May 4, 2024

అమ్మమ్మ – 49

రచన: గిరిజ పీసపాటి

అందరూ ప్రసాదం తిన్నాక, గిరిజకు రెండు స్టీల్ బాక్సులలో పులిహోర, రెండు బాక్సులలో పరమాన్నం పెట్టిచ్చి, గణేష్ గారికి ఒక బాక్స్ పులిహోర, పరమాన్నం, మిగిలిన రెండు బాక్స్ లలో ఉన్నవి స్టాఫ్ అందరికీ పంచమని చెప్పింది వసంత. లేట్ పర్మిషన్ పెట్టినప్పటికీ టైమ్ కే షాప్ కి చేరుకుంది గిరిజ.
గిరిజను చూస్తూనే “హేపీ బర్త్ డే తల్లీ!” అంటూ విష్ చేసిన గణేష్ గారితో “థాంక్యూ సర్” అంటూ, తన చేతిలోని రెండు చిన్న బాక్సులను ఆయనకు ఇచ్చింది గిరిజ.
“ఏమిటివి?” అంటూనే ముందు పరమాన్నం బాక్స్ ఓపెన్ చేసి, “స్వీట్ నాకు నచ్చదు” అంటూ ఒక స్పూన్ తో కొద్దిగా తీసుకుని తిని, తిరిగి గిరిజకు ఆ బాక్స్ ఇచ్చేసారు. తరువాత రెండవ బాక్స్ ఓపెన్ చేసి, మెరుస్తున్న కళ్ళతో “పులిహోరా! నాకు చాలా ఇష్టం. ఇప్పుడే టిఫిన్ తిన్నాను. మధ్యాహ్నం తింటాను” అంటూ శ్రీను ని కేకేసి “లోపల నా కేబిన్లో టేబుల్ మీద పెట్టు” అని చెప్పారు.
“సర్! స్టాఫ్ అందరికీ ఇవ్వొచ్చా!” అని గిరిజ అడగగానే “తప్పకుండా ఇవ్వు తల్లీ!” అన్నారు. గిరిజ వెళ్ళి అందరికీ పులిహోర, పరమాన్నం కొద్దికొద్దిగా ఇచ్చి, అందరి విషెస్ అందుకుంది. అందరూ ఉన్నారు గానీ ఉల్లాస్ కనబడలేదు. “ఉల్లాస్ గారు ఎక్కడ? సెలవు పెట్టారా?” నీలాద్రి అనే స్టాఫ్ ని అడిగింది.
“గణేష్ గారు ఎక్కడికో పంపించారు. వచ్చాక ఇద్దువు” అని ఆయన అనగానే “సరే” అంటూ తన సీట్ లో కూర్చుని, ముందు రోజు సేల్స్ రిజిస్టర్ నోట్ చేయసాగింది.
మరో గంటకు అకౌంట్స్ వర్క్ అంతా పూర్తయి, తన రొటీన్ వర్క్ లో పడింది. ఇంతలో “హేపీ బర్త్ డే” అన్న ఉల్లాస్ గొంతు వినబడడంతో ఆయనకు “థాంక్యూ” అంటూ రిప్లయ్ ఇచ్చి, “మీరు బయటకు వెళ్ళినట్లు నీలాద్రి గారు చెప్పారు” అంటూ పులిహోర, పరమాన్నం ఇచ్చింది.
ఆషాఢ మాసం కావడం వల్ల పెద్దగా కష్టమర్స్ లేరు. మరో అరగంటకి గణేష్ గారు “గిరిజా! ఒకసారి ఇలా రా తల్లీ!” అంటూ క్రోకరీ కౌంటర్ దగ్గర నిలబడి కేకేయడంతో అటు వెళ్ళింది. అక్కడ బ్రౌన్ కలర్ పేకింగ్ పేపర్ చుట్టి, ప్లాస్టిక్ తాడుతో పేక్ చేసి ఉన్న ఒక పెద్ద బండిల్ ఉంది.
ఉల్లాస్ కూడా అక్కడే ఉన్నాడు. గిరిజ వెళ్ళగానే ఉల్లాస్ తో “ఓపెన్ చెయ్యు” అని చెప్పారు గణేష్ గారు. ఉల్లాస్ చకచకా ప్లాస్టిక్ తాళ్ళను చాకుతో తెంపి, పైన ఉన్న బ్రౌన్ కలర్ ను ఓపెన్ చేసేసరికి, లోపల ఒకదాని మీద ఒకటి పేర్చబడిన కొత్త పుస్తకాలు కనబడ్డాయి. “నీకే. ఒకసారి చూసుకో” అన్నారు గణేష్ గారు గిరిజతో.
‘అన్ని పుస్తకాలు తనకే అంటారేమిటా’ అని చూస్తున్న గిరిజతో “ఒకసారి అన్ని పుస్తకాలు లిస్ట్ ప్రకారం ఉన్నాయో లేదో చూసుకో తల్లీ!” అంటూ ఒక లిస్ట్ ను గిరిజ చేతిలో పెట్టి, తన చేతిలో బిల్ ఉంచుకుని “నువ్వు ఒక్కో పుస్తకం పేరు చదువు ఉల్లాస్. మేడమ్ లిస్ట్ లో ఆ బుక్ ఉందో లేదో చూస్తారు. నేను బిల్ చెక్ చేస్తాను” అన్నారు.
ఉల్లాస్ ఒక్కో బుక్ తీసి, పైన ఉన్న పేరు చదువుతుంటే గిరిజ తన చేతిలో ఉన్న లిస్ట్ లో ఆ బుక్ పేరు టిక్ చేయసాగింది. అన్నీ అలా చెక్ చేయడం పూర్తి కాగానే “అన్నీ ఉన్నాయి సర్” అంది గిరిజ.
“నువ్వు మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళు. ఇంత బరువు మోసుకెళ్ళలేవు గానీ… ఉల్లాస్ టివిఎస్ మోపెడ్ మీద బుక్స్ తీసుకొస్తాడు” అన్నారు.
“కానీ… ఈ బుక్స్” అంటూ… ఇంకేమని అడగాలో తెలీక ఇబ్బంది పడుతున్న గిరిజతో “నీకు నా బర్త్ డే గిఫ్ట్ తల్లీ! డిగ్రీ చదవలేకపోతున్నానని బాధ పడుతున్నావు కదా! అందుకే ఈ బుక్స్ తెప్పించాను. ఇవన్నీ డిగ్రీ ఫస్టియర్ బుక్స్. నువ్వు ప్రైవేటుగా కట్టి, ఎగ్జామ్స్ రాయు. ఉద్యోగం మానక్కరలేకుండా చదువుకోవచ్చు” అన్న ఆయన మాటలకు ఆనంద పడినా, ఫీజు కట్టేందుకు కూడా కుదరని తమ పరిస్థితిని బయట పెట్టుకోవడానికి స్వాభిమానం అడ్డొచ్చి “వద్దు సర్! నేను చదవలేను” అని చెప్పింది.
ఆయనొకసారి గిరిజ ముఖం వంక పరిశీలనగా చూసి “నేను నా కేబిన్లో ఉంటాను. ఇక్కడ అర్జంటు పనేమన్నా ఉంటే పది నిముషాలలో పూర్తి చేసుకుని రా!” అని చెప్పి, ఉల్లాస్ తో “ఈ బుక్స్ అన్నీ లోపలకి తీసుకురా!” అంటూ లోపలికి సీరియస్ గా వెళిపోయారు.
‘భగవంతుడా!’ అనుకుంటూ ఏ పనీ లేకపోయినా తన టేబిల్ అలమరలో ఉన్న పుస్తకాలు తీసి, సర్దుతున్న నెపంతో పది నిముషాలు గడిపేసి, ఇక తప్పదన్నట్లు కాళ్ళీడ్చుకుంటూ లోపలికి వెళ్ళింది. గిరిజను చూస్తూనే “నీ కోసమే చూస్తున్నాను. కూర్చో!” అనగానే ఆయనకు ఎదురుగా, టేబుల్ కి ఇవతల వైపు వేసి ఉన్న కుర్చీలో కూర్చుంది.
ఎదురుగా నీకోసమే ఉన్నామంటూ భరోసానిస్తున్నట్లు పుస్తకాల బండిల్ కనబడింది. దాని పక్కనే పులిహోర బాక్స్. “ఎందుకు చదవలేనంటున్నావు?” కొంచెం కోపంగా అడిగారాయన.
“ఇంటికి వెళ్ళేసరికి రాత్రి తొమ్మిది దాటుతోంది సర్. చదువుకోవడానికి టైమ్ ఉండదనీ…” అంటుండగానే “ఇలాంటి మాటలు నాకు చెప్పకు. రాత్రి పదకొండు, పన్నెండు గంటల వరకు చదువు. ఆదివారం మన షాపు ఒక పూటే ఉంటుంది. మిగిలిన సమయంలో చదువు. నీకు చదువంటే నిజంగా ఇష్టం ఉన్నదానివైతే ఇలాంటి సాకులు చెప్పవు” అన్నారు తీవ్ర స్వరంతో.
“అది కాదు సర్!” అంటున్న గిరిజతో “ఇంకేం మాట్లాడకు. యూనివర్సిటీలో పని చేస్తున్న మా ఫ్రెండ్ ని కనుక్కున్నాను. ఆల్రెడీ అడ్మిషన్స్ కి నోటిఫికేషన్ పడిందట. ఉల్లాస్ చేత నిన్ననే అడ్మిషన్ ఫార్మ్ కూడా తెప్పించాను” అంటూ టేబుల్ సొరుగులో నుండి అడ్మిషన్ ఫార్మ్ బయటకు తీసి, ఆయనే గిరిజ డిటెయిల్స్ అన్నీ అడిగి ఒక్కొక్క కాలమ్ నింపసాగారు.
ఆయన అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇస్తూనే ఫీజు విషయం ఆలోచిస్తోంది గిరిజ. అన్ని కాలమ్స్ ఫిల్ చేసాక ఫార్మ్ ని గిరిజ ముందుకు తోసి “ఆలోచనలు కట్టిపెట్టి, సిగ్నేచర్ చెయ్యు” అన్నారు.
అయినా సంతకం పెట్టకుండా ఆలోచిస్తున్న గిరిజను చూస్తూ “చూడు తల్లీ! నాకు కూడా చదువుకోవడం అంటే చాలా ఇష్టం. కానీ మా ఇంటికి పెద్ద కొడుకుని కావడంతో డిగ్రీ మధ్యలోనే ఆపేసి, బిజినెస్ లో నాన్నగారికి సాయంగా ఉండాల్సి వచ్చింది. చదువు మధ్యలోనే ఆగిపోవడంతో నేను ఎంత బాధపడ్డానో, నాకు ఆ భగవంతుడికి మాత్రమే తెలుసు”.
” జీవితంలో అందరికీ అన్నీ దొరకవు. ఇంకా చిన్న పిల్లవు. రేపు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలంటే ఈ చదువు చాలదు. ఏరోజు ఎలా ఉంటుందో మనకు తెలియదు. నువ్వు ఎంతవరకు చదువుకుంటానంటే అంతవరకు చదువు చెప్పిస్తాను. పుస్తకాలు, ఫీజులు మొదలైన డబ్బుకి సంబంధించిన వివరాలన్నీ నేను చూసుకుంటాను. నువ్వింకేం ఆలోచించకుండా సంతకం పెట్టు” లాలనగా పసిపిల్లను బుజ్జగిస్తున్నట్లు అన్నారు.
ఆయన ఫీజు గురించి కూడా హామీ ఇచ్చేసరికి మారుమాట్లాడకుండా అప్లికేషన్ ఫార్మ్ ఉన్న పాడ్ ని అందుకుని సంతకం చేసి, ఆయనకు ఇచ్చింది. “గుడ్ గర్ల్” అంటూ మెచ్చుకుంటూనే తిరిగి “నేను నిన్ను చదివించాలంటే నావి కొన్ని కండిషన్స్” అన్నారాయన.
ప్రశ్నార్ధకంగా చూసిన గిరిజతో “ఒక్క రోజు కూడా షాప్ మానకూడదు. పరీక్షలు జరిగినన్నాళ్ళూ పరీక్ష రోజు తప్ప మధ్యలో సెలవు వస్తే షాప్ కి రావలసిందే. ప్రిపరేషన్ కి అంటూ సెలవులు పెట్టడానికి వీల్లేదు. అలాగే ఒక్క సంవత్సరం ఒక్క సబ్జెక్టు కూడా ఫెయిల్ అవకూడదు. ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ అయినా అక్కడితో నీ చదువు ఆగిపోతుందన్న విషయం గుర్తుంచుకో”.
“కేవలం డబ్బు కట్టడం, పుస్తకాలు కొనడం మాత్రమే నేను చేస్తాను. నువ్వు ఎలా ప్లాన్ చేసుకుని చదువు కుంటావో నీ ఇష్టం” అన్నారు సూటిగా చూస్తూ.
“మీరు చెప్పినట్లే చేస్తాను సర్. సెలవులు పెట్టను. రాత్రి షాప్ నుండి ఇంటికెళ్ళాక చదువుకుంటాను. థాంక్యూ సర్. థాంక్యూ వెరీ మచ్” అంది గిరిజ కృతజ్ఞతతో కళ్ళలో నీళ్ళు తిరుగుతుండగా చేతులు జోడించి ఆయనకు నమస్కరిస్తూ.
“పిచ్చి పిల్లా! చదువు అంటే నీకెంత ఇష్టమో నాకు అర్ధమైంది. అందుకే ఈ బుక్స్ తెప్పించాను. ఇవి కాక నీకోసం మరో గిఫ్ట్ కొన్నాను” అంటూ చిన్న బాక్స్ టేబుల్ సొరుగులో నుంచి బయటకు తీసి, గిరిజకు ఇచ్చి “ఓపెన్ చెయ్యు” అన్నారు.
గిరిజ మొహమాటపడుతూనే ఆ బాక్స్ ని అందుకని ఓపెన్ చేసింది. లోపల బ్లాక్ డయల్ కి రామా గ్రీన్ కలర్ కేస్, స్ట్రాప్ తో టైమెక్స్ రిస్ట్ వాచ్ ఉంది.
వాచ్ ని బయటకు తియ్యగానే “ఇక నుండి నువ్వు కాలంతో పోటీ పడాలి. నీకా విషయం ఎప్పుడూ గుర్తుండడం కోసం ఈ వాచ్ కొన్నాను. ఇప్పుడే చేతికి పెట్టుకుని, బయటకు వెళ్ళి పని చూసుకో. ఆల్ ద బెస్ట్ అండ్ వన్స్ ఎగైన్ హేపీ బర్త్ డే” టేబుల్ డ్రా లోంచి ఒక డైరీ మిల్క్ చాక్లెట్ తీసి గిరిజకు అందిస్తూ అన్నారు.
ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతూ, వాచ్ ని కుడిచేతి మటికట్టుకి తగిలించుకుని, రెండు చేతులూ జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించింది. ఆ క్షణంలో ఆయనలో తన తండ్రి కనిపించాడు ఆ అమ్మాయికి.
మధ్యాహ్నం భోజన సమయానికి గణేష్ గారు వచ్చి “గిరిజా భోజనానికి నేను డ్రాప్ చేస్తాను. ఆ బుక్స్ ఉల్లాస్
చేత వేన్ పెట్టించాను. నేను బయట వెయిట్ చేస్తుంటాను. త్వరగా రా!” అని వెళ్ళబోతుంటే “ఫరవాలేదు సర్! నేను వెళ్తాను” అంది గాభరాగా.
“ఉల్లాస్ బండి వెనకాల ఆ బుక్స్ బండిల్ ని పెట్టుకుని, నువ్వు ముందు నడుస్తూ వెళుతూ ఉంటే… నీ వెనుక స్లోగా ఫాలో అవడం ఇబ్బంది అవుతుంది. నేను ఎలాగూ భోజనానికి వెళ్తున్నాను. నిన్ను డ్రాప్ చేసి వెళ్తాను” చెప్పి బయటకు వెళిపోయారు.

****** సశేషం *******

1 thought on “అమ్మమ్మ – 49

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *