May 25, 2024

బాలమాలిక కథ – అడవిలో ఉగాది

రచన: కోనే నాగ వెంకట ఆంజనేయులు

 

 

ఉగాది పండుగ రోజు. ఊళ్ళో ఇల్లిల్లూ తిరిగే కాకి ఉదయాన్నే  అడవిలో జంతువులన్నిoటినీ మామిడి చెట్టు క్రింద సమావేశ పరిచింది.

ఈ అత్యవసర సమావేశం దేనికో అర్థం కాని జంతువులన్నీ కాకి చెప్పే విషయం కోసం ఆత్రంగా ఎదురు చూడసాగేయి.

కాకి గొంతు సవరించుకుంది. జంతువులన్నీ చెవులు రిక్కించాయి.

“సోదరులారా! ఈరోజు ఉగాది పండుగ. ఊళ్ళో మనుషులందరూ ఈ పండుగని చాలా ఆనందంగా జరుపుకుంటారు. సంవత్సరంలో వచ్చే మొట్టమొదటి పండుగ ఇది. మనుషుల్లాగే మనం కూడా ఈ ఏడాదినుండీ ప్రతి సంవత్సరం ఉగాది పండుగ జరుపుకుంటే బాగుంటుందని నా కోరిక”  అన్నది కాకి.

కాకి చేసిన ఈ సూచనకు మిగతా జంతువులన్నీ తమ అంగీకారాన్ని తెలియజేశాయి.

“అసలు మానవులు ఈ పండుగ ఎందుకు జరుపుకుంటారు? ఈ పండుగ జరుపుకుంటే ఏం జరుగుతుంది?” అంటూ తన సందేహం వెలిబుచ్చింది బుర్రుపిట్ట.

“ఉగాదిపండుగ రోజున మనం ఎలా గడిపితే ఆ సంవత్సరం అంతా అలా గడుస్తుందట. అందుకే ఈ రోజు మనుషులంతా తమ బాధలన్నీ మర్చిపోయి ఆనందంగా గడుపుతారు. అందువలన మిగతా సంవత్సరం అంతా ఆనందంగా గడుస్తుందని మానవుల నమ్మకం”  ఉగాది పండుగ విశిష్టత గురించి తనకు తెలిసింది అంతా వివరంగా తెలియజెప్పింది కాకి తన మిత్రులకు.

“అయితే మనం కూడా ఉగాది పండుగ జరుపుకుందాం. దానికోసం మనం ఏం చెయ్యాలో అది కూడా నువ్వే చెప్పు కాకి బావా!” అన్నాయి మిగతా జంతువులన్నీ సంబరంగా.

“ఉగాది పండుగ నాడు మనుషులంతా ఉదయాన్నే లేచి తలస్నానం చేసి కొత్తబట్టలు కట్టుకుని పూజ చేసుకుని ఉగాది పచ్చడి తింటారు. తరువాత రకరకాల పిండి వంటలు తయారు చేసుకుని బంధుమిత్రులందరితో కలిసి భుజిస్తారు. రాత్రికి వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుని సంబరాలు చేసుకుంటారు. మన జంతు లోకానికి బట్టలు కట్టుకునే సంప్రదాయం లేదు కాబట్టి ఆ విషయం వదిలేసి ఉగాది పచ్చడి చేసుకుని తిందాం. అన్ని రుచులూ కలగలిసిన ఆ పచ్చడి ఎంతో రుచికరంగా ఉంటుందట. పైగా  ఆరోగ్యానికి మంచిది కూడానట” వివరంగా చెప్పింది కాకి.

“సరే ఈ పండుగ కోసం మనలో ఎవరెవరు ఏ ఏ పనులు చేయాలో అది కూడా నువ్వే చెప్పు” అన్నాయి జంతువులన్నీ సంబరంగా. ఎవరెవరు ఏ ఏ పనులు చేయాలో పురమాయించింది కాకి.

కాకి పురమాయించిన విధంగా జంతువులన్నీ తమకు అప్పగించిన పనులన్నీ చెయ్యడానికి పూను కున్నాయి. ఏనుగు పొలంలోంచి  చెరుకుగడలు పీక్కు వచ్చింది. ఎలుగుబంటి చింతచెట్టు ఎక్కి పండిన చింతకాయలు కోసుకొచ్చింది. చిలుక చిటారుకొమ్మన ఉన్న వేపపువ్వు దూసుకొచ్చింది. బెల్లం బట్టీ దగ్గర్నుంచి ఇంత బెల్లం అచ్చు ఎత్తుకొచ్చింది గద్ద. జింక తన కొమ్ములతో – పచ్చగా పండిన అరటిపళ్ళు పట్టుకొచ్చింది. నక్క ఎగిరెగిరి మామిడి చెట్టుకున్న పుల్లటి మామిడి పిందెలు తెంపుకొచ్చింది. కోతి, కొబ్బరి చెట్టు ఎక్కి కొబ్బరిబొండాలు కోసి కిందకి జార విడిచింది. ఉడత ఉప్పుమడి దగ్గరికి వెళ్లి ఒంటికి ఉప్పు అంటించుకుని తెచ్చి తామరాకులో దులిపి ఉడత సాయం చేసింది.

తోడేలు ఆ పదార్థాలన్నీ ఒక  సొరకాయ బుర్రలో వేసి రుచికరంగా ఉగాది పచ్చడి తయారుచేసింది.  బాదం ఆకుల్లో ఉగాది పచ్చడి వేసి మిత్రులందరికీ పంచింది బాతు.  లొట్టలు వేసుకుంటూ ఉగాది పచ్చడి తిన్న జంతువులు – అన్ని రుచులూ కలగలిసిన ఉగాది పచ్చడి అద్భుతంగా ఉందని మెచ్చుకున్నాయి.

ఆ రాత్రి కోతి మనుషులను అనుకరిస్తూ, మిమిక్రీ చేసి పొట్టచెక్కలయ్యేలా నవ్వించింది తన సహచర జంతువులను. కోయిల తన తీయటి గొంతుతో పాటలు పాడి అడవినంతా పరవశింపజేసింది. నెమలి చాలా సేపు పురివిప్పి నాట్యం చేసి అలరించింది. చిలుక తన ముద్దు మాటలతో అందరినీ సంతోష పరచింది. ఆటపాటలతో అర్ధరాత్రి వరకు ఆనందంగా గడిపిన జంతువులన్నీ – ప్రతి సంవత్సరం ఇలాగే ఉగాది పండుగ వేడుకగా జరుపుకోవాలని తీర్మానించుకుని వేటి దారిన అవి తమ తమ నివాసాలకు  వెళ్లిపోయాయి.

 

***

 

              

                

 

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *