April 16, 2024

చంద్రోదయం – 36

రచన: మన్నెం శారద

“డాక్టర్! ఎలా వుంది?” నానీని పరీక్షించి వెళ్తోన్న డాక్టర్ని వెంబడించి వరండాలో అడిగేడు సారథి.
అప్పటికే వారం రోజులుగా నానీలో ఎలాంటి మార్పూ లేదు. అతనికసలు స్పృహే లేదు. కాళ్లు కొయ్యలా బిగుసుకుపోయేయి. ముఖం గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. మంచానికి పుల్లలా అతుక్కుపోయేడు.
డాక్టర్ సారథివైపు జాలిగా చూసేడు.
“మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ఇది బ్రెయిన్ ఫీవర్ దీనికింతవరకు మందు లేదు. ధైర్యంగా వుండండి” అంటూ వెళ్లిపోయేడు.
సారథి మ్రాన్స్పడి నిలబడిపొయేడు.
భూమిలోకి కూరుకుపోయినట్లున్న పాదాల్ని లాక్కుని భారంగా నానీ బెడ్ దగ్గరకొచ్చేడు. నానీ మెల్లిగా డొక్కలెగ రేస్తున్నాడు.
వాన్నలా చూసేసరికి అతనికి గుండెల్లో చేయిపెట్టి దేవినట్లయింది.
ఎనాళ్ళుగానో నిద్ర ఎరుగని స్వాతి తల నానీ బెడ్‌కి ఆనించి నిద్రపోతోంది. కానీ నిద్రలో కూడా ఆమె ఏడుస్తున్నట్లు ఆమె గొంతు అదురుతోంది.
అతను స్వాతిని పరీక్షగా చూసేడు.
ఆమె చాలా చిక్కిపోయింది. చెక్కిళ్ళు లోపలికి పోయేయి. జడ వేసుకుని ఎన్నాళ్ళయిందో జుత్తు చెదిరిపోయింది.
సారథి నానీ దగ్గరకు వెళ్ళేడు. వాణ్ని చూస్తే అతని హృదయం తరుక్కుపోతోంది. ‘వీడసలు నానీయేనా? ఏవా బుగ్గలు? ఏదా చిలిపితనం? ఏమయిందా అల్లరి? సారథిలో దుఃఖం సుడులు తిరుగుతోంది.
“బ్రెయిన్ ఫీవర్!”
అది ఎంత ప్రమాదకరమైన జబ్బో అతనికి తెలుసు. అందుకే అతను ఆశ వదులుకొని నానీ వంక అలాగే చూస్తూ కూర్చున్నాడు. అతని మనసు మొద్దుబారిపోతోంది.
వార్డులో గడియారం టీక్కుటిక్కుమంటూ కాలాన్ని వెనక్కి నెట్టడానికి ప్రయత్నిస్తోంది.
కాలం గడిస్తే మళ్లీ దొరకదన్నంత అపనగా నానీ ముఖంలోకే చూస్తూ కూర్చున్నాడు సారథి.
నానీ బలహీనంగా డొక్కలు కదుపుతున్నాడు.
గడియారం అయిదుసార్లు మ్రోగింది. “హమ్మయ్యా! ఒక రాత్రి గడిచింది.” అంకున్నాడు సారథి.
కూరుకుపోతున్న కళ్లని విప్పార్చి నానీవైపు చూసేడు. నానీ నిశ్చింతగా నిద్రపోతున్నవాడిలా వున్నాడు. అతని డొక్కలు ఎగరటం లేదు.
సారథి స్థాణువులా బిగుసుకుపోయాడు.
ఆందోళనగా అతని వంటిని నిమిరేడు.
అతని వళ్లు చల్లగా, మంచుముద్దులా వుంది. అంతే! ఆ క్షణం అతను పెట్టిన కేకకి వార్డు దద్దరిల్లింది.
స్వాతి ఉలిక్కిపడి లేచి కూచుంది.
సారథి చలిజ్వరం వచ్చినట్టు వణికిపోతున్నాడు. స్వాతి అర్థం కాని దానిలా సారథి వైపు చూసింది.
నర్సులు పరిగెత్తుకొచ్చి నానీని చూసి పరుగున దాక్టర్ని పిలుచుకొచ్చేరు. అతను నానీ పల్స్ చూసి ఆక్సిజన్ ట్యూబ్ ముక్కులోంచి లాగేసేడు. అతను వెళ్లిపోతూ “అయాం సారీ!” అంటూ గొణిగేడు.
స్వాతికి అంతా అర్థమైంది.
ఏది జరగకూడదని క్షణం క్షణం అందరి దేవుళ్లనీ ప్రార్థించిందో అది జరిగిపోయింది.
వారం రోజులుగా ప్రతిక్షణం ఏడ్వటం వల్ల నేమో ఆమె బయటికి ఏదవలేకపోయింది. మొద్దుబారిన ఆమె హృదయం ఏ రకమైన అనుభూతులనూ బహిర్గతం చేయలేనట్లు స్థంభించిపోయింది.
హాస్పిటల్ పద్ధతులు అయ్యేక నానీ దేహాన్ని వారికి అందజేసేరు.
సారథి భుజాలపై నానీని వేసుకొని, మరో చేత్తో స్వాతిని పట్టుకొని దేశ బహిష్కరణ చేయబడ్డ నేరస్థుడిలా వార్డు బయటికి వచ్చేడు.
అతనికి అడుగులు పదడం లేదు.
కంటికి ఏమీ కనిపించనంత శూన్యం.
జరిగింది నిజమా?
కల కాకూడదా?
కాళ్ళక్రింద భూమి కదులుతోంది.
శరీరంలోని ప్రతి అణువూ చలిజ్వరం వచ్చినట్లు వణికిపోతోంది.
“బాబూ!” అంటూ ఒక్కసారిగా నానీ శరీరాన్ని గట్టిగా కౌగలించుకున్నాడు సారథి.
స్వాతి కళ్లకి మసగ్గా కనపడుతోంది.
నిలబడలేక ముందుకు తూలింది.
ఆమెకి స్పృహ తప్పింది.
***
ప్రాణానికి ప్రాణమైన స్నేహితుడు శేఖర్ పోయినప్పుడు కూడా చలించని సారథి నానీ మరణంతో పూర్తిగా కృంగిపోయేడు.
చిన్నపిల్లాడిలా వెక్కెక్కి ఏడ్చేడు.
“ఈ చేతులతో ఎత్తుకుని ఆడించేను. ఈ చేతులతో చదువు చెప్పి, ఆటలు నేర్పేను. చివరికి ఈ చేతులతోనే నిన్ను పూడ్చి పెట్టానురా నానీ, ఈ చెతులెంత పాపం చేసుకున్నాయిరా!” అంటూ అతను విలపిస్తుంటే చూసినవాళ్లంతా కరిగిపోయారు.
జానకమ్మ నీళ్ళు నిండిన కళ్లతో అతనివిపు చూసింది. అతనికి నానీ పట్ల వున్న ప్రేమ కేవలం నటనని భావించిన వాళ్లంతా విస్తుపోయి చూస్తున్నారు.
‘ఇదేమిటి? వీడింతగా కృంగిపోతున్నాడు, వీడేమైపోతాడో!’ అని ఆందోళన చెందింది సావిత్రమ్మ.
సునంద, వసుధ, సుహాసిని, జ్యోతి లోపల గదిలో నానీ ముద్దు ముచ్చటలు తలచుకుని కుమిలికుమిలి ఏడుస్తున్నారు.
విజయకుమార్ అనునయంగా సారథి భుజాలు పట్టుకొని “అన్నయ్యగారూ, ఒకరికి ధైర్యం చెప్పాల్సిన మీరే చిన్న పిల్లాడిలా ఏడిస్తే అవతల వదినగారి సంగతేమిటి?” అన్నాడు.
సారథి తల కొట్టుకున్నాడు.
“నేనింక ఎవరి సంగతీ ఆలోచించలేను. వాడు నా బహిప్రాణం. శేఖర్ మరణానికే కృంగిపోయిన నేను వాడి ప్రతిరూపాన్ని చూసి, వాడి బాధ్యత నా మీద వున్నదని నిలదొక్కుకున్నాను. నా చేతులతో వాడిని పెంచి పెద్ద చేసి శేఖర్ ఆత్మకు తృప్తిని కలిగించాలని కలలు కన్నాను. కానీ ఇంకేం మిగిలిందని, ఇంకేం చెయ్యాలని నేను ధైర్యం తెచ్చుకోవాలి? వాణ్ని మరచి నేనెలా బ్రతగ్గలను?” అన్నాడు ఆవేదనగా.
“మీరెంతగా నానీని ప్రేమించేరో మాకందరికీ తెలుసు. కాని భగవంతుడికే దయ లేనప్పుడు మనమేం చేయగలం” అన్నాదు భార్గవ అనునయంగా.
సారథికి వాళ్ల మాటలు రుచించడం లేదు.
అతని గుండెలో అగ్నిపర్వతాలు బ్రద్దలవుతున్నాయి.
అంతసేపూ నిశ్శబ్దంగా కూర్చున్న స్వాతి వున్నట్టుంది పెద్దపెట్టున నవ్వింది. అందరూ వులిక్కిపడి అటువైపు చూసేరు.
సారథి తల్లి చటుక్కున వెళ్లి కోడల్ని గట్టిగా పట్టుకొంది.
“ఎందుకత్తయ్యగారూ, అలా కంగారుపడ్తారు. నానీ ఎందుకు చచ్చిపోయాడో మీకు నేను చెప్పలేదు కదూ. వాణ్ని నేనే చంపేసేను. నిజం, నేనే చంపేసేను.”
“ఊరుకో స్వాతీ, అలా మాట్లాడకూడదు” సునంద బుజ్జగించింది.
స్వాతి మళ్లీ నవ్వింది. “నన్ను నిజం చెప్పనీయండి. అక్కడ కూర్చుని తన స్నేహితుడి కొడుకుని అమితంగా ప్రేమించి కన్నతండ్రికన్నా ఎక్కువగా ఏడుస్తున్నాడే, ఆ దేవుడి పిల్లల్ని నేను హత్య చేసేను. ఒకళ్లని కాదు, ముగ్గుర్ని. అందుకే ఆ దేవుడు నాకీ శిక్ష వేసి కక్ష తీర్చుకున్నాడు” అంది.
సారథి ఎర్రబడి జ్యోతుల్లా వున్న కళ్లతో స్వాతి వైపు చూసేడు.
“అవునండీ. నేనే ఈ అనర్ధానికి కారణం నేనే.. నన్ను చంపేయండి” స్వాతి వుద్రేకంగా సారథి గుండెలకి తల కొట్టుకుంటూ ఏడుస్తోంది.
జానకమ్మ, సునంద స్వాతిని గట్టిగా పట్టుకొన్నారు. వసుధ అక్కగారికి స్లీపింగ్ పిల్ వేసి బలవంతంగా లాక్కెళ్ళి మంచమ్మీద పడుకోబెట్టింది.
జ్యోతి బేలగా అక్కగారి వేపే చూస్తోంది.
స్వాతి క్రమంగా నిద్రలోకి జారుకొంది. నిద్రలో కూడా ఆమె ఏడుస్తున్నట్లుగా వుండి వుండీ వెక్కుతోంది.
“అక్క జీవితంతో విధి ఎందుకిలా ఆడుకొంటోంది? ఏ మనిషీ ఇన్ని దెబ్బలు తగిలితే తట్టుకోలేడు. ఎందుకు దేవుడికింత కక్ష?’ జ్యోతి వెక్కివెక్కి ఏడ్చింది.
“బావగారూ, కొన్నాళ్లు మీ యిద్దరూ ఎటైనా వెళ్లి రండి” అన్నాడు భార్గవ.
సారథి నిర్లిప్తంగా చూస్తూ “ఈ గుండెలో మంట ఎక్కడికెల్తే మాత్రం చల్లారుతుంది?” అన్నాడు.
“ఆ మాట నిజమే. స్వాతి యిక్కడ వుంటే పిచ్చిదయిపోతుందని భయంగా వుంది. స్థలం మార్పు చాలా అవసరం. నానీ ఆడిపాడిన చోట మీరిక వుండలేరు ఉండి తట్టుకోలేరు” అంది సునంద.
“ఈ పాడుకొంపలోకి ఏనాడు వచ్చేరోగాని, ఒక్కరోజు కూడ సుఖపడలేదు. పిడుగులాంటి శేఖర్‌ని పొట్టన పెట్టుకుంది. శంకరంగారు సరేసరి. ఆడుతూ పాడుతూన్న బిడ్డ క్షణంలో మటుమాయమయ్యేడు” అంది సారథి తల్లి కళ్ళొత్తుకుంటూ.
“ఇల్లేం చేసిందమ్మా. అంత మన దురదృష్టం” అన్నాడు సారథి నిరాశగా.
“ఏది యేమైనా యిక్కడ మీరు వుండడం మంచిది కాదు. కావాలంటే ఈ ఇల్లు అద్దెకిచ్చేయండి” అన్నాడూ విజయకుమార్.
సారథి విన్నాడు కానీ మాట్లాడలేదు.
ఎక్కడ చూసినా నానీఎ ఆటవస్తువులు కన్పిస్తున్నాయి. బీరువా మూలన వున్న క్రికెట్ బాట్ చూడగానే సారథి కళ్లలో నీళ్లు తిరిగేయి. సాయంత్రమయ్యేసరికి బాట్ తీసుకుని తన కోసం ఎంతగానో ఎదురుచూసేవాడు. దోబూచులాడే ఆ కళ్లు తనకిక కన్పించవు.
సారథికి ఆ ఇంట్లో వుండలేననిపించింది.
పదిరోజుల తర్వాత సారథి అందర్నీ తీసుకుని తిరుపతి బయల్దేరాడు. స్వాతి గుడికి రానని పట్టుబట్టింది.
“ఆ దేవుడు నాకేమిచ్చాడని గుడికి రావాలి? ఇచ్చినట్లే ఇచ్చి నా గుండెల్లో చిచ్చుపెట్టి నా కన్నబిడ్డని లాక్కున్నందుకు దర్శనం చేసుకోవాలా?” అంది బధగా.
“తప్పు స్వాతీ, మన జీవితాల్లో ఒడిదుడుకులకు దేవుణ్ని నిందించి ప్రయోజనం లేదు. కేవలం మనశ్శాంతి కోసమే నిన్ను దైవదర్శనం చేసుకోమంటున్నాను. మనదేమి లేదని, ఎవరిమీదో భారం పెట్టి బ్రతకటంలో నిశ్చింత, హాయి వున్నాయి” అన్నాడు సారథి.
స్వాతి అతన్ని అనుసరించింది.
మూడు రోజులు తిరుపతిలో వున్నారు.
సావిత్రమ్మ కూడా నానీ మరణం పట్ల చాలా కృంగిపోయింది. అల్లారుముద్దుగా చూసే ఆ బిడ్డని, చివరి రోజుల్లో స్వాతి మీద కోపంతో ఈసడించి దూరం చేసింది. కఠినంగా ప్రవర్తించింది.
నానీ మరణం ఆమెను దహించేస్తోంది.
అతని చావుకి తనూ కారణమేమో, పైకి చెప్పుకోలేదు.
అందరూ తిరిగి ప్రయాణం అయ్యేరు. విజయవాడలో జ్యోతి, విజయకుమార్, వసుధ, సుహాసిని, సావిత్రమ్మ దిగిపొయేరు.
ట్రెయిన్ కదిలి వెళ్లిపోతుంటే స్వాతి కన్నీళ్లతో వాళ్లని కనిపించినంత దూరం చూసింది.

* * *

సారథి మద్రాసు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నాడు. నుంగంబాకంలో తెలుగువారుండే లొకాలిటీలో యిల్లు అద్దెకు తీసుకున్నాడు.
ఒక సంవత్సర కాలాన్ని గతం మింగేసింది. నానీ మరణంతో ఆ యింట్లో వుత్సాయమన్నది మచ్చుకైనా లేకుండా పోయింది.
అప్పటికి సారథి సాయంత్రమవ్వగానే యింటికి చేరతాడు. సాధ్యమైనంతవరకూ ఏ బీచ్‌కో, సినిమాకో, లేక షాపింగ్‌కో
తీసికెళ్తాడు స్వాతిని.
బీచ్‌లో ఆడే నానీ వయసు పిల్లల్ని చూసి వెక్కెక్కి ఏడుస్తుంది స్వాతి.
యూనిఫారం వేఉస్కుని స్కూల్ బాగ్ తగిలించుకుని వెళ్తూన్న పిల్లల్ని చూసి ఆమె మతి చెడగొట్టుకుంటూంది.
సారథి ఆమెని వూరడించలెక అలాగే చూస్తుంటాడు. అతని మన్సు కూడా మూగగా రోదిస్తుంటే, యింక ఆమెనే విధంగా సముదాయించాలో అర్ధం కాదతనికి.
సారథి యింట్లో వున్నంతసేపూ ఆమె కాస్త ధైర్యంగానే వుంటుంది. అతనలా బేంక్‌కి వెళ్లగానే ఆమెని ఒంటరితనమనే దయ్యం ఆవహించి భయపడిపోతుంది.
ఎటు చూసినా నానీ నిలబడి నవ్వినట్టు, పిలిచినట్లనిపించి గుండె పగిలేలా ఏడవటం..
తన ప్రాణం ఎంత గట్టింది.
శేఖర్ పోయినా బతికింది.
నానీని పోగొట్టుకుని కూడా జీవచ్చవంలా మిగిలింది.
“ఈ మనసు పెట్టే రంపపు కోతకన్నా చావే నయం” అనుకొంటుంది. చచ్చిపోవాలని ఆమె అనేకసార్లనుకొంది. కానీ.. తన కొసం ఎన్నో కష్టాల్ని భరించి నిలబడ్డ మనిషిని మోసం చేసిపోవటం ధర్మం కాదని ఆమె నిలదొక్కుకోటానికి ప్రయత్నించింది.
బ్రతుకంటే భయం… చావాలన్న కోరిక
ఈ రెంటికి మధ్య ఆమె చాలా వరకు నలిగిపోయింది.
సారథి ఆమెని చాల జాగ్రత్తగా గమనిస్తున్నాడు.
ఆమె ఆత్మహత్య ప్రయత్నాలు చేస్తుండనే భయంతో ఇంట్లో పనిమనిషిని పెట్టేడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమెను ఒంటరిగా వదలొద్దని రహస్యంగా హెచ్చరించేడు. అయితే ఆ సంగతి స్వాతికి తెలీదు.

ఇంకా వుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *