపోయింది.
తండ్రి చెప్పినట్లే కోర్టులో సాక్ష్యం చెప్పింది గంగ. సాక్ష్యాధారాలు రుజువు కావటంతో నిందితునికి యావజ్జీవ శిక్ష పడింది. అందరూ కోర్టు నుంచి బయటకు వస్తున్నారు.
రాధ, వాళ్ళ కుటుంబమంత రామయ్యకు చేతులెత్తి నమస్కరించి, కృతజ్ఞతలు చెప్పారు.
ఈలోపు చుట్టూ పోలీసులతో నిందితుడు కోర్టు బయటకు వచ్చాడు. తన పెంపకంలో ఏర్పడిన మచ్చను చూస్తూ… అవమానభారంతో… సిగ్గుతో తల వంచుకొని గట్టిగా ఏడుస్తూ… కోర్టు మెట్లపై కూలబడ్డాడు రామయ్య.
రామయ్యను, అతని భార్యను, కూతురి వైపు చూస్తూ… జీపులోకి ఎక్కాడు నిందితుడు. వారిలో ఒకడిగా ఉండలేకపోయాననే పశ్చాత్తాపం అతని కళ్ళ నిండా కురుస్తోంది.
తప్పు మన వైపు ఉన్నా… కప్పి పెట్టుకోకుండా… సరిచేయగలిగిన మనుషులున్నంత కాలం… సమాజం కాంతులీనుతూనే వుంటుంది.
– – –

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *