May 4, 2024

కర్ణాటక సంగీతంలో రాగమాలికలు – 2

రచన: కొంపెల్ల రామలక్ష్మి

మనం గత సంచికలో తెలుసుకున్న ‘72 మేళ రాగమాలిక’, అభ్యాసగానానికి ఉపకరించే రచన కాదు. ఈ రచనను ఒక గీతంగా చెప్పడం కంటే, ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన అతి పెద్ద రాగమాలికగా చెప్పుకోవాలి. కొందరు విద్వాంసులు ఈ రచనను కృతిగా సంబోధించడం కూడా జరిగింది.
అయితే, అభ్యాసగాన స్థాయిలోనే మరొక ముఖ్యమైన 72 మేళ రాగమాలికాగీతం మీకు పరిచయం చేసి, తర్వాతి అంశం అయిన ‘జతి స్వరం మరియు స్వరజతులు’ గురించి వివరిస్తాను.
అయితే, అభ్యాసగాన స్థాయిలోనే మరొక ముఖ్యమైన 72 మేళ రాగమాలికా గీతం గురించి ఇప్పుడు చెప్పుకుందాము.
72 మేళ రాగమాలికా గీతం:
దీనిని రచించిన వారు శ్రీ చిత్రవీణ యన్ రవికిరణ్ గారు.
ఈ రచన పాడడానికి పట్టే సమయం కేవలం 7 నిముషాలు. రవికిరణ్ గారు 1967 లో మైసూరులో పుట్టారు. వీరి తండ్రి గారైన శ్రీ కె యస్ నరసింహన్ గారు కూడా చాలా పేరు గల గొట్టు వాద్యం కళాకారులు. రవికిరణ్ గారు, తన రెండు సంవత్సరాల వయసులోనే, ‘మద్రాస్ మ్యూజిక్ అకాడమీ’ వారు నిర్వహించిన సంగీత ఉత్సవాల్లో పాల్గొని, 325 రాగాలు, 175 తాళాలు గుర్తు పట్టి, ‘బాల మేధావి’గా గుర్తింపు పొందారు. ఆ తర్వాత ఒక సంవత్సరం లోపే (అంటే 3 సంవత్సరాల వయసులో) వారు బొంబాయి షణ్ముఖానంద సభలో జరిగిన సంగీత కార్యక్రమంలో పాడటానికి ఆహ్వానాన్ని అందుకున్నారు. అంతటి ప్రతిభాశాలి వారు. 12 సంవత్సరాల వయసులోనే ఆకాశవాణిలో A గ్రేడ్ కళాకారునిగా నియమితులయ్యారు. వీరు దాదాపుగా 1050 రచనలు సంగీత, నృత్య మరియు పాశ్చాత్య వాద్య సంగీతానికి సంబంధించినవి చేసినట్టుగా తెలుస్తుంది. ఇది క్లుప్తంగా రవికిరణ్ గారి గురించి.
ఇక వారి రచన విషయానికి వస్తే, ఇది 72 మేళకర్తల పేర్లనే వాడి చేసిన రచన. అలాగే, ప్రతీ చక్రం స రి గ మ అనే స్వరాలతో (ప్రతీ చక్రంలోని పూర్వాంగ స్వరాలు అయిన సరిగమలు ఒకే స్థాయిలో ఉంటాయి) మొదలై, ఆ చక్రం పేరుతో (ఉదాహరణకు మొదటి చక్రం పేరు ఇందు) ముగుస్తుంది. ప్రతీ రాగం పేరు అదే రాగంలో కూర్చడం జరిగింది. చివర్లో శ్రీ సీతారాముల ప్రార్థన ‘సురటి’ రాగంలో చాలా మంగళకరంగా రచించారు శ్రీ రవికిరణ్ గారు. (‘ఆది నాట, అంత్య సురటి’ అంటారు.) ఇది చాలా అందమైన రచన.


ఇప్పుడు మనం జతిస్వరాలు, స్వరజతులు గురించి తెలుసుకుందాం.
అభ్యాసగానంలో గీతాల తర్వాత నేర్చుకునే రచన జతిస్వరం లేదా స్వరపల్లవి. ఇది పూర్తిగా స్వరాలతో చేయబడిన రచన. కొన్ని రాగాల జతిస్వరాలలో ‘తరికిట థిమితక’ వంటి జతులతో రచన చేయడం కనిపిస్తుంది. ఇవి నాట్యానికి చాలా అనుకూలంగా ఉంటాయి. ఈ రచనలో కూడా పల్లవి, అనుపల్లవి, చరణాలు వంటి అంగాలు ఉంటాయి. కొన్ని రచనల్లో పల్లవి చరణాలు మాత్రమే ఉండడం కూడా మనకి కనిపిస్తుంది.
జతిస్వరానికి సాహిత్యం రచించినప్పుడు అది స్వరజతి అవుతుంది. జతిస్వరం మొత్తం ధాతురచనగా సాగుతుంది. స్వరజతి రచన ధాతు మాతుల మిశ్రమంగా ఉంటుంది.
జతిస్వరం, స్వరజతి పాడే విధానం ఏంటంటే – ముందుగా పల్లవి పాడి, తర్వాత అనుపల్లవి పాడి మళ్లీ పల్లవి పాడాలి. ప్రతీ చరణము పాడిన తర్వాత పల్లవి పాడాలి. స్వరజతికి సాహిత్యం కూడా ఉంటుంది కాబట్టి స్వరజతి పాడేటప్పుడు ముందుగా పల్లవి స్వరము తర్వాత సాహిత్యము పాడి, అనుపల్లవి స్వరము, సాహిత్యము పాడాలి. ఆ తర్వాత ఒక్కొక్క చరణానికి స్వరము, సాహిత్యము పాడి, ప్రతి చరణం తర్వాత పల్లవి సాహిత్యాన్ని పాడాలి. ఈ జతిస్వరము మరియు స్వరజతి బాగా అభ్యాసం చేయడం వల్ల విద్యార్థికి ఒక రాగం మీద మంచి అవగాహన ఏర్పడుతుంది. స్వర సంచారాల గురించిన జ్ఞానం పెరుగుతుంది.
జతిస్వరాలు రచించిన వారిలో ప్రముఖులు
1. స్వాతి తిరునాళ్
2. పొన్నయ్య
3. వడివేలు
మొదలైనవారు.
స్వరజతి రచనల్లో మనం తరచూ వినే రచనలు –
1. రారవేణుగోపాబాల
2. సాంబశివాయనవే (చిన్న కృష్ణ దాసర్ గారి రచన)
3. రావేమే మగువా (వీరభద్రయ్య గారి రచన)
మొదలైనవి.
ఇవన్నీ ఒక ఎత్తు అయితే స్వరజతిత్రయంగా పిలువబడే, మూడు అపురూపమైన రచనలు చేసిన వారు శ్రీ శ్యామశాస్త్రి గారు. ఒక అభ్యాసగాన రచనను సభాగానస్థాయిలో చేసిన ఘనత శ్రీ శ్యామశాస్త్రి గారిది. ఈ మూడు స్వరజతులు కామాక్షి అమ్మవారిని స్తుతిస్తూ చేసినవి.
1. భైరవి రాగ స్వరజతి
2. యదుకుల కాంభోజి రాగ స్వరజతి
3. తోడి రాగ స్వరజతి
మనం ప్రస్తుతం చర్చించుకుంటున్న రాగమాలికల విషయానికి వస్తే, పంచరాగ జతిస్వర రచనను ప్రముఖంగా చెప్పుకోవాలి. దీనిని రచించినవారు ప్రఖ్యాత వాగ్గేయకారులు శ్రీ స్వాతి తిరునాళ్ గారు.
వీరు జీవించిన కాలం క్రీస్తుశకం 1813-1846.
వీరి రచనలు అన్నీ కూడా అద్భుతాలే. 400 పైన రచనలు వీరు చేసినట్టుగా తెలుస్తుంది. ఈ రచనలు కర్ణాటక మరియు హిందుస్థాని సంగీత విధానాల్లో మనకు లభ్యం అవుతున్నాయి. వీరు ట్రావెన్కోర్ సామ్రాజ్యాన్ని అత్యంత సమర్థవంతంగా పరిపాలించిన మహారాజు. చిత్రలేఖనం వంటి అన్ని లలితకళలలోనూ ప్రావీణ్యం కలిగిన గొప్ప కళాకారులు కూడా.
వీరు రచించిన ఈ పంచరాగ జతిస్వరంలో వాడిన రాగాలు – కళ్యాణి, బేగడ, అఠాణా, సురటి మరియు తోడి. పల్లవి కళ్యాణి రాగంలో ఉంటుంది. ఈ రచనకే తర్వాతి తరంవారెవరో సాహిత్యాన్ని రచించి, స్వరజతిగా మార్చినట్టుగా తెలుస్తోంది. ఇదే రచనకు జతులు, సోల్ కట్టు స్వరాలు (సోల్ కట్టు స్వరాలు అంటే మనకు నాట్యానికి సంబంధించిన పాటలలో, నట్టువాంగంలో వినిపించే తకిటతక, తరిగిణ థోమ్, తత్తళాంగు, తకథిమి మొదలైన శబ్దాలు) సమకూర్చి, నాట్యానికి కూడా అనుకూలంగా మలచుకోవడం జరుగుతోంది.
ఈ రచనకు సాహిత్యంలో ‘స్వరాక్షరాలు’ వంటి అలంకారాలు కనిపిస్తాయి.
స్వరాక్షరం అంటే, ఏదైనా స్వరానికి సంబంధించిన సాహిత్యంలో కూడా అదే అక్షరం ఉంటే, దాన్ని ‘స్వరాక్షరం’ అంటారు. ఇది వ్రాయడానికి సంగీతంలో మంచి ప్రావీణ్యం అవసరం. ఈ రచన మిశ్రచాపు తాళంలో చేయబడింది. మిశ్రచాపు తాళం అంటే ‘తకిట తక తక’ అని ఏడు క్రియలతో ఉండే తాళం.

వచ్చే సంచికలో వర్ణాలలోని కొన్ని రాగమాలికల గురించి తెలుసుకుందాం.
(సశేషం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *