May 9, 2024

స్వప్నాలూ , సంకల్పాలూ – సాకారాలు -1

ఒక భారతీయ ప్లాస్టిక్ సర్జన్ జీవిత చరిత్ర
ఆంగ్లమూలం : డా.లక్ష్మీ సలీమ్ ఎం ఎస్. : ఏమ్ సీ ఎచ్
తెలుగు సేత : స్వాతీ శ్రీపాద

1. బాల్యం

అందరి రాతలూ భగవంతుడు రాసే ఉన్నాడని అంటారు.
జీవితంలో ఏదో ఒకటి సాధించాలని అనుకున్నప్పుడు మనకు తెలియకుండానే మన శక్తి అంతా ఆ వైపుకే మళ్ళుతుంది. రసవాది పాల్ కియొహో చెప్పినట్టు “నువ్వు ఏదో ఒకటి సాధించాలని అనుకున్నప్పుడు విశ్వమంతా నీకు సహాయపడేందుకు సమాయత్తమవుతుంది
విజయవాడలో ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టాను. నేను పుట్టినప్పుడు నాన్నకు చాలా కలిసిరాడంతో నాకు లక్ష్మి అని ఆ లక్ష్మీ దేవి పేరు పెట్టారు.
తాతినేని సూర్యనారాయణ మా నాన్నగారు, సివిల్ ఇంజనీరు. ఏడుగురు సహోదరులు . బ్రిటిష్ ప్రభుత్వం సాంక్షన్ చేసిన సివిల్ కాంట్రాక్ట్ పనులు రోడ్లు వెయ్యడం, వంతెనల నిర్మాణం చేసేవారు. ప్రాథమిక నిర్మాణాలకు శిక్షణ పొందిన వృత్తి నిపుణుల అవసరం ఎంతైనా ఉందని ఆయన నమ్మకం.
ఆ నమ్మకం వల్లే పథనిర్దేశకత్వం వహించి విజయవాడలో సివిల్ ఇంజనీరింగ్ , నిర్మాణం, కోర్స్ లకోసం, శిక్షణలో లోపాలు భర్తీ చేసేందుకు స్వతంత్ర్యంగా సాంకేతిక కళాశాలను ప్రారంభించారు. అదొక్కటే కాదు. ఆయన ఆడపిల్లలకు విద్యావశ్యకతను, దాని ప్రాముఖ్యతను గుర్తించి తన స్వగ్రామమైన అంగలూరులో బాలికల కోసమే ఒక ఉన్నత పాఠశాలనూ నిర్మించారు.
మా అమ్మ రాజేశ్వరమ్మ నలుగురు పిల్లలలో పెద్దది. చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకోడం వల్ల అప్పుడే సంరక్షకురాలిగా మారి మిగతా వారిని చూసుకునేది. మాది పెద్ద ఉమ్మడి కుటుంబం అవడంతో అమ్మ సంరక్షకురాలిగా ఇంటికే పరిమితమైపోయింది.
పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలని మా తలిదండ్రుల ఆశ. మా పెద్దన్నలు ఇద్దరూ సైకాలజీ లో, ఆర్గానిక్ కెమిస్ట్రీలో గోల్డ్ మెడల్స్ సంపాదించగా తమ్ముడు వినికిడి సమస్యల నిపుణుడు. మా ఇద్దరక్కలకూ హైస్కూల్ చదువయాక పెళ్ళిళ్ళు చేసేశారు. నేను వారికి పూర్తిగా భిన్నం. ఎన్నో ఉన్నతమైన కలలు నావి. పెళ్ళి అనేది నా దృష్టిలో చివరి ఆలోచన.
నా తలిదండ్రులు దాన్ని ఆమోదించడం నా అదృష్టం.
చాలా మంది పిల్లలు స్కూల్లో చదివే రోజుల్లో బయటకు ఆటలకు వెళ్ళేవారు, బొమ్మలతో ఆడే వారు, చెట్ల మధ్య పరుగులు పెట్టేవారు, లేదా ఇంట్లో అమ్మలు చేసిన పిండివంటలు తింటూ కనిపించేవారు.
నాకు మాత్రం బాల్యం పుస్తకాల మధ్యనే గడిచింది. అందువల్లే కావచ్చు ఒకటో క్లాస్ అవగానే డబుల్ ప్రమోషన్ ఇవ్వడంతో మూడో క్లాస్ కి, మళ్ళీ అక్కడా ఇచ్చిన డబుల్ ప్రమోషన్ కి అయిదో క్లాస్ కి వెళ్ళిపోయాను. ఆ రోజుల్లో స్కూళ్ళలో అలా ఇవ్వడం చాలా అరుదే మరి.
నా వ్యక్తిత్వం మీద ప్రభావం చూపిన సంఘటనలు స్కూల్ రోజుల్లో ఇంకా ఉన్నాయి. అవేమీ నన్ను మరింత మంచి మనిషిగా మార్చలేదు గాని నా వయసుకు మంచీ చెడూ తెలుసుకుని మరింత ఉన్నతంగా మారడానికి, మరికొంత పరిపక్వమవడానికి, ఉన్నత స్థితి ఆశించడానికి ఆస్కారమయ్యాయి. నిజానికి అవి నాకు వ్యతిరేకమనే అనుకోవాలి.
నేను తొమ్మిదో తరగతిలో ఉండగా మా తెలుగు టీచర్ మమ్మల్ని ఏమవాలని ఆశిస్తున్నామో అనే దాని గురించి
వ్యాసం రాయమన్నారు. నేను హృదయం అంతా గుమ్మరించి నా స్వప్నాలు, ఆశయాల గురించి అవసరమైన దానికన్నా
ఎక్కువే రాసాను. టీచర్ గారు పిలవడంతో నన్ను మెచ్చుకుంటారన్న ధీమాతో స్టాఫ్ రూమ్ లోకి వెళ్ళాను.
” లక్ష్మీ, ఈ వ్యాసం నువ్వే రాసావా?” కొంచం కోపంగా పేజీలు తిప్పుతూ అడిగారాయన.
” సర్, అవి నా ఆలోచనలూ , కలలూ. నేనే రాసాను.” అన్నాను.
” నిజంగా ఎక్కడి నుండీ కాపీ చెయ్యలేదు కదా?”
నేను వింటున్నదేమిటో నాకు అర్ధం కాలేదు. కాపీ కొట్టానని నిందించడం వల్ల ఒక రకమైన షాక్ లో ఉన్నాను.
నాకళ్ళవెంట నీటి ధారలు మొదలై నన్ను నేను సమర్ధించుకోడం ఎలాగా అని ఆలోచిస్తున్నాను.
” సర్, నాకు భవిష్యత్తు పట్ల గొప్ప కలలు ఉన్నాయి. నేను డాక్టర్నవాలి, అందులోనూ గొప్ప డాక్టర్ని. నేను ప్రజలకు సాయపడాలి. అవసరంలో ఉన్నవాళ్ళకు సేవచెయ్యాలి. ఆ విధంగా ఆలోచించడం తప్పా? ఈ కాగితాల మీదా ఉన్న ఆ పదాలే సరిగ్గా నేనేమిటో, నేనెవరో, నేనేమవుతాయో చెప్తాయి.”
నేను నా నిజాయితీ నిరూపించుకునే ప్రయత్నంలో ఆ పాటికీ దుఃఖం ముంచుకు వచ్చింది. ఎంతో నచ్చజెప్పాక అది నేను స్వయంగా నిజాయితీగా రాసిన వ్యాసమేనని, ఆయన నమ్మారు.
వ్యాసం ఎంతో గొప్పగా ఉండటం వల్ల నేనే రాసానంటే నమ్మలేకపోయానని అన్నారు. నాకు ఆ వ్యాసానికి క్లాస్ లో అందరికన్నా ఎక్కువ మార్కులు వచ్చాయి.
రెండో సంఘటన నేను పదో తరగతిలో ఉన్నప్పుడు జరిగింది. ఉన్నట్టుండి మా బోధన తెలుగు మీడియం నుండి ఇంగ్లీష్ మీడియంకి మార్చారు. తెలుగులో చదువుకునే మాకందరికీ ఇది పెద్ద సవాలుగా మారింది. అదీ ముఖ్యంగా మాకు బయాలజీ చెప్పే టీచర్ అమెరికన్. ఆమె ఉచ్చారణ అర్ధం చేసుకోడం కష్టంగా ఉండేది.
మరోసారి క్లాస్ లో చాలా తక్కువ మందిలో నేనూ చాలా శ్రమపడి ఆమెను అర్ధం చేసుకోడం, నోట్స్ రాసుకుని ఆమె చెప్పేది నా సహ విద్యార్ధుల కోసం తెలుగులోకి అనువదించడం చేసేదాన్ని. ఇది మళ్ళీ నన్ను ఇబ్బందుల్లోకి నెట్టింది. పదాలు వాక్యాలు ఒకేలా ఉండటం వల్ల నేను నా క్లాస్ మేట్ అసైన్మెంట్ కాపీ చేస్తున్నానని అభియోగం.
నాకు చాలా కోపమూ వచ్చింది, కలవరపెట్టింది కూడా. నేనేం చేసినా నాకు తిట్లు తప్పవని అనిపించింది. ఇది జరిగాక ఒక వారం మొత్తం నేనెవరితోనూ మాట్లాడలేదు. ప్రతివాళ్ళూ నా అసాధారణ ప్రవర్తన గమనించారు. మా హెడ్ మిస్ట్రెస్ నన్ను ఆవిడ ఆఫీస్ రూమ్ కి పిలిచి అనునయిస్తున్నట్టుగా మా బయాలజీ టీచర్ మిసెస్ వాల్టర్స్ పొరబాటు పడ్డారనీ నా మామూలు స్వభావం, ఇతరులకు సాయపడటం మానవద్దనీ చెప్పారు. ఆ తరువాత మా బయాలజీ టీచర్ కూడా నాతో మాట్లాడేందుకు మా ఇంటికి వచ్చే శ్రమ తీసుకున్నారు.
ఈ రెండు సంఘటనలు బహుశా నా వ్యక్తిత్వం గురించి నన్ను నేను ప్రశ్నించుకునేలా చేసినా నన్ను నేనుగానే ఉండేలా నాలో ఏ మార్పునూ తేలేకపోయాయి. అవే నన్ను మరికొంత దృఢంగా మార్చాయి.
నా బాల్యంలో మరో ఆసక్తి కలిగించే దశ, నేను పుట్టుకతో హిందూ మతస్థురాలినైనా కిస్టియన్ మిషినరీ స్కూల్లో చదువుకున్నాను. అక్కడ మేం రోజూ ఉదయం స్కూల్ అసెంబ్లీ సమయంలో బైబిల్ నుండి ఉల్లేఖించిన మాటలు చదివేవాళ్ళం. హిందువునై ఉండి క్రిస్టియన్ స్కూల్లో శిక్షణ పొందటం భవిష్యత్తు నాకోసం సిద్ధంగా ఉంచిన జీవితానికి, సలీమ్ తో ముడిపడనున్నదానికి ఒక సూచికలా అనిపించింది.
భగవంతుడు మనందరి రాతలూ రాసే ఉంచుతాడని అంటారు.
నాకోసమూ భగవంతుడు ప్లాన్ చేసి పెట్టాడని, నా జీవితంలో పెద్ద పాత్ర పోషించే నమ్మకాలు, మత సంఘర్షణలను ఎలా ఎదుర్కుంటాను అనేది అప్పుడు నాకెంత మాత్రమూ తెలియదు.
స్వప్నాల వినువీధిలో విహరించటం ఎప్పుడు మానవద్దు.

ఇంకా వుంది…

1 thought on “స్వప్నాలూ , సంకల్పాలూ – సాకారాలు -1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *