May 2, 2024

స్వప్నాలూ, సంకల్పాలు, సాకారాలూ – 8

రచన: డా. లక్ష్మీ సలీం
అనువాదం: స్వాతీ శ్రీపాద

18. ఒక సంఘటనాత్మక శీతాకాలం

అది మంచు కురిసే క్రిస్మస్ సమయం. మాకంటే ఎక్కువ అమ్ము ఈ పండుగ సందడిని ఆనందిస్తోంది. శాంటా నుండి తనకు కావలసిన బహుమతుల పట్టిక నిర్దాక్షిణ్యంగా రాసింది. సలీం క్రిస్మస్ పార్టీలకు వెళ్తూంటే, నేను అమ్ముతో ఇంట్లో ఉండిపోయాను. అలాగని నాకు పెద్ద బాధగా కూడా లేదు.
ఒకప్పుడు సలీం గురించి ఎలా అనుకునేదాన్నో ఇప్పుడలా అనిపించడం లేదు. అతని పట్ల వస్తున్న వ్యతిరేక భావనలు వదిలించుకునే శక్తినిమ్మని, మనసావాచా ఎప్పటిలా అతన్ని ప్రేమించగలిగేలా ఉండనిమ్మని దేవుడిని వేడుకునేదాన్ని. కాని ఎక్కడో -లోలోపల నాలోని ఒక భాగం ఇదివరలో నేనతన్ని ప్రేమించినంతగా ప్రేమించలేకపోతోంది. అలాగని అది ద్వేషం కాదు, కాని ఒక స్త్రీకి పురుషుడికీ మధ్యన ఉండవలసిన అనుబంధం వ్యామోహం, కోరిక లేకపోడం.
కాలమే నా గాయాన్ని మాన్పుతుందని అనుకున్నాను. ఫిబ్రవరిలో మా పెళ్ళి రోజును ప్రశాంతంగా జరుపుకున్నాము.
1980 లో ఒక రోజు ఉదయం నా మెడమీద ఒకపక్కన నిమ్మకాయంత వాపు కనిపించింది. నేను దాన్ని డాక్టర్ తో పరీక్ష చేయించుకోవాలనుకున్నాను. మర్నాడు దానికి బయాప్సీ చేయించమని డాక్టర్ సలహా. ఆ హాస్పిటల్ గురించి నాక్కొంచం భయంగా ఉండటంతో సలీం నేను ఇదివరకు పనిచేసిన హాస్పిటల్ లో ఒక కన్సల్టెంట్ ను చూసేందుకు అపాయింట్మెంట్ తీసుకున్నాడు. అది కేవలం మామూలు గడ్డే కావచ్చని నేనెంత నొక్కి చెప్పినా లింఫోమా చాన్సెస్ కూడా కావచ్చని అతని భయం.
సలీం సర్జరీ గురించీ, రాబోయే బయాప్సీ రిపోర్ట్ గురించి కొంత భయపడ్డాడు. అందువల్ల అమ్ముని, ఇంటిని చూసు కుందుకు సెలవుపెట్టి ఇంట్లో ఉండిపోయాడు. అతనికి థియేటర్లోకి వచ్చేందుకు అనుమతినివ్వలేదు. ఆ ఉదయం మొట్ట మొదలు సర్జరీ చేసినది నాకే. నాకు స్పృహ వచ్చేసరికి అమ్ముతో పాటు సలీం నా బెడ్ పక్కన ఉన్నాడు. అమ్ము నా చేతిని పట్టుకుంది. అంతా సవ్యంగానే ఉందనీ ఇహ మనం ఇంటికి పోవచ్చనీ చెప్పాడతను. అమ్మును దగ్గరగా లాక్కుని ఏదైనా సవ్యంగా లేకపోయినా కనీసం నన్ను మరికొన్నేళ్ళు అమ్ముతో ఉండనిమ్మని భగవంతుడిని వేడుకున్నాను. సలీం కన్నీళ్ళు దాచుకుందుకు తలతిప్పుకున్నాడు. మర్నాడు ఇంటికి వెళ్ళాను, ఇంకా బయాప్సీ రిపోర్ట్ కోసం ఎదురు చూస్తూ.
సలీం ఎమర్జన్సీ వర్క్ కోసం వెళ్ళవలసివచ్చింది. నాకు చాలా నీరసంగా ఉంది అయినా స్నానం చెయ్యాలి. కాని బాత్ టబ్ లోకి వెళ్ళాక ఎందుకో అసౌకర్యంగా అనిపించింది. అమ్మూను పిలిచాను. ఆ చిన్న మెదడుకు నాకు సహాయం కావాలని దానికి అర్ధమైంది. తన చిన్ని చిన్ని చేతులతో ఒళ్ళురుద్దుకుందుకు డ్రెస్ వేసుకుందుకు సాయపడింది.
నేను నా రిపోర్ట్ కోసం సిటీ హాస్పిటల్ కి వెళ్ళాను. ప్రతివాళ్ళకీ రిలీఫ్ నిస్తూ అందులో ఒట్టి గడ్డ( ట్యూబర్క్యులార్ మాస్) అనే వచ్చింది. తొమ్మిది నెలలు యాంటీ ట్యూబర్క్యులర్ మందులు వాడాలని చెప్పారు. నేను విశ్రాంతిగా ఉండేందుకు హాస్పిటల్ జాబ్ మానేసాను.
వారాంతాల్లో సలీం నన్ను, అమ్మును సిటీలో తిప్పేవాడు. నా మూడ్ మార్పులను మర్చిపోయేందుకు ఆ లాంగ్ ట్రిప్స్ ఉపయోగపడేవి. నేను డ్రైవింగ్ పాఠాలు తీసుకోడం మొదలుపెట్టాను, వర్క్ చేస్తే వెళ్ళడం ఈజీగా ఉంటుందని. నేను ఇంట్లో ఉండటంతో అమ్ము క్రెష్ కి వెళ్ళడం లేదు. ఆగస్ట్లో రోడ్డుకు ఆ వైపున ఉన్న్ స్కూల్లో చేర్చాము.
కొంచం తేరుకున్నాక ఒక రోజున, డా. పార్క్స్ కి కాల్ చేసాను. ప్లాస్టిక్ సర్జరీ డిపార్ట్మెంట్ లో ఏదైనా ఖాళీ ఉందా అని అడుగుదామని. ఆగస్ట్ లో రొటేషన్ ప్రోగ్రామ్ లో చేరమని అతను సూచించాడు. అమ్మూ స్కూల్ దగ్గరలో ఉంటుంది గనక సలీం అదే హాస్పిటల్ లో పని చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. సర్జరీ డిపార్ట్మెంట్ లో కన్సల్టెంట్ లు ఇద్దరికీ సలీం నైపుణ్యత మీద, అనుభవం మీద గొప్ప నమ్మకం ఉండటంతో అతను ఆనందపడేలా మేజర్ సర్జరీలు అతనితో చేయించే వారు.
ఆగస్ట్ లో అల్స్టర్ హాస్పిటల్ ఫ్రాక్చర్ విభాగానికి పోస్ట్ చేసారు. అక్కడ వాళ్ళు ఆర్థోపెడిక్స్ ని చూసేవారు. తేలికపాటి పనే ఉండేది నాకు. కాని నేను ఆ జాబ్ అంగీకరించినా పొద్దున్నే లేచి రెండు బస్ లలో ప్రయాణించి వెళ్ళడం కష్టం గానే ఉండేది. అమ్మూ స్కూల్ దగ్గరలో ఉండటం, సలీం కోసం తప్ప మిగతాదంతా భరించడమే. మేం లిస్బన్ లో ఆసుపత్రికి దగ్గరలో ఒక చిన్న అపార్ట్మెంట్ కి మారిపోయాం.
కన్సల్టెంట్లు నాతో బాగానే ఉండేవారు, వారితో పనిచెయ్యడం నాకు ఆనందాన్నిచ్చేది. ఎలాగో ఆర్నెల్లు గడచిపోయాయి. మందులు సమయానికి వేసుకుని బాగా తినేలా శ్రద్ధ తీసుకున్నాను. థొరాసిక్ సర్జరీలో, కాలిన గాయాల విభాగంలో సంయుక్తంగా నాకోసం ఒక ప్రత్యేక మైన పోస్ట్ సృష్టించడం వల్ల నేను నా స్పెషాలిటీతో టచ్ లో ఉండగలిగాను. థొరాసిక్ సర్జరీలో కన్సల్టెంట్ లు ఇద్దరూ ఎంతో అర్ధం చేసుకుని నా ప్లాస్టిక్ సర్జరీ పుస్తకాలు చదువుకుందుకు నాకు సమయాన్ని ఇచ్చేవారు. కేవలం కాలిన గాయల వార్డ్ లో కన్సల్టెంట్ తో ఉండి చూసుకుంటూ సర్జికల్ సహాయానికి మాత్రమే పిలిచేవారు.
త్వరలోనే నా డ్రైవింగ్ లైసెన్స్ రాడంతో నేనే డ్రైవ్ చేసుకుని హాస్పిటల్ కి సరైన సమయానికి చేరుకోగలుగుతున్నాను. ఎప్పుడూ రేడియో ఆన్ లో ఉంచుకుని ప్రసిద్ధి చెందిన టెర్రీ వాగన్ షో వింటూ వెళ్ళేదాన్ని. ఒక రోజున మోటర్ వే లో డ్రైవ్ చేస్తున్న ఒక స్త్రీ దాదాపు నన్ను గుద్దేసిందనే అనుకున్నాను. ఆవిడను తప్పించుకుందుకు బ్రేక్ వేసి రోడ్ షోల్డర్ మీద ఆపాను. దాని వల్ల నా కారు గుండ్రంగా తిరిగి ఫాస్ట్ లైన్ లో ఆగింది.
ఆ సమయాన ఏం జరుగుతోందో నాకు తెలియదు కాని స్టీరింగ్ వీల్ మీద తల ఆనించాను. ఆ స్త్రీ క్షమార్పణ చెప్తోంది. ఒక్కసారి కారు దిగి కింద అడుగుపెట్టాక తెలిసింది, నాకు గాని , కారుకు గాని ఏమీ అవలేదు. రష్ సమయం గనక నా వెనక ఎన్నో కార్లు ఆగిపోయాయి.
క్షణాల్లో తేరుకుని కారు వెనక్కు తిప్పుకుని నా డ్యూటీకి వెళ్ళిపోయాను. నేనీ సంఘటన నా కొలీగ్స్ కి చెప్పినప్పుడు నమ్మలేకపోయారు. ఏ మాత్రం గాయపడకుండా కారుకి ఏమీ కాకుండా ఒక్క గీతా లేకుండా ఎలా తప్పించుకోగలిగానో అని. ఒక విషాదాంతంగా ముగియవలసిన ప్రమాదం ఒక అద్భుతంగా రక్షించుకోగలగడం నిజంగా ఒక మాయే.
మనకు ఏం జరగాలి అనేదానికి ఒక భగవంతుడు తప్ప మరెవ్వరూ బాధ్యులు కారు అని అనుకున్నాను. ఆ రోజు నన్ను రక్షించినందుకు ఎంతగానో కృతజ్ఞతలు చెప్పుకున్నాను. నేను గ్రహించగలిగినది –
అతను సృష్టికర్త -బ్రహ్మ
అతను ఉద్ధారకుడు, పోషకుడు- విష్ణువు
అతను లయకారుడు- నిర్మాణాత్మక లయకారుడు -శివుడు
ఇది సలీం ను అపసెట్ చేస్తుందేమో నని అతనికి చెప్పలేదు. కాని మోటర్ వేలో ఉన్న మా మిత్రులలో ఒకరు సలీంకి నేనెలా ఉన్నానో తెలుసుకుందుకు కాల్ చేసారు. సలీం ఎంతో వర్రీ అయి మళ్ళీ ఫ్రీ వేలో వెళ్ళద్దని చెప్పాడు. కాస్త ఎక్కువ సమయం తీసుకున్నా టౌన్ లో వెళ్ళే దారి లో వెళ్లమని చెప్పాడు. అతని కోరిక అంగీకరించాను. కాని కొన్నాళ్ళకు మాత్రమే. త్వరలోనే ఫ్రీ వే లో ప్రయాణం మొదలెట్టాను.
అపాయలనుండి రక్షణ కోసం మనం ప్రార్ధించవద్దు కాని వాటి నిర్భయంగా ఎదుర్కొనే అభయం కోరదాం –
రబీంద్రనాథ్ టాగూర్.

19. నేను కన్న కల

వేసవి ఆగమనంతో వేడి పెరుగుతోంది. అమ్మూ స్కూల్ కి వేసవి సెలవలు. దానితో గడపడానికి ఒక వారం సెలవు తీసుకున్నాను. అది సస్నేహంగా ఉండే పిల్ల, ఎంతోమందిని ఇట్టే స్నేహితులుగా చేసుకుంది. వాళ్ళ తలిదండ్రులు నాకు మిత్రులయారు కూడా.
ఒక సాయంత్రం, ఉన్నట్టుండి నేను సాయంత్రం వచ్చే మిత్రులకోసం వంట చేస్తుంటే నా ముందు ఎన్నో దృశ్యాలు. సలీం ని పిలిచి నా కలలు అతనితో పంచుకున్నాను.
“సలీం, ఈ ఐ ఆర్ ఏ జనం ఎవరో నాకు తెలుసు, వాళ్ళ పేర్లు తెలుసు, వాళ్ళ మొహాలు నాకు తెలుసు. వాళ్ళకు ఫండ్స్ ఎక్కడి నుండి వస్తాయో కూడా నాకు తెలుసు.”
“ఏమైంది నీకు ఇలా మాట్లాడుతున్నావు?” అతను వర్రీ అవుతూ అడిగాడు.
“నీకు తెలుసుగా ప్రిన్స్ చార్లెస్ పెళ్ళి చేసుకోబోతున్నాడు. జులై 29 అతని పెళ్ళి రోజు” నేను నిర్వికారంగా చెప్పాను.
చిత్రం ఏమిటంటే ఏ మీడియాలోనూ ఈ తేదీని ప్రకటించలేదు. సలీంకి నా మాటలు, నేను వింతగా అనిపించి ఇవన్నీ మాట్లాడటం ఆపమన్నాడు. నా మనఃస్థితిని చూసి నేను అనారోగ్యంగా ఉన్నానని మిత్రులకు కాల్ చేసి చెప్పి డిన్నర్ కాన్సిల్ చేసాడు.
నేనూ సలీం అమ్ముతో కలిసి వాకింగ్ కి వెళ్ళాం. నేను మా భవిష్యత్తు గురించి అతనికి ఎన్నో ఏవేవో చెబ్తూనే ఉన్నాను. ఆ రాత్రి నన్ను నిద్రపుచ్చడాని సలీం ఎంతో కష్టపడ్డాడు.
ఆ రాత్రి నాకొక కల వచ్చింది. నాకొక సుపుత్రుడు ప్రాప్తిస్తాడని పోప్ జాన్ పాల్ నన్ను అశీర్వదించినట్టు. నేను వెనక్కు ఇంటికి వెళ్ళి పెద్ద హాస్పిటల్ కట్టుకుంటాననీ, ఒక పుస్తకం కూడా వ్రాస్తాననీ, అమ్మును చక్కని భారతీయ వనితగా ఎర్రని పెళ్ళి బట్టల్లో చూస్తాననీ కాని పాశ్చాత్య ప్రపంచపు లాభాలూ అది పొందగలదనీ, వీటన్నింటిలో దేవుడు నాకు మార్గదర్శకంగా ఉంటాడనీ.
ఇంకా ఎన్నో విషయాల గురించి నాకు ఒక ముందు చూపు ఉండేది.మార్గరేట్ థాచర్, పోప్ జాన్ పాల్, పిన్స్ చార్లెస్
భారతదేశ పర్యటన- ఇలా. మర్నాడు ఈ విషయాలు సలీంకి చెప్తే అతను మరింత వర్రీ అయి మానసిక వైద్యుడిని వచ్చి నన్ను ఇంటి వద్దే చూడమని కోరాడు. అతనిచ్చిన పిల్స్ నన్ను మత్తుగా ఉంచేవి.
సలీం వర్రీ అయి, ఒంటరిగా బాధపడి నన్ను మాంచెస్టర్ లోని డా. హనుమంతరావుగారి ఇంటికి తీసుకెళ్ళాడు. అక్కడ ఇరవై నాలుగ్గంటలూ నాకు పిల్స్ ఇచ్చారు. సలీం, హనుమంతరావు, అతని భార్య కుమారి కూడా విశ్రాంతి లేని పని, ఇంటి మీద బెంగ , ఒత్తిడి నన్నిలా పిచ్చిదాన్ని చేసాయని అనుకున్నారు. సలీం ఇహ కొన్నాళ్ళు సెలవు తీసుకుని భారత దేశంలో గడిపి రావాలని నిశ్చయించుకున్నాడు. మేం టికెట్స్, కొన్ని బహుమతులు కొనుక్కుని సీదా ఇంటికి బయలు దేరాం.
మా మా తలిదంద్రులతో కొన్నాళ్ళు గడిపాము. జులై మూడో వారంలో లగాన్ వాలీ తిరిగి వచ్చాం. ప్రిన్స్ చార్లెస్ , లేడీ డయానా రాచరికపు పెళ్ళి వేడుకలు మిస్ అవదలుచుకోలేదు. భారతదేశంలో ఉండగా రెండేళ్ళ తరువాత విజయవాడలో స్వయంగా ప్రాక్టీస్ పెట్టడం గురించి చర్చించుకున్నాము.
నా కుటుంబానికి అద్దె ఇచ్చి మా ఇల్లు హాస్పిటల్ గా వాడుకోవాలని అనుకున్నాము. నేను పుట్టిన సూర్యాభవన్ లో ఆరంభించమని మమ్మల్ని వాళ్ళు ప్రోత్సహించారు.
లగాన్ వాలీ తిరిగి వచ్చాక రాయల్ వెడ్డింగ్ చూస్తూ, మేం ముగ్గురమే, అమ్ము అయిదో పుట్టిన రోజు జరుపుకున్నాము. అది వింతే కావచ్చు గాని బాగా దగ్గరి వాళ్ల పెళ్ళిలానే అనిపించింది.
తిరిగి మా డ్యూటీ మొదలుపెట్టాం, సలీం అదే హాస్పిటల్ లో. నాకు మాత్రం కాలిన గాయాల యూనిట్ లో రొటేషన్. ముఖ్యంగా ఇద్దరం పని చేస్తున్నాం గనక ఒక బేబీ సిట్టర్ అమ్మాయిని కుదుర్చుకున్నాము. గెయిల్, అమ్మూ బాగా కలిసిపోయారు.ఎంత ఆలస్యమైనా గెయిల్ ఎదురు చూసేది. మేం తరచూ ఆ అమ్మాయిని ఇంటి దగ్గర దింపి వచ్చే వాళ్ళం.
నా యాంటీ ట్యూబర్క్యులార్ ట్రీట్మెంట్ ముగిసింది, బాగా తిని విశ్రాంతి తీసుకుని మెరుగుపడ్డాను.
జీవితం గురించి నాకు వేదాంత ధోరణి అలవడింది. జీవితపరమార్ధం మొదలైన విషయాలు. దానితో ఒక అమ్మగా, భార్యగా, డాక్టర్ గా ఎవరినీ నొప్పించకుండా నా బాధ్యత ఏమిటో తెలిసి వచ్చింది. భగవంతుడి పట్ల నా విశ్వాసం పెరిగి నన్ను నా గమ్యం వైపు నడిపిస్తుందని తెలుసుకున్నాను. నా భవిష్యత్తు నాకు దర్శనమైంది.
అప్పుడే నేను తెలుసుకున్నాను, జీవితంలో ముందుకు సాగాలంటే నేను సలీంను హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా క్షమించాలి.
జాన్ గ్రే ” వై మార్స్ అండ్ వీనస్ కొలాయిడ్” అనే పుస్తకంలో శాస్త్రీయ, వైద్యపరమైన విజ్ఞానంతో దానికి ఆధారమయే విషయ సేకరణతో వివరించినట్టుగా స్త్రీ , పురుషులు ఒక పరిస్థితికి ఎలా వేరు వేరుగా స్పందిస్తారు అనేది నేను అర్ధం చేసుకున్నాను తెలుసుకున్నాను.
ఒక స్త్రీ మెదడులో చాలా పెద్ద కార్పస్ కొలోసమ్, (నరాల మోపు) ఉంటుంది. అది కుడి ఎడమ మెదడును
అనుసంధానిస్తుంది. రెండు వైపుల మెదడు మధ్య లింక్ ఏర్పరచే అనవసరపు వాదన మగవారిలో 25% తక్కువగా
ఉంటుంది. అందుకే స్త్రీల లాగా పురుషులు భావోద్వేగాలకు ఆలోచనలకు అనుసంధానమవరో ధృవీకరిస్తుంది.
స్త్రీలలో రెండువైపుల మెదడు మధ్యన ఉన్న బలమైన అనుబంధం వారిని ఎన్నో పనులు ఒకసారి చేసేలా చేస్తుంది. ఆమె వింటూనే ఆలోచించగలదు, గుర్తుపెట్టుకోగలదు, అనుభవించగలదు ప్లాన్ చెయ్యగలదు, అన్నీ ఒకే సమయంలో.
పురుషులు మాత్రం విషయ సేకరణ, భావోద్వేగం, అనుభూతి వేరు వేరుగా చూస్తారు.
స్త్రీ పురుషుల మెదడు ఆకృతులే వేరు. మగవారిలో 6.5 % గ్రే మాటర్ స్త్రీలకన్నా ఎక్కువగా ఉంటుంది. స్త్రీలలో 10% వైట్ మాటర్ పురుషుల కన్నా ఎక్కువ. అందువల్లే ఇద్దరూ వేరు వేరు పనుల్లో రాణించేది.
అది మనసులో ఉంచుకుని సలీంతో ఏకమై రెండో సారి గర్భవతినయ్యాను. అది కొంత భయంగానే అనిపించేది. కొన్నాళ్ళ క్రితం వచ్చిన నా కల నిజం కాబోతున్నందుకు. కాని అది ఆనందించవలసిన సమయం కూడా మేం నలుగురం మా కుటుంబం కాబోతున్నందుకు.
చాలా రోజుల తరువాత సెలెబ్రిటీల గురించి నా కలలో చూసిన విషయాలు, భారత దేశం సందర్శించటం నిజం కాబోతున్నాయని తెలుసుకున్నాను.
ప్రేమా ఆకర్షణ అనేవాటికి మనం దాసోహం అవుతాము. జీవితం లోతైన అర్ధం. అది అల్పమైనది. అంతే.-
ఫ్రెడ్ నైప్.

20. ప్రశాంతతకు ఒక అబ్బాయి
తొలిసారిలాగే ఇప్పుడు నా పని నేను చేస్తూనే ఉన్నాను. శీతాకాలం మొదలైంది. అలాగే ఆ సమయంలో వచ్చే నా అనవసర భయం కూడా. ప్లాస్టిక్ సర్జన్లు మమ్మల్ని క్రిస్మస్ విందులకు ఆహ్వానిస్తున్నారు. అలాటి ఒక పార్టీలో నేను గర్భవతిని అనీ ఏప్రియల్ నుండి పదివారాలు ప్రసూతి సెలవులో వెళ్తాననీ ప్రకటించాను. నా చెకప్స్ కోసం రాయల్ విక్టోరియా ఆసుపత్రికి వెళ్ళేదాన్ని. కొంచం నీరసం తప్ప, అంతా బాగానే ఉంది. అమ్ము నాకు నీరసం తగ్గడానికి సాయం చేసేది, ఇహ కొన్ని వారాలే పనికి వెళ్ళేదని గుర్తు చేస్తూ.
ఒక రోజున యాంటీ నేటల్ విభాగం నుండి నాకు అత్యవసర కాల్స్ వచ్చాయి, నా హిమోగ్లోబిన్ 8 గ్రాములే ఉందని, వెంటనే వెళ్ళి వారిని కలవాలనీ. ఆ గర్భస్థ స్థితిలో చాలా మంది భారతీయ వనితల్లో ఇది మామూలే. నాకది అసాధారణం అనిపించలేదు. కాని వాళ్లను కలిసాక ఆరోజు నుండే విశ్రాంతిగా ఉండాలని చెప్పారు. అమ్మయ్య అనుకుని నిట్టూర్చాను. ఒక అమ్మగా, భార్యగా అమ్ముతో సలీంతో ఇంట్లో ఉండటం నాకు ఆనందాన్నిచ్చింది. సలీంను పరీక్షలకు బాగా శ్రద్ధ పెట్టమని ప్రోత్సహించాను. ఇదివరలో అతను విజయవంతం కాలేకపోయాడు, కనీసం సమ్మర్లో బాగా చేస్తాడని నా ఆశ. నేనెప్పుడూ అతని వెనకాల ఉండి ముందుకు నెడుతూనే ఉన్నాను.
వారాలు గడిచి శారీరిక ఇబ్బంది పెరిగినా అమ్మును , దాని మిత్రులను స్విమ్మింగ్ పూల్ తీసుకు వెళ్తూనే ఉన్నాను.
ఆ రోజు మే ఆరు. ఏదో రాజకీయ కల్లోలం వల్ల గొడవలు దాడులు జరగవచ్చని ట్రాఫిక్ డైవర్ట్ చేసారు. క్రితం ఏడాది ఇదే రోజున బాబీ సాండ్స్ అనే ఖైదీ నిరాహారదీక్ష చేస్తూ జైల్ లో మరణించాడు. కాథలిక్ తల్లికి ప్రొటస్టెంట్ తండ్రికి పుట్టినా ఐంగ్లండ్ నుండి ఉత్తర ఐర్లండ్ విడిపోవాలని కోరుతూ జైలు పాలయి అత్యంత అహింసాత్మకంగా జరిగిన గొడవల్లో అతని కోరికలు నెరవేరని కారణంగా నిరాహారంతో మరణించాడు.
ఇది మహాత్మా గాంధీ సంస్మరణే.
అమ్ము డాన్స్ క్లాస్ ఒకటి జరుగుతున్నప్పుడు నాకు అసౌకర్యంగా అనిపించింది. సలీం వచ్చే వరకూ చూద్దామనీ ఈ లోగా క్లీనింగ్, వంట ముగిస్తే నేను హాస్పిటల్ లో ఉన్నప్పుడు అమ్ము ,సలీం సౌఖ్యంగా ఉంటారనీ అనుకున్నాను. మా మిత్రులలో ఒకరు మిశ్రా, అబ్స్ట్రెట్రిషియన్ ఆ రోజు ఇంటికి వచ్చాడు. నాకు నొప్పులు వస్తున్నాయని గ్రహించి, ” నువ్వు గనక ఇప్పుడు ఆసుపత్రికి వెళ్ళకపోతే సలీం శ్రద్ధ, తీసుకోలేదని అతన్ని అరెస్ట్ చేస్తారు.” అన్నాడు.
అమ్మును మిత్రులొకరి ఇంటి వద్ద వదిలి నేనూ సలీం ఆ రాత్రి 11 గంటలకు సీదా లేబర్ రూమ్ కి వెళ్ళాం. నా నొప్పులు బాగా ఎక్కువయ్యాయి. ఆ రాత్రంతా సలీం నాతోనే ఉన్నాడు.
ఆ రాత్రి ఒంటిగంటకు నల్లటి జుట్టున్న అందమైన, మూడు కిలోల బరువున్న అబ్బాయికి జన్మనిచ్చాను. ఇది నా మరో కల నిజమవడం.
పిల్లవాడిని నాకు దూరంగా తీసుకుని వెళ్ళినా నేను వాడి ఏడుపు గుర్తుపట్టి నర్స్ ని అడిగాను పిల్లడిని తీసుకురా పాలివ్వాలని. వాడు రెడీగా పాలు తాగాడు.
మర్నాడు సాయంత్రం బేబీని చూపించటానికి సలీం అమ్మును తీసుకు వచ్చాడు. సలీం వాడిని ఎత్తుకుని, “నీకు తెలుసా? నేను నీ తండ్రిని” అన్నాడు. బేబీ జవాబు ఒక నవ్వు.
అమ్మూ వాడిని బాబీ అని పిలవాలనుకుంది. మేం వాడికి అమన్ పేరు ఎన్నుకున్నాం. అమన్ అంటే శాంతి. బాబీ వాడి ముద్దుపేరుగా మారింది.
ఇద్దరు పిల్లలతో నేను పని చెయ్యదలుచుకోలేదు. మేం వైట్ ఆబీ హౌస్ హాస్పిటల్ కి మారదలుచుకున్నాము. అక్కడ ఎమర్జెన్సీ వార్డ్ లేదు. అంటే సలీమ్ సాయంత్రాలు ఖాళీగా ఉంటాడు. కాస్త ఖరీదే అయినా అమ్మును ప్రైవేట్ స్కూల్ కి పంపాలనుకున్నాము. కాని అక్కడ చదువు బాగుంటుంది. చాలా యేళ్ళక్రితం వాళ్ళమ్మ చేసినట్టే రెండో క్లాస్ వదిలేసి, అసెస్మెంట్ టెస్ట్ లో బాగా చేసి మూడో గ్రేడ్ లో చేరింది.
వేసవిలో అమ్మూకు ఒక బైసైకిల్ కొన్నాం తొక్కడం నేర్చుకుంటుందని. నేను చాలా రోజులు బాబీని ప్రామ్ లో ఉంచుకుని, అమ్ము బైసైకిల్ తొక్కుతుంటే చూస్తూ గడిపాను.

ఇంకా వుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *