March 19, 2024

కవి పరిచయం – సాయి కామేష్

రచన: లక్ష్మీ రాధిక

ఆలోచనకి చక్కని అభివ్యక్తి తోడై, మనసుని మాటల్లోకి అనువదించడం అందరికీ రాని ప్రత్యేక లక్షణం. భావ కవిత్వంలో అభావాన్ని. . ముభావాన్ని సముపాళ్ళలో రంగరించి కదిలిస్తారు సాయి కామేష్. ఆకతాయి వయసు అల్లరితనం, దుఃఖాన్నే కవ్వించే చాతుర్యం, జీవితంతో రాజీపడుతూ ఒదిగిపోవడం, సహజమైన సుప్తచేతనావస్థలన్నీ తన కలానికి వెన్నతో పెట్టిన విద్యలు. సరళంగా ఉన్నట్లుంటూనే మనసుని మెలిపెట్టే భావాలు కొన్నయితే, సున్నితమైన సంవేదనలు కొన్ని. తను, నేను అనే శీర్షికన ఎన్నో కవితలు రాసిన ఘనత కాక, పదివేలు పై చిలుకు ఏకవాక్యాలు, ద్విపద, త్రిపదాలను అలంకరించారు. స్త్రీ హృదయాన్ని ఆవిష్కరించడంలో తనకెవ్వరూ ఎదురు రాలేరు.
అప్పుడప్పుడూ కన్నుల్లో సముద్రాలు దాచినట్లు అనిపిస్తారు, చీకట్లో నిశ్శబ్దాన్ని నెమరేస్తూ మెలకువలో కలలు కంటుంటారు. ఆశల తీరం ఆకాశమంత దూరమైన విషయాన్ని చర్చిస్తారు. వెన్నెల కరుగుతూ అందరికీ సంతోషాన్ని పంచుతూ, తనకి మాత్రం విషాదాన్ని మిగిల్చిందని నిందిస్తారు. అయినాసరే ఎప్పటికప్పుడు జీవితాన్ని కొత్త ప్రయాణం అన్నంత ఆశావాహంతో మొదలుపెడతారు. తన వియోగం శాశ్వతం అంటూనే ఆమె తనను అనుసరించడం ఆపలేదని మురిసిపోతారు. తన అంతర్లీన భావావేశాన్ని గమనిస్తూ, మనమూ వెనుకే సాగిపోతామన్న రహస్యం తనను చదివే అతి కొద్దిమందికి మాత్రమే తెలిసిన నిజం.
వీరేంద్రనాథ్ గారి వీరాభిమానిగా భావుకతని ఎక్కువగా ఇష్టపడుతూ, లోతైన తలపులతోనే గుండె ఖాళీలు నింపుకుంటూ మనతోనూ పంచుకుంటారు. సముద్రాన్ని అమితంగా ప్రేమించే తను మానని గాయపు కావ్యాలన్నిటా ఆ ఉప్పురుచిని కొంచం ఎక్కువగానే వేస్తుంటారు. చక్కని పుస్తకాలు, సంగీతమూ, కుటుంబమూ, స్నేహితులూ తప్ప వేరే ఆడంబరానికి పోని, అతిశమన్నది లేని నిగర్వ స్వాభిమానం అతని చిరునామా. .
“పదేపదే గాయపడుతున్నా
ప్రేమించడాన్ని ఇష్టపడతా నేను. .
అవును. .
దీపపు ఆకర్షణ దాటడం
మిణుగురురులకెప్పటికీ సాధ్యం కాదు” అన్నట్టు కన్నుగీటి మరీ చెప్తారు.

“సంద్రం దగ్గరకు వెళ్దామనుకున్నా ఈ సంధ్యలో. .
నువ్వు లేవని గుర్తొచ్చింది
సంద్రమే నా కన్నుల్లోకొచ్చి చేరిపోయింది”అంటూ కంటతడి పెట్టిస్తారు. .
Lock down diaries# అంటూ చిట్టి కవితలెన్నో రాస్తున్నారు సందర్భానికి తగినట్టుగా. .

“స్వీయ నిర్బంధమేమీ
కొత్త కాదు నాకు
తను విడిపోయిన క్షణాల్లోనే
జీవితకాల నిర్బంధంలోకి
జారిపోయాను నేను”
ఇంకా. . .
“నీ బారినే పడి బ్రతుకుతున్న నాకు
ఈ కరోనా ఓ లెక్క కాదు” అని చమత్కారాలు విసరుతారు.

“రెప్పలు రెండూ ముద్దాడుకున్నప్పుడే
కలలు మాట్లాడినట్లు
చీకటి నుదుటిపై ముద్దాడుతూ
తొలి కిరణం పలుకరించినట్లు
తను మెదిలింది
నేను కదిలిపోయాను
కాలం ఆగిపోయింది” అంటూ ఆమె గురించి అద్భుతంగా చెప్పారు. .

“తనకీ నాకూ మధ్యన
మౌనమొక ప్రవాహం
ప్రేమ అంతర్వాహినిగా. .
ఇటువైపు చెమరింతలతో నేను
అటువైపు చెదిరిపోయిన కలగా తను
చదవకుండా తను విసిరేసిన లేఖ నేను” అంటూ ఎంతో హృదయవిదారకమైన బాధని సున్నితంగా వర్ణించారు.

“కాలమేమీ
గొప్ప శిల్పకారుడు కాదు. .
ఇప్పటికీ
నేనొక అసంపూర్ణ శిల్పాన్నే. .
తనకు నచ్చిన శిల్పమై
ఎదురుపడతానని అనుకోలేదు ఏనాడూ
తను పయనించే దారుల్లో
ఒక రాయిగానైనా మిగిలిపోతే చాలనుకున్నా” ఆమె జ్ఞాపకంలో మిగిలినా చాలనుకుంటూ పడుతున్న ఆవేదన ఇది.

“చాలాసార్లు మౌనం. . మారణాయుధం
ముందస్తు సమాచారమేదీ లేకుండానే
మా మధ్యకి చేరింది
ఎన్నివేల క్షణాలో గడిచిపోయాయి
ఇప్పటికీ ఆ క్షణం చేసిన గాయం
మనసులో పచ్చిగానే మిగిలిపోయింది”. . !
మౌనం గురించి చాలా హృయంగమముగా రాసిన పదములివి. .

నాకు ప్రపంచం అర్ధమైంది. . దానికి మాత్రమే నేను అర్ధం కాలేదంటూ. . అర్ధం చేసుకొనేలోపు మరో ప్రహేళికనై ఎదురు నిలబడతానంటారు. .
మరణానికి నేనో వ్యాపకాన్ని అంటూ, మాటలు వినిపించలేని నిశ్శబ్దాన్ని ఇలా విరచించారు
“చాలా సంఘర్షణలు, మరిన్ని సందిగ్ధతల తరువాత
ఒకానొక వేకువ నా హృదయంపై ఓ కఫన్ లా కప్పుకున్నప్పుడు. .
ఈ ప్రపంచం ఆసక్తిగా గమనిస్తుంది. .
నా హత్యకు కారణం ఎవరని. . ”

ఇన్ని సంగుతులు చెప్పి అసలైన విషయం చెప్పకుంటే అతన్ని అసంపూర్ణంగా వదిలేసిన లెక్క. సిగిరెట్ అంటే అతనికి ప్రాణసమానం. బాధలో. . విలాపంలో. . సంతోషం. . సందిగ్ధంలో. . అదే తోడు అంటూ ఆశువుగా “యాష్ ట్రే”అనే శీర్షికన అనేక చిట్టికవితలు రాసారు. మునుపెవ్వరూ ఇంత ప్రేమగా ఇటువంటి ప్రయోగం చేసి ఉండలేదన్నది అక్షరసత్యం. .
సిగిరెట్ ఎందుకంత ఇష్టమని అడిగితే. .
“నా ఆనందాన్ని చూసి ఈర్ష్యపడదు, నా బాధని చూసి నవ్వుకోదు చాలామంది మనుషుల్లాగా” అని తేలిగ్గా నవ్వేస్తారు.

చెప్పుకుంటూ పోతే ఎన్నో. . ఎన్నెన్నో కవితలు. . నవ్విస్తూ. . కంటతడిపెట్టిస్తూ. . తనలోని రకరకాల భావాల ఆవిష్కారాన్ని చూపెడతాయి.
మరిన్ని మృదుల భావాలతో. . ఇంకెన్నో పదునైన విమర్శనాస్త్రాలతో . . త్వరలో “తనూ. . నేనూ” అన్న చక్కని సంకలనాన్ని మన ముందుకి తేవాలని ఆశిస్తూ. .

2 thoughts on “కవి పరిచయం – సాయి కామేష్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *