April 27, 2024

అర్చన 2020 – చేదు నిజం

రచన: మీనాక్షి చెరుకువాడ

అఖిల రోజూ లాగే పనంతా పూర్తి చేసుకుని తన గది కిటికీ దగ్గరగా ఉన్న వాలు కుర్చీలో చేతిలో పుస్తకంతో కూర్చుంది. జిల్లా పరిషత్ స్కూల్లో సుమారు నలభై ఒక్కేళ్ళ సుదీర్ఘ కాలం పని చేసి, పదవీ విరమణ అయి ఈ ఇల్లు కొనుక్కుంది.
ఆ కాలనీ ఊరికి కొంచెం దూరంగా ఉన్నా అన్ని ప్రాధమిక అవసరాలూ అందుబాటులో ఉన్న ప్రశాంతమైన ఏరియా కావడంతో తను అంతకుముందు కొనుకున్న అపార్ట్మెంట్ అమ్మేసిన సొమ్మూ, పదవీ విరమణ అందించిన సొమ్మూ కలిపి ఈ రెండంతస్తుల మేడ కొనుక్కుంది. దానికి ప్రతిగా అయిన వాళ్ళందరి కోపాలకూ గురి అయింది.
కంట నీరు తిరిగింది ప్చ్ .. ‘అయిన వాళ్ళు ‘ అని తను అనుకోవడమేనేమో, తను మాత్రం వాళ్ళకు ఏ.టీ ఏం .. అంతే. అంతలోకే ఫక్కున నవ్వొచ్చింది. అవును డీమోనిటైజేషన్ పుణ్యమా అని అవి ఒట్టిపోయినట్టే .. అంత్య కాలానికి కలిగిన జ్ఞానోదయంతో తను ఇప్పుడు అలాటి ఏ టీ ఏం గా మారడమే .. అందరి కోపాలకూ అసలు కారణం.
ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ అదే పనిగా మోగుతున్న హారన్ శబ్దాలకు ఇహ లోకంలోకి వచ్చి బయటకు చూసింది అఖిల. అరే .. తమ ఎదురింటికి రెండిళ్ళ అవతల ఉన్న సుమన వాళ్ళింటి ముందు మినీ వేన్ సామాను దింపుతూ అడ్డంగా ఉండి, ఆ పక్కనే అటునుంచి వచ్చేసిన ఓ కారు మూలంగా ట్రాఫిక్ జాం .. మనసు కన్నా వేగం కోరుకుంటున్న ఈ రోజుల్లో అసౌకర్యాన్ని ఎవరు భరిస్తారు! అలా ఎడా పెడా హారన్ కొట్టి తొందర చేస్తున్నారు.
ఇంతకూ సుమన వాళ్ళింట్లో ఎవరైనా ఖాళీ చేసారా? నిన్న కూడా సాయంత్రం మొక్కలకు నీళ్ళు పోస్తున్నప్పుడు కలిసింది, ఏం చెప్పలేదే ..’ అనుకుంటూ అటు చూస్తున్న అఖిలకు చేతిలో పిల్లాడితో ప్రియ కనబడింది .. సామాను జాగ్రత్తగా దించమని కాబోలు వాళ్ళతో చెబుతోంది.
అదేమిటీ వీళ్ళకేమైనా బదిలీ అయిందా! అంతే అయుంటుంది లేకపోతే సామానుతో సహా ఎందుకొచ్చేస్తారు? అనుకుంటూ మళ్ళీ కుర్చీలో కూలబడింది. ఏడ్నర్ధం కాబోలు అయింది ప్రియ పెళ్ళయి .. తనే ఆ పెళ్ళికి పెద్దమనిషి.
ప్రియ ఇంజనీరింగ్ లో ఉండగానే ప్రేమించడం, ఆ విషయం తెలిసి ఇంట్లో పెద్ద గొడవ .. ప్రియ ఏడుస్తూ తన దగ్గరకొచ్చి విషయం చెబితే తను అటు వాళ్ళతో, ఇటు వాళ్ళతో మాట్లాడి ఒప్పించి ఆ పెళ్ళి జరిగేటట్లు చూడడం .. ఇంకా అంతా నిన్నో మొన్నో జరిగినట్లు ఉంది. ఈ లోపే కొడుకు పుట్టి ఇద్దరి ఇళ్ళలో సర్దుబాటుతో రాకపోకలు మొదలయ్యాయి.
తను ఈ ఇంట్లోకి వచ్చేటప్పటికే చదువు ఆఖరేడాదిలో ఉండి కేంపస్ సెలక్షన్ లో రెండు మూడు జాబ్స్ వచ్చినా కాగ్నిజంట్ లో చేరి బెంగుళూరు పోస్టింగ్ వప్పుకోవడానికి కారణం మాత్రం చైతన్య అన్న విషయం తనకు మాత్రమే తెలుసు.. చైతన్య తనకు రెండేళ్ళు సీనియర్ అనీ, చాలా మంచి వాడనీ, తనంటే ప్రాణం అనీ ఇలా తన దగ్గరకు ఎప్పుడొచ్చినా చెప్పి ఊదరగొడుతూ ఉండేది. అసలు ఆ అబ్బాయిని మొదట తన దగ్గరకే తీసుకు వచ్చింది. తను అతనితో మాట్లాడి అన్ని రకాలుగా ప్రియకు తగిన వాడే అని నిర్ధారించుకున్నాకనే వాళ్ళకు అండగా నిలబడి వాళ్ళ పెళ్ళి గురించి మాట్లాడి ఒప్పించింది. మొదట సుమన, వాళ్ళాయన వ్యతిరేకించినా తరువాత వాళ్ళే మనస్పూర్తిగా ఒప్పుకుని పెళ్ళి చేసారు. వీళ్ళకు ప్రియ ఒక్కతే కూతురు. అటు చైతన్యకు ఓ చెల్లెలు .. తనూ ప్రియ కాలేజ్ లోనే బి టెక్ చేసింది. ఆ తరువాత ఆ పిల్లకూ పెళ్ళయి వెళ్ళిపోయింది.
ప్రియ పురిటికి వచ్చి సుమారు ఆరునెలలు ఇక్కడే ఉండిపోయింది, ఎక్కువ భాగం అఖిలతోనే గడిపేది. తిరిగి పిల్లాడితో వెళ్ళేటప్పుడు కూడా సొంత మనిషిలా బాధపడింది, ‘ బాగా అలవాటయిపోయావు పెద్దమ్మా’ అంటూ కంట తడి పెట్టుకుని వెళ్ళలేక వెళ్ళలేక వెళ్ళింది.. ఈ మధ్య ఎందుకో సుమన కూడా బాగా తగ్గించేసింది మాట్లాడడం .. హలో అంటే హలో అనడమే, ప్రియ సంగతి ఎత్తితే .. బానే ఉంది అంటూ మాట తుంచేయడం. మొదట్లో బాధపడినా తరువాత మనసు సరిపెట్టుకుంది అఖిల, మనుషులే అంత అనుకుంటూ. రెండేళ్ళ పరిచయం ఆ కుటుంబంతో అంతే కదా.’ దృష్టి పుస్తకం మీదకి వెళ్ళడం లేదెందుకనో .. లేచి జాగ్రత్తగా అలమారులో పెట్టేసి మళ్ళీ కిటికీ దగ్గర నిలబడింది అఖిల.
ఉదయాన్నే చేతిలో కాఫీ కప్పుతో పేపర్ చదువుతూ కూర్చున్న అఖిల తో అక్కడే అన్నీ సర్దుతూ గది చిమ్ముతున్న పార్వతి గొంతు సవరించుకుని నెమ్మదిగా మొదలు పెట్టింది. ‘ అమ్మ గారూ ఈ విషయం విన్నారూ !’
‘మొదలు పెట్టావుగా, ఎటూ వద్దన్నా ఆపవు.. వింటా చెప్పు ‘ చేతిలో పేపర్ పక్కన పడేసి వినడానికి ఉద్యుక్తురాలయింది అఖిల.
‘ మరే .. ప్రియమ్మ మొగుడికి ఇడాకులిచ్చేస్తదంట .. నువ్వూ వద్దు నీ కాపురం వద్దని తెగతెంపులు చేసుకుని …. ‘
యధాలాపంగా వింటున్న అఖిల ఉలిక్కి పడింది.
‘ఏయ్ మొద్దూ .. తప్పు, ఏమిటా వాగుడు? ఎవరైనా వింటే బాగుండదు. తప్పు ఊరుకో , ప్రియమ్మ వాళ్ళకీ ఇక్కడికే బదిలీ అయి ఉంటుంది, అందుకే సామానుతో వచ్చి ఉంటారు. ‘ చిరుకోపంగా అంది అఖిల.
‘ అయ్యో లేదమ్మగారూ .. నిన్న సుమనమ్మగోరే అయ్యగోరితో అంటుంటే విన్నా’ ఏమిటతని ఉద్దేశం? అంత తన వాళ్ళే ముఖ్యమనుకుంటే అసలు పెళ్ళెందుకు చేసుకున్నాడటా? అయినా మనమ్మాయికేం తక్కువ .. లక్షణంగా నెల తిరిగేసరికి బిళ్ళకుడుముల్లా లక్ష రూపాయలు సంపాదించుకుంటోంది .. చెప్పాలంటే అతనితో సమానంగా సంపాదిస్తోంది .. ఏం తక్కువని అతనికీ, ఆ మందకీ చాకిరీ చెయ్యాలి .. అసలు .. ‘ ప్రవాహంలా అత్యుత్సాహంగా సాగిపోతున్న ఆ మాటలకు అడ్డు తగులుతూ .. ‘ పార్వతీ, ఇల్లన్నాకా సవాలక్ష సమస్యలుంటాయి .. వాళ్ళేదో టెన్షన్ లో వెనకా ముందూ చూసుకోకుండా మాటాడుకుంటే, తప్పే! .. నువ్విలా ఊరంతా టాంటాం చేయ్యకూడదే .. నోరు మూసుకుని పని చూసుకో ‘ మందలింపుగా అంది.
‘ నేదమ్మగోరూ .. ‘ అంటూ ఏదో చెప్పబోయిన ఆమెని
‘ పార్వతీ ‘ అంటూ వారించింది అఖిల. అఖిల అలా గట్టిగా ‘పార్వతీ ‘ అందంటే ఇక పార్వతి మాటాడదు.
“ ఏటో .. ఈ అమ్మ .. అందరూ అడిగి మరీ సెప్పించుకుంతారు, సెప్పినా ఇనదు ‘ గొణుక్కుంటూ పనిలోబడింది.
తేనెటీగల్లాంటి గతజ్ఞాపకాల తేనెతుట్ట మీద గురి చూసి విసిరినట్టు తగిలాయి పార్వతి మాటలు అఖిలకు పొద్దున్నే.
కళ్ళు ప్రియ ఇంటివైపే చూస్తున్నా మనసెందుకో గతం వైపే పరుగులు తీస్తోంది. ఆరుగురు సంతానంలో మొదటి పిల్లగా పుట్టడమే తన నేరమా? లేక ఆ రోజుల్లోనే తన కాళ్ళ మీద తను నిలబడడమే కాక తన వాళ్ళందరినీ తీర్చి దిద్దడం తన నేరమా? తల్లీ తండ్రీ ‘అఖిల నా కూతురు కాదు పెద్ద కొడుకు’ అంటూ అందరితో గొప్పగా చెప్పుకుంటుంటే మురిసిపోయి తన గురించి ఆలోచించుకోకుండా చెల్లెళ్ళ .. తమ్ముళ్ళ చదువులూ, పెళ్ళిళ్ళూ అంటూ అదేదో గొప్ప ఘనకార్యం అన్న అపోహలో జీవితాన్ని కరిగించుకోవడం తన నేరమా? అక్కడకీ మధు తనకు ఎంతలా నచ్చ చెప్పేడు ఇవన్నీ నువ్వు పెళ్ళి చేసుకుని కూడా చెయ్యచ్చు, దానికి నా సహకారం తప్పకుండా ఉంటుందీ అని ‘ వింటేనా .. పాపం మధు తననెంతగానో ప్రేమించి తన మనసు ఎప్పటికైనా మారక పోతుందా అని ఎన్నేళ్ళు ఎదురుచూసాడు! తన బాధ్యతలు తీరాక, తమ ఇంటికి వచ్చాడు .. నేను అఖిలను పెళ్ళి చేసుకుందామనుకుంటున్నాను అని నాన్నతో అన్నప్పుడు .. ‘ ఈ వయసులో దానికి పెళ్ళేమిటి నాయనా .. నలుగురూ నవ్వరా, దానికి మేమూ .. మా కదీ తోడూ నీడా .. అయినా మీరిప్పుడు పెళ్ళి చేసుకుంటే అంతా ఇన్నాళ్ళూ మీ మధ్యన ఏదో గ్రంథం నడిచే ఉంటుందనుకోరా, చాల్లే మమ్మల్నిలా బ్రతకనీయ్ ‘ అంటూ ముఖాన కొట్టినట్టు చెప్పినప్పుడు కూడా తను నోరు విప్పలేక పోయింది. అప్పుడు తన వయసెంతనీ ముఫై మూడు .. ఇప్పుడు చాలామంది ఇంకా పెళ్ళి ప్రయత్నాలే చేయడం లేదు.
మౌనంగా ఉన్న తనను అప్పుడు మధు చూసిన జాలి చూపు ఏళ్ళు గడచినా ఇప్పటికీ మరచిపోలేదు
తన మంచితనమే తనకు శాపం అయ్యిందన్న విషయం తనకు అర్థం అయ్యేసరికే జరగాల్సిన అనర్థం జరిగిపోయింది. తన జీవితాన్ని చక్కదిద్దాల్సిన తండ్రే తన జీతానికాశపడి ఆ మాటే మరచిపోయాడు. ఎంతో ప్రేమించిన మధుని కాదని తను సాధించినదేమిటీ .. భయంకరమైన వంటరితనం.
ఇక పదవీ విరమణ తరువాత తన మనసుకు నచ్చిన మంచి పనులు చేస్తూ ఒక రకంగా తనే అందరినీ దూరంగా పెట్టింది. గతానికీ వర్తమానానికీ మధ్య కొట్టుమిట్టాడుతూ ఆ రోజంతా ఎలా గడిచిందో కూడా తెలియకుండానే సాయంత్రం అయింది. చికాకుగా ఉన్న మనసును సేద దీర్చడం కోసం అమ్మవారి ఆలయానికి బయలుదేరింది.
***
ప్రియ కొడుకునెత్తుకుని గుమ్మం లోనే ఉంది .. ‘ ఏమిటీ! మీకు ఇక్కడికి బదిలీ అయ్యిందా ప్రియా? ‘ అన్న అఖిల ప్రశ్నకు పలకరింపుగా నవ్వింది కానీ జవాబివ్వలేదు ప్రియ. ఎందుకో ముభావంగా కనబడింది. ఇంక మాట్లాడకుండా తన దారిన తను వెళ్ళిపోయింది అఖిల.
అరె, ఏమైందీ ఈ పిల్లకు! అందుకే కాబోలు నిన్నటి నుంచీ మనసు మనసులో లేదు. ప్రేమించి పెళ్ళాడింది, ఇంకా కొడుకు పుట్టి ఏడాది కాలేదు, అప్పుడే ఏమైంది? వీళ్ళ మధ్య విడిపోవాలన్నంత గొడవలు ఏం జరిగి ఉంటాయి! పిల్లలు తెలియనితనంతో కీచులాడుకున్నా, పెద్దవాళ్ళుగా సర్ది చెప్పడం పోయి ఈ సుమనా వాళ్ళేమిటి ఇలా ఆలోచించడం .. మూర్ఖత్వం కాకపోతే. తనతో వాళ్ళు చెప్పక పోయినా, తను వాళ్ళకేమీ కాకపోయినా ప్రియ మంచి కోరే వ్యక్తిగా, అంతకు మించి తను మధ్యవర్తిగా ఉండి వాళ్ళ పెళ్ళి జరిపిన బాధ్యతతో, తను కలిపించుకోక తప్పదు.
ప్రియ వచ్చి నాలుగు రోజులయినట్లుంది, తన దగ్గరకు రాలేదు. బహుశా ఈ విషయం గురించే అయి ఉంటుంది. అయినా తనే రావాలని చూడడం దేనికీ, నేనే వెళ్ళి చూసొస్తే సరి .. ఈ ఆలోచన రాగానే మనసు కాస్త నెమ్మదించింది.
ఇంట్లో ఉన్న బొమ్మల బొమ్మల క్లాత్ తో ప్రియ కొడుక్కి ఓ చొక్కా, చెడ్డీ కుట్టి ఆ సాయంత్రం వాళ్ళింటికి వెళ్ళింది అఖిల.
గుమ్మంలోనే ఎదురైన సుమన ముఖాన నవ్వు పులుముకుని .. ‘ రా అక్కా .. ప్రియ గదిలో ఉంది, ఏదీ చంటాడికి నీళ్ళు కొత్త చేసినట్లున్నాయి వచ్చినప్పటి నుంచీ కొంచెం జలుబు చేసి, నలతగా ఉన్నాడు .. అందుకే ప్రియ రాలేకపోయింది ‘ అంటూ ఆహ్వానం పలికింది.
“ ఫర్వాలేదు, చంటాడితో దానికెక్కడ కుదురుతుందీ, అందుకే నేనే వచ్చా “ అంటూ పెరట్లోకెళ్ళి కాళ్ళు కడుక్కుని ప్రియ గదిలోకి అడుగుపెట్టింది అఖిల.
“ రా పెద్దమ్మా, ఎలా ఉన్నావు? ..ఇదిగో వీడితో కుదరక .. “ అంటూ తడబడింది ప్రియ.
“ ఏం ఫర్వాలేదే, నా దగ్గర నీకు ఫార్మాలిటీస్ ఏమిటీ? ఎలా ఉన్నావు? బాబు పడుకున్నట్లున్నాడు ‘ ..అంటూ తను తెచ్చిన కవర్ అక్కడ టీపాయ్ మీద పెట్టింది.
“ చైతన్య వాళ్ళూ ఎలా ఉన్నారు? అతనూ వచ్చాడా? “ అంది ఏమీ తెలియనట్లే.
“లేదు పెద్దమ్మా, నేనే వచ్చా .. ‘ ఇబ్బందిగా కదులుతూ అంది.
ప్రియ ఇబ్బందిని గ్రహించిన అఖిల , ఏవో కాసేపు మాట్లాడి వెడతానంటూ లేచింది. అప్పటికి కాస్త సర్దుకుంది ప్రియ.
ఈ విషయమై ప్రియతో ఎలా మాట్లాడాలా! అని ఆలోచిస్తున్న అఖిలకు అవకాశం రానే వచ్చింది మరో రెండు రోజుల్లో .
***
“ అక్కా .. “ అంటూ కంగారుగా వచ్చిన సుమనని ‘ రా సుమా .. ఏమిటీ కంగారుపడుతున్నావ్? “ అంటూ ఎదురొచ్చింది అఖిల.
“ అక్కా .. మా అన్నయ్యకు ఏక్సిడెంట్ జరిగిందట .. చాలా ప్రమాద స్థితిలో ఉన్నాడట, ఇటు చూస్తే ప్రియ పిల్లాడితో ఒక్కతే ఉంది, పైగా వాడికి జ్వరం, ఏంచెయ్యాలో అర్ధం కావడం లేదు, నువ్వు శ్రమ అనుకోకపోతే ప్రియకు సాయంగా..
“ అరే, సుమనా మరీ అంతలా అడగాలా, అయినా అంత మొహమాటం అయితే ఎలా? మీరు వెళ్ళి రండి ప్రియనూ, బాబునూ నేను చూసుకుంటా .. అసలు వాళ్ళను ఇక్కడ నాతోనే ఉంచుకుంటా మీరు వచ్చే వరకూ .. సరేనా .. నడు నేనే వచ్చి ప్రియనీ, పిల్లాడినీ నాతో తీసుకొస్తా, మీరు త్వరగా బయలుదేరి వెళ్ళి రండి, మరి టికెట్స్ దొరికాయా? “
“ లేదక్కా, డ్రైవర్ ను పెట్టుకుని కారులో వెడతాం, అక్కడ తిరగడానికి కూడా వీలుగా ఉంటుంది ..”
మాటల్లోనే చకచకా తెమిలి వాళ్ళటు వెళ్ళగానే ప్రియనీ, పిల్లాడినీ తమ ఇంటికితీసుకొచ్చింది. రాత్రి భోజనాల తరువాత పిల్లాడిని నిద్రపుచ్చి విషయం ఎలా కదపాలా అని చూస్తున్న అఖిలకు ప్రియే ఆ అవకాశం ఇచ్చింది.
“ పెద్దమ్మా నేనిక్కడకు బదిలీ చేయించుకున్నాను, చైతన్యతో విడిపోవాలనుకుంటున్నాను, అమ్మా వాళ్ళూకూడా ఓ.కే అన్నారు” అంది తలదించుకుని.
“చూడూ, నువ్వెందుకు విడిపోవాలనుకుంటున్నావో, మీ మధ్య గొడవలేమిటో ఇవేవీ నిన్ను నేను అడగను .. కారణం నువ్వు చిన్నపిల్లవూ కావు, వివేకం లేనిదానివీ కావు .. ఇక మీ అమ్మా వాళ్ళూ అంటావా .. అది వాళ్ళ ఇష్టం, కాదనడానికీ, తప్పనడానికీ నేనెవరిని! కానీ నీకు కొన్ని చేదు నిజాలు చెబుతాను, అవి విన్నాకా ఎందుకు చెప్పానో నీకు అర్ధం అయి, మంచీ చెడూ ఆలోచించుకోగలిగితే నీకే మంచిది, లేదూ అప్పటికీ నీ నిర్ణయం అదేనంటే నీ ఇష్టం.” కూర్చున్న చోటనుంచి లేచి అశాంతిగా నుదురురాసుకుంటూ పచార్లు చేస్తున్న అఖిలను వింతగా చూసింది ప్రియ.
“ నీకు మరీ సోది చెప్పి విసిగించను, సూటిగా చెబుతాను. భర్త చెడ్డవాడైనా, కొట్టినా, తిట్టినా, తిరుగుబోతూ, తాగుబోతూ అయినా భరించి సర్దుకుపొమ్మని చెప్పే మూర్ఖురాలిని కాను అయితే చిన్న చిన్న విషయాలకే విడిపోవడం దాకా వెళ్ళిపోతున్న ఇప్పటి యువత తెలుసుకోవాల్సిన కొన్ని చేదు నిజాలు. చదువు నేర్పని , అనుభవం మాత్రమే నేర్పే జీవిత సత్యాలు .. నీకు తెలుసు కుటుంబభారాన్ని పంచుకోవడం కోసమే పెళ్ళి చేసుకోకుండా ఇలా ఒంటరి అంకెలా ఉండిపోయానని, అది కేవలం నా తెలివితక్కువతనం అని అర్థం అయ్యేసరికి నా జీవితం తెల్లారిపోయింది. నా తమ్ముళ్ళూ, చెల్లెళ్ళూ తమ అవసరాలు తీరాకా నేను తమకోసం అవివాహితగా ఉండిపోయానన్న నిజాన్ని మరచిపోయి, ఏవో గొంతెమ్మ కోర్కెలతోటీ, పొగరుతోటీ ఇలా ఉండిపోయానని అన్నప్పుడు మొదటిసారి అర్థం అయింది నే చేసిన తప్పేమిటో, ఎవరికి వారు గదులు తీసుకుని నువ్వు ఒక్కదానివేగా అక్కా అంటూ వరండా లోకి నా పడక మార్చినప్పుడు అర్థం అయింది నా తప్పేమిటో, అక్కా నల్లపూసల పక్కన అందంగా ఉంటాయే పలకసర్లు అంటూ చెల్లెలూ, ఒదినా ఆ చంద్రహారాలు నే వేసుకుంటే మీ తమ్ముడు ఎంత మురిసిపోతారో అంటూ మరదళ్ళూ .. అంతెందుకు ఆఖరుకు పూల చెండు కూడా వాళ్ళు మూరలుమూరలు పెట్టుకుని నీకు ఇది చాలు అన్నట్లు చిన్న ముక్క ఇచ్చినప్పుడు అర్థం అయ్యింది నే చేసిన తప్పేమిటో.
ఇక అన్నింటి కంటే దారుణం ఇంట్లో పసిపిల్లల వేడుకల్లో కూడా పిల్లాపాపతో ఉన్నవాళ్ళూ, ముత్తైదువలూ అంటూ మిగతావాళ్ళకు ప్రాముఖ్యతనిచ్చి నన్ను పక్కకు నెట్టేసినప్పుడు అర్థం అయింది నే చేసిన తప్పేమిటో .. నాది లోపమో, శాపమో కాదే, నేనేమీ గొడ్రాలునీ కాదే అయినా వాళ్ళు చూపించే వ్యత్యాసం గుండెల్ని చీల్చేసేది .. ఆఖరుకు నన్ను కన్నతల్లి కూడా నీకెందుకే, ఏ అచ్చటా ముచ్చటా లేకుండా మోడులా బతుకుతున్నావు, వాళ్ళ బ్రతుకులూ నీలానే తగలడతాయి .. నువ్వుండు’ అంటూ నన్ను పక్కకు నెట్టేసినప్పుడు కానీ నాకర్థం కాలేదు నాది వెర్రితనం అని. ఇప్పుడు ఇవన్నీ నీకు ఎందుకు చెబుతున్నానో నీకర్థం అయ్యిందనే అనుకుంటున్నాను. నాకు తెలిసి చైతన్య తాగుబోతో, తిరుగుబోతో కాదు, నిన్ను , నీ వ్యక్తిత్వాన్ని ప్రేమించి, గౌరవించే మంచి మనసున్న వాడనే నా నమ్మకం.. నీకభ్యంతరం లేకపోతే చెప్పు నువ్వు ఎందుకు విడిపోవాలనుకుంటున్నావో ..” అలసటగా ఆగింది అఖిల.
“ పెద్దమ్మా, నన్ను నిర్లక్షం చేస్తున్నాడు, ఎప్పుడూ పని పనీ అంటూ ఆఫీసే లోకంలా ఉంటాడు, . ఈ మధ్య వాళ్ళ చెల్లెలు భర్తకు ఏక్సిడెంట్ అయి మేజర్ సర్జరీ అయితే తన కంపెనీలో లోన్ పెట్టడమే కాక నా సేవింగ్స్ అన్నీ కూడా తీసి ఖర్చుపెట్టేసాడు .. ఎప్పుడూ వాళ్ళ గురించే, నన్నూ, పిల్లాడినీ పట్టించుకోకుండా .. పైగా ఓ సరదా లేదు, .
“ ప్రియా .. ఇప్పుడు మీ మామయ్యకు ఏక్సిడెంట్ అని తెలియగానే మీ అమ్మ ఉన్నపాటున పరిగెట్టుకెళ్ళిందా లేదా,మరి అది అవసరమా? అనవసర ఖర్చా? చెప్పు” ప్రియ మాటల్ని ఖండిస్తూ సూటిగా అడిగింది అఖిల.
“ అది .. అది వెళ్ళి చూడడం వరకూ ఓ.కే కానీ ఇలా లక్షలు లక్షలు ఖర్చు ..
“ లక్షణమైన ప్రాణం కంటే ఎక్కువ కాదు ఆ లక్షలు ..మనసున్న వాళ్ళే కరువైపోతున్న ఈ రోజుల్లో చైతన్య నిజంగా ఓ అద్భుతమే పైగా తల్లినీ, చెల్లినీ ప్రేమించి గౌరవించగలిగే ఏ మగాడైనా ఖచ్చితంగా భార్యనూ ప్రేమించగలడు .. ఇది ఏనాడో ఎవరో చెప్పిన మాటే ఇప్పుడు కొత్తగా నే చెబుతున్నది కాదు, సరే పడుకో, రేపు మాట్లాడుకుందాం .. చూడూ .. చివరిగా సూటిగా ఓ మాట చెబుతున్నా విను ఏ బంధానికైనా ఓ హద్దు అనేది ఉంటుంది అది దాటి ఎవరి కోసం ఎవరూ ఆరాటపడరు. ఒక్క భార్యా భర్తల బంధం మాత్రమే కాలంతో బాటు పరిణితి చెందుతుంది. పెళ్ళి అనేది కొత్తలో ఓ ఆకర్షణ, అవసరం గానే ఉన్నా కాలంతో బాటు ఆ ఇద్దరి మధ్యనా తెలియని అనుబంధం ఏర్పడుతుంది. ఈ మనిషి పూర్తిగా ‘నా’ అన్న ఫీలింగ్ కలుగచేస్తుంది. ఒకరికొకరు తోడూ, నీడాగా మారిపోతారు.
కాలంతో వచ్చిన మార్పులకనుగుణంగా ఇతను కాకపోతే నన్ను నచ్చి మెచ్చి నా జీవితంలోకి వచ్చేవాడు మరొకడుండచ్చు అని అనుకోవచ్చు, కానీ వాడెటువంటి వాడో, తరువాత ఎలా మారతాడో, నిన్ను నీ కొడుకుతో సహా మనస్పూర్తిగా ప్రేమించి కడ దాకా తోడుగా ఉంటాడన్న గ్యారంటీ ఉందా? అక్కడ మాత్రం గొడవలూ, అభిప్రాయ బేధాలూ రావా? కట్టుకున్నవాడు రాక్షసుడయితే విడిపోవడంలో, మరో దారి చూసుకోవడంలో తప్పు లేదు కానీ ఇలా చిన్న చిన్న విషయాలకే అలాంటి నిర్ణయం తీసుకోవడం ఎంతవరకూ సబబో! చదువూ, సంస్కారం, విజ్ఞత ఉన్న నీకు ఇంతకంటే విడమరచి చెప్పఖరలేదు. “ అంటూ చటుక్కున లేచిపోయింది అఖిల.
ఆ రాత్రి చాలాసేపటి వరకూ అఖిల మాటలే మనసులో మారుమ్రోగాయి ప్రియకు, ఇలా విడిపోయి బ్రతుకుతున్న తన సహోద్యోగులనే చాటుగా చులకనగా మాట్లాడుకునే సాటి ఉద్యోగినులూ, వెర్రిమొర్రి వేషాలేసి వాళ్ళను కీచకుల్లా వేధించే మగ ఉద్యోగులూ మనసులో మెదిలారు. పెద్దమ్మ చెప్పిన దానిలో ఎంత నిజం ఉందీ, నిజంగానే రేపు అన్న రోజు తననంతా ఎంత చులకనగా చూస్తారూ! ఇవన్నీ పక్కన పెడితే తనెంత నోరు పడేసుకుని విసిగించినా తనను ప్రేమగా చూసే చైతన్యనేనా తను వద్దనుకున్నది? వద్దు అలా జరగడానికి వీల్లేదు .. అనుకున్న మరుక్షణం మనసంతా తేలికైన భావన .. హాయిగా నిద్రపోయి కలల పల్లకిలోనే చైతన్య దరి చేరింది ప్రియ కొడుకుతో సహా.
*** *** ***

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *