May 2, 2024

బాలమాలిక – రెప్లికా

రచన: మీనాక్షి శ్రీనివాస్

‘పిల్లలూ, దేవుడూ చల్లని వారే,
కల్లకపటమెరుగనీ కరుణామయులే’
దూరంగా మైక్ లో వస్తున్న పాటను మోసుకొస్తున్న గాలి వంటగదిలో సాయంత్రం చిరుతిండి కోసం సతమతమవుతున్న అలివేణి చెవిని హాయిగా సోకింది.
ఎప్పటి పాట, అసలు ఆ పాటలో సుశీల గొంతులో ఆ భావం, ఆ మాధుర్యం… ఓహ్! ఒకప్పుడు జనాల్ని ఉర్రూతలూగించిన పాట కదూ.
కానీ ఇప్పుడు పిల్లల్లో ఆ సున్నితత్వం, అమాయకత్వం ఉంటున్నాయా!
తన ప్రశ్నకు తనే ఉలిక్కిపడింది. ఉంటాయి ఎందుకుండవూ, కానీ వాటిని వాళ్ళలో లేకుండా చేస్తున్నది మనమే కదూ!
అంతలోనే కాలింగ్ బెల్ మోగింది. చేతిలో పని వదిలి అలివేణి పరిగెత్తేలోపే తలుపులు అసహనంగా బాదేస్తున్నాడు.
ఇంకెవరూ తన సుపుత్రుడు, గారాల పట్టి.
గబగబా తలుపు తీస్తూ…
“నాన్నా! ఏమిటా తొందర? రావాలా! ఒక్క నిముషం ఆగలేవూ!” విసుగునణచుకుంటూ సాధ్యమైనంత మార్దవంగా అంది.
కానీ శ్రీకర్ తల్లిని ఏమాత్రం పట్టించుకోకుండా, యథాతథంగా స్కూల్ నుంచి రాగానే పుస్తకాల సంచీ సోఫాలో విసిరేసి, షూస్ పీకి చెరోవైపూ పడేసి, బట్టలైనా మార్చుకోకుండా గదిలో దూరి తలుపేసేసుకున్నాడు.
“ఒరే! శ్రీ, ముందు ఆ పుస్తకాల సంచీ, జోళ్ళు చక్కగా పొందికగా ఓ వార పెట్టి, స్నానం చేసి, ఏదైనా తిని అప్పుడు కూర్చోరా!” తల్లీ యథావిధిగా మొత్తుకుంది.
“అబ్బా! ఎందుకే అలా అరుస్తావు. పదో తరగతికి వచ్చాడు వాడికి తెలీదా చెప్పు. అయినా ఏదో రోజు వాడే తెలుసుకుంటాడులే”
అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చి ఆఫీస్ బేగ్, లాప్ టాప్ సోఫాలో పడేసి, షూస్ విప్పి అక్కడే పడేసిన శ్రీపతి విసుగ్గా అన్నాడు.
“హూ! ఏమిటి తెలుసుకునేది! పెళ్లయినప్పటి నుండీ చెబుతున్నా మీకే నేర్పలేక పోయాను. ‘చెప్పీ చెప్పీ నోరు నెప్పెడుతోంది’ కానీ ఇసుమంత మార్పు మీలోనే తేలేకపోయాను. మనల్ని చూసే పిల్లలూ నేర్చుకుంటారు. ఇంక మీ ఇద్దరినీ మార్చడం ‘నా వల్ల అవదేమో!’ ఉసూరుమంటూ అవన్నీ తీసి ఎక్కడివక్కడ పెడుతూ నిస్ప్రహతో అంది అలివేణి.
“అబ్బా! మొదలుపెట్టావా! ఇలా చచ్చీ చెడీ రాగానే సుప్రభాతం వినిపించద్దని నీకూ చెబుతున్నా మన పెళ్ళైనప్పటి నుంచీ, నువ్వు మానావా? మారావా? కాసిని చల్లని నీళ్ళు తగలేయ్ నా ముఖాన…” విసుగ్గా సోఫాలో కూలబడుతూ అన్నాడు.
“ఇదిగో!” అక్కడే టీపాయ్ మీద ఉంచిన చల్లటి నీళ్ళు గ్లాసులో పోసి అందిస్తూ అంది.
శ్రీపతి అవి అందుకోకుండా చెయ్యి జాపి ఆ కాపర్ వాటర్ బాటిల్ అందుకుని ఎత్తి గటగటా తాగేసాడు.
అలివేణి నిస్పృహగా చూసింది.
ఆమెకు నచ్చనిదీ, చెప్పి చెప్పి విసుగెత్తినవాటిలో ఇది కూడా ఒకటి.
‘అలా సీసాతో తాగడం వద్దు, బాగుండదూ, మళ్ళీ అదే సీసాలో నీళ్ళూ అందరూ తాగుతారు, గ్లాసుతో తాగ’మని ప్రతి రోజూ, ప్రతి సారీ మొత్తుకుంటుంది. కానీ వినేదెవరూ? తండ్రీ పిల్లలూ కూడా చక్కగా రెండు చెవులూ ఉపయోగించుకుంటారు.
అలివేణి పద్ధతైన మనిషి. అన్నీ పొందికగా, పద్ధతిగా చేస్తుందీ, అందరూ అలాగే చేయాలనుకుంటుంది.
“ఏమైనా పెట్టేదుందా, కనీసం కాఫీ అయినా ఇస్తావా? లేకపోతే ఇలా సూక్తులతో కడుపు నింపుతావా?” విసుగ్గా అడిగాడు.
వస్తున్న నిట్టూర్పును అణుచుకుంటూ వంటింట్లోకి నడిచింది.
తను మాత్రం కష్టపడడం లేదా, ఇంకా ఆయన చక్కగా బైక్ మీద వస్తాడు. తను రెండు బస్సులు మారి, ఆ రద్దీలో అంత దూరం నుంచి వస్తుంది. ఏం చెప్పినా అలాగే మాట్లాడతాడు, అక్కడికి తనేదో హాయిగా ఇంటిపట్టునే కూర్చున్నట్టు.
పిల్లాడికి పరీక్షలు దగ్గర పడుతున్నాయని తను సెలవు పెట్టింది కాబట్టి ఈ సమయంలో ఇంట్లో ఉంది.
తనలో తనే అనుకుంటూ ఓ ప్లేట్ నిండా పకోడీలు, ఓ చేత్తో కాఫీ తీసుకుని వచ్చింది.
అంతలోనే ధడేల్ మని గది తలుపు తెరుచుకుని వంశోద్ధారకుడు వచ్చేసాడు. వాసన తగిలినట్టుంది, “హేయ్ పకోడీలా!” అంటూ.
వస్తూనే తండ్రి పక్కన కూలబడి ప్లేట్ మీద దండయాత్ర మొదలుపెట్టాడు.
కనీసం కాళ్ళూ, చేతులైనా కడుక్కోకుండా అలా తింటున్న ఆ తండ్రీ కొడుకుల్ని చూడలేక అలివేణి అక్కడ నుంచి వెళ్ళిపోయింది.
‘పిల్లలు చెప్పినది వినరు, మనం చేసేదే చూస్తూ, అనుకరిస్తూ, ఆచరిస్తూ పెరుగుతారు.
మనం చేసేది ఒకటీ, చెప్పేది ఒకటీ అయితే వాళ్ళు మాత్రం ఎందుకు వింటారు?
వాళ్ళు పద్ధతుల్లో అయినా, బుద్ధుల్లో అయినా తల్లితండ్రులకు నకలు… ప్చ్! ఈ విషయం ముందు పెద్దవాళ్ళకు అర్థం అయితే అప్పుడు పిల్లలకు తెలుస్తుంది.’ అనుకుంటూ తనకు కాఫీ, పిల్లాడికి పాలూ తెచ్చుకు కూర్చుంది.
తను ఇదే మాట ఎన్నో సార్లు చెప్పింది అయితే విసుక్కుంటాడు, లేదంటే ‘అలా అయితే నువ్వు పద్ధతిగా ఉంటావుగా మరి అవెందుకు రాలేదూ’ అంటూ నవ్వేస్తాడు.
‘ఎవరికైనా చెడు ఎక్కినంత సులభంగా మంచి ఎక్కుతుందా నా పిచ్చి కానీ’ అనుకుంటూ మౌనంగా కాఫీ తాగసాగింది అలివేణి.
***

1 thought on “బాలమాలిక – రెప్లికా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *