March 19, 2024

చంటోడి స్వగతం

రచన: గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్

పుట్టగానే ఏడ్చా
పరమాత్ముని వీడి
పుడమిపై పడ్డందుకు

క్షీరం కుడిపితే త్రాగా
కన్నతల్లి ప్రేమరుచిని
కనుగొనేందుకు

వంటిపైన చెయ్యేస్తే
స్పర్శానుభూతిని పొందా
హాయిగా నిదురబోయా

నాన్న ఎత్తుకుంటే
నాకు కావలసినవాడని
నేను మురిసిపోయా

ఉయ్యాలలోవేసి ఊపితే
గాలిలో తేలిపోతున్నట్లుగా
సంబరపడిపోయా

ప్రక్కవాళ్ళు పలకరిస్తే
పరిచయం చేసుకుంటే
పకపక నవ్వా

అన్నను చూశాక
ఆటలు ఆడాలని
ఆరాటపడ్డా

అక్క పలకరించాక
అనురాగం ఆప్యాయతలను
అందరికి అందించాలనుకున్నా

అంగీ తొడిగితే
అంగాలకు రక్షణ దొరికిందని
అనందపడిపోయా

అన్నప్రాశన చేస్తే
అరిగించుకునే శక్తివచ్చిందని
సంతసించా

పేరుపెట్టి పిలిస్తే
గుర్తింపు వచ్చిందని
కుతూహలపడ్డా

కళ్ళతోచూచా
కమ్మదనాన్ని
క్రోలుకొనటం మొదలుపెట్టా

చెవులతోవిన్నా
శ్రావ్యతేమిటో
తెలుసుకున్నా

రానున్న రోజుల్లో
నడక నేర్చుకుంటా
మాటలు నోట్లోచిందిస్తా
తినటం తెలుసుకుంటా

చదువులు నేర్చుకుంటా
ఉద్యోగాలు చేస్తా
సంపాదన పొందుతా
స్వతంత్రుడిగా బ్రతుకుతా

శిరసువంచుతా
సపర్యలుచేస్తా
పూజలుచేస్తా
నమస్కరిస్తా

పెద్దల్లారా
దీవించండి
గురువుల్లారా
ఆశీర్వదించండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *