April 23, 2024

గోపమ్మ కథ – 6

రచన: గిరిజారాణి కలవల

 

నేను చెప్పినదేదీ పట్టించుకోకుండానే గోపమ్మ … తిరనాల అయిన పదిరోజులకే లక్ష్మి,  కోటిలకి లగ్గాలు పెట్టించేసింది.  ముందు నిశ్చయ తాంబూలాలకి వాళ్ళ భాషలో పప్పన్నాలు పెట్టుకోవడం.  అలా ఓ మంచి రోజు చూసుకుని,  రెండు కుటుంబాలతో పాటు బంధువులందరూ కలిసి  పెళ్ళి నిశ్చయం చేసుకున్నారు.  అదే పప్పన్నాలు పెట్టుకున్నారు.  పేరుకే పప్పన్నాలు… ఆరోజు కోడి పలావులు,  కల్లు ముంతలు ధారాళంగా కొనసాగాయని చెప్పింది గోపమ్మ.

“ఎందుకు అలా అనవసరపు ఖర్చు గోపమ్మా? అదే డబ్బు రేపు వాళ్ళ కొత్త సంసారానికి పనికొస్తుంది కదా!”అన్నాను.

“మా ఇళ్ళల్లో ఇలా తప్పదమ్మా! ఇదేముంది? రేపు పెళ్ళికి చూడండి. ఇంతకు రెట్టింపు పెట్టాలి.  అప్పు చేసైనా సరే ఇలా అందరికీ మందు పోయించాల్సిందే.  లేకపోతే ఊరుకోరు.  కులపోళ్ళతో మాట పడాల్సి వస్తుంది.” అంది.

ఆ మాట ప్రకారమే అప్పు చేసి మరీ,  ధూంధాం గా లక్ష్మిపెళ్ళి చేసింది గోపమ్మ.  పేరుకే ఇంటి యజమాని అంజి.  డబ్బు ఖర్చు, అప్పులు తర్వాత రెక్కలు ముక్కలు చేసుకుని తీర్చడం మొత్తం బాధ్యత అంతా గోపమ్మదే.  షావుకారు దగ్గర నూటికి ఐదు రూపాయల చొప్పున అప్పు తీసుకుని,  పెంచుకున్న కూతురుకి పెళ్లి చేసి అత్తగారింటికి పంపింది గోపమ్మ.

నా వంతు సహాయంగా గోపమ్మకి ఐదువేలు ఇచ్చి,  లక్ష్మికి చెవులకి బంగారు దుద్దులు బహుమతిగా ఇచ్చాను.  పెళ్ళి అయిపోయాక… పెళ్ళికొడుకు,  పెళ్ళి కూతురుని తీసుకుని మా ఇంటికి తీసుకు వచ్చింది.  మా ఊళ్ళో,  వాళ్ళ ఇళ్ళల్లో మేము భోజనాలు చేయమని,  మాకు స్వయంపాకాలు తేవడం ఒక ఆనవాయితీ.  అలాగే,  ఆ రోజు బియ్యం,  కంది పప్పు,  చింతపండు,  సగ్గుబియ్యం,  పంచదార,  రెండు రకాల కూరలు,  పళ్ళు తీసుకుని వచ్చింది గోపమ్మ.

“ఇవన్నీ ఎందుకు గోపమ్మా?” అన్నాను.

“మీరు చేసే సాయం ముందు ఇదెంతమ్మా? వీళ్ళని దీవించండమ్మా!” అంటూ… “అమ్మగారి కాళ్ళకి మొక్కండి” అని కోటికి,  లక్ష్మికి చెప్పింది.

వాళ్ళిద్దరూ వంగి నా పాదాలకి నమస్కరించారు.  ఇద్దరికీ కొత్త బట్టలు పెట్టి, వాళ్ళ నెత్తిన అక్షతలు వేసి ఆశీర్వదించాను.

మళ్లీ గోపమ్మకి ఈ కొత్త అప్పులు తీర్చడం కోసం కొత్త చాకిరీలు తప్పనిసరైంది.  వీళ్ళని మనం ఏమో అనుకుంటాం కానీ, పూర్తి నిజాయతీకి గోపమ్మలాంటి వారే నిదర్శనం అనిపిస్తుంది.  చేసిన అప్పులని వడ్డీ పైసలతో సహా తీర్చేదాకా నిద్రపోదు.  మనం అనుకునే గొప్ప గొప్పవారు,  సంఘంలో బడాబాబులు బేంకులలో కోట్లకి కోట్లు అప్పులు ఎగ్గొట్టి,  హాయిగా చలామణీ అయిపోతూనే వుంటారు.  ఇలా గోపమ్మ వంటి వారిని చూసి వాళ్లు కొంతైనా బుద్ధి తెచ్చుకుంటే బావుంటుంది అనిపించింది.

మా ఇంట్లోనూ,  మరో రెండు ఇళ్ళల్లో పని చేసాక తర్వాత,  సమయంలో ఒక స్కూలులో ఆయాగా పని కుదురుకుంది.

ఉదయమే ఇళ్ళల్లో పనులు గబగబా ముగించుకుని ఆ స్కూలుకి పరుగుతీసేది.  పదవేలు జీతం అనేసరికి,  రోజంతా చేయడం కొంచెం కష్టమైనా తప్పదు కదా అని ఒప్పుకుంది.  అలా వచ్చిన జీతం, చీటీపాటలు కట్టి కొంత సొమ్ము కూడగానే,  లక్ష్మి పెళ్లి కి చేసిన అప్పులు తీర్చేసింది.

హమ్మయ్య,  అనుకునేలోగానే,  గోపమ్మ రెండో కొడుకు దుర్గారావుకి జబ్బు చేసింది.  పదిహేనేళ్ల కుర్రాడు ఎప్పుడూ ఈసురోమంటూ వుండేవాడు.  పాపం చాలా డాక్టర్లు చుట్టూ తిరిగింది.  ఏదో లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చింది.  గుండెలో నెమ్ము చేరిందటమ్మా! మంచి ఆహారం పెట్టాలట అంటూ జీతంలో ఎక్కువ భాగం వాడి తిండికి,  మందులకూ,  హాస్పిటల్ కీ పోసింది.  అయినా ప్రయోజనం లేకపోయింది.  వాడికి ఆయుష్షు కొన్ని రోజులే ఇచ్చాడు దేవుడు.  పురిట్లోనే ఒక కొడుకునీ,  పెరిగాక మరో కొడుకునీ పోగొట్టుకుంది గోపమ్మ.  పెద్ద కొడుకు రమేషు,  వాడి పిల్లల ఆలనా పాలనలో కొంత తేరుకుంది.  ఇటు లక్ష్మ కి కూడా, వెంట వెంటనే ముగ్గురు పిల్లలు ఏడాది కొకరు చొప్పున పుట్టారు.

ఈ విషయంలో మాత్రం గోపమ్మనీ,  లక్ష్మిని బాగా అరిచాను.  చిన్న వయసులోనే పెళ్లి చేయడం ఒక తప్పైతే,  మళ్లీ ఇలా ముగ్గురు పిల్లలని కనడం,  పెంచడం మాటలనుకుంటున్నారా? అని గట్టిగా మందలించాను.  కానీ ఎంత చెప్పినా కొన్ని విషయాలలో వాళ్ళంతటి మూర్ఖులు మరొకరు ఉండరు అనిపించింది.  ‘ముందు రెండు కాన్పులలోనూ ఆడపిల్లలే కదమ్మా! మగపిల్లోడు ఉండాలి కదా!’ అంటూ సమర్ధించుకుంది.

ఇటువంటి వారిని జన్మలో బాగుచేయలేము అనిపించింది నాకు.  ‘మగపిల్లాడు పుడితే వాడేమైనా ఉద్ధరించేవాడా? మరో తాగుబోతు పుట్టినట్లేగా? అంటే సమాధానం మాత్రం చెప్పేది కాదు.

 

సశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *