August 11, 2022

వ్యసనం

రచన: రాజ్యలక్ష్మి బి

“ఏవండీ గుమ్మం దగ్గర మిమ్మల్ని యెవరో పిలుస్తున్నారు “వంటింట్లోనించి రాధిక హాల్లో చదువుకుంటున్న రఘునాథ్ కు చెప్పింది.
చదువుతున్న “అసమర్ధుని జీవయాత్ర “ప్రక్కన పెట్టి షర్ట్ వేసుకుని లుంగీ సర్దుకుంటూ వరండాలోకి వచ్చాడు రఘునాథ్.
కైలాష్ ని ఆశ్చర్యంగా చూస్తూ అయినా మొహంలో కనపడనియ్యకుండా, ”రండి లోపలికి “అంటూ ఆహ్వానించాడు. ఇద్దరూ హాల్లో కూర్చున్నారు. రాధికను మంచినీళ్లు తీసుకురమ్మని చెప్పాడు.
కైలాస్ మంచి యెండలో వచ్చాడు రెండు గ్లాసుల చల్లని నీళ్లు త్రాగి రఘునాథ్ కి నమస్కరించాడు. జేబురుమాలు తో మొహం మీద చెమట తుడుచుకున్నాడు. అప్పుడు రఘునాథ్ అతన్ని పరికించి చూసాడు.
కైలాష్ బట్టలు దుమ్ముకొట్టి మాసిపోయి వున్నాయి. జుట్టంతా చింపిరిగా నూనె లేకుండా యెండిన గడ్డిలాగా వుంది. కళ్లు గుంటలు పడి నిర్జీవంగా వున్నాయి. చెంపలు పీక్కుపోయి వున్నాయి. చిరుగుల చొక్కా , వేసుకున్న ప్యాంటు అడుగున పీలికలు పీలికలుగా దారాలు వేలాడుతున్నాయి. రఘునాథ్ కి అతని పరిస్థితి అర్ధం అయ్యింది. కొంతవరకు అతను వచ్చిన కారణం అర్ధం చేసుకున్నాడు.
“కైలాసంగారు మంచి యెండలో వచ్చారు, యేమిటి విశేషం?”అంటూ ప్రశ్నించాడు.
కైలాసం చేతులు నలుపుకుంటూ యిబ్బందిగా అటూయిటూ చూస్తూ ”రఘునాథ్ గారు , మీరే నన్ను ఆదుకోవాలి. నన్ను గట్టెక్కించాలి “అన్నాడు.
“చెప్పండి పర్వాలేదు “తన వూహ కరెక్టే అనుకున్నాడు రఘునాథ్.
“నేను చెప్పిన తర్వాత మీరు కాదనకూడదు!” దీనంగా అన్నాడు కైలాస్.
“విషయం తెలియకుండా నన్ను యిరకాటంలో పెట్టేస్తున్నారు కైలాస్ “నవ్వడానికి ప్రయత్నించాడు రఘునాథ్.
“మా ఆవిడా, పిల్లలు వుదయం పుట్టింటినించి వచ్చారు, యింట్లో సరుకులు బియ్యంతో సహా అన్నీనిండుకున్నాయి. కరోనా గడ్డు సమయంలో నా వుద్యోగం వూడింది. మళ్లీ ప్రయత్నిస్తున్నాను , వచ్చే సూచనలున్నాయి. వెయ్యి రూపాయలు అప్పివ్వండి , నాకు వుద్యోగం రాగానే వెంటనే తీర్చేస్తాను “అన్నాడు కైలాష్ కళ్లల్లో నీళ్లు చిమ్ముతున్నాయి.
రఘునాథ్ మాట్లాడలేదు. ఆలోచిస్తూ అతన్నే చూస్తున్నాడు. కైలాష్ గురించి , అతని ప్రవర్తన గురించి కొంతవరకు తెలుసు.
“క్షమించండి , కరోనా గడ్డుకాలం నేనూ అనుభవిస్తున్నాను. ప్రస్తుతానికి నేను అప్పిచ్చే స్థాయిలో లేను” నొచ్చుకున్నట్టు చూస్తూ అన్నాడు రఘునాథ్.
“ఆలా అనకండి మీ మీద కొండంత ఆశతో వచ్చాను. మీరే కాపాడాలి , యింటి దగ్గర మా ఆవిడ బియ్యం కోసం యెదురుచూస్తున్నది” కైలాస్ బ్రతిమాలాడు !
“నేనే డబ్బు చాలక యిబ్బందుల్లో వున్నాను, మీకేం సాయం చెయ్యగలను?”అన్నాడు రఘునాథ్.
“మా ఆవిడ యింటికి బియ్యం పప్పూ తీసుకెళ్లకుండా వెళ్తే రచ్చ రచ్చ చేస్తుంది, అందరూ వినేట్టుగా అరుస్తుంది, పుట్టింటికి పోతానంటుంది, నేను నలుగురిలో తలెత్తుకు తిరగలేను” కైలాస్ కళ్లల్లో నీళ్లు, మనిషి నిలువెల్లా వణికిపోతున్నాడు ,
“కైలాస్ గారు! మీరింతగా అడగాలా, వుంటే వెంటనే యిచ్చెయ్యనా! మీ ఆవిడ యిరుగుపొరుగు వాళ్ల దగ్గర తీసుకుని వంట చేసి వుంటారు, పిల్లలను ఆలా వుంచలేరుగా ! ఎండన పడి నడిచి వచ్చారు, భోజనం చేసి వెళ్లండి, సాయంత్రంలోగా యెక్కడైనా ప్రయత్నం చేద్దాం” అంటూ రఘునాథ్ అతనికి కొంత వూరట కలిగించాడు.
“భోజనం వద్దండీ, మరోచోట ప్రయత్నిస్తాను “అంటూ కైలాస్ లేచాడు.
“భలేవారే భోజనం వేళలో తినకుండా వెళ్తానంటే నాకు బాధేస్తుంది. మీరు కంగారు పడకండి , సాయంత్రం యేదో యేర్పాటు చేస్తాను లెండి, రండి కాళ్ళుకడుక్కుని వచ్చేసెయ్యండి “అన్నాడు రఘునాథ్.
“మీరు యేర్పాటు చేస్తానన్నారు కాబట్టి భోజనం చేస్తాను “అన్నాడు కైలాస్.
రాధిక వంటింట్లో నించి అన్నీ వింటున్నది. అందుకే వంట అధరువులు యెక్కువే చేసింది. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న కైలాస్ ఆకలి నకనకలాడింది ! గబగబా అన్నీ మారు వడ్డించుకుంటూ తినేసాడు. రాధిక అతను గుటకలు మ్రింగుతూ తినడం చూసి జాలిపడింది. భార్య యెంత గయ్యాళిదో అనుకుంది. హాయిగా సుష్టుగా తృప్తిగా భోజనం ముగించాడు కైలాస్.
“సాయంకాలం కూరల బజారు మర్రిచెట్టు దగ్గరికి రండి కైలాస్ , ప్రయత్నం చేస్తాను “అన్నాడు రఘునాథ్. కైలాస్ సరేనని నమస్కరించి వెళ్లిపోయాడు.
రాధికా రఘునాథ్ భోజనం చేసి తీరిగ్గా కూర్చున్నారు. అప్పుడు మెల్లిగా భర్తను చూస్తూ , ”ఏమండీ , పాపం అతను కన్నీళ్ల పర్యంతం అవుతున్నాడు , భగభగ యెండలో వగరుస్తూ నడిచొచ్చాడు కదా , అంత కఠినంగా ప్రవర్తించారేమిటి ! డబ్బులివ్వకపోయారా“ ప్రశ్నించింది.
“అతని సంగతి తెలియక నువ్వు అడుగుతున్నావు, అతనికి అసలు అప్పే యివ్వకూడదు.” అంటూ రఘునాథ్ లోపలికి వెళ్లి మంచం మీద వాలాడు. రాధిక అతని వెనకాలే లోపలికి వెళ్తూ ఏం ఎందుకివ్వకూడదు?” ప్రశ్నించింది.
“అదంతే! అతను వడ్డీలకు అప్పులిస్తాడు ! మళ్లీ వచ్చిన వడ్డీలు కూడా మళ్లీ వడ్డీలకు అప్పిస్తాడు ! జీతం మూడొంతులు యిలా వడ్డీలకు అప్పిస్తాడు. ఇంట్లో పట్టించుకోడు ! బియ్యం పప్పూ ఉప్పూ యేవి పట్టించుకోడు ! భార్య చిరుగుల చీరె , పిల్లలూ చిరిగిన బట్టలే ! తనూ అంతే ! ఇవన్నీ చూసీ చూసీ భార్యకు విసుగెత్తి పుట్టింటికి వెళ్లిపోయింది ! కరోనా గోలలో వుద్యోగం వూడింది !”అన్నాడు రఘునాథ్
“భార్య వచ్చింది కదా” అడిగింది రాధిక !
“అదంతా అతని భ్రమ ! కరోనా సమయంలో అతనికి యెవ్వరూ డబ్బులు తిరిగి యివ్వలేదు ! ఇంట్లో దాచుకున్న కాస్త డబ్బూ దొంగలెత్తుకు పోయారు ! భార్యా బిడ్డలూ పుట్టింట్లోనే వున్నారు. ఆవిడ అక్కడే చిన్న చిన్న పనులు చేసుకుంటూ పిల్లల్ని పెంచుకుంటున్నది. ఇతను వాళ్లు వచ్చారనీ యింట్లో వున్నారనీ తనలో తాను అనుకుంటూ తిరుగుతుంటాడు. ఎవరైనా డబ్బులిస్తే ఆ నోట్లను చేతిలో వూపుతూ ‘అప్పు కావాలా అప్పు కావాలా వడ్డీకిస్తాను’ అంటూ వీధుల్లో పరుగెత్తుతాడు” బాధగా చెప్పాడు రఘునాథ్ !
మితిమీరిన ఆలోచనలు , వ్యసనంగా మారిన వడ్డీల మోజు, కైలాష్ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది.

*****

1 thought on “వ్యసనం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *