May 9, 2024

‘డయాస్పోరా జీవన కథనం’ – ముళ్ళ గులాబి

రచన: కోసూరి ఉమాభారతి

‘మారుతున్న యువత దృక్పధాలకి, నాటి తరాల మనస్తత్వాలకి నడుమ సంఘర్షణే ‘ముళ్ళ గులాబి’ లోని కధాంశం’

“మమ్మీ! కరెక్ట్ గా ఆరు గంటలకి, మిల్పిటాస్ బాబా టెంపుల్ కి వచ్చేయి. నేను, మాలిని అక్కడ నిన్ను కలుస్తాము.
తరువాత డిన్నర్ కి వెళదాము….సరేనా?” ఫోన్ లో కిరణ్. ఉత్సాహంగా ఉన్నాడు మావాడు. న్యూయార్క్ కాలేజీ నుండి ‘లా’ డిగ్రీ తీసుకొని, బిజినెస్ MBA చేసాడు. ఆరు నెలల క్రితమే శాంహోజే, కాలిఫోర్నియాలో ఉద్యోగంలో చేరాడు.
తన స్నేహితురాలు, క్లాస్మేట్ మాలిని, న్యూయార్క్ నుంచి మమ్మల్ని కలవడానికి వస్తుందని రెండు రోజుల క్రితమే చెప్పాడు. ఊరెళ్లిన మావారు రేపు సాయంత్రం ఇంటికి వచ్చే లోగానే నన్ను కలుస్తానని మాలిని తొందరపడితే,
ఇలా ఏర్పాటు చేసాడు కిరణ్.
సాయిబాబా టెంపుల్ దగ్గరే వాళ్ళ పిన్ని ఇంట ఉందిట ఆ అమ్మాయి. “వర్క్ నుంచి బయలుదేరి, మాలినిని
తీసుకొని రావడానికి గంట పైనే పడుతుంది మమ్మీ.” అన్నాడు కిరణ్…
నాకూ కొంత ఆదుర్దాగానే ఉంది మాలినిని కలవాలని. అంత ప్రత్యేకంగా ఆ అమ్మాయి మమ్మల్ని కలవడానికి రావడమంటే, విషయం మేమూహించేదే అయ్యుంటుంది. సాయంత్రం వరకు నాకు ఎన్నో ఆలోచనలు.
మా కిరణ్ ఎంచుకున్న అమ్మాయిని మేము కాదనేది ఉండదు కాబట్టి, మా ఇంట త్వరలో కోడలు అడుగెడుతుందన్న మాట. మనస్సంతా సంతోషంతో నిండిపోయింది.
ఆలస్యంగా వెళితే కిరణ్ కి ఇష్టముండదని, గుడికి కాస్త ముందుగానే బయలుదేరాను. మేముండేది సాయిబాబా గుడికి అరగంట డ్రైవ్. కిరణ్ అపార్ట్మెంట్, వర్క్ కి దగ్గరగా మాకు వంద మైళ్ళ దూరం ఉంటుంది. వీకెండ్ (శనాదివారాలు) అయితేనే ఇంటికి వస్తుంటాడు. ఆలోచించుకుంటూ గుడి ఆవరణలోకి వచ్చేసాను. ఆ రోజు గురువారం. గణేష చతుర్ది కూడా కావడంతో ఆలయ ప్రాంగణం జనంతో నిండిపోయుంది. ప్రసాదాలు, పువ్వులు పట్టుకొని మెట్లెక్కుతున్న చిన్న పిల్లల్ని గమనిస్తూ పైమెట్టు మీద కూర్చున్నాను.
పది నిముషాలకి అల్లంత దూరాన కిరణ్, పక్కనే మాలిని గబగబా నా వైపు వస్తూ కనబడ్డారు. నీలి రంగు పంజాబీ డ్రెస్ వేసుకొని, కిరణ్ ప్రక్కన కాస్త పొట్టిగా, సన్నగా ఉంది మాలిని. దగ్గరగా వచ్చి నన్ను కలిసి, చేతులు జోడించి “నమస్తే ఆంటీ, మీరొచ్చి చాలా టైంఅయ్యిందా?” అంది మృదువుగా. సుళువు లేని తెలుగులో. మా పిల్లలు తెలుగు మాట్లాడినట్టే ఉంది.
తెల్ల గులాబీలా సుకుమారంగా అనిపించింది. దేవుణ్ణి దర్శించుకొని, ప్రసాదం తీసుకొని మెట్లపై కూర్చున్నాము. చక్కగా మాట్లాడుతూనే ఉంది మాలిని. “కిరణ్ మంచి స్నేహితుడు ఆంటీ, నాకు కాలేజీలో, చదువులో హెల్ప్ చేసేవాడు. మా అమ్మావాళ్ళకి కూడా కిరణ్ అంటే చాలా ఇష్టం,” అంది. కిరణ్ పై ఉన్న అభిమానం బాగా తెలుస్తుంది మాలిని మాటల్లో. ముచ్చటేసింది నాకు. మా వాడి మనస్సులోని వలపుల తలపులకి నేను మురిసి పోయాను. ఆ సాయంత్రమంతా కబుర్లు సంతోషాలతో గడిచింది.
“ఇవాళ డిన్నర్ వద్దులే, ఆలస్యమయిపోయింది. శనివారం ఇంటికి వచ్చి డాడీని కలవండి,” అని ఇద్దరికీ చెప్పి ఇంటి ముఖం పట్టాను.
***
ఇంటికొచ్చి ఎంతో ఉత్సాహంగా, “అమ్మాయి నాకు నచ్చింది. శనివారం కిరణ్ తో కూడా ఇంటికి వస్తుంది, మీరూ కలుస్తారుగా! దీవించేస్తే మన కిరణ్ ఓ ఇంటివాడవుతాడు,” అని మా ఆయనకి ఫోన్ చేసి చెబుతూనే పోయాను. మా ఆయన కూడా సంతోషించారు. ఆనందంతో రాత్రి నిద్రపోలేదు. ఎదిగి ప్రయోజకుడైన మా ప్రియపుత్రుడు కోరి వరించిన అమ్మాయిని తప్పక ఆనందంగా ఆమోదిస్తాము, ఆహ్వానిస్తాము.
శనివారం హడావిడిగా వంట ముగించాను.
కిరణ్, మాలిని లంచ్ కి వచ్చి సాయంత్రం వరకు ఉన్నారు. చాల సరదాగా గడిచింది సమయం. చదువులు నుండి,
మాలిని వాళ్ళ కుటుంబ విషయాల వరకు ఎన్నో సంగతులు మాట్లాడుకొన్నాము.
“అంకుల్, మీకూ కిరణ్ కి చాలా పోలికలున్నాయి.” అంటూ మా వారితో ఎన్నో కబుర్లు చెప్పింది మాలిని.
***
మాలినితో మాట్లాడాలనీ… తన గురించి తెలుసుకోవాలనీ… మా భావాలు, ఆనందాలు, అభిరుచులు తనతో ప్రస్తావిస్తూ… తనవి అడిగి తెలుసుకుంటూ… ఆ తరువాత కూడా కొన్ని సార్లు కలిసాము. ఆప్యాయంగా మాట్లాడేది మాలిని. మా అమ్మాయి నిషి కూడా మాలినిని కలవడానికి ఓ సారి చికాగో నుంచి వచ్చింది. ఇద్దరూ స్నేహితు లయ్యారు. మాలినితో మాకందరికీ సాన్నిహిత్యం ఏర్పడింది.
“అమ్మాయి బాగా నచ్చింది కూడాగా నీకు. కిరణ్ తో ప్రస్తావించి, ఇక వాళ్ళ ఫ్యామిలీని ఆహ్వానించు.” అని మా ఆయన ప్రోత్సహించారు. మనసులు కలిసాయి ఇక మనువులే తరువాయని, సందేహపడకుండా సందేశంతో పాటు మంచి రోజు చూసి
మా ఆతిధ్యాన్ని అందుకోమని మాలిని వాళ్ళ కుటుంబాన్ని ఆహ్వానించాము.
***
కిరణ్ ఆ అమ్మాయికి ప్రపోజ్ చేసి, మా ఇరువురి కుటుంబాల సమక్షంలోనే డైమండ్ ఉంగరం వేలికి పెట్టాడు.
మరి కొంతకాలం సంతోషాలు, సమావేశాలు. కాబోయే వియ్యంకులతో కబుర్లు, కమామీషు. ఉత్సాహంగా
గడిచింది.
మాలిని కుటుంబ పరివారంతో చిరకాల స్నేహితుల్లా మెలిగాను. మాలిని వాళ్ళ అమ్మ లక్ష్మి, నాన్న నారాయణ గారు, మాలిని చెల్లెళ్ళు, అంతా మమ్మల్ని కలవడం ఆనందంగా ఉందన్నారు.
“కిరణ్ లాంటి అబ్బాయి అల్లుడు అవడం మా అదృష్టం. అంతకన్నా ఎక్కువ మీ వంటి అత్తగారు దొరకడం, మాలిని చేసుకున్న పుణ్యం,” అని పొగిడేసింది లక్ష్మిగారు. నారాయణగారు కూడా అంత సంతోషాన్నీ వ్యక్తపరిచారు.
కిరణ్ అంటే ఇష్టపడే అమ్మాయే కాదు, కుటుంబమంతా అభిమానంగా ఉన్నారు. వాళ్ళకీ అబ్బాయిలు లేరు కనుక,
కిరణ్ ని వారి సొంత కొడుకులా భావిస్తారు కూడానని అనిపించింది. ఆ మాటే వాళ్ళతోనూ అన్నాను. కట్నాలు ప్రసక్తే అస్సలు లేదు.
కిరణ్ కి అలాంటి వన్నీ పడవు. మాకూ అంతే. ఇరువురూ సంతోషంగా సంసారం చేసుకొని వందేళ్ళు మంచి జీవితం గడపాలనే తప్ప వేరే ఆలోచన లేదు.
***
ఇక జరగవలసిన కార్యక్రమం నిశ్చితార్దం. ఇక్కడా? అక్కడా? ఏ భోజనం? ఎవరి సాంప్రదాయం? దేవుని గుడిలోనా? కళ్యాణ మండపంలోనా? ప్రశ్నలు, సందేహాలు. సంప్రదింపులు, సన్నాహాలు. వీటన్నిటి నడుమ వచ్చింది వేసవి కాలం. మా ఇంట మొదటి శుభ కార్యానికి అమ్మమ్మ తాతయ్యల దీవెనలుతో పాటు, ఏడుకొండల వెంకన్న ఆశీస్సులు కోసం హైదరాబాద్, తిరుపతి ప్రయాణం పెట్టుకున్నాము.
“ఆంటీ, కిరణ్ తో, మీతో ఇండియా వెళ్ళాలని ఉంది. ప్లీజ్, మీకు కష్టం కాదంటే మీతో పాటే వెళ్ళేలా ప్లాన్ చేసుకొంటాను. అమ్మ వాళ్ళకి అభ్యంతరమే లేదు.” అని మాలిని ఫోన్ చేయడంతో మాలినితో పాటు బయలుదేరాము.
మా కుటుంబంతో, చుట్టాలతో ఆణుకువగా మెదిలింది ఆ అమ్మాయి. సహజంగా ఓర్పున్న పడతిలా తోచింది. కాకపోతే నాలుగు రోజులు జబ్బు పడింది. దగ్గరుండి చూసుకున్నాము నేను, కిరణ్. ఢిల్లీ, ఆగ్రా వెళ్ళడం మానుకొని, తన ఆరోగ్యం తేలికయ్యాక తిరుపతి వెళ్ళాము. దర్శనం బాగా జరిగింది. అందరిని చూసాము, అంతటా తిరిగాము. ఆశీస్సులతో, ఆనందాలతో ఇల్లు చేరాము.
***
నిశ్చితార్దానికి ముహూర్తాలు పెట్టించాము. ఆడ పెళ్లివారి ఊరి కోవెలలో జరప నిశ్చయించాము. కెంపులు చెక్కిన వజ్రాల హారం, పగ్గాల మీద నుండి ప్రత్యేకంగా తెప్పించిన చెంగావి పట్టుచీరతో పాటు అద్దాల గాజులు, జలతారు వోణీలు తయారు చేయించి మాలినికి కానుకులుగా తెప్పించాము. ఆ శుభదినాన… శుభ ముహూర్తానికి… శుభాకాంక్షలతో శివారుల్లోని ఆలయ ప్రాంగణానికి బయలుదేరాము.
మా బంగారుకొడుకు ఉల్లిపొర రంగు టస్సూర్ సిల్క్ దుస్తుల్లో, నుదుట తిలకంతో, చెంపన దిష్టి చుక్కతో… ఉదయించే సూర్యుడిలా వెలిగిపోయాడు. ప్రతినిత్యం వాణ్ణలా అందంగా, ఆనందంగా చూడాలని, మనస్సులోనే దేవుడికి దణ్ణం పెట్టుకొన్నాను.
తాంబూలాలు, కట్నకానుకలు సర్దుకొన్నాము. సపరివార సమేతంగా వడివడిగా కదులుతున్నాము. అంతలో అందింది కోవెల నుండి మాలిని పిలుపు. “ఇదిగో వస్తున్నామే తల్లీ!” అంటూనే ఉన్నాను. అటునుండి అలజడిగా బిగ్గరగా కిరణ్ తో ఫోన్ లో వాదిస్తున్నదని, అదీ గొడవ పడుతున్నట్టు అర్ధమయి అవాక్కయ్యాము. మమ్ముల తోడ్కొని వెళ్ళడానికి వచ్చిన ఆ అమ్మాయి తండ్రి, నారాయణ గారు నచ్చజెపుతున్నా … నా కన్న కొడుకుపై కక్షగా అరుస్తూనే పోయింది ఫోనులో మాలిని.
అదురుతున్న గుండెల్ని అదుపు చేసుకొని అసలు సంగతేమిటా అని వాకబు చేసాము.
మా విడిదిలో, మా పరివారంతో ఉన్నందుకు, ఇక్కడే మా వాడి స్నానాలంకారాలు అయినందుకు, తనని, తన వాళ్ళని ఒక్కింత కూడా లెక్క చేయలేదంటూ అర్ధం లేకుండా మావాడిని నిష్కర్షగా తిడుతూనే పోయింది ఆ అమ్మాయి. అనూహ్యమైన ఈ మాటలకి, చేష్టలకి నా మనసున అశాంతులు చెలరేగాయి. ఉద్వేగంతో దు:ఖం ఆగలేదు, ఆలోచన సాగలేదు.
అదిరింపులు, బెదిరింపులు ఎరుగని వాడు, సుకుమారంగా, రాకుమారుడిలా ఎదిగినవాడు.. నా కంటి దీపం మా కిరణ్. సున్నిత మనస్కుడు వాడు మూగవోయాడు. తనకి తెలిసిన మాలినియేనాని వాపోయాడు.
నారాయణగారు, తనపై కూడా ఫోన్ లో బిగ్గరగా అరుస్తున్న కూతురితో, “సరే, ఇంక శాంతించు, ఆంటీ చాల బాధ పడుతుంది. మేము బయలుదేరుతున్నాము.” అంటూనే… ఇటు మాకూ సర్ది చెప్పి చేతలుడిగిన మమ్మల్ని బయలుదేర దీశారు.
***
ఎంతటి జాణతనం? ఎంతటి జ్వాలతనం? కిరణ్ మనసు మలిన పడకుండా ఏమి చేయాలి? వాడిని ఎలా ఆదు కోవాలి? ఆగని కన్నీటితో కలలోలా కదిలాను. ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. మా వారు నా కన్నీళ్ళకి చలించిపోయారు. మనసు పాడయి జరుగుతున్న కార్యక్రమంలో పాల్గొనలేదు. మాతో వచ్చినా, నిశ్చితార్ద తంతు నుంచి దూరంగా గుడిలోనే ఉండిపోయారు.
నేను మాత్రం కిరణ్ కోసం, వాణ్ని అంటిపెట్టుకొనే ఉన్నాను. నిషి మా వెంటే ఉంది. నిశ్చితార్దం అంటూ జరిగిన కార్యక్రమం… మా వారు అక్కడ లేకుండానే జరిపించారు. ఏమయిందో ఎలా జరిగిందో? మాట మంతీ లేకుండా తిరిగి విడిది చేరుకొన్నాము. ఆ పై ఊరు వెళ్ళిపోయాము. మనస్సు మొద్దు బారిపోయింది. నా ఆలోచనంతా కిరణ్ గురించే. మా జీవితాలు ఎటువంటి మలుపులు తిరుగుతాయో ఇక మీదట అని ఆలోచించి నా తల ముక్కలైపోతుంది.
***
రెండు నెలల వ్యవధి తరువాత, కిరణ్ తన ప్రయత్నాలు మొదలెట్టాడు. కలిసి కూర్చుని, విషయాలన్నీ మాట్లాడుకొని,
ఇరువైపులా పరస్పర అవగాహన తెద్దామని ఆ అమ్మాయిని ఎన్నో మార్లు అడిగాడు. అయినా లాభం లేకపోయింది. ఇంతటి మొండి అమ్మాయితో అసలు జీవితం ఎలా ఉంటుందోనని, కిరణ్ విషయంలో భయం వేసింది.
అంతటితో ఆగని ఆ అమ్మాయి వీరంగం… ‘వటుడు అంతై అంతంతై’ అన్నసామెతగా, తల్లి లాంటి నన్ను దుయ్య బట్టేంత వరకూ వచ్చింది. కిరణ్ కి ఏవో అప్రస్తుతపు మాటలు చెపుతూ, వాడికి నా పై కోపం రావాలని, బాహాటంగానే నన్ను తూలనాడుతూ, మాటల్లోనే కాక లేఖలు కూడా రాసింది. తనంటే ఇష్టపడక, తన కంటే అందం, అంతస్తులున్న కోడలి కోసం నేను ఆరాట పడుతున్నానని, నా మీద అబద్దపు అభాండాలు మోపింది. నా ముఖం చూడనంది, నా ఉనికే వద్దంది.
మా నుండి వాడిని వేరుచేయడమే ఆ అమ్మాయి ధ్యేయమయ్యిందని అర్ధమైపోయింది. మా కిరణ్ కావాలనుకున్నదే దైనా, దేనికైనా వాడికి సంపూర్ణ స్వాతంత్ర్యముందని, అసలు వాడు ఏది చెయ్యాలన్నా మేము వద్దనడం గాని, వాడిని దేనికైనా మభ్యపెట్టడం గానీ, మా పద్ధతే కాదని ఆ అమ్మాయికి తెలియదు.
***
ఇంతా జరిగాక, పరిస్థితుల్లో ఎటువంటి మార్పు లేకుండానే తాను నిర్ణయించిన సమయానికల్లా వివాహం అవ్వాల్సిందే అని నిశ్చయించేసింది మాలిని. నన్ను దూరముంచుతానని నిర్మొహమాటంగా ప్రతిఘ్నలు కూడా చేసింది. పైగా యివన్నీ రాసేది మా వాడికీ, నాకూను. ఇంతటి వెరపు లేనిదనం, తెగింపు, పాపభీతే లేని కరుకుదనం, ఓర్వలేనితనం ఎందుకో? తెలియక నిస్సత్తువయ్యాను, విలవిలలాడాను, వేసారిపోయాను.
మనస్సు రాయి చేసుకొన్నాను. నా మంచితనం, నా న్యాయం నిలుపుకోవాలి. మా పిల్లలికి నేను అన్యాయం చేయలేను. ఏదోలా ఆ అమ్మాయిని మళ్లీ మచ్చిక చేసుకోవచ్చునేమో, మనసు మార్చవచ్చునేమో, నా మీద కలిగిన అయిష్టత, అనుమానం దూరం చేయవచ్చునేమో అని ఆలోచించాను. తను చిన్నపిల్లేగా, మా అమ్మాయి నిషిలానే కదా. తెలియకే ఇలా చేస్తుందేమో అని కూడా అనుకొన్నాను. కిరణ్ మనసు, వాడి సుఖం, సంతోషమే నాకు ముఖ్యం. కనుక మాలిని పుట్టినరోజున, నేనొక్కతినే వెళ్లి ఆ అమ్మాయిని కలవాలని కూడా అనుకొన్నాను.
నా ఒక్కగానొక్క కొడుకు మనసు బాధపెట్టి, ఇలా పోట్లాటలు పెంచి, జీవితాన్ని దుర్భరం కానివ్వదలుచుకోలేదు. కిరణ్ కి తెలుసు నేను ఏం చేసానో, ఎటువంటి మనిషినో, కొడుకుగా నన్ను బాగా తెలుసుకొన్న వాడే. కాకపోతే ఈ గొడవంతా ఎలా సమర్దించాలో తెలియని అయోమయంలో మునిగాడు. మాలిని నన్ను చూడ్డానికి ఇష్టపడలేదని అర్ధమయ్యింది.
అయినా కిరణ్ తో, “కన్నా, నీవే ఎలాగో మమ్మల్ని కలుపు. పెళ్లి చేసేసుకో. అన్నీ సర్డుకుంటాయిలే,” అన్నాను.
వాడి నుండి నాకు వచ్చిన జవాబు నన్ను నిశ్చేష్టురాలిని చేసింది. నేనేరుగని ఓ కొత్త సాంప్రదాయం. ఇక వింత షరతులు విధించి, కాబోయేవాణ్ణి వేధించే ధోరణి అవలంభిస్తుందిట ఆ అమ్మాయి. తలితండ్రులైన మమ్మల్ని తక్షణమే వీడవలెననీ, తనకి అత్తింటి వారి ఉనికే వద్దనీ, లేదేని పెళ్లి జరగదని కిరణ్ కి జేసిందిట మాలిని. పైగా పెళ్లి జరిగే ఛాయలకే, నేను రాగూడదని కిరణ్ కి ఆదేశాలు జారీ చేసిందట కూడా.
వాళ్ళ అమ్మ నాన్నలతో నేను మాట్లాడాలని మెసేజ్ పంపాను. “అంతా నా ఇష్టమే, వాళ్ళ ప్రమేయమే లేదు, కాబట్టి నేనెలా అంటే అలా జరగాలి.” అని జవాబిచ్చింది.
***
గత పాతికేళ్ళగా నా ప్రపంచమే నా పిల్లలుగా ప్రశాంతంగా సాగిన నా జీవన కొలనులో పిడుగులే పేలాయి. ప్రేమతో కట్టుకున్న
ఆశాసౌధాలు కూలాయి. మా బిడ్డని మానుండి చీల్చాలని వేచి ఉన్న ఓ తోడేలులా అనిపించింది, సుకుమారంగా కనబడే విషపూరిత ముళ్ళగులాబి మాలిని.
సుఖసంతోషాల్ని పంచాలనుకోనేవారితో పాటు, వాటిని హరించాలనుకొనే మాలినిలాంటి వారూ ఉంటారు కదా అనుకొన్నాను. ఓపిగ్గా జీవితకాలం పాటు ఆటుపోట్లకి తట్టుకొని, ఏర్పరుచుకున్న జీవన సౌధాన్ని, ఎవరో ఎక్కడినుంచో వచ్చి.. ఆనందాలు హరించి.. కూల్చను ప్రయత్నించగలరు. కూల్చనూ గలరు అనుకొన్నాను. ఈ క్లిష్ట సమస్యనుండి బయటపడే మార్గం అన్వేషిస్తూ, నిత్యం మనస్సు అలిసిపోయేది.
యువతలో పురోగతి, విద్యా విజ్ఞానాలతో పాటు కొందరిలో ఓ తెగింపు, ధిక్కార ధోరణి వల్ల ఇలాటివి జరుగు నేమోనని కూడా అనుకొన్నాను. అస్సలు వివాహబంధంతో ఏర్పడే సున్నితమైన బాంధవ్యాలన్నా, బంధుత్వాలన్నా, బాధ్యతలన్నా ఈ నాటి యువతకి అయిష్టత, అసహనమే అనిపిస్తుంది. అర్ధంకాని ఈ వైనం, విపరీతమైన మాలిని నైజంకి నిర్ఘాంతపోయినా, అయోమయావస్థలో ఉన్న ఆ అమ్మాయిపై జాలి వేస్తుంది.
***
కాలం నత్త నడకలు నడుస్తూ మరో నెల గడిచింది. ఈ మధ్య కిరణ్ బిజీగా ఉంటున్నాడు. చూసి కూడా నెల పైనయింది. శనివారం పొద్దున్నే ఫోన్ చేసి, “ఐ యామ్ కమింగ్ ఇన్ టెన్ మినిట్స్, మీ ఇద్దరితో మాట్లాడాలి,” అన్నాడు కిరణ్. కాస్త ఆదుర్దాగా ఉన్నా, వాడికి ఇష్టమైన ఎగ్ కర్రీ, పూరి చేయడంలో ఉండిపోయాను.
ఓ అరగంటలో వచ్చి, నన్ను, వాళ్ళ డాడిని లైబ్రరీలో కూర్చోబెట్టి ఎదురుగా కార్పెట్ మీద చతికిలబడ్డాడు కిరణ్. మా వంక చూస్తూ, “ఎంతగానో అలోచించి, నేను మాలినితో బ్రేక్అప్ కే డిసైడ్ అయ్యాను. మాలినిది, చాల అసమంజస మైన నడవడి, ఆలోచన అనిపిస్తుంది. నాకు నచ్చలేదు. ఎవరికీ మంచిది కాదు. అందరు అన్హాపీగా ఉండడం బాగా లేదు.” అంటూ పైకి లేచి, ” సో, అదీ సంగతి, నేను కూడా జాబ్ లో బిజీగా ఉండబోతున్నాను. నువ్వు, డాడి ఇక ఏమీ దిగులు పడవద్దు”,
” ఐ యామ్ హంగ్రీ, ఫుడ్ ప్లీజ్,” అంటూ కిచెన్ లోకి దారి తీసాడు కిరణ్.
******

1 thought on “‘డయాస్పోరా జీవన కథనం’ – ముళ్ళ గులాబి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *