June 24, 2024

తథాస్తు

రచన: సి. హెచ్. ప్రతాప్

సీతాపురంలో కృష్ణయ్య, రాధమ్మ అనే దంపతులు వుంటున్నారు. వారికి కడు బీద కుటుంబం. పెళ్ళయి పదేళ్లయినా పిల్లలు కలగలేదు. జరుగుబాటు కష్టం అవుతున్నా నైతిక విలువలకు, మానవత్వానికి పెద్ద పీట వేసేవారు ఆ దంపతులు. తాతల కాలం నాటి పది సెంట్ల స్థలంలో ఇల్లుకు పోగా మిగిలిన జాగాలో కూరలు పండిస్తూ, వాటిని బజారులో అమ్ముకొని, వచ్చిన డబ్బుతో తృప్తిగా జీవించేవారు. ఏనాడు కూడా తమది కష్టంతో కూడుకున్న జీవితం అని గాని, తమ బంధువులకు మల్లే సుఖమయ జీవితం, సకల సౌకర్యాలు లేవని బాధపడకుండా వున్నదానితోనే సంతృప్తిగా జీవించడం అలవాటు చేసుకున్నారు ఆ దంపతులు. పూట పూటకు గండం, పొట్టకూటి కోసం ఆరాటం, కన్నీళ్ళతోనే సహవాసం, అయినా సంతృప్తితో పాటు ఇతరుల క్షుద్భాధ తోర్చడంలోనే ఆనందం వెదుక్కుంటున్నారు ఆ పేద దంపతులు.
ఒకరోజు మధ్యాహ్నం ఆకలితో వున్న ఒక బిచ్చగాడు ఆ ఇంటి ముందు ఆగి ” కొంచెం అన్నం వుంటే పెట్టమని” రాధమ్మని అర్ధించాడు. అప్పుడే రాధమ్మ భోజనం ప్రారంభించబోతోంది. చిక్కిశల్యమై ఎప్పుడు ప్రాణాలు పోతాయో అన్నట్లు వున్న ఆ బిచ్చగాడిని చూడగానే రాధమ్మకు జాలేసింది.
వెంటనే వున్న అన్నంలో సగం తీసి బిచ్చగాడికి పెట్టింది. దానిని ఎంతో ఆత్రంగా తిన్న అతడు “రెండు రోజులయ్యిందమ్మా అన్నం తిని, ఇంకాస్త వుంటే పెట్టమ్మా ” అని కింద చతికిలపడ్డాడు.
తానెంతో అదృష్టవంతురాలు, కనీసం కిందటి రాత్రైనా అన్నం తినగలిగింది. ఈ బిచ్చగాడి పరిస్థితి మరీ దారుణంగా వుంది” అనుకుంటూ మిగిలిన అన్నం కూడా పెట్టేసి, త్రాగడానికి ఒక పెద్ద గ్లాసుతో కుండలోని చల్లని నీరు ఇచ్చింది.
అన్నం ఆబగా తిని నీళ్ళు త్రాగిన ఆ బిచ్చగాడు రాధమ్మకు దణ్ణం పెట్టి, ఆకాశం వంక చూసి “దేవతలారా, తాను తినకుండా వున్నదంతా నాకే పెట్టేసిన ఈ తల్లిది గొప్ప మనసు. దయచేసి ఈ అమ్మను దీవించి, సకలైశ్వర్యాలు ప్రసాదించండి” అని ప్రార్ధన చేసి వెళ్ళిపోయాడు. ఆ సమయంలో ఆకాశంలో తధాస్తు దేవతలు ఆ ఇంటిమీదుగా ప్రయాణిస్తున్నారు. బిచ్చగాడి ఆర్ధ్రతతో కూడిన ప్రార్ధనను వినగానే తక్షణం తధాస్తు అని దీవించారు.
ఆ క్షణం నుండి రాధమ్మ దంపతుల జీవిత విధనమే మారిపోయింది. పట్టిందల్లా బంగారం కాసాగింది. దొడ్లో కాయగూరలు అద్భుతంగా పండసాగాయి. వాటికి బజార్లో మంచి ధర పలకసాగింది. కొద్దికాలం లో వచ్చిన లాభాలతో పక్కనే వున్న మరి కొంత స్థలం కొని అందులో కుడా ఋతువుల కనుగుణంగా కూరగాయలు పండించసాగారు. వాటిపై కూడా మంచి లాభాలు రాసాగాయి.
సంవత్సరం తిరిగేసరికి కృష్ణయ్య, రాధమ్మల ఆర్ధిక స్థితి మారిపోయింది. ఒక పెద్ద ఇల్లు కట్టుకున్నారు. ఇంట్ళొ పని, తోట పని చేసేందుకు నౌకర్లను కూడా పెట్టుకున్నారు.
వారికి జీవితంలో దర్జాగా జీవించేందుకు అన్ని సౌకర్యాలు సమకురాయి. అయితే ఐశ్వర్యంతో పాటు మానవుల ఆలోచనా విధానం, ధృక్పధాలలో మార్పు వస్తుందన్న సత్యం వీరి విషయంలో కూడా నిజమయ్యింది. డబ్బు, సుఖాలు, భోగ్యభాగ్యాలు రాగానే కృష్ణయ్య, రాధమ్మ మనస్థత్వంలో కూడా మార్పు వచ్చింది. అధికారం, దర్పం ఎక్కువయ్యాయి. పట్టణంలో పెద్దవారు, ధనవంతులతో పరిచయాలు, వారితో విందులు, వినోదాలు మొదలయ్యాయి. నౌకర్లపై పెత్తనాలు చెలాయిస్తున్నారు. డబ్బు యావ ఎక్కువవడంతో ఇంకా ఏయే వ్యాపారాలు చేస్తే సంపదలు సమకూరుతాయోనన్న ఆలోచనలే ఎప్పుడు వారి మనసులలో మెదిలేవి.
ఇలా మరొక సంవత్సరం పూర్తయ్యింది. ఒక ఎండాకాలం నాటి మధ్యాహ్నం రాధమ్మ అప్పుడే ఒక పరిచయస్తురాలి ఇంటి నుండి తిరిగి వస్తూ గుర్రపుబగ్గీ దిగుతోంది. అప్పుడే ఒక బిచ్చగాడు ఆ వీధిన పోతూ రాధమ్మను చూసి ఆగి దీనంగా “అమ్మా , అన్నం తిని రెండు రోజులయ్యింది. నడిచే శక్తి కూడా లేదు. ప్రాణాలన్నీ పోతున్నంత బాధ కలుగుతోంది. పట్టెడన్నం వుంటే పెట్టించు తల్లి” అని ప్రార్ధించాడు.
వాడిని చూడగానే రాధమ్మ ఒళ్ళంతా కంపరం పుట్టినట్లయ్యింది. ఆపాదమస్తకం కారం పూసుకున్నట్లు మంటగా అనిపించగా జుగుప్సతో” నాకేం పనీ పాటా లేదనుకున్నావా ? నీలాంటి అడ్డమైన వాళ్ళను ఆదరించాడానికి. అయినా ముష్టెత్తుకోవడానికి నా ఇల్లే దొరికిందా? నువ్వు చస్తే నాకేమిటి, బ్రతికి వుంటే నాకేమిటి ? అయినా తినడానికి ఒక మెతుకు అయినా లేనివాడివి నువ్వు బ్రతకడం వలన ఈ ప్రపంచానికి ఏం లాభం ? వెళ్ళి ఏ నూతిలొనైనా పడి చావు, పీడ విరగడ అవుతుంది. భూభారం తగ్గుతుంది” అంటూ తీవ్రస్వరంతో వాడిని తిట్టిపోసింది. అంతే కాకుండా అక్కడే నిలబడి ఆశగా చూస్తున్న ఆ బిచ్చగాడిని మెడ పట్టి బయటకు గెంటేయమని సేవకులకు ఆజ్ఞాపించింది.
ఆ మాటలకు, చర్యలకు బిచ్చగాడు ఎంతో మనస్తాపానికి గురయ్యాడు. కళ్ళలో నీళ్ళు చిప్పిల్లగా ఆకాశం వైపు చూస్తూ “దేవతలారా, డబ్బు మదంతో సాటివారిని పురుగుల కంటే హీనంగా చూస్తున్న ఈమెకు తగు బుద్ధి వచ్చేలా చేయండి” అంటూ ప్రార్ధించి అక్కడినుండి వెళ్ళిపోయాడు.
ఆ సమయంలో ఆకాశంలో ఆ ఇంటి మీద నుండి పయనిస్తున్న తధాస్తు దేవతలు ఆ బిచ్చగాడి మనోవేదనాపూరితమైన ప్రార్ధన విని “తధాస్తు” అన్నారు.
మరుక్షణంలో ఆ దంపతులకు పట్టిన అదృష్టం వీగిపోయింది. కృష్ణయ్య తీవ్ర వ్యాధికి లోనై మంచం పట్టాడు. వ్యాపారం చూసుకునే దక్షత లేక రాధమ్మ ఆ బాధ్యతలను కింది ఉద్యోగులకు అప్పగించగా సంవత్సరం తిరిగేలోగా వారు లాభాలన్నీ కాజేసి అప్పులు మిగిల్చి పరారైపోయారు. అప్పులు తీర్చేందుకు ఉన్నఆస్తులన్నీ అమ్ముకొని రాధమ్మ దంపతులు కట్టుబట్టలతో వీధిన పడ్డారు.
తిరిగి కుటుంబాన్ని పోషించడం కోసం రాధమ్మ కాయకష్టం చేసుకోవడం ప్రారంభించింది.
నడిమంత్రపు సిరి ఎల్లకాలం నిలవదని, తధాస్తు దేవతలు ఎప్పుడు ఎక్కడ వుంటారో తెలియదు కాబట్టి మన నోటి నుండి లేక మన గురించి ఇతరుల నోటి నుండి ఆశుభపు పలుకులు రావడం మంచిది కాదని అప్పుడు వారిద్దరికీ అర్ధమయ్యింది. సంపద వచ్చినప్పుడు అహంకారానికి, దర్పానికి పోయి సాటి వారిని చులకనగా చూస్తూ మానవత్వపు విలువలకు పాతర వేసే తమలాంటి వారికి చివరకు అధోగతి తప్పదని గ్రహించారు.

1 thought on “తథాస్తు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *