March 19, 2024

విదేశ విహార యాత్రలు నాతో చేద్దాం రండి … మలేషియా

రచన: నాగలక్ష్మి కర్రా

ఇవాళ పినాంగ్ వాతావరణం యెలా వుంటుందో తెలుసుకుందాం . ఈ ద్వీపంలో ప్రతీ రోజు సాయంత్రం వాన పడుతుందంటే ఆశ్చర్యం కదూ కాని ఇది నిజం. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 33డిగ్రీలు కన్నా ఎక్కువకి చేరుకోవు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 23 డిగ్రీలకు తక్కువకావు. రోజూ వాన పడడం వల్ల పొల్యూషన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది.
పినాంగ్ లో తప్పకుండా తినవలసిన పండ్లు చిన్న అరటిపండ్లు, ఇవి చాలా రుచిగా వుంటాయి. రంబుతాన్ ( లీచీ రకం ) పండ్లు.
ఆటూపోటూ సమయంలో సముద్రం ఓ కిలోమీటరుమేర లోపలికి వెళ్లిపోయేది. ఆ సమయంలో చాలామంది చేతులతో జలచరాలను పట్టుకొని బుట్టలలో వేసుకోడం ఎంతో ఆశ్చర్యంగా చూసేదానిని. ఇక్కడ వీరు సముద్ర ప్రాణులు ఏవైనా తినేవారు. అలాగే పేక్డ్ ఫుడ్ కొనాలంటే బిస్కెట్స్ అయినా సరే అందులో వాడిని పదార్ధాలను జాగ్రత్తగా చదివి కొనుక్కోవాలి, ఇక్కడ వాళ్లకి వెజిటేరియన్ అంటే ఏమీఅర్దం కాని పరిస్థితి, బిస్కెట్స్, చాక్లెట్స్ లో కూడా సముద్రచరాలు కాని భూ చరాలు గాని ఉండి తీరుతాయని అక్కడకి వెళ్లేక తెలిసిన నిజం. సాధ్యమైనంత వరకు పప్పో బియ్యమో పేకెట్స్ తప్ప వేరేవేవీ ముట్టుకోకపోవడం మంచిదని తెలుసుకున్నాం.
మద్యం షాపులు చాలా అరుదుగా ఉంటాయి, మలేషియన్లు మద్యం ముట్టుకోకూడదు, పొగ త్రాగకూడదు అనే నియమం ఉంది, అందువల్ల మలేషియన్ ముస్లిములు ఈ రెండూ ముట్టుకుంటే కఠిన మైన శిక్షలు ఉంటాయి. అలాగే ముస్లింలకు ఈ పదార్ధాలు అమ్మిన వారిపై కూడా కఠిన చర్యలు ఉంటాయి. రంజాను టైములో పగలు తినుబండారాల అమ్మకం కూడా నిషేధం.
స్త్రీలు బురఖా వేసుకోకపోయినా ఒళ్లుకనబడకుండా బట్టలు కట్టుకొని తల పూర్తిగా స్కార్ఫ్ తో కప్పుకుంటారు. చిన్నచిన్న బట్టలలో చైనీయులు, థాయివారు తిరుగుతూ ఉంటారు.
సాయంత్రం ఫుట్పాత్ మీద స్టాల్స్ తయారయిపోయేవి. కుర్చీలు బల్లలు, “టీవీ” లు అన్నీ పగలంతా ఫుట్పాత్ మీదే వుండేవి సాయంత్రం అయేసరికి తినడానికి వచ్చిన మనుషులతో హడావిడిగా ఉండేవి వీధులు, రాత్రి పది అయేసరికి ఫుట్పాత్ మీద బల్లలు కుర్చీలు టీవి మాత్రమే మిగిలేవి. మనదేశంలో అలా వదిలేస్తే మర్నాటికి అన్తునీ మాయమౌతాయి, లేదా పగలకొట్టెస్తారు. కాని ఇక్కడ ప్రతీ కార్నరులోనూ ఇలాంటి రాత్రి ఫుట్ పాథ్ భోజనశాలలు ఉండేవి. వీటిలో భోజనం చాలా తక్కువ ధరలో ఉంటాయట, చాలా మంది ఇక్కడే తినేవారు. ఇంట్లో వండుకుంటారా ? అని మమ్మలని చూసి అక్కడి వారు ఆశ్చర్య పోయేవారు. అక్కడ తొంభైశాతం మంది ఇలాంటి చోట్లల్లో తింటారు ఇళ్లల్లో వండుకోడం ఏ పండగలకో పున్నాలకో మాత్రమే చేస్తారు.
పిడకల వేట లో పడిపోయేను సరే అసలు కథలో కొద్దాం. ఈ ద్వీపం లో చిన్నచిన్న గుట్టలు, ఎత్తైన పర్వతాలు తో పాటు అడవులు, నదులు, సరస్సులు, జలపాతాలు కూడా ఉన్నాయి. ఓ పాటి ఎత్తున్న గుట్టలని పార్కులుగా తీర్చిదిద్దుకున్నారు. స్థానిక భాషలో గుట్టలని “బుకిత్” అనేవారు. “తమన్” అంటే ఉద్యానవనం. ఇలాంటి బుకిత్ తమన్ లు చాలానేవున్నాయి.
పినాంగ్ లో హిందూమందిరాలు, చైనా మందిరాలు, ముస్లిం ప్రార్ధనా మందిరాలు అనేకం ఉన్నాయి.
ఇప్పుడు అన్ని మాల్స్ లోనూ మనకి కావలసిన వస్తువులు దొరుకుతున్నాయి కాని అప్పట్లో పప్పులు, బియ్యం కూరలు దొరికేవి కావు, వాటికోసం మేం ఇండియన్ మార్కెట్టుకి వెళ్లవలసి వచ్చేది. అలాంటి షాపులన్నీ జార్జి టౌను లోని లిటిల్ ఇండియా ప్రాంతం లో తమిళ మలేషిన్ల చే నడపబడుతుండేవి. బట్టల దుకాణాలు, టైలరింగు షాపులు కూడా ఉంటాయి. అక్కడే చిన్నచిన్న ఇండియన్ రెష్టాంట్లు, టఫిన్స్ అమ్మే బండీలు ఉండేవి.
అక్కడే హిందూ మందిరం “మారియమ్మ కోయిల్ “ ఉంది. మారియమ్మ అంటే పార్వతీదేవి, పార్వతీదేవి మందిరం అన్నమాట. మందిరం వున్న ప్రాంతాన్ని క్వీన్స్ స్ట్రీట్ అని అంటారు.
1800 సంత్సరంలో నిర్మించబడిన మందిరం. దీనిని UNESCO వారు సంరక్షిత మందిరంగా గుర్తించేరు.
మారియమ్మ అంటే గ్రామదేవత అని చెప్పుకోవచ్చు. ఈ కోవెలలో పూజలు అన్నీ ఆగమశాస్తప్రకారం జరుగుతాయి. ప్రొద్దున్న 6 నుంచి 12-30 వరకు తిరిగి సాయంత్రం 4 నుంచి 8 వరకు తెరచివుంటుంది. తమిళనాడు మందిరాన్ని పోలివుంటుంది, హిందువులతో పాటు చైనీయులు కూడా ఈ మందిరంలో పూజలు చెయ్యడం చూసి ఆశ్చర్యపోయేం. ఇక్కడ అమ్మవారికి ఆరోగ్యం కోసం, సౌభాగ్యంకోసం పూజలు నిర్వహిస్తారు.

ఈ కోవెలలో వినాయకుడు, కుమారస్వామి, శివుడు మొదలైన దేవుళ్లకు చిన్నచిన్న మందిరాలు ఉన్నాయి. ద్వజస్థంబం లోపల ప్రత్యేక పూజలప్పుడు భక్తులు కూర్చోడానికి వీలుగా మంటపం, మంటపం దాటేక గర్భగుడిలో అమ్మవారు సర్వాలంకారాలతో కళకళ లాడుతూ ఉంటుంది.
మలేషియాలో ఉన్న చైనీయుల ఆచారాల గురించి చెప్పుకుందాం, ప్రతీ ఇంటిముందర చిన్న పాటి మందిరం, అందరూ ఉపయోగించుకోగలిగినట్లు ఊదొత్తులు, అగ్గిపెట్టె వుండేవి . కొందరు ఊదొత్తులు వెలిగించేవారు. మనం పెరట్లో తలసికోట పెట్టుకున్నట్లు వీరు ఇంటిముందు దేవుడిని పెట్టుకుంటారేమో?, పళ్లు, కూల్ డ్రింకులు, చాక్లెట్సే కాక వండిన వెజ్ నాన్ వెజ్ పదార్ధాలు కూడా అక్కడ పెట్టేవారు. నైవేద్యం చేసినవి ప్రసాదంగా తీసుకెళ్లక అక్కడ ఎందుకు వదిలేస్తున్నారో సందేహం నాకు, ఎవరిని అడగాలన్నా మనుషులే కనిపించని చోట ఎవరిని అడుగుతాం? . ఏ దేవుడిని ఇంత భక్తి శ్రద్దలతో పూజిస్తునారు అనే కుతూహలంతో వెళ్లి చూస్తే ఆ చిన్న మందిరంలో ఊదొత్తులు పెట్టుకొనే పాత్రతప్పమరేమీ లేదు. మా చైనీస్ మైడ్ ని ఆ మందిరం చూపించి అందులో ఏ దేవుడుని పూజిస్తారని అడిగేను . ఆమె “ ఛ దేవుడు కాదు దెయ్యానిదా ప్రదేశం “ అంది.
నైవేద్యాలు అవీ ఎందుకు పెడుతున్నట్లు అని అడిగితే ఆమె సమాధానం బయట పెట్టిన పదార్ధాలు తిని సంతుష్టులైన దెయ్యాలు ఇంట్లో ప్రవేశించకుండా బయటకి వెళ్లిపోతాయట. చైనీయులలో మనకన్నా ఎక్కువ మూఢనమ్మకాలున్నవారు అని అర్దం అయింది . పినాంగ్ లో చాలా చైనీస్ మందిరాలుండేవి వాటిలో ఏవి దేవుళ్లవో ఏవి దెయ్యాలవో అర్దమయేవికావు. ప్రతీ పదిహేను రోజులకి ఓ ఊరేగింపు జరిగేది. కాస్త పెద్దగా ఉండే కోవెళ్లలో నిలువెత్తు ఊదొత్తులు అంటే సునాయాసంగా వారం రోజులు ఏకాద్రంగా వెలిగేవి వెలిగించి ఉంచేవారు. మన బుర్రకథ హరికథ లను పోలిన కార్యక్రమాలను నిర్వహించేవారు. భాష తెలియకపోవడం వల్ల వారు చెప్తున్నదేమిటో మాకేమీ అర్దం కాలేదుకాని వారు పాడే ట్యూను, వేషం అంతా మన బుర్రకథను పోలి వుండటం మాకు ఆశ్చర్యంతో పాటు ఆనందాన్ని కలుగజేసింది. హరికథలాంటి వాటిలో ఇద్దరు చిడతలు వాయిస్తూ కథ చెప్పడం ( మన కి హరిదాసు చిడతలు వాయిస్తూ ఒకరు మాత్రమే ఉంటారు ) చూసేం.
పినాంగ్ రాష్ట్రం లో ఉన్న మరో ప్రధానమైన జిల్లా “బయాన్ లెపస్”. ఈ జిల్లా “ సుంగై క్లువాంగ్ “ తీరానవుంది. సుంగై అంటే నది అని అర్దం. క్లువాంగ్ నదీతీరానవుంది. “సుంగై దువ” అంటే రెండునదుల సంగమం అని అర్దం. బయాన్ లెపస్ జిల్లాలో ముఖ్యంగా చూడదగ్గవి వార్ మ్యూజియం, మలేషియాలో అతి పెద్దదిగా చెప్పబడే “ క్వీన్స్ బె మాల్ “ , స్నేక్ టెంపుల్.
క్వీన్స్ బె మాల్ చాలా పెద్దది, విండో షాపింగ్ కి చాలా అనువుగా ఉంటుంది. ఇప్పుడంటే మాల్స్ అంటే బోరుకొట్టేయిగాని అప్పట్లో వారానికి ఒకసారైనా వెళ్లకపోతే మాకు తోచేదికాదు.
స్నేక్ టెంపుల్ —-

సులువుగా ఆంగ్లంలో స్నేక్ టెంపుల్ గా పిలువబడుతున్న ఈ మందిరాన్ని స్థానిక భాషలో “తొకోంగ్ ఉలర్” గా పిలుస్తారు . “ఉలర్ “ అంటే పాము అని అర్దం లెండి. ప్రంచంలో బతికున్న పాములకి మందిరం ఉన్నది ఇదొక్కటేనేమో?.
బతికున్న పాముల మందిరం అంటే పాములు అద్దాల పెట్టెలలో పెడతారా? అని అడిగితే లేదు ఫ్రీగా తిరుగుతూ ఉంటాయని చెప్పడంతో పాములంటే సహజంగా ఉండే భయం వల్ల చాలా రోజులు ఆమందిరం చూడ్డానికి వెళ్లలేదు. చాలారోజుల తరువాత ఎలాగో ధైర్యం కూడదీసుకొని వెళ్లేం.
మందిరం మొత్తం చైనీ ఆర్కిటెక్చర్ తో నిర్మింపబడింది. లోపల ఎప్పుడూ ఊదొత్తుల, సాంభ్రాణి పొగలతో నిండి ఉంటుంది. బతికున్న పాములు, మంచి జాతి విష సర్పాలు మెల్లమెల్లగా కదులుతూ గర్భగుడిలో ఉన్న విగ్రహాలమీద పాకుతూ కనిపించేయి. మందిరం లో ఉన్న చైనీయులు పాములు కుట్టవని, ఇప్పటి వరకు ఎవరినీ కుట్టలేదని చెప్పినా జాగ్రత్తగా చూసుకుంటూ మందిరం లోంచి బయటకి వచ్చేం . లోపల అక్కడక్కడ పాములు చాలా విషపూరితమైనవని, వాటిని తాకడం, శరీరం పైన ఉంచుకోడం గాని చెయ్యకూడదనే హెచ్చరికలు కనిపించేయి.
ఈ మందిరాన్ని 1850 లో “ఛోర్ సూ కొంగ్ “ అనే బౌద్ద భిక్షువు జ్ఞాపకార్దం నిర్మించేరు. 960 —- 1279 మధ్యకాలంలో చైనాను పరిపాలించిన “ సోంగ్ “ రాజుల కాలంలో “తన్ “ వంశంలో జన్మించిన “ కొంగ్ “ బౌధ్ద ధర్మాలను నియమనిష్ఠలను పాఠిస్తూ పాముల కొసం నివాసాలను ఏర్పరుస్తూ వాటి సేవచేస్తూ కాలంగడిపే వాడట. అతని 65 వ ఏట అతను మరణించేడు, మరణానంతరం అతని సేవలను గుర్తించి అతనికి “ ఛోర్ సూ” అనే బిరుదుని ఇచ్చేరు. జాతక కథలలో ఉన్నట్లు ఇతను కూడా రకరకాల జన్మలు ఎత్తుతూ కష్టాలలో ఉన్న వారికి సహాయపడేవాడట. పినాంగ్ ద్వీపం లో ఈ మందిరం నిర్మించిన తరువాత పాములు వాటంతటవే వచ్చి ఈ మందిరం లో నివశించసాగేయట, వాటినే “ఛోర్ సూ కొంగ్ “ అవతారంగా భావించి పూజిస్తూ ఉంటారు.
ప్రతీ సంవత్సరం చైత్ర శుక్ల షష్ఠి నాడు “ఛోర్ సూ కొంగ్” జన్మదినంగా ఇక్కడ ప్రత్యేక పూజలు జరుపుకుంటారు. ఈ పూజలకు థాయ్ వాన్, సింగపూర్, హాంగ్ కాంగ్ ల నుంచి అనేకమంది భక్తులు వస్తూ ఉంటారు.
పినాంగ్ లోని మరో హిందూ మందిరం గురించి చెప్పుకుందాం. ఈ మందిరం కుమారస్వామి మందిరం. బయటి దేశాలలో ఉన్న అతి పెద్ద మురుగన్ కోవెలగా దీనిని చెప్తారు. దీనిని “ అరుళ్ మిగు బాల దండాయుధపాణి “ మందిరం అని అంటారు.
ఈ మందిరం నిర్మించిన సంవత్సరానికి సంభందించిన సాక్షాలు దొరకక పోయినా ఈ మందిరం సుమారు 1782 నుంచి ఉన్నట్లు ఆనవాళ్లు లభించేయి. 1800 సంవత్సరంలో ఆంగ్లేయులు ఓ జలపాతం వద్ద చిన్న కుమారస్వామి మందిరాన్ని కనుగొన్నారు. ఇప్పటికీ ఈ మందిరంలో 1856 లో ఆంగ్ల చిత్రకారుడు చిత్రించిన అప్పటి మందిర చిత్రాన్ని చూడొచ్చు.
ప్రస్తుతం వున్న మందిరం ఏడంతస్థుల గోపురంతో రెండు భాగాలుగా నిర్మింప బడ్డ మందిరం ఇన్ని వందల సంవత్సరాలలో ఎన్నో సార్లు మరమ్మత్తులు చేయడం, పూర్తిగా మందిరాన్ని మార్చడం జరిగిన తరువాత ఈ విశాల మందిరం తీర్చదిద్దబడింది.

ముందుగా నేను చెప్పినట్లు ఈమందిరాన్ని జులపాతం వద్ద నిర్మించేరు 1892లో ఇక్కడ రిజర్వాయర్ నిర్మించదలచినప్పుడు ఈ మందిరాన్ని ఇక్కడ నుంచి మార్చవలసి వచ్చింది. కొత్త మందిర నిర్మాణం కొండపైన కట్టడానికి తీర్మానం జరిగింది. 1915 లో కొండపైన కట్టిన మందిరానికి మూల విరాట్టుని తరలించేరు. 1915 లోనే ఇక్కడ థైపూసం ఉత్సవాన్ని మొదటిసారి నిర్వహించేరు. 1985 లో వున్న మందిరాన్ని పెద్దది చెయ్యాలనే ముఖ్య వుద్దేశ్యంతో మరమ్మత్తులు చేపట్టేరు. ఏడంతస్థులగోపుర నిర్మాణం జరిగింది, మందిరం చేరుకోడానికి రోడ్డు మార్గమే కాకుండా 513 మెట్లతో కూడిన నడక దారికూడా ఉంది. జలపాతం అందాలని, దట్టమైన అడవి అందాలను చూస్తూ వెళ్లడానికి రెండంచలుగా వెళ్లే బండి ఏర్పాటు కూడా వుంది.
1985 లో ఏడంతస్థుల గోపుర నిర్మాణానంతరం అదే సంవత్సరం కుంభాభిషేకం నిర్వహించేరు. 2006 లో మందిరానికి సుమారు 30మీటర్ల ఎత్తులో మరో మందిర నిర్మాణం చేపట్టి 2012 లో పూర్తిచేసేరు. మండపం లో పాలరాతి పలకలు పరిచి మందిరాన్ని యెంతో సుందరంగా తీర్చిదిద్దేరు . 2012 లో 1. 6 టన్నుల బంగారంతో చేసిన రథం మనదేశంలో తమిళనాడులో తయారుచెయ్యబడిన ముక్కలు జోడించి పినాంగ్లో వాటిని రథంగా మలిచి మొదటిసారి అదే సంవత్సరం “థైపూసం” పండగలో వేలాయుధాన్ని ఊరేగించేరు. అదే సంవత్సరం మహాకుంభాభిషేకం నిర్వహించేరు.
కొండ మీదకి నడక దారిలో వెళ్లినా, కారులో వెళ్లినా అందమైన అనుభూతిని సొంతం చేసుకోడం ఖాయం. బండి మీద వెళ్లే అనుభూతి మరోరకం యేటవాలుగా ఉన్న పట్టాలుమీద పెద్దపెద్ద కేబుల్స్ ద్వారా లాగబడే బండి, దట్టమైన అడవుల గుండా, జలపాతాన్ని దాటుతూ వెళ్లే ఆ అనుభూతేవేరు. అందుకే మా ఇంటికి వచ్చే అథిధులకి ఆ అనుభూతిని అందించే వారం. పూర్తిగా ద్రవిడ శిల్పకళ తో కట్టిన మందిరం తమిళనాడు లో ఉన్న అను భూతిని కలుగ జేస్తుంది. నవగ్రహమందిరం, వినాయక మందిరం, నాగరాజమందిరం, శివకోవల ఈ ప్రాంగణం లో ఉన్నాయి. పరిసరాలు, మందిరం చాలా ప్రశాంతతను కలుగజేస్తాయి. ఇక్కడ నిర్మించిన సుమారు 8. 5 మీటర్ల శివ విగ్రహం ప్రత్యేకంగా వుంటుంది.
కొత్త మందిర నిర్మాణం కొండపైన జరిగినా ఇంకా జలపాతం దగ్గర పాత మందిరాన్ని అలాగే ఉంచేరు.
ఈ మందిరం గురించి చెప్పుకున్నప్పుడు చాలా సార్లు “థైపూసం” గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు థైపూసం అంటే ఏమిటి?, మలేషియన్ హిందువులు ఎలా జరుపుకుంటారో తెలుసుకుందాం. తమిళ నెలల ప్రాకారం మాఘ పౌర్ణమి కి ( జనవరి 15 నుంచి వారి థై మాసం మొదలవుతుంది ) పున్నమి పుష్యమి నక్షత్రం లో వస్తుంది ఆరోజును ‘. థైపూసం (థై + పుష్యం ) గా అన్ని కుమారస్వామి మందిరాలలోనూ జరుపుకుంటారు. ఇది మొత్తం 18 రోజులు జరుపుకొనే పండగ. దేవీ భాగవతం, శివపురాణం ప్రకారం రాక్షససంహారణార్దం కుమారస్వామి జననం జరిగేక అతనికి ఆయుధాన్ని సృష్టించేపనిలో ఆది పరాశక్తి తనలోని శక్తులను రోజుకొకటి చొప్పున వేలాయుధం లో నిక్షిప్తం చేసి కుమారస్వామికి థైపూసం నాడు అందజేస్తుంది. కుమారస్వామికి ఆదిపరాశక్తి శక్తివంతమైన ఆయుధాన్ని సమర్పించిన రోజుని తమిళనాడు ప్రజలు ఎంతో భక్తి శ్రధ్దలతో జరుపుకుంటారు. పినాంగ్ లోని హిందువులు ఎలా జరుపుకుంటారో తెలుసుకుందాం.

థై పౌర్ణమికి పద్దెనిమిది రోజులముందు “క్వీన్స్ స్ట్రీట్” లో వున్న “మారియమ్మ” మందిరంలో కమారస్వామి ఆయుధమైన “వేలాయుధాన్ని” వుంచి రోజూ పూజలు నిర్వహిస్తారు. థైపూసానికి రెండు రోజుల ముందు “ జలాన్ కెబున్ బుంగ “ లో ఉన్న వినాయక మందిరానికి తెస్తారు. థైపూసం రోజు వినాయక మందిరం నుంచి ఊరేగింపుగా “ మారియమ్మన్ “ కోవెలకు తీసుకు వచ్చి పూజలు నిర్వహించి బంగారు రథం లో వేలాయుధాన్ని ఉంచి ఊరేగింపుగా తీసుకువెళ్లి మలై మందిరం లో ఉంచుతారు. మలేషియ దేశం థైపూసం దినాన్ని శలవు దినంగా ప్రకటించింది. ఆ రోజు భక్తులు కావిళ్లు మొయ్యడం “శరీరం లో ఇనుప హుక్కులు బిగించుకొని రథాలను లాగడం, కొరడాలతో కొట్టుకోడం లాంటి మొక్కులు తీరుస్తూ ఊరేగింపులో వెళతారు. భక్తులకు అన్నపానీయాలు ఉచితంగా అందించడంలో హిందువులతో సమానంగా చైనీయులూ పాల్లొంటారు.
థైపూసం నాడు కుమారస్వామి వేలాయుధాన్ని పొందిన రోజుగా, వైశాఖ విశాఖం నాడు ( వైశాఖ మాసంలో పౌర్ణిమ విశాఖ నక్షత్రం లో వుంటుంది ) కుమారస్వామి జన్మించిన రోజుగా భావిస్తారు. ఈ మందిరం లో థైపూసం, చిత్తర పూర్ణం ( చైత్ర పూర్ణిమ ), వైశాఖ విశాఖం, కాంత షష్ఠి, పెరియకార్తిఘై, ఆఢి పూర్ణిమ ( ఆషాఢ పూర్ణిమ ) రోజులలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

ఈ థైపూసం యాత్రకి కావలసిన ఆర్ధిక సహాయం చైనీయులు అందిస్తారు.
ఈ మందిరం ఉన్న ప్రదేశం మంచి పిక్నికి స్పాట్ కూడా, చిన్నచిన్న ట్రెక్కింగులు చేస్తూ పగలంతా సరదాగా గడిపే వసతులు ఉన్నాయి.
పినాంగ్ లో వున్న మరో అహ్లాదకరమైన పిక్నిక్ స్పాట్ “ ఎయిర్ హితేమ్ “. మలయభాషలో ‘ ఎయిర్ అంటే నీరు హితేమ్ అంటే ఆకుపచ్చ అని అర్దం. అక్కడినీటిలో చుట్టుపక్కల వున్న చెట్ల రంగు ప్రతిఫలించి నీరు ముదురు ఆకు పచ్చ రంగులో ఉన్న బ్రమ కలిగిస్తుంది ఈ రిజర్వాయరులోని నీరు. నిజానికి నీరు పాకు పట్టి అలా కనిపిస్తున్నాయేమో అని అనిపిస్తుంది. కాని నీరు చాలా స్వఛ్చమైనవి, పినాంగు ద్వీపానికి ఇక్కడనుంచే మంచినీటి సరఫరా జరుగుతుంది. రిజర్వాయరు మీద కట్టిన ఆనకట్ట మీద నడుస్తూ అవతల వొడ్డున ఉన్న అడవిలో పిల్లలకి ఆడుకోడానికి వీలుగా పార్కు కట్టేరు. ఏకాలమైనా ఎండ పడకుండా చల్లగా ఉండటం వల్ల సీజను తో సంభందం లేకుండా హాయిగా గడపొచ్చు. ఇక్కడ నేల తడితడిగా ఉండి తరచూ వానపడుతున్నట్లు తెలుస్తూ ఉంటుంది.

వచ్చే సంచికలో మరిన్ని విశేషాలతో మీ ముందుటానని మనవి చేసుకుంటూ శలవు .

1 thought on “విదేశ విహార యాత్రలు నాతో చేద్దాం రండి … మలేషియా

  1. ఏషియా లో అత్యంత పొడవైన వంతెన కూడా పెనాంగ్ లోనే ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *