February 27, 2024

అలసిపోతున్న ఆనందం

రచన: విజయలక్ష్మి

మూడు జనరేషన్స్ ను చూస్తున్న ఎనబై పదులు వయసులో మా చిన్నతనం, మా పెద్దవాళ్ళను, మా సంతానం ప్రస్తుత వారి పిల్లల జీవనశైలి గుర్తుచేసుకోవా లని పిస్తుంది. మేము ఆరుగురం, ఐదుమంది ఆడపిల్లలo. మాకు ఒక అన్న. ఊరు , ఉమ్మడి కుటుంబ వ్యవస్థకు దూరం కాకుండానే కొంత మార్పుతో హైదరాబాదులో ఉంటున్నాo కనుక, చదువులకని మా చిన్నాన్న పెద్దమ్మల పిల్లలు, మరొకిద్దరు మగపిల్లలుండేవారు. కాగా ఆడపిల్లలందరికి పొడవాటి వెంట్రుకలుండేవి. ఆ రోజుల్లో క్రాఫ్ లు అంతగా లేవు. జడలు వేసి రిబ్బన్లతో కట్టేది అమ్మ. ఉదయాన్నే టిఫిన్ తిని పాలు తాగి అప్పట్లో ఇంట్లో చేసేవి తప్ప కెలాగ్స్ లాటివి తెలియవు. ఆ కార్యక్రమంతో పాటు లంచ్ బాక్సులు సిద్ధం చేసి స్కూళ్ళకు పంపేది. మేం లేచేసరికి అమ్మ స్నానాధికాలు, పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకొని మరీ మాకన్నీ సిద్ధం చేసేది. మధ్య మధ్య నాన్నకు ఆయన కొరకు వచ్చే వాళ్ళ కొరకు కాఫీ, టీ లు వగైరా అందిస్తుండేది, ఆ కాలంలో రైతు కుటుంబాల్లో మగవాళ్ళు వ్యవసాయం బయట వ్యవహారాలూ తప్ప ఇంటి విషయాలు కానీ, పిల్లల చదువుల గురించి గానీ పెద్దగా పట్టించుకొనేవాళ్ళు కాదు. ఎవరైన కొత్తగా అతిధులు వచ్చినప్పుడు మేమేమీ చదువుతున్నామో వాళ్ళు మా నాన్నను అడిగినపుడు మమ్మల్నే అడిగి చెప్పేవారు ఆయన.
తగవులు, అలుగులు, గొడవపడుతూ పిల్లల్లో సహజంగా అన్ని రకాల వాళ్లం ఉండేవాళ్ళం. అయినా మా పెద్దవాళ్ళ నుండి మా ఒంటిపై ఒక్క దెబ్బ పడి ఎరుగము. కనీసం విసుగులు, కసుర్లు లాంటివి కూడా మాకు తెలియదు సంతానం కూడ ఒక భాగ్యంగా భావించే రోజులవి. వెలితి లేని ప్రేమ మాకందరికి దొరికింది. పండగయినా ప్రయాణమయినా ఆనందమైన జ్ఞాపకాలుగ మిగుల్చు కున్నాము సాయంత్రం స్కూళ్ళ నుండి రాగానే చిరుతిండ్ల (బొరుగుముద్దలు, సున్నుoడలు, నువ్వుముద్దలు, ఉప్ప చెక్కలు, కారప్పూస,మణుగుబులు) ఇవెప్పుడు ఇంట్లో ఉండేవి తినేసి కాసేపు ఆడుకుని స్నానాలు చేసేవాళ్ళము. సంధ్య దీపం పెట్టగానే, ఆరున్నర ఏడు గంటలలోపు ఆరు బయట తులసి కోట అరుగు పై అందరం కూర్చుంటే అమ్మ వేడి వేడి అన్నంలో కమ్మని నెయ్యి వేసి పచ్చడి మొదలు రసం వరకు పెద్ద పిల్లలకు కంచాల్లో, చిన్నవాళ్ళకు ముద్దలు కలిపి పెడుతూ ఎన్నో విలువలతో కూడిన కధలు, మాటలు చెప్పేది. రాత్రి పూట పెరుగు, మజ్జిగ నిషిద్ధం. ఉదయం వంట వేరు, రాత్రి వంట వేరు మెనూ మారి పోయేది. భోజన కార్యక్రమం పూర్తికాగానే ఆ రోజు హోంవర్కులు, చదువులు పూర్తి చేసుకుని అందరం తలొక గ్లాసు పాలు తాగి పడకల మీదికి చేరి ఏవో మాట్లాడు కుంటూ తొమ్మిదిన్నర కల్లా నిద్రపోయేవాళ్ళం. నాన్న భోజనం కాగానే అమ్మ ఆ పై పని వాళ్ళ భోజనాలు పూర్తయి ప్రొద్దునకు వంటిల్లు సిద్ధం చేసుకుని పడుకునే వాళ్ళు.
ఇక పెద్ద పండగ (సంక్రాంతి) వేసవి సెలవులకు తప్పక ఊరికి చేరేవాళ్ళం. మా వూరు నెల్లూరు జిల్లా అల్లూరు. అమ్మమ్మగారి వూరు కూడా అక్కడికి దగ్గరలో ఇందుపూరు. ఎనిమిది మంది పిల్లలం. మూడు నాలుగు ట్రంకు పెట్టెలు (సూట్ కేసుల పరిచయం కాలేదు) చిన్న చితక సంచులు ప్లాట్ ఫాo నిండిపోయేది. హైదరాబాదు నుండి అర్ధరాత్రి ఖాజీపేట చేరిన రైలు నుండి నిద్రకళ్ళతో పట్టాలపై ఆగి వున్న రైళ్ళ క్రింద దూరి అవతలి ప్లాట్ ఫారం ఎక్కేవాళ్ళం. ఇప్పుడు తలచు కుంటే ఆయుష్యుండాలే గాని బ్రతుకు భరోసాకేమీ ఢోకా లేదని పిస్తుంది. అక్కడ మళ్ళీ రైలు ఎక్కితే తెల్లవారు ఝామున తలమంచి స్టేషను చేరగానే, అక్కడ మా కొరకు గుర్రపు బండ్లు వచ్చి ఉండేవి. అందులో మళ్ళీ రెండు మూడు గంటల ప్రయాణంతో ఊరు చేరేవాళ్ళము. ఇంత ప్రయాణము బడలిక కూడ తెలియకుండ పిల్లలం ఎంజాయ్ చేసేవాళ్ళము. క్రమంగా మాకందరికి పెళ్ళిళ్ళయి తలోక చోట ఉన్నాము. నలుగురు, ముగ్గురు మా సంతానం. మా పిల్లలకు ఇద్దరు, ఒక్కరు అయినా ఆరుగురిని, నలుగురిని పెంచినదానికన్నా అలసిపోతున్నారు. వంతులు, వాదులతో సతమతమవుతూ, కంఫర్ట్ అనే ఉచ్చులో కంఫర్టబుల్ జీవితం బిగుసుకుపోతున్నది. తల్లిదండ్రుల పరుగులు పిల్లలతో గడిపేoదుకు సమయం దొరకని వెలితిని, అనవసరమైన స్వేచ్ఛను, అవసరంలేని వసతులను వారికి అందిస్తూ వారిని మరో ప్రపంచం వైపుకు నడిపిస్తున్నారు. పోటీ జీవితానికి పందెపు కోళ్ళను సాకినట్లు పిల్లలు పెరుగుతున్నారు. శరీర వ్యాయామానికి కొరత లేకుండ నిద్రలేచింది మొదలు, రాత్రి పడుకునేవరకు ఇంట్లో ప్రతి ఒక్కరి అవసరాలు గమనిస్తూ అనవసరమయిన ఆలోచనలులేని ఆరోగ్యకరమైన జీవితం గడిపాము. ఉమ్మడి కుటుంబాలు, అత్త, ఆడపడుచుల పెత్తనం, తోటి కోడళ్ళ పొరపొచ్చాలు. ఇరుగు పొరుగు పలకరింపులు, బంధుజనం రాకపోకలు ఇన్నింటి మద్య ఎవరి విలువలు వారి కండేవి. అందరి మధ్య నా వాళ్ళు అనే భావం చెప్పలేని అనుబంధం ఉండేది కొంత మెరుగైన సౌకర్యాలతో మా పిల్లల వరకు ఇంచుమించు ఇలాగే గడిచింది. పల్లెటూర్లు పండగల సరదాల రుచి చూశారు కానీ వాళ్ళ పిల్లలకు ఆ భాగ్యం దక్కలేదు. చదువులు, ఉద్యోగవేటలతో టౌన్లు, పట్టణాలు నిండిపోతున్నాయి . సహజ సౌందర్యానికి దూరమయి ఊర్లు మూగ బోయాయి. కృత్రిమ సొగసులతో పట్టణాలు పగలు రాత్రికి తేడా లేకుండా వెలిగి పోతూ, మనిషి మనుగడనే అయోమయంలో పడేశాయి. పీల్చేగాలి తినే తిండి, తాగే నీరు అంతటా కాలుష్యం ఆలోచనలు మారాయి, అవసరాలు పెరిగాయి. బఫేకు, బంతి భోజనానికున్నంత తేడా బొన్సాయి జీవితం ఎదుర్కొంటున్నది. కడుపు నిండదు, కోరిక తీరదు, పెరిగిన వసతులు ఉప్పనీటి సముద్రాలయి దాహం తీర్చవు . అలుపు ఎరుగని ఆనందం అప్పుడు అనుభవించాము ఆనందమే అలసిపోతున్నదిప్పుడు అనుకుంటూ సుదీర్ఘమైన నిట్టూర్పుతో ప్రస్తుతంలో నిలిచాను.

1 thought on “అలసిపోతున్న ఆనందం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *