April 23, 2024

విరించినై విరచించితిని… 2 , తనికెళ్ల భరణి

రచన: ఉంగుటూరి శ్రీలక్ష్మి

 

 

 

 

నటుడైన రచయిత తనికెళ్ళ భరణి

వీధి నాటకాలలో ప్రయోగాత్మకంగా అందరినీ ఆకట్టుకుని, తన డైలాగ్స్‌తో, అందులోనూ తెలంగాణా యాసలో హీరోయిన్‌కి పూర్తి పిక్చరంతా మాటలు వ్రాసి ప్రేక్షకుల మెప్పుపొందిన తనికెళ్ల భరణిగారిని అందరికీ పరిచయం చెయ్యాలనిపించింది.
భరణి ఇంటికి వెళ్లాం. ‘సౌందర్యలహరి ‘ అని అందంగా రాసుంది. అందులోనే తెలుస్తున్నది ఆయన కవి హృదయం. గుమ్మంలోనే ఎదురయ్యారు వాళ్ల నాన్నగారు. మేము మాటల్లో వుండగానే వచ్చారు భరణి. కబుర్ల కలబోతలోనే ఇంటర్వ్యూ చేశాను.

భరణిగారూ! మీరు ఏ ఊళ్ళో పుట్టారు? మీ పూర్తి పేరు ఏమిటి? మీ తల్లిదండ్రులెవరు?

అంత స్పీడ్ అక్కరలేదండి. నాకు టైం సరిపోతుంది. స్లోమోషన్‌లోనే వెళదాం. నేను సికిందరాబాదులోనే పుట్టాను. మా నాన్నగారు టి.వి.ఎస్.ఎన్ రామలింగేశ్వరరాఉగారు. మీవారితో అప్పుడే కబుర్లలో పడిపోయారు ఆయన. మా అమ్మగారు లక్ష్మీనరసమ్మగారు. నేను బి.కాం పాసయ్యాను. థియేటర్ ఆర్ట్స్‌లో పి.జి.డిప్లొమా చేశాను. నా పూర్తి పేరు తనికెళ్ల దశ భరణి శేషప్రసాద్.

మీరు ఏ వయసు నుంచి వ్రాస్తున్నారు? మొదట ఏం రాశారు?
ఇంటర్ వరకు ఏమీ వ్రాయలేదండీ. ఇంటర్ చదివేటప్పుడు దేవరకొండ నరసింహ కుమార్ అని మంచి ఫ్రెండ్ ఉండేవాడు. నన్ను అతనే బాగా ఎంకరేజ్ చేసేవాడు. మొదటి కవిత ‘అగ్గిపుల్ల-ఆత్మహత్య ‘, ‘కొత్త కలాలు ‘ శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి ‘లో పడింది. పురాణంవారు బాగా ఎంకరేజ్ చేశారు. మా బి.కాం పూర్తయ్యాక నా ఫ్రెండ్ అకస్మాత్తుగా చనిపోయాడు. అతను నా అభివృద్ధిని చూడ లేకపోయాడే అని దిగులుగా ఉంటుంది.

నాటకాలు ఎప్పటినుండి వ్రాశారు? ఎన్ని వ్రాశారు? ఎక్కడ వేసేవారు? మీరు యాక్షన్, డైరెక్షన్ కూడా చేశారా?
బి.కాం చదివే రోజుల్లోనే రాళ్లపల్లిగారితో పరిచయం అయింది. ఆయన వ్రాసిన ‘ముగింపు లేని కథ నాటకంలో నేను 70 ఏళ్ల ముసలి వేషం, ఆయన మావగారిగా వేశాను. అది బాగా పాపులర్ అయింది. రాళ్లపల్లిగారి సంస్థ పేరు ‘శ్రీమురళీ కళానిలయం’. ఆయన మెద్రాస్ వెళ్లాక నాటకలు వ్రాసేవాళ్లు లేక, ఆ సంస్థ నిలబెట్టడం కోసం నేను వ్రాయవలసి వచ్చింది. పది నాటికలు వ్రాశాను. తల్లవజ్ఝుల సుందరం దర్శకత్వం వహించాడు. అప్పట్లో ఇవి ఆంధ్ర నాటకాల్లో ప్రయోగాత్మకంగా వుండి బాగా పాపులర్ అయినాయి. వాటిలో ‘గోగ్రహణం’ నాటకానికి సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. అది స్త్రీవాద నాటకంలా వుంటుంది. పుట్టినప్పటినుంచీ పెద్దయ్యేదాకా స్త్రీ జీవితంలోని వివిధ దశలు అందులో బాగా చూపించాను. ఆ నాటకం ఆంధ్రదేశంలోని చాలా సమాజాలు వేశాయి. మొన్న ఎగ్జిబిషన్‌లో ఒకామె నన్ను చూసి పలకరించింది. తను ఎప్పుడో కొచ్చిన్‌లో ‘గోగ్రహణం’ నాటకం వేస్తే, ప్రైజు వచ్చిందని చెప్పింది. నాకు చాలా సంతోషమయింది.
చిన్న చిన్నకథలు చాలానే వ్రాశాను. ప్రముఖ పతికలలో ప్రచురితమయి ప్రైజులు వచ్చాయి. ‘గోగ్రహణం’లోవిలన్‌గా వేశాను. నేను వ్రాసిన అన్ని నాటకాలలోనూ వేశాను. ఎక్కువగా విలన్‌గానే వేశాను.

వీధి నాటకాలు వేసేవారట కదా. వాటి గురించి చెప్పండి?
ఆకెళ్ల సత్యనారాయణ వ్రాసిన “పెద్ద బాలశిక్ష” అనే వీధి నాటకం వేశాము. అందులో విలన్‌గా వేశాను. అప్పట్లో ఔత్సాహిక నాటకాలని ‘రవీంద్రభారతి’, ‘గానసభ’ వుండేవి. నాటకం వెయ్యాలనే కళాకారులకి అద్దె కట్టుకోవడానికి డబ్బులుండేవి కావు. బెంగాల్ నాటక ప్రయోక ‘బాదల్ సర్కార్’ వల్ల ఉత్తేజితులై ప్రేక్షకులను మా దగ్గరకు రప్పించుకోవటం కాకుండా, వాళ్ల దగ్గరకు వెళ్దామని తల్లవఝుల సుందరం ఈ ప్రయోగం చేశాడు. ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో వచ్చేవారు. మా వీధినాటకాలకి మంచి ఆదరణ లభించింది. నేను వ్రాసిన ‘గోగ్రహణం, కొక్కొరొకో, గొయ్యి’ మొదలైన నాటకాలన్నింటినీ మాతోపాటుగా చాలామంది వేశారు. అన్నిటికీ తల్లావఝుల సుందరమే డైరెక్టర్. మేము నాటకాలకి వస్తున్నామంటే, మిగతా సమాజాల వాళ్లు భయపడేవాళ్లు. మా నాటకాలు సెన్సేషనల్‌గా వుండేవి. అందరూ బాగా ఆదరించారు. పరిషత్తులలో మా నాటకం ముందు వేస్తే, జనం మా నాటకం కాగానే వెళ్లిపోతారని చివరగా పెట్టేవారు. ప్రేక్షకులు మా నాటకం చూడటం కోసం ఓపిగ్గా చివరివరకూ ఆగేవారు.. కమర్షియల్‌గా నాటకాలు వేసి సక్సెస్ అయిన వాళ్లలో మేమూ ఒకళ్లం.

మీరు నాటకాలు, నాటికలు, కథలు ఎన్ని వ్రాశారు?
నాటకాలు పది, నాటికలు పది, కథలు, మినీ కథలు చాలానే వ్రాశాను.

మీ సినీరంగ ప్రవేశం ఎలా జరిగింది?
నా నాటకం ‘చల్ చల్ గుర్రం’ చూసి రామరాజు హనుమంతరావుగారు ‘కంచు కవచం’ సినిమాకి రైటర్‌గా తీసుకున్నారు. అదే నా ఫస్ట్ డైలాగ్ రైటింగ్. వంశీగారి ‘లేడీస్‌టైలర్ ‘తో నాకు రైటర్‌గా బాగా పేరొచ్చింది. యాక్టర్‌గా’శివ ‘నుంచి మంచి పేరొచ్చింది.

మీరు ఎన్ని సినిమాలకి డైలాగ్స్ వ్రాశారు? సినిమాలకి రాసినప్పుడు ఎలా ఫీలయ్యారు? నాటకాలు రాసేటప్పుడు ఎలా ఫీలయ్యారు?
అరవైదాకా సినిమాలకి డైలాగ్స్ వ్రాశాను. నాటకం వ్రాసినప్పుడే నేను చాలా హ్యాపీగా ఫీలయ్యాను. సినిమాలకి వ్రాసినప్పుడు వాళ్ళు హాపీగా ఫీలయ్యారు.

మీ డైలాగ్స్‌లో తెలంగాణా యాస ఎలా వచ్చింది?
నేను ఇక్కడే పుట్టి, పెరగటం వల్ల తెలంగాణా యాస బాగా వచ్చింది. పిక్చర్స్‌లో తెలంగాణా యాస పాపులర్ చేయగలిగాను.’మొండి
మొగుడు- పెంకి పెళ్లాం’ చిత్రంలో హీరోయిన్‌కి పూర్తిగా తెలంగాణా భాషలోనే డైలాగ్స్ వ్రాశాను. చాలా బాగా ‘క్లిక్’ అయింది. హాస్యానికి మాత్రమే పరిచయమైన తెలంగాణా భాషకు కావ్య గౌరవం కలిగించిన అదృష్టం నాకు పట్టింది.

డైలాగ్ రైటర్‌గా మీకు మంచి పేరు వుంది. ఇప్పుడు ఎందుకు వ్రాయటం లేదు?
‘యమలీల’, ‘ఆమె’ తరువాత ఆర్టిస్ట్‌గా చాలా బిజీ అయ్యాను. వ్రాసే టైం లేదు. అదీకాక ఆర్థికంగా నటించడం లాభం. రైటర్‌గా నాకు తృప్తి. రోజుకి పాతికదాకా సీన్లు రాయగలను. జనం నా నుంచి యాక్షన్ కోరుకుంటున్నారు. అందుకే నాకూ రాయాలనిపించటం లేదు. ఎప్ప్పుడైనా వ్రాసినా ‘శ్రీరమణ’లా (బంగారు మురుగు, మిథునం) దశాబ్దానికి ఒకటి వ్రాసినా చాలు.

మీరు ఎన్ని చిత్రాలు చేశారు? ఎన్ని చేస్తున్నారు?
రెండువందల సినిమాలకు పైనే సుమారుగా యాక్ట్ చేశాను. ఇప్పుడు చేస్తున్నవి పదిహేను, ఇరవై పిక్చర్లపైనే వున్నాయి.

మీ యాక్టింగ్ విలన్‌గానే ప్రారంభించారా?
ఫస్ట్ కామెడీ యాక్టర్‌గానే చేశాను. తరువాత విలన్‌గా చాలా సినిమాలే చేశాను.

సాఫ్ట్ రోల్స్ ఎన్ని పిక్చర్స్ చేశారు?
సాఫ్ట్ రోల్స్ చాలా చేశాను. ‘సొగసు చూడ తరమా’, ‘ఎగిరే పావురమా’, ‘మావి చిగురు’, ‘పరదేశి ‘మొదలైనవి చాల ఉదాత్తమైన పాత్రలు.

మీకు ఏ రకమైన పాత్రలు ఇష్టం?
కామెడీ విలన్, లేదా విలన్‌గా చెయ్యటమే ఇష్టం. అందులో వైవిధ్యం ఉంటుంది. ప్రతీ పిక్చర్‌లోనూ మేనరిజం, భాష, గెటప్ అన్నింట్లోనూ వైవిధ్యం చూపించవచ్చును.

డైలాగ్ రైటింగ్, నటనలో మీకు ఏది బాగా నచ్చుతుంది. ఎందువల్ల?
నటన అయితే పదిరోజుల్లో అయిపోతుంది. రచన రెండు నుంచి మూడు నెలలు పడుతుంది. అందుకే ఫస్ట్ నటుడినీ, తరువాత రచయితనీ .. రెండింటినీ ఇష్టపడతాను.

మీరు ఏ సినిమాకైనా పాటలు పాడారా?
పాడలేదు. ఈ విషయంలో ప్రేక్షకులు అదృష్టవంతులు. నేను సంగీతపరంగా మంచి శ్రోతని.

మీరే డైలాగ్స్ వ్రాసి నటించిన చిత్రాలు ఏవి?
‘కనకమహాలక్ష్మి డ్యాన్స్ ట్రూప్’,’లేడీస్ టైలర్’, ‘వారసుడొచ్చేడు’,’శివ”పేకాట పాపారావు’,’వన్ బై టూ’, ‘కుర్రాళ్ల రాజ్యం’,

డైలాగ్స్, యాక్టింగ్ రెండూ చెయ్యాలంటే ఎలా ఫీలయ్యరు? వేరేవాళ్లు డైలాగ్స్ వ్రాసి మీరు యాక్ట్ చేస్తే ఎలా ఫీలయ్యారు?
నేనే డైలాగ్స్ వ్రాసి యాక్ట్ చేస్తే, నాకు తక్కువ డైలాగ్స్ వ్రాసుకుంటాను. ఎందుకంటే తనే రైటర్ కాబట్టి తనకే ఎక్కువ డైలాగ్స్ వ్రాసుకున్నాను అనుకోకుండా, వేరే వాళ్లు వ్రాసినదాంట్లో నేను యాక్ట్ చెయ్యడమంటే మూడు బ్రెయిన్లు కలుస్తాయి. దర్శకుడు, రచయిత, నేను. అందుకని అదే నాకు సుఖంగా వుంటుంది.

యాక్టర్‌గా మీకు నచ్చిన పాత్ర?
నేను వ్రాసి యాక్ట్ చెసినవి ‘శివ&’, ‘లేడీస్ టైలర్’ మొదలైనవి. బయటివాళ్లు వ్రాసిన వాటిలో ‘కాలేజీ బుల్లోడు’ లో శాడిస్టు పాత్ర, ‘మాతృదేవోభవ ‘లో విలన్, ‘ఆమె’లో హీరోయిన్ బావ బాగా నచ్చిన పాత్రలు.

యాక్టర్‌గానే కొనసాగుతారా? లేక మీలోని రైటర్‌కు ఆహ్వానం పలుకుతారా?
సినిమాకి సంబంధించి యాక్టర్‌గానే ఉంటాను. ఆత్మసంతృప్తి కోసం నాటకాలు వ్రాసుకుంటాను.

మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏమిటి?
ఇప్పుడున్న పొజిషన్ నేను ప్లాన్ చేసింది కాదు. ఇక ముందు కూడా చెయ్యను. అనెక్స్‌పెక్టేడ్‌గా కష్టానికీ, సుఖానికీ థ్రిల్ అవటం జీవనఫలాన్ని అన్ని రుచులతో ఆస్వాదించటం నాకిష్టం.

మీ శ్రీమతిగారి సహకారం ఎంత? ఆమెకి మీలోని రైటర్ ఇష్టమా! యాక్టర్ ఇష్టమా? మీరంటే ఇష్టం అనకండి.
మీరు అనవద్దు అన్నా అదే నిజం. మా ఆవిడకి నాలో రైటర్, యాక్టర్‌ల కంటే నేనంటేనే చాలా ఇష్టం. ఇంటి బాధ్యతలన్నీ తనే చూసుకుంటుంది. అందుకే నా కార్యక్రమాలన్నీ చక్కగా చూసుకోగలుగుతున్నాను. ఖాళీ చిక్కినప్పుడల్లా మా ఆవిడని రెస్ట్ తీసుకోమని చక్కగా వంట చెయ్యటం నా హాబీ.

మీకు పిల్లలు ఎందరు? వాళ్ల పేర్లు..
నాకు ఇద్దరు బాబులు. ఒకడు నన్ను కన్న బాబు. ఒకడు నేను కన్న బాబు. నాకు ఒక బాబు, ఒక పాప. బాబు మహాతేజ. సౌందర్యలహరి పాప పేరూ, మా ఇంటికి పెట్టిన పేరూ ఒకటే. మా శ్రీమతి పేరు దుర్గాభవాని.

పాత సినిమాలకీ, కొత్త సినిమాలకీ తేడా ఏమిటి?
పాత సినిమాలు పూతరేకుల్లాంటివి. కొత్త సినిమాలు హాట్ కేకుల్లాంటివి.

చివరగా ‘రచన’ మీద మీ అభిప్రాయం?
సాహితీ విలువల్లో అప్పట్లో ‘భారతి’తో పోల్చదగ్గది ‘రచన’. దురదృష్టం ఏమిటంటే అప్పుడూ, ఇప్పుడూ కూడా సాహిత్యంతో పరిచయం ఉన్నవాళ్లే చదువుతున్నారు. పత్రిక కొని హాయిగా చదివేవాళ్ల చాలా తక్కువ. ఏ ‘ఫాస్ట్ ఫుడ్ సెంటర్’ అన్నా పెట్టుకుంటే నాలుగు రాళ్లొచ్చేవి. మరి ఈ ‘రచన ‘కి ఏం వస్తుందో అనుకుంటూ వుంటాను. నా మటుకు ‘రచన’ అంటే ఎంతో గౌరవం. ఒక సాహితీ విలువలున్న పత్రికని తీసుకురావటం ఎన్ని కష్టాలన్నా పడి కన్నతల్లికి అన్నం పెట్టినట్లు, నేను ఎప్పుడూ ‘రచన ‘ కొనే చదువుతాను. కొనేటప్పుడూ, చదివేటప్పుడూ, ఎవరికైనా కొనమని చెప్పేటప్పుడూ కూడా గర్వపడతాను.

సమాప్తం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *