September 21, 2021

ఇప్పుడన్నీ…

 

రచన: – సాంబమూర్తి లండ.

 

 

అవి ఎవరివైనా కానివ్వండి

జీవితాలన్నీ గతితప్పిన గమనాలే.

 

సంపాదన ఎరలకు చిక్కుకుని

విలవిల్లాడుతున్న చేపలు

సుఖాల వలల్లో పడి

పంజరాల పాలవుతున్న పావురాలు

స్వార్ధం మొసళ్ళకు

ఆహారమైపోతున్న జీవితాలు

అవినీతి

అనంత బాహువులతో

మనిషిని ఒడిసిపట్టి

అమాంతం మింగేస్తోంది

 

ఉన్నతంగా ఉజ్వలంగా బతకాలన్న

ప్రతి ఆశా ఓ కొత్త రెక్క

ఓ లేత చిగురు!

ఎన్ని రెక్కలుంటే

ఆకాశం అంత చేరువ

ఎన్ని ఆశలుంటే

కళ్ళల్లో అంత పచ్చని మెరుపు

 

మనం మాత్రం

నాలుగు బతుకుల్ని తొక్కి

నిచ్చెన మెట్లు వేసుకుంటాం

ఎవరెవరివో నిస్సహాయతల్ని

తాళ్లుగా పేనుకుని శిఖరాల్ని చేరుకుంటాం

దారిలో ఏదైనా అడ్డొస్తే

నిర్దాక్షిణ్యంగా నలిపేస్తాం గానీ

క్రీడాస్ఫూర్తిని చాటుకుంటామా?

రాత్రికి రాత్రి

చేతికి స్వర్గం అందాలనుకుంటాం

 

ప్రలోభాల ప్రతి లోగిలీ

ఒక కృష్ణబిలమై

గమనాలను ధ్వంసం చేస్తున్నప్పుడు

కక్ష్యలుదాటి

వ్యామోహాల చేతులు విస్తరిస్తున్నప్పుడు

అప్పుడవి ఎవరివైనా కానివ్వండి!

జీవితాలన్నీ గతితప్పిన గమనాలే.

 

 

 

1 thought on “ఇప్పుడన్నీ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *