April 27, 2024

సినీ బేతాళ కథలు – తోలు మనసులు

రచన:- డా. కె.వివేకానందమూర్తి

విక్రమార్కుడు మళ్లీ బేతాళుడి శవాన్ని తన భుజం మీద వేసుకుని, విసుగు చెంద కుండా తెలుగు సినిమాలు పదే పదే చూస్తున్న ప్రేక్షకుడిలా, నడక సాగించాడు.
‘విక్ర! మార్గమధ్యంలో నీకు విసుగు, శ్రమ అనిపించకుండా యింటర్వెల్ యివ్వ కుండా మరో కథ చెబుతాను విను.’ – అని బేతాళుడు ప్రారంభించాడు –
“అమలాపురంలో బొబ్బర్లంక బుజ్జిబాబుకి వొక లాడ్డింగ్ హోటలుంది. దానికి ఏ స్టార్స్ లేకపోయినా ఫైవ్ స్టార్ హోటల్ అని పేరెట్టుకున్నాడు. పేరుకి ఫైవ్ స్టార్ హోటలైనా ఔట్ డోర్ షూటింగ్కి కోనసీమ కొచ్చే స్టార్సంతా అక్కడే దిగేవారు. వారితో బాటు నిర్మాతలు, దర్శకులు, మిగతా క్రూ అంతా కూడా అక్కడే మకాం.
అప్పుడెప్పుడో ‘తోలు మనసులు’ షూటింగ్ కోసం ఆ షెడ్యూల్కి కావల్సిన నటీ నటవర్గం, టెక్నిషియన్లు అంతా బొబ్బర్లంక స్టార్ హోటల్ కి వెళ్లారు. వారితోబాటు తొలి షూటింగు ప్రారంభానికి సంరంభంగా పూజ నిర్వహించేందుకు, కూడా ఘనాపాటి మరియు పరమ నిష్టాగరిష్టుడైన వాత్స్యాయన శాస్త్రిగార్ని కూడా తీసుకువెళ్లారు. ‘త’ కింద ‘స’ పలకడం, ‘స’, కింద ‘య’ పలకడం, కష్టం అనిపించి అంతా ఆయన్ని వాస్తాయన శాస్త్రి, వాళ్లాయన శాస్త్రి, వానశాస్త్రి, వాతస్సా పంతులు అని రకరకాలుగా పిలిచేవారు.
బొబ్బర్లంక బుజ్జిబాబు, అప్పుడే తన హోటల్లోకి అడుగుపెట్టిన తెలుగు తెర తెమ్మెరలను చిరునవ్వుతో ఆహ్వానిస్తూ పలకరించాడు. వాత్స్యాయన శాస్త్రిగారు కాస్త లేటుగా వచ్చారు వచ్చి, బుజ్జిబాబుని ‘ఏవయ్యా! నీ హోటల్లో ఏర్పాట్లన్నీ సదుపాయంగా వున్నాయా?’ అని అడిగారు.
‘బలేవోరేనండి! మాది తారు వొటేలు ఇక్కడ అన్నీ వున్నాయి’ అన్నాడు. ‘అన్నీ’లో ఎన్నో సంకేతాలు సంధిస్తూ, ‘సరేమరి’ అని వాత్స్యాయనుడు రిసెప్షన్ కేసి చూశాడు. అక్కడ రంభలా రంజుగా పిటపిటలాడే యవ్వన శిఖరాల్తో నాగులమ్మ కూర్చుని శాస్త్రిగారి మీదికో చిరునవ్వు విసిరింది. ఆ నవ్వుకి ఆయన చలనచిత్రం గురించి మరిచిపోయి అచలన చిత్తుడై చితైపోయాడు.
అన్ని స్టార్ హోటల్స్ రూమ్స్ లో బైబిల్, శ్రీమద్భగద్గీత, ఖురాన్ పుస్తకాలు బెడ్ సైడ్ టేబిల్ మీద పెడతారు. బొబ్బర్లంక బుజ్జిబాబు మాత్రం శ్రీకృష్ణ భక్తుడు కావడంవల్ల భగవద్గీత పుస్తకం వొక్కటే పెట్టాడు.
మధ్యాహ్నం వాత్స్యాయనంగారికి బుజ్జిబాబు మళ్లీ ప్రత్యేకంగా చెప్పాడు- ‘సొత్తుల్లుగారు – యిక్కడన్నీ, అన్నీ వున్నయ్. దేనికీ మొగమాటం వొద్దు. మన సినేమా వోల్లప్పుడొచ్చినా యిక్కడే దిగుతారు. మన హోటల్కి సినేమా వాడకం యెక్కువ మీరు పూజేస్తే యిక తిరుగేలేదు’ అని. రూమ్లో దిగిందగ్గర్నుంచీ మన సినిమాశాస్త్రిగారికి ఒకేవొక ఏకాలోచన ఆయన మెదడులో మంత్రాలన్నిటినీ మూలకి తోసేసింది. స్థిమితం కోసం కాసేపు అక్కడున్న భగవద్గీత పుస్తకంలో కొన్ని శ్లోకాలు, యింతకు ముందు అతిధులు రాసిన అమూల్యమైన అభిప్రాయాలు చదివాడు.
సాయంకాలమైంది. కోనసీమ కొబ్బరిచెట్లు, గోదావరి తెలుగుదనానికి వెలుగు ప్రతీకలై విచ్చలవిడిగా అందాల సందోహం చేస్తున్నాయి.
వాత్స్యాయన శాస్త్రిగారికి తోచడంలేదు. తన రూమ్ విడిచి రిసెప్షన్ దగ్గరికి వెళ్లాడు. రిసెప్షనిస్టు యిష్టంగా స్మైలింది. శాస్త్రిగారు సశాస్త్రీయమైన మందహాసం బదులిచ్చారు. అంతకంటే మించి వారి మధ్య డైలాగుల్లేవు. బైట కొబ్బరిచెట్లగాలే బిజి యమ్. ఆయన పైకి తన రూమ్ లోకి నడిచారు. రిసెప్షనిస్టు నాగులమ్మ ఆయన్ని అనుస రించింది. ఇద్దరూ రూమ్లో చెరో కొబ్బరి బొండాం తాగారు. శాస్త్రిగారన్నారు- ” అన్నట్టు – నీ పేరేమిటన్నావ్?”
నాగులమ్మ – “ఏవన్లా – నాగులమ్మ!”
వాత్సాయన – “-ఆఁ- నాగులూ, నాకు సంగీతం అంటే యిష్టం. మరి నీకు?”
“నాకూ యిట్టవే?”
“నీకే పాట యిష్టం”
“శానా పాటలే ఉన్నయ్- అయ్యన్నీ నాకు లైకింగులే కానీ వింటి పాటలు – పాతయి- బాగా లైకింగు! ”
“ఏదీ ఓ పాట చెప్పు”
“పాట సెప్పడవేంటి – పాడతారు- మాటసెపుతారు. పాట పాడుతారు. “.
“ఏవిటది?”
“అల్లెప్పుడో వచ్చిందీ – అదీ – జెనక్ ఔనక్-”
“అదా – ఝనక్ ఝనక్ పాయల్ బాజ్ నా- ఆ పాట నాకూ యిష్టమే.”
“మరయితే ఓ పాలు పాడతారేటి?”
“నాకూ రాదు పాట – అదేవన్నా మంత్రోచ్చారణా?”
“బలె బలే – మనిద్దరికీ పాటరాదు మాటా యీకు’
“సత్యం పలికితివి. మన మాట వీకు. పాటసలే రాదు కనుక రాగం రానీకు. ”
“మరేటి సేద్దాం. యాక్షనా? ”
“సత్యం పలికితివి. యాక్షనే యిప్పుడు మన టివటివ కర్తవ్యం.”
“టివటివ? ఆదేటో
“అది అనుభవైక వేద్యమేగాని, చెప్పనలవికాదు”
“అయితే కస్సేప్పొయాక సెబుదురుగాని -‘
“అలాగే- అలాగే – ”
కాసేప్పోయింది.
నాగులమ్మ అడిగింది – చీర సర్దుకుంటూ- “శాత్తులుగారూ! నాకో సిన్న డౌటు.”
“ఏవిటి?” – అడిగారు వాత్స్యాయన శాస్త్రిగారు పంచె సరిచేసుకుంటూ,
“మీరు యేదాలు సదూకున్నోరు. బేదాలు తెలిసినోరు. పయిత్తరంగా వుంటారు. మరిలా సీసేసారు. కరసీనా అని దేవుడు అడగడా?”
“పిచ్చిదానా! మన క్రియలో యే వక్రంలేదు. యీ మాట శ్రీ భగవద్గీతలోనే
చెప్పబడింది.”
“నిజమా! భగద్గీత నాను సదవలా గానీ, అలా అందులో సెప్పడం నమ్మసెక్కంగా లేదు”
“నీకా అనుమానం అక్కర్లేదు. ఇదుగో భగవద్గీత పుస్తకం యిక్కడే వుంది. నీకు చదవడం వచ్చుగా నీ కళ్లతో నువ్వే చూడు.”
“మా కోనసీమలో అందరికీ సదవడం వొచ్చు. వూరకే మన సినేమా టైల్లో మాటాడ్డం యాబిట్టయిపోయింది. మరేం సేత్తాం
సినేమాలు తీసే, రాసే నాకొడుకుల పెభావం.. ఎదీ! ఆ భగద్గీతలో యెక్కడ రాసుందో సూపియ్యండి”
“ఇదిగో – నీ కళ్లతో నువ్వే చూసి చదువుకో” అని వాత్స్యాయన శాస్త్రి అక్కడున్న భగవద్గీత పుస్తకం తెరిచి, మొదటి పేజీ చూపించారు.
ఆ పేజీలో అంతకు ముందు ఆ రూమ్లో దిగిన సినిమా గెస్టెవరో పెన్నుతో రాసిన వాక్యాలున్నాయి యిప్పుడు చెప్పు విక్రమార్కా! ఏవిటా వాక్యాలు? ఈ ప్రశ్నకు నువ్వు తెలిసే బదులు చెప్పకపోయావో నాగులమ్మ అంద సంబంధమైన ఆలోచనలో తట్టుకోలేక, నీ తల వెయ్యి చెక్కలై, ఆ చెక్కలు యింకా ముక్కలై, చుక్కల్లో కలిసిపోతుంది.” అని బేతాళుడు ముగించాడు.
అందుకు విక్రమార్కుడు “ఓ! బేతాళ నాగులమ్మ ఆ పుస్తకంలో వాక్యాలు యిలా చదివింది ఈ హోటల్లో వోనర్ చెప్పినట్టుగా ‘అన్నీ’ వున్నాయి. రిసెప్షనిస్ట్ అదుర్స్! అబ్జెక్షన్స్ అన్నీ అవతల పారేసి గెస్టుకి బెస్టు టైమిస్తుంది. అవకాశం వదులుకోవద్దు ఆయాసం ఆనందం కలిపి తరించండి. ‘
చదివాక “యీడెవడో యేదయాసుడు.. అని భగవద్గీత పుస్తకం వాత్స్యాయన శాస్త్రి చేతిలో పెట్టి, ‘శానా టయిమయినట్టున్నాది. కిందుండాలి నేను. ఏ కట్టమరొత్తాడో ఏటో’ అని నాగులమ్మ రూమ్ వదిలి రిసెప్షన్ డెస్క్ వంక కదిలింది.
అవ్యక్తాత్ వ్యక్తయస్సర్వాః ప్రభవన్త్యహరాగమే | రాత్ర్యాగమే ప్రలీయన్తో తతైవా
వ్యక్త సంకే||
బ్రహ్మకు పగలు త్రిలోకాలందున్న సమస్త వస్తువులు చతుర్ముఖ బ్రహ్మ శరీరమునుండి పుట్టుచున్నవి. అట్లే ఆ బ్రహ్మకు రాత్రి రాగానే ఆ దేహమునందే లీనమగు చున్నవి- అన్నారోయ్ గీతాచార్యులు శ్రీకృష్ణభగవానుడు” అని బదులు పలకగానే, రాజుకి మౌనభంగం కలిగి బేతాళుడు అర్జంటుగా యెగిరి వెళ్లి చెట్టెక్కేసి, కొమ్మ చివరకి పాకి కోనసీమదాకా చూడసాగాడు.

*****

1 thought on “సినీ బేతాళ కథలు – తోలు మనసులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *