పాజిటివ్ థింకింగ్

రచన: గిరిజ కలవల

పూజ, టిఫిన్ అవగానే…. వంటకు తొందరలేదు.. ఈరోజు లంచ్ కి ఈయన ఎలాగూ రానన్నారు.. నెమ్మదిగా ఆలోచిద్దాం దాని సంగతి అనుకుంటూ, చాలా రోజులుగా పెండింగ్ లో వున్న నవలని తీసుకుని సోఫాలో చతికిలపడ్డాను. రెండు పేజీలు చదివానో లేదో, వసుధ దగ్గరనుండి ఫోను వచ్చింది. ” వాణీ… ఏం చేస్తున్నావు…. ఉన్నపళంగా బయలుదేరి మా ఇంటికి రా..” అంది.. ఏమీటే సంగతి అని అన్నా కూడా ఏం చెప్పలేదు. ఇక చేసేదేం లేక లేచి చీర మార్చుకుని, తాళం వేసి బయలుదేరాను. రోడ్డు మీదకి రాగానే ఆటో దొరికింది. వసుధ అడ్రసు చెప్పి ఆటోలో బయలుదేరాను. ఏమయి వుంటుంది.. ఏ సంగతీ చెప్పకుండా ఇంత హఠాత్తుగా ఎందుకు రమ్మందో అని ఆలోచించసాగాను. వసుధ, నేను చిన్నపాటి నుండి ప్రాణస్నేహితురాళ్ళం. పెళ్ళిళ్ళు అయ్యాక కూడా ఒకేవూరికి కాపురాలకు రావడంతో ఆ స్నేహం ఇంకా కొనసాగుతూనే వుంది. నాకూతురు పూజ, వసుధ కూతురు సింధు కూడా ఒకే వయసు వారవడంతో.. మా స్నేహం రెండో తరానికి కూడా పాకింది. పై చదువుల కోసం మేము పూజని అమెరికా కి పంపినపుడు, వసుధ, వాళ్ళాయన సింధుని పంపడానికి ధైర్యం చేయలేకపోయారు. పిల్లని వదిలి వుండలేమని పంపలేదు. సింధు కూడ అమ్మ నాన్న లని వదిలి ఒక్క రోజు కూడా వుండలేదు. ఉన్న వూళ్లో నే MBA లో జాయిన్ చేసారు.
మా పూజ అక్కడ చదువుతూండగానే, గ్రీన్ కార్డు వున్న అమెరికా సంబంధం గురించి మా అన్నయ్య చెప్పాడు. అన్నయ్య స్నేహితుని కొడుకు కిరణ్, అన్ని విధాల అందరికీ నచ్చడంతో, కిందటి సంవత్సరం పూజ, కిరణ్ ల పెళ్లి గ్రాండ్ గా చేసి, పర్మినెంటు గా పూజని అమెరికా నివాసిని చేసేసాము. దాని కోరికా అదే.. మేము కోరుకున్నదీ దాని సుఖమే..
అయితే వసుధ మాత్రం ఈ విషయంలో నాతో చాలా పోట్లాడింది. ఒక్కగానొక్క కూతురిని అంత దూరంలో పంపడమేమిటి అని దాని వాదన. తన కూతురు సింధుని మాత్రం దూర ప్రాంతాల సంబంధాలు చచ్చినా చెయ్యనని చెప్పింది. ఈ కారణంతో సింధు పెళ్ళి కొద్దిగా ఆలస్యం అయింది.
సింధుకి తగిన వరుడు రవి అనుకోకుండా నా కంట పడ్డాడు. శ్రీవారి స్నేహితుడు మూర్తి, రూప ల కూతురి పెళ్ళి కి మేము వెళ్ళడం, అక్కడ రూప కి అక్క కొడుకు రవి ని చూడ్డం జరిగింది. ఆరడగుల అందగాడు, చలాకీగా అందరితో కలివిడిగా తిరగడంతో ఆసక్తి తో రూపని వివరాలు అడిగాను. ” మా అక్క సుమతి ఇద్దరి కొడుకుల్లో వీడు రెండోవాడు. పెద్దవాడు అమెరికా వెళ్లి పోయాడు. వీడికి లక్షల్లో జీతంతో అమెరికా ఆఫర్స్ వచ్చినా అమ్మ నాన్న లని వదిలి వెళ్ళేది లేదని అవన్నీ వదులుకున్నాడు. MBA చేసి ఇక్కడే ఏదో MNCలో నెలకి ఏభై వేల జీతం సంపాదించుకుంటున్నాడు. వచ్చే పిల్ల కూడా అమెరికా మోజు లేనిదీ, తన తల్లి తండ్రులు తో పాటు వుండడానికి ఇష్టపడేదీ అయివుండాలనుకుంటున్నాడు. ” అంటూ చెప్పి తన అక్క సుమతిని పరిచయం చేసింది. ఆవిడతో నేను సింధు గురించి చెప్పి ఫోటో చూపించగానే ఆవిడకి సింధు ఎంత గానో నచ్చింది. కొడుకు ని పిలిచి చూపించింది. రవి కి కూడా సింధు నచ్చింది. సింధుకి కూడా తల్లితండ్రులను వదిలి విదేశాలకు వెళ్ళడం ఇష్టం లేదని తెలిసేసరికి సుమతి కొంచెం ఉత్సాహం చూపింది . నేను వెంటనే వసుధ కి ఫోన్ చేసి వివరాలన్నీ చెప్పి రెండురోజుల్లో పెళ్ళిచూపులు ఏర్పాటు చేసాను. అన్ని విధాల ఉభయులకూ నచ్చడంతో ముహూర్తాలు పెట్టేసుకున్నారు. రెండు వైపులా నేను మథ్యవర్తిత్వం వహించి వైభవంగా పెళ్ళి జరిపించాను. ఆహుతులందరి నోటా ఒకటే మాట.. చూడ ముచ్చటి జంట.. రవి సింథు అని.
పదహారురోజుల పండుగ అవగానే మంచిరోజు చూసి సింధుని అత్తగారింటికి కాపురానికి పంపారు. ఉన్న ఊళ్లో నే అయినా కూడా పంపలేక పంపలేక పంపారు. వాళ్ళ బెంగ చూసి సుమతి, వసుథ తో ” వదినా, బెంగ పెట్టుకోకండి… ఊళ్ళోనేగా.. ప్రతీ వారం కలుసుకుంటూవుండవచ్చు.. ఓ ఆదివారం మీరిద్దరూ మాఇంటికి వచ్చెయ్యండి, మరో ఆదివారం మేమంతా మీ ఇంటికి వచ్చేస్తాము” అంటూ ధైర్యం చెప్పింది. ఆడపిల్లలు లేని సుమతికి సింధు ఆ లోటు తీర్చింది. కోడలిని ఎంతో అపురూపంగా చూసుకునేది సుమతి. ఈ ఆనంద సందోహాల మథ్యలో సింథు నెలతప్పిందన్న శుభవార్త రెండు కుటుంబాలలోనూ సంతోషం ఇనుమడించింది. మూడో నెల వచ్చిందని వసుథ మొన్ననే నాకు ఫోన్ చేసి చెప్పింది. ఇప్పుడు ఇంత అర్జంటుగా ఉన్నపళాన ఎందుకు రమ్మందో ఏమిటో అర్థం కాలేదు.
ఆటోవాడు” ఇల్లు ఎక్కడమ్మా..” . అని అడుగుతూంటే ఆలోచనలనుండి బయటకి వచ్చి “అదిగో ఆ పచ్చగేటు ముందు ఆపు” అన్నాను. వాడికి డబ్బులు ఇచ్చి.. లోపలకి వెళ్ళాను. తిన్నగా బెడ్ రూమ్ లోకి వెళ్ళాను. అక్కడ సింధుకి టిఫిన్ కాబోలు తినిపిస్తోంది వసుధ. ” ఏరా.. సింథూ.. ఎలా వున్నావురా…కంగ్రాట్స్ తల్లీ..” అని పలకరించాను. సింథు జవాబు ఇవ్వకుండా కళ్ళు తుడుచుకుంటూ బయటకి వెళ్లి పోయింది. ఏం జరిగిందో తెలీక నివ్వెరపోయాను ” ఏమైంది వసూ… ఏం జరిగింది? ఎందుకు అర్జంటుగా రమ్మన్నావు? సింధు అలా ఎందుకు వుంది? ” అని అడిగాను. వసుధ కూడా కళ్ళు తుడుచుకుంటూ..” ఏం చెప్పమంటావు.. అంతా మా ఖర్మ.. దేముడు మామీద చిన్నచూపు చూసాడు” అంది.
” అసలేం జరిగిందో చెప్పు వసూ… సింధు కాపురం సజావుగా సాగడం లేదా… రవితో కానీ, సుమతితో కానీ ఏమైనా తేడాలు వస్తున్నాయా.. ” అని అడిగాను.
జవాబుగా వసుధ చెప్పిన విషయం విని నివ్వెరపోయాను. నోట మాట రాలేదు. ఏమిటిది? నిజంగానేనా? ఎలా ఇప్పుడు? ఇలా ఎన్నో జవాబు లేని ప్రశ్నలు ఉదయించాయి.
” నిజంగానేనా… ఇంకో సారి టెస్టు చేయిద్దాం ” అన్నాను. ” లేదు వాణీ… రిపోర్టు సరిగ్గానే వచ్చింది.” అంది వసుధ. ఇంతలో వాళ్ళాయన పిలవడంతో హాల్లో కి వెళ్ళింది. తను చెప్పిన మాటలు నా చెవిలో ఇంకా వినపడుతూనేవున్నాయి. ” వాణీ… మొన్న ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక డాక్టర్ దగ్గరికి సింథుని తీసుకువెళ్లాను. ఆవిడ అన్ని టెస్టులు రాసింది. ఆప్రకారం అన్నీ చేయించాను. అప్పుడే బయటపడింది సింథుకి ఎయిడ్స్ వుందని. మాకు ప్రపంచం తలకిందులు అయిపోయింది ఆ మాట వినగానే. సింధు సంగతి చెప్పనవసరమే లేదు. అప్పటినుంచి కంటికి మింటికి ఏకధారగా ఏడుస్తూనే వుంది. మేమేం పాపం చేసామని భగవంతుడు ఇలా చేసాడు. ఉన్న ఊళ్లో ఎదురుగా వుంటుందికదా.. అని పెద్దగా వాకబు కూడా చెయ్యకుండా నువ్వు చెప్పిన సంబంధం చేసి దాని బతుకు బుగ్గి చేసాము. వాడి మూలంగా నా చిట్టితల్లి అన్యాయం అయిపోయింది. ” అంది.
“వసుధా..రవిని అనుమానిస్తున్నావా? ” అన్నాను.
“అంటే.. సింథుని తప్పు పట్టమంటావా?” అంది వసుధ. నేనేం మాట్లాడలేకపోయాను.
రవి అటువంటి అలవాట్లు వున్నవాడు కాదని నా నమ్మకం. అలా అని సింధు చిన్నప్పటి నుండి నాముందు పెరిగిన పిల్ల. అయినా అలాంటి ఊహే నాకు ఒళ్లు జలదరించింది. ఇలా ఎలా జరిగిందో.. ఇప్పుడేం చెయ్యాలో.. తోచడం లేదు.
వసుధ వాళ్ళాయన ఇద్దరూ లోపలికి వచ్చారు. ఆయన చేతుల్లో ఏవో మెడికల్ రిపోర్టులున్నాయి. ” ఆ రవికి కూడా టెస్టు చేయించాము ఉదయం. ఆ రిపోర్టు లే ఇవి.” అని నాకు చెప్పి ” ఏమయిందండీ…. రిపోర్టు లో ఏముంది? ఎన్నాళ్లు నుండి అతనికీ జబ్బు వుందో చెప్పారా డాక్టర్లు?” అని అడిగింది.
ఆయన ” లేదు వసూ…. రవి రిపోర్టులు నార్మల్ గా వచ్చాయి. అతనికి ఈ జబ్బు లేదట. కేవలం మనమ్మాయికే వుందట. రవి ద్వారా సింధుకి ఈ జబ్బు రాలేదట.” అనగానే వసుధ ఒక్కసారిగా గొల్లుమంది.
సింధు మా మాటలు, వసుధ ఏడుపు వికుండా తలుపు దగ్గరకు వేద్దామని వెళ్ళాను. కానీ అప్పటికే సింథు మా మాటలు వినడం, రెండో బెడ్రూమ్ లోకి వెళ్లి తలుపు వేసుకోవడం జరిగింది. నేను కంగారుగా””వసూ.. సింధూ రూమ్ తలుపు వేసుకుంది.. ఏదైనా అఘాయిత్యం చేసుకుంటుందో.. ఏంటో ” అని పెద్దగా అరిచాను. వెంటనే ముగ్గురం ఆ రూమ్ తలుపు దబదబా బాదుతూ” సింధూ.. తలుపు తీయమ్మా.. నిన్ను మేమేమీ అనుకోవడం లేదు.. ఏమీ చేసుకోకు తల్లీ… ముందు తియ్యి.. ” అంటూ అరవసాగాము.
ఇంతలో రవి వచ్చాడు. పరిస్థితి గమనించి బలంగా తలుపుని బాది పగలకొట్టి లోపలకి వెళ్లేసరికి సింధు ఫేన్ కి చీర బిగించే ప్రయత్నం లో వుంది. ఒక్కవుదుటన సింధుని కిందకి లాగి హాల్లోకి తీసుకువచ్చాడు. హిస్టీరియా వచ్చినదానిలా సింధు తలబాదుకుని ఏడ్చేస్తోంది.
” నాదగ్గరకు రాకండి.. నన్ను తాకకండి.. రేపు పుట్టబోయే నా బిడ్డకి కూడా ఈ జబ్బు వచ్చేస్తుంది. నేనేం పాపం ఎరుగను. నాకెందుకు అవాలి ఇలా… పదిమందికి మొహం చూపీయలేను. మిమ్మల్ని క్షోభ పెట్టలేను. నన్ను చచ్చిపోనివ్వండి” అంటూ వెక్కి వెక్కి ఏడవసాగింది. సింధుని దగ్గరకి తీసుకుని ఓదార్చాడు రవి. మంచినీళ్లు తాగించి సింథు ఊరడిల్లాక” అత్తయ్యా, మామయ్యా, ఆంటీ, సింథూ.. ఇప్పుడు ఏమయిందని మీరందరూ ఇంత బాధ పడుతున్నారు. కారణం నేనుకున్నారు.. కానీ కాదని తెలిసింది. నేనెక్కడ సింధుని తప్పుపడతానో అని మీరందరూ ఫీలయిపోతున్నారు. అయినా, ఇదివరకు ఒకసారి సింధు కళ్లు తిరిగి పడిపోవడంతో, రక్తం తక్కువగా వుంది ఎక్కించాలని డాక్టర్ చెప్పిన ప్రకారం ఎవరో డొనేట్ చేసిన రక్తం ఎక్కించామని అన్నారు గుర్తువుందా.. అప్పుడు సరైన టెస్టులు చేయించకుండా ఎక్కించివుంటారు. దాని ఫలితమే ఇప్పుడు సింధు అనుభవిస్తోంది. ఎలా వచ్చిందో ఇప్పుడు మనకి అనవసరం. అయిపోయిందేదో అయిపోయింది. ఇప్పుడు బాధ పడి ప్రయోజనం లేదు. ఇకముందు ఎలా వుండాలన్నదే ముఖ్యం. నేను డాక్టర్ ని కనుక్కున్నాను. ముందు సింధు ధైర్యంగా, మనోనిబ్బరంగా వుండాలి. ప్రసవ విషయం లో డాక్టర్ చెప్పినట్టు విని, ఇప్పటినుండి మందులు వాడితే పుట్టబేయే బిడ్డకు ఎటువంటి హాని వుండదట. సిజేరియన్ ఆపరేషన్ జరగాలట. తల్లి పాలు వద్దన్నారు. డబ్బా పాలు పడదాం. మంచి ఆహారం తీసుకుంటూ, వేళకి మందులు వేసుకుంటూ, మంచి ఆలోచనలతో, భవిష్యత్తు మీద ఆశతో, నమ్మకంతో సింధు వుంటే చాలు. ఒక బి. పీ, ఒక సుగర్ వ్యాథి లాగానే ఇది కూడా అనుకోండి. వాటికి చికిత్స లేదు జీవితాంతం మందులు వేసుకున్నట్లే ఈ జబ్బు కి కూడా వేసుకోవడమే. ముందు మనందరం థైర్యాన్ని సింథుకి ఇవ్వాలి. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ సింథు చేయి వదిలేది లేదు. అయినా ఏ మనిషి కి మాత్రం కలకాలం బతుకుతామనే హామీ ఎక్కడుంది? ఎవరు ముందో.. ఎవరు వెనకో.. ఎవరికి తెలుసు? ఇది అంటరాని జబ్బు కాదు. వెలివేయాల్సిన అవసరం లేదు. నేనైతే సింధుకి జీవితాంతం తోడుగా నీడగా వుండి తీరతాను. ఎటువంటి అపార్థం నేను చేసుకోలేదు. దేముడు చిన్న పరీక్ష పెట్టాడు అంతే. మన మనో స్థైర్యం తో గట్టెక్కుతాము. ఇటువంటి అఘాయిత్యం సింథు మరెన్నడూ చేసుకోనని నాకు మాట ఇవ్వాలి. మనందరం తనకి తోడుగా నిలబడి జీవితం మీద ఆశని కల్పించి థైర్యాన్ని ఇద్దాము. పూర్ణాయుష్షుతో సింథు తన ఆరోగ్యవంతురాలైన బిడ్డతో గడుపుతుంది. ”
రవి మాటలు విన్న మాకు ఎంతో ఎత్తుకు ఎదిగిన మహనీయుడిలాగా అనిపించాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఒక భర్త ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడో అలాగే ఆలోచిస్తాడని అనుకున్న మాకు రవి భగవంతుని రూపంలో కనిపించాడు. ఎంత తేలిగ్గా మా బాధని చెరిపేసాడు. అతని ఔన్నత్యం ఎంత గొప్పగా వుంది. దేముడు చిన్న చూపు చూసిన సింథు పాలిట దేముడే అయ్యాడు. ఆనందంగా నేను, వసుధ కళ్లు తుడుచుకున్నాము. సింధు తన కన్నీటి తో రవికి పాదాభిషేకం చేసింది. రవి ఆప్యాయంగా సింధు ని కౌగిలి లోకి తీసుకుని తల నిమురుతూ ” ఇంకెప్పుడూ ఇలాంటి పిచ్చి పనులు చెయ్యకు. నాకు నచ్చలేదు. సాయంత్రం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. భోంచేసి రెస్ట్ తీసుకో. ఇకనుండీ నీ బాధ్యత నాదే” అన్నాడు. తేలికపడ్డ మనసుతో సింథు పసిపిల్లలా రవి చేతిలో ఒదిగిపోయింది. మాకు కూడా మనసులోని భారం చేతితో తీసినట్లయిపోయి ఊపిరి పీల్చుకున్నాము.
ఇంటికి బయలుదేరిన నా మనసు నిండా రవే నిండిపేయాడు. నిజానికి ఈ హెచ్. ఐ. వి. పాజిటివ్ అనే జబ్బు ఓ భయంకరమైనదే అందరి దృష్టిలో. ఆ జబ్బు పాల్పడిన వారిని అంటరాని వారిగా చూడడం సమాజంలో పరిపాటి అయింది. దీనిపట్ల అవగాహన లేని వారిలోనూ, దిగువతరగతి కుటుంబాలలోనూ ఈ భావన ఎక్కువగా వుంది. వారి చెడు అలవాట్లు ద్వారా వారి జీవితం నాశనం చేసుకోవడమే కాకుండా జీవిత భాగస్వామిని కూడా బలి తీసుకుంటున్నారు. అంతేకాక ముక్కుపచ్చలారని పిల్లలు కూడా తల్లితండ్రుల తప్పులకు బలి అవుతున్నారు. సింథు లాంటి అమాయకులు ఇతర కారణాల తో ఇలాంటి జబ్బులకి బలవుతున్నారు. ఒకసారి నేను విన్న సంఘటన గుర్తు వచ్చింది. సరదాగా స్నేహితురాళ్ళ తో సినిమాకు వెళ్లిన ఒక అమ్మాయి కి వీపు మీద ఏదో గుచ్చుకున్నట్లు అయిందట. ఏదో కుట్టింది అనుకుని తడుముకుని చూసేసరికి, ఓ స్టిక్కర్ అంటించివుంది. దాని మీద మా ప్రపంచంలోకి ఆహ్వానం అని వుందట. ఆ తర్వాత ఆ అమ్మాయి జబ్బు పడడం, పరీక్షలు చేయిస్తే హెచ్. ఐ. వీ. అని తేలడం జరిగిందట. పాపం ఆ అమ్మాయి జీవితం నాశనమైపోయిందని తెలిసాక ఎంతో బాధ పడ్డాను. అటువంటిదే ఇప్పుడు సింధు జీవితంలో జరిగింది. రెపరెపలాడే ఆ జ్యోతి కి రవి తన రెండుచేతులు పట్టి ఆరనీకుండాచేస్తున్నాడు. ఆ పాజిటివ్ జబ్బుకి నెగిటివ్ గా ఆలోచించకుండా పాజిటివ్ గా తన సపోర్టు ఇవ్వడం ఎంతో గొప్ప విషయం.

లాస్య – నేటి తరం అమ్మాయి

రచన: మణికుమారి గోవిందరాజుల

కళ్యాణమంటపంలో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. పెళ్ళివాళ్ళు అలిగారట అంటూ. పెళ్ళికి వచ్చిన వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. ఈ రోజుల్లో కూడానా అనుకుంటూ.
“అబ్బా! మళ్ళీ వెనకటి రోజులొచ్చాయి. పెళ్ళికొడుకుల తల్లులు యేమి ఆశిస్తున్నారో? యెందుకు కోపాలు తెచ్చుకుంటున్నారో అర్థం కావడం లేదు.
“ఇంతకీ ఇప్పుడెందుకో కోపాలు?కారణమేంటొ?”
“యేమీ లేదు. హారతి ఇచ్చేప్పుడు రెండు వత్తుల బదులు ఒకటే వత్తి వేసారట అదీ కోపం.”
“అది కాదులే పెళ్ళికొడుకు తల్లి అన్నగారి తోడల్లుడి కూతురి తోడికోడలి చెల్లెలి కూతురు అయిదేళ్ళ పిల్లకి బొట్టుపెట్టి భోజనానికి పిలవలేదట వాళ్ళందరు వరుస ప్రకారం అలిగారట . అందుకని పెళ్ళికొడుకు తల్లి కూడా అలిగిందట మావాళ్ళకి సరిగా మర్యాదలు వ్హేయటం లేదని”కిసుక్కున నవ్వి ఆయాసం తీర్చుకుంది ఒకావిడ.
“ఓయ్! ఇంకా పెద్ద కారణం ఇంకోటి వుంది. వీళ్ళు విడిదింట్లోకి వచ్చేటప్పటికి కారు డోర్ తీయటానికి డోర్ హ్యాండిల్ మీద అందరూ చెయ్యి వేసారట కాని పెళ్ళికూతురి పిన్ని అత్తగారి ఆడపడుచు కూతురి తోడికోడలు చెల్లెలి కూతురు పదేళ్ళపిల్ల చెయ్యి వేయటానికి రాకుండా దూరం నుండి చూస్తున్నదట అదీ కోపానికి కారణం”గుర్తొచ్చిన వరసలన్నీ చెప్పి వెటకారంగా నవ్వింది ఇంకొకావిడ.
“సర్లెండి ! నోరు ముయ్యండి అందరూ. అసలే గోలగా వుంటే మీ వ్యాఖ్యానాలొకటి. ఇవన్నీపెళ్ళివారు విన్నారంటే అదో గోల.” కసురుకుంది ఒక పెద్దావిడ.
“అసలేమి జరుగుతుందో చూద్దాం పదండి” యెవరైనా సరే వినోదాన్ని ఇష్టపడతారు కదా?
అందరూ గొడవ జరుగుతున్న చోటికి వెళ్ళారు. చుట్టూ యెంతోమంది వున్నా ఒక్క ఆడమనిషి నోరు మూయించలేక పోతున్నారు. అందంగా పార్లర్ అమ్మాయిని పిలిపించి వేయించుకున్న ముడి వూడిపోయింది. కట్టుకున్నఖరీదైన పట్టు చీర నాణ్యాన్ని పోగొట్టుకుంది. అందంగా చేయించుకున్న మేకప్ వికృతంగా తేలిపోయింది. నిజానికి పెళ్ళికొడుకు ప్రవీణ్ తల్లి సౌందర్య పేరుకి తగ్గట్లే వుంటుంది యెంతో అందంగా. కానీ ఆమె చేస్తున్న వీరంగానికి ఆమె చాలా లేకిగా కనిపిస్తున్నది. అందం ముసుగేసుకున్న కురూపి కనపడుతున్నది. . పక్కనే ఒక కుర్చీలో కూర్చున్న పెళ్ళికొడుకు తండ్రి జరుగుతున్న దానితో తనకేమీ సంబంధం లేనట్లుగా వింటున్నాడు. ఇంకో కుర్చీలో కూర్చున్న పెళ్ళికొడుకు కూడా తల్లిని ఆపడానికి ప్రయత్నించడం లేదు. సౌందర్య పక్కనే వున్న ఆమె తోడికోడళ్ళు ఆమె చెవిలో యేదో చెప్తూ యెగదోస్తున్నారు. కాళ్ళావేళ్ళా పడి బ్రతిమలాడుతున్న అమ్మాయి తల్లిదండ్రులను పట్టించుకోకుండా ఆమె అలా నోటికొచ్చినట్టల్లా వదరుతూనే వుంది. పక్క వాయిద్యాలుగా వాళ్ళ చుట్టాలు. అందరికీ కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి పిల్ల అమ్మా నాన్నను చూస్తుంటే. ప్రతీవాళ్ళుకూడా మనసులోనే తిట్టుకుంటున్నారు పెళ్ళివాళ్ళని. వైభవంగా అలంకరించిన కళ్యాణ వేదిక జాలిగా చూస్తున్నది. . ఆ వేదిక మీదా ఇప్పటివరకు యెన్నో పెళ్ళిళ్ళు జరిగాయి. కొన్ని పెళ్ళిళ్ళు అందంగా జరిగాయి. కొన్ని ఆహ్లాదంగా జరిగాయి. అవన్నీ కూడా ఆడపెళ్ళివాళ్ళు మగపెళ్ళివాళ్ళు అన్న తేడా లేకుండా మన ఇంట్లో పెళ్ళిసందడి అని ఆనందంతో జరిగాయి. అప్పుడు యెంతో ఆనందించింది ఆ వేదిక . చాలా కొద్ది పెళ్ళిళ్ళలో చిన్న చిన్న గొడవలైనా వెంటనే సర్దుబాటు చేసుకున్నారు. కానీ ఇంత లేకిగా యెవరూ గొడవ పెట్టలేదు. ఇప్పుడు పెళ్ళి అయితే పిల్ల పరిస్ధితి యేమిటని పిల్ల మీదా, కోడలి మనసు విరిచేంతగా వదరుతున్న అత్తగారి మీదా జాలి పడుతున్నది కళ్యాణవేదిక.
ఇంతలో యెవరో చెప్పినట్లున్నారు పరిగెత్తుకుంటూ వచ్చింది పెళ్ళి కూతురు లాస్య.
“అత్తయ్యా! యేమి జరిగింది?”
“యేమి? ఇప్పుడు నువ్వొచ్చావా? అసలేమన్నా మర్యాదలు తెలుసా మీవాళ్ళకి? పెళ్ళివాళ్ళకి విడిగా అందంగా వడ్డించాలని తెలీదా?అందరికీ బొట్టుపెట్టి పిలిచారా?ఇందాకటినుండి చచ్చిపోతున్నాము దాహంతో కొబ్బరినీళ్ళు రెడీగా వుంచాలని తెలీదా?”
“అయ్యో! ఇంట్లో మొదటిపెళ్ళి. చిన్నవాళ్ళు. కాస్త పెద్దమనసు చేసుకో అమ్మా. అన్ని యేర్పాటు అవుతాయి. మీరు నిదానించండి. ” లాస్య పెదనాయనమ్మ వచ్చి వేడుకున్నది.
ఆవిణ్ణి ఒక్క విదిలింపుతో దూరం నెట్టింది. “నిదానిస్తామండీ. ఇంతవరకు జరిగిన దానికి మా కాళ్ళు పట్టుకుని క్షమార్పణ కోరితే నిదానిస్తాము” ఖరాఖండిగా తేల్చేసింది సౌందర్య. అందరూ ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు మూతుల మీద చేతులేసుకుని.
పడబోతున్న నాయనమ్మని రెండు చేతులతో పట్టుకుని ఆపింది లాస్య. ” నాయనమ్మా! సారీ!వెరీ సారీ! నాయనమ్మా” ఆమె అరచేతులు కళ్ళ కద్దుకుంటూ చెప్పింది.
“అమ్మానాన్నా మీరు మొదలు అక్కడినుండి లేవండి”
“అమ్మా లాస్యా నువెందుకొచ్చావు ఇక్కడికి?ఇది పెద్దవాళ్ళ విషయం. మేము మేము చూసుకుంటాము. నువు లోపలికి వెళ్ళు. అరేయ్ మాధవా అక్కని లోపలికి తీసుకెళ్ళు.” ఖచ్చితంగా వుండే కూతురి స్వభావం తెలిసిన తండ్రి కంగారు పడ్డాడు.
“నాన్నా ఆగండి. ఇప్పటివరకు మీరన్నట్లు పెద్దవాళ్ళ విషయమే. కానీ ఇప్పుడు ఇది నా జీవిత సమస్య. మీరు మాట్లాడకండి. పెళ్ళికి వచ్చిన పెద్దలారా మీరంతా కూడా ప్రశాంతంగా కూర్చోండి. “అందరికీ చెప్పి తను కూడా ఒక కుర్చీ తెచ్చుకుని కాబోయే అత్తగారి యెదురుగుండా కూర్చుంది. “అత్తయ్యా! ఇప్పుడేమంటారు? మీకు మర్యాదలు సరిగ్గా జరగలేదంటారు?మర్యాద అంటే మీకు అర్థం తెలుసా?తెలిస్తే ఇంత గొడవ చేస్తారా? మీకు దాహం వేస్తే యెవ్వరినడిగినా తెచ్చిపెడతారు కదా? దానికి “ఆఆఆఆడ పెళ్ళి” వాళ్ళే కానక్కరలేదు కదా?కొబ్బరి నీళ్ళు కావాలి. . శీతాకాలంలో కొబ్బరి నీళ్ళు అడుగుతారని మాకు తోచలేదు. ఓకే . అవి కూడా తెప్పిస్తాము. విడిగా వడ్డించడం. సరే పొరపాటు అయింది. ఇంకా రెండు పూటల భోజనాలు వున్నాయి. విడిగానే వడ్డిస్తారు… ఇవన్నీ కూడా కొద్దిపాటి సమయం వెచ్చిస్తే అవుతాయి. కానీ ఇప్పటివరకు మీరు చేసిన “మర్యాద లేని రచ్చ”వెనక్కి తీసుకో గలరా? నా మనసులో మీ మీద పోయిన గౌరవాన్ని వెనక్కి తీసుకుని రాగలరా?” “యేంటే! యేదో వదరుతున్నావు?యభై లక్షల కట్నమిస్తానన్నా నిన్ను ప్రేమించాడని ఈ పెళ్ళికి ఒప్పుకున్నాము. ఇంత మర్యాద లేని మనుషులనుకోలేదు” హూంకరించింది సౌందర్య . “అవును నేను అందంగా వున్నానన్న ఒకే కారణంతొ ఈ పెళ్ళికి ఒప్పుకున్నారు. కానీ పెళ్ళంటే ఒక అబ్బాయి అమ్మాయికి కట్టే తాళిబొట్టు కాదు. . రెండు వేరు వేరు కుటుంబాలు ఒక కుటుంబం అవడం. మీరు మేము కలిసి మనం అవడం. ఇక్కడ హోస్ట్ మేమొక్కళ్ళమే కాదు మీరు కూడా. మనందరమూ కలిసి వచ్చినవాళ్ళకి మర్యాద చేయడం మర్యాద. ఇప్పుడు మీ పక్కన వుండి మిమ్మల్ని యెగదోస్తున్న వాళ్ళెవరూ కొన్నాళ్ళు పోయాక మీ వెంట వుండరు. వాళ్ళ జీవితాలు వాళ్ళకి యేర్పడతాయి. జీవితాంతమూ వుండేది నేనూ నా వారు. యేది కావాలన్నా చెప్పటానికి ఒక పద్దతి వుంది. నావాళ్ళని కూడా మీవాళ్ళుగా, మనవాళ్ళుగా చూడడంలో ఒక మర్యాద, ఆత్మీయత వుంటుంది. అప్పుడు మీ మీద నాకు రెట్టింపు ప్రేమ కలుగుతుంది. కొడుకుకి పెళ్ళి చేసి కోడల్ని ఇంటికి తెచ్చుకోవడం అంటే వుట్టి పెళ్ళి కాదు. ఇంతకాలం మీరు కాపాడిన మీ ఇంటి గౌరవ ప్రతిష్టల్ని సాంప్రదాయబద్దంగా వేదమంత్రాల సాక్షిగా కోడలికి అప్పగించడం. నాకు సహజంగా కాస్త ఆవేశం యెక్కువ. ఇక్కడికి వచ్చేటప్పుడు యెంతో కోపంగా వచ్చాను . అదంతా యెటు పోయిందో కానీ నాకు మిమ్మల్ని చూస్తుంటే అపారమైన జాలి కలుగుతున్నది. గ్లాసుడు నీళ్ళకోసం, తినే కాస్త మెతుకుల కోసం మీ ఇంటి గౌరవాన్ని పోగొట్టు కుంటున్నారు కదా?
“యేంటీ! యేదేదో మాట్లాడేస్తున్నావు? అసలు నా కొడుక్కి యాభై లక్షలిస్తామని…. . ”
“సిగ్గుపడాలి ప్రవీణ్! నిన్ను కని యెంతో ప్రేమతో పెంచిన నీ తల్లి యాభై లక్షలకు నిన్ను ఖరీదు కట్టింది. సిగ్గుపడు ప్రవీణ్. ” ప్రవీణ్ వేపు తిరిగి ఛీత్కరించింది. “వ్యక్తిత్వం లేని నాడు నువు బ్రతికి వుండీ జీవచ్చవానివే ప్రవీణ్” తెల్లటి లాస్య వదనం యెర్రటి పట్టుచీరతో పోటీ పడింది.
“మామయ్యగారూ మీరంటే నాకు యెంతో గౌరవం. అత్తయ్యగారికి మీరు ఇచ్చే ప్రేమ ఆప్యాయతలు, అందరిలో ఆవిడకు మీరిచ్చే గౌరవమర్యాదలు నాకు యెంతో నచ్చాయి. మీకు చాలా ఆస్తులున్నాయనో లేక మీ అబ్బాయి అందగాడనో, నా వెంట పడి నన్ను ప్రేమించాడనో నేను ఈ పెళ్ళికి ఒప్పుకోలేదు. మీ పెంపకంలొ పెరిగిన ప్రవీణ్ నన్ను నా వ్యక్తిత్వాన్ని గౌరవిస్తాడని ఆశపడ్డాను.” లాస్య కళ్ళల్లో నుండి రెండు కన్నీటి చుక్కలు రాలాయి. “మామయ్యా ఇంత జరుగుతున్నా మీరు మీ ఆవిడను యేమీ అనకుండా ఆమెని యెవరి ముందూ తక్కువ చేయటం లేదు చూడండి మీకు నా జోహార్లు” రెండు చేతులు యెత్తి దండం పెట్టింది. పెళ్ళి అమ్మాయికి అబ్బాయికి ఒక మధురమైన కల . నేను కూడా అలానే కలలు కన్నాను. ఆ కల నిజం చేయడానికి ఆత్మీయులయిన మీరు ప్రేమ హస్తాన్ని అందిస్తారని ఆశపడ్డాను.” కళ్ళు తుడుచుకుని గట్టిగా వూపిరి పీల్చి వదిలింది. “మా అమ్మానాన్న నన్ను కన్న నేరానికి ఇంత మందిలో మీ కాళ్ళు పట్టుకున్న సంఘటనని నేను మరచిపోయి మీ ఇంట కోడలిగా కాలు పెట్టి సంతోషంగా వుండలేను.”
అందరూ కూడా నిశ్శబ్దంగా వింటున్నారు. “అత్తయ్యా! నేటి తరం ఆడపిల్ల మీరిచ్చే ఆస్తులకంటే కూడా మీరు చూపించే ప్రేమాభిమానాలకి పడిపోతుంది. అది తెలుసుకోలేని మీ మీద జాలే తప్ప కోపం రావడం లేదు. ఆల్ రెడీ పది దాటింది. ఇంతమంది యెక్కడికో వెళ్ళి హోటళ్ళు వెతుక్కోలేరు. దయచేసి అందరూ భోజనాలు చేసి వెళ్ళండి. అత్తయ్యా మీకు విడిగా అందంగా వడ్డన చేస్తారు. భోజనాలయ్యాక మీ కోసం యేర్పాటు చేసిన బస్సుల్లో మీ మీ ఇళ్ళకి వెళ్ళండి. గుడ్ బై ప్రవీణ్” చెప్పి హుందాగా వెనక్కి తిరిగింది లాస్య.
మొదటగా పద్దెనిమిదేళ్ళ అమ్మాయి చప్పట్లు కొట్టింది. ఆ తర్వాత ఒక పాతికేళ్ళ అబ్బాయి, ఆడపిల్లని కన్న ఒక తండ్రి అందరూ చప్పట్లు కొడుతుండగా తల్లినీ, తండ్రినీ రెండు చేతులతో దగ్గరికి తీసుకుంది లాస్య.

జీవితమే ఒక పెద్ద పోరాటం

రచన: నిర్మల సిరివేలు

అమ్మా! అమ్మా! అని పిల్లలు ఏడుస్తూ ఉన్న హృదయ విదారకమైన సంఘటన చూస్తే ఎటువంటి వారికైనా కంతనీరు రాకమానదు.
పాలుతాగే పసిబిడ్డను వదిలి ఆ కన్నతల్లి ఎలా వెళ్లగలిగిందో ఏమో పైలోకాలకి వెళ్లిపోయింది. పెద్దపిల్ల అమ్మా అని ఏడుపు. చిన్నబిడ్డకు ఏమీ తెలియని పసి వయసు. ఆకలితో పాలకోసం తల్లి మీద పడి ఏడుస్తూ ఉంది. చూసినవాళ్లు ఆ బిడ్డను పక్కకు తీసికెళ్ళి ఆ తల్లిని సాగనంపడానికి ఆలోచనలు చేస్తున్నారు. ఆ శవాన్ని మునిసిపల్ వాళ్లకు అప్పచెప్పాలా, లేక మనమే తలా కొంత వేసుకుని అంత్యక్రియలు చేయాలా అని చర్చిస్తున్నారు.
తండ్రి ఏమైనాడో ఎవరికీ తెలీదు. అతను పని చేసే షావుకారు ఎర్రచెందనం చెక్క తేవడానికి పంపించారు. అడవిలో దొంగతనంగా చందనం తేవడానికి ఆ రాత్రి వెళ్లినవారందరూ బాగా తాగి నిద్రపోయారు. అదే సమయంలో ఫారెస్ట్ పోలీసులు వచ్చి పట్టుకెళ్లారు. ఎక్కడున్నాడో తెలీదు. అతనికి తన భార్యా, పిల్లలు గుర్తుండి వుంటే వాళ్ల గురించి పట్టించుకుని ఉంటే ఆ తల్లి ఇలా హీనమైన చావు కొనితెచ్చుకునేది కాదు.
నాలుగిళ్లల్లో పాచిపని చేస్తూ పిల్లలను సాకుతూ ఉండేది. 2,3 సార్లు ఆమె నోట్లోనుంచి రక్తం పడింది. ఆమె వెంటనే తను పని చేసే డాక్టరు దగ్గరకి వెళ్లింది. అన్ని టెస్టులు చేసాక కాన్సర్ అని తెలిసింది. నా దగ్గర ట్రీట్‌మెంట్‌కు అంత డబ్బు ఉందా, మంచి తిండి తినగలనా, ఏమి నా పరిస్థితి , నేను బాగవుతానా, నా పిల్లలతో ఈ జీవితమంతా నడవగలనా, నా బిడ్డలకు దిక్కు ఎవరు …. ఇలాంటి ఆలోచనలతో ఎవ్వరికి చెప్పినా నాకు ప్రయోజనం ఏమీ లేదంటూ కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ కుమిలిపోసాగింది. తన పిల్లలను ఎవరైనా తీసుకుని పెంచుకుంటే బాగుంటుంది అని ఎంతగానో ఆలోచించింది. బ్రతికుండగా తన పిల్లల గురించి ఏమీ చేయలేకపోయినా ఆమె చనిపోయిన తర్వాత ఎవరో పుణ్యాత్ములు ఆ పిల్లల్ని మంచి అనాధశరణాలయంలో చేర్చారు
అక్కా! ఇది ఏం కూర అని చిన్నారి చెల్లెలు అడిగితే , ఎవరు ఏది పెడితే అది తినాలమ్మా, చాలా బావుంది తిను అని చెప్తే అలా అమాయకంగా అంటూ తినేది పాప. ఆ దృశ్యం చూసినావారికి కంట నీరు రాకమానదు. అక్కడున్నవారంతా ఆడపిల్లలే. ఎవరు ఎవరికి ఏమవుతారో తెలీదు కాని ఆత్మీయంగా కలిసి ఉండేవారు. అమ్మాయిలిద్దరూ చాలా బాగా చదువుకునేవారు. టీచర్లు, ఫ్రెండ్స్ అంతా దగ్గరకు తీసేవారు. ఇలాంటి పిల్లలు కష్టపడి చదువుకుంటే మంచి పౌరులుగా తయారవుతారు. కాని అక్కడ కూడా శత్రువులు ఎదురుచూస్తూ, కన్నేసి ఉంటారు. అదను దొరికినంతనే బలి తీసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ ఎదుర్కుంటూ ఉన్నతస్థాయికి చేరుకోవడానికి ఎంత కాలం పడుతుంది. పాలవాళ్ళు, చెత్తవాళ్లు, వాచ్‌మెన్‌లు, ఇలా ఎందరినో ఎదిరించి అక్కడినుండి తప్పించుకుని బయటపడాలంటే ఎంత కష్టమో.
పిల్లలు బాగా చదువుకుంటూ ఎనిమిది, పదిక్లాసులకు వచ్చారు. శ్రద్ధగా చదువుకుంటూ అందంగా ఎదిగారు. పెద్దమ్మాయి బాగా చదివి, పెద్ద పోలీస్ ఆఫీసర్ కావాలని అనుకుంటూ ఉండేది. 10 క్లాసు కాగానే ఇంటర్లో చేరింది. పదో క్లాసులో మంచి మార్కులు రావడంతో ఇంటర్ కి స్కాలర్షిప్ వచ్చింది. మనం బాగా చదువుకోవాలి. పైకి రావాలి. మనకు ఎవరూ లేరు. మనకు మనమే తోడు. మన జీవితాన్ని మనమే తయారు చేసుకోవాలి అని ఒకరికొకరు చెప్పుకుంటూ ఉండేవారు. పెట్టింది తినడం, ఏ గొడవలైనా, సమస్యలైనా సర్దుకుని పోవడం, చదువు , కాలేజీ.. ఇదే జీవితంలా ఉన్నారిద్దరు పిల్లలు.
పెద్దమ్మాయి జ్యోతికి ఒక ఆలోచన వచ్చింది. నేను బాగా చదువుకుని, పెద్ద ఉద్యోగంలో చేరి ఇక్కడున్న అమ్మాయిలకు సాయం చేయాలి. ఏదో చెప్పలేని ఆలోచన. అలా చేయాలి. ఇలా చేయాలి. ఇందులో నా స్వార్ధం తలెత్తకూడదు అని మనసు నిర్ధారణ చేసుకుంది. తర్వాత డిగ్రీలో చేరింది. కాలేజీ కెళ్లడానికి సరైన బట్టలు లేవు. అప్పుడు , ఇప్పుడు కూడా కాలేజీల్లో డబ్బున్నవాళ్ల నడవడిక, డబ్బుతో వచ్చే అహంకారాలే వేరుగా ఉంటాయి. అవన్నీ తట్టుకున్న పిల్లలు ఎన్నో కష్టాలను, అవమానాలను దిగ్రమ్రింగుకుని చదువు మీదే ధ్యాస పెట్టేవారు. ఒకోసారి తట్టుకోలేక జ్యోతి దేవుని పటం ముందు కూర్చుని ఏడుస్తూ మమ్మల్ని పుట్టినప్పుడే చంపేసినా, మా అమ్మతో పాటు మమ్మల్ని తీసికెళ్లినా ఎంత బాగుండేది. మాకు శక్తినివ్వు తండ్రీ అని ప్రార్ధించేది. వాళ్ల బాధ చెప్పుకోవడానికి ఆ దేవుడు తప్ప ఇంకెవరూ లేరు మరి.
జ్యోతి అష్టకష్టాలు పడి డిగ్రీ చదువు పూర్తి చేసింది. ఇంక పైకి చదవదలచుకోలేదు. తను పెరిగిన అనాధ శరణాలయం కోసమే తన జీవితాన్ని అంకితం చేయాలని అనుకుంది. వార్డెన్ మేడంతో మాట్లాడింది. ఆవిడ కూడా సరే చూస్తూ ఉండు. నాకు కాస్త రెస్ట్ దొరుకుతుంది అని ఒప్పుకుంది. చెల్లెలు స్వాతిని ఇంజనీరింగులో చేర్పించి తను మాత్రం 24 గంటలు అనాధ శరణాలయం గురించే ఆలోచించేది, పని చేసేది.
ఒకరోజు వార్డెన్ మేడం జ్యోతిని పిలిచి చూడమ్మా చదువుకునే సమయంలోనే చదువుకుంటే మంచిది. తర్వాత చదవలేవు. ఏమో అప్పటి పరిస్థితులు ఎలా ఉంటాయో. చదువు ఆపకు. ఇంకొంచం కష్టపడి నీ చదువు పూర్తి చేయి తర్వాత నీ ఇష్టం అని చెప్పింది. దాని గురించి ఆలోచించిన జ్యోతి సివిల్స్ కి ప్రిపేర్ అయి ఐ.పి.ఎస్ కి సెలెక్ట్ అయింది. అందరూ చాలా సంతోషపడ్డారు. చిన్నమ్మాయి స్వాతి కూడా అక్కలాగే చాలా కష్టపడుతుంది. అక్కలాగే బాగా చదువుకోసాగింది. ముందులా కాకుండా ఇప్పుడు అన్ని సౌకర్యాలు ఉన్నాయి. చదువు మీద ఏకాగ్రత, శ్రద్ధ ఉన్నాయి. ఫ్రెండ్స్ అంటూ సమయం వృధా చేసేది కాదు. మనం ఎలా పెరిగాము, మనకు మన జీవితమే నేర్పిన పెద్ద పాఠం. పైకి రావాలన్న తపన ఉంటే ఎవరూ అడ్డగించలేరు. అది తప్పకుండా విజయాలను అందిస్తుంది అనుకున్నారిద్దరూ.
స్వాతి ఇంజనీరింగు మంచి మార్కులతో పూర్తి చేసింది. అక్కను మించిన చెల్లెలుగా పేరు తెచ్చుకుంది. జ్యోతి మంచి ఉద్యోగంలో చేరిపోయింది. స్వాతికి కూడా క్యాంపస్ సెలెక్షన్లో పెద్ద ఉద్యోగం వచ్చింది. ఎన్ని కష్టాలు పడినా పట్టుదల, కసితో వాళ్లకు వాళ్లే తమ జీవితాన్ని చక్కదిద్దుకున్నారు. ఉన్నత శిఖరాలను చేరుకున్నారు. ఇక మీ ఇద్దరికి పెళ్లి చేయాలి . అబ్బాయిలను చూడనా అంటూ నవ్వుతూ అంది వార్డెన్ మేడం.

అమ్ము- ఆల్ఫా-ఇన్ఫినిటీ

రచన: శ్రీదేవి

నా పేరు అలివేలు. ముద్దుగా అందరూ అమ్ము అని పిలుస్తారు. నేను చాలా తెలివయిన అమ్మాయిని అని మా పిచ్చి నాన్న నమ్మకం. ఆ అమాయకుడిని చూసి మా అమ్మ తల కొట్టుకోవటం రోజు పరిపాటే మా ఇంట్లో. ఇంతకీ అసలు నేను తెలివిగలదాన్నా ?కాదా? అన్న మీమాంసలోనే నాకు 16 యేళ్ళు వచ్చేశాయి. అన్నయ్య బోoడామ్ అని 24 గంటలు ఎక్కిరిస్తుంటే ఉక్రోషంతో మేడ మీద ఏరోబిక్స్ మొదలెట్టాను. మొదలెట్టిన పది నిమిషాలకే పక్కింటి రమణారావ్ అంకల్ వచ్చి “ఆడ పిల్లలకి కా. . స్థ ఒళ్లుంటేనే బాగుంటుంది” అన్నాడు, చూడకూడని ప్రదేశాల్లో చూస్తూ. . అంతే కాదండోయ్, ఒక డైరీ మిల్క్ చాక్లెట్ కూడా ఇచ్చాడు. నేను చిరుసిగ్గుతో తీసుకొని కాలి బొటన వేలితో ఒక ముగ్గు వేసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాను. దానికి ఉబ్బి తబ్బిబ్బు అయ్యి “సాయం కాలం ఇదే చోటున లాల్చీ లుంగీ కట్టుకొస్తాను, అమ్మకి అంకల్ లెక్కలు ట్యూషన్ చెప్తాడు అని చెప్పు” అన్నాడు నా దగ్గర స్మార్ట్ ఫోన్ ఉందని తెలియక.
ఇప్పుడు అంకల్ ఎర్రగడ్డ పిచ్చాసుపత్రి లో ఉన్నారు, వాళ్ళావిడ వీడియో చూసిన తర్వాత ఇచ్చిన ప్రోత్సాహముతో.
ఇంక నా గురించి పరిచయం చాలనుకుంటాను. సరిపోలేదా?
నేను ఛామనచాయ కి కొద్దిగా తక్కువగా, కాస్త బొద్దుగా, ముద్దుగా ఉంటాను. ఏదో అడపా దడపా అయిదు ఆరుగురు అబ్బాయిలు నా వెంట పడ్డా నా కంటికి వాళ్ళు ఆన లేదు. ఎవరైనా సంస్కారవంతుడయిన అబ్బాయిని ప్రేమించి పెళ్ళి చేసుకొందామని నా జీవిత ఆకాంక్ష తప్ప, పెద్దగా నాకేం చదువు వంట పట్టటం లేదు. ఇది చూసిన మా అమ్మ రేపల్లే లో ఉన్న మా బావకి ఇచ్చి నాకు పెళ్లి చేసేశారు, 18 వ ఏడు అనే గడిలో పడగానే. నా కధ పాఠశాల నించి నేరుగా పాకశాలలో పారేశావా ఏంట్రా దేవుడా అని తిట్టిపోసాను. . . పాపం దేవుడు బాగా ఫీల్ అయ్యాడు. ఆ రోజు సాయంకాలం వస్తూనే బావ రెస్టారెంట్ కి తీసుకెళ్ళి “చూడు అమ్ము, నువ్వు చాలా తెలివిగల దానివి. అలాంటి నిన్ను వంటకి, ఇంటి పనికి పరిమితం చేయటం నాకు నచ్చలేదు. కాలేజీ లో చేర్పిస్తాను, బాగా చదువుకో” అన్నాడు.
మా బావ చాలా మంచోడు. . కాదు కాదు దేవుడు. నా కన్నా 15 యేళ్ళు పెద్దవాడే అయినా కూడా భర్త అనే దర్పం మచ్చుకైనా లేదు. అమ్మ కంటే లాలన గా మాట్లాడ్తాడు, నాన్నకంటే ఎక్కువగా ప్రేమిస్తాడు. నేను ఏది అడిగినా క్షణాల్లో అమరుస్తాడు. ఆ నిజాయితీ వల్ల నాకు చదువు మీద ఆసక్తి పెరిగింది, ఇపుడు క్లాస్స్ లో నేనే ఫస్ట్ ర్యాంకు అంటే నమ్మండి.
తర్వాత బావ బండి నేర్చుకో అన్నాడు. ఎప్పుడు ఆడ పిల్లలతోనే కాదు, అప్పుడప్పుడు మగ వాళ్ళతో కూడా మాట్లాడాలి, అది నీ కెరీర్ లో చొచ్చుకు పోవటానికి ఉపయోగ పడుతుంది అని తన సహృదయాన్ని చాటుకున్నాడు. మొదటిసారిగా అమ్మకి ధన్య వాదాలు తెలుపుకున్నాను మనస్సులోనే.
*********************
ఒక రోజు రాత్రి క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ ప్రొజెక్ట్ కోసం బయట ఊరికి వెళ్ళి తిరిగి వచ్చే సరికి 11 గంటలు అయింది. ఇంటికి వచ్చే సరికి ఆశ్చర్యంగా ఇల్లంతా ఫూలు బెలూన్స్ తో అలంకరించి ఉంది. అమ్మ నాన్న కూడా ఉన్నారు. మర్చేపోయాను, ఇవాళ నా పుట్టిన రోజు కదా, బావ ఇంత శ్రద్ధ చూపాడో, అమ్మని సంతోషంతో అమాంతం కౌగలించు కున్నాను. నన్ను ఒక్క తోపు తోసి బలంగా చెంప పగలు కొట్టింది అమ్మ, “ పెళ్లి అయిన ఆడ పిల్ల కి ఈ అర్ధరాత్రిళ్లు తిరుగుళ్ళేంటి, పరాయి మగాళ్లు నిన్ను దిగబెట్టటం ఏంటి?” అంటూ.
నేను గట్టిగా నవ్వాను. నన్ను బావ ఎంతలా మార్చేశాడో అమ్మకి తెలీదు పాపం. . “బావ !పుట్టిన రోజు నాడు అమ్మ కొట్టింది చూడు అన్నాను. కనీసం ఆ అబ్బాయితో రాకుండా ఉండాల్సింది అమ్ము, అప్పుడు ఏదో గుడికి వెళ్ళావని చెప్పేవాడిని” అన్నాడు.
నాకు అర్థం కాలేదు “ఏంటి బావ” అని అడిగాను.
బావ అమ్మకేసి చూస్తూ “అమ్ము ని ఏమన్నా క్రమ శిక్షణలో పెట్టి ఉంటే అది చిన్నప్పుడే చేయాలి ఆంటీ, ఇపుడు కాదు” అంటూ కళ్ళు తుడుచుకుంటూ లోపలికి వెళ్ళి పోయాడు.
“ఛీ. . ఛీ. . నా కడుపున చెడ పుట్టావ్ కదే, పుట్టింటి పరువు తీసేశావు” అంటూ నాన్న అమ్మని లాక్కొని వెళ్ళిపోయారు.
నాకు కళ్ళు చీకట్లు కమ్ముతున్నాయి. . .

***************
తెల్లగా తెల్లవారింది. బావ కాఫీ కప్ తో నా వద్దకు వచ్చి “ పిచ్చి అమ్ము, బాధ పడ్డావా? నువ్వే చెప్పు, పల్లెటూరు బైతుని ఎవరన్నా భరించగల రా, ఏదో ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ కోసం మీ అమ్మ ఇచ్చే కట్నం కక్కుర్తి తప్ప నిన్ను ఎవరన్నా చేసుకుంటారా? “అల్ మోటివేషన్స్ ఆర్ నాట్ ఫర్ గుడ్ అమ్ము” అంటూ విడాకుల పత్రాలు నా చేతిలో పెట్టాడు.
నేను సంతకం పెట్టాను అచేతనంగా. . . .
*************
NH 18 road:
వేగంగా వెళుతున్న వాహనాలకు సమానంగా నా మనస్సు పరుగెడుతోంది. నడుస్తున్న, నడుస్తున్న. . నడుస్తూనే ఉన్నా నేను. అక్కడున్న 84 కి. మీ అనే మైలు రాయి నన్ను చూసి వెక్కిరించింది “ గమ్యం లేని ప్రయాణం ఏక్కడికి” అంటూ. .
నమ్మక ద్రోహం. . నయ వంచన. . జ్వాల రగిలిపోతోంది, మనసులో. . నా దేవుడు నా తండ్రి ముందే నా నడవడిక బాలేదని కుటిలమయిన పన్నాగం తో నిరూపించాడు. నా మట్టి బుర్ర కి ఏం చేయాలో తెల్సే లోపే అంతా జరిగి పోయింది. నా ఆలోచనల సంఘర్షణలో నేనుండగానే, నా ముందు రయ్యిమంటూ ఒక బండి వచ్చి జారీ పడిపోయింది.
చచ్చాడేమో అనుకోని కదలికలు లేని అతన్ని దగ్గరికి వెళ్ళి శ్వాస ఆడుతోందా లేదా అని పరీక్షించాను. వాడు నన్నే విచిత్రంగా చూస్తూ అమ్మంతమ్ లేచి బండి ని అటు తిప్పి ఇటు తిప్పి చూసుకుంటూ దేవుడా! ధన్య వాదాలు:అంటున్నాడు ఆకాశంకేసి చూస్తూ. .
నాకు చిర్రెత్తుకొచ్చి “నీకు బుద్ధుందా? ఇంత దెబ్బ తగిలితే బైకును చూసుకుంటున్నావా? పద కట్టు కడతాను” అంటూ చూన్ని చింప బోయాను.
వాడు ఆగండీ అంటూ చేతులు గాల్లో ఆడించి ఒక వెదురు కంకణం తీసి “ ఆల్ఫా బీటా నీకు నాకు టాటా” అన్నాడు కళ్ళు మూసుకొని, అంతే క్షణంలో ఫస్ట్ ఎయిడ్ కిట్ వాడి బండి మీద వుంది. నాకు మతి గాని పోయిందా అనుకుంటూ వాడిని “మంత్ర గాడివా”? అని అడిగాను అనుమానంగా.
“కానే కాదు” అంటూ వాడికి వాడే ప్రధమ చికిత్స చేసుకొంటూ, “అవును ఆడ పిల్లవి, ఒంటరిగా హై వే మీద ఏం చేస్తున్నావ్?” అని అడిగాడు.
గట్టిగా ఏడ్చేశాను. కర్చీఫ్ ఇచ్చి, “ఇప్పుడు చెప్పు” అన్నాడు.
పూస గుచ్చినట్లు చెప్పాను.
“వాడికి వేరే పెళ్ళాం ఉందా”
“తెలీదు. . తెలుసుకోవాలని కూడా లేదు, ఇంతకీ నీ పేరు ఏంటి?”
అక్కడ మొగుడు అడగ్గానే సంతకం చేసొచ్చి, తీరిగ్గా నా పేరు అడుగుతున్నావా?
“నీ పేరేంటీ?
ముందు నువ్వు చెప్పు
అలివేలు, కానీ అమ్ము అంటారు.
ఆల్ఫా. .
అదేం పేరు, విచిత్రంగా?
అమ్మ నాన్న శాస్త్ర వేత్తలు, అందుకని.
ఆకలేస్తోంది, అనుకున్నాం ఇద్దరం ఒకే సారి పొట్ట పట్టుకొని. వాడు ఇందాకటి మంత్రమే మళ్ళీ చెప్పి ఫలహారాల పళ్లెము తెచ్చాడు అకస్మాత్తుగా.
తినొచ్చా? లేదా? వీడు మంత్ర గాడిలా ఉన్నాడే? అనుకుంటుండగా. . వాడు తినొచ్చు, మంత్ర గాడిని కాదు ఖచ్చితంగా అన్నాడు. వీడికి ఫేస్ రీడింగ్ కూడా వచ్చా అనుకుంటూ మరో ఆలోచన లేకుండా తినేసాను.
“మీ ఇంట్లో దింపుతా పద” అన్నాడు తింటం అయ్యాక.
ఆ మాట అన్నావో చంపేస్తా జాగ్రత్త”, అని హూంకరించాను.
“పిచ్చి అలివేలు ! సమస్య నించి పారిపోవటం అంటే నిజంగా నడవడిక బాగోలేదని అర్థం. మీ నాన్న ఎప్పటికీ నిన్ను ఇలానే భావించ కూడదు అనుకుంటే, ముందు ఇంటికి వెళ్ళు, ఆ విడాకుల కాగితాలు వెతికి చించేయి”
ఆ తర్వాత నన్ను మా ఇంట్లో పాత మంత్రం ద్వారా దింపేశాడు. నాకు ఏడుపొస్తుంటే నా కళ్ళు తుడుస్తూ నా చేతిలో ఒక వెదురు కంకణం పెట్టి, “నీకు ఎప్పుడు అవసరం వచ్చినా, నా పేరు చెప్పి ఈ కంకణం తో నీకు ఏం కావాలో చెప్పు” అని మాయమయి పోయాడు.
ఈ లోపు మా బావ ఎవరో అమ్మాయి తో లోపలికి వచ్చి నన్ను చూసి “నీకు ఇంకా సిగ్గు రాలేదా? ఎందుకు వచ్చావ్ మళ్ళీ? అన్నాడు.
పొట్టి గౌను వేసుకున్న, తెల్లటి పొడుగాటి కాళ్ళ అమ్మాయి నన్నే చూస్తూ “పూర్ గల్, వదిలేయ్” అంటోంది.
నన్ను ఆల్ఫా దగ్గరికి తీసుకెళ్ళు అన్నాను, వెదురు కంకణంతో, అవమాన భారం తట్టుకోలేక. .
ఎన్‌హెచ్18 రోడ్ మీద ఉన్న వాడి దగ్గర అమాంతం కూలేసింది నన్ను వెదురు కంకణం.
“మళ్ళీ ఏంటీ”
“చాలా స్కెచ్ వేసి ఇరికించాడు నన్ను వాడు, వాడి మొహం చూడాలంటేనే అసహ్యంగా వుంది”.
“కావొచ్చు కానీ వాడు నీ నడవడిక మీద మచ్చ వేశాక అలా వదిలేస్తావా?
“కంకణం ఇచ్చి ఎంత సేపు అయింది, యూస్ యువర్ బ్రైన్ లేడి”
నేను కృత నిశ్చయంతో కంకణం దగ్గరకి తీసుకొని “ఇంటికెళ్లాలి. కాదు కాదు బావ ఆఫీసుకి వెళ్ళాలి అన్నాను.
మొదలు ఇంటికి వెళ్ళి మారు క్షణంలో బావ ఆఫీసులో ఉన్నాను.
“ఇదేంటి . . ఈ మిషనుకేమన్నా పిచ్చా? ఆల్ఫా”
కాదు. . నువ్వేమన్నా సరే అది చేసి తీరుతుంది. అది కూడా చెప్పింది చెప్పినట్టుగా. అందుకే జాగ్రత్తగా ఆలోచించి అడగాలి నువ్వు”
పిచ్చి సంతోషంతో గెంతులేశాను.
బావ చాలా శ్రద్ధగా పని చేసుకొంటున్నాడు. ఇంతలో వాళ్ళ బాస్ వచ్చి ఏదో పావుగంట విడమరచి చెప్పాడు. “నువ్వు బాగా చేయగలవని నీకు మాత్రమే అప్పగిస్తున్నాను” అని చెప్పి వెళ్ళి పోయాడు. ఒక గంట సేపు ఏవో వెతికి మొత్తానికి లెటర్ తయారు చేసి అక్కడున్న గుమాస్తాకు సాయంత్రం నాలుగు కల్లా ఇచ్చేయమన్నాడు. అతను ఎంతో భక్తి గా అది తీసుకు వెళ్ళిపోయాడు. అతడు వెళ్ళగానే ఫోన్ అందుకొని “హే లవ్, లావణ్య. వెరీ హెక్టిక్ డే, నీడ్ యూ బాడ్లీ” అంటూ మెసేజ్ పెడ్తున్నాడు.
నాకు కోపం ముంచుకు వచ్చింది. ఆల్ఫా వైపు చూశాను. నా కోపాన్ని వాడు అప్పుగా తీసుకున్నాడు. సూటిగా మొబైల్ ని చూశాడు. అవతల వైపు నించి మెస్సేజ్ వచ్చింది “ ఐ యామ్ నాట్ యువర్ సెక్స్ టాయ్”
ఖంగు తిన్నాడు బావ.
నా చేయి పట్టుకొని “ ఆల్ఫా బీటా నీకు టాటా “ అన్నాడు బావ వైపు చూస్తూ, ఇద్దరం మాయమై పోయి క్షణంలో బిడ్డింగ్ ఆఫీస్ లో ఉన్నాము. గుమాస్తా అనుకున్న సమయానికి కొటేషన్ కవర్ అధికారులకి అప్పగించాడు.
ఆల్ఫా గాడిని కసి గా ఒక్క గుడ్డు గుద్దాను కసిగా, వాడు కడుపు పట్టుకొని వంగి పోయి “బండ దానా ఏం తింటున్నావే” అంటూ ఒక్కడే మాయమై పోయాడు.
నా కంకణం సహాయం తో నేను మా ఇంటికి చేరాను. మా బావ హఠాత్తుగా నన్ను చూసి షాక్ అయిపోయాడు, “ ఇందాక గదిలో లేవు కదా! అన్నాడు.
నేను బావ కళ్ళల్లోకి చూస్తూ కంకణం సరి చేసుకుంటూ “ఆపిల్ కావాలి” అన్నాను, ఆపిల్ వచ్చి చేతిలో పడింది.
బావ బిత్తర పోతుండగా నేను గదిలో కెళ్ళి తలుపేసుకొని కూర్చొన్నాను.
బయట ఫోన్ మోగింది, నేను పరుగున తలుపులకి చెవులు రిక్కించి నిల్చున్నాను.
సారీ సర్! మీరు చెప్పినట్ల్లు అన్నీ క్రోఢీకరించి, మన ప్రత్యర్థి గుమాస్తా కి లంచం ఇచ్చి వాళ్ల కొటేషన్ తెల్సుకుని ఒక శాతం తగ్గించి మరి కోట్ చేశాను” నమ్మండి.
“షటప్, నీ పల్లెటూరి బైతు కి చెప్పు నీ కధలు నాకు కాదు ”
ఫోన్ కట్ అయింది.
నాకు అర్థం అయింది ఆల్ఫా గాడు కోట్ ప్రింట్ చేసే సమయానికి నెంబర్ మార్చేశాడు.
“ఒరేయ్ ఆల్ఫా ఎక్కనున్నావు రారా? అంటూ సంతోషం గా అరిచాను.
“ఇక్కడే ఉన్నా” అంటూ వాడీ గాల్ ఫ్రెండ్ తో సహా వచ్చాడు.
“చ. . చ ఇదేంటీ. . ఇలా వచ్చావ్. . ?
“మరేం చేయమంటావ్ కంకణం మహిమా, ఉన్న పళంగా లాక్కొస్తుంది”.
ముందు వెళ్ళు ఇక్కడ నించి . . అన్నాను గట్టిగా. .
***************
మరునాడు:
“నేను బాగా చదువుకొని పైకి రావాలి” అన్నాను కంకణం దగ్గర చేసుకొని.
ఉన్నట్టుండి నేను నా పాత ఫాషన్ డిజైనింగ్ క్లాస్ లో కూలబడ్డాను. సర్దుకునేలోపే ఫాకల్టీ మాడమ్ వచ్చి ఇన్ని రోజులూ ఏమీ అయిపోయావు, ఇన్నాళ్ల క్రాఫ్ట్ వర్క్ బుక్ కావాలి అన్నది. అంతే ఆవిడ చేతిలో ప్రాజెక్ట్ పుస్తకం వచ్చి పడింది.
“వెరీ ఆర్రొగంట్ లేడి” అని కళ్ళెర్ర చేసి వెళ్ళిపోయింది.
ఆ తర్వాత పాఠం మీద నా మనస్సు నిమగ్నమైపోయింది.
సాయంకాలం:
“అవును ఆల్ఫా! క్రాఫ్ట్ బుక్ మా మ్యాడమ్ చేతిలో ఎలా పడింది. ?
“మీ మ్యాడమ్ కంకణానికి దగ్గరగా వచ్చి మాట్లాడి ఉంటుంది. ”
************
నేను ఇంటికి వెళ్ళి నా క్రాఫ్ట్ బుక్ తో కుస్తీ పడుతున్నాను.
మా బావ వచ్చాడు “ ఏమే నీకు ఎన్నిసార్లు చెప్పాలి, కుక్క లాగే ఇక్కడే ఉంటావా? మళ్ళీ క్లాస్ లో చేరావా? అంటే నన్ను విడిచి వెళ్ళవా? అని నా మీద కొచ్చి బెదిరిస్తున్నాడు. నా మెడ పట్టుకొని “లావణ్య అంటే నాకు ప్రాణమే, ఒక పని చేయీ, నా తల పగలుకొట్టు” అన్నాడు.
అంతే వాడి వెనకాల ఒక బెత్తం వచ్చి ఉతకటం ప్రారంభించింది. నేను కంకణం మహిమ అని తెలుసుకొని “స్టాప్ ఇట్” అన్నాను.
**********
రాత్రి జరిగింది ఆల్ఫా గాడికి చెప్పాను. వాడు ఉడికిపోయి ఉన్న పళంగా బావ దగ్గరకు తీసుకెళ్లాడు.
లావణ్య తాగి పడుంది. బావ వాష్ రూమ్ లో ఉన్నాడు , లావణ్య స్థానంలో నన్ను ఉంచాడు ఆల్ఫా. నన్ను చూసి ఒక్క పరుగున వెళ్లిపోయాడు. ఇంతలో లావణ్య లేచింది, హే వేర్ ఆర్ యు? అంటూ మెసేజ్ పెట్టింది, వాడికి.
ఒక్క చూపు చూశాడు ఆల్ఫాగాడు తన మొబైల్ ని . అవతలి వైపు నించి మెసేజ్ వచ్చింది.
“హే సెక్స్ టాయ్, ఐ యాం విత్ మై వైఫ్” అని .
లావణ్య గోడ కేసి కొట్టింది. . మొబైల్‌ని.
****************
లావణ్య మా ఇంట్లో ఉండాలి అన్నాను.
అందరం బావ బెడ్ రూమ్ లో ఉన్నాము.
ఆల్ఫాగాడు బావ చూడాలనే లావణ్య ఫ్రెండ్ తడబడుతూ వెళ్లిపోతున్నట్టు చూపించాడు.
నేరుగా తన పడక గదిలో పడుకొని ఉన్న లావణ్య చెంప పగలు కొట్టాడు అతను.
అదిరి పడిన లావణ్య శివంగిలా రెచ్చి పోయి అది నేర్చుకున్న కుంఫూ, కరాటే అన్నీ వాడి మీద ప్రయోగించి వాడి నడుము విరగ కొట్టింది, అమ్మ నాన్న ఎదురుగా.
మా నాన్న క్షమించు తల్లి అన్నారు. . ఇవాళ నా పుట్టిన రోజు. . ఆల్ఫా గాడు పెద్ద బహుమతినే ఇచ్చాడు.
వెదురు కంకణాన్ని దగ్గరగా తీసుకొని చివరి కోరికగా. . “నేను సెల్ఫ్ రిలయంట్ ఉమెన్ అవ్వాలి” అని వాడికి ఇచ్చేశాను.

నీతి: మన జీవితం, ఆ జీవితములో ప్రేమ మనకెంత విలువైనవో, అవతలి వారికి కూడా అంతే విలువైనవి. మన స్వార్థం కోసం అవతలి వారి జీవితాలను పణంగా పెట్టటం అమానుషం.

“మనీ” షి

రచన: కంభంపాటి రవీంద్ర

“లుటే కోయీ మన్ కా నగర్ ..బన్ కె మేరా సాథీ” అని అనిత పాడుతూంటే, చేతిలో ఉన్న ఐస్ కోల్డ్ గా ఉన్న కోక్ టిన్ను పట్టుకుని అలా వింటూండిపోయేడు ఆత్రేయ ! ఆఫీస్ లో ఎవరో యూఎస్ వెళ్తూంటే ఫేర్వెల్ పార్టీ జరుగుతూంది, పార్టీ అనే ఏమిటి, వాళ్ళ ఆఫీస్ లో ఏ ఫంక్షన్ అయినా కూడా అనిత పాట పాడడం అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే, అంత బాగా పాడుతుంది మరి !
పాట పాడడం అయిపోయిన వెంటనే అందరూ ఒకటే చప్పట్లు, ఇంకొక్క పాట పాడమని తెగ రిక్వెస్టు చేస్తే,” తేరే బినా భి జిందగీ సే కోయి షిఖ్వా తో నహీ” అంటూ ఆ అమ్మాయి పాడడం మొదలెట్టేసరికి, కాస్త దూరంలో ఉన్న దోశ కౌంటర్లో దోశెలేసే నరహరి దోశ తిప్పడం మర్చిపోయి అలా వింటూండిపోయేసరికి, వేస్తున్న దోశ కాస్తా మాడిపోయింది !
పాట పాడడం అయిపోయిన వెంటనే ఆత్రేయ దగ్గిరికి పరిగెత్తుకుని వచ్చేసింది !
“మిథాలీ దగ్గర కాస్సేపు ఉండొచ్చుగా .. మళ్ళీ తను యూఎస్ నుంచి ఎప్పుడొస్తుందో మరి “అన్నాడు ఆత్రేయ
“నువ్వు నా చుట్టుపక్కల ఉన్నప్పుడు, నీ కన్నా నాకెవరూ ఇంపార్టెంట్ కాదు” అని అనిత అంటే,” పోనీ నన్ను వెళ్లిపొమ్మంటావా ?” అని నవ్వేడు ఆత్రేయ .
“ఇలాంటి పిచ్చి క్వశ్చన్స్ కి నేను ఆన్సర్ చెప్పను .. సరే .. కాస్సేపు అలా బయటికెల్దామా ?” అడిగింది అనిత.
ఇద్దరూ ఆఫీస్ క్యాంటీన్ బయటనున్న లాన్ లో నడుస్తున్నారు .
“మన సంగతి .. మీ ఇంట్లో చెప్పేవా ?” అడిగింది అనిత
“చెప్పాలంటే భయమేస్తూంది .. అందుకే .. మా పిన్ని హెల్ప్ తీసుకుంటున్నా” అన్నాడు ఆత్రేయ
“ఆవిడ మనకి సపోర్ట్ గా మాట్లాడతారంటావా ?”
“తప్పకుండా.. మొన్న వీకెండ్ మా పిన్ని, బాబాయ్ లని కలిసేను .. నీ ఫోటో చాలా నచ్చింది వాళ్లకి .. అసలు నీకో సిస్టరుంటే వాళ్ళ అబ్బాయి ప్రవీణ్ కి చేసుకుందురట”
“పోన్లే.. అదొక రిలీఫ్ .. ఆవిడ మీ పేరెంట్స్ ని కన్విన్స్ చేయగలిగితే చాలు” అంది అనిత.
“సరే.. నేను ఇంటికి బయల్దేరాలి .. ఇవాళ మా లక్ష్మి పిన్ని వాళ్ళు ఇంటికొస్తామన్నారు .. హోప్ ఫుల్లీ ..వాళ్ళ సపోర్ట్ తో మన పెళ్లి సంగతి మాట్లాడతాను” అన్నాడు ఆత్రేయ
“లెట్ అస్ హోప్ ఫర్ ది బెస్ట్” అని అతని చేతిని గట్టిగా నొక్కింది అనిత .
ఆ రోజు రాత్రి ఆత్రేయ వాళ్ళింట్లో పెద్ద చర్చే నడిచింది .
“ఆ పిల్లకి తల్లీ, తండ్రీ లేరు, ఇలాంటి అణా కాణీ సంబంధం ఎందుకు మనకి” అన్నాడు ఆత్రేయ తండ్రి లక్ష్మణ్
“నిజమే బావగారూ .. ఆ పిల్లకి తల్లీ, తండ్రీ లేరు.. చిన్నప్పట్నుంచీ తనని వాళ్ళ అమ్మమ్మ, తాతయ్య పెంచారు .. అయినా కూడా ఎంత చక్కగా పెరిగింది ఆ అమ్మాయి ! బాగా చదువుకుంది, మంచి ఉద్యోగం చేస్తూంది .. ఇంత కన్నా ఏం కావాలండీ” అని లక్ష్మి అంటే
“చాల్లేవే .. వీడు చేసే ఉద్యోగం లో అమెరికా వెళ్లే అవకాశం ఉంది .. కానీ ఆ పిల్ల అమెరికా వెళ్ళాదట .. తను అక్కడికి వెళ్తే వాళ్ళ అమ్మమ్మ, తాతయ్య లని ఎవరూ చూసుకోడానికి ఉండరు కాబట్టి ఇక్కడే ఉంటుందట ..అంటే .. మన వెధవ కూడా ఆ పిల్ల తో పాటు, ఇక్కడే పడి ఉండాల్సిందే ..పైగా .. ఆ ముసలాళ్ళిద్దరి ఖర్చూ కూడా మన వెర్రాడి జేబులోంచే “అంటూ అందుకుంది ఆత్రేయ తల్లి సరస్వతి
“అక్కా .. ఆ అమ్మాయి తనని పెంచినందుకు వాళ్ళని చూసుకోడానికి ఇండియా లోనే ఉండిపోడానికి నిశ్చయించుకుంది అంటే .. ఆ పిల్లది ఎంత గొప్ప మనసో ..” అని లక్ష్మి అంటే.
“మనసుదేవుంది ..అన్నం పెడుతుందా ఏవన్నానా .. వీడి తోటివాళ్ళందరూ అమెరికా, యూరప్ అంటూ ఉద్యోగాలొచ్చి వెళ్లి, డబ్బులు సంపాదించేస్తూంటే, వీడు మటుకు ఆ పిల్లతో పాటు ఇక్కడే ఉండి, ఆ ముసలాళ్ళ సేవలో తరించాలేంటి ? పైగా ..వాళ్ళది మన శాఖ కూడా కాదు ..
కనీసం వెలనాట్లు కూడా కాదు ..నియోగులట !!” ఈసడింపుగా బదులిచ్చింది సరస్వతి
“డబ్బుదేముందక్కా .. గుణం ముఖ్యం గానీ .. ఇంక శాఖాభేదం అంటావా ..ఈ రోజుల్లో అవన్నీ ఎవరు పట్టించుకుంటున్నారు కనక ?.. అసలు మీవాడో బ్రాహ్మణ పిల్లని ప్రేమించేడు .. అదే సంతోషం అనుకోవాలి” అంది లక్ష్మి
“నీకు డబ్బూ, శాఖ, కులమూ ప్రధానం కానప్పుడు, ఆ పిల్లని మీవాడికే చేసుకో .. మావాడ్ని వెనకేసుకు రాకు .. ఒకవేళ వీడు మమ్మల్ని కాదని ఆ పిల్లని చేసుకుంటే, వీడికి మేమెవరమూ లేనట్టే” కోపం గా అన్నాడు లక్ష్మణ్
“నాకు ఆత్రేయ, ప్రవీణ్ వేర్వేరు కాదండి . . ఒకవేళ ఆత్రేయ ఆ అమ్మాయిని ప్రేమించకుండా ఉండుంటే, ఆ పిల్లని మా ప్రవీణ్ కి కళ్ళకద్దుకుని చూసుకునేదాన్ని” అనేసి విసురుగా వెళ్ళిపోయింది లక్ష్మి .
మర్నాడు అనితని తీసుకుని, లక్ష్మి పిన్ని వాళింటికెళ్ళేడు ఆత్రేయ.
“పిన్నీ .. ఏం చెయ్యాలో తోచటం లేదు ..అనితేమో పెద్దలు ఒప్పుకోనిదే పెళ్ళొద్దు అంటూంది .. మరి నిన్న మా అమ్మా వాళ్ళ అభిప్రాయం చూసేవు కదా .. నువ్వే చెప్పు ..” అన్నాడు
“ఒరే వెధవా .. ఆ పిల్లని నిజంగా ప్రేమించుంటే, ఏం చెయ్యాలో తోచడం లేదు లాంటి వెర్రిమాటలెందుకొస్తాయి ?.. నిజం చెప్పు .. ఆ అమ్మాయిని నిజంగా ప్రేమిస్తున్నావా ?” అంది లక్ష్మి
“భలేదానివి పిన్ని .. మా అమ్మతో సమానమైన రెస్పెక్ట్ ఇస్తాను నీకు .. నేను ఎప్పుడైనా అబద్ధం చెప్పేనా ?.. నేను అనిత ని తప్ప వేరెవర్నీ పెళ్లి చేసుకోను .. ప్రామిస్” అన్నాడు ఆత్రేయ
“అయితే …ఇంకేమి. నేనూ, మీ బాబాయి గారు కలిసి వీళ్ళ తాతగారితో మాట్లాడతాము .. మీ అమ్మావాళ్ళూ ఇప్పుడు ఒప్పుకోకపోయినా, తర్వాతయినా ఒప్పుకోక తప్పదు .. నువ్వు తప్ప వాళ్ళకెవరున్నారు కనుక ?” అని భరోసా ఇచ్చింది లక్ష్మి పిన్ని !
“చాలా థాంక్స్ పిన్నీ” అని ఆత్రేయ అంటే,” మీరీ హెల్ప్ చేసినందుకు ఎప్పటికీ మర్చిపోలేమండి” అంటూ అనిత లక్ష్మి పిన్ని కాళ్ళకి దణ్ణం పెట్టేసింది
“ఆమ్మో! మా పెద్ద కోడలు బంగారం” అంటూ ఆశీర్వదించింది లక్ష్మి .

**************************

“మనకి పెళ్ళై రెండేళ్ళవుతూంది. బాబు పుట్టి ఏడాదవుతూంది .. ఇంతవరకూ మావయ్యగారూ వాళ్ళూ మనల్ని కలుపుకోడానికి ఇష్టపడ్డం లేదు” దిగులుగా అంది అనిత
“పెళ్ళైతే మాతో సంబంధం లేదని మా నాన్నగారు ముందే చెప్పేరుగా” అన్నాడు ఆత్రేయ
“కరెక్టే .. కానీ ఇప్పుడు, బాబుని, అమ్మమ్మ వాళ్ళని చూసుకోడానికి నేను జాబ్ మానేసి ఏడాదవుతూంది .. నీ ఒక్కడి శాలరీతో ఇంతమందిని ఎలా పోషిస్తావు ?” బాధగా అంది అనిత
“ఒక మూడు నెలలు అమెరికాకి వెళ్లమంటున్నారు .. కొంచెం ఇలాంటి షార్ట్ ట్రిప్స్ ఒప్పుకుంటే డబ్బులు మిగులుతూంటాయి .. నీకు సపోర్ట్ గా మా లక్ష్మి పిన్ని ఉంటుంది .. ఓసారి వాళ్ళింటికి వెళ్ళి విషయం చెబుదాం” అని లక్ష్మి పిన్ని వాళ్ళింటికి బయల్దేరదీసేడు .
లక్ష్మి పిన్ని వాళ్ళ ఫ్లాట్ బయట చెప్పులిప్పి కాలింగ్ బెల్ కొట్టబోతూ ఆగాడు ఆత్రేయ,
“ఆ ఆత్రేయగాడిలా పిచ్చి సంబంధమేదైనా ప్రేమా దోమా అంటూ అన్నావంటే ఇదిగో. ఈ సిలిండర్ పేల్చుకుని చస్తా వెధవా .. నీకొచ్చింది అల్లాటప్పా సంబంధం అనుకున్నావా ? పిల్లకి గ్రీన్ కార్డుంది .. కోటీశ్వరులు .. పైగా మన శాఖే .. వైదీకులు” అంటూ తన కొడుకు ప్రవీణ్ మీద విరుచుకుపడుతున్న లక్ష్మి మాటలు స్పష్టంగా వినిపించాయి !

తను కన్నతల్లి

రచన: చెంగల్వల కామేశ్వరి

“అమ్మా” చిన్నగా అరిచింది విమల. సూది గుచ్చుకుంది. వేలులో దిగిన సూదిని తీసి పక్కన పెట్టింది. విమల ఆగకుండా కారుతున్న రక్తం! వదిన వంటింటి లోంచే ఏమయింది! అనడుగుతోంది. తనే గబగబా వాష్ బేసిన్ దగ్గరకు పరిగెత్తింది. రక్తం కారుతున్న వేలుని నీళ్లతో కడిగి రక్తం కారడం ఆగాక మళ్లీ వచ్చి కుర్చీలో కూర్చుని మళ్లీ అప్రయత్నంగా గోడ మీద ఉన్న ఫొటోలో నవ్వుతున్న అమ్మ ఫొటో చూసిన విమల కళ్లల్లో నీళ్లు చిప్పిల్లాయి.
“అమ్మ “అమ్మ” ఉంటే ఈ పాటికి తన అజాగ్రత్తకు సుతిమెత్తగా తిడ్తూనే కాఫీ పొడి అద్దటం చేసేది. అన్నం కలిపి తినపెట్టేది. అప్పుడే నెలయింది. అమ్మ పోయి. ఇంత సడన్ గా అమ్మ తమందరిని వదిలి వెళ్లిపోతుందని అనుకోలేదు.
“అమ్మ” విలువేంటో అమ్మ గొప్పతనమేమిటో అమ్మ పోయాకే తెలిసింది. నాన్న తాము అమ్మ లేకుండా ఎలా ఉండాలో! అర్ధం కావటంలేదు. నాన్న అమ్మని ఎంత ప్రేమించాడో ఇప్పుడిప్పుడే అర్ధమవుతోంది. వాళ్ల దాంపత్యంలో ఉన్న అనుబంధమేమిటో నాన్న నోటినుండి అమ్మ జ్ఞాపకాలుగా వింటుంటే నాన్న ఇంత మాట్లాడటం అది కూడా అమ్మ గురించి. మాట్లాడటం. ఆశ్చర్యంగా ఉంది.
అమ్మ ఫొటోలు వీడియోలు వెతుక్కుని వెతుక్కుని చూస్తూ ఒక్కో సారి నవ్వేసుకుంటూ మరోసారి కళ్లొత్తుకుంటో చూస్తూ అమ్మ వియోగానికి చిక్కిశల్యమవుతున్న నాన్నని చూసి, చిన్న అన్నయ్య, తను ఏడ్వలేక, ఏడుపు ఆపుకోలేక, యాతన పడుతూ నాన్నని ఓదార్చాల్సి వస్తోంది. నాన్నని తనతో తీసుకెళ్లడం కోసమే తను వెళ్లకుండా ఆగిపోయింది.
పెద్దన్నయ్య వాళ్లు ఈ ఊళ్లోనే ఉన్నా పెద్దొదిన ధోరణికి తామెవ్వరూ వెళ్లరు. చిన్నన్నయ్య చిన్నొదిన అమ్మానాన్న అన్నా, తనన్నా ప్రాణం పెడతారు. అందుకే పిల్లలు కూడా ఇక్కడ ఉండటానికే ఇష్టపడతారు. కాని అందరి బదులు అమ్మని ఆడిపోసుకున్న పెద్దొదినకి, అమ్మ విలువ ఏనాటికీ అర్ధంకాదు. అందుకే పెద్దన్నయ్య రమ్మన్నా అక్కడికి వెళ్లలేదు నాన్న .
తను కూడా భర్త సూర్యాన్ని పంపేసి నాన్న కోసం కొన్నాళ్లు ఉండి వచ్చేప్పుడు నాన్నని తనతో తీసుకెళ్లాలని ఆగింది. నాన్న ఇంకా అమ్మ పోయిన షాక్ నుండి తేరుకోలేదు. తన ప్రక్కనే పడుకొన్న అమ్మ అచేతనంగా ఎలా అయిందో అర్ధం కాని అయోమయంలోనే ఉండిపోయాడు. సరిగ్గా నిద్రపోడు. ఏది పెట్టినా తినడు. ఎప్పుడూ తనలో తానే తిరణాలలో తప్పిపోయిన వాడిలా అమ్మ వాడిన వస్తువు దగ్గర పెట్టుకుని కుమిలిపోతూ ఉంటాడు
వదిన ఏది చేసిపెట్టినా “అచ్చం మీ అత్తగారిలాగే చేసావమ్మా! ఇదివరకు అలా చేసేదానివి కాదు. మీ అత్తయే నీ చేత ఇలా చేయిస్తోందేమో! అని తినడానికి కూర్చున్నా అమ్మ జ్ఞాపకమొచ్చి చేయి కడిగేసుకుంటున్నాడు.
ఇంకో నెలలో అమెరికా వెళ్లిపోతుంది. మళ్లీ ఇండియాకి రావాలంటే అమ్మ లేని ఇంటికి ఎలా రావాలో! అనుకుంటేనే గుండె బావురుమంటోంది. తనని చూడాలని అమ్మ అంటే రెండేళ్లయింది నువ్వెళ్లి ఎప్పుడొస్తావే!
“తల్లి ఉన్నఫ్పుడే పుట్టిల్లు! పాలున్నప్పుడే పాయసం! అని సామెతలు చెప్పేది. కాని ఆ తల్లి ఇంకలేదు అని తెలిసాక ఎంత ఏడ్చిందో! అందరికన్నా చిన్నదని ఎంతో గారం చేసే అమ్మ చివరిక్షణాలలో కూడా చూసుకోలేదు. ఆ తరగని దుంఖంతో దూరం తరగని ఆ దూరప్రయాణం తాను మరువలేదు.
కానీ ఇక్కడే ఉన్న వాళ్లందరూ అమ్మని ఎంత మిస్సవుతున్నారో! వాళ్లెలా మామూలుగా అవుతారో! అమ్మంటే ప్రాణం పెట్టే తమతో పాటు అమ్మమ్మ బామ్మ మామయ్యలు పిన్నిలు బాబయ్యలు అమ్మ ఫ్రెండ్స్ అకస్మాత్తుగా దూరమయిన అమ్మ గురించి ఎంత వేదన పడుతున్నారో!
అమ్మ సహాయం పొందిన వారు అమ్మ గురించి చెప్పుకొని ఏడుస్తుంటే అటువంటి తల్లి కడుపున పుట్టటమే అదృష్టం కాని అమ్మని ఆనందపరిచే అవకాశం తామెవ్వరికీ ఇవ్వలేదు. ఎందుకంటే ఎన్ని టెన్షన్స్ ఉన్నా తను చేసుకునే మెడిటేషన్ పూజ సామాజిక కార్యక్రమాలతో ప్రశాంతంగా ఆనందంగా తానుంటూ అందరిని ఆనందపరిచేది.
అయినా “చచ్చిన వాళ్ల కళ్లు చారెడేసి !అన్నట్లు అమ్మ బ్రతికున్నప్పుడు అందరూ రకరకాలుగా అమ్మ ని ఏదో ఒకటి అన్నవారే! ఇప్పుడవన్నీ అమ్మతో పాటే మాయమైపోయాయి. అమ్మ మంచితనమే అందరికీ అర్ధమవుతుంది. ఉనికి పోయాకే మనుష్యులు గుర్తింపబడతారా ఏమో,! ఇప్పుడలాగే అనిపిస్తోంది.
అమ్మ ఉన్నప్పుడు అమ్మ కేవలం గృహిణి మాత్రమే కాదు . సామాజికంగా పలు సంస్థలు చేసే కార్యక్రమాలలో పాల్గొనేది. సాహిత్యం పట్ల మక్కువతో పుస్తకాలు కొని చదివేది. ఏవేవో రాస్తూ పుస్తకాలకు పంపేది. ఇలా ఎప్పుడూ తనను తాను బిజీగా ఉంచుకుంటూ సోషల్ మీడియాలో కూడా చాలా మంచి పేరు సంపాదించుకుంది. ఇవన్నీ తమకు గర్వంగానే ఉండేవి. కాని కొందరు కావాలని హేళనగా మాట్లాడేవారు. నాన్న మీద తమ మీద అక్కరలేని జాలి కురిపిస్తూ అమ్మ తమందరినీ గాలికొదిలేసినట్లు నాన్న అమ్మని కట్టడి చేయలేదన్నట్లు చేసే వాఖ్యానాలకి అమ్మ చాలా బాధపడేది.
నాన్న అన్నయ్య తను ఎప్పుడూ అమ్మ వల్ల ఇబ్బంది పడలేదు. అమ్మ బిజీగా ఉంటే తామేదయినా సహాయం చేస్తే దానికే ఎంతో పొంగిపోయేది. ఇంటికెవరో ఒకరు రావడం సాహిత్య చర్చలు జరగడం అన్నీ బాగుండేవి. తమ పెళ్లిళ్లు అవి ఉన్నప్పుడు అవన్నీ మానుకుని ఇల్లాలిగా తల్లిగా తన బాద్యతలు నెరవేర్చేది. అలా ఇంటా బైటా గెల్చి మన్ననలు పొందిన అమ్మ పెద్దొదినకి నచ్చలేదు.
అమ్మ రాసిన విషయాలను కధలను ప్రస్తావించి హేళనగా మాట్లాడటం ఈ వయసులో ఇంత మెయింటెయిన్ చేసే వారినెక్కడా చూడలే్దు పెద్దరికం అంటే వయసుకొస్తే చాలదు. ఇంకా కోడళ్లతో కూతుళ్లతో పోటీ పడతుంది మా అత్తగారు. మనవలనెత్తినా స్వీట్ సిక్స్టీన్ అనుకుంటుంది. ఆ చీరలేంటో ఆ వాలుజడలేంటో! అని ఆవిడ పై ఉన్న ఈర్ష్యాసూయలు వెలిగ్రక్కుతూ ఉండేది. అమ్మ యాక్టివ్ గా ఉండటం వలన ఆవిడ వయసు కన్నా తక్కువగా కనిపించేది. దానికి సాయం ఇంటా బయటా పనుల కోసం తిరిగేదేమో ఉన్నంతలో నీటుగా ఉండేది. అది చూసి ఓర్వలేకపోయేది. పెద్దవదిన.
ఈవిడ మాటలు విని అమ్మేమయినా హర్ట్ అయిందేమో అనుకుని “అవేమి పట్టించుకోవద్దు” అని చెప్పబోతే చాలా తేలికగా నవ్వేసి” నాకు ఇవేమి కొత్తకాదమ్మా! నేనేమిటో మీకు తెలుసు. నాకు తెలుసు. నా గురించి అర్ధం కాని వారనుకుంటే ఎందుకు పట్టించుకోవాలి”అనేది. నాన్న జోక్ చేసేవారు. “భార్యా రూపవతీ శత్రువు” అన్నారు కాని అత్తా రూపవతీ శత్రువనలేదు కదే ! అని అమ్మ భయపడేది. “కోడలు వింటే గొడవలవుతాయి. బైటకెడతూ ఉంటాను కాబట్టి ఏదో రెడీ అయి వెడతాను. కాని, వయసులేదా అత్తగారు అవలేదా అమ్మమ్మ బామ్మ అవలేదా ! మీరు మరీను!” అని కేకలేసేది.
అలా అమ్మ మవునాన్ని అలుసుగా తీసుకుని బాహాటంగా అందరి ఎదురుగా మాట్లాడటం. ప్రతీదానికి వాళ్ల అమ్మతో పోల్చుకుని ఆవిడ మహా పతివ్రత మొగుడు గీసిన గీటు దాటదు. ఇల్లే ముఖ్యం మా అమ్మకి. . ఇవన్నీ ఆవిడా చేయగలదు. కాని, మా అమ్మకి ఇలా వీధులమ్మట సింగారించుకుని తిరగడం ఇష్టంలేదు అని” అయినా ఇలా వచ్చే పోయే వారికి వండి వార్చి ఇల్లు దిబ్బ చేస్తోంది రేపు మాకందరికీ ఉన్నాయి తిప్పలు” అంటూ అమ్మని మాటి మాటికి అంటుంటే నచ్చక ఒకరోజు నాన్నకి చిర్రెత్తింది. .
“ఏమ్మా! మీ అత్తగారు ఎలా ఉంటే నీకేమయింది. దానికి ఏది కట్టినా ఎలావున్నా నప్పుతుంది. ఈ రోజు కొత్తగా వచ్చింది నువ్వొక్కదానివే! అత్తగారు చేసేవి రాసేవి నచ్చకపోతే నీ ఇష్టం! మర్యాద తగ్గించి మాట్లాడితే బాగుండదు”. అని గట్టిగా చెప్పారు. దానికి పెద్ద రాద్దాంతమే జరిగింది.
అమ్మ కూడా కొన్ని సంధర్భాలలో మృదువుగా నచ్చచెప్పి చూసింది. కాని ,ఆ వంకా,ఈ వంకా పెట్టి వేరు కాపురం పెట్టించింది. పెద్దొదిన ఈ పరిస్తితులు చూసి పెద్దన్నయ్య ఇబ్బంది పడుతూ మెయిల్ పెడ్తే, తను కూడా చెప్పింది. “నచ్చనపుడు దగ్గరే ఉండి, నచ్చకుండా ఉండే కంటే, వేర్వేరుగా ఉండటమే మంచిది. ! అని. పాపం వాడు తనొక్కడే వేరయినట్లుగా దిగాలు పడటం చూసి తనూ చిన్నన్నయ్య అమ్మా నాన్న నచ్చచెప్పారు.
” ఏదో అప్పుడప్పుడు రావటం వెళ్లటం తప్ప పెద్దొదినతో పెద్ద అనుబంధం ఏర్పడలే్దు. తనకి కూడా చిన్నొదినలో అమ్మే కనిపిస్తుంది. అందరికీ ఆ చిన్నావిడే కావాలి మేమే ఎవరికీ అక్కర్లేదు అని మధ్య మధ్యలో దులపరించేస్తూ ఉంటుంది. విచిత్రమేమిటంటే అమ్మ పోయినప్పుడొచ్చిన రాజకీయ ప్రముఖులని, వీధంతా నిండిన పలు సంఘాల సభ్యులని చూసి పోయిన అత్తగారి గురించి చిలవలు పలవలు పోతూ పెట్టిన శోకాలు చూసి తమవారందరూ విస్తుపోయారు.
నాన్నకన్నా తను ముందు పోవాలని అనేది కాదుఅమ్మ పెద్దొదిన పెట్టే గొడవలకి కలత చెంది ” మీనాన్న కన్నా నేను ముందు పోతే ముత్తైదువగా పసుపుకుంకాలతో పోతానేమో కాని, నాన్న నేను లేకుండా ఉండలేరే! వాళ్లమ్మ పోయినపుడే ఎంత బెంగపడ్డారో! నేను లేకపోతే నాన్నను నువ్వే చూడాలమ్మా! అంటే అలాంటి మాటలేంటమా! ఏభయ్యేడేళ్లకే ఇలా మాట్లాడతావా! నువ్వింకా రిటైర్ కాలేదు నాన్నే రిటైర్ అయ్యారు. అయినా మీ ఇద్దరిని నాతో తీసుకెళ్లిపోతాను. ఆ సోషల్ వర్కేదో అమెరికాలో చేయి. ,! అనేది.
అలాంటిది ఇలా సడన్ గా వెళ్లిపోయింది. అని బాధ పడుతుంటే నాన్న తన తల నిముర్తూ “దాన్ని నా కళ్లల్లో పెట్టి చూసుకున్నాను. దాన్నెవరికి అప్పచెప్పి పోవాలా అనుకున్నాను. కడతేరేదాకా నా పక్కనే ఉంది. దాని మంచి మనసుతో లోకాన్ని గెలిచింది. ఇంట గెలవలేకపోయింది. ఆ సంగతి నాకు తెలుసమ్మా! దాని ఆశయాలు ఆలోచనలు ఉన్నతమైనవి. అందుకే అదేం చేస్తాను అన్నా అభ్యంతరపెట్టలేదు. కాని మీ అంతా పెద్దయ్యాక పిల్లలు పుట్టాక అమ్మ అభివృధ్ది చెంది అందరి కంటే బిజీగా ఉండటం కొందరికి నచ్చలేదు. అలాంటిది నేను ముందు పోయి అది మిగిలిపోతే దానికేం చేసేవారో కాని దాని మనసుని చంపేసేవాళ్లు. చాలా మందున్నారు. ఎవరి చేతా చేయించుకోకుండా మంచాన పడకుండా పువ్వులా వెళ్లిపోయింది. నేను కూడా అలాగే వెళ్లాలి అనే కోరుకుంటున్నాను” అన్ననాన్నమాటల్లోఎంతో సత్యముందనిపించింది. అందుకే అమ్మ కోరిక ప్రకారం మీరు నాదగ్గరే ఉండండి. నాన్నా! ఎప్పుడు కావాలంటే అప్పుడు చిన్నన్నయ్య దగ్గర ఉందురు గాని అని చెప్పింది తను.
ఇకనుండి నాన్నకు అమ్మానాన్న తనే ! అనుకుంటూ గుచ్చిన పూలదండ తీసుకెళ్లి తల్లి ఫొటోకి అలంకరిస్తూ అమ్మా! నాన్నలోనే నిన్నూ నాన్నను చూసుకుంటాను. నాన్న గురించి బెంగపడకమ్మాఅని చెప్తున్న “తను”చెప్పిన విధంగానే చేస్తున్న” తను “కన్న” తల్లి” తన కూతురి ని దీవిస్తున్నట్లుగా ఫొటోలోంచి నవ్వుతోనే ఉంది అమ్మ. తల్లి కోరిక తీర్చిన తనయగా ఆ దేవతకు మనస్పూర్తిగా మొక్కుకుంది విమల.

ఆపరేషన్ పాంచాలి

రచన: శ్రీదేవి

న్యూయార్క్ నగరం: పొద్దున్నే నిద్ర లేస్తూనే పరుగుపెట్టే పోటీ ప్రపంచంలో మానవాళికి ఏదన్నా సహాయ పడాలి అనే ఉన్నత ఆశయాన్ని ఊపిరిగా చేసుకొని జీవితoతో పోరాడుతున్న యువకుడు దీప్. ఒక విదేశీ కుటుంబానికి భారతీయురాలైన పేద తల్లి చేత దత్తతకి ఇవ్వబడ్డాడు. తన ఆశయం కోసం ఎలాంటి ప్రమాదన్నయినా స్వీకరిస్తాడు అతడు. ప్రపంచమంటే గిరి గీసుకున్న నాలుగు గోడలు కాదని, కొన్ని కోట్ల హృదయాల సమ్మేళనమే అని మనస్ఫూర్తిగా నమ్మే వ్యక్తి. .
భారత దేశం: అచ్చమయిన పదహారణాల ఆడపిల్ల. విప్లవాత్మకమైన ఆలోచనలు, పుట్టుకతో ఫెమినిస్ట్. కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే మనస్తత్వం, ప్రస్తుతం చిన్న చిన్న రచనలు చేస్తూ.. గుర్తింపు కోసం ఎదురు చూస్తోంది-మహన్విత
తన పెంపుడు తల్లి ద్వారా మహన్విత గురించి తెలుసుకుంటాడు దీప్. తమ సంస్థకి గుర్తింపు రావాలంటే కొన్ని ప్రమాదకరమైన పనులు చేయాలని అది మహన్విత ద్వారా సాధ్యమని అతడి తల్లి అతడిని ఇండియాకి పంపుతుంది.
ఇండియాకి వచ్చాక మహాకి, అతడి తల్లికి ఎఫ్. బి లో తన పాత రచనల మీద జరిగిన వాగ్వివాదం గూర్చి చెప్పి సహాయానికి నిరాకరిస్తుంది మహా. ఎలాగో ఆమెను బతిమిలాడి ఒప్పించి తను వచ్చిన విషయం వివరిస్తాడు దీప్.
తనకి ఒక తీవ్రవాది అయిన 37 ఏళ్ల మహిళా జీవిత ఖైదీని ఇచ్చి పెళ్ళి చేయాలని, తద్వారా మానవతా దృక్పథంతో తను చేసిన పనికి, తమ సంస్థకు దేశ వ్యాప్తoగా గుర్తింపు కలుగుతుందని, తర్వాత నిదానంగా ఆమెకు జీవనోపాధి కల్పించి విడాకులు పొందాలని, దానికి మహా సహకరించాలని. మహా అందుకు తీవ్రంగా మండిపడుతుంది. అతడు అసహనంతో కొన్ని వారపత్రికలను ఆమె మొఖం మీద విసిరి కొడతాడు. వాటిలో మహా, తన చిన్ననాటి అభిమాన ప్రఖ్యాత విలేఖరి అయిన షామా చతుర్వేది, ఒక తీవ్రవాదిగా చేయని తప్పుకి 15 సంవత్సరాలుగా జైలు శిక్ష అనుభవిస్తోంది అని తెలుసుకుని నమ్మలేకపోతుంది. జరిగిన అన్యాయం పూర్తిగా తెలుసుకోవాలని, ఆమెను రక్షించాలని దీప్ కి సహకరిస్తానని మాట ఇస్తుంది.
అప్పటి నించి ‘ఆపరేషన్ పాంచాలి’ మొదలవుతుంది.
**************
ఇద్దరూ షామాను కలిసి పెరోలు మీద తీసుకెళతామని చెప్పగా ఆమె “మీరు ఏమి ఆశించి ఈ సహాయం చేస్తున్నారో”? అంటూ సహాయాన్ని నిరాకరిస్తుంది. వారు నచ్చచెప్పటానికి ప్రయత్నించినా ససేమిరా అంటుంది షామా. ఈ క్రమంలో దీప్ ని చాచి పెట్టి కొడుతుంది ఒక సందర్భంలో షామా. మహా కలగచేసుకొని గొడవ సర్దుబాటు చేస్తుంది.
మొత్తానికి 4 లక్షలు తన సొంత డబ్బును పెట్టుబడిగా పెట్టి షామాను పెరోలు మీద విడుదల చేయిస్తాడు దీప్. ఆమె 15 ఏళ్ళ శిక్ష కారణంగా త్వరగా కోలుకోదు. దీప్ కి ఈ విషయం కంఠకంగా మారుతుంది. ఆమెను ఎంత త్వరగా వివాహమాడి ఈ ప్రపంచానికి చూపిస్తే అంతా త్వరగా అతడి అప్పులు తీరి తమ సంస్థకి గుర్తింపు వస్తుంది. ఈ విషయం ఆమెతో చెప్పాలని అతడు శతవిధాలుగా ప్రయత్నించినా కూడా, ప్రతిసారి ఏవో అవాంతరాలు వచ్చి చెప్పలేక పోతాడు. మహా సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది.
ఒక పక్కన 4 లక్షల అప్పు, దాని యొక్క వడ్డీ దీప్ ని వేధిస్తుంటే మూలిగే నక్క మీద తాటి కాయ పడ్డట్లు, షామాకి బెయిల్ ఇచ్చిన లాయరు పెళ్లి నాటకం ఆమెకు చెప్తానని బెదిరిస్తుంటాడు, అంతే కాకుండా షామాకి దగ్గరవ్వటానికి శత విధాలుగా ప్రయత్నిస్తుంటాడు. మహా వాటిని అంతే సమర్ధవంతంగా చెడగొడుతూ ఉంటుంది.
కొన్ని రోజులకి షామా పూర్తిగా కోలుకొని మునుపటి సంస్థలోనే ప్రోగ్రామ్ ఎక్సెక్యూటర్ ఉద్యోగములో చేరుతుంది. పరిస్ధితి మెరుగు పడటంతో షామాకి అసలు విషయం చెప్తుంది మహా. కానీ అప్పటికే తను రిషిని ప్రేమిస్తున్నానని తనకు తిరిగి ఉద్యోగానికి సరిపడే స్థైర్యాన్ని తానే కల్పించాడని, కావాలంటే డబ్బు తిరిగి ఇస్తానని చెప్పి దీప్ ని క్షమించమని కోరుతుంది. దీప్, మహా లు ఆమె సమాధానానికి హతాశులయిపోయి, షామాను బాధ పెట్టకూడదు అని అనుకుంటారు. నిరాశతో దీప్ వేరే ప్రోజెక్ట్ కోసం బయలుదేరుతుండగా మహాకి మెరుపు లాంటి ఆలోచన వస్తుంది.
ఇద్దరు కలిసి రిషి ఇంటికి వెళ్ళి షామా కోసం చేసిన ఖర్చు చూపి వాపసు చేయమని అడుగుతారు. అతడు సంతోషంగా వారి చేతిలో 10 లక్షలు పెడతాడు. గొంతులో పచ్చి వెలగకాయ పడ్డట్లు అయ్యి వారిద్దరూ చెక్కు తో ఇంటి ముఖం పడతారు.
షామా, మహా ఇల్లు ఖాళీ చేసి వేరే ఇంటికి మారుతుంది. నిశ్చితార్థం కూడా రిషితో అంగ రంగ వైభవంగా జరుగుతుంది.
దీప్ కి డబ్బు వచ్చింది కానీ తను అనుకున్న పని అవ్వ లేదు. పైగా పది లక్షలు తీసుకోవటం అతనికి ఎందుకో మనస్కరించదు. అందుకే రిషికి చెక్కు ఇచ్చి వేయమని షామాకి చెప్పాలని, ఆమె ఇంటికి వెళ్తా డు. అక్కడ ఆమె లేదని ప్రోగ్రామ్ పని మీద MLA క్వార్టర్స్ కి వెళ్ళిందని తెలిసి అక్కడకు వెళ్తాడు.
అక్కడ.. రిషి , షామా పరిస్థితి చూసి అవాక్కు అయిపోతాడు. రిషి గాయాలతో నెత్తుటి మడుగులో అపస్మారక స్థితిలో ఉంటాడు. షామా MLA మహిధర్ వీడియోని షూట్ చేస్తూ ఉంటుంది. మహిధర్ “నేనే షామా మీద తీవ్రవాదీ అని ముద్ర వేసి 15 ఏళ్ళు జైల్ శిక్ష వేయించాను, ఆమె నా కార్యకలాపాలకు అడుగడుగునా అడ్డు పడటం నాకు నచ్చలేదు. ముఖ్యంగా భూకబ్జాల వీడియో ఎక్కడ బయట పెడుతుందో అని పధకం ప్రకారమే ఇదంతా చేశాను” అని పూస గుచ్చినట్లు చెప్పుకొస్తున్నాడు.
ఇంతలో గణగణమంటూ అంబులెన్సు, ఆ వెనుకే పోలీసుల జీపు వస్తాయి. రిషిని హుటా హుటిన తీసుకెళ్తారు వైద్య నిమిత్తం.
దీప్ షామాను చాచి పెట్టి కొడతాడు “ఇందుకేనా నిన్ను బయటకి తీసుకొచ్చింది” అంటూ.
“నీకు పది లక్షలు ఎలా వచ్చాయి దీప్?”
“ఇది నీకు ఇచ్చి వెళ్దామనే వచ్చాను”
“అది నీకు చెందిన చెక్కు, నాకెలా ఇస్తావ్”
“షామా”?
రిషి ఎవరో తెలుసా? నా చిరకాల మిత్రుడు, వాడిని నేను ఎందుకు చంపుతాను? పెరోలు కోసం మహా వచ్చినపుడు రిషి గురించి తెలుసుకొని, వాడు లాయరు అయ్యాడని తెల్సి ఆశ్చర్యపోయాను, వాడికి కబురు పంపాను. కానీ వాడి గూర్చి మీకు చెప్ప లేదు, ఎందుకంటే నా కేసు సాక్షాల సేకరణకు వాడు ఒక్కడే నాకు నమ్మకమైన వ్యక్తి, ఆ MLA శక్తి తెల్సి కావాలనే మీ ఇద్దరినీ దూరముగా ఉంచాను. వాడు తన ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ఈ‌ ఆపరేషన్ ని ముందుకు తీసుకెళ్లాడు. నిశ్చితార్థం కూడా అతడిని కలవటానికి మేము ఆడిన నాటకమే.. ఈ MLA కారణంగా నా పిల్లలకి దూరం అయ్యాను. నా భర్త కూడా నన్ను అవమానించాడు, ఇప్పటికీ నన్ను గౌరవించటం లేదు, నా వృత్తిని కోల్పోయాను, నా 15 సంవత్సరాల జీవితం కోల్పోయాను.. అంటూ వివరిస్తుంది. నిస్తేజంగా షామా..
షామాను విచారణ నిమిత్తం పోలీసులు తీసుకెళ్తారు..
దీప్ మీద కదిలి పోతున్న పోలీసు జీపు పొగ చిమ్ముతూ వెళ్ళిపోతుంది.
*********************

కృతజ్ఞత

రచన: ఝాన్సీరాణి కె.

డాక్టర్‌ హరిత వార్డ్‌ రౌండ్‌ పూర్తి చేసుకుని బయటకు వస్తూంది. హరిత పేరు పొందిక గైనకాజిస్టు. హస్తవాసి మంచిదని రోగులను ప్రేమగా చూస్తుందని మంచిపేరు వుంది. ఆవిడ గవర్నమెంట్‌ హాస్పిటల్‌లో పని చేస్తూంది.
హరిత భర్త ఆదిత్య కూడా డాక్టర్‌ ఆర్థోపెడిక్‌ సర్జన్‌. హైదరాబాద్‌లో ప్రైవేట్‌ హాస్పిటల్‌లో పని చేస్తున్నాడు. అంతేకాక చాలా క్లినిక్‌కి కూడా వెళ్ళి వస్తూంటాడు. క్రిటికల్‌ సర్జరీకి చాలా నర్సింగ్‌ హోమ్స్, కార్పొరేట్‌ హాస్పిటల్స్‌ నుంచి కూడా ఆదిత్యకు పిలుపు వస్తూ వుంటుంది. వారిది చాలాఅనోన్య దాంపత్యం ఆదిత్య, హరితకు ఒకే కూతురు చిరిత టెన్త్‌ క్లాస్‌ చదువుతూంది.
“మేడమ్‌, ఒక పేషెంట్‌ కడుపులో నొప్పి అంటూ వచ్చింది. గదిముందు బెంచిపై కూర్చోబెట్టి వచ్చాను” అంది నర్స్‌ విజయ.
పద వస్తున్నానంటూ కన్సల్టింగ్‌ రూం వైపు నడుస్తున్న హరిత ఒకక్షణం అలాగే నిలుచుండి పోయింది. ఆ మొహం ఎక్కడో చూసినట్లనిపించింది. మరో రెండు క్షణాలకి గుర్తుకి వచ్చింది తను ఆ మొహన్ని ఎక్కడ చూసిందో.
వారం రోజుల క్రితం ఆదిత్య బ్రీప్‌కేస్‌ నుంచి కొన్ని పేపర్స్‌ తీసుకు రమ్మన్నాడు. ఆ పేపర్స్‌ తీస్తూవుంటే కింద ఒక ఫోటో కనిపించింది. అప్పటికి ఆవేశాన్ని అణచుకుని రాత్రి హరిత ఆదిత్యని అడిగింది బ్రీఫ్‌కేస్‌లో ఉన్న ఫోటో గురించి. అది చాలా ముఖ్యమైన వ్యక్తిది. దాని గురించి పిచ్చి ఆలోచనలు చేయకు. ఇప్పటికి చర్చ అనవసరం అని బయటకు వెళ్ళాడు ఆదిత్య. అప్పటినుంచి ఆ ఫోటో గురించి ఎలా ఆరాతీయాలా? అసలు ఆ ఫోటోలో వ్యక్తి ఎవరు? ఆమెకు ఆదిత్యకు సంబంధం ఏమిటి? దాని వలన భవిష్యత్తులో తలెత్తే సమస్యలేమిటి? తన జీవితం మాట ఎలా వున్నా చరిత భవిష్యత్తు ఏమవుతుంది అన్న ఆలోచన మధ్య సతమతమవుతుంది హరిత. ఆదిత్యని ఆ ఫోటోగురించి అడిగినపుడు ఉలిక్కిపడలేదు సిగ్గుపడలేదు. పైగా వి.ఐ.పి అని చెప్పాడు. చర్చను సాగనీయకుండా మధ్యలో అనవసరం అని ఆపేశాడు. అతని స్వభావం తెలిసిన హరిత మళ్ళీ ఆదిత్యతో ఆ విషయం గురించి మాట్లాడలేదు కాని లోలోప మధన పడసాగింది.
ఆలోచనల్లోంచి బయటపడి విజయా ఆమెని లోపలికి పంపు అని గదిలోకి వెళ్ళింది హరిత.
ఆమె మెల్లగా విజయ ఒకవైపు పట్టుకుని నడిపించగా లోపలికి వచ్చింది.
“కూర్చోండి” అంది హరిత.
“మీ పేరేమిటి?” అడిగింది హరిత.
“దీప” చెప్పిందామె.
“ఎన్నోనెల?” హరిత ప్రశ్నించింది.
“ఎనిమిది” అంది ఆమె.
“ఇప్పుడేమిటి ప్రాబ్లెం” అడిగింది హరిత తన జీవితాన్నే ప్రాబ్లెంగా మార్చిన మనిషి ప్రాబ్లెం గురించి ఆడుగుతూంది” తను ఎంత విచిత్రం.
“బాగా నెప్పిగా వుంటుంది” అంది దీప
విజయ ఈమెని టేబుల్‌ మీద పడుకోబెట్టు చెక్‌ చేస్తానని తనను తాను కంట్రోల్‌ చేసుకుంటూ ఆదిత్య గృహిణిగా హరితను ప్రక్కకు నెట్టి డాక్టరు హరితగా ఆమెను పూర్తిగా చెక్‌ చేసింది.
“కంగారు పడక్కల్లేదు అంతా నార్మల్‌గా వుంది. మీరు దేనికైనా ఆంగైటీగా ఫీయితే ఇలా కడుపులో నెప్పి రావడం సహజం, టాబ్లెట్స్‌ వ్రాసిస్తాను. వాడండి తగ్గిపోతుంది డిసెంబర్‌ 20 తర్వాత ప్రసవం కావచ్చు. మీరు నొప్పులు ప్రారంభం కాగానే వచ్చి అడ్మిట్‌ అయిపోతే సరి” అంటూ ఒక ఇంజెక్షన్‌ ఇచ్చింది హరిత.
“థాంక్స్‌ డాక్టరు గారు మీరు చాలా మంచివారని, హస్తవాసి మంచిదని మా కాలనీలో వాళ్ళు చెబితే వచ్చాను” అంది అయిదు నిముషాల తర్వాత తేరుకున్న దీప.
“ఒక్కరే వచ్చారు?” అంది ఆమె వివరాలు కనుక్కునే నెపంతో హరిత.
“మావారు భాస్కర్‌ బ్యాంకులో ఫీల్డ్‌ ఆఫీసర్‌. క్యాంప్‌కి వెళ్ళారు. అందుకని నేనే వచ్చాను. అయినా మీ గదిముందు “మా చేతుల్లో మీరు సురక్షితం” అనే మాట చూశాను. మీరున్నారు ఇక భయమెందుకు. థాంక్యూ డాక్టర్‌” అని మరోసారి చెప్పి బయటకు నడిచింది దీప.
ఈ అమ్మాయిని ఎంతవరకు నమ్మవచ్చు. అమ్మాయి అందంగా లేదు. చూస్తే చిన్నగా వుంది కాబట్టి ఆదిత్య క్లాస్‌మేట్‌ కూడా కాదు. భర్త రాలేదు పేరు భాస్కర్‌ అంది భాస్కర్‌, ఆదిత్య అన్నీ సూర్య భగవానుని పేర్లే కదా? బ్యాంక్‌లో ఆఫీసర్‌ అంది. అదెంత వరకు నిజం. అయినా తన జీవితం బాగు చేసుకోవడం వైవాహిక జీవితం నిలబెట్టుకోవడం అన్నీ తన చేతుల్లోనే వుంది. “నా చేతుల్లో నా గృహస్థ జీవితం సురక్షితం” డెలివరీకి వచ్చినపుడు ఆ దీపని ఆపరేట్‌ చేసి ఆమెకు యుటిరస్‌ రిమూవ్‌ చేస్తే సరి ఇక భవిష్యత్తులో మరే స్త్రీకి ఈ అమ్మాయి వల్ల ముఖ్యంగా తనకు తమ కుటుంబ పరువు ప్రతిష్టకు ఎలాంటి మచ్చ వుండదు. సమస్య వుండదు. దీప అని పేరు పెట్టుకుంది చుట్టూ వెలుగు నివ్వకుంటే మానే తన చుట్టూ చీకటి నింపకుంటే చాలు. ఆయినా ఇక ఈ దీప కాంతి నాచేతుల్లో” అనుకుంది హరిత.
“ఎంత క్రూరంగా క్రిమినల్‌లా ఆలోచిస్తుంది తను” హరితలోని డాక్టరు మేలుకుంది.
ఇంతలో వార్డ్‌బాయ్‌ రాజు వచ్చాడు.
“మేడం సూపరింటెండెంట్‌ సార్‌ రమ్మంటున్నారు” అంటూ
“వస్తున్నా” అంటూ లేచి గది బయటకు నడిచింది.
ఇప్పుడు ఆమె మొహంలో ఒక రిలీఫ్‌. వారం రోజుల నుంచి ఆమెను రాత్రింబవళ్ళు వేధిస్తున్న సమస్య. ఎలాంటి క్లూ లేకుండా ఆమె గురించి వెతకాలి అనుకుంటే ఆమె తన దగ్గరికి రావడం సమస్యకు పరిష్కారం దొరకడంతో హరిత మనసు ప్రశాంతంగా వుంది.
“మే ఐ కమిన్‌ సర్‌” అంది హరిత.
“రామ్మా హరితా” అన్నారు సూపరెంటెండెంట్‌ రాఘవగారు.
ఆయనకు ఓపిగ్గా, మంచిగా పేషంట్లని చూచే తెలివైనా హరిత అంటే ప్రత్యేకమైన అభిమానం.
“హరితా వైజాగ్‌లో డాక్టర్‌ లక్ష్మీ ఒక ట్రైనింగ్‌ కోసం మూడు నెలలు యు.ఎస్‌.కి వెళ్తూంది. అందుకని ఆవిడ ప్లేస్‌లో ఆ మూడు నెలలు నిన్ను వైజాగ్‌కి డెప్యుటేషన్‌ మీద పంపుతున్నాం. నీకిది ఒక మంచి అవకాశం. వైజాగ్‌లో డాక్టర్‌ కిరణ్మయిగారి దగ్గర నీవు చాలా నేర్చుకోవచ్చు.” అన్నారాయన.
“డిసెంబరు 10వ తారీఖు నీవు అక్కడ వుండాలి” అన్నారు ఆయన. మళ్ళీ “పదవ తారీఖా? మరి దీప డ్యూడేట్‌ 20 తర్వాత ఎలా వీలవుతుంది?”
“ఇంత సువర్ణావకాశం వదలుకోవడమా? నో నెవ్వర్‌” అనుకుంది హరిత.
“సర్‌ డిసెంబర్‌లో చాలా ఫంక్షన్‌ వున్నాయి” అంది నెమ్మదిగా
“సిల్లీగా మాట్లాడకు ఇది నీకు సువర్ణావకాశం” అన్నారు రాఘవగారు.
“తనకు దీప విషయంలో కూడా సువర్ణావకాశం ఇదే కదా” అనుకుంది. అయినా ఇప్పటి నుంచి ఎందుకు అనుకుంటూ లేచి వెళ్ళి తన గదిలో కూర్చుని ఆలోచించసాగింది. పోని వుద్యోగానికి రిజైన్‌ చేస్తే సరి. నెల జీతం కంటే తన జీవితం ముఖ్యం అంతే ఈ విషయం ఆదిత్యకు కూడా చెప్పకూడదు డిసెంబర్‌ తొమ్మిదిన రెసిగ్నేషన్‌ ఇచ్చేస్తే సరి అనుకుంది హరిత.
డిసెంబర్‌ 9 రానే వచ్చింది. హరిత సూపరింటెండ్‌కి తన రాజీనామా అందచేసింది.
“ఏమిటిది?” అడిగారు రాఘవ.
“ఇంతకంటే నేనేమి చెప్పలేను సర్‌. డెప్యుటేషన్‌ అదీ కుదరదు నాకు. మీరు లీవు ఇవ్వరు” అంది హరిత.
“అందుకని రిజైన్‌ చేస్తావా? ఆలోచించే చేస్తున్నావా? ఈ విషయం సాయంత్రం మాట్లాడుదాం నీవు వెళ్ళు” అన్నారు రాఘవ.
తన కనస్టల్టింగ్‌ రూంకి వెళ్ళగానే ఫోన్‌ అందించింది విజయ.
“గుడ్‌మార్నింగ్‌ డాక్టర్‌గారూ నేను మీ పేషంట్‌ దీప భర్తని. దీప ఇందాకా ఉన్నట్టుండి అన్‌కాన్షస్‌గా పడిపోయింది. తనను మీరే ట్రీట్‌ చేస్తున్నారు అని చెప్పింది. ప్లీజ్‌ మీరు రాగలరా” అడిగాడు భాస్కర్‌ ఆతృతగా.
అసలే చికాగ్గా వుంది హరితకి ఇంతలో ఈ ఫోన్‌.
“నేను గవర్నమెంట్‌ డాక్టర్‌ని పైగా ఓ.పీ.లో చాలా మంది వెయిట్‌ చేస్తున్నారు. ఎలాగైనా మీరే ఇక్కడికి తీసుకు రండి” అని ఫోన్‌ పెట్టేసింది హరిత.
పేషంట్స్‌ ఒక్కొక్కరు వస్తున్నారు. అన్యమనస్కంగానే చూచి పంపిస్తూంది ఇంతలో ఆదిత్య దగ్గర నుంచి ఫోన్‌.
“ఏంటి రెసిగ్నేషన్‌ ఇచ్చావా? అంత అవసరం ఏం వచ్చింది. వైజాగ్‌ వెళ్ళనన్నవట. ఆ విషయం కూర్చుని డిస్కస్‌ చేద్దాం తొందరపడవద్దు. రాఘవగారిప్పుడే నాకు కాల్‌ చేస్తే తెలిసింది” అంటున్నాడు అటువైపు నుంచి ఆదిత్య. ఇంతలో దీపని తీసుకువచ్చారు లోపలికి. ఆమె వాలకం చూడగానే భయం కలిగింది హరితకి.
ఒక అర్జంట్‌ కేసు ఒక అరగంట ఆగి నేనే ఫోన్‌ చేస్తాను అని ఫోన్‌ డిస్కనెక్ట్ చేసి పేషంట్‌ని టేబుల్‌ మీద పడుకోబెట్టమని అటుకేసి నడిచింది హరిత.
“డాక్టర్‌గారూ ఎలాగైనా నా దీపను కాపాడండి. ఇతరుల ప్రాణాలను కాపాడటానికి తన ప్రాణాలను కూడా లెక్కచేయని ఉత్తమురాలు దీప. అలాంటి దీపకు ఏం కాకూడదు” అన్నాడు భాస్కర్‌.
“ఏవరి ప్రాణాలను కాపాడిందో కాని నా జీవితంలో చొరపడి నా ప్రాణం మీదకు తెస్తూంది” అనుకుని ఆమెను చెక్‌ చేయసాగింది హరిత.
“ఈమె కాలుకేమైంది” అని అడిగింది హరిత భాస్కర్‌ని ఆమెకు ఇంజక్షన్‌ ఇస్తూ హరిత.
సుమారు ఆరు నెలలక్రితం ఒకరోజు దీప సూపర్‌ బజారుకు వెళ్ళి సామాన్లు తీసుకుని బయట ఆటో కోసం వెయిట్‌ చేస్తూంది. ఎదురుగా హాస్పిటల్‌ ముందున్న కారు క్రింది నుంచి ఒకడు బయటకు వచ్చాడు. ఇంకొకతను కారు ప్రక్కన నిలబడి వున్నాడు. అతడు “పనయిందా?” అని అడిగాడు.
“పర్‌ఫెక్ట్‌గా” అని కారు క్రిందనుంచి వచ్చిన వాడు చెప్పగానే ఇద్దరు సెల్‌లో ఎవరికో మెసేజ్‌ ఇస్తూ వెళ్ళిపోయారు. దీపకి ఈ తతంగమంతా అనుమానాస్పదంగా కనిపించింది. ఆ కారుకి బ్రేకు తీసేసారా. టైం బాంబ్‌ ఫిక్స్‌చేసారా? ఆ కారులో వెళ్ళే వ్యక్తికి తప్పకుండా ప్రమాదం అనుకుంది దీప. ఇంతలో ఆ హాస్పిటల్‌లోంచి ఒక డాక్టరు బయటకు వచ్చి ఆ కారు దగ్గరకు వస్తూన్నాడు.
“సార్‌ ఆ కారు ఎక్కవద్దూ” అంటూ రోడ్డుదాటి అటువైపుకు పరుగెత్తింది.
దీప ఇంతలో కుడివైపు నుంచి వస్తున్న కారు దీపను గుద్దేసింది. ఆ డాక్టరు వచ్చి దీపను హాస్పిటల్‌లోకి తీసుకెళ్ళి ట్రీట్‌ చేశాడు. మేజర్‌ ఇంజురీస్‌ తగ్గడానికి రెండు నెలలు పట్టింది. ఆ డాక్టరు ప్రాణాలను కాపాడిందన్న కృతజ్ఞతతో అతడు ఒక్కపైసా కూడా ఖర్చుకాకుండా ఆమెకు ట్రీట్‌మెంట్‌ ఇప్పించాడు.
హరితకు తలలో ఒకమూల ఒక లైట్‌ వెలిగినట్టయింది.
“ఆ హస్పిటల్‌ పేరు” ఆతృతను అణచుకుంటూ ఆడిగింది హరిత
“ధన్వంతరి” డాక్టరుగారిపేరు ఆదిత్య” అన్నాడు భాస్కర్‌
రెండు మూడు లైట్స్‌ వెలిగినట్లనిపించింది హరితకు.
ప్రక్కన విలేజ్‌లో పెద్ద తగాదా జరిగింది. ఒక ముఠా వాళ్ళు ఇంకోముఠా నాయకుడి తల పగుకొట్టారు.అతనిని ఈ డాక్టరు ఆపరేషన్‌ చేసి బ్రతికించాడు. అందుకని ఆ ముఠా వాళ్ళు ఈ డాక్టరుని చంపాని ప్రయత్నించారు. అది దీప కారణంగా విఫమయింది. ఈ విషయం పోలీసులకు గాని వేరే ఎవరికైనా చెప్పినా కుటుంబాన్నే నాశనం చేస్తామని బెదిరించారట. రెండు నెలల తర్వాత డాక్టరుగారికి థాంక్స్‌ చెబుదామని దీప వెళ్తే ఆరోజు డాక్టరుగారి బర్త్‌డే అని అక్కడ నర్స్‌ చెప్పిందట. దీప గ్రీటింగ్‌ స్వీట్స్‌ తీసికెళ్ళి ఆదిత్యగారికి ఇచ్చింది. ఆదిత్యగారు ఈ రోజు నేను ఈ పుట్టిన రోజు జరుపుకుంటున్నానంటే కారణం నేవే నీ ఫోటో ఒకటి ఇవ్వమ్మా అంటే తన ఫోటో ఇచ్చింది” అన్నాడు భాస్కర్‌.
గబగబా లైట్లు వెలిగి చీకటి తొగిపోయి ప్రకాశవంతంగా అయింది హరితకు
భాస్కర్‌ గారూ మీరేం వర్రీ కాకండి దీపని. మీ బేబీని కాపాడటం నా బాధ్యత అని విజయ ఆపరేషన్‌కి రెడి చేయండి సెడేటివ్‌ ఇవ్వండి అని చకచక ఆర్డర్లు పాస్‌ చేసింది హరిత.
తనెంత పొరబాటుగా ఆలోచించింది. తన జీవితంలో వెలుగు నింపిన దీప జీవితమే ఆర్పేయాలనుకుంది. క్రిమినల్‌లా ఆలోచించింది. భాస్కర్‌ ఇప్పుడు ఈ విషయం చెప్పకపోతే సరిదిద్దుకోలేని తప్పు చేసి జీవితాంతం బాధ పడాల్సివచ్చేది. థాంక్స్‌ గాడ్‌ దీపని, బిడ్డని భాస్కర్‌కి అప్పచెప్పి రాత్రికి వైజాగ్‌కి బయుదేరాలి. రాఘవ గారికి ఈ విషయం చెప్పాలి దీపను తను కాపాడిన విషయం తెలిస్తే ఆదిత్య ఎంత సంతోషిస్తాడు. దీపకు కొంతయినా రుణం తీర్చుకునే అవకాశం కలిగింది అంటాడు. తన రెజిగ్నేషన్‌ లెటర్‌ వాపసు తీసుకోవడాని సూపరింటెండెంట్‌ గదివైపు నడిచింది హరిత.

*****

కొత్త చీర

రచన : శ్రీకాంత గుమ్ములూరి.

“అన్నవస్త్రాలకి పొతే ఉన్న వస్త్రం ఊడిందిట !!”
“ఎవరి మీదే అక్కసు?” అడక్కుండా ఉండలేకపోయింది కొత్తగా పెళ్ళైన అక్కని.
“అధముడికి భార్య అయ్యేకన్నా బలవంతుడికి భార్య అవడం మేలు …. ” ఇంకో సామెత దూసుకు వచ్చింది అక్క నోటి నుంచి బాణంలా…
‘పెళ్లై రెండు రోజులైనా కాలేదు అప్పుడే బావని తిట్టుకుంటున్నావా?” చెల్లెలి ప్రశ్న.
దానికి ఆమె ఇచ్చిన తలతిక్క జవాబు అత్యంత వినసొంపు !!
అనుకున్న పని అంగవస్త్రంలో అయినట్లు కట్టబెట్టారుగా నన్ను మేనరికానికి ….
అండలుంటే కొండలు దాటచ్చు, మేనత్త కొడుకుని పెళ్ళిచేసుకుంటే అత్తారింట్లో హాయిగా సుఖపడచ్చు అనుకుంటే.. జరిగిందేమిటిట? ఆడబడుచు కళ్లన్నీ నా చీరలమీదే… అండ ఉన్నవాడిదే అందలం… ఉన్నాడుగా అండగా చెట్టంత అన్న !అడిగిందే పాపం… అనుగ్రహం తన స్వభావం కదా… చెల్లెలు కొత్త చీర కొనిమ్మని కోరడం ఆలస్యం, “ఇప్పటికి ఇప్పుడే అంటే ఎక్కడ నుంచి తేను? కొత్త పెళ్లికూతురు దగ్గిర కొత్త చీరలు కోకొల్లలు. మన ఇంటి పిల్లేకదా. నీక్కావల్సింది ఒకటి తీస్కో.” అని సులువైన సలహా ఇచ్చాడు కట్టుకున్న మొగుడు.
ఇంటివాడు ఒసే అంటే బయటవాడూ ఒసే అంటాడు… అంతే ! నా చీరల మీదకి దండెత్తింది మహాతల్లి. నా పెట్టెలో ఉన్నకొత్త చీరలన్నీ మంచం మీద చక్కగా పరిచి మరీ ఎంచుకుంది తనకు నచ్చింది. నాకు నచ్చిన చీరే దానికీ నచ్చాలా? ఐనా … నా అన్న నాకిచ్చింది నేనింకొకళ్ళ కెందుకు ఇవ్వాలి? ఇచ్చినవాడు దాత… ఇవ్వనివాడు రోత… నా చీర నేనివ్వనని మొండికేస్తే… నామీద ఉక్రోషంతో ఒకటే ఏడుపు. ఇవ్వని మొండికి విడువని చండి …. “ఇవ్వనుగాక ఇవ్వను దిక్కున్నచోట చెప్పుకో.” అని నేను మొరాయిస్తే.. ఇల్లంతా పీకి పందిరే వేసింది…….
పోనీ అత్తయినా తనను సమర్ధిస్తుందా? అత్తకు మంచి లేదు చింతకు పచ్చి లేదు…
ఎంత బ్రతిమిలాడినా వినకుండా “ఇద్దరికీ బుద్ధి లేదు.” అంటూ… అన్న తనకి ఇచ్చిన నాల్గు కొత్త చీరలు, తాము పెట్టిన ఆరు కొత్త చీరలు ….. మొత్తం అన్నీ తీసి బీరువాలో దాచేసింది.
అంటే ఆరడి అనకుంటే అలుసు…. తాను గాని నోరు మెదప కుండా ఉండి ఉంటే … ఈ పాటికి తన చక్కదనాల కొత్త చీర కట్టేసుకుని బుట్ట బొమ్మల్లే ముస్తాబయ్యేది కదూ? ఇవ్వడమన్నది ఈ ఇంట లేదు, తే అన్నది తరతరాలుగా వస్తు న్నట్లు – కొత్త పెళ్లి కూతుర్ని నాకు పెట్టకపోగా నా నుంచే లాక్కోడానికి సర్వ ప్రయత్నాలూ చేస్తున్నారు వీళ్ళు!
మొన్నటికి మొన్న, నిశ్చితార్ధం రోజున అత్త ఇచ్చిన కొత్త జరీ చీర కట్టుకుని “ఈ చీరలో నేనెట్లా వున్నాను?” అని అడిగితే…. ” చీరెందుకే నీకు చిన్నారీ! చీర కంటే నువ్వు మరీ బాగుంటావు.” అన్నాడు బావ.
అడిగింది రొట్టె ఇచ్చింది రాయి… నేనన్నా నా చీరలన్నా అందరికీ అలుసే !

***

ఎఱ్ఱని అంచున్న తెల్ల చీర !!
ఎఱ్ఱని కలువలు పొదిగిన చీర !!
తన అర్ధాంగి మనసుపడి కోరిన చీర !!
తాను మక్కువతో కొని తెచ్చిన చీర !!

పొంగుతున్న పాలలా పెల్లుబుకుతున్న తన ఉత్సాహాన్ని క్షణంలో చన్నీళ్ళు చిలకరించి చప్పున చల్లార్చింది చెల్లి మహాతల్లి! పెళ్లి దానికైతే మరెవ్వరికీ మంచి చీర కట్టుకునే సౌభాగ్యం ఉండకూడదులావుంది!
జానా బెత్తెడు ఉద్యోగం. చిన్న చిన్న సంతోషాలు తీర్చుకోలేని జీవితం. అర్హతలు మించిన కోరికలు ఆనందాన్ని దూరం చేస్తాయనే నగ్నసత్యం తెలిసిన వాడు కనునకనే ఉన్నంతలో లోపం లేకుండా, తన గురించి అన్నీ తెలిసిన బావతో చెల్లెలి పెళ్లి కుదిర్చాడు. అమ్మ నాన్నలు కరువైన నాటినుంచీ అత్తమ్మే తమకు పెద్ద దిక్కు. ఏ కష్టమొచ్చినా కడుపులో పెట్టుకుని తమని ఆదుకుంది. దొడ్డ మనసుతో సంబంధం కలుపుకోడానికి తానే ముందుకు వచ్చి అడిగింది. వాళ్లదీ తమలాంటి మధ్య తరగతి బాపతే ! అయితేనేం? అత్తమ్మ చెల్లిని పువ్వుల్లో పెట్టుకు చూసుకుంటుందన్న నమ్మకం తనకుంది. దాన్ని ఒక దారిలోకి తేగలదన్న ధీమా కూడా వుంది.
ఉన్నంతలో పెళ్లి పన్లు చకచకా చెయ్యడం మొదలెట్టాడు భార్య సహకారంతో.
కొత్త పెళ్లికూతురికి మూడు చీరలు, చిన్న చెల్లికొక చీర, తన భార్యకొక చీర…. అతి కష్టం మీద! అంతకు మించి కొనగలిగే తాహతేదీ?
ఆ రోజు … షాపింగు చేస్తున్న రోజు… షాపులో ఆ చీర చూడగానే కోమలి కళ్ళలో కనిపించిన మెఱుపు తానెలా విస్మరించగలడు? ఆ చీరతో తన భార్య ఎంత అందంగా ఉంటుందో అదే క్షణంలో, కొనక ముందే ఊహించేస్కున్నాడు! అది తన భార్యకే ఇవ్వడానికి గట్టిగా నిర్ణయించేసుకున్నాడు. కానీ అన్ని ఊహలూ నిర్ణయాలూ వ్యర్థం! ఇచ్చిన మూడు చీరలూ పుచ్చుకున్నాక ఆ చీర తనకి చాలా చాలా నచ్చిందనిన్నీ, అది గాని తనకివ్వకపొతే పెళ్లే చేసుకోననీ పెద్దపెట్టున రాగాలు పెట్టింది చెల్లి మహాతల్లి! అయ్యబాబోయ్! నిజంగా అలాగే జరిగితే తమ జీవితానికి తెరిపేదీ…. ?
ఇష్టం లేని పని కూడా తన ఇష్టానికి అనుగుణంగా మలచుకున్న వాడే ప్రజ్ఞావంతుడు….
ఎంత ప్రాప్తమో అంతే ఫలం…. మనసుని రాయి చేసుకుని, భార్యకి నచ్చ జెప్పుకుని, తల ప్రాణం తోకకి తెచ్చుకుని, ఇద్దరికీ ప్రాణ ప్రదమైన చీరను చెల్లికి ధారపోసి, పెళ్లి పనులలో బుర్ర దూర్చేసాడు అన్నివిధాలా అదే మంచిదని.

***

తనలో లోపాలే లేవనుకునే లోపాన్ని మించిన లోపం మరొకటి లేదు….
తాను చేసిన పనే అక్షరాలా తన ఆడపడుచు కూడా చేస్తోందన్న గ్రాహ్యం అక్కకి ఎందుకు లేదు ? తనకు తట్టిన విషయం అక్క కెందుకు తట్టలేదు ? ఆనాడు అన్న అందరికీ కొత్త చీరలు కొని తెచ్చినప్పుడు వొదినకి ఒక్క చీర కూడా మిగల్చకుండా అన్నీ తానే తీసేసుకోడం ఎంత అన్యాయం. ఎంతసేపూ తన గురించే తప్ప పక్కనున్న వాళ్ళ గురించి కూడా ఆలోచించాలని ఇంగితమే లేదు అక్కకి. దేవుడు దీనికి తగిన శాస్తి చెయ్యకపోతాడా?
చిన్నబోయిన వదిన ముఖం, అన్న ముఖంలో నిరుత్సాహం ఆ క్షణంలో దాని కంట ఎందుకు పడలేదు ? స్వార్ధానికి సరిహద్దు లేదులా వుంది. అర్హతకు మించిన కోరికలు ఆనందాన్ని దూరం చేస్తాయి. ఉన్నంతలో సంతృప్తి ఊరంతా మంచి… లేనినాడు ప్రపంచమంతా చుక్కెదురే ! మూర్ఖురాలు – పరిస్థితి అర్ధం చేస్కోదే…. ఇక నుంచీ ఈ పరమ గయ్యాళిని అదుపులోనికి పెట్టవలసిన బాధ్యత అత్తమ్మదే.

***
అంతరంగం అందంగా ఉంటే ఆచరణ కూడా అర్ధవంతంగా ఉంటుంది ….
ఎవరినీ ప్రశ్నించకుండా, ఎవరిచేతా ప్రశ్నింపబడకుండా, ఎక్కడా పొల్లు పోకుండా, ఒకరికి వేలెత్తి చూపే అవకాశం ఇవ్వకుండా, ఉన్న నాల్గు రోజులూ ఒకే చీరతో, నోరెత్తకుండా పెళ్లి పనులన్నీ శ్రద్ధతో పూర్తిచేసి, భర్తతో ఇంటిముఖం పట్టడానికి సిద్ధమైంది కోమలి.
“బొట్టు పెట్టించుకుని వెళ్ళమ్మా” అని, దేవుడిగది లోనికి తీసుకువెళ్లి, ఆమె చేతిలో కొత్త చీరను ఉంచి, “నువ్వు ఈ చీర కట్టుకున్నాకనే ఈ గడప దాటేది.” అని హుకుం జారీ చేసింది అత్తమ్మ.
కొత్త చీర కట్టుకున్న కోమలిని చూసి కొత్త కోడలూ, కూతురూ కంగు తిన్నారు…..
కట్టుకున్న భర్త కళ్లింత చేసుకుని, కలువలన్నీ వెల్లి విరిసేట్టుగా వెన్నెలలు కళ్ళాపి జల్లాడు……
మేనల్లుడి కళ్ళలో జిలుగు చూసిన అత్తమ్మ ఆప్యాయంగా చిరునవ్వు నవ్వింది ……
కాగల కార్యాన్ని గంధర్వులే తీర్చారు !!!

——————

మాడర్న్‌ అమ్మమ్మ చెప్పిన మాడల్‌ కథలు

రచన: ఝాన్సీరాణి కె.

లక్ష్మిగారు డైనింగ్‌ టేబల్‌ దగ్గర కూర్చుని మరుసటి రోజు కూరకి చిక్కుడుకాయలు వలుస్తున్నారు. హాల్లో పిల్లలందరూ కూర్చున్నారు.
మన ఆర్థిక మంత్రి ఎవరు అడుగుతున్నాడు కిరాణ్‌ ?
“రోశయ్య” అంది లాస్య
“కాదు” అన్నాడు కిరణ్‌
హోంమంత్రి ఎవరో చెప్పు?
సబితా ఇంద్రారెడ్డి
“చెన్నై గవర్నరెవరు?”అడిగారెవరో
“రోశయ్య” అన్నాడు కిరణ్‌
“ఆయన మన ఆర్థిక శాఖ మంత్రి” అంది లాస్య.
“కావాలంటే ఈ బుక్‌ చూడంఢి. మూడేళ్ళ నుంచి ఈ బుక్‌ చదివిన వాళ్ళకే క్విజ్‌లో ప్రైజ్‌ వస్తూంది” అన్నాడు రోహిత్‌.
“అమ్మా ఇలా రండి” పిలిచారు లక్ష్మిగారు.
అందరూ బిలబిలా ఆవిడ చుట్టూ చేరారు.
“ఎల్లుండి క్విజ్‌ కాంపిటీషన్‌ ఉంది అమ్మమ్మా” అన్నాడు జార్జ్‌.
“కొన్ని ప్రశ్నలకు జవాబులు మాత్రం ఈ పుస్తకంలో ఉన్నవి కావంటున్నాడు కిరణ్‌” అని ఫిర్యాదు చేసింది లాస్య.
“పుస్తకంలో కూడా తప్పులుంటాయా అమ్మమ్మా?” అన్నాడు సాగర్‌.
“మీకొక కథ చెప్పనా?” అన్నారు క్ష్మీగారు
“బలే బలే” అంటూ వచ్చాడు రఫీ అందరూ కుర్చీలలో, గోడవార ఉన్న సోఫాలో సర్దుకుని కూర్చున్నారు.
“కనకరాజు” 9 లేక 10 చెట్లు కొట్టేవాడు. అతడితో బాటు రంగడు, గోపి, అహమ్మద్‌ అని మరో ముగ్గురు పని చేసేవారు. వారు పని మధ్యలో రెండు సార్లు టీ త్రాగటానికి వెళ్లి అరగంట తర్వాత వచ్చేవారు. కొన్ని రోజుల తర్వాత కనకరాజు తన యజమాని జగన్నాధరావుగారితో తన తోటివారు, పని మధ్య లో వదిలేసి వెళ్ళి కబుర్లతో సమయం వృధా చేస్తున్నారని చెప్పాడు. ఒక వారం తర్వాత వాళ్ళను అడుగుతానన్నాడు జగన్నాధరావు. వారం రోజులు గడిచాయి. యజమాని వాళ్ళనెలా కోప్పడతాడో, అప్పుడు వాళ్ళేం చెబుతారో చూడాలని ఆతృతగా ఉన్నాడు. కనకరాజు.
జగన్నాధరావు కనకరాజును పిలిచాడు. మిగిలినవాళ్ళను పిలవకుండా తనను పిలుస్తున్నాడేమిటా అనుకుంటూ వెళ్ళాడు కనక రాజు.
జగన్నాధరావు చేతిలో ఒక కాగితం ఉంది. అందులో పని చేస్తున్న నలుగురి పేర్లు: వారం రోజుల్లో ఒక్కోరోజు పేరు కెదురుగా వారు కొట్టిన చెట్ల సంఖ్య వ్రాసి వుంది. ప్రతిరోజు నలుగురు సమానంగా కాని, లేకుంటే కనకరాజుకంటే ఎక్కువ చెట్లు కొట్టారు. అది చూపించి ఎవరినేమనాలో చెప్పమన్నాడు జగన్నాధరావు.
ఏమి మాట్లాడకుండా వెళ్ళిపోయాడు కనకరాజు కాని అతడికి అర్థం కానిది ఒక్కటే తనకంటే తక్కువ సమయం పనిచేసినా వాళ్ళెలా తనతో సమానంగానో, లేకపోతే ఎక్కువగానో పని చేయగలుగుతున్నారు అని తర్వాత రోజు వాళ్ళతో కలిసి టీ త్రాగటానికి వెళ్ళాడు కనకరాజు.
“ఏమిటి కనకరాజూ గాలిలా మళ్ళింది?” అన్నాడు అహమ్మద్‌. “సమయం వృధా కాదా?” అన్నాడు రంగడు. ఊరుకోండ్రా అంటూ టీ కప్పు కనకరాజుకిచ్చాడు గోపి.
టీ త్రాగాక వాళ్ళు కబుర్లు చెప్పుకుంటూ గొడ్డలి గొడకేసి సానపెట్టడం ప్రారంభించారు స్నేహితులు. ..
అప్పుడర్థమయింది కనకరాజుకు మిత్రులు కబుర్లు చెబుతూ సమయం వృధా చేయట్లేదని, తమ పనికి కావలసిన విధంగా పని ముట్టును తయారు చేసుకుంటున్నారని. తర్వాత రోజు నుంచి వాళ్ళతో కలిసి తనుకూడా వెళ్ళి గొడ్డలి పదును పెట్టడం ప్రారంభించాడు.
అతనికి ఫలితం పెరిగింది.
కాబట్టి మూడేళ్ల క్రితం పుస్తకం కొని చదవడంకాదు రాహుల్‌ నాన్నకు చెప్పి కొత్త పుస్తకం తెప్పించుకో. మన రాష్ట్ర మంత్రులు, దేశానికి సంబంధించిన మంత్రుల జాబితా అంతా ఎవరైనా పెద్దవాళ్ళని కాని, లేకుంటే స్కూల్లో మీ టీచర్ని కాని అడిగి వ్రాసుకోండి. మీ నాలెజ్జ్‌ని అప్‌టుడేట్‌ చేసుకోండి అని ముగించారు లక్ష్మీగారు.
పిల్లలు అమ్మమ్మకు ధాంక్స్‌ చెప్పి ఆవిడ సహా పాటించి క్విజ్‌ ప్రోగ్రాంలో కప్‌ గెలిచి సంతోషంగా తెచ్చి ఆవిడ చేతిలో పెట్టారు.
*****