May 26, 2024

పరిపూర్ణం

రచన : రమ శాండిల్య

భానుమూర్తి ఒక మధ్య తరగతి చిరు ఉద్యోగి. అతనికి అమ్మవైపువారి నుంచి కానీ, అత్తగారి వైపునుంచి కానీ ఎటువంటి ఆధారం లేదు. తనకొచ్చే కొంచెం జీతంతో ముగ్గురు పిల్లల్ని చదివించుకోవాలి. సంసారం దానితోనే సర్దుకుపోవాలి.
మీనాక్షి, భానుమూర్తికి తగిన భార్య. భర్త తనకిచ్చేదానిలోనే గుట్టుగా సంసారం చేసుకుంటూ, చిన్నపిల్లలకు తనకొచ్చిన కొద్దిపాటి సంగీతము నేర్పుతూ వారిచ్చిన తృణమో ఫణమో స్వీకరిస్తూ, ఇరుగుపొరుగులకు సహాయపడుతూ చుట్టుపక్కల వారిలో మంచి ఇల్లాలు అనే పేరు తెచ్చుకుంది.
ముగ్గురు పిల్లలూ ముత్యాల్లాంటివారే.
వారి చదువేదో వారి లోకమేదో వారిది. పెద్దమ్మాయి అరుణ చాలా మంచిపిల్ల, తల్లికి వెనకే ఉండి సహయం చేస్తూ ఉంటుంది. చదువులో యావరేజ్ గా ఉంటుంది. రెండవ కూతురు చంద్రకళ గడుగ్గాయి, చదువులో చాలా తెలివైనది కానీ ఎవరితో కలవకుండా అందరితో పొట్లాడుతూ తల్లికి పెద్ద తలనొప్పిగా ఉంటుంది. కొడుకు ఆనంద్ చిన్నవాడు. ముగ్గురు తల్లితండ్రుల ప్రస్థితిని అర్ధంచేసుకొని మసలుకునే వారే.
ఒకరోజు ఆడపిల్లలిద్దరూ తమ స్నేహితురాలి పుట్టినరోజు పార్టీ ఉంది అని వెళ్ళి తొందరగా వచ్చేస్తామని అడిగే సరికి ‘మీనాక్షి తొందరగా వచ్చేయ్యాలి’అని పిల్లల్ని హెచ్చరించి పంపించింది.
అరుణ, చంద్రకళ వెళ్ళేసరికి స్నేహితురాలు సునీత వీరి కోసం ఎదురుచూస్తోంది. పార్టీ సమయం మించి పోతుండడంతో వీరిని చూడగానే “రండి రండి మీకోసమే చూస్తున్నాను, కేక్ కటింగ్ అయిపోయాక కబుర్లు చెప్పుకుందాం” అని లోపలికి తీసుకెళ్లింది.
వీళ్ళు వెళ్ళేసరికి అక్కడ వీళ్ళ వయసు పిల్లలు చాలా మంది ఉన్నారు. వారందరూ పెద్ద శబ్దంతో కబుర్లు చెప్పుకుంటున్నవారు అరుణను, చంద్రకళను చూసి ఒక్కసారి నిశ్శబ్దంగా మారిపోయారు. అక్కడున్న పిల్లలందరూ చాలా డబ్బున్నవారి పిల్లలు అలంకరణలతో మెరిసి పోతున్నారు. అయినా వారి మధ్య వీరిద్దరూ అందంతో దేవకన్యల్లా కనిపించారు. ఆ రోజు అరుణ వాళ్ళమ్మ పెళ్లి పట్టుచీరతో, పాత గిల్టు నగలేసుకుని వచ్చింది. వాటితోనే మెరిసిపోతున్న అరుణను అక్కడున్నవారందరు కూడా ఆశ్చర్యంగా, ఆరాధనగా చూస్తుండిపోయారు.
ఇంతలో సునీత వచ్చి అందరిని హల్లోకి రమ్మంటే అందరూ బిలబిలలాడుతూ హాల్లోకొచ్చి కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అక్కడంతా హుషారుగా వున్నా అరుణకు ఏదో చిన్న ఇబ్బందిగా ఉండి!, “చెల్లెలితో ఇంటికి వెళ్లిపోదాం అంది.”
“ఇంకాసేపు ఉందాం అమ్మకి చెప్పే వచ్చాము కదా!’ అని అంటున్నచెల్లెలికి చెప్పలేక, అక్కడ ఉండలేక పెద్దవారు కూర్చున్న చోటికొచ్చి సునీత వాళ్ళ అమ్మగారితో మాట్లాడుతూ కూర్చుంది.
దేనికోసం అక్కడినుంచి వచ్చేసిందో అదే ఇబ్బంది మళ్ళీ ఇక్కడ కూడా మొదలైంది. చింపిరి జుట్టు, చిన్నచిన్న కళ్ళతో చూడ్డానికి హిప్పీలా ఉన్న ఒకతను తనను తదేకంగా చూస్తున్నాడు. సునీతా వాళ్ళమ్మ దగ్గరకొచ్చి, “అత్తా మీరందరూ ఏం చేస్తున్నారు? ఇక్కడే ఉన్నారేంటి!.” అని మాటలు అత్తతోను, చూపులు మాత్రం అరుణవైపు ఉన్నాయి.
ఆవిడ వెంటనే అతని వైపు చూస్తూ “హర్షా నువ్వెందుకు వాళ్ళను వదిలి ఇటు వచ్చావు? పద అక్కడే డిన్నర్ ఏర్పాట్లవుతున్నాయి” అంటూ ఆవిడ కూడా పార్టీ జరుగుతున్న చోటికి వచ్చారు.
ఆమె వెనుకే అరుణ, ఆమెను చూస్తూ హర్షా పార్టీ జరుగుతున్న దగ్గరకొచ్చారు. అక్కడ అందరి కబుర్లు, నవ్వులు, ఆటలతో హడావిడిగా ఉంది.
అరుణ నెమ్మదిగా సునీత దగ్గరకొచ్చి “వెళ్ళొస్తాను సునీతా! అమ్మ ఎదురు చూస్తుంది. నాన్నకూడా వొచ్చేసి వుంటారు అంది.
“ఇంకొంచెం సేపు ఉండు అరుణా! ఆలస్యమైతే నేను కారులో దిగబెడతాను ప్లీజ్, ప్లీజ్ అనేసరికి
“సరేలే ” అని కూర్చుంది.
ఇంతలో పక్కనే నుంచుని అరుణ వైపు చూస్తున్న హర్షను! చూపిస్తూ “ఇతను మా మేనమామ కొడుకు, వీడు చెన్నైలో IIT చదివి MIT కోసం try చేస్తున్నాడు. ఖాళీగా ఉన్నా కదా అని మమ్మల్ని చూడడానికి వచ్చాడు. ఇవాళ నా పుట్టిన రోజు కదా అని ఇక్కడ ఉండమన్నాం. రేపో, ఎల్లుండో వెళ్లిపోతాడు ”
తరువాత హర్ష కేసితిరిగి ” ఇది నా బెస్ట్ ఫ్రెండ్ అరుణ! డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. అని పరిచయం చేసింది. అరుణకు షేక్ హాండ్ కోసం చెయ్యి చాపి “హాయ్” అన్నాడు హర్ష.
అతనందించిన చెయ్యి అందుకోకుండా “హాయ్ “అని చిన్న స్వరంతో చెప్పింది.
హర్ష నవ్వుతూ “నేను మిమ్మల్ని భయపెట్టినట్లున్నాను అంత భయంకరమైన వాడిని కాదండి బాబు, నా వేషం చూసి నన్నొక రౌడీ అనుకుంటున్నట్లున్నారు, నేను చాలా స్నేహశీలిని అని నా స్నేహితులంటుంటారు”. అంటూ నవ్వేశాడు.
అరుణ కూడా నవ్వుతూ, “అదేం లేదు అంది”.
కొంచెం సేపు అందరూ సరదాగా గడిపాకా… భోజనాలు చేసేసి వెడతామని అందరికి చెప్పి బయలుదేరింది అరుణ చెల్లెలితో. సునీత వెంటనే హర్షవైపు చూస్తూ “హర్షా ప్లీజ్ వీళ్ళని ఇంటిదగ్గర విడిచి రావా!” నాన్నగారి కారు తీసుకెళ్ళు అనేసరికి, వెంటనే ‘సరే’ అని బయలుదేరాడు.
అరుణ సునీతకేసి ఇబ్బందిగా చూస్తూ “వద్దులే సునీతా నేను రిక్షాలో వెడతానంది”
సునీత వెంటనే ” నీమొహం, చాలా రాత్రి అయ్యింది. మీరు ఒక్కరే ఎలా వెడతారు? అంటూ హర్షకు కారు తాళాలు తెచ్చిచ్చింది.
అందరికి వెడుతున్నామని చెప్పి బయటకొచ్చేసరికి గుమ్మంలోనే కారులో డ్రైవింగ్ సీటులో కూర్చునున్నాడు హర్ష.
చెల్లెలి వైపు చూసేలోపు అలిసి ఉన్న చంద్రకళ కారు వెనుకవైపు డోర్ తీసుకుని కూర్చోవడమే కాదు తల వెనుకకు వాల్చి కళ్ళుమూసుకుంది. అరుణకు ముందు కూర్చోక తప్పలేదు. నిశ్శబ్దంగా డ్రైవ్ చేస్తున్నాడు హర్ష. రెండునిమిషాల తరువాత ” అరుణవైపు చూస్తూ దారి చెప్పాలి మీరు, నాకు మీ ఇంటి అడ్రెస్ తెలియదు కదా?” అన్నాడు.
నెమ్మదిగా ఇంటికి వెళ్ళే దారి చెప్పింది అరుణ. కొంచెంసేపట్లోనే కారు సన్నని మట్టి రోడ్ దగ్గరకి చేరింది. అక్కడ ఆపమని హర్షవైపు తిరిగి, ” కారు మా సందులోకి ఇంటిదాకా రాదండీ, ఇక్కడి నుండి రెండు నిమిషాల నడక అంతే మేము వెళ్లగలుగుతాము. చాలా థాంక్స్ అండి ” అని చెప్పింది.
“అయ్యో ! ఒక్కరూ ఎలా వెడతారు నేను కూడ వస్తాను” అని కార్ డోర్ లాక్ చేసి వారితో పాటు తను కూడా నడిచి వారి సందులోకి రాగానే, కొంచెం దూరంలో ఒక మగాయన, భుజాల చుట్టూ చీర కొంగు కప్పుకుని ఒక ఆడామె సందులో అటూ ఇటూ తిరుగుతూ కనిపించారు. అరుణ గబగబా అడుగులేసి వారి దగ్గరకు వెళ్ళి
” నాన్నా! కంగారు పడుతున్నారా? క్షమించండి మా ఫ్రెండ్స్ అందరం కలిసేటప్పటికి కబుర్లలో సమయం గమనించలేదు. సునీత వాళ్ళమ్మగారు కార్లో పంపిస్తామని చెప్పి ఉంచేశారు.” అని గబగబా చెప్పేసి హర్షను పరిచయం చేసింది. అక్కడ చీకట్లో హర్షకు ఎవరూ, ఏమి కనిపించలేదు. నమస్కారమండి వెళ్ళొస్తాను అని చెప్పి కారు దగ్గరకి వెళ్ళాడు.
వెడుతూ వెనక్కి వెనక్కి చూస్తూ బాయ్ అనుకుంటూ వెళ్ళాడు. హర్ష వెళ్ళాక తండ్రి “ఏంటమ్మా! ఇంతాలస్యమైంది, ఎంత కంగారు పడ్డామో తెలుసా? అసలే రోజులు బాగాలేవు ” అని చిన్నగా మందలించారు. తల్లి మాత్రం కళ్ళతోనే మందలించింది. అరుణ తల్లికి అంతా వివరంగా చెప్పి, సునీత బలవంతంతో ఉండిపోవలసి వచ్చిందమ్మా అన్నది.
అలాగే హర్ష గురించి కూడా అతను తన వెనుకే ఎలా తిరిగాడో, అది తనని ఎంత ఇబ్బంది పెట్టిందో కూడా చెప్పి ప్రశాంతంగా నిద్రపోయింది.
మర్నాడు లేచేసారికి వంటింట్లో తల్లి, చెల్లి సంభాషణ వినిపిస్తోంది. చంద్రకళ పెద్దగొంతుతో నిన్నటి డబ్బుకలవారి పుట్టిన రోజు ఎలా జరుపుకుంటారో, సునీతకు ఎన్ని బహుమతులొచ్చాయో, వారి ఇంటి భోజనంలో ఎన్ని రకాల వంటలు పెట్టారో, కేక్ ఎంత రుచిగా ఉందో మరీమరీ చెప్తూనే ఉంది. అదేకాక అక్కడ ఎవరితోనే చాలా గొడవ పడ్డానని చెప్పింది. తల్లి తల కొట్టుకుని “అలా గొడవ పడొచ్చా?” అని కేకలేస్తుంటే… అరుణ వంటగదిలోకొచ్చి చెల్లెలితో “గొడవపడ్డావా? ఎవరితో” అని ఆశ్చర్యపోయింది.
“అమ్మా నేను కాసేపు ఆంటీ దగ్గర కూర్చుని కబుర్లు చెబుతుంటే ఇది అక్కడ వారితో గొడవ పడినట్లుంది. నేను చూడలేదమ్మా” ‘ లేకపోతే అప్పుడే చెప్పి ఉందును అన్నది.
*****
అరుణ లోపలికెళ్లి హోంవర్క్ చేసుకుని అలిసిపోయి అలానే నిద్ర పోయింది.
ఉదయం నిద్రలేచి ఇంట్లో తల్లికి సహాయం చేసి కాలేజీకి వెళ్ళింది. అక్కడ సునీత ‘హాయ్ ‘అంటూ ఎదురొచ్చింది. రహస్యంగా అరుణతో” సాయంత్రం హర్ష కాలేజ్ కొస్తానన్నాడు. నీతో మాట్లాడతాడట” అని చెప్పింది.
అప్పుడు మొదలయ్యాయి ఆలోచనలు అరుణలో. ‘ఇప్పుడు పెళ్లి చేసుకునే సమయమా? ఏదో ఒక ఉద్యోగం చేస్తూ, చదువుకుని తల్లి తండ్రులకు సహాయంగా ఉండాలనుకుంది తను… పెళ్లయితే అది కుదరక పోవచ్చు, అప్పుడు ఎలా, ? అయినా ఇప్పుడు తన పెళ్లి చేసే స్థితిలో లేరు అమ్మానాన్నలు అది తనకు తెలుసు. అందుకని హర్షతో పెళ్లి ఇష్టం లేదని చెప్పేయాలనుకుంది’ సాయంత్రం హర్షతో..
చెల్లెలిని ఇంటికెళ్ళమని చెప్పేసి తను సునీతతో బయలుదేరింది. “అమ్మా వాళ్ళకి ఆలస్యమైనా కంగారు పడొద్దు అని చెప్పు” అని సునీతచంద్రకళతో అన్నది
సునీతా, అరుణ ఇద్దరూ కలిసి సునీత ఇంటికొచ్చేసరికి హాల్లో పెద్దవాళ్లదరూ కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. వీళ్ళను చూసి దగ్గరకు రమ్మని పిలిచారు. వాళ్ళ దగ్గరే కూర్చున్నారు వీరు కూడా.
అరుణ మొహంలోకి పరిశీలనగా చూస్తూ హర్షా వాళ్ళ అమ్మగారు ”ఏంటమ్మా! క్లాసులు బాగా జరుగుతున్నాయా ? అమ్మా నాన్నగారు ఏమైనా మాట్లాడారా? మేమొచ్చి వెళ్ళాక… “అని ప్రశ్నించారు.
దానికి సునీత తల్లి “వదినా! అరుణ చిన్నపిల్ల తనేం చెప్తుంది. ఒకసారి హర్షతో మాట్లాడాకా ఆలోచిద్దాము అన్ని విషయాలు “అంటూ నవ్వుతూ తేల్చేసి, సునీతతో అమ్మాయి మీరు పైన బాల్కనీలో కూర్చోండి, టీ అక్కడికే పంపిస్తాను అనేసరికి బతుకు జీవుడా అనుకుంటూ ఇద్దరు పైన బాల్కనీలో కొచ్చేసరికి అక్కడ ఒక కుర్చీలో పుస్తకమేదో పట్టుకుని హర్ష కూర్చుని ఉన్నాడు.
నెమ్మదిగా హలో చెప్పి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది అరుణ. సునీత నుంచుని కబుర్లు మొదలుపెట్టింది. ఇంతలో టీ టిఫిన్ పట్టుకుని వంటబ్బాయి అక్కడ సద్ధి వీరి ప్లేట్లలో పెట్టి వెళ్ళాడు. సునీత, హర్షా టీ తాగుతూ కూర్చున్నారు. అరుణ ఆలోచిస్తూ కూర్చుంది. హర్ష చనువుగా టీ కప్ అరుణ చేతికిచ్చి తాగమని చెప్పేసరికి మొహమాటంగా తీసుకుంది అరుణ.
టీ తాగేసి బట్టలు మార్చుకుని వస్తా అని ఎవరి జవాబుకు ఎదురు చూడకుండా క్రిందకు వెళ్ళిపోయింది సునీత.
హర్ష అరుణవైపు చూస్తూ “ఎలావున్నారు? “అని అడిగాడు అరుణను. “బావున్నాను” అంది టీకప్ లోకే తదేకంగా చూస్తూ.
నవ్వుతూ “అమ్మచెప్పిన విషయం ఏమి ఆలోచించారు? మీ అభిప్రాయం ఏమిటి? ”
” నాకు ఇప్పుడే పెళ్లి ఇష్టం లేదండి. దానికి అనేక కారణాలున్నాయి ” అంది.
“పర్సనల్ అయితే చెప్పొద్దు… కానీ మీరు చెప్పే కారణాలు నా పరిధిలో చేయగలం. మనమిద్దరం కలిసి అనేవయితే సపోర్టుగా నేను ఉంటాను అని మాటిస్తాను. నాకు కూడా ఇప్పటి వరకు పెళ్లి చేసుకోవాలని లేదు. కానీ సునీత పుట్టినరోజు మీరు నడిచి వస్తుంటే ఇదే బాల్కనీ మీదనుండీ చూసాను. సంధ్యాలక్ష్మిలా కనిపించారు. మీ వెనుకే పొద్దుతిరుగుడు పువ్వులా తిరగడానికి ఒక్క మీ అందమే కాదు. మీలో అంతర్లీనంగా కనిపించే ఒక ఆకర్షణ, సొగసు కూడా నన్నాకర్షించాయి. ఇప్పటివరకు ఎంతోమంది ఆడపిల్లలను చూసాను, మాట్లాడాను, కానీ మొదటి చూపులోనే మీరు నాకు ఎంతో నచ్చారు. అందుకే అడుగుతున్నాను. చెప్పొచ్చు అనుకుంటే మీ కారణాలు చెప్పండి. అని ఆడిగేసరికి హిప్పీలా, రౌడీలా ఉన్న ఈ అబ్బాయికి ఇంత మంచి అలోచనలా? అని ఆశ్చర్యంగా చూసింది హర్షవైపు.
” మౌనంగా ఉంటే ఎలా? మాట్లాడండి” అన్నాడు హర్షా.
అరుణ నెమ్మదిగా మాట్లాడడం ప్రారంభించింది.
“నేను Bsc చదువుతున్నాను, రెండు నెలల్లో పరీక్షలున్నాయి. అవయ్యాక పైచదువులు చదవాలని వున్నానాన్న ముగ్గురిని చదివించలేరు. చెల్లిని తమ్ముడిని చదివించాలంటే నేను ఏదో ఒక ఉద్యోగం చెయ్యాలి. నేను పెళ్ళి చేసుకుని వెళ్ళిపోతే నాన్న నా తరువాతి వాళ్ళను కూడా నాలాగే డిగ్రితో ఆపెయ్యాల్సి రావచ్చు. ఆడపిల్లలం మాకు పెళ్లి అనే ఆప్షన్ ఉంది. కానీ మా తమ్ముడికి అలాకాదు కదా. అందుకే నేను ఏదో ఒక ఉద్యోగంలో చేరి నాన్నకు సాయం చెయ్యాలనుకుంటున్నా. నాకు B. ed చెయ్యాలనుంది, మా నాన్నకు నన్ను చదివించడం కష్టం.. అందుకే ముందు ఉద్యోగంలో చేరి తరువాత చదువుకుంటాను. ”
“ఇంకా చాలా కోరికలున్నాయి సహాయ కార్యక్రమాలు చెయ్యాలని, ఇప్పుడు కూడా వారానికి ఒకసారి పెద్దవాళ్ళ నుంచే ఆశ్రమాలకు వెళ్లి భారత, భాగవత, రామాయణాల్లోంచి కొంతభాగం చదవడం, తల్లి తండ్రులు లేని, వదిలేసిన చిన్నపిల్లలు దగ్గరకెళ్లి నాకొచ్చిన విద్యలో వారికి లెక్కలు అలాంటివన్ని నేర్పడం చేస్తుంటాను. ఇంక ముఖ్యవిషయం మా నాన్నకు నా పెళ్లిచేసే అంత డబ్బు లేదు ప్రస్తుతం, మాకు గడవడానికి సరిపడా ఉంది కానీ, వేరే ఏ పని చేయాలన్నా నాన్నకు కష్టమే. అందుకే మనిద్దరికి ఏ విషయంలోనూ సరిపడదు. పెళ్ళంటే ఒక ఆలోచనే లేని నాకు ఇంత హడావిడిగా ఎవరో వచ్చి పెళ్ళంటే ఏం చెప్పాలో కూడా తెలియటం లేదు.” అని చెప్పి అతని మొహంలోకి ధైర్యంగా చూసింది.
హర్ష తదేకంగా అరుణనే చూస్తున్నాడు. లేచి నుంచుని అరుణ దగ్గరగా వచ్చి “మీరు చెప్పినవన్నీ సునీత నాకు ముందే చెప్పింది. అన్ని తెలిసాకే మా అమ్మతో మాట్లాడి మీ దగ్గరకి పంపించాను. మీరు నాకు కావాలనిపించే అన్నీ కనుక్కుని మీ దగ్గర కొచ్చాను. నా వేషం చూసి మీరు నన్ను రౌడీ అనుకున్నారేమో కూడా! మోడ్రన్ గా ఉండడం డ్రెస్ విషయంలోనే. ఇంట్లో అమ్మ చాలా పద్ధతిగా ఉంటుంది. అమ్మ కూడా ఫ్యాక్టరీలు అవీ చూసుకుంటుంది. మా ఇంట్లో ఉన్నది మేము ముగ్గురమే కానీ ముగ్గురం అన్ని కలిసి చూసుకుంటాము. ఒకరి పద్ధతులు వేరొకరం గౌరవిస్తాము. మా ఇంటికొచ్చే అమ్మాయి మా ఇంట్లో నాలుగో మెంబర్ అంతే. అలాగే మీ ఇంటి అల్లుడుగా నేను వస్తే వారికి పెద్దకొడుకుగా ఉంటాను అన్ని విషయాల్లో కూడా. ఇంతకన్నా ఎలా చెప్పాలో నాకు తెలియటం లేదు. నమ్మండి… నమ్మినట్లైతే మీ ఇంటికి మీతో పాటు నేనొస్తాను. లేదంటే డ్రైవర్తో మీరు ఇంటికెళ్ళి పోవచ్చు. మిమ్మల్ని ఇంక ఇబ్బందిపెట్టను” అన్నాడు హర్షా.
సునీతా ! అని పిలిచి హర్షా కిందకెళ్ళిపోయాడు. సునీతోచ్చేదాక అరుణ ఏ ఆలోచనా లేకుండా అలా కూర్చుండిపోయింది. సునీత వచ్చి అరుణ బుజాలమీద చెయ్యేసి “ఎంటమ్మాయ్ విశేషాలు. ఇంతసేపేమి మాట్లాడుకున్నారు ఇద్దరు” అంది. అరుణ కళ్ళల్లో నీళ్ళు సునీత చేతిమీద పడేసరికి సునీత కంగారుగా “అయ్యో! ఏమైంది” అని కంగారు పడింది.
“నన్ను ఇంట్లో దించేయండి ఆలస్యమైపోయింది” అనేసరికి, సునీత ‘సరే డ్రైవర్ని పంపిస్తా ఉండు ‘అని వెళ్లబోతుంటే డ్రైవరొద్దు హర్షను దించేయమను”అని చెప్పింది అరుణ. సునీత ఆశ్చర్యంగా చూసింది అరుణవైపు.
అరుణ తన మనసులోనే అనుకుంది… హర్షతో తన జీవితం పరిపూర్ణంగా వుంటుందని.

********సమాప్తం*********

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *