May 26, 2024

ప్లీజ్ మైండ్ యువర్ బిజినెస్

రచన: శైలజ రాంషా

Awkward : ఇబ్బందికరమైన, వికారమైన, వికృతమైన, చేతకాని – డిక్షనరీ అర్ధం.

మనందరం ఎన్నో ఆక్వర్డ్ సిట్యుయేషన్స్ ఎదుర్కొంటుంటాం మన జీవితంలో. పని చేసే చోట, మనం ఉండే చోట! వీటిని ఎంత బాగా ఎదుర్కోగలిగితే అంత త్వరగా ఆ పరిస్థితిలో నుండి బయటపడతాము.
రెండు రోజుల క్రితం, సార్థక్ ఫోన్, తను చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకొంటూ సోఫాలు డస్టింగ్ చేస్తూ ఆలోచిస్తూంది లత. ఇంతలో, ద్వారం దగ్గర ఎవరో వెలుగుకి అడ్డంగా. . వెనక్కి తిరిగి చూస్తే, “లత గారు! పాపం మీ అబ్బాయి ఎవరో అమ్మాయిని పెళ్లి చేసుకొన్నాడట కదా!” ఆరో ఫ్లోర్ లో ఉండే ఆంటీ వచ్చి అడుగుతుంది.
మేము ఈ అపార్ట్మెంట్ లోకి వచ్చి ఓ ఎనిమిది నెలలు అవుతుంది. ఎవరితోటీ అంతగా పరిచయాలు ఏర్పడలేదు, మా ఫ్లోర్ లో తప్ప. ఇంతలో మా అబ్బాయి సార్థక్ తన చిన్నప్పటి ఫ్రెండ్ సాంత్వనకి బలవంతంగా పెళ్లి చేస్తున్నారని తెలిసి ఆర్య సమాజంలో పెళ్లి చేసుకొన్నాడు. ఇద్దరూ మేజర్లు అవడం వలన, చట్టపరంగా ఎలాంటి ఇష్యూ రాలేదు. సార్థక్ ఇంకా ఎం. టెక్ చదువు తున్నాడు. భార్యని పోషించుకోగలనో లేదో అన్న ఆలోచన రాలేదేమో? సాంత్వనని పెళ్లి చేసుకొనే ఉద్దేశ్యం ఉన్నట్టు కూడా ఎప్పుడూ ఇంట్లో చెప్పలేదు. ఇంట్లో ఇంకొక ఎదుగుతూన్న పిల్ల ఉంది. తల్లితండ్రులుగా మేమింకా ఈ నిజాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం.
అప్పుడే అపార్ట్మెంట్ లో దండోరా అయిపోయిందని తెలుస్తుంది ఈ ఆంటీ వచ్చి అడుగుతుంటే ఒక నిట్టూర్పు విడిచి, కూర్చోండి అని ఆహ్వానం పలికాను. “మరేమీ లేదు, సార్థక్ పెళ్లి చేసుకొన్నాడని విన్నాం” అనగానే నవ్వి “నిజమే” అన్నాను.
“అంటే మీకు ముందుగానే తెలుసా? ఇలా చేస్తాడని?” దీర్ఘం తీసింది ఆంటీ.
“తెలియదండీ!” అన్నాను.
“అయ్యో!” అట్లానా?” “మీకు బాగా కష్టం అనిపించుంటుంది. చెప్పకుండ చేసుకొన్నాడు కదా!”
ఇంక లాభం లేదు, “లతా! ఏదో ఒక జవాబు చెప్పు” అని అంతరంగం చెబుతుంది.
చిన్నగా నవ్వి, “ఏం చేస్తామండీ, అయిపొయింది కదా! మీరు మీ గురించి చెప్పండి. మీవారు, మీ పిల్లలు?” అంటూ ప్రశ్నర్థకంగా చూసింది.
ఆవిడకి కావాల్సిన ఎక్స్ప్రెషన్ కనిపించకపోగానే, సోఫాలో ఇబ్బందిగా కదిలింది. వెంటనే సర్దుకొని, “ఇద్దరు అబ్బాయిలండీ, మావారు రైల్వేస్ లో చేస్తున్నారు. ” అని ఆగింది.
“మరి మీరు?” అని అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్న లత అడగగానే, కొంచెం మొహం మాడింది.
“ప్రైవేట్ స్కూల్ లో టీచర్ గా చేశానండీ” అని ఆగింది.
“ఓ! నిజమా? బి. ఎడ్ చేశారన్నమాట. వెరీ గుడ్. టీచర్లు చాలా అవసరం అండీ, పిల్లలకి విద్య కాక ఇంకా ఎన్నో నేర్పించాలి”
“లేదండి, ఏదో మామూలు స్కూల్ అన్ ట్రైన్డ్ టీచర్ గానే చేసాను”
“ఓ! అలాగా అండీ, టీచర్లు బాగా పెరగాలండి. పిల్లలకు చదువుతో పాటు, అనేక విషయాలు నేర్పించాల్సి ఉంటుంది. విస్తృతమైన పరిజ్ఞానం అవసరం. టీచర్లు కూడా నిరంతరం జ్ఞానం సముపార్జించుకోవలసి ఉంటుంది. బాగా చదువుకొన్నవాళ్ళు, డాలర్ మోజులో సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు సంపాదించుకొంటున్నారు” అని ఆగేటప్పటికి ఆంటీగారి మొహంలోకి ఇంకాస్త అసహనం చేరింది.
“నేను మళ్ళీ వస్తానండీ” అని వెళ్ళిపోయింది.
హమ్మయ్య! అనుకొని, వంటింట్లోకి వెళదామని లేచాను.
ఇంతలో పక్క ఫ్లాట్ నుండి, రాధ వచ్చింది. ఏమైందాంటీ? ఆరో ఫ్లోర్ ఆవిడ వచ్చారు? మిమ్మల్నేమీ ఇబ్బంది పెట్టలేదు కదా? అని.
“లేదులే రాధా! మీ ఇద్దరూ సాయంకాలం పార్టీకి తయారు అవుతున్నారు కదా! అని అడిగాను.
“ఎస్ ఆంటీ!” అంది రాధ.
“పిల్లలు వచ్చేసారా? వాళ్ళని కూడా తీసుకురండి. అండ్ నో గిఫ్ట్స్ ప్లీజ్!” అనగానే రాధ నవ్వుతూ “సరే ఆంటీ!” అని బౌ చేసింది.
రాధ, కృష్ణ మా పక్కింట్లో ఉండే దంపతులు, ఇద్దరు చిన్న పిల్లలు. స్కూల్ గోవర్స్. పిల్లలని చక్కగా నీట్ గా డిస్సిప్లైన్డ్ గా పెంచుతారు. సంతోషంగా ఉంటారు, ఆనందాన్ని పంచుతారు. ఎవరి విషయాలలోకి అనవసరంగా తల దూర్చరు.
మా ఇంట్లో సార్థక్ పెళ్లి రిసెప్షన్ కి సాంత్వన పేరెంట్స్ కూడా రావడం, అంతా ఈజీగానే సార్ట్ అవుట్ అయిపొయింది.
మళ్ళీ ఒక రోజు వాకింగ్ లో ఆరో ఫ్లోర్ ఆంటీ కలిసింది. సోది మొదలైంది.
“హిహి, మీ కోడలు వచ్చిందా?”
“హా! వచ్చిందండి” అనగానే, మొహం మాడిపోయింది.
“మీరు ఎవరికీ మీ కోడలిని పరిచయం చేయలేదే? గట్ల ఇంట్లోనే దాపెట్టుకుంటరా?” అని అడిగింది.
“అలా ఏమీ లేదే? చదువుకొనే అమ్మాయి కదా, కాలేజీకి వెళుతూనే ఉంది, మీరు చూసే ఉంటారు కదా?” అని అడిగాను. ”
“చూసినా, మీరు పార్టీ ఏదైనా ఇస్తారేమో అని”.
“మాకు తెలిసిన కొంతమందిని అపార్ట్మెంట్ లో వాళ్ళని పిలిచామండి. పార్టీ అయిపొయింది” అని నవ్వాను.
“అవునా! ఈ అపార్టుమెంట్లో, ఏ ఫంక్షన్ అయినా. నన్ను పిలుస్తారు. పెద్దదాన్నని. నాకు చాలా respect ఇస్తారు”
“అవునా అండి? నాకు తెలియదు. ” అన్నాను.
ఇంకేమీ చేయలేక, వెళ్ళిపోయింది.
సార్థక్ పెళ్లి రిసెప్షన్ తరువాత, రాధ చెప్పిన మాటలు గుర్తు వచ్చాయి నాకు. అందరి ఇళ్ళకి పిలవకుండా వెళ్లిపోవడం, గోడల దగ్గర నిలబడి అందరి ఇళ్లల్లో ఏం జరుగుతుందో వినడం, ఇవే పనులు. ఎదురింట్లో డ్రిల్, పక్కింట్లో మామిడికాయలు కొట్టే కత్తి, సుత్తి, మేకు, ఉల్లిపాయలు, ఫ్రీజర్ లో బఠాణీలు, ధనియాల పొడి, కాదేది అప్పుకి అనర్హం అని వచ్చేస్తుంది.
అంతెందుకు, కాలో, చెయ్యో నొప్పి వస్తే హాట్ ప్యాక్ కూడా రెండో ఫ్లోర్ లో ఉండే రాజీ వాళ్లదే. “హి హి, మీ దగ్గర ఉందని నాకు గుర్తు, కొంచెం వాచ్మెన్ తో పంపిస్తారా?” అని ఫోన్ చేసి అడుగుతుందట.
ఏ క్షణం ఎవరింటింకి ఎప్పుడు వెళ్లి తలుపు తడుతుందో తెలీదు. ఆల్మోస్ట్ అపార్ట్మెంట్స్ లో అందరికీ చిరాకు, విసుగు. ఇంక ఏదో వయస్సులో పెద్దది కదా అని చూసీ చూడనట్లు ఊరుకుంటారు. కొంతమందిని టార్గెట్ చేసి మరీ మాట్లాడుతుంది. ఇంట్లో ఏదో పూజ అని పిలవడం, పూరీలు చేయడానికి ఎదురింట్లో వాళ్ళని, పక్కింట్లో వాళ్ళని పిలవడం.
బ్లాక్ లో అవతలి వైపు ఉండే కుటుంబంలో అమ్మాయి ఇంజనీరింగ్ అవ్వగానే, ఇంటర్నేషనల్ స్కూల్ లో మాథ్స్ టీచర్ గా చేరింది. ఓ సంవత్సరం ఉద్యోగం చేస్తూ. . పై చదువులకి చదవాలని. అర్ధం చేసుకొన్న వాళ్ళందరూ మెచ్చుకొన్నారు. ఆరో ఫ్లోర్ ఆంటీ మాత్రం “ఆఁ, ఎక్కడా ఉద్యోగం వచ్చి ఉండదు. మా పిల్లగాడికైతే, క్యాంపస్ లోనే ఉద్యోగం వచ్చేసింది” అన్నదట. ఇవన్నీ విని వాళ్ళ ఆలోచనా పరిధి అంతే. అనుకొని నిట్టూర్చింది లత.
ఎదుటి వాళ్ళ జీవితంలోకి తొంగి చూడడం ఈవిడకి అలవాటని తెలుస్తుంది. ఇలాంటి వాళ్ళు ఇంటా బయటా రాజ్యం ఏలాలని అనుకొంటారు. భర్త, పిల్లలు, బంధువులు, పనిమనిషి, రోజూ దండం పెట్టుకొనే దేవుడు, వాకిట్లో తులసమ్మ, తూర్పున ఉదయించే సూర్యుడు తన మాటే వినాలన్నట్టు ఉంటారు.
వాళ్ళు కూడా విన్నట్లే కనిపిస్తుంటారు. ఇంట్లో తమకి ఇంకేమి పని లేనట్టు, ఎదుటివాళ్ళ స్వవిషయాలు కావాలి. ఆరోగ్యకరమైన వ్యాపకం లేని వాళ్ళు. జాలి పడడం తప్ప ఇంకేమి చేయలేం అనుకొంది లత. వీళ్ళకి జీవితాన్ని ఎదుటివారి లైఫ్ లో చూడడం అలవాటు. వారి జీవితాలలో ఉన్న లోటు పాట్లని ఎదుటివారి జీవితాలకి ఆపాదించి, సరి పోల్చుకొంటూ, వీలైనప్పుడల్లా గాసిప్ చేస్తూ, వీలైతే వాళ్ళ ఇళ్లల్లో కి వెళ్లి, అడగకూడనివి అన్నీ అడిగి అవతలివారి ఎస్టీమ్ ని, గౌరవాన్ని, మౌనాన్ని చేతనైనంత వరకు ఛిద్రం చేసి, విన్నదంతా మళ్ళీ రిపీటెడ్ గా బయట ఇంకో నలుగురితో చెప్పడం. ఒక విధమైన అలవాటుగా, వ్యసనంగా తరువాత ప్రవృత్తి గా మారుతుంది. చాలా మంది దీన్ని, లీడర్షిప్ ట్రైట్ అనుకొని వాళ్ళని వాళ్ళే లీడర్ అనుకొంటారు. ఇంక వీళ్ళని ఆపే వాళ్ళే ఉండరు. ఇంటా, బయటా రాజరికం ఆపాదించేసుకొంటారు వీళ్ళ గద్దరితనం తో. అతి చొరవతో వీళ్ళు చొచ్చుకుపోతూ ఉంటే, ఆపడానికి భయపడే వాళ్ళే ఎక్కువ. ఎవరైనా ఆపారా, వాళ్ళతో సిగ పట్టు పట్టడానికి, నోరు పెట్టుకొని కలబడిపోవడానికి వెనుదీయరు. రభస దేనికని, చుట్టుపక్కల వాళ్ళు తప్పించుకొని తిరుగుతారు. దాన్ని వీళ్ళు తామంటే చాలా గౌరవం అందరికీ అనే ఫాల్స్ ఇమేజ్ లో బతుకుతుంటారు.
అమెరికన్ కాలమిస్టు ఎప్పీ లెడెరేర్ (ఏన్ లాండర్స్) మాటల్లో, దిగువ తరగతి మనుషులు వేరే వాళ్ళ గురించి మాట్లాడుతారు. సామాన్య ప్రజలు విషయాలు, వస్తువులు గురించి మాట్లాడుతారు. ఉన్నతమైన వాళ్ళు ఆలోచనల గూర్చి మాట్లాడతారని అంటుంది. ఎంత లోతైన థాట్ కదా! అనుకొంది లత.
ఫైనల్ గా ఒక రోజు రెండో ఫ్లోర్ లో ఉండే స్వర్ణకి ఆరో ఫ్లోర్ ఆంటీతో గొడవ అయ్యింది. వాళ్ళ అమ్మాయిని పిలిచి మీ మమ్మీ ఒంటి మీద ఎక్కడెక్కడ టాటూ వేయించుకుంది? అని అడిగిందట. స్వర్ణ మా అందరికీ తెలుసు. చక్కగా నవ్వుతూ, హాయిగా తన పనేదో తాను చేసుకొనే అమ్మాయి. ఇద్దరు అమ్మాయిలు, చిన్న అమ్మాయికి ఆరు, పెద్ద అమ్మాయికి 8 ఏళ్ళు. భర్త ప్రభు ప్రభుత్వ అధికారి. తను ఐటీ సెక్టార్ లో ఉద్యోగం. రీసెంట్ గా మెడమీద టాటూ వేయించుకొందట. అది తెలిసి, ఆరో ఫ్లోర్ ఆంటీ స్వర్ణ పెద్ద కూతురిని పిలిచి కబుర్లాడి, టాటూ ఎక్కడెక్కడ వేయించుకొంది అని ఆరా తీసింది. దానితో స్వర్ణకి వచ్చిన ఉగ్ర రూపంకి ప్రభునే భయపడ్డాడట.
అసోసియేషన్ ఆఫీస్ రూమ్ కి వెళ్లి కంప్లైంట్ చేసింది. 24 గంటల లోపు రిటర్న్ అపాలజీ ఇవ్వకపోతే, చైల్డ్ మెంటల్ అబ్యూజ్, ఉమెన్ హరాస్మెంట్, బ్రీచ్ ఆఫ్ పీస్ కింద పోలీస్ కంప్లెయింట్, లాయర్ నోటీసు ఇస్తానని రిటన్ గా వ్రాసి అసోసియేషన్ ప్రెసిడెంట్ కి ఇచ్చి వచ్చింది. అప్పుడు తెలిసింది, అందరికీ స్వర్ణ ఐటీ సెక్టార్ లో చేసే ఉద్యోగం లీగల్ మేటర్స్ ఎక్స్పర్ట్ అని.
తరువాత సంగతి ఏముంది? ఇంటిల్లిపాది వచ్చి, సయోధ్య కుదర్చాలని చూసారు. స్వర్ణ వినలేదు. పిల్లల విషయంలో, వ్యక్తిగత విషయాలలో కలుగచేసుకోవడాన్ని, అనవసరమైన ప్రమేయాన్ని సహించేది లేదని ఖచ్చితంగా చెప్పింది. తప్పనిసరై, ఆరోఫ్లోర్ ఆంటీ క్షమాపణా పత్రం వ్రాసిచ్చి, ఇకమీదట ఇలా జరగదని భర్తతో సహా స్వర్ణ ఇంటికి వచ్చి చెప్పి వెళ్ళింది. ఆవిడ వచ్చినప్పుడు స్వర్ణ కూర్చోబెట్టి, కాఫీ ఇచ్చి, ఆవిడ ఇచ్చిన క్షమాపణ పత్రాన్ని, జాగ్రత్తగా చదివి, కొత్త ఫైల్ ఓపెన్ చేసి, అందులో పెట్టి, షెల్ఫ్ లో పెట్టి ఆవిడ ఎదురుగానే లాక్ చేసింది. కాఫీ అయ్యాక ఆవిడ ఏదో మాట్లాడబోతే, ప్లీజ్ మైండ్ యువర్ బిజినెస్ ఆంటీ, నాకు కొంచెం పని ఉంది అని లేచి నిలబడింది ఇంక వెళ్ళండి అన్నట్టు.
ఇంకేమి చేయలేక బయటకి నడిచింది ఆవిడ. ప్రవర్తనా సరిహద్దులు తెలియకపోవడం, ఎదుటివారిని తక్కువ అంచనా వేయడం, వ్యక్తిగత విషయాలలో తల దూర్చడం, సరైన వ్యక్తిత్వం లేకపోవడం, గద్దరితనంతో ప్రపంచాన్ని జయించాలనుకోవడం ఈరోజు ఈ గుణపాఠం చెప్పాయి. దీని నుండి ఏమైనా నేర్చుకొంటుందా ఆమె? బహుశా నేర్చుకోకపోవచ్చు! ఏ మూల నుండో, స్వర్ణ కుటుంబం పై బురద చల్లే అవకాశం కోసం ఎదురుచూస్తుండవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *