June 25, 2024

చంద్రోదయం – 27

రచన: మన్నెం శారద

” ఎక్కడ్రా వుద్యోగం?” అంది సావిత్రమ్మ.
“శేఖర్ ఆఫీసులోనే. భర్తగాని, తండ్రిగాని పోయినప్పుడు ఆ యింట్లో ఎవరికో ఒకరికి ఉపాధి చూపించేందుకు ఉద్యోగం ఇచ్చే రూల్ వుంది” అంటూ వివరంగా చెప్పేడు సారథి.
ఆ మాట విన్న స్వాతి చేతులు ముఖానికడ్డంగ పెట్టుకుని వెక్కెక్కి ఏడిచింది.
సారథి కాస్సేపు మాట్లాడలేనట్లు చూసి వూరుకున్నాడు.
“ఎప్పుడు జాయిన్ అవుతారు?”
స్వాతి దుఃఖాన్ని అదుపులో పెట్టుకుంటూ “నేను వీధి ముఖం చూడలేను. నాకే వుద్యోగం వద్దు” అంది బాధగా.
“నిజమే! నీ పొట్ట నువ్వు పోషించుకోక తప్పదని, మిమ్మల్ని ఉద్యోగంలో చేరమని చెప్పడం లేదు. ఈ రోజు వున్న బాధ యెప్పుడూ యిలానే వుండదు. మిమ్మల్ని మీరు కంట్రోలు చేస్కుని, ఈ బాధని మరచి నానీని పెంచడానికైనా మీకో వ్యాపకం వుండాలి. అందుకోసమే నేను మిమ్మల్ని ధైర్యం తెచ్చుకోమని బ్రతిమాలుతున్నాను”
సారథి మాటలకి స్వాతి జవాబేం చెప్పలేదు.
ఆమె ఆలోచనలో పడింది. తనెంత బాధలో వున్నా తనకు బాధ్యతలున్నయై. వాటినుండి తనకి తప్పించుకునే ఆస్కారం లేదు. భవిష్యత్తులొకి ఆశగా చూస్తూ అనాధలైన చెల్లెళ్ల్లు, పుట్టగానే తండ్రిని పోగొట్టుకుని నీకు నేను, నాకు నీవేనని చిరునవ్వులొలికించే పసివాడు నానీ. వీళ్ల బాధ్యత తను మోయక తప్పదు.
స్వాతి మారు మాట్లాడకుండా సారథి చెప్పిన రోజున అతని వెంట వెళ్ళి ఆఫీసులో జాయినయింది

*****
వసుధ, సుహాసిని మెడిసిన్ ఎంట్రన్స్ వ్రాసేరు. ఇందులో ఒక్క సారథి ప్రమేయమే కాకుండా, స్వాతి నిర్ణయం కూడా వుంది.
శేఖర్ పోయేక జి.పి.ఎఫ్, ఎల్.ఐ.సి అన్నీ కలుపుకుని పాతికవేలదాకా అందేయి స్వాతికి. వాటితో వసుధ కోరిక తీర్చాలని ఆమె నిర్ణయించుకుంది.
అక్కగారు అంగీకారం తెలపడంతో వసుధకి ఏనుగెక్కినంత సంతోషం వేసింది.
ఆ ఉత్సాహంతో ఆ అమ్మాయి, సుహాసిని కలిసి పట్టుదలగా చదివి గుంటూరులో ఎంట్రన్స్ రాసేరు. అనుకున్న విధంగానే వాళ్లిద్దరికీ మెడిసిన్‌లో సీట్లు వచ్చేయి.
చాలా రోజుల తర్వాత ఆ ఇంట్లో కాస్తంత ఉత్సాహం చోటు చేసుకుంది.
ఎక్కడ వుంచాల్సిందీ, ఏమి చేయాల్సింది కాస్తంత తర్జనభర్జన పడ్డాక “హాస్టల్లో జాయిన్ చేద్దాం” అన్నాడు సారథి. స్వాతి కాస్సేపు ఆలోచించి “హాస్టల్లో చాలా ఖర్చవుతుంది. నాకొకటి చేస్తే బాగుంటుందనిపిస్తోంది” అంది.
“ఏమిటి?” అన్నాడు సారథి.
“మీ అమ్మగారిని వాళ్లకి తోడుగా వుంచి ఏదైనా చిన్న యిల్లు తీసికొని అక్కడ పెట్టి చదివించడం మంచిదని నా ఉద్ధేశ్యం”
“జ్యోతి సంగతి?”
“దానికి చదువుపట్ల అంత శ్రద్ధ లేదు. అయినా మానిపించాలని నా నిర్ణయం కాదు. అక్కడే కాలేజీలో సీటు దొరికితే చూడండి.”
“అందర్నీ అక్కడికి పంపిస్తే మీకు తోడూ?” అన్నాడు సారథి. స్వాతి నిస్పృహగా నవ్వింది. “ఆ భగవంతుడే! అయినా నాకు తోడెందుకు? స్వంత ఇల్లు, ఆదుకొనే యిరుగూ పొరుగున్నారు. ఇప్పుడే ప్రపంచంలోకి అడుగు పెడుతోన్న ఆ ఆడపిల్లలకి కావాలి తోడు. అందుకే మీ అమ్మగారిని వాళ్ల దగ్గర వుంచితే పెద్ద దిక్కుగా వుంటుంది”
“పోనీ యిక్కడే చదివించొచ్చు కదా!” సందేహంగా అడిగింది సావిత్రమ్మ.
“వద్దండి. ఈ వాతావరణంలో వాళ్లు చదవలేరు” అంది స్వాతి.
చివరికి అందరూ స్వాతి నిర్ణయాన్నే అంగీకరించారు. ఆ విధంగా స్వాతి చెల్లెళ్లను, తన తల్లినీ, చెల్లెలినీ కలిపి గుంటూరు పంపించేడు.
వసుధ, సుహాసిని జాగ్రత్తగా చదువుతారు కానీ జ్యోతిదంతా ఆషామాషీ చదువే.
ఆ అమ్మాయికి నవ్వటం, నవ్వించడమే జీవితాశయం.
స్వతహాగా తెలివితేటలున్నా అదంతా చదువులోనే చొప్పించి మార్కుల రూపంలో బయటపెట్టుకోవాలన్న సిద్ధాంతం ఏమీ లేదు.
ఎలాగోలా డిగ్రీలో కొచ్చేసింది.
వసుధ, సుహాసిని థర్డ్ ఇయర్‌లోకి వచ్చేరు.
వసుధకి స్కాలర్‌షిప్ కూడా దొరికింది.
“ఈ కొద్దిరోజుల్లో తన జీవితంలో ఎన్నో మార్పులు!” ఆలోచనల్లోంచి బయటపడి గాఢంగా నిట్టూర్చింది స్వాతి.
సారథి బస్సులో కూర్చున్నాడన్నమాటేగాని మనసు మనసులో లేదు.
‘స్వాతిలో ఈ రోజు ఏదో మార్పు కనిపిస్తోంది. తనిలా అకస్మాత్తుగా ప్రయాణం కావటం యిష్టపడనట్టుగా కనిపించింది పాపం!’ అనుకున్నాడతను.
‘తమాషా ఏవిటోగాని ఆమె ఉత్సాహం మీద దేవుడెప్పుడూ నీళ్లు పోస్తాడు” అని నిట్టూర్చాడతను.
బస్సు వేగంగా వెళ్తోంది.
అతను కళ్ళు మూసుకున్నాడు. అయినా స్వాతి ఆలోచనలే అతన్ని వెంటాడుతున్నాయి. తిరిగి ఆమె తన జీవితంలోకి ప్రవేశించిన పరిస్థితులు తలుచుకుంటే అతనికి విచిత్రంగా వుంటుందిప్పటికీ..
జానకమ్మ యిచ్చిన టెలిగ్రాం అందుకొని వెంటనే వైజాగ్ చేరుకున్నాడు సారథి.
స్వాతి పరిస్థితి అతన్ని దిగ్భ్రాంతిలో ముంచింది.
మూసిన కన్ను తెరవకుండా పడి వున్నదామె. ఒళ్ళు జ్వరంతో పేలిపోతోంది.
సారథికి అంతుపట్టడం లేదు. కడుపులో మాట కాస్త కూడా దాచుకోలేని జానకమ్మ జరిగిన సంగతంతా పూసగ్రుచ్చినట్టు తన ధోరణిలో చెప్పేసింది.
“అప్పటికి నే చెబుతూనే వున్నాను. వింటేగా. వయసు పొంగలాంటిది. మా కాలంలో మొగుడుపోతే యిలాగ మళ్లీ పెళ్ళంటూ ఎగబడి ఎరుగం. ఎంత నిక్కచ్చిగా మగవాసన తగలకుండా బ్రతికేది. వాడితో ఎంతవరకు సంబంధం వుందో గానీ వుత్త పిచ్చిదయిపోయింది”
సారథి వినీ విననట్లు విన్నాడు.
లోలోపల అతనికి ఆవేశం పెల్లుబికిపోతోంది. ఆ మోహన్ గాడిని నరికి పాతెయ్యాలనిపించింది.
కానీ.. అలా చేసినంత మాత్రాన స్వాతికి కలిగే లాభం ఏమిటి?
సారథి ఆవేశం నీరుకారిపోయింది.
అతనికి కర్తవ్యం గుర్తొచ్చి వెంటనే డాక్టర్ని పిల్చుకొచ్చేడు.
నానీని ఓ పక్క కనిపెడుతూనే, స్వాతికి రాత్రింబవళ్లూ సేవచేస్తూ అక్కడే వుండిపోయాడు.
మొదట గుంటూరు కబురు చేసి “తల్లిని పిలిపిద్దాం” అనుకున్నాడు. కానీ అక్కడ వసుధకి, సుహాసినికీ పరీక్షలవుతున్నాయి.

ఇంకా వుంది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *