May 2, 2024

పూల సంకెల

రచన: నండూరి సుందరీ నాగమణి

ఆ రోజు వాట్సాప్ లో వచ్చిన మెసేజ్ చూడగానే శ్రీధరరావుకి నవనాడులు క్రుంగిపోయినట్టు అయిపోయింది. అలాగే పడక్కుర్చీలో వాలిపోయి, చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ లో కొడుకు నుంచి వచ్చిన మెసేజ్ లోని ఆ ఫోటో వంక అదేపనిగా, వెర్రిగా చూడసాగాడు.
“ఏమండీ, వంట ఏం చేయను?” అంటూ హాల్లోకి వచ్చిన రుక్మిణి ఆయన పరిస్థితి చూసి, గాబరాగా “ఏమైందండీ?” అని చేయి పట్టుకుని కుదిపింది.
“ఆ… అబ్బే… ఏం లేదు రుక్కూ… ఏం లేదు… అలా ఆ ఫ్యాన్ కొంచెం స్పీడ్ పెంచు…” కొంచెం నీరసంగా అన్నాడు శ్రీధరరావు.
ఆవిడ గబగబా ఫ్యాన్ రెగ్యులేటర్ మాగ్జిమమ్ స్పీడ్ కి పెట్టి, త్వరత్వరగా గ్లాసుతో, మంచినీళ్ళు తీసుకొని వచ్చి ఆయనతో తాగించింది.
నుదుటి మీదినుంచి ధారాపాతంగా కారుతున్న చెమటలను తుడుచుకుంటూ, ఆమె ఇచ్చిన గ్లాసెత్తి మంచినీళ్ళు గటగటా తాగేసాడు శ్రీధరరావు.
కంగారుగా చూస్తున్న భార్యతో, “ఏంలేదు రుక్కూ… ఇదిగో ఈ విషయం చూసి జీర్ణించుకోలేక పోయాను…” అంటూ మొబైల్ లోని ఆ ఫోటో చూపించాడు.
అమెరికాలో ఉంటున్న రెండవ కొడుకు మోహన్ పంపిన మెసేజ్ అది. ఆ ఫోటోలో మోహన్ కూతురు, తమ మనవరాలు అయిన ఆశ్రిత పెళ్ళికూతురి అలంకరణలో ఉంది. అయితే పక్కనే ఉన్న పెళ్ళికొడుకు మాత్రం శ్వేతజాతీయుడు. అదే శ్రీధరరావును కలవరపరచిన విషయం.
“ఏమిటి, ఆశ్రిత పెళ్ళి అయిపోయిందా? మనకు తెలియకుండానే?” బాధగా అంది రుక్మిణి.
“అవును. మనకి తెలియజేయాలన్న ఇంగితం వీడికి లేకపోయింది. మన ముద్దుల మనవరాలి పెండ్లి… ఎవరితో జరిగిందో చూడు రుక్కూ!” అప్రయత్నంగా ఆయన కళ్ళల్లోకి నీళ్ళు వచ్చాయి.
“ఎప్పుడైతే వాడు అమెరికా వెళ్ళి సెటిల్ అయ్యాడో అప్పుడే నేను ఇలాంటివి ఊహించానండీ. కాకపోతే పెళ్ళి కబురు మనకి తెలియజేయలేదని బాధగా అనిపించింది.” అన్నది.
“నీకేమైనా మెంటలా? అది చేసుకున్నది అమెరికన్ ని…” గట్టిగా అరిచాడు శ్రీధరరావు.
“మనిషి మంచివాడైతే చాలు, మనవరాలిని బాగా చూసుకుంటే చాలు, అతడు ఎవరైతేనేం?”
“రుక్కూ! మనం హిందువులం… మనది హిందూమతం… ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావు?” ఆయన ఆగ్రహం కంఠంలో చిందులు వేస్తోంది.
“మరి హిందూదేశంలోనే ఉంచకుండా వాడిని పై చదువుల నిమిత్తం ఎందుకు అమెరికా పంపించారు?” తానూ గట్టిగా అన్నది రుక్మిణి.
“అయితే? సంప్రదాయాన్ని మంటగలుపుతాడని కలగన్నానా?”
“ఇప్పుడేమైంది? దానికి పెళ్ళి అయింది… వరుడు ఎవరు అనేదాన్ని పెద్ద విషయంగా ఆలోచించకుండా, మంచివాడైతే చాలని అనుకోండి. దాని పెళ్ళికి మీరు ఇవ్వాలనుకున్న కానుక ఏదో వాడికి డబ్బు రూపంలో పంపించేయండి…” అనునయించింది రుక్మిణి.
“నా వల్ల కాదు. నేను ఇది జీర్ణించుకోలేను… పెద్దాడు ఇంగ్లాండ్ లో సెటిల్ అయ్యాడు. మనం చూసిన బంధువుల సంబంధాలే అక్కడి వాళ్ళవి తన కొడుక్కీ, కూతురుకి చేసాడు… వాడికీ పెడబుద్ధులు లేవు… ఇక్కడ విరాజ్, అక్కడ మోహన్…” ఆయన గొంతు రుద్ధమైంది.
“విరాజ్ ఏం తప్పు చేసాడు? మీ అక్క కొడుకును మీ కొడుకులా పెంచారు. తనకి ఇష్టమైన పెళ్ళి చేసుకున్నాడని ఇంట్లోంచి పొమ్మని అన్నారు. వాడూ ఢిల్లీలో ఉద్యోగం రావటంతో వెళ్ళిపోయాడు మనకి దూరంగా… ఇంకా వాడి మీద కోపం మీకెందుకు?”
రుక్మిణి వైపు నిరసనగా ఓ చూపు చూసి, తల తిప్పుకున్నాడు శ్రీధరరావు.
“సరే, కోపాలు ఆపి, వెంటనే మోహన్ కి మెసేజ్ చేయండి. మనవరాలికి, కొత్త మనవడికి ఆశీస్సులు అని వ్రాయండి…” ఆయనకి నచ్చదని తెలిసినా తన వంతుగా చెప్పేసి, అక్కడినుండి వెళ్ళిపోయింది రుక్మిణి.
***
రుక్మిణి, శ్రీధరరావులకు మాధవ్, మోహన్ ఇద్దరే సంతానం. ఇద్దరినీ బాగా చదివించారు. పెద్దవాడికి అతని కంపెనీ వాళ్ళే లండన్ లో తమ బ్రాంచ్ ఓపెన్ చేసి, అక్కడికి డిప్యుటేషన్ మీద పంపించి, తరువాత అక్కడే పర్మనెంట్ చేసారు. రెండో వాడు ఇంజనీరింగ్ పూర్తి చేయటంతో ఎమ్మెస్ చదవటానికి అమెరికాకి పంపించాడు శ్రీధరరావు.
మోహన్ చదువు పూర్తి చేసి, అక్కడే ఉద్యోగం సంపాదించుకున్నాడు. తల్లిదండ్రులు చూసిన సంబంధమే చేసుకున్నాడు. ఏడాదికి ఓసారి ఇద్దరు కొడుకులూ కుటుంబంతో కలిసి ఇండియా వస్తారు.
తల్లిదండ్రులతో ఒక నెలరోజులు గడిపి తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు. పాతికేళ్ళుగా ఇది వారికి మామూలైపోయింది.
తన అక్కయ్య మరణిస్తూ తన చేతిలో పెట్టిన విరాజ్ తానే మరో తండ్రి అయ్యాడు, శ్రీధరరావు. అప్పటికి పదవ తరగతి చదువుతున్న విరాజ్ ని తన ఇంట్లోనే ఉంచుకుని, చదివించాడు. డిగ్రీ పూర్తి చేయగానే మంచి ఉద్యోగం సంపాదించుకున్న విరాజ్ కి ఆఫీస్ క్వార్టర్స్ అలాట్ అయ్యాయి.
ఉద్యోగులంతా క్వార్టర్లోనే ఉండాలని నియమం ఉండటంతో మేనమామను, మేనత్తనూ తనతో రమ్మని అడిగాడు విరాజ్. అలవాటైపోయిన ఇంటిని వదిలి వెళ్ళటం ఇష్టం లేక, అతనితో వెళ్ళటానికి ఇష్టపడలేదు శ్రీధరరావు. విరాజ్ తన క్వార్టర్స్ లోకి కొద్ది సామానుతో వెళ్ళిపోయాడు.
తమకు ఎంతో సన్నిహితంగా మెలిగే విరాజ్ అంటే రుక్మిణికి చాలా ప్రేమ. ఏడెనిమిదేళ్ళు తమతో ఉన్న పిల్లవాడు ఉద్యోగం సంపాదించుకుని, వెళ్ళిపోవటంతో ఇల్లంతా ఖాళీ అయినట్టు తోచి ఎంతో వెలితిగా అనిపించింది. మేనమామ కన్నా అత్త దగ్గరే అతనికి చేరిక ఎక్కువ. ఇంట్లో ఉన్నంతసేపూ ‘అత్తా… అత్తా…’ అని కొంగు పట్టుకుని తిరుగుతూ, పనిలో కూడా చాలా సాయం చేస్తూ ఉండేవాడు.
తన కొలీగ్ రుచిత అనే అమ్మాయితో ప్రేమలో పడ్డాడు విరాజ్. ఈ విషయాన్ని రుక్మిణి దగ్గర చెప్పి, రుచితను ఆమెకు చూపించి, ఆమె ఆశీర్వచనం కూడా పొందాడు.
రుక్మిణి ఆ విషయం శ్రీధరరావుతో ఇప్పుడే చెప్పవద్దని, సమయం చూసి, నిదానంగా చెప్పవచ్చని విరాజ్ తో అనటంతో సరేనన్నాడు. రుచిత గుజరాతీ అమ్మాయి అయినా, హైదరాబాద్ లోనే పుట్టి పెరిగింది. మాతృభాషతో పాటుగా తెలుగు, ఆంగ్లం, హిందీ అనర్గళంగా మాట్లాడుతుంది. ఆమెకు పెద్దలంటే గౌరవం, ఆదరాభిమానాలు ఎక్కువని ఒకసారి చూడగానే గ్రహించింది రుక్మిణి.
ఓనాటి రాత్రి అకస్మాత్తుగా రుచిత తండ్రి చనిపోయాడు. ఆయనకి రుచిత ఏకైక సంతానం కావటంతో ఆమెను, ఆమె తల్లిని అలా వదిలెయ్యలేక, ధైర్యం చేసి, శ్రీధరరావుకు రుచిత విషయం చెప్పి, ఆమెను ఇంటికి తీసుకుని వచ్చి, పెళ్ళికి అనుమతి అడిగాడు, విరాజ్. శ్రీధరరావు కోపం నసాళానికి అంటింది. తమ కులం కాని, రాష్ట్రం కాని, భాష కాని అమ్మాయిని ప్రేమించినందుకు అనేకరకాలుగా విరాజ్ ని దూషించాడు. తన పెద్దరికాన్ని మంట గలిపేసిన కృతఘ్నుడని నిందించాడు.
రుక్మిణి మాత్రం బీరువాలోంచి ఒక చిన్న నగలపెట్టె తీసుకుని వచ్చి, రుచిత చేతిలో పెట్టింది. “ఇది మీ అత్తగారు వెళ్ళిపోతూ, తన కోడలికి ఇవ్వమని నా చేతుల్లో పెట్టింది. తీసుకోమ్మా… ఇద్దరూ కలకాలం పిల్లాపాపలతో హాయిగా ఉండండి…” అని బొట్టు పెట్టి, ఇద్దరికీ కొత్తబట్టలు పెట్టి ఇంటినుంచి సాగనంపింది. కోపం ముంచుకు వస్తున్నా, ఏమీ చేయలేక మౌనంగా ఉండిపోయాడు, శ్రీధరరావు.
విరాజ్, రుచితల వివాహం సింపుల్ గా స్నేహితుల సమక్షంలో జరిగిపోయింది. తరువాత అతనికి, రుచితకు ఢిల్లీకి బదిలీ అవటంతో రుచిత తల్లిని కూడా తీసుకుని, భార్యతో అటు వెళ్ళిపోయాడు విరాజ్. ఇది జరిగి నాలుగేళ్ళు అయింది.
***
రెండు రోజుల తరువాత –
“హాయ్ గ్రాండ్ పా…” సాయంత్రపు నడక ముగించుకుని, ఇంటికి తిరిగి వచ్చిన శ్రీధరరావుకు ఎదురువచ్చి మరీ విష్ చేసాడు, మూడేళ్ళ బుడతడు ఒకడు. ఆ బాబును చూస్తూ, లోపలికి వచ్చి, కాళ్ళు, చేతులు కడుక్కుని కూర్చున్నాడు.
తనకు కాఫీ అందిస్తున్న రుక్మిణితో, “చాలా ముద్దుగా ఉన్నాడు ఎవరీ అబ్బాయి?” అన్నాడు వాడి బుగ్గలు మీటుతూ… “ఆ… మా బంధువుల అబ్బాయిలెండి… ఒక రెండురోజులు ఉంటాడు ఇక్కడ…” జవాబు చెప్పింది రుక్మిణి.
“తాతగాలూ… మనం ఆలుకుందామా?” ఆయన ఒళ్లోకి ఎక్కిపోతూ అడిగాడు ఆ బాబు.

“అలాగే, ఆడుకుందాం. ఇంతకీ నీ పేరేమిటి బాబూ?”
“చీదల్…” ఉలిక్కిపడ్డాడు శ్రీధరరావు. “మీ పేలూ చీదలే కదా… ఈ అమ్మమ్మ చెప్పింది.” కిలకిలా నవ్వాడు చిన్న శ్రీధర్.
“కానీ ఇంత్లో తింకూ అంతారు!”
“తింకూనా?” అయోమయంగా చూసాడు, శ్రీధరరావు. “తింకూ కాదు తింకూ.” సరిచేసాడు చిన్న శ్రీధర్.
“టింకూ కదా నాన్నా…” అపురూపంగా చూస్తూ అన్నది రుక్మిణి.
“అవునమ్మమ్మా… తాతా… లంది, మనం ఆలుకుందాం…” అతని చేయి పట్టి లాగి, కింద పరచిన బొమ్మల దగ్గర కూర్చోబెట్టాడు, టింకూ.
***
మరో అరగంట తరువాత వాడికి అన్నం తినిపించి, పడుకోబెట్టింది రుక్మిణి.
“ఇప్పుడు చెప్పు రుక్కూ, ఎవరీ పిల్లవాడు? విరాజ్ పోలికలు బాగా కనిపిస్తున్నాయి…”
“అవును, వాడి కొడుకే. వాళ్ళిద్దరూ వీడిని సాయంత్రం వదిలేసి ఊరికి వెళ్ళారు. వారం దాకా రారు…” ఆయనకు కంచంలో భోజనం వడ్డిస్తూ చెప్పింది రుక్మిణి.
“ఇక్కడికి వచ్చారా? ఎలా ఉన్నారిద్దరూ?” ఆయన కంఠంలో తొణికిసలాడుతున్న ఆరాటాన్ని గమనించినా గమనించనట్టే,
“వాళ్ళిద్దరికీ ఇక్కడికి మళ్ళీ ట్రాన్స్ఫర్ అయిందట. వాడి మామగారిల్లు ఖాళీ చేయించి, ఇక అక్కడే ఉంటారట. క్వార్టర్స్ ఖాళీ లేవట… రుచిత వాళ్ళమ్మగారూ వీళ్ళతోనే ఉంటారు కదా… ఆవిడ అన్నగారికి బాగాలేదంటే ఆమెను తీసుకుని మైసూరు వెళ్ళారు. పిల్లవాడు నలిగిపోతాడని నేనే వీడినిక్కడ వదిలేయమని అన్నాను…” చెప్పింది రుక్మిణి. ఆయన ఏమీ మాట్లాడలేదు.
భోజనాలు పూర్తయి, టీవీలో వార్తలు చూస్తూండగా, “ఏమైనా, మీ ఆడవారి పెంచిన ప్రేమలే వేరు…” అన్నాడు ఉన్నట్టుండి. “అర్థం కాలేదు…” అన్నది రుక్మిణి.
“విరాజ్ ది, నాది రక్తసంబంధం. కానీ నీది పెంచిన ప్రేమ అయినా, అదే గెలిచింది. వాడికి నువ్వు అండగా నిలబడ్డావు, కానీ నేను దూరంగా పెట్టాను. పిల్లలంటే ఎంత ప్రేమ ఉన్నా, ఈ కులాంతరాలు, మతాంతరాలూ అంగీకరించలేని మౌఢ్యముంది నాలో… నన్ను దాటి వెళుతున్నారు అనే అహంకారం కూడా… వాటిని నేను జయించలేకపోతున్నాను.” ఎటో చూస్తూ అన్నాడు.
“ఏదో అతిథుల్లా వచ్చారు. మళ్ళీ అలాగే వెళ్ళిపోతారు వీడిని తీసుకుని. ఎక్కువగా ఆలోచించకుండా, ఇక మందులు వేసుకుని పడుకోండి…” మృదువుగా చెప్పింది రుక్మిణి.
***
టింకూకి కొత్తనేది లేకపోవటం వలన రుక్మిణి, శ్రీధరరావులకు బాగా మాలిమి అయిపోయాడు. ముఖ్యంగా శ్రీధరరావుకు వాడితోనే లోకం అయిపోయింది. వాడితో ఆడుతూ, పాడుతూ ఆయనా చిన్నపిల్లాడైపోయాడు.
విరాజ్ తన కొడుక్కి తన తండ్రి పేరు, రుచిత తండ్రి పేరు కాకుండా శ్రీధర్ అని తన పేరు పెట్టటం ఆయనకి ఎంతో ఆశ్చర్యంగానూ, ఆనందంగానూ అనిపించింది. ఇప్పుడు ఆ పిల్లవాడు టింకూ ఎవరో పరాయి పిల్లయిన రుచిత కొడుకని అనిపించకుండా, తన స్వంత మనవడు అన్న భావన వచ్చేసింది.
మైసూరునుంచి వచ్చిన వెంటనే కొడుకుని తీసుకుని వెళ్ళటానికి వచ్చిన విరాజ్, రుచిత శ్రీధరరావుకు పాదాభివందనం చేసారు. వారిని అక్కున చేర్చుకుని కన్నీరు కార్చాడాయన. విరాజ్ ని దూరం చేసుకుని ఎంత కోల్పోయాడో అర్థమైంది ఆయనకి.
“ఇక్కడే ఉండిపోండ్రా, మాతోనే… అమ్మా రుచితా, మీ అమ్మగారు కూడా మాతోనే ఉంటారు… వేరే ఇల్లు ఎందుకు?” “ఇక ఇక్కడే ఉంటాము కదా మామయ్యా… రెండురోజులకోసారి వస్తూనే ఉంటాము.” ప్రేమగా ఆయనను కౌగలించుకున్నాడు విరాజ్.
“బై తాతా… ఈసారి నాకు బొంగలం ఆత నేర్పాలి, చరేనా?” వెళుతూ వెళుతూ టింకూ అన్న మాటలకు హాయిగా నవ్వాడు శ్రీధరరావు.
ఆ రాత్రి, మొబైల్ చేతిలోకి తీసుకుని, పెళ్ళికూతురు పేరున కొంత డబ్బు ట్రాన్స్ఫర్ చేయటానికి ఉపక్రమించాడు, శ్రీధరరావు.
“వీధి చివర శంకరం షాపులో ఉంటాయి…” ఉన్నట్టుండి అన్నది రుక్మిణి.
“ఏమిటవీ?”
“బొంగరాలు… ఆదివారం వస్తాడు మనవడు… తెచ్చి ఉంచుకోండి. శ్రీధర్లిద్దరూ బొంగరాల ఆట ఆడాలిగా…” అన్నది గలగలా నవ్వేస్తూ. ఆమె నవ్వులో శ్రుతి కలిపాడు శ్రీధరరావు.

***

(సమాప్తం)

1 thought on “పూల సంకెల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *