May 2, 2024

భగవత్ తత్వం

రచన: సి.హెచ్.ప్రతాప్

దైవశక్తి భిన్ననామాలతో ప్రకాశిస్తుంది. ఏ రూపమైనా వాటి మూల తత్త్వం, పరతత్త్వం ఒక్కటేనని ముందుగా అర్ధం చేసుకోవాలి. భగవంతుని తత్త్వాన్ని తెలుసుకోవడం చాలా కష్టం. నేటి కాలంలో భగవంతుని గూర్చి మిడి మిడి జ్ఞాతంతో తమకు అన్నీ తెలుసనుకునేవారే ఎక్కువగా వుంటారని శ్రీ కృష్ణుడు ఆనాడే మానవాళిని హెచ్చరించాడు. అసలు భగవంతుడు ఎవరు? ఎక్కడ ఉంటాడు? అసలు ఉన్నాడా? లేడా? అన్న సందేహం మాత్రం అందరికీ ఉంటుంది.
కాని భగవంతునికి ఆకారం లేదు. నామం లేదు. మానవాళిని పట్టి పీడించే సత్వ, తమో, రజో గుణాలకు అతీతుడు. ఎందరో జ్ఞానులు ధ్యానం చేసి ఏకాగ్రతతో భగవంతుడిని మెప్పించి తమ చర్మచక్షువులతో చూసినవారున్నట్లు పురాణాలు చెబుతాయి. భగవంతుడిని చూడాలనుకొంటే మంచి మార్గము, సులభమైనది భక్తి ఒక్కటే అసలు సిసలైన సాధనం.
తపో, జ్ఞాన మార్గాలున్నప్పటికీ ఇవి చాలా కష్టంతో కూడుకొన్నవి. భక్తిమార్గంలో మాత్రం తప్పక భగవంతుడు మనకు వ్యక్తమవుతాడు. పైగా కోరుకున్న రూపాన్ని కూడా అపాదించుకుని మరీ భగవంతుడు కనిపిస్తాడు అన్న నమ్మకమున్న మార్గమిది.
భక్తిసామ్రాజ్యంలో భగవంతుడిని చూచినట్లు చెప్పడానికి భగవంతుని తమ అనుభవంలోకి తెచ్చుకున్నవారు ఎందరో కనిపిస్తారు.
రామకృష్ణ పరమహంస తన జీవితాన్ని కాళికామాతకే అర్పించాడు. తన భార్యను సైతం ఆది పరాశక్తిగానే భావించాడు. ఆ పరాశక్తి రామకృష్ణ పరమహంసకు కనిపించింది. అతని చేత ఎన్నో ఉపచారాలను పొందింది. అతనిని ఒక మహా యోగిగా తీర్చిదిద్దింది.
భగవంతుని తత్వాన్ని తెలుసుకోవడానికి భాగవతుల సేవ కూడా ముఖ్యమే. భాగవతుల సేవలు భగవంతుడు మెచ్చుతాడు. త్రిలోక సంచారి నారదుడు కూడా భాగవతుల సేవ చేసి నారాయణ మంత్రాన్ని పొంది నిత్యమూ నారాయణ జపంతో త్రిలోకాలు తిరిగే శక్తిని సంపాదించుకున్నాడని పురాణాలు తెలియజేస్తున్నాయి. అటువంటి భగవంతుడిని చూడాలనుకొంటే ముందుగా సమత్వబుద్ధిని, విశాల భావాన్ని పెంపొందించుకోవాలి. భగవంతుని తత్వాన్ని ఎరుకపర్చుకోవాలి. సర్వం పరాత్పరుని రూపంగా భావించాలి. సర్వ జీవ సమానత్వం, సర్వ మానవ సౌభ్రాతృత్వం అలవరచుకోవాలి.
భక్తులలో అనేక రకమైన భక్తులు ఉంటారు. ఎవరికి ఎటువంటి భక్తి అలవడు తుందో అది భగవంతుడికి ఎరుక. భక్తి కూడా గంగా ప్రవాహం లాంటిదే. మనల్ని ఆ ప్రవాహంలో సరియైన మునక సరియైన చోట వేయించ గల సమర్థత ఆ పరమాత్మకే సాధ్యము. భగవత్‌ తత్వం అలకించడం, భగవత్‌ తత్వం గురించి ఆలోచన చేయడమూ, అనుభవానికి తెచ్చుకోవడం ప్రసాదం. ఆధ్యాత్మిక మార్గంలో నడవడం, నడవాలనే ఆసక్తి కలగటం, నడవగలగటం కూడా పూర్వ జన్మ సుకృతమేనని శాస్త్రాలు చెబుతున్నాయి.

* * *

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *