April 26, 2024

*శ్రీగణేశ చరిత్ర*

రచన: నాగమంజరి గుమ్మా

61 వ పద్యం

దండమయా విఘ్నేశ్వర
దండమయా ఏకదంత దానవనిహతా
కొండవు విద్దెల కెల్లను
ఖండపరశు ముద్దుపట్టి కామితమిమ్మా
భావం: విఘ్నేశ్వరా నీకు వందనం. ఏకదంతుడవైన నీకు వందనం. దానవులను సంహరించిన వాడా, అన్ని విద్యలకు నిలయమైనవాడా, శివునికి ముద్దుల కొడుకా మా కోరికలు తీర్చవయ్యా
ఖండపరశువు: శివుడు

62 వ పద్యం

కొలిచెద నే కుడుముల దొర
కొలిచెద నే తొలుత వేల్పు కోర్కెలు తీరన్
పులకపు ముద్దలు పెట్టెద
వెలయుచు విద్ధియలనిమ్ము వెలితియు లేకన్
భావం: కుడుములు ఇష్టంగా తినే వినాయకుని, అందరూ తొలిగా పూజించే విఘ్నేశ్వరుని నేను కూడా పూజిస్తాను. పెసరపప్పు వేసి వండిన పులగం ముద్దలు చేసి తినిపిస్తాను కానీ నాకు విద్యలు మాత్రం లోటు చెయ్యకుండా ఇవ్వాలి సుమా..
పులకపు ముద్దలు: పెసరపప్పు వేసి వండిన అన్నం, పులగం

63 వ పద్యం

గజముఖునికి పెండ్లియని అ
గజాతయు వెదకెను కన్యకామణి కొఱకున్
గజముఖు డాలోచించియు
ఋజువున నీవలెనె యున్న మృగనయని పసల్
భావం: వినాయకునికి పెండ్లి చేద్దామని తల్లి భావించింది. చక్కని పిల్ల కోసం వెదికింది. వినాయకుడు కాసేపు ఆలోచించి, “అమ్మా .. నీలాగే చక్కని కన్నులు ఉండాలి.. ఇంకా” అంటూ తన కోరికలు చెప్పసాగాడు.
అగజాత : పర్వత పుత్రిక, పార్వతి
మృగనయని: లేడి కన్నులు గల స్త్రీ
పసల్: చతురతలు

64 వ పద్యం

నీవలె సౌందర్యవతియు
నీవలె లావణ్యరాశి నీరజ ముఖియున్
నీవలె చిలుకల కొలికియు
కావలె నాకున్ భవాని కామన తీరన్
భావం: పార్వతీదేవి జగదేకసౌందర్యవతి కావున గణపతి తన భార్య కూడా తల్లిలా అందంగా ఉండాలని, చక్కని ముఖకాంతి కలిగినదై ఉండాలని (లావణ్యరాశి) కనుల చివర ఎర్రని వన్నె ఉండాలని (చిలుకల కొలికి) , పద్మం వంటి ముఖం ఉండాలని, తన కోరికలు తీరాలంటే ఇలాంటి అమ్మాయే కావాలని కోరాడు.
(కనుల చివరి భాగాన్ని కొలికి అంటారు. కాటుక పెట్టుకునేటప్పుడు ప్రత్యేకంగా కొలికి తీర్చిదిద్దుకుంటారు. అరచేతులు, పాదాలు, కంటి కొలుకులు, పెదవులు ఇవి ఎర్రగా ఉంటే శ్రేష్టం అని సాముద్రిక శాస్త్రం చెపుతోంది)

65 వ పద్యం

సంబరపడె గౌరి, సుతా!
అంబ కుమారా! గణేశ! అంబరా పథముల్
యింబడరగ గాలింతుము
సాంబశివుని తోడ నమ్ము సాధ్వీమణి కై
భావం: పార్వతీదేవి చాలా సంతోషించింది. “నాయనా కుమారా, మీ తండ్రిగారితో కలిసి, ఆకాశ వీధులన్నీ వెదికి మరీ నీకు తగిన పిల్లను చూస్తాను” అని పలికింది.

66 వ పద్యం

వెదకితి నన్ని దిశల మరి
వెదకిన నీ సాటి పోడి వెరగున లేదే
అదనుగ పరిణయమొప్పగ
సుదతిని నీవెట్లు తెత్తు సుఖముగ నమ్మా
భావం: అప్పుడు వినాయకుడు అన్నాడు కదా ” నేను అన్ని దిక్కులలో వెదికేను. అదేం ఆశ్చర్యమో, నీలాంటి అమ్మాయి నాకు కనబడలేదు. మరి నాకు పెళ్లి చేయడానికి పిల్లను ఎలా తెస్తావమ్మా?” అని అన్నాడు.
వెరగున: ఆశ్చర్యంగా

67 వ పద్యం

అని పలికిన సుతుని పిలిచి
అనఘుడ మెచ్చితి తపంబు నన్ని దెసలయం
దనవరతము నీ పూజను
ఘనముగ నే దిశలనైన కానగవచ్చున్
భావం: “నావంటి స్త్రీ కొరకు ఎనిమిది దిక్కులలో ఒక తపస్సులా కూర్చుని వెతికేవు. నీ పట్టుదలకు మెచ్చాను. అందుచేత ఓ పుణ్యాత్ముడా! ఏ దిక్కులో నైనా నీపూజను చేసుకోవచ్చు. ” అని పార్వతీదేవి గణపతికి వరమిచ్చింది. అందుకే చిన్న పిల్లలతో సహా వినాయక పూజకు మండపం వేసేటప్పుడు ఏ దిక్కు అని చూడరు. అనువైన స్థలమో కాదో మాత్రమే చూస్తారు.

68 వ పద్యం

పడతుల నిరువుర చూసితి
కడుగొని పిళ్ళారి నీదు కళ్యాణార్ధం
బుడుగరమిది విఘ్నేశుడ
పడతుల తోడుగ జగముల పాలింపుమయా
భావం: “నీ పెళ్లి కోసం ఇద్దరు చక్కని అమ్మాయిలను చూసాను. ఇది నా కానుక. వీరిద్దరిని వివాహం చేసుకుని, ఈ జగమంతా పరిపాలించు” అని పార్వతీదేవి వినాయకునికి చెప్పింది.
పిళ్ళారి: వినాయకుడు
ఉడుగరము: కానుక

69 వ పద్యం

గౌరీశులకు నమసులిడి
వారిజ నేత్రల ముదమున వరియింతు ననెన్
శౌరి విరించియు సురలును
వారి నిజసతులను గూడి పరిణయ వేదిన్..
భావం: శివ పార్వతులకు నమస్కరించి, కలువరేకుల వంటి కన్నులున్న ఆ ఇద్దరు అమ్మాయిలను వివాహము చేసుకుంటానని గణేశుడు చెప్పాడు. విష్ణువు, బ్రహ్మ, దేవతలందరూ వారి వారి భార్యలతో వచ్చి వివాహ వేదిక వద్ద… (ఏమి చేశారో తర్వాత పద్యంతో అన్వయం)

70 వ పద్యం

కలకలమనుచును కూరిమి
చెలువుల బాసికములుంచి చెంగల్వపు దం
డల కంఠసీమలన్ వే
సి లత్తుక తిలకము తీర్చె శ్రీకరమొప్పన్
భావం: పెండ్లి కుమారునికి బాసికము కట్టారు. చెంగల్వపూల దండ మెడలో వేశారు. లక్క తో తిలకము దిద్దారు. (లత్తుక : లక్క, పారాణి అని కూడా చదివిన జ్ఞాపకం)

71 వ పద్యం
శుద్ధపు తెల్లని వస్త్రము
పద్ధతిగ ధరించి సిద్ధి బుద్దిల తోడన్
సిద్దించగ మా కోర్కెలు
ముద్దుగ వరమిమ్ము మాకు ముచ్చట తీరన్
భావం: తెల్లని వస్త్రమును ధరించి, సిద్ధి బుద్ధి లతో కూడిన వాడా మా కోరికలు సిద్ధింపజేయుమయా (అనగా వినాయకుని వివాహం సిద్ధి, బుద్ధి లతో జరిగిందన్నమాట
వినాయకుడు, హనుమంతుడు బ్రహ్మచారులే. కానీ వివాహం కానిదే వారికి కొన్ని వరాలను ఇచ్చే శక్తి రాదు. కనుక విద్యను నేర్పిన సూర్యుడే తన కుమార్తె అయిన సువర్చల (తన యొక్క అంశ లేదా కళ) ను హనుమంతునికి కళత్రం (భార్య) గా ఇచ్చాడు. అంటే హనుమంతుని ఉపాసించిన వారికి సువర్ఛస్సు ఆయాచితంగా ప్రాప్తిస్తుంది. అలాగే పార్వతీ వర దత్తమైన సిద్ధి బుద్ధి అనే శక్తుల (కళత్రాల) వలన విఘ్నేశ్వరోపాసకులకు తగిన కార్యాలు సిద్దించడం, ఆ కార్యానికి తగిన ఆలోచన బుద్ధికి తోచడం వగైరాలు ఆయాచితంగా లభిస్తాయి)

72 వ పద్యం

అక్షతలు చల్లిరి సురలు
దాక్షాయణి సంతసించి ద్రవ్యములొసగెన్
లక్షణముగ నీదు సతుల
వీక్షణలు జనులకు మేలు విత్తములిచ్చున్
భావం: దేవతలందరూ నూతన వధూవరులను అక్షతలు చల్లి ఆశీర్వదించారు. పార్వతీదేవి వారికి కావలసినవన్ని ఇచ్చి, “నీ భార్యల దృష్టి సోకితే జనులకు శుభం జరుగుతుంది” అని దీవించింది.

73 వ పద్యం

ఒద్దిక మీరగ మీరలు
సిద్ధియు బుద్ధియు మదీయ సేవక వాంఛల్
సిద్ధింపజేయు మనె విభు
డుద్ధతులైరి సతులిర్వురున్మీలితలై
భావం: వివాహమైన వెంటనే “నేటి నుంచి నీవు నా అర్ధాంగివి, నేను చేసే కార్యక్రమాలలో పాలు పంచుకుంటూ, నా వంశాన్ని అభివృద్ధి చెయ్యి” అని భర్త అగ్నిసాక్షిగా భార్యకు చెప్తాడు. భార్య కూడా సరే అంటుంది. అదేవిధంగా విఘ్నేశ్వరుడు కూడా తన భార్యలైన సిద్ధి, బుద్ధి లను చూసి, “ఈ రోజు నుంచి మీరు నన్ను సేవించిన వారి కోర్కెలు తీర్చండి” అని చెప్పేడు. భర్త చేసే కార్యక్రమంలో పాల్గొనబోతున్నందుకు వారిద్దరూ ఆనందంతో వికసించిన వారై గర్వంతో ఉప్పొంగారు.
ఉద్దతులు: గర్వంతో కూడినవారు
ఉన్మీలితలు: విరిసినవారు

74 వ పద్యం

వందే గణపతి దేవం
వందే వ్యాస వినుతం భవానీశ సుతం
వందే మహా గణపతిం
వందే హే విఘ్ననాశ వందే చరణం
భావం: గణపతికి నమస్కరిస్తున్నాను. వ్యాసునిచే స్తుతించబడిన వినాయకునికి, పార్వతీపరమేశ్వరుల కుమారుడైన విఘ్నేశ్వరునికి, విఘ్ననాశకుడైన మహా గణపతి చరణాలకు నమస్కరిస్తున్నాను.

75 వ పద్యం

లంకేశుడు కోరగ నా
టంకము లేక వరమిడెనట శివుడు నయ్యో
శంకరు డొసగిన లింగము
లంకేశుని కాత్మలింగ లంబనమయ్యెన్
భావం: లంకాధిపతి అయిన రావణాసురుడు కోరగా శివుడు వెంటనే వరమిచ్చేశాడట.. ఏమి వరమది? ఆత్మలింగం. అనగా తనకు తానే కట్టుబడిపోవడం. శివుడు ఇచ్చిన లింగాన్ని చక్కగా మెడలో హారంగా అమర్చుకున్నాడట రావణుడు.
లంబనము: మెడను వేలాడు హారము

76 వ పద్యం

ప్రాణేశుని గాంచక రు
ద్రాణి భయమునొంది సురల రావించెన్ శ
ర్వాణీశుడభయ మిడగా
రాణువ తో కూడి తాము రావణు చేరెన్
భావం: ఆత్మలింగం ఇవ్వడం అంటే తాను రావణునికి వశమై పోవడమే. రావణుని వెంట వెళ్ళిపోయాడు శివుడు. కైలాసంలో శివుడు కనబడక పార్వతీదేవి భయపడింది. దేవతలందరిని పిలిచింది. “శివుడు రావణునితో ఉన్నాడని, తాము తీసుకు వస్తామని , భయపడవద్దని” బ్రహ్మ అభయమిచ్చి, దేవతల సైన్యంతో రావణాసురుని వద్దకు బయలుదేరి వెళ్లారు
రుద్రాణి: పార్వతి
శర్వాణిపతి : సరస్వతీ దేవి భర్త అయిన బ్రహ్మ
రాణువ: సైన్యం

77 వ పద్యం

దక్షిణ సముద్ర తరి గో
రక్షణ సేయుచుబుగాణపటి రాజిలుచుండన్
రాక్షసుడది గని “బాలుడ
రక్ష యొసగు మాత్మలింగ రాజమ్మిదియే”
భావం: దక్షిణ సముద్ర తీరాన ఆవులను కాస్తున్న బాలుణ్ణి గమనించి, రావణుడు ” ఓ బాలుడా, ఈ లింగము చాలా పవిత్రమైనది. కాసేపు రక్షణ ఇస్తావూ?” అని అడిగాడు.

78 వ పద్యం

చేతనిడు, నేల దాకకు
చేతుల, రవి కుంకె, సంధ్య సేయు సమయమౌ
ఊతము సేయుము, బాలక
పాతరలాడకమనుచును వారిధి చేరన్
(తర్వాత పద్యంతో అన్వయం)
భావం: బాలుణ్ణి పిలిచి, ఆత్మలింగం చేతిలో పెట్టాడు. “జాగ్రత్తగా పట్టుకో, చేతులు నేలను తాకనివ్వకు, సూర్యుడు అస్తమిస్తున్నాడు. సంధ్యావందనం చేయాలి. కాసేపు పట్టుకో. అబ్బాయీ, గంతులువేసి, ఆ లింగంతో ఆడేవు సుమా… జాగ్రత్త ” అని చెప్పి, సముద్రం దగ్గరకు చేరినంతలో…
పాతరలాడుట: ఒక జాతీయం. గెంతులు వేసి చేతిలో ఉన్నది ఆడించుట.

79 వ పద్యం

లింగము బహు భారము నీ
సంగతి నాకెఱుక రాక్షస విను పిలిచెదన్
మంగళముగ ముమ్మారులు
కొంగొని రాకున్నా విడుతు కూపారమునన్
భావం: అప్పుడు బాలుడు ” లింగం చాలా బరువుగా ఉంది. నువ్వు రావణుడవని, రాక్షసుడవని నాకు తెలుసు. నేను నిన్ను మూడు మార్లు పిలుస్తాను. ఆ లోగా నువ్వు రాకపోతే తీసుకొచ్చి సముద్రంలో పడేస్తాను లింగాన్ని” అన్నాడు.

కూపారము: సముద్రము

80 వ పద్యం

వల్లె యనె రావణుడు మరి
అల్లన బోవ నదిలించె నసురుని తొలిగా
ఒల్లకు వచ్చెదననియెను
చల్లగ మఱియొక్కమారు చయ్యన పిలిచెన్
భావం: “సరే” నన్నాడు రావణుడు. ఇంకా రావణుడు సముద్రాన్ని చేరక ముందే “రావణా, రా” అంటూ మొదటి సారి పిలిచాడు బాలుడు. “అయ్యయ్యో విడిచిపెట్టకు వచ్చేస్తున్నాను ” అని హడావిడిగా నీటిలో దిగాడు రావణుడు. వెంటనే మరోసారి “రావణా.. రా త్వరగా” అని కేకేసాడు.

81 వ పద్యం

రవికి మలిసంధ్య నర్ఘ్య మి
డి వడివడి యడుగుల పరువిడె నసురు డంతన్
దివిజులు నానందించగ
నవలీలగ మూడవ పిలుపది యెలుగెత్తెన్
భావం: సముద్రంలో దిగి సూర్యునికి అర్ఘ్యమిచ్చి పరుగున రావణుడు వచ్చేటంతలో… దేవతలందరూ ఆనందించేటట్లుగా మూడవసారి కూడా పిలిచేసాడు బాలుడు.

1 thought on “*శ్రీగణేశ చరిత్ర*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *