March 19, 2024

చిత్రగుప్తుడు

రచన: శ్యామసుందరరావు

యమగోల యమలీల లాంటి హిందూ దేవుళ్లను కించపరిచే సినిమాల పుణ్యమా అని పురాణాల్లోని ఉదాత్తమైన పాత్ర చిత్రగుప్తుడు ఒక హాస్య పాత్రగా మన మనస్సుల్లో ముద్ర పడింది నిజానికి చిత్రగుప్తుడు బ్రహ్మ యొక్క పదిహేడు మంది మానసపుత్రులలో ఒకడు. యమధర్మరాజుకు ధర్మ నిర్వహణలో సహాయకుడిగా ఉంటూ భూలోకవాసుల మరణానంతరము వారి పాప పుణ్యాల అనుగుణముగా వారికి న్యాయ బద్ధముగా ఏ విధమైన పక్షపాత ధోరణి లేకుండా శిక్షలు నిర్ణయించటంలో యమధర్మ రాజుకు సహకరించే వ్యక్తి చిత్రగుప్తుడు. గరుడ పురాణములో చిత్రగుప్తుని జననము వివరింపబడింది.మొదట్లో అంటే విశ్వము ప్రారంభము తరువాత భూలోక వాసులు చనిపోయి వారి ఆత్మలు యమధర్మరాజు సమక్షంలోకి వెళ్లి నప్పుడు వారి పాప పుణ్యాలను నిర్ణయించుటలో అయన కొంత గందరగోళానికి లోనయ్యేవాడు ఎందుకంటే వారి పాపపుణ్యాల చిట్టా ఏమి ఉండేది కాదు ఈ పరిస్థితిలో యమధర్మరాజు తన ఇబ్బందిని సృష్టి కర్త అయినా బ్రహ్మకు వివరించాడు.

ఈ సమస్య పరిష్కారము కోసము బ్రహ్మ యోగనిద్రలోకి వెళతాడు. కొంతకాలము అంటే 11,000 సంవత్సరాల తరువాత కళ్ళు తెరిచిన బ్రహ్మకు ఎదురుగా ఒక ఆజానుబాహుడిని చూస్తాడు అతని చేతిలో పుస్తకము,ఘంటము, నడుముకు కత్తి ఉంటాయి. బ్రహ్మ తన దివ్యదృష్టితో ఆ వ్యక్తి తన చిత్తము (శరీరము) లో గుప్తముగా నివాసము ఉన్న వ్యక్తిగా గ్రహిస్తాడు.

ఆ విధముగా “చిత్రగుప్తుడు “అని ఆ వ్యక్తికీ నామకరణము చేస్తాడు.బ్రహ్మ శరీరము నుండి ఉద్బవించాడు కాబట్టి కాయస్థ అని పేరు కూడా ఉంది. “ఇక నుంచి నీవు ఈ విశ్వములోని ప్రతి జీవిలో రహస్యముగా వుంటూ, వారి మంచి చెడులను తెలుసుకుంటూ, నాకు తెలియజేయాలి. వాటిని ఆధారముగా వారికి శిక్షలు వేయబడతాయి” అని పెద్ద బాధ్యత చిత్రగుప్తునికి యమధర్మరాజు అప్పగిస్తాడు. మనము మనలను ఎవరు చూడటము లేదు అన్న ధీమాతో అనేక తప్పులు చేస్తూ ఉంటాము కానీ, వాటిని మనలో గుప్తముగా ఉన్న చిత్రగుప్తుడు వాటిని తన చిట్టాలో నమోదుచేస్తూ మన ఆత్మలు యమధర్మరాజు సమక్షానికి చేరినప్పుడు విన్నవించి శిక్షలు వేయటానికి యమధర్మరాజుకు సహకరిస్తాడు.

చిత్రగుప్తునికి ఈ విషయములో సహకరించేవారిని శ్రవణులు అంటారు. వీరు కూడా బ్రహ్మ మానసపుత్రులు వీరు ముల్లోకాలలో విహరిస్తూ జీవుల పాపపుణ్యాలను ఎప్పటికప్పుడు చిత్రగుప్తుడికి తెలియజేస్తుంటారు. అందుచేతనే ఈ విశ్వములోని జీవుల పాపపుణ్యాలను చిత్రగుప్తుడు ఖచ్చితముగా నిర్ణయించగలుగుతున్నాడని గరుడ పురాణము తెలియజేస్తుంది.యమధర్మరాజు తన కుమార్తె ఐరావతితో చిత్రగుప్తుని వివాహము జరిపిస్తాడు. సూర్యుని కుమారుడైన శ్రద్ధదేవ మను అయన కూతురైన నందినిని చిత్రగుప్తునికి ఇచ్చి వివాహము చేస్తాడు. చిత్రగుప్తునికి ఐరావతి ద్వారా ఎనిమిదిమంది కుమారులు, నందిని ద్వారా నలుగురు కుమారులు ఉన్నారు. వీరు కాయస్థ వంశానికి మూలపురుషులుగా ఉంటారు.

పద్మపురాణములో కూడా చిత్రగుప్తుని ప్రస్తావన ఉంది. చిత్రగుప్తుడు తనకున్న అమోఘమైన తెలివితేటలతో యమధర్మరాజు దగ్గర ఉండి జీవుల పాపపుణ్యాల చిట్టాను చేస్తుంటాడని చెప్పబడింది.భవిష్యపురాణము, విజ్ఞాన తంత్రములలో కూడా ఇదే విధముగా చెప్పబడింది. మహాభారతములోని అనుశాసన పర్వంలో చిత్రగుప్తుని బోధనలు వివరింపబడ్డాయి. ప్రజలు ధర్మబద్ధముగా ఉంటూ యజ్ఞ యాగాదులు చేస్తూ ఉండాలని ఈ బోధనలు చెపుతాయి. లేని పక్షంలో వీరికి శిక్షలు ఉంటాయని కూడా చెపుతాయి. పురాణాల ప్రకారము చిత్రగుప్తుడు రాజాధిరాజు మిగిలినవారు అందరు చిన్న రాజులు చిత్రగుప్తుడు నవగ్రహాల్లో ఒకటైన కేతువుకు అదిదేవుడు కాబట్టి చిత్రగుప్తుని పూజించినవారికి కేతువు వల్ల కలిగే చెడు ఫలితాలు తొలగింపబడతాయి.

చితగుప్తునికి భారతదేశములో చాలా చోట్ల ఆలయాలు ఉన్నాయి.వాటిలో కొన్ని ప్రముఖ దేవాలయాలను గురించి తెలుసుకుందాము. ఖజురహో,ఉజ్జయిని,కాంచిపురము,హైదరాబాదులలో ఉన్నాయి. ఉజ్జయినిలో గుడి సుమారు 4000 సంవత్సర క్రితముది . ఈ గుడి భారతదేశములోని ఒక ప్రముఖమైన పురావస్తు కేంద్రము. కాంచీపురంలోని గుడిని 9 వ శతాబ్దములో చోళ రాజులు నిర్మించినట్లు అక్కడి శిలా శాసనాల ద్వారా తెలుస్తుంది. హైదరాబాదు లోని పాత బస్తీ లో ఫలక్ నామ ప్రాంతములో,కందికల్ గెట్ వద్ద చిత్రగుప్తుని గుడిని 18 వ శతాబ్దము లో కుతుబ్ షాహి దగ్గర పనిచేసే కాయస్తులు నిర్మించినట్లు తెలుస్తుంది.చిత్రగుప్తుని పూజలో వాడే వస్తువులు విచిత్రముగా ఉంటాయి అవి పెన్ను, పేపరు, ఇంకు ,తేనే,వక్కపొడి, అగ్గిపెట్టే, చక్కెర,గంధముచెక్క, ఆవాలు,నువ్వులు, తమలపాకులు. న్యాయము, శాంతి,అక్షరాస్యత, విజ్ఞానము అనే నాలుగు గుణాలకోసము చిత్రగుప్తుని పూజిస్తారు. చిత్రగుప్తుని ఆలయాల్లో దీపావళి రెండో రోజు చిత్రగుప్తుని పుట్టిన రోజుగా నిర్వహిస్తారు దీనినే భాయ్ దూజానుంటారు.

చిత్రగుప్తుని సంస్కృతములో కాయస్త అంటారు కాబట్టి ప్రస్తుతము చిత్రగుప్తుడు కాయస్తుల కులానికి చెందినవాడుగా భావిస్తారు. కాయస్తుల కులదైవం చిత్రగుప్తుడే . చిత్రగుప్తునికి ఇష్టమైన రోజు బుధవారముగా పూజారులు చెపుతారు. ఆ రోజు చిత్రగుప్తుని గుళ్ళలో అభిషేకము ప్రత్యేక పూజలు చేస్తారు. ఆకాల మృత్యువును జయించటానికి,ఆరోగ్యము,చదువు మరియు అనేక సమస్యల పరిష్కారము కోసము భక్తులు ఈ దేవాలయాలను దర్శించుకుంటారు. కేతు గ్రహ దోష నివారణకు కూడా ఈ దేవాలయలో పూజలు చేస్తుంటారు. కాబట్టి సినిమాలు చూసి చిత్రగుప్తుని పట్ల చులకన భావము ఏర్పరచుకోకండి. చాలా విశిష్ట మైన, మన అంతరాత్మలో ఉండి, మనలను నిత్యము గమనిస్తూ మన పాప పుణ్యాలను లెక్కగట్టి మనకు శిక్షలు వేసే దేవుడు చిత్రగుప్తుడే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *