April 26, 2024

గిలకమ్మ కతలు – నడిసెల్లేదారి

రచన: కన్నెగంటి అనసూయ

భుజానున్న సంచిని మొయ్యలేక మొయ్యలేక మోత్తా..పరిగెత్తుకుంటా వచ్చేసేడు శీను బళ్ళోంచి.
సందలడే యేల సరోజ్ని బయటే అరుగు మీద కూకుని సేట్లో పోసి తెచ్చుకున్న బియ్యంలో మట్టిబెడ్డలుంటే ఏరతందేవో..ఎవరా వగురుత్తున్నారని తలెత్తి సూసేతలికి శీను..
దాంతో..
“ ఏటా పరిగెత్తుకొత్తం? ఏం కొంపలంటుకుపోతన్నయ్యనీ..! గొప్పదగిలి ఎక్కడన్నా పడితేనో..” అంటా ఇసుక్కుంది..కొడుకెనక్కే సూత్తా..
శీనగాడా మాటలెయ్యీ లెక్కసెయ్యనట్టు..
ఎంత పరిగెత్తుకొచ్చేడో అంతిసురుగానూ పుస్తకాల సంచి అరుగుమీదడేసి..ఆళ్ళమ్మ దగ్గరకంటా వచ్చేసి రాస్కున్నిలబడి..
“ అమ్మా..మరే…మరి అక్క…” అన్నాడు రొప్పుతూ..
“ ఊ..సెప్పేడువ్ ..నువ్వూ ..నీ వగురుత్తువూను..” అంది మళ్ళీ బియ్యంలోకి తల్దూరుత్తా సరోజ్ని.
“ కాదమ్మా…మరి అక్కేం..బడికంతటికీని..లీడరయ్యింది. బళ్లో.. ఇంక నన్నెవరూ కొట్రు..తెల్సా..” అన్నాడు ఇంత సంబరంతో అటూ ఇటూ ఊగిపోతా..మజ్జమజ్జలో పిల్లిమొగ్గలేత్తా..
“యేడిసేవ్లే ఎదవా! ఎదవన్నరెదవని..ఊరుకో..! మియ్యక్క లీడరవుతుం ఏవోగానీ ..నీ నడుం ఇరిగిందంటే సెయ్యలేక సావాలా. కాళీగా కనిపిత్నానా ఏటి? నాకోపిక లేదు నాయనా ఏ కాలన్నా ఇరగ్గేట్టుకున్నావంటేని సాకిరీ సేత్తాకి.. “ ఎటకారంగా అంది ఎక్కడన్నా మట్టిబెడ్డ దొరుకుద్దేవోనని సేట్లో బియ్యాన్ని మునేళ్లతో అటూ ఇటూ దొల్లిత్తా..
“ కాదెహ్హే..సెప్పీదిను. మరేవో..అక్క లీడరయ్యింది గదా..ఎడ్డుమేస్టారు దండేసేరు..అక్కకి. ఇంటికొత్తదిగదా..నువ్వే సూద్దుగాని..నీకు సెప్తాకనీ పరిగెత్తుకొచ్చేసేను..”
అన్నాడు పిల్లి మొగ్గలు ఏత్తానే.
మళ్లీ ఓ నివుషానికి తనే..పిల్లిమొగ్గలేత్తం ఆపి..ఆల్లమ్మెనక్కి సూత్తా ఆళ్ళో ఆడే పక పకా నవ్వుకుంటా..
“ ..మెళ్లో దండేత్తేనీ..అక్కెలాగుందనుకున్నావే అమ్మా సూత్తాకి..కిస్టాస్టంకి హరికజ్జెప్పింది సూడు ఓ మామ్మ..అలాగుంది అక్క..”అన్నాడు అక్కొంతందేవోనని.. ఈధెనక్కోసారి సూసి మరో మొగ్గ కోసవని నేల మీచ్చెయ్యాన్చుతా..
“ ఓరి నియ్యమ్మా కడుపు సల్లగుండా..ఇందంటే మాడు పగిలేట్తు కొట్టుద్దిరా ఏటనుకున్నావో. అయినా ఇప్పుళ్ళీడరేటి? బళ్లు తెరిసినప్పుడు కదా పెడతారు. మజ్జలో ఏటి?” అంది తిన్నగా ఈధెనక్కి సూత్తా..
అప్పటికే పిల్లలందరూ ఎవరిళ్లకాళ్ళెల్లిపోయేరేవో..గిలక్కోసం కళ్ళు సికిలిచ్చి మరీ సూసింది..
“ అప్పుడెట్తేరోసారి…అక్కకి ఫ్రెండే..మల్లీ ఎంతుకో ఆయక్కన్దీసేసి మనక్కనెట్తేరు.
మజ్జానం మా బళ్లోను మా డ్రిల్లు మేస్టారు కబడ్డీ ఆడిత్తుంటే ..”దువ్విచ్చి దువ్విచ్చి” అంటా ఎల్తన్న రాజేషన్న ఎంతమందిని ఒౌటుజేత్తాడోనని సూత్తుంటే మా క్లాసులో వరలచ్వి వచ్చి సెప్పింది మియ్యక్క..లీడరయ్యింది..మేస్టార్లందరూ మియ్యక్కని మెచ్చుకుంట్నారని….పరిగెత్తికెల్లి దూరాన్నించే అక్కని సూసేసి..మళ్ళు పరిగెత్తుకుంటా వచ్చేసేను నీకు సెబ్ధారని, నిజ్వేనే అమ్మా..” అన్నాడు రొప్పుతూనే..
ఇంతలో రానే వచ్చింది గిలక పండగ పూట గుమ్మం ముందు పేడ కళ్ళాపితో కళొచ్చినట్టు ఇంత సంబరాన్ని ముఖమంతా పులుంకుని.
మెళ్ళో దండలాగే ఉందేవో దానెనక్కే సూత్తా..
“ ఏటే ..లీడరయ్యేవంట..ఇందాకట్నించీ ఈడి పిల్లి మొగ్గలు సూళ్లేక సత్తన్నాననుకో. అయినా నాన్న..లీడర్లూ..ప్లీడర్లూ మనకొద్దని అచ్చిరావని సెప్పేరా లేదా?”
అంది సరోజ్ని..ఏంజెప్పుద్దాని గిలకనే తేరిపారా సూత్తా..
అప్పడుదాకా కూడా పెట్టుకునొచ్చినోళ్ళు ఎక్కడున్నారాని ఎనక్కి తిరిగి చూసిందోసారి గిలక ఆళ్లమ్మన్న మాటలు ఆళ్లేవరన్నా ఇన్నారా ఏటి ఇంటే నామోసని.
ఎవ్వళ్ళూ ఇన్లేదు. ఎవరి గొడవలో ఆళ్లున్నారు.
అందరూ కల్సి ఎక్కడికన్నా ఎల్లి ఆడుకుందావని ప్లానేసుకున్నారేవో..మాయమ్మతో ఓ మాట సెప్పి వత్తానని ఇటొచ్చిన గిలక తీరా వచ్చాకా వాళ్లమ్మ మాటకి తెగ ఇదైపోయింది..
‘’ అచ్చొత్తవేటే అమ్మా..” అంది అప్పటికే ఆనందవంతా ఎగ్గిరిపోయిందేమో..పెగలన్నోటిని కడాకరుకి పెగిలిత్తా..
“ అదే..నాన వద్దని సెప్పేరా లేదాని నేననేది.? వద్దన్నాకా..ఎంతుకొప్పుకున్నావనడుగుతున్నా.. ఎంతుండమంటే మాత్తారం..”
“ అద్సరేగానీ కల్సొత్తవేటి? ఇలాటాటిల్లో కల్సొత్తాలూ కల్సిరాపోతాలూ ఉంటయ్యా..ఏటి?”అంది సిరాగ్గా మొకవెట్టి..ఆల్లమ్మెనక్కే సురా సురా.. సూత్తా..
“ అదే..మీ నాన ఏలిడిసిన అప్ప ఆడబిడ్డ మొగుణ్ణి పెసిడెంట్ గా గెల్సేడని…ఆల్లెవరో గొడవల్లో బాగా ఇరక్కొట్టేసేర్లే..అంతుకనుంటారు..గానీ ఇంతకీ ఎంతుకొప్పుకున్నా..లీడరుంటాకి? మాటలనుకుంటన్నావా ఏటి లీడరుంటవంటేనీ?”
“ఉండకేంజేత్తారు..ఉన్నోళ్లు సరిగ్గా ఉండాపోతేనీ”
“ఉన్నోళ్ళు సరిగ్గా ఉంటవేటీ..” సాగదీసింది సరోజ్ని..సోలతో సేటలో బియ్యం కొల్సి గిన్నెలో పోత్తా..
“ సరిగ్గా ఉంటవేటా? లీడర్లనేటోళ్ళు..ఒకళ్లనొకలాగా ఒకళ్లనొకలాగా సూత్తారా ఎక్కడైనాను? అలా సూత్తే ఎలా కుదురుద్ది. అప్పుడాళ్లు లీడర్లవుతారా? “
“ అలాగే సూత్తారు మరి…నీకేందెల్సు..”
“ఊ..నువ్వూ బాగానే సెప్తున్నావ్. అలా సూత్తే ఆళ్లు లీడర్లవరు. లీడరనేటోళ్లకి అందరూ సమానవే..”
“ య్యే… ఆయమ్మాయి అలాగలేదాఏటి?” ఆరాగా అంది సరోజ్ని సేట్లో మిగిలిన బియ్యాన్ని..ఏరిన బియ్యం డబ్బాలో పోత్తా..
“ ఉంటే నన్నెంతుకెడతారేమ్మా? తప్పు సేత్తే ఎవరైనా ఒకటేనా? కాదా? మనోళ్లైతేనేమో..అదొప్పా? అత్తప్పవదా? మనోళ్ళు కాపోతే తప్పా? “
“ నాకు నీతో వాదిచ్చే ఓపిక లేదుగాంతల్లీ..మీ నానొచ్చేకా సెప్పుకో ఇయ్యన్నీని..లీడరే సేత్తావో…ప్లీడరే సేత్తావో..మీ బాబూ కూతుళ్ళు పడండి..ఏదో మీ నాన్నన్నప్పుడు ఇన్నానుగాబట్టి సెప్పేను..”
“ నాన్నెంత సెప్పినా..ఉండాల్సొచ్చినప్పుడు తప్పదమ్మా..”
ఆ రాత్రి ఆళ్ల నాన్నక్కూడా అదే సెప్పింది..
“ లీడర్లయ్యేరలాగని ..పొగరెక్కి ఆల్లకి ఇట్తం వచ్చినట్టు సేత్తా ఉంటే అదే నిజవనుకుంటారు నాన్నా..ఎనకాలొచ్చీవోల్లు. ఆల్లు మనెనకాలే వత్తారు గదా..మనవేంజేత్నావో సూత్తా..! అలాటప్పుడు ఎలా సెయ్యాలి? సేచ్చూపిద్దారనొప్పుకున్నా. తప్పా?”
అపురూపంగా చూసేడు కూతురొంక ఎంకటేస్వ్వర్రావు..
——

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *