బ్రహ్మలిఖితం 14

రచన: మన్నెం శారద

లిఖిత ఎంగేజ్ చేసిన టాక్సీ కొచ్చిన్‌లో బయల్దేరింది.
అడుగడుగునా బాక్‌వాటర్స్‌తో, కొబ్బరి తోటలతో మరో లోకంలో అడుగుపెట్టినట్లుంది కొచ్చిన్.
లిఖిత కళ్లార్పకుండా చూస్తుందా స్థలాల్ని.
సహజంగా సైట్ సీయింగ్‌కి, శబరిమలై వెళ్ళే యాత్రికుల్ని తీసుకెళ్ళడానికలవాటు పడ్డ డ్రైవర్ లిఖితలోని ఆసక్తి గమనించి “ఇదేనా మొదటిసారి రావడం మేడం?” అనడిగేడు ఇంగ్లీషులో.
అవునన్నట్లుగా తల పంకించింది లిఖిత.
“ఎన్‌చాంటింగ్ యీజ్ ద కరెక్ట్ వర్డ్ టు డిస్క్రయిబ్ ద బాక్ వాటర్స్ ఆఫ్ కేరళ” అన్నాడతను నవ్వుతూ.
లిఖిత అతనివైపు విస్పారిత నేత్రాలతో చూసింది.
అతను చాలా సింపుల్‌గా వున్నాడు. నల్లని శరీరం, వెనక్కు దువ్విన వత్తయిన క్రాఫు తెల్లషర్టు, తెల్ల లుంగీ చాలా సాదాగా వున్నాడు.
కాని.. ఆ కళ్ళలో మాత్రం అతనిలోని తెలివి తాలూకు మెరపు కనిపిస్తోంది. అతని ఇంగ్లీషు ఉచ్చారణలో మళయాళపు యాస కనిపిస్తున్నా చక్కటి భాష మాట్లాడుతున్నాడు.
“ఏ జర్నీ త్రూ ద బాక్ వాటర్స్ యీజ్ వెరీ ప్లెషరబుల్ ఇన్ ఏ కంట్రీ బోట్ ఫ్రం కొల్లాం టూ కొట్టాయం విచ్ యీజ్ కాల్డ్ వెనీస్ ఆఫ్ ఈస్ట్” అన్నాడతను తిరిగి నవ్వుతూ.
“ఏం చదువుకున్నారు మీరు?” అనడిగింది ఆసక్తిగా.
“ఎం.ఏ లిటరేచర్!”
“మరిలా టాక్సీ నడుపుతున్నారేంటి?”
“చూడండి మేడం. మా రాష్ట్రంలో నిరక్షరాస్యులే లేరు. ఎంతమందికని ప్రభుత్వం ఉద్యోగాలు ప్రొవైడ్ చెయ్యగలదు. అందుకే తప్పుకాని ప్రతి పనిని కష్టపడి చేసుకుంటాం. అయినా డిగ్రీలు ఉద్యోగం కోసమనే ఉద్ధేశ్యం తప్పు మేడం!” అన్నాడతను ఇంగ్లీషులో.
“మీ పేరు?”
“క్రిష్టఫర్. నా సంగతికేం గాని పరిగెత్తుతున్న అందాల్ని మిస్ కాకుండా చూడండి” అంటూ హెచ్చరించేడతను.
లిఖిత మళ్ళీ కిటికీలోంచి బయటికి చూసింది.
కేరళ రాష్ట్రం చాలా గమ్మత్తుగా వుంది. మనలా ఒక వూరు, మధ్యలో ఖాళీ స్థలాలు, మళ్ళీ మరో వూరు. అలా లేదు. అడుగడుగునా తోటలు. తోటల మధ్య ఇళ్ళు. అలా ఎప్పటికీ ఊరు అంతం కానట్లుగా కనిపిస్తోంది. కొన్ని చోట్ల ఇళ్ళనానుకునే బాక్ వాటర్సున్నాయి. వాళ్లంతా మరో చోటికి ఫెర్రీల ఆధారంతోనే వెళ్లడం గమనించింది లిఖిత.
“అవర్ స్టేట్ యీజ్ ఏ నేరో స్ట్రిప్ టక్ట్ ఎవే ఇన్ ద సౌత్ వెస్ట్ కార్నర్ ఆఫ్ ఇండియా ఇన్ బిట్వీన్ ద అరేబియన్ సీ ఆండ్ వెస్ట్రన్ ఘాట్స్” అన్నాడు క్రిస్టఫర్.
లిఖిత అతని మాటలు వింటూ భగవంతుడు సృష్టించిన అందాల్ని ఇచ్చిన ప్రకృతిని ఎలా వుపయోగించుకున్నాడో గమనిస్తోంది. బాక్ వాటర్స్, కొబ్బరి తోటలు, టీ తోటలు, రబ్బరు తోటలతో కేరళ పచ్చదనంతో మనసుని పరవశానికి గురి చేస్తోంది.
టీ తోటల పసుపు, లేతాకుపచ్చ, ముదరాకు పచ్చరంగుల్లో కొండవాలుల్లో అందంగా గీతలు గీసి హద్దులేర్పరిచినట్లుగా కంపిస్తున్నాయి.
అడుగడుగునా చిన్న చిన్న వాగులు, జలపాతాలు, సూర్య కిరణాలు జొరబడకుండా పెరిగిన చెట్లు, నిజంగానే కేరళీయులు దేవతలు భూలోక సంచారానికి కేరళ రాష్ట్రాన్ని సృష్టించుకున్నారని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదనిపించింది లిఖితకి.
భగవతి కోవెలలో పూజారి కుట్టికారన్ చెప్పిన మాటలు కూడా గుర్తొచ్చేయి. ఇంత చదువుకున్న అందమైన రాష్టరంలో నీచోపాసకులు ఎలా వెలిసేరో అనుకుంది బాధగా.
క్షణం సేపు తండ్రి గుర్తొచ్చి ఆమె మొహం మబ్బులు కమ్మినట్టయింది.
చీకటి పడుతుండగా టాక్సీ మున్నార్ టీన్ చేరుకుంది.
“ఎక్కడ దిగుతారు?” అనడిగేడు క్రిస్టఫర్.
“నాకు తెలీదు. మీరు చెప్పండి. ఎక్కడ బాగుంటుందో?”
“క్రిస్టఫర్ ఒక క్షణం ఆలోచించి “పదండి సినాయ్ కాటేజెస్‌కి తీసుకెళ్తాను” అంటూ టాక్సీని బస్టాండు దగ్గరగా వున్న సినాయ్ కాటేజెస్‌కి తీసుకెళ్ళేడు. లిఖిత అతనికి థాంక్స్ చెప్పి అతని టాక్సీ చార్జీలు పే చేసి లోనికెళ్లి ఒక రూం తీసుకుంది.
స్నానం చేసి భోంచేసి మనసు శరీరం అలసిపోవడం వలన వెంటనే పడుకొని నిద్రపోయింది లిఖిత..

**************
అహోబిళంలో నృసింహస్వామి దర్శనం చేసుకుని “నువ్విక్కడ ఈ కోనేటి గట్టున కూర్చో. నే వెళ్ళి స్వాములవారిని కలిసి రమ్మంటే నిన్ను తీసుకెళ్తాను” అన్నాదు వెంకట్ ఈశ్వరితో.
ఈశ్వరి బుద్ధిగా తలూపింది.
ఆమెకేదో ఆందోళన మొదలైంది మనసులో.
తనకెంత ధైర్యం! మొదటిసారి భర్తని, పిల్లల్ని వదిలేసి ఒక అపరిచిత వ్యక్తితో ఊరుగాని ఊరొచ్చేసింది.
అసలేం జరగబోతున్నదో!
ఇతను కూడ వెంకటే తన భర్తని చెబితే..
ఏం చేయాలి తనిప్పుడు! భర్తని.. పిల్లల్ని వదిలేసి .. ఇతనితో వుండిపోవాలా?
భర్తని వదిలేయగలదుగాని.. పాపం.. పిల్లలు.. ఆ పెద్దాడికి వంట రాదు. చిన్నాడు తనని చూడకుండా ఒక్క పూటా వుండలేదు. వాళ్ల చదువులు పాడయిపోతాయేమో! ఆయన మళ్ళీ పెళ్ళి చేసుకుంటే.. ఆవిడ తన పిల్లల్ని సరిగ్గా చూస్తుందా? పోనీ తను వెంకట్‌ని బ్రతిమాలి తన పిల్లల్ని తీసుకెళ్తే! అతనొప్పుకుంటాడా?”
“ఈశ్వరి!!”
ఆ పిలుపు విని ఆమె తృళ్ళిపడి లేచి నిలబడింది.
ఎదురుగా వెంకట్‌తో పాటు ఒక గడ్డాలు మీసాలున్న వ్యక్తి నిలబడి వున్నాడు.
“ఈయనే ఓంకారస్వామి చెప్పిన స్వాములవారు. నమస్కారం పెట్టు” అన్నాడు వెంకట్.
ఈశ్వరి అతనికి నమస్కరించింది భయంగా.
“అతను కమండలమెత్తి అందులోని నీళ్ళు ఆమె మీద జల్లి “అపచారం చేసింది అమ్మణీ అమ్మ! నిన్ను కాదని మరొకణ్ణి కట్టుకుంది. పాప దోషం తీసేయాలి! ఒప్పుకుంటుందా?” అంటూ వెంకట్ వైపు తిరిగి చూశాడు.
“ఒప్పుకుంటుంది. ఒప్పుకుంటున్నానని చెప్పు!” అన్నాడు వెంకట్ ఈశ్వరి వైపు తిరిగి.
ఈశ్వరి తలాడించింది అయోమయంగా .
“అయితే రండి” అంటూ అతను కోనేటిలోకి దిగేడు.
వెంకట్ అతనిననుసరించి ఈశ్వరి కోనేటిలోకి దిగేరు.
ఈశ్వరి భయంగా వెంకట్ భుజం పట్టుకుంది.
“ఊ!” అని ఘర్జించేడు స్వామి.
ఈశ్వరి బిత్తరపోతూ చూసింది.
“అపచార దోషం తీసేసేంతవరకు అతన్ని తాకరాదు.!”
ఈశ్వరి తలాడించి వెంకట్‌కి దూరంగా నిలబడింది.
ముగ్గురూ మొలలోతు నీళ్లలో నిలబడ్డారు.
దోసిళ్ళతో నీళ్లు పట్టుకోమని ఏవేవో మంత్రాలు చదవసాగేడు.
ఈశ్వరి కళ్ళు గట్టిగా మూసుకుంది.
అరగంట గడిచింది.
అతను వాళ్ల దోసిళ్ళలో తన చేతిలోని మూటలో పొడి తీసి జల్లేడూ. నీరు పసుపు పచ్చగా మారింది. మరో పొడి తీసి జల్లేడూ. నీరు క్షణాల్లో ఎర్రరంగుగా మారింది.
“దోసిట్లో నీటిని కోనేటిలో వంపండి”
ఇద్దరూ స్వామి చెప్పినట్లే చేసేరు.
క్షణాల్లో కోనేరంతా ఎర్రగా మారిపోయింది.
“కళ్ళు తెరవండి”
ఇద్దరూ కళ్లు తెరిచేరు.
“చూడండి కోనేరే రంగులో వుందో?”
“ఎర్రగా వుంది”
“ఎందుకలా అయింది?” గంభీరంగా అడిగేడు స్వామి.
ఇద్దరూ మౌనంగా చూశారతనివైపు.
ఈ అమ్మణి పాపం చేసింది. భర్తని కాదని మరో వ్యక్తిని మనువాడి ఇద్దరు పిల్లల్ని కన్నది. అందుకే కోనేరు కన్నెర్ర చేసింది . సరే! ఆ పాపమంతా తేసేసేను. ఇప్పుడో మంత్రం చెబుతాను. కళ్ళు మూసుకుని వినండి. మనసెటూ పోకూడదు” అంటూ హెచ్చరించేడు స్వామి.
ఇద్దరూ కళ్ళు మూసుకున్నారు.
స్వామి ఏదో ఒక మంత్రం చెప్పేడు.
వెంకట్ కొద్దిగా కళ్ళు తెరచి స్వామివైపే చూశాడు.
స్వామి కన్ను కొట్టి ఇవతలికి రమ్మన్నాడు.
వెంకట్ నవ్వాపుకొని ఇవతలికొచ్చి నిలబడ్డాడు.
ఈశ్వరి మాత్రం ఏకాగ్రతగా భక్తిభావంతో కళ్ళు మూసుకుంది.
“నా మాటలు జాగ్రత్తగా విను”
ఈశ్వరి తలూపింది.
“ఇవి నేను చెబుతున్న మాటలు కావు. నీ అదృష్టం పండి ఇక్కడికొచ్చేవు. ఈ జన్మలోనే నీ భర్తని కలుసుకున్నావు. ఇక ఇతన్ని వదలకూడదు.అర్ధమయిందా?”
ఈశ్వరి అర్ధమైనట్లుగా తలూపింది.
“నీటిలో మూడు మునకలెయ్యి!” అన్నాడు అభుక్తేశ్వరస్వామి.
ఈశ్వరి అలానే చేసింది.
ఆమె నిలువెల్లా తడిచి సన్నగా వణుకుతోంది.
అభుక్తేశ్వరస్వామి దృష్టి తడిసిన బట్టల్లో స్పష్టమవుతున్న ఆమె శరీరాకృతి మీద మెడలో నగల మీద ఒక్కసారే పడింది.
“పాపాత్మురాలా!” అంటూ గావుకేక పెట్టేడు.
ఈశ్వరి ఇంకా వణికింది.
“నీ భర్త వుండగా ఆ పెళ్ళెలా చేసుకున్నావు? వాడిని వెంటనే ఈ క్షణం నుండి వదిలెయ్యాలి. అర్ధమయిందా?”
ఈశ్వరి “అయింది స్వామి!” అంది లెంపలు వాయించుకుంటూ.
“అయితే మెడలో తాళి తెంపు!”
ఆమె ఉలిక్కిపడింది.
“ఒక కుక్క కట్టిన తాళిని మెడలో వుంచుకుని ఎగతాళవుతావా?”
“లేదు”
“అయితే తెంచు. ఇతను నీ మెడలో తాళి కడతాడు”
ఈస్వరి అప్పటికే మానసికంగా అసక్తురాలయిపోయింది. పూర్తిగా వాళ్లేం చెబితే అది చేసే పరిస్థితిలో వుంది. భర్తిప్పుడు నిజంగా కుక్కలానే కన్పిస్తున్నాడు. వెంకట్ జన్మజన్మలకి తనకి భర్తగా అనిపిస్తున్నాడు.
ఏదో శక్తి ఆవహించినట్లుగా మెడలో తాళి తెంపేసింది.
అభుక్తేశ్వరస్వామి శంఖం పూరించేడు కోలాహలంగా.
వెంటనే ఆ తెంచిన బంగారపు తాడుని తన జేబులో వేసుకొని మంగళసూత్రాల్ని పసుపు తాడుకెక్కించి ఈశ్వరి మెడలో కట్టమన్నాడు వెంకట్‌ని.
వెంకట్ అతనివైపు నిస్సందేహంగా చూశాడు.
“కొంపేమి మునగదులే. వెయ్యి” అన్నాడతను నెమ్మదిగా.
ఎందుకైనా మంచిదని వెంకట్ ఆవిడ మెడలో నాలు ముళ్ళేసేడు.
ఇద్దరూ కోనేటిలోంచి బయటకొచ్చేరు.
“ఈ తీర్థం తాగండి” అంటూ కమండలంలోని తీర్థం ఇద్దరి చేతుల్లో పోసేడు.
వెంకట్ తాగబోతుంటే మళ్లీ కన్నుకొట్టి ఆగమన్నట్లుగా సైగ చేసేడు స్వామి.
ఈశ్వరి మాత్రం అదేం గమనించలేదు.
మూడుసార్లు భక్తిపూర్వకంగా తీర్థం తీసుకుంది.
“బయటికి రండి” అని ఆజ్ఞాపించి తాను ముందు నడిచేడు అభుక్తేశ్వరస్వామి. పేరుగు తగినట్టుగానే అతను డొక్కలు కనిపిస్తూ వున్నాడు. అతనిని నిశితంగా గమనిస్తూ అనుసరించేడు వెంకట్.
“ఈ పిల్ల విషయం నాకు మా రాజు రాసేడు” అన్నడతను వెంకట్‌తో గుసగుసగా.
వెంకట్ మాట్లాడలేదు.
స్వామి ఈశ్వరివైపు చూసి”నువ్వు కాస్సేపలా చెట్టు క్రింద కూర్చుని దైవధ్యానం చేసుకో” అన్నాడు.
ఈశ్వరి యోగనిద్రలో వున్నట్లుగా తల పంకించి అక్కడే వున్న చెట్టూ క్రింద కూర్చుంది.
అప్పటికే బాగా చీకటి పడింది.
పక్షులు గోలగోల చేస్తూ గూళ్లకి చేరేయి,.
అసలే వృక్ష సముదాయంతో వున్న ఆ ప్రాంతం మరింత చీకటిమయమైంది.
స్వామి అక్కడే వున్న మంటపంలో కూర్చుని వెంకట్‌ని కూర్చోమన్నట్లుగా సైగ చేసేడు.
వెంకట్ కూర్చున్నాడు.
“ఇక్కడే ఈ మంటపంలోనే మనకిప్పుడు శోభనం!”
స్వామి మాటలకి వెంకట్ ఉలిక్కిపడ్డాడు.
“మనకంటున్నారేమిటి?”
స్వామి కన్నుకొట్టి “నేనేం నిజం స్వాములోర్ని గాదు. నా పేరు అసిరి. మా అన్నలా నేనూ చిలకజోస్యం చెప్పి ఈ ప్రాంతాల్లో బతుకుతున్నాను. విశాఖపట్నంలో ఒక మర్డర్ కేసులో ఇరుక్కున్నాను. అందుకే ఇంత దూరం పారిపోయొచ్చేను. నాక్కాస్త ఆడ బలహీనతుంది. ఇదొక పిచ్చిముండ మనమిప్పుడేం చేసినా కాదనే స్థితిలో లేదు దాని మనసు. భయపడకు” అన్నాడు.
వెంకట్‌కెందుకో అతను చెప్పింది నచ్చలేదు.
అతని దృష్టి ఆమె ఆస్తి మీదే కేంద్రీకృతమై వుంది.
ఈ శారీరక సంబంధాల మీద అతనికి మక్కువ లేదు.
“వద్దు స్వామి! నాకింట్రస్టు లేదు. ఆ పిల్ల చాలా ఆస్తికి కాబోయే వారసురాలు. అది మనకొస్తే చాలు!” అన్నాడు.
స్వామి హేళనగా నవ్వేడు.
“అదెలానూ వస్తుంది. ఈ ఒంటరి రాత్రి అలాంటి ఆడపిల్లని వదులుకొనే స్థితి నీకుంటే వుండొచ్చు. నాకు మాత్రం లేదు. ఇపుడు మనమేం చేసినా కిమ్మనదా పిల్ల. నువ్వు కూర్చో” అంటూ స్వామి వేషంలో ఉన్న అసిరి చెట్టు క్రింద కూర్చున్న ఈశ్వరి దగ్గర కెళ్ళి భుజం తట్టేడు. ఆమె యాంత్రికంగా పైకి లేచింది.
అతనామె చెయ్యి పట్టుకుని మంటపం వైపు నడిపించేడు.
సరిగ్గా అదే సమయంలో ఆ ప్రాంతమంతా ఒక టార్చ్ లైటు గిరగిరా తిరిగింది.
స్వామితో పాటు వెంకట్ కూడా ఆ కాంతిని చూసి ఉలిక్కిపడి లేచి నిలబడ్డాడు.
వెంటనే అడుగులు చప్పుడు వినిపించింది.
ఏం జరగబోతున్నదో స్వామి వేషంలో వున్న అసిరి వెంటనే గ్రహించేడు.
అంతే!!
వెంటనే ఈశ్వరిని వదిలేసి రివ్వున చెట్ల గుబురుల్లోంచి పారిపోయేడు.
ఆ కాంతి చిన్నగా వెంకట్ మొహం మీద నిలిచింది.
“అబ్బాయ్! అమ్మాయేది?”
ఆ గొంతు హెడ్‌మాస్టారు నారాయణరెడ్డిగారిదని గ్రహించేడు వెంకట్.
వెంటనే గొంతు తడారిపోయింది.
“మీరా?” అన్నాదు హీనస్వరంతో.
“అవున్నేనే! మీరీ రాత్రికి ఇక్కడ వుంటారని తెలిసి పరిగెత్తుకొచ్చేను. మీకు ముందే చెప్పేను కదా. ఇక్కడ దొంగ వెధవలుంటారని. ఇంతకీ అమ్మాయేది?” అనడిగేరు మాస్టారు ఆత్రంగా.
“పిల్లల్లేరని అతను పూజ చేస్తానంటే…” అంటూ గొణిగేడు వెంకట్ ఏం చెప్పాలో తోచక.
మాస్టారు గాబరా పడుతూ “అసలమ్మాయేదయ్యా?” అన్నాడు కోపంగా.
వెంకట్ మంటపం వైపు చూపించేడు.
మాస్టారు, జట్కా అతను గబగబా మంటపం వైపు పరిగెత్తినట్లుగా నడిచేరు. అక్కడ ఈ ప్రపంచంతో సంబంధం లేనట్లుగా కళ్లు మూసుకుని కూర్చుని వుంది ఈశ్వరి.
ఆ అమ్మాయిని ఆ స్థితిలో చూసి మాస్టారి పితృహృదయం ద్రవించింది.
“అమ్మా ఈశ్వరి!” అని పిలిచేడు ఆర్ద్రత మేళవించిన స్వరంతో.
ఈశ్వరి పలకలేదు.
మాస్టారు ఆ పిల్ల వంటి మీద తడి బట్టలు చూసి “ఏం చేసారీ పిల్లని! వాడేడి?” అన్నడు రౌద్రంగా.
“ఏదో పూజ చేసేడు కోనేటిలో అతను పారిపోయినట్లున్నాడు” అన్నాడు వెంకట్ సగం ప్రాణం వచ్చి.
“నువ్వు చదువుకున్నావా?”
వెంకట్ తలాడించేడు.
“ఎందుకు? ఏడవను? మంత్రాలకి చింతకాయలు రాలతాయా? అంతకీ పిల్లలు పుట్టకపోతే ఎవర్నయినా అనాధని పెంచుకోవచ్చుగా. నేను సందేహించి రాకపోతే.. ఈ పిల్ల బతుకు అధ్వాన్నమైపోయేది. ఏదో జరగబోతున్నదనే అనుమానంతోనే నేను పరిగెత్తుకొచ్చేను” అన్నారాయన.
వెంకట్ మాట్లాడలేదు.
మాస్టారు జట్కా అతని సహాయంతో ఈశ్వరిని జట్కా ఎక్కించేరు.
వెంకట్ ఎక్కేక మాస్టారు కూడా ఎక్కేరు.
జట్కా కదిలింది.
ఈశ్వరింకా ఈ లోకంలోకి రాలేదు.
జట్కా వెళ్తుంటే మాస్టారన్నారు మెల్లిగా.
“అహోబిళం చాలా పవిత్ర పుణ్యక్షేత్రం. చూడదగిన స్థలం. కాని మొగలిపువ్వులో మిన్నాగుల్లా ఇప్పుడిలాంటి ప్రాంతాల్ని దొంగస్వాములు ఆక్రమించుకుని కలుషితం చేస్తున్నారు. నమ్మిన మనుషుల జీవితాల్ని నాశనం చేస్తున్నారు. పిల్లలు పూర్వ జన్మ రుణ సంబంధీకులు. రుణం లేకపోతే పిల్లలు కల్గరు. దానికోసం ఇంగితం మరచి నిన్ను కట్టుకున్న భార్యని పూజల పేరుతో పరాయి వారికప్పగిస్తావా? భార్యాబిడ్డలనే కాదు. ఏ స్త్రీనయినా గౌరవంగా చూడాలి. కన్నబిడ్డలా ఆదరించాలి. వీలైతే సహాయపడాలి. స్త్రీని మోసం చేసినవాడు స్త్రీ ఆస్తిని కాజేసినవాడు ఏడేడు జన్మలు రౌరవాది నరకాలను అనుభవిస్తాడని పెద్దలు చెబుతారు.

ఇంకా వుంది..

బ్రహ్మలిఖితం 13

రచన: మన్నెం శారద

అర్ధరాత్రి దాటింది.
ఈశ్వరికెంత ప్రయత్నించినా నిద్ర పట్టలేదు.
పదే పదే వెంకట్ రూపం కళ్ళలో కవ్విస్తూ కనబడుతోంది. అతనే తన భర్తన్న భావన ఆమె మస్తిష్కంలో క్షణక్షణం బలపడసాగింది.
పక్కనే పడుకున్న కుటుంబరావు నిద్రలో ఆమె మీద చెయ్యి వేసాడు. బలమైన సర్పం మీద పడినట్లుగా ఆమె ఉలిక్కిపడింది.
వెంటనే ఆ చేతిని చీదరగా విసిరికొట్టింది.
కుటుంబరావుకి మెలకువ రాలేదు.
ఈశ్వరి అతన్ని పరాయి వ్యక్తిలా గమనించింది.
అతను కొద్దిగా నోరు తెరిచి గురక పెడుతున్నాడు.
డొక్కలు గురక వలన ఎగసెగసి పడుతున్నాయి.
ఈశ్వరికి వెంటనే అతను పూర్వజన్మలో కుక్కని ఓంకారస్వామి చెప్పిన మాటలు గుర్తుకొచ్చేయి.
ఆమె అనుకోకుండా కెవ్వున అరచింది.
కుటుంబరావు ఉలిక్కిపడి లేచి” ఏం జరిగింది?” అన్నాడు.
“ఏం లేదు. ఏం లేదు” అందామె తనలోని గగుర్పాటునణచుకుంటూ.
“కలొచ్చిందా? కాసిన్ని మంచినీళ్ళు తాగి పడుకో” గొణీగినట్లుగా అని అటు తిరిగి పడుకున్నాడు.
ఈస్వరి లేచి ఫ్రిజ్ తెరచి మంచినీళ్లు తాగింది.
తిరిగి భర్త పక్కన పడుకోవాలనిపించలేదు.
వెళ్లి పిల్లల గదిలోకి తొంగి చూసింది.
వాళ్లిద్దరూ గాఢనిద్రలో వున్నారు. వాళ్లు కప్పుకున్న దుప్పట్లు సరిచేసి హాల్లోకొచ్చి నిలబడింది.
ముసురుతున్న ఆలోచనలు ఆమె హృదయాన్ని స్థిమితం కోల్పోయేలా చేస్తున్నాయి.
ఏదో జరిగిపోయిందేదో జరిగిపోయింది.
ఇప్పుడెందుకు తనకి గత జన్మ గురించి తెలియాలి.
ఇప్పుడెలా ఈ నిజాన్ని తెలీనట్లుగా నటించి ముందు జీవితాన్ని గడపగలదు తను.
అందులోనూ తన భర్త గత జన్మలో తన పెంపుడు కుక్కని తెలిసేక అతన్నెలా గౌరవించగలదు. అతని స్పర్శనెలా భరించగలదు.
పైగా క్షణక్షణానికి తన మనసు వెంకట్ వైపు మొగ్గిపోతున్నది.
ఒక్కసారి అహోబిలం వెళ్తే?
అక్కడున్న అభుక్తేశ్వర స్వామి ఏం చెబుతారో?
తన జీవితానికెలాంటి నిష్కృతి చూపిస్తారో?
రేపే వెంకట్‌ని అడగాలి. అతనికి తన ఫోను నెంబరు కూడా ఇచ్చింది. అతనొకసారి తనకి ఫోను చేస్తే బాగుండును.
ఈశ్వరి తన ఆలోచనల్లో తానుండగానే ఫోను రింగయింది.
ఈశ్వరి గబాగబా వెళ్లి రిసీవర్ ఎత్తింది.
“హలో నేను.. వెంకట్‌ని.. నీకూ నిద్ర పట్టలేదు కదూ. నాకూ అంతే!” అంటూ నవ్వేడతను.
ఈశ్వరి హృదయం సంతోషంతోనూ, భయంతోను మరింత వేగంగా కొట్టుకుంది.
భర్త గదివైపు చూస్తూ “ఒక్క నిముషం” అని రిసీవర్ పెట్టి ఆ గది తలుపులు దగ్గరకేసి వచ్చి మళ్లీ రిసీవరందుకుంది.
“నిన్ను నేనొదిలి వుండలేకపోతున్నాను డార్లింగ్!”
ఆ మాట వినగానే ఈశ్వరి శరీరమంతా గోదారి లంకల్లో మొలిచిన రెల్లుగడ్డితో సున్నితంగా నిమిరినట్లు పులకరించింది.
“ఏంటి! మాట్లాడవు. నిన్నిబ్బంది పెడుతున్నానా?” అంటూ రెట్టించేడు వెంకట్.
“అదికాదు. ఇప్పుడీ పరిస్థితిలో మనకీ నిజం తెలియకుండా వుండాల్సింది” అంది అతి నీరసంగా ఈశ్వరి.
“తెలిసినందుకు బాధపడుతున్నావా? అలాగయితే నేను నిన్ను బాధించనులే. ఈ ఊరొదిలేసి వెళ్లిపోతున్నాను” అన్నడు వెంకట్ కంఠంలో బాధని అరువు తెచ్చుకుని.
“వద్దొద్దు. మిమ్మల్ని చూడకుండా బ్రతకలేను. ఇప్పటికే ఇక్కడొక క్షణం వుండలేకపోతున్ననాను” అంది ఈశ్వరి వస్తున్న దుఃఖాన్ని ఆపుకొంటూ.
వెంకట్ తన పాచిక పారినందుకు సంతోషిస్తూ “ఎలా మరి! నిన్ను తీసుకెళ్లిపోదామంటే.. నువ్వు పెళ్లయినదానివి. పైగా పిల్లలున్నారు. నాకా సరైన ఉద్యోగం… ఆస్తి లేవు. నిన్నెలా పోషించగలను?”
అతని మాటలకి ఆశ్చర్యపోయింది ఈశ్వరి.
“మరి నిన్నెలా పాతిక వేలు తెచ్చిచ్చేరు?” అనడిగిందాశ్చర్యంగా.
“బెగ్, బారో, ఆర్ ధెఫ్ట్! అన్నాడు. రెండోది చేసేను. నా భార్య కష్టంలో వున్నప్పుడు నేనెలా చూస్తూ ఊరుకోగలను”
వెంకట్ జవాబు విని ఈశ్వరి హృదయం ఆర్ద్రమైపోయింది.
“ఇలా ఎప్పుడైనా ఆ కుక్క మొహంగాడన్నాడా?” అనుకుని మనసులోనే.
“ఈసారి మీరలా నాకోసం అప్పు చేయొద్దు. మాకు చచ్చేంత ఆస్తుంది. కాని మా మేనమామ మూణ్నెల్లకోసారొచ్చి నా నగలు తూకం వేసి ఎంత తరుగొచ్చిందో మరీ చూసుకుంటాడు. ఇకపోతే మా పెదనాన్న రేపోమాపో చచ్చేట్లున్నాడు మంచం మీద. ఆయనకి పెళ్లాం, పిల్లలు లేరు. నేనే అతని ఆస్థికి వారసురాల్ని. ఆ ఆస్తి చేతికొస్తే నేనీ కుక్కమొహంగాణ్ని వదిలేసి తీరతాను” అంది ఈశ్వరి.
ఆమె ఆస్థి వివరాలు వినగానే వెంకట్ మొహం చింకి చేటంతయింది. ఏమి తనదృష్టం. అటు లిఖిత అమ్మని బుట్టలో వేసి కంపెనీ హేండోవర్ చేసుకోవాలి. ఇటు ఈ పిచ్చిదాన్ని వశం చేసుకొని ఆస్తి కాజేయాలి.
“ఏంటి మాట్లాడరు?” అంటూ ఈశ్వరి రెట్టించింది.
“ఆహా! ఏం లేదు కుక్కమొహం గాడెవరా అని ఆలోచిస్తున్నాను” అన్నాడూ.
“ఇంకెవరు? ప్రస్తుతం నా మొగుడే. పూర్వ జన్మలో మనింటి పెంపుడు కుక్కేనట ఇతను. అది తెలిసిందగ్గర్నించి నాకతన్ని చూస్తే కంపరమెత్తిపొతున్నది!”
ఆ మాత విని వచ్చే నవ్వాపుకున్నాడు వెంకట్.
“చీ! ఛీ! నీకేం గతి పట్టింది డార్లింగ్. అది సరే మనం ఒకసరి అహోబిలం వెళ్దాం. ఆ ఓంకారస్వామి మాటలెంతవరకు నిజమో తెలుసుకోవాలిగా.” అన్నాడు.
“నేనూ.. అదే అనుకుంటున్నాను. రెండ్రోజులు మా వూరెళ్తానని శెలవు పెడ్తాను. ఆళ్లగడ్డ కర్నూల్ జిల్లాలో వుందట. ముందక్కడికి వెళ్దామంటే.. మనకెవరో ఒకరు దారి చెబుతారు” అంది ఈశ్వరి.
“అలాగే” అన్నాడు వెంకట్ ఆనందంగా రిసీవర్ క్రెడిల్ చేస్తూ..
*****
వెంకట్ ఫోను చేసి చెప్పిన మాటలు గుర్తొచ్చి లిఖిత హృదయం భగ్గుమంటోంది.
“లిఖితా! మీ అమ్మ నీకు టి.ఎం.ఓ చెయ్యమని నాకు చెప్పింది. వెంటనే నన్ను నీకు తోడుగా వుండమని కొచ్చిన్ వెళ్లమని కూడా చెప్పింది. కాని ఈ రెండూ నేను చేయడం లేదు. డబ్బు డ్రా చేసుకున్నాను. అందులో ఒక్క పైసా కూడా నీకు రాదు. వెళ్తూ వెళ్తూ నా మొహాన వెయ్యి రూపాయలు ముష్టోడి కిసిరినట్లు విసిరి కొడ్తావా? ప్రస్తుతం మీ అమ్మ నా గుప్పెట్లో వుంది. చెప్పాలని ప్రయత్నించేవా ఆ అడవిలో నీకెలానో నీ బాబు దొరకడు. నువ్వొచ్చేటప్పటికి మీ అమ్మ బే ఆఫ్ బెంగాల్‌లో కలిసిపోతుంది. బీ కేర్‌ఫుల్!” అంటూ బెదిరించేడు.
అతని మాటలు విని లిఖిత నివ్వెరపోయింది.
తమ ఇంట్లో ఒక పెంపుడు కుక్కలా తిరిగి, తమ కనుసన్నల్లో పడటానికి అడ్డమైన చాకిరి చేయడానికి సిద్ధపడిన ఈ వ్యక్తిత్వం లేని నీచుడు అకారణంగా ఎంత నీచంగా ప్రవర్తిస్తున్నాడో అర్ధమయ్యేసరికి లిఖితలో విపరీతమైన ఉద్రేకం చోటు చేసుకుంది.
ఒక నీచుడి బెదిరింపుకి వణికిపోయే మనస్తత్వం కాదామెది.
వెంటనే ఇంటికి రింగ్ చేసింది.
ఎంత ట్రై చేసినా ఫోను డెడ్ సౌండ్ వస్తోంది.
లిఖిత నిస్పృహగా రిసీవర్ని క్రెడిల్ చేస్తుంటే హోటల్ మేనేజర్ ఆమెవైపు జాలిగా చూసి “వాట్ హేపెండ్?” అనడిగేడు.
జరిగింది చెప్పడం చాలా అనవసరమనిపించింది లిఖితకి.
ఆలోచిస్తూ అతనికెదురుగా బిగించి వున్న అద్దంలోకి అప్రయత్నంగా చూసింది.
వెంటనే ఆమె కళ్ళు తళుక్కుమన్నాయి.
“జస్టే మినిట్!” అంటూ బయటకొచ్చి ఆ రోడ్డులోనే వున్న ఒక జ్యూయలరీ షాపుకెళ్లింది లిఖిత.
తన చెవులకున్న డైమండ్ హేంగింగ్స్ షాపతని చేతిలో పెట్టి “అయి వాంట్ మనీ. వెరీ క్విక్ డిస్పోసల్” అంది లిఖిత.
అతను వాటిని పరీక్షించి , ఆమె చేతిలో లక్ష రూపాయిలు పెట్టేడు.
ఆమె తెల్లబోతూ “లక్షా?” అంది.
“అంతకంటే రాదు. కావాలంటే ఇంకెక్కడైనా అమ్ముకోండి అమ్ముకోండి” అన్నడతను.
తల్లి తనని డైమండ్ టాప్స్ పెట్టుకోమంటే.. తను ఇష్టం లేక ఎంతో మారాం చేసింది. కాని.. ఇప్పుడవే ఊరుకాని ఊరిలో ఆదుకున్నాయి. ఈ లక్ష రూపాయిలు పట్టుకొని తిరుగుతుంటే.. తన కూడా మళ్లీ ఏ నకిలీ జర్నలిస్టో పడకమానడు అనుకుంటూ వాటిని బాగ్‌లో సర్దుకుని షాప్ ఓనర్ వైపు తిరిగి “థాంక్స్” అంది.
అతడు పళ్లికిలించేడు.
లిఖిత గ్లాసు డోర్ తీసుకొని బయటికి నడుస్తుంటే “ప్రొద్దుటే లక్ష రూపాయలు లాభం!” అనుకున్నాడతను డైమండ్ హేంగింగ్స్ చేత్తో తిప్పి అపురూపంగా చూసుకొంటూ.
ఆమె తిరిగి హోటల్‌కి రాగానే మానేజర్ ఆమెని జాలిగా చూస్తూ “డబ్బు కోసం మీరవస్థ పడుతున్నట్టున్నారు. ఒక పని చెయ్యండి. ఈ హోటల్ బిల్ నేను కడ్తాను. మున్నార్ వెళ్లడానికి ఏర్పాటు చేస్తాను. మీరు తిరిగొచ్చేక నాకు డబ్బిద్దురుగాని” అంటూ వేలికున్న అయ్యప్ప స్వామి ఉంగరం తీసేడతను.
లిఖిత అతనివైపు ఆశ్చర్యంగా చూస్తూ “అదెందుకు?” అంది.
“నేనూ మిడిల్ క్లాస్ మనిషినే! కేష్ లేదు నా దగ్గర. ఇదమ్మేసి అర్జెంటుగా డబ్బు తే!” అన్నాడొక బేరర్‌ని పిలిచి.
లిఖిత తేరుకుని “వద్దొద్దు” అంది.
అతను తెల్లబోతూ “ఏం?” అన్నాడు చిత్రంగా చూస్తూ.
“నా దగ్గర డబ్బుంది. మీ సహకారానికి కృతజ్ఞతలు. నేను బిల్ పే చేస్తాను. ఎంతయింది?” అంటూ బాగ్‌లోంచి ఒక పదివేల కట్ట తీసింది లిఖిత.
మానేజర్ ఆ కట్టవైపు విభ్రమంగా చూసేడు.
“ఎక్కడిది?” అనడగబోయి నాలిక్కరచుకొని బిల్ సిద్ధం చేసిచ్చేడు.
ఆమె బిల్ పే చేసి “నాకో సహాయం చేస్తారా?”అనడిగింది.
“విత్ ప్లెషర్!”
“నా దగ్గర లక్ష రూపాయిలున్నాయి. ఇందులో నేనొక పదివేలు మాత్రం తీసుకొంటాను. మిగతాది మీ దగ్గర దాచాలి.!”
ఆ మాట విని అతను గాభరాపడుతూ “అంత డబ్బే! వద్దండి!” అన్నాడు.
లిఖిత చిన్నగా నవ్వి “ఏం ఆ మాత్రం సహాయపడకూడని మనిషిలా కనిపిస్తున్నానా నేను?” అంది.
“అది కాదు. డబ్బు పాపిష్టిదన్నారు. అంతే కాక చాలా అవసరమైనది కూడా. ఏ క్షణం ఏ బుద్ధి పుడుతుందో. కావాలంటే మీ కూడా బాంక్‌కొచ్చి డిపాజిట్ చేయించి పెడ్తాను” అన్నాడు మానేజర్.
“నాకంత టైము లేదు. పైగా నాకు మీమీద చాలా నమ్మకముంది. ప్రాణం పోయినా మీరు నా డబ్బు తాకరు!”
మానేజర్ ఆశ్చర్యంగా చూసి “ఏంటంత నమ్మకం నా మీద!” అన్నాడు.
లిఖిత నవ్వి “నా నమ్మకానికెలాంటి డెరివేషనూ లేదు. కొందరు అప్పు అని తీసుకొని అడిగితే అపకారం చేస్తారు. మీలో నాకు మానవత్వపు విలువలు కనిపిస్తున్నాయి దట్సాల్!” అంటూ తనో పదివేలు తీసుకొని మిగతా బండిల్స్ అతని చేతికందించింది.
అతను వణుకుతున్న చేతులతో దాన్ని అందుకున్నాడు.
ఆమె ‘థాంక్స్’ చెప్పి రెండడుగులు ముందుకేసి వెనుతిరిగి “మీ పేరు?” అనడిగింది.
“జోసెఫ్”
“మరి మీ చేటికి అయ్యప్ప రింగు..?” ఆమె ఆశ్చర్యపోతూ అడిగింది.
“అది నా నమ్మకం..” అతను నవ్వాడు.
లిఖిత చెయ్యి వూపుతూ బయటకి నడిచింది.
*****
ఈశ్వరి, వెంకట్ ఎలాగోలా కష్టపడి కర్నూలు చేరుకొని అక్కడ బస్సెక్కి ఆళ్లగడ్డ చేరుకున్నారు. ఆళ్ళగడ్డ ఊరు చిన్నదయినా రాయలసీమలో రాజకీయపరంగా పేరు గాంచింది.
ఇద్దరూ బస్సు దిగి అహోబిలం ఎలా వెళ్లాలా అని ఆలోచిస్తూండగా పంచెకట్టుతో ఒక ముసలాయన ఎదురుపడ్డాడు. ఈశ్వరిని చూస్తే ఆయనకి సద్భావన కల్గింది.
“ఎక్కడికెళ్ళాలమ్మా?” అనడిగేడాయన.
“అహోబిలం” అన్నడు వెంకట్ తను కల్గజేసుకుంటూ.
“ఇంతెండలోనా?”అతను రిస్టువాచీ కేసి చూసుకుంటూ అని “సరే. ముందు మా యింటికి రండి. భోంచేసి వెళ్దురుగాని” అన్నాడూ.
అపరిచితుల్ని భోజనానికి రమ్మంటున్న అతని సహృదయతకి వాళ్లాశ్చర్యపోయేరు.
అనుమానంగా చూస్తున్న వాళ్లవైపతను చూసి నవ్వి “నా పేరు నారాయణరెడ్డి. రిటైర్డ్ హెడ్‌మాస్టర్ని. నాకు తోచిన మంచి పని చేయడం నాకలవాటు. రండి” అన్నాడు.
వాళ్లతన్ని అనుసరించేరు.
ఇంట్లోవాళ్లు ఎవరు ఏంటి అని అడక్కుండానే వాళ్లకి మంచి భోజనం పెట్టేరు.
“కాస్సేపు పడుకోండి. మూడింటికి లేచి బయల్దేరితే చల్లగా వుంటుందన్నాడాయన.
ఈశ్వరి వెంకట్ పడుకున్నారన్నమాటేగాని నిద్ర పట్టలేదెవరికీ.
ఎవరి ఆలోచనల్లో వాళ్ళున్నారు.
తొందరగా నిజం తెలుసుకొవాలని ఈశ్వరి, అతి తొందరగా అబద్ధాన్ని నిజంగా నమ్మించాలని వెంకట్ ఆతృతపడుతున్నారు.
మూడు కాగానే గంట కొట్టినట్లు ఠక్కున లేచి కూర్చున్నారు.
రెడ్డిగారమ్మాయి వాళ్లకి వేడివేడి పకోడీలు, టీ తెచ్చిచ్చింది.
అవి తిని టీ తాగి తల దువ్వుకొని ఇద్దరూ క్రింద కొచ్చేటప్పటికి జట్కాబండి రెడీగా వుంది.
“ఒరే సుబ్బా, బండి నిదానంగా నదుపు. అమ్మాయి భయస్తురాల్లా వుంది” అని చెప్పేడు నారాయణరెడ్డి.
ఆయన కూతురు మరచెంబుతో నీళ్లు, ఉడకబెట్టిన వేరుశెనక్కాయలు తెచ్చి ఇస్తూ “బండిలో కాలక్షేపం” అంటూ నవ్వింది.
బండి కదులుతుంటే ఈశ్వరి, వెంకట్ అతనికి నమస్కరించేరు.
“జాగ్రత్త! అహోబిల నృసింహస్వామిని దర్శించండి. ఆ చుట్టుపక్కల ప్రాంతం మనోహరంగా వుంటుంది. చూడండి. కాని.. అక్కడుండే బైరాగుల్ని, స్వాముల్ని కదిలించకండి!”అన్నాడు హెచ్చరికగా మాస్టారు.
వాళ్లిద్దరూ మొహమొహాలు చూసుకున్నరు.
జట్కా ఆ లోపున స్పీడందుకుంది.
“ఈ ఊళ్ళో ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాలితే బాంబులేసుకొని చంపుకుంటారంటారు. ఈయనెవరో మనం ఎవరో తెలీకపోయినా భోజనం పెట్టి మర్యాదలు చేసేడు” అంది ఈశ్వరి ఆశ్చర్యంగా.
“అవునమ్మా. ఈ ఊరిని బాంబుల గడ్డని కూడా అంటారు జనం. ఈ గడ్డ మీద జనానికి పౌరుషాలు, పంతాలు ఎక్కువ. కుళ్ళుకి, కావేషాలకి, ఆశకి, అసూయకి చంపుకోరు మా వూరి జనం. అలాగే స్నేహానికి ప్రాణాలిస్తారు. అస్తులు పంచేస్తారు. ఆ మాస్టారయ్య మా వూళ్ళొ గాంధీ మహత్ముడిలాంటివాడు. తనకున్న దానిలో బీదలకి అయిదెకరాల ఇళ్ల స్థలం పంచేడు అదిగో ఆ వచ్చే శారదానగర్ ఆయన దానం చేసిన స్థలమే.” అన్నాడు జట్కా సుబ్బడు.
అతని మాటలు మౌనంగా విన్నారు వాళ్లిద్దరూ.
జట్కా వెళ్తోంటే చల్లని గాలి వీచసాగింది. చెట్ల గుబుర్ల సాంద్రత పెరిగి రోడ్డు పొడుగునా నీడ పరుచుకుంది.
జట్కా ఒక చోట ఆగింది.
“దిగండి. అహోబిలం వచ్చింది” అన్నాదు సుబ్బడు.
ఇద్దరూ దిగేరు.
“నువ్వెళ్లిపో. ఈ రాత్రి మేమిక్కడుంటాం”
“ఇక్కడా?”
“ఏం?”
“రాత్రులుండె సదుపాయాలేం లేవిక్కడ. మిమ్మల్ని అంతా చూపించి తిరిగి తీసుకొచ్చేయమన్నారు” అన్నాడు సుబ్బడు.
ఈశ్వరి వెంకట్ వైపు చూసింది.
“మేమొక రాత్రి ఇక్కడ నిద్ర చేయాలనుకున్నాం. నువ్వెళ్లు” అంటూ డబ్బులివ్వబోయేడు వెంకట్.
సుబ్బడు “నయం. మా రెడ్డిగారు డొక్క చించేస్తారిట్టాంటి పన్లు జేస్తే. వస్తా!” అంటూ జట్కా తోలుకు వెళ్లిపోయేడు.
“పడ” అన్నాడు వెంకట్ ముందుకి నడుస్తూ.
ఈశ్వరి అతన్ననుసరించింది.
ఆ ప్రాంతమంతా దట్టమైన చెట్లతో అల్లుకుపోయి ఆకాశాన్ని కనిపించనీయడం లేదు. పలకలు పేర్చినట్లున్న రాళ్ల సందుల్లోంచి సన్నగా చుక్కలుగా కారుతున్నట్లనిపించే నీరు గుడిముందు ఒక కోనేరుగా మారడం చిత్రంగా అనిపిస్తుందెవరికైనా. ఆ కోనేటి మెట్ళు, చుట్టూ రాతి కట్టడం కూడా పలకలతో నిర్మించినట్లే వుంది. ముఖ్యంగా అందులోని నీరు ఎన్నిసార్లు సెడిమెంటేషన్, ఫిల్టరింగ్ చేసినా అంత స్వచ్చంగా మారదనిపిస్తుంది. ఈశ్వరి ఆ వాతావరణాన్ని పరవశంగా గమనిస్తూ గుహలాంటి గుడిలోకి వెంకట్ ననుసరించి నడిచింది.
ఆ రాత్రే ఆమె జీవితం ఒక భయంకరమైన మలుపు తిరగబోతున్నదని , తన అందమైన సంసారాన్ని తానే చేతులారా భ్రష్టు పట్టించుకోబోతున్నానని ఆ సగటు అమాయకురాలికెంత మాత్రమూ తెలియదు.

ఇంకా వుంది.

బ్రహ్మలిఖితం 12

రచన: మన్నెం శారద

వేంకటేశ్వర స్వామి గుడి మెట్లెక్కుతుంటే ఈశ్వరి కాళ్ళు చిన్నగా వణికేయి.
ఒక అపరిచిత వ్యక్తిని కలుసుకోడానికి తనేంటింత ధైర్యంగా వస్తోంది.
తను కాకినాడ పక్కన కత్తిపూడిలో పుట్టి పెరిగింది. ముందు నుండీ ఘోషా కుటుంబం తమది. తండ్రి పట్టుదల వలన కాకినాడ మేనమామ ఇంట్లో వుంది, బి.ఏ వరకు చదివింది. పేరుకి కాలేజీకి వెళ్ళేదే గాని ఇంట్లో వంచిన తల కాలేజీలో ఎత్తేది. మళ్లీ అక్కడ వంచిన తల ఇంట్లో ఎత్తేది. ఆడవాళ్లు ఆ ఇంట్లో కేవలం తినడానికి మాత్రమే నోరు తెరవాలి. మగవాళ్ళేదైనా చెబితే కేవలం సరేనంటూ గంగిరెద్దులా తల తిప్పి చెప్పాలి. బి.ఏ ఫైనలియర్‌లో వుండగా తనకి మేనమామ కొడుకు కుటుంబరావుతో పెళ్ళయింది. కుటుంబరావు కోరమండల్ ఫెర్టిలైజర్స్‌లో పని చేస్తున్నాడు. అతని పట్టుదల వలనే తను ఉద్యోగం చేస్తోంది.
కుటుంబరావు అలవాట్ల పరంగా చూస్తే మంచివాడే.
చుట్ట, బీడీ, సిగరెట్‌లో దేన్నీ ముట్టడు. కల్లు, సారా, బ్రాందిల్లాంటివి చస్తే తాగడు. పరాయి ఆడవాళ్లు వివస్త్రలుగా ఎదురుగా నిలబడ్డా కన్నెత్తి చూడడు. ఎవరితోనూ విమర్శలు పెట్టుకోడు. కోతలు కోయడు. భార్య వండి కంచంలో ఏది పెడితే అది తిని ఆఫీసుకెళ్లిపోతాడు. సాయంత్రం ఇంటికి రాగానే ఆవిడ కాఫీ యిస్తే కాఫీ, టీ ఇస్తే టీ తాగుతాడు. ఆవిడ కాఫీ పేరుతో కుడితిచ్చినా అతడు తాగుతాడేమోనని ఆవిడకనుమానం. కాని ఆవిడకంత ధైర్యం లేదు ఆ పని చెయ్యడానికి.
అలానే ఇద్దరు పిల్లలు పుట్టేరు. స్కూలుకెళ్లి చదువుకుంటున్నారు.
మాట్లాడకపోతే మానే. కనీసం కొట్లాడటం కూడా రాని భర్తతో ఈశ్వరికి జీవితం ఉప్పులేని కూరలా తయారయింది.
ఏది చేసినా ఇది బాగుందనడు. బాగోలేదనడు.
ఎలా తయారైనా నువ్వీరోజు బాగున్నావనో, ఈ చీర నీకు నప్పిందని చస్తే చెప్పడు.
పెళ్లయి పదేళ్లయినా చిన్న మెలికా, మెరపూ లేని జీవితం ఆమెది.
సరిగ్గా మనసు విసిగి వేసారిన సమయంలో సుదీర్ఘ గ్రీష్మ తాపంలో డస్సిపోయింది అనుకున్న తన ప్రాణానికి తొలకరి జల్లులాంటిదయింది ఓంకారస్వామి మాట.
అందుకే ఆమె కట్టుబాట్లని త్రెంచుకొని వెంకట్‌ని కలుసుక్కునేందుకు అక్కడికొచ్చేసింది.
చివరి మెట్టు మీద పాదం మోపుతున్నప్పుడు ఆమె పాదం పట్టి తప్పినట్లుగా వణికింది.
తన తడబాడు నణచుకుంటూ తలెత్తి చుట్టూ చూసింది. సముద్రం వైపుగా వున్న పేరాపెట్ వాల్ నానుకొని ఆమె రాకకోసం ఎదురు చూస్తున్నాడు వెంకట్.
బ్లూయిష్ వైట్ లూయీ ఫిలిప్స్ షర్ట్‌ని, బ్లాకిష్ బ్లూ రేమండ్స్ పేంట్‌లో టక్ చేసి తల బాగా వెనక్కి దువ్వు రెండు చెతుల్నీ పేరాపెట్ వాల్ కాన్చి నిలబడ్డాడు. ఆ డ్రెస్సు కూడా అంతకు ముందు పుట్టినరోజుకి లిఖిత కొనిపెట్టిందే.
వెంకట్ ఈశ్వరి రావడం గమనించి చిరునవ్వు నవ్వేడు. ఆ నవ్వులోని కృతకత తెలీని ఈశ్వరి తనూ నవ్వాలని ప్రయత్నించి విఫలురాలయి సిగ్గుతో తల దించుకుంది.
ఏదో తప్పు చేస్తున్నానన్న భావన ఆమె మనసుని ఎండ్రకాయలా పట్టుకు పీకుతోంది.
“రండి” అన్నాడతను చొరవగా.
ఈశ్వరి బలిపశువులా అతని దగ్గరకు నడిచింది.
“ఇక్కడ కూర్చుందామా, లేక బీచ్‌లో కెళదామా?”
అతని ప్రశ్నకామె కంగారు పడుతూ “వద్దొద్దు. బాగా వెలుగుగా వుంది. ఎవరైనా చూస్తారు.” అంది గాభరాగా.
అతను నవ్వి “సరే, ఇక్కడే కూర్చుందాం” అంటూ అతను కటకటాలుగా కట్టిన పేరాపెట్ వాల్ కానుకుని కూర్చున్నాడు.
ఈశ్వరి కూడా అతని కభిముఖంగా కొద్దిగా దూరంగా మోకాళ్ల మీద తల పెట్టుక్కూర్చుంది.
పైకి గాంభీర్యం వహించినా మనసు మాత్రం సూపర్ ఎక్స్‌ప్రెస్ వచ్చేటప్పుడు దడదడలాడే ఫ్లాట్‌ఫారంలా వణుకుతూనే వుంది.
వెంకట్ క్రీగంట ఆమెని నిశితంగా గమనించేడు.
స్వచ్చమైన పారచూట్ కొబ్బరినూనె రాసి జడ గట్టిగా దువ్వు అల్లింది. అయితే జద చాలా పెద్దది. మంచి గోధుమ రంగులో మెరిసే శరీరం గుండ్రని ఆకృతి. కాటుక దిద్దిన కళ్లు, లిప్‌స్తిఖ్ లేకుండానే గులాబీ రంగులో మెరిసే పెదవులు, మైసూర్ క్రేప్ చీరలో తీర్చిదిద్దినట్లున్న ఆకృతి, ముఖ్యంగా మెడలో దిట్టంగా వున్న రెండు పేటల మంగళసూత్రాల గొలుసు. నల్ల పూసలు, చేతికి ఆరు జతల గాజులు, చెవులకి డైమండ్ దుద్దులు, ఈవిడకి ఓంకారస్వామి పాతికవేలు ఎందుకిమ్మన్నట్టు?
“ఏదో మాట్లాడాలన్నారు?”
వెంకట్ ప్రశ్నకి ఆమె కళ్లెత్తి అతనివైపు చూసింది.
ఓంకారస్వామి చెప్పిన మాటలు చెప్పడానికి నోరు పెగల్లేదు. తీరా విని తననొక పిచ్చిదానిలా జమకట్టి కింగ్ జార్జి హస్పిటల్‌కి తరలిస్తాడేమోనని భయపడిందామె.
“నేను మీకు ఎక్సెస్ పే చేసింది ఇరవై వేలే. ఇరవ్వయిదిచ్చేరు మీరు. సరిగ్గా లెక్క చూసుకోలేదా?” అంది మెల్లిగా.
అతనదోలా నవ్వేడు.
ఆమె తనేమన్నా అతప్పు మాట్లాడేమోనని కంగారు పడింది.
“నా కసలు మీ బాంక్‌లో అకౌంట్ లేదు.”
అతని జవాబు విని ఆమె అదిరిపడింది.
“ఏంటి మీరంటున్నది?” అంది గగుర్పాటుగా.
“ఎస్. మేడం. నేను చెబుతున్నది నూటికి నూరుపాళ్లూ నిజం”
“అయితే మీరెందుకా డబ్బిచ్చేరు?” కొంచెం కోపంగానూ, మరికొంచెం భయంగానూ అడిగింది ఈశ్వరి.
“ఎందుకంటే .. వద్దులెండి. నన్ను పిచ్చివాడిగా జమకడతారు!” అన్నాడు వెంకట్.
ఈసారి ఈశ్వరి అనుమానం బలపడింది.
తనకు చెప్పినట్లుగానే ఓంకార స్వామి ఇతనికి తన గురించి చెప్పేడేమో.
“నేనేం అనుకోను చెప్పండి” అంది ఈశ్వరి కొంత ధైర్యం తెచ్చుకొని.
వెంకట్ పేరాపెట్ వాల్ కటకటాల్లోంచి సముద్రం కేసి దీక్షగా చూశాడు.
అలల వంపులో పైకి లేస్తు, క్రిందకి మునిగిపోయినట్లుగా వంగుతూ వెళ్తూన్న జాలర్ల పదవల కేసి చూస్తూ “నాకో కల వచ్చింది” అన్నాదు.
ఈశ్వరి టెన్షన్‌గా ఊపిరి బిగబెట్టి అతనేం చెప్పబోతున్నాడాని వింటోంది.
“ఆ కలలో నాకొక స్వాముల వారు కన్పించి మీరు గత జన్మలో నా భార్యని, మీరు డబ్బు పోగొట్టుకుని ఆపదలో వున్నారని వెంటనే ఆ డబ్బివ్వమని చెప్పేడు. మీకెంత ఇవ్వమని చెప్పాడో గుర్తు లేదు. అందుకే పాతికవేలు తెచ్చిచ్చేను”. వెంకట్ మాటలు విని అసలే పెద్దవైన తన కళ్ళని మరింత పెద్దవి చేసింది ఈశ్వరి.
“నా పేరు బాంక్ పేరు కూడా చెప్పేడా స్వామి?” అనడిగింది అమాయకంగా.
“చెప్పలేదు. మీ ఆనవాళ్లు మాత్రం కొద్దిగా చెప్పినట్లు గుర్తు. అందుకే సిటీలో బాంక్ బాంక్ తిరిగేను. మీ బాంక్ కొచ్చినప్పుడు మిమ్మల్ని చూడగానే జన్మ జన్మలనుబంధం వున్నట్లుగా అనిపించింది నాకు” అన్నాదు వెంకట్ గాఢంగా నిశ్వసిస్తూ.
ఈశ్వరి మ్రాన్స్పడినట్లుగా చూసిందతనివైపు.
“మీరు వివాహితలా వున్నారు. నా మాటలు విని కోపం తెచ్చుకోకండి. నా కలలు తరచూ నిజమవుతుంటాయి. 1977 నవంబరులో ఉప్పెన వచ్చేముందు కూడా నాకో కలొచ్చింది. అంతా కొట్టుకుపోతున్నట్లుగా. అప్పుడు చిన్నవాణ్ణి. నా మాటలెవరూ పట్టించుకోలేదు. ఆ తర్వాత ఇందిరాగాంధీని షూట్ చేస్తున్నట్లు, భూకంపం వచ్చినట్లు.. దాదాపు అన్నీ జరిగేయి. అందుకే నేను గాఢంగా మీరు నా భార్యని నమ్ముతున్నాను. అలా అని నేనేం మీ జీవితానికడ్డం రాను” అంటూ భారంగా ఏదో పోగొట్టుకున్న వాడిలా నటిస్తూ లేచి నిలబడ్డాడు వెంకట్.
ఈశ్వరి కూడా లేచి నిలబడి “ఆగండి. నా మాట కూడా వినండి” అంది.
“చెప్పండి”
“ఇదే మాట నాకు భీమిలీ బీచ్ రోడ్డులో వున్న ఓంకారస్వామి నాకు చెప్పేరు. నేను డబ్బు పోయినప్పుడు ఆ విషయం తెలుసుకోడానికతన్ని ఆశ్రయించేను. ఆయన గత జన్మలో నా భర్త ఈ డబ్బు తెచ్చిస్తాడని చెప్పేడు. అందుకే సాయంత్రం మీతో మాట్లాడాలన్నాను. మనిద్దరం అక్కడికెళ్దాం రండి” అంది ఈశ్వరి.
“వద్దు. నాకు స్వాములు, బాబాలంటే నమ్మకం లేదు. వెళ్లిన వాళ్లని వాళ్లు ఉత్తినే వదలరు” అన్నాడు వెంకట్.
“నా మాట వినండి. అతను మామూలు స్వామి కానే కాదు. మీ కలలో కొచ్చిందతనేనని నా నమ్మకం. నా మాట కాదనకండి ప్లీజ్!” అంది ఈశ్వరి బ్రతిమాలుతున్న ధోరణిలో.
వెంకట్ ఆమె మాట తీసేయలేనట్లుగా బలవంతంగా “మీ ఇష్టం” అన్నాడూ.
ఈశ్వరి కళ్లలో సంతోషం మెరిసింది.
ఇద్దరూ గుడిమెట్లు దిగుతుంటే అయిదేళ్ల పసిపిల్లాడిలా సముద్రం తుళ్ళుతూ పరుగులు పెట్టి ఆడుతోంది.
మెట్ళు దిగుతూ అతన్ని గమనించింది ఈశ్వరి.
వెడల్పు మొహం, పెద్ద కళ్లు .. బాగానే ఉన్నాడనుకుంది.
కాని.. ఆ కళ్లలో నిర్మలత్వం ఏమాత్రం లేదని, అతని బ్రెయిన్‌లో జరిగే క్రిమినల్ థాట్స్‌కి ఆ కళ్లు గవాక్షాలని గ్రహించలెకపోయిందా అమాయకురాలు.
అతన్ని భర్తగా ఊహించుకొని అతనితో అడుగులెయ్యడానికామె మనసు ఉత్సాహపదింది కూడా.
ఇద్దరూ ఆటోలో భీమిలీ బీచ్ రోడ్డులోని ఓంకార స్వామి ఆశ్రమానికి చేరుకున్నారు.
వారిద్దరూ లోనికి ప్రవేశిస్తుండగా పీనుగులాంటి ఒక మనిషిని గట్టిగా లోనికీడ్చుకొస్తున్నారు కొందరు. అతనసలు స్పృహలో లేడు. వెంట ఇద్దరాడవాళ్లున్నారు.
“ఏం జరిగింది?” అనడిగింది ఈశ్వరి ఆత్రంగా.
“ఏం చెప్పాలి తల్లీ! వీడుత్త తాగుబోతయిపోయేడు. తాగి పడుకుంటే పర్లేదు. అర్ధరాత్రి అందరి కొంపల మీదకి వెళ్తాడు తగాదాలకి. వీడితో మా పరువు పోతోంది. ఓంకారస్వామి మహిమ విని వీణ్ని తాగుడు మానిప్స్తాడేమోనని తీసుకొచ్చేం” అంది ముసలావిడ బాధగా.
ఆవిణ్ణి చూస్తే జాలేసింది ఈశ్వరికి.
ఆ తాగుబోతుని ఓంకారస్వామి ముందు కూలేసేరు.
అతను కళ్ళు మూసుకుని తూలిపోతూ కూర్చున్నాడు.
“గోవిందూ! ఒరే గోవిందూ!” అంటూ అతన్ని పేరుతో పిలిచేడు ఓంకారస్వామి.
అతన్ని పేరు పెట్టి పిలవగానే అతని వాళ్లంతా అతని మహిమ గుర్తించి లెంపలేసుకున్నారు చెంపలు నొప్పి పుట్టేటట్లుగా.
గోవిందు మాత్రం తూలుతూనే “ఊ” అన్నాడు కళ్ళు ఏమాత్రం తెరవకుండానే.
“నోరు తెరు!” అన్నాడు ఓంకారస్వామి.
అతను నోరి తెరిచే స్థితిలో లేనే లేడు.
అతని వాళ్లందరూ కలిసి అతని నోరు బలవంతంగా తెరిచేరు.
ఓంకారస్వామి ఇంత విబూది అతని నోట్లో వేసి “ఈ రోజు నుండితను తాగడు. తాగితే వెంటనే కక్కేస్తాడు. తీసుకెళ్లండి.” అన్నాదు.
అందరూ మళ్లీ అతన్ని లాక్కెళ్ళిపోయేరు.
ఓంకారస్వామి శిష్యుడి అవతారమెత్తిన రాజు ఈశ్వరిని, వెంకట్‌ని లోనికి ప్రవేశపెట్టేడు.
ఈశ్వరి ఓంకారస్వామి పాదాలకి మొక్కి “మీరన్నట్లుగానే జరిగింది స్వామి! ఈయన డబ్బు తెచ్చిచ్చేరు. ఈయన క్కూడా నేను పూర్వ జన్మలో భార్యగా కలొచ్చిందట. “అంది భక్తిగా
ఓంకారస్వామి తలెత్తి వెంకట్‌ని చూస్తూ “ఎవడ్రా నీకు కలలో కొచ్చిన స్వామి?” అనడిగేడు కాస్త కోపంగా.
“మీలానే వున్నాడు స్వామి. నేనిదివరలో చూడలేదు” అన్నాడు.
“నీకు అనుకున్నదానికంటే ఎక్కువే ముట్టింది కదూ!” అన్నాడు ఈశ్వరి వైపు చూస్తూ.
“అవును స్వామి! ఆ అయిదువేలూ మీకిద్దామని తెచ్చేను” అంటూ అయిదువేల కట్ట బయటకు తీసింది ఈశ్వరి.
“మాకెండుకు సన్యాసులం?” అన్నాడు ఓంకారస్వామి దర్పంగా.
ఆ మాట విని రాజు ఖంగు తిన్నాడు. కాషాయ రంగు చీరకట్టి సన్యాసినిలా తయారైన సంపెంగి ఆ డబ్బువైపే ఆశగా చూస్తోంది.
“డబ్బుని చేత్తో తాకరు స్వామి. హుండీలో వెయ్యండి. అన్నదానానికుపయోగపడుతుంది” అన్నాడు రాజు.
ఈశ్వరలాగే చేసింది.
“ఇప్పటికయినా మీకు నమ్మకం కుదిరిందా మీరిద్దరూ భార్యాభర్తలని?”
ఓంకారస్వామి ప్రశ్నకి వాళ్లిద్దరూ బుద్ధిగా తలూపేరు.
“మీకపనమ్మకంగా వుంటే.. ఆళ్లగడ్డ దగ్గర అహోబిళం వెళ్లండి. అక్కడ వెయ్యేళ్ళు తపస్సు చేసిన అభుక్తేశ్వర స్వామి వుంటారు. వారు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు” అన్నాడు ఓంకారస్వామి.
వాళిద్దరూ తలూపి బయటకెళ్లేరు.
వళ్లు వెళ్లగానే ” ఆ తాగుబొతు నా కొడుకు తాగడం మానేస్తాడని చెప్పేవేంటి? వాడు మళ్లీ తాగితే అందరొచ్చి మనల్ని మక్కెలిరగకొడ్తారు” అన్నాడు రాజు గుసగుసగా.
“వాడు పుట్టిందగ్గర్నుంచీ తాగుతున్నాడట. ఇప్పటికెన్ని వేల పీపాలయి వుంటాయో. లివర్ ఎప్పుడో చెడి వాడికి వాంతులు పట్టుకున్నాయని కూడా నాకు తెలిసింది. అందుకే అలా చెప్పేను. భయమేం లేదు. వాడి ఆకారం చూశావుగా. బహుశ వాడికి లోపల గుండె, జీర్ణకోశం, కిడ్నీలు ఇలాంటివేవీ వుండి వుండవు!” అన్నాడు ఓంకారస్వామి నవ్వుతూ.
“వాడు తిరుగుబోతు కూడా!” అన్నాడు రాజు నవ్వుతూ.
“పోనీ వాడి గురించి మనకెందుకులే ఆలోచన. ఈ జంట బహుశ అహోబిళం వెళ్తారు. నీ తమ్ముణ్ణి వెంటనే అభుక్తేశ్వరస్వామి అవతారమెత్తమను. ఈ పిల్ల వలన మనకు చాలా లాభముంటుంది ముందు ముందు” అన్నాడు ఓంకారస్వామి అవతారమెత్తిన నారాయనణ.
రాజు సరేనంటూ తలూపేడు.

*****
కేయూరవల్లి పూజగదిలోంచి బయటకొచ్చింది.
ఇది వరకులా పూజ మీద ఏకాగ్రత కుదరడం లేదు. మనసులో దేవుని రూపానికి బదులు కూతురి రూపం కనబడుతోంది.
లిఖిత పడరాని కష్టాలు పదుతున్నట్లుగా కలలొస్తున్నాయి.
అక్కడికి మనసు చంపుకొని కేయూర లాబ్స్ కి ఫోన్ చేసింది.
ఫోన్ రింగవుతుందే గాని ఎవరూ ఎత్తడమే లేదు.
కేయూర కాఫీ కలుపుకొని మగ్ తీసుకొని బాల్కనీ రెయిల్స్ పట్టుకొని ఆలోచిస్తూ నిలబడింది.
సూర్యుణ్ణి కని, అతను ఆకాశంలో దోగాడుతుంటే.. చూసి మురిసిపోయే తల్లిలా సముద్రం ఉప్పొంగుతుంతుంది.
ఇరవై నాలుగ్గంటల్లో ఈ సముద్రం ఎన్ని రూపాంతరాలు చెందుతుందో గమనిస్తుంటే చాలా ఆశ్చర్యమనిపిస్తుంటుంది కేయూరకి.
*****
ప్రత్యూషంలో వేదాంతిలా, సూర్యోదయం తర్వాత చైతన్యం నింపుకొని కళకళల్లాడే మనిషిలా పది గంటల తర్వాత శ్రమజీవిలా మిట్టమధ్యహ్నం అన్యాయాన్ని చూసి సహించలేని తీవ్రవాదిలా, సాయంత్రం కల్లాకపటమెరుగని పసిపాపలా అర్ధరాత్రి అన్యాయానికి బలయి ఘోషించే స్త్రీమూర్తిలా, పలకకుండానే ఎన్నో భావాల్ని ప్రస్ఫుటం చేసే శక్తి సముద్రానికి మాత్రమే వుందనిపిస్తుందామెకు.
ఆమె ఆలోచనలనుకోకుండా వెంకట్ మీదకి మళ్ళేయి.
లిఖిత వెంకట్‌ని ప్రేమించిన సంగతి ఆమె ఆలోచించే కొలది ఆశ్చర్యాన్ని అపనమ్మకాన్నీ కూడా కల్గిస్తున్నది.
కాని.. ప్రేమ గుడ్డిది.
ఎవరి మనసుని ఎవరు స్పందింప చేయగలరో తెలుసుకోవడం చాలా కష్టం.
కాని ఎందుకో వెంకట్ లిఖితకి తగినవాడనిపించడం లేదు.
మనసుకి నచ్చచెప్పుకోవడం మహాకష్టంగా ఉందామెకు.
సరిగ్గా అపుడే గేటు ముందు వెంకట్ బైకాగింది.
కేయూర దృష్టి అటు మళ్ళింది.
“గుడ్ మార్నింగాంటీ!” అన్నాడు వెంకట్ క్రిందనుందే నవ్వుతూ.
కేయూర తల పంకించింది.
అతను హడావిడిగా మెట్లెక్కి వచ్చి “లిఖిత సంగతులేమైనా తెలిసేయాంటీ?” అనడిగేడు.
“లేదు” అంది కేయూర దిగులుగా.
“ఏంటి తనింత నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తోంది? మీ ఆందోళనర్ధం చేసుకోనక్కర్లేదా?” అన్నాడు కొంత కోపాన్ని ప్రదర్శిస్తూ.
కేయూర మాట్లాడలేదు.
అతని మాటలామె హృదయాన్ని బరువు చేస్తున్నాయన్న నిజాన్నతను గ్రహించేడతను.
అదే కావాలతనికి.
ఆమె మానసికంగా బలహీనురాలయి తన మీద ఆధారపడాలి.
అతను మళ్లీ ఏదో అనబోతుండగా ఫోను రింగయింది.
కేయూర గబుక్కున రిసీవరందుకుంది.
అవతల్నుండి లిఖిత కంఠస్వరం వినిపించగానే ఆమెకు ప్రాణం లేచొచ్చినట్లయింది.
“హలో లిఖిత! నేను. మీ అమ్మని. ఎక్కణ్ణుంచి?” అంది ఆత్రుతగా.
లిఖిత చెప్పిన విషయం విని ఆమె మొహం మ్లానమవడం వెంకట్ గమనిస్తున్నాడు.
“అయ్యో! అసలు నువ్వెందుకెళ్ళేవు. నీదంతా నీ తండ్రి దూకుడే. సరే. ఇప్పుడే పంపుతాను. ఎడ్రస్ చెప్పు!” కేయూర బాల్ పెన్ అందుకొని గబగబా ఆమె చెపిన ఎడ్రస్ ఫోన్ నెంబర్ నోట్‌బుక్‌లో రాసింది.
“వెంటనే టి. ఎం. ఓ పంపుతాను. నువ్వక్కడే వుండు. జాగ్రత్త. నువ్వే ఆపదలో చిక్కుకుంటావోనని భయంగా వుంది. వెంటవెంటనే ఫోనులు చెయ్యి. లేకపోతే నాకు పిచ్చెక్కిపోతుంది” అంటూ రిసీవర్ క్రెడిల్ చేసి వెంకట్ వైపు చూసింది.
“ఎక్కడుందాంటీ!” ఆని ఆత్రం ప్రకటించేడు వెంకట్.
“కొచ్చిన్ వెల్లిందంట. ఎవరో మనీ పర్స్ కొట్టేసేరంట. చేతిలో పైసా లేదట. ఒక పది వేలు అర్జంటుగా పంపమంది. వెంటనే టి.ఎం.ఓ చేసొస్తావా?” అనదిగింది కేయూర గాభరాగా.
“అలాగే ఆంటీ! కాని పదివేలు సరిపోతాయంటారా? అసలు నేనెళ్తే ఎలా వుంటుంది?”
కేయూర ఆలోచించింది.
లిఖిత మొండిగా మున్నార్ అడవుల్లోకి బయల్దేరబోతున్నది. వేరే రాష్ట్రం. అందులోనూ మంత్రగాళ్ల దగ్గరకి. ఒక మగతోడుండటం సమంజసం!” అంతకంటే ఎక్కువాలోచించే స్థితిలో ఆమె లేదు.
వెంటనే విత్ డ్రాయల్ ఫారం మీద ఫిగర్ వెయ్యకుండా సంకతం చేసి అతని చేతికిస్తూ “బాంక్ బుక్ నీ దగ్గరే వుంది కదూ!” అంది.
వెంకట్ అప్పుడే ఆ సంగతి గుర్తొచ్చినట్లుగా నటించి”అవునాంటీ, మర్చిపోయొచ్చేను. ఇంటికెళ్లి బాంక్ కెళ్తాను” అన్నాడు.
“సరే! ముందెలాంటి చిక్కుల్లో వుందో! ఒక పదివేలు పంపించు. తర్వాత నువ్వో పదివేలు తీసుకుని బయల్దేరు. ఫ్లయిటయినా సరే. డబ్బుకాలోచించకు!” అంది కేయూర ఆందోళనగా.
“అలాగే ఆంటీ! నేను నీకు ఫోను చేస్తుంటానుగా! ఒక గ్లాసు మంచినీళ్లిస్తారా?”
కేయూర లోనికెళ్లింది. వెంకట్ అదే అదనుగా టెలిఫోను వైర్ డిస్‌కనెక్ట్ చేసి ఏమీ ఎరగనట్లుగా కూర్చున్నాడు.
కేయూర మంచినీళ్లు తెచ్చిచ్చింది.
అతనా నీళ్లు తాగి లిఖిత ఎడ్రస్ తీసుకుని బయకొచ్చి బైక్ ఎక్కేడు మనసులో హుషారుని దాచుకుంటూ.
కేయూర మాత్రం అతనివైపే చూస్తూ నిలబడింది ఆందోళనణచుకుంటూ.

ఇంకా వుంది.

బ్రహ్మలిఖితం .. 11

రచన: మన్నెం శారద

అతను తలదించుకుని టాయిలెట్స్ దగ్గర నిలబడ్డాడు.
కోయదొర లిఖిత వైపు చూసి చిరునవ్వుతో “మేం కూడా కూటి కోసం అబద్ధాలడతాం. కాని మా సమ్మక్క జాతరలు నిష్టగా చేస్తం. పూజలో వుంటే పెళ్ళాన్ని కూడా తల్లిలానే చూస్తం. ఇపుడు చెప్పు. పుస్తకల్లో చ్ అదివి నాగరికత తెలుసుకునే మీ బస్తీ జనాలు పరగడుపునే పాపాలు చేస్తారా లెదా? ఇంతోటీ గోరాలు మా అదవిలో చిత్తకార్తి ఊరకుక్కలు కూదా సెయ్యవు!” అన్నాడూ.
లిఖిత అతనికి జవాబు చెప్పాలేకపోయింది.

********

టైము పదకొండు గంటలు దాటింది.
కాలం గడిచే కొలది బాంక్‌లో రద్దీ పెరిగిపోతున్నది.
ఈశ్వరి మనసు మనసులో లేదు.
ఓ పక్క పని చేస్తున్నా మనసులో మాత్రం ఓంకారస్వామి చెప్పిన మాటలు నిజమవుతాయో లేదోనని ఆందోళనగా చూస్తోంది.
ఒకవేళ కొంపదీసి నిజమయితే! అలా అనుకోవడమే తరువాయి ఈశ్వరి శరీరం జనవరి నెలలో జమ్మూలో చిక్కుపడినట్లుగా బిగుసుకుపోయింది.
క్షణక్షణం అతిప్రయాస మీద వెనక్కి జరుగుతున్నాయి.
ఓంకార స్వామిం చెప్పింది ‘ఉత్త హంబక్’ అనే నమ్మకం మనసులో కొద్ది కొద్దిగా ఏర్పడి బలపడసాగింది.
లంచ్ ముగిసింది.
ఈశ్వరి లెడ్జర్ బుక్ ముందేసుకుని ఫిలప్ చేస్తోంది.
“ఏమండి?”
ఈశ్వరి తెలెత్తింది.
వెంకట్ నిలబడి వున్నాడక్కడ.
“ఎవరు మీరు?” ఈశ్వరి తడబాటుగా అడిగింది.
“మీ పేరు ఈశ్వరి కదూ!” అతనామె ప్రశ్నకి జవాబు చెప్పకపోగా ఎదురు ప్రశ్నించేడు.
అవునన్నట్లుగా తలాదించింది ఈశ్వరి.
“మొన్న కేష్ డ్రా చేసినప్పుడు ఇరవైవేలెక్కువిచ్చేసేరు. వెంటనే రావడానిక్కుదరలేదు. ఈపాటికి మీ ఉద్యోగం ఊడిందేమోనని భయపడ్డాను తీసుకోండి” అతను కాష్ వున్న కవరు చేతికందిస్తుంటే ఈశ్వరి కొయ్యబారిపోయింది.
భయంతో, ఆశ్చర్యంతో ఆమె కనుపాపలు పెద్దవి కావడం క్రీగంట గమనించి కూడా గమనించనట్లుగా వెనుతిరిగేడు వెంకట్.
అంతవరకు చేష్టలు దక్కి ప్రాణం కోల్పోయినట్లుగా నిలబడీపోయిన ఈశ్వరి ఒక్కసారి “ఏమండీ!” అంటూ తేలు కుట్టినట్లుగా కెవ్వున అరిచింది.
బాంక్ ఎక్జిట్ దాటుతూ అతను వెనుతిరిగి చూసి “పిలిచేరా ?” అనడిగేడు అమాయకంగా.
అప్పటికే ఈశ్వరి రివ్వున పరిగెత్తుకెళ్ళి అతని దగ్గరగా నిలబడి “మీ పేరు? ఎక్కడుంటారు? ఏం చేస్తుంటారు?” అనడిగింది రొప్పుతూ.
ఆ దృశ్యాన్ని బాంక్‌లోని తన సహోద్యోగులు ఆసక్తిగా గమనిస్తున్నారనే ఇంగితం కూడా ఆమెకి తోచడం లేదు.
“వెంకట్. ద్వారకానగరి. బిజినెస్” అన్నాడు వెంకట్.
“మీ ఎడ్రస్ రాసిస్తారా, మీతో మాట్లాడాలి!” అంది ఈస్వరి.
వెంకట్ కొంత ఇబ్బంది నటించి “అంతవసరమంటారా?” అనడిగేడు.
“చాలా అవసరం” అంది ఈశ్వరి.
“అయితే ఒక పని చెయ్యండి. సాయంత్రం ఆరుగంటలకి రామకృష్ణా బీచ్ దగ్గరున్న వేంకటేశ్వర స్వామి గుడి దగ్గర వెయిట్ చేస్తుంటాను రండి” అంటూ వెళ్ళిపోయేడు వెంకట్.
వెళ్తున్న అతని వైపు మైమరపుగా చూస్తూ సీట్లో కొచ్చిందామె.
అంతసేపూ ఆమెనే గమనిస్తున్న ఆమె కొలీగ్ లావణ్య “ఏం జరిగింది ఎవరతను?” అనడిగింది ఆశ్చర్యంగా.
“మొన్న కాష్ తగ్గింది కదా! ఇతనికే ఇచ్చేసేనట!” అంటూ పేకెట్ చూపించింది.
లావణ్య పేకెట్ తెరచి “తగ్గింది ఇరవై వేలేగా పాతికిచ్చేడేంటీ? నిన్ను చూసి మైమరచిపోయేడా?” అంది కన్ను కొడుతూ.
ఆ మాటకే ఈశ్వరి బుగ్గలెర్రబడ్డాయి. “చీ.. ఊరుకో” అంది సొట్టబడిన బుగ్గలలో నవ్వు దాచుకుంటూ.
ఈసారి తెల్లబోవడం లావణ్య వంతయింది.
ఏ చిన్న జోక్ వేసినా సీరియస్సైపోయే ఈశ్వరి ఈ రోజు తన జోక్‌నింత స్పోర్టివ్‌గా రిసీవ్ చేసుకోవడం ఆమెకి చాలా ఆశ్చర్యాన్ని కల్గించింది.
“సర్లే. ముందెళ్ళి ఆ ఇరవై వేలూ మానేజర్‌గాడి మొహాన కొట్టు. చిన్న తప్పు దొరికితే ఉద్యోగాలు పీకేయాలని మహా సరదా పడిపోతుంటాడు శాడిస్టు వెధవ!” అంది లావణ్య.
ఈశ్వరి తలూపి మిగతా అయిదువేలూ లావణ్య దగ్గర పెట్టి మానేజర్ దగ్గరకెళ్ళి ఇరవై వేలూ యిచ్చి గాలి పీల్చుకుంది.
మానేజర్ వాటిని జమ చేసుకొని “ఎక్కడివి? ఏదైనా నగమ్మేసేవా?” అడిగేడు కుతూహలంగా.
“లేదు లెండి. మావారడ్జెస్ట్ చేసేరు. నాక్కాస్త పర్మిషనిస్తారా? ఇంటికెళ్లాలి” అనడిగింది.
“ఓకె.. ఓకె..” అన్నాడాయన.,
“మావారడ్జెస్ట్ చేసారని చెప్పావేంటే” అని ఆలోచించుకుంటూ సీటు కొచ్చి బాగ్ సర్దుకుంటుంటే అయిదువేలు ఈశ్వరి కందిస్తూ అడిగింది లావణ్య.
“చెక్కేస్తున్నావా?”
“ఆ!” అంది ఈశ్వరి నవ్వుతూ.
“అద్సరే! ఆ మహానుభావుడి కసలు మన దగ్గర ఎకౌంటుందా?” అనడిగింది.
దాంతో ఈశ్వరికి కొద్దిగా అనుమానమేసింది.
******
వేంకటేశ్వర్రావులు, వెంకట్రావులు, వెంకట సుబ్బారావులు, రామరావులూ ఇలా చాలా ఎకౌంట్లున్నాయి. కాని కేవలం వెంకట్ వున్నట్లుగా గుర్తు లేదు. ఒకవేళ్ అతను పూర్తి పేరు చెప్పలేదేమో.
ఆలోచిస్తూ బ్యాంక్ బయటకొచ్చి బీచ్ కెళ్ళే బస్సుకోసం నిలబడింది బస్టాండులో.

******
ఇంకా తెలవారకుండానే ‘కొచ్చి’ అని ప్రస్తుతం పిలవబడే కొచ్చిన్‌లో రైలాగింది. లిఖిత రైలు దిగి ఒక ప్రక్కగా నిలబడింది వెంటనే ఏం చేయాలో తోచక. దాదాపు రైలంతా అయ్యప్ప భక్తులే వున్నారు. స్టేషనంతా చూస్తుండగానే ఒక నల్లని తెర కప్పినట్లయిపోయింది వాళ్లతో. స్టేషన్ చాలా పెద్దదయిన అపురాతనంగా వుంది. ఆమెకి దణ్ణం పెట్టి వెళ్ళిపోయేడు కోయదొర.
జర్నలిస్టు మాత్రం ఆమెని వీడకుండా పక్కకొచ్చి నిలబడి “ఎక్కడికెళ్లాలి?” అనడిగేడు. లిఖిత అతని వైపు చురుగ్గా చూసి “నా సంగతి మీకు దేనికి? మీ దారిన మీరు వెళ్ళండి” అంది.
“సారీ! మీతో వస్తే మర్యాదలు బాగా జరుగుతాయని ఆసక్తి” అన్నాడు నవ్వుతూ.
“ఇక్కడ నాకేం ఇన్‌ఫ్లూయెంస్ లేదు. వెళ్లండి” అంది లిఖిత.
“మరీ నన్నొక పురుగులా విదిలించేయకండీ. ఎంతయినా మగాణ్ని. కాస్త తోడుంటే మీకు ఇబ్బందులుండవు. నన్ను మీతో రానివ్వండీ. ప్లీజ్!” అన్నాడూ.
లిఖిత అతని మాటని పూర్తిగా కాదనలేకపోయింది.
ఈ రాష్ట్రంలో తనతో కాస్త తెలుగు మాట్లాడేవాడతనే.
“సరే పదండి!” అంది.
“దట్స్ గుడ్!” అంటూ ఆమె బాగ్‌ని కూడా అందుకున్నాడతను. ఇద్దరూ టాక్సీలొ ఎం.జి రోడ్డులో వున్న ద్వారక హోటల్ కెళ్ళేరు. కొచ్చిన్ చూస్తుంటే కొద్దిగా కాకినాడ వాతావరణం కనిపించింది. అక్కడ డబుల్ రూం బుక్ చేసింది లిఖిత. అప్పటికే బాగా తెల్లారింది.
వెంటనే కాఫీలు తెప్పించింది.
ఇద్దరూ కాఫీ తాగాక “మీకేమన్నా పనులుంటే స్నానం చేసి ముగించుకు రండి” అంది లిఖిత.
అతను బుద్ధిగా తలూపేడు.
అతను స్నానం చేసేక లిఖిత వెళ్ళి షవర్ ఓపెన్ చేసుకొని స్నానం చేసింది. నీళ్ళు జల్లుగా మీద పడుతుంటే మనసు హాయిగా ఫ్రెష్‌గా తయారవ్వసాగింది. ఆ హాయిని కోల్పోవడానికిష్టం లేక లిఖిత దాదాపు అరగంటసేపూ స్నానం చేస్తూనే వుంది. ఇంకా ఇంకా చేయాలనిపించినా తానొచ్చిన పని గుర్తొచ్చి స్నానం ముగించి బట్టలు వేసుకొని బయటకొచ్చింది.
రూం తలుపు దగ్గరగా వేసుంది. అతను బయటకెళ్ళి నిలబడినట్లున్నాడు.
తలుపు బోల్ట్ వేసి చీర కట్టుకుంది. కేరళలో చాలా దేవాలయాల్లోకి స్త్రీలని చీర తప్ప మరో డ్రెస్సులతో, మగవాళ్లని షర్టులతో రానివ్వరని ఆమె ఎక్కడో చదివినట్ళు గుర్తు.
తల దువ్వుకొని బాగ్ అక్కడే పెట్టి బయటకొచ్చి కారిడార్‌లో జర్నలిస్టు కోసం చూసింది. అక్కడతను కనిపించలేదు. అతను క్రిందకు ఎళ్లి నిలబడుండొచ్చని ఆమె తన హేండ్‌బాగ్ కోసం చూసింది. అదెక్కడా కనిపించకపోవడంతో ఆమె కంగారుపడి మంచం మీద, టేబుల్ మీద అన్ని ప్రాంతాలూ వెదికించి. బాగ్ దొరకలేదు.
ఆమె హతాశురాలయిపోయింది.
గబగబా రూం తాళం వేసి క్రిందకొచ్చి జర్నలిస్టు కోసం అంతటా చూసింది.
“ఏం జరిగింది?” అనడిగేడు బేరర్ ఒకడు ఇంగ్లీసులో, ఆమె ఆందోళన చూసి.
“నా మనీ బాగ్ పోయింది. నాతో వచ్చిన వ్యక్తిని చూశారా?” అనడిగింది లిఖిత ఆందొళనగా.
“అతను ఆటోలో వెళ్ళిపోవడం చూసాను. అతను మీకేం కాడా?” అనడిగేడతను ఆశ్చర్యంగా.
“జస్ట్ హీ యీజే ట్రెయిన్ మేట్” అంది లిఖిత. అప్పటికే ఆమె కళ్ళలో నీళ్ళు నిలిచేయి.
“యూ ఆరే ఎడ్యుకేటెడ్ గాల్, హౌ డుయు బిలీవ్ ఏ స్ట్రేంజర్ మాడం. ఇట్సాల్ రైట్. డోంట్ వర్రీ. లెటజ్ ఇంఫార్మ్ ది థింగ్స్ టు అవర్ హోటల్ మానేజర్!” అన్నాడతను.
లిఖిత తలూపి అతనితో మానేజర్ దగ్గరకెళ్ళి జరిగిందంతా చెప్పింది.
“మీరు ఖంగారు పడకండి. పోలీస్ రిపోర్టిద్దాం. ఇన్ ద మీన్‌వైల్ మీరు కావాలంటే మీ ఇంటికి ఫోన్ చేసి టి.ఎం.ఓ చెయమని చెప్పండి” అన్నాడతను.
వేరే రాష్ట్రంలో వాళ్లు చూపిస్తున్న ఆదరణ, సహృదయతలకి లిఖిత కళ్ళు వర్షించేయి. కన్నీటిని తుడుచుకుంటూనే ఇంటీకి డయల్ చేసింది. ఎంతకూ లైన్ దొరకలేదు.
ఆమె నిస్సహాయంగా మానేజర్ కేసి చూస్తోంది.
“ఇట్స్ ఓకే. ఆందోళన చెందకండి.ముందు టిఫిన్ చేసి మీరొచ్చిన పని చూసుకోండి. ఈ అయిదొందలూ వుంచుకోండి.” అన్నాడు తన పాకెట్ లోంచి డబ్బు తీసిస్తూ.
లిఖితకి ఆత్మాభిమానమడ్డమొచ్చింది. ఎవరికైనా ఇవ్వడమే కాని ఎవరి దగ్గరా తీసుకోవడమెరుగని ఆమె మనసు ఆ డబ్బు తీసుకోడానికెంతగానో సిగ్గుతో కుంచించుకుపోయింది.
“ఫర్వాలేదు తీసుకోండి. ఇంటినుండీ డబ్బు రాగానే ఇచ్చేద్దురుగాని. ట్రీట్ మీ ఏజ్ యువర్ ఫ్రెండ్. ప్రపంచంలో అందరూ నీచులూ, మోసగాళ్ళే వుండరు” అన్నాడతను మెత్తగా.
“థాంక్స్” అంటూ డబ్బందుకుంది లిఖిత.
రెస్టారెంట్లో మరో కప్పు కాఫీ తాగి భగవతి టెంపుల్ అడ్రస్ తెలుసుకుని ఆటోలో అక్కడికి చేరుకుంది.
పెద్ద సరంభీ పెంకుటిల్లులా వున్న ఆ గుడిని చూసి ఆమె ఆశ్చర్యపోయింది మొదట. గుడి బయట గోడకమర్చిన ఇనుప బద్దెల మీద ప్రమిదల్లో దీపాలు వెలుగుతున్నాయి. లోపలికెళ్ళి స్లిప్పర్స్ చెట్టు పక్కగా పెట్టి గుడిచుట్టూ ప్రదిక్షిణాలు చేసి గర్భగుడి ముందుకొచ్చింది. అక్కడ కూడా లోపల వేలాది ప్రమిదలతో కొమ్మల్లా వున్న ఇత్తడి కుందెలలో దీపాలు వెలుగుతున్నాయి. కాంతి చెదరి అమ్మవారి మీద పడినప్పుడు అమ్మవారి వంటిమీద నగలు తళుక్కుమంటున్నాయి. పూజారి కూడా మన పూజారిలా లేడు. తెల్లటి లుంగీ పంచె, వెనక్కు దువ్విన పల్చని జుట్టు, నుదుటున అడ్డ విబూధి నామాలు, నల్లని శరీరం .. అతనందరికీ తులసి దళాలు వేసిన నీటిని తీర్థంగా ఇచ్చేడు. తర్వాత చందనం, పసుపు కలిపిన చిన్న చిన్న ముద్దల్ని చేతిలో పెట్టేడు. దాన్నేం చేసుకోవాలో తెలీక లిఖిత అందరివైపూ చూసింది. వాళ్లందరూ దాన్ని నుదుట బొట్టులా పెట్టుకుంటున్నారు. లిఖిత కూడా వారిననుసరించింది.
ఆ రోజు శుక్రవారం.
గుడి రద్దీగానే వుంది.
ప్రొద్దుటే తల స్నానాలు చేసి, తెల్లని సాంప్రదాయపు ఓణీ తీరు కట్టుతో ఆడవాళు, పైన ఆచాదన లేకుండా లుంగీలతో మగవాళ్ళు భగవతిని సందర్శించుకుంటున్నారు.
ఒక్క ఘంటారావన తప్ప ఒక్క చిన్న శబ్దం కూడా లేదక్కడ. అందరూ అమ్మవారిని సందర్శించుకోవడానికి గుడికి వచ్చేమన్న భావన తప్ప ఒకర్నొకరు పలకరించుకోవడాలు, కబుర్లూ లేవు.
అంతే కాదు. మన వైపులా దద్దోజనాలూ, చక్కెర పొంగళ్లూ, పులిహోరలూ ప్రసాదాల్లా పెట్టడం లేదు. చాలా నిరాడంబరంగా, నిర్మలంగా జరుగుతున్నది పూజావిధానం.
లిఖిత గుడి ప్రాంగణంలో ఓ పక్కగా కూర్చుంది.
మరో గంటలో గుడిలో రద్దీ తగ్గింది. పూజారి నిదానంగా బయటకొచ్చి నిలబడ్డాను.
లిఖిత లేచి నమస్కరించింది.
అతను ఆశీర్వాదం ఇస్తున్నట్లుగా దూరం నుండే చెయ్యెత్తి అభయమిచ్చినట్లుగా ఊపేడు.
లిఖిత అతని దగ్గరగా వెళ్లి “నేను హైద్రాబాదు నుండి .. మీనన్ పంపేరు మీ దగ్గరకి.. ” అంది సైగ చేస్తూ.
“నా దగ్గరికా?” అన్నాడతను తెలుగులో.
తెలుగు వినగానే ఆమె ప్రాణం లేచి వచ్చినట్లయింది.
“మీకు తెలుగొచ్చా? మీ పేరు కుట్టికారనే కదూ!” అంది.
అతను తల పంకించి “వచ్చు నేను కొన్నాళ్ళు ఆంధ్రాలో వున్నాను. ఇంతకీ ఏ మీనన్ పంపించేడు నిన్ను?” అనడిగేడు.
లిఖితకెలా చెప్పాలో తెలియలేదు.
“ఆయన మా నాన్నగారి స్నేహితుడు. ప్రస్తుతం హార్ట్ డిసీస్‌తో హాస్పిటల్లో వున్నారు. మా నాన్నగారి పేరు కార్తికేయన్”.
కుట్టికారన్ ఆమె వైపు అదోలా చూసి “రా, ఈ పక్కన కూర్చుని మాట్లాడుకుందాం” అన్నాడు తను ముందుకి నడుస్తూ.
లిఖిత అతన్ననుసరించింది.
ఇద్దరూ గుడి ప్రాంగణంలో వున్న మరో మంటపంలో కూర్చున్నారు.
“ఇప్పుడు చెప్పు. మీ నాన్నని వెదుక్కుంటూ వచ్చేవా? ఆయన రెండ్రోజుల క్రితమే నా దగ్గర్కొచ్చి వెళ్ళేరు”.
ఆ మాట వినగానే లిఖిత మొహంలో ఆనందం చోటు చేసుకుంది.
“మీ దగ్గర కొచ్చేరా? ఇప్పుడెక్కడున్నారు?” అనడిగింది ఆత్రుతగా.
“తెలియదు” అతని జవాబు వినగానే ఆమె మొహంలో వర్షరుతువులో వచ్చిన ఎండలా సంతోషం వెంటనే మాయమయ్యింది.
కుట్టికారన్ అది గమనించేడు.
“నేను చెప్పి చూశాను. అతని ప్రయత్నం ప్రయోజనం లేనిదని. చెడు దాపురించినవాళ్లకి హితం చెవికెక్కదు. మగవాడికెప్పుడూ మంచిని చెప్పే తల్లి కాని, భార్య కాని వుండాలి. స్త్రీ శక్తిస్వరూపిణి. కాని ఆ స్త్రీ రాక్షస గుణాలతో చెడు చెప్పిందంటే మగాది బతుక్కి నిష్కృతుండదు. మీ అమ్మగారు ఆయన్ని వెళ్లనివ్వకుండా వుండాల్సింది.”
లిఖిత మొహం మ్లానమయింది.
“ఆయన చాలా సంవత్సరాలుగా మాతో లేరు” అంది మెల్లిగా.
కుట్టికారన్ అర్ధమైనట్లుగా తల పంకించి “అతను వెళ్ళింది నీచోపాసకుల దగ్గరకి. నువ్వెలా వెళ్తావు! ఆడపిల్లవి!” అన్నాడు జాలిగా.
“ఎలాగైనా నా తండ్రిని రక్షించుకోవాలి. ప్లీజ్! నేను పుట్టేక ఆయన్ని చూడలేదు” అంది లిఖిత చేతులు జోడిస్తూ.
కుట్టికారన్ క్షణం సేపు కళ్ళు మూసుకుని వేళ్ళని లెక్కలు కడుతున్నట్లుగ్లా అడించి “నువ్వు బయలుదేరిన వేళ మంచిది కాదు. నీ కడుగడుగునా ఆటంకాలు ఈపాటికే వచ్చి వుండాలి!” అన్నడు.
లిఖిత ఆశ్చర్యంగా చూసింది.
“నువ్వు నన్నొక మోసగాడనుకొంటున్నావు కదూ! అదేం కాదు. నేను ఈ గుడి ప్రాంగణంలో కూర్చుని నాకు తోచింది చెబుతాను. కావాలని ఏదీ చెప్పను. బహుస అమ్మ నాచేత ఈ మాటలు పలికిస్తుంటుందేమో నాకు తెలియదు. నేనిలా చెప్పినందుకు ఒక్క రూపాయి కూడా తీసుకోను” అన్నారాయన.
“దేవుడున్నాడంటారా?”
లిఖిత ప్రశ్నకి అతను పకపకా నవ్వాడు.
లిఖిత అతనివైపు తెల్లబోయినట్లుగా చూసింది. “లేడనడానికి నిదర్శనముందా?”అనడిగేడు నవ్వుతూనే.
“మీకెప్పుడైనా కనిపించేడా?”
“ఎలా కనిపిస్తాడు. నిర్వికారుడాయన”.
“మరి గుడిలో ఆ రూపం?”
“ఒక దివ్య శక్తికి మనం కల్పించుకొన్న ఆకృతి. మనం మన అత్మీయుల్ని తల్లి, తండ్రి, భార్య, భర్త, కొడుకు, కూతురు అని వరుసలతో విభజించుకోలేదూ! వాళ్లందర్నీ మనం వివిధ వరుసలో ప్రేమిస్తున్నాం కదా. ప్రేమ మాత్రం ఒక్కటే కదా. అలానే భగవంతుడికి శతకోటి పేర్లు, ఆకారాలు ఏర్పరచుకొని పూజిస్తున్నాము. ఒక్క మాటలో నిజం చెప్పాలంటే మన శక్తికన్నా అతీతమైన ప్రతి శక్తిని దైవంగా భావించి పూజించడం మానవుడు అలవరచుకొన్నాడు. అద్సరే. మనం దేవుడున్నాడా లేడా అని తర్కించే అంత తీరికగా లేము. ముందు మీ నాన్నగారి జాడ తెలుసుకోవాలి.” అంటూ ఆయన లిఖిత వైపు చూశాడు.
“అవును” అంది లిఖిత ఆందోళనగా
“ఈ రాష్ట్రం చాలా చిత్రమైంది. అందమైంది కూదా. కాని గనులలో విలువైన వజ్రాలు, బంగారంతో పాటు విషనాగులు కూడా వున్నట్లు ఈ సుందరమైన అక్షరాస్యులున్న ఈ కేరళలో కొంతమంది క్షుద్రోపాసకులు, చేతబదులు, నీచపూజలు చేసే వారు కూడా వున్నారు. మీ నాన్నగారిలా మానసికంగా బలహీనులైన వ్యక్తుల్ని, అడ్డదారిన పైకి రావాలనుకునే మనుషుల్ని వాళ్లు వశపరుచుకుంటారు.”
“అసలు చేతబడులు ఉన్నాయంటున్నారో, లేవంటున్నారో కూడా నాకర్ధం కావట్లేదు” అంది.
మళ్ళీ పకపకా నవ్వేడు కుట్టికారన్.
“లేవు. ముమ్మాటికీ లేవు. ఇదంతా మనిషి బలహీనతలతో కొంతమంది ఆడుతున్న నాటకం. మనిషి నరాలు పట్టుదప్పినప్పుడు తప్పుడు అలవాటులతో మానసికంగా క్షీణించినపుడు కొన్ని భ్రమలకి లోనవుతాడు. అప్పుడు తన తప్పుల్ని, లోపాల్ని కప్పిపుచ్చుకునేందుకు నన్నెవరో చేతబడి చేసేరని చెప్పుకుని ఇతరుల జాలి సంపాదించాలని ప్రయత్నిస్తాడు. అలాంటప్పుడు అతని పక్కనున్నవారు ఆ అవకాశాన్ని తమ ప్రయోజనాలకి వాడుకోటానికి తమ శత్రువులు ఆ పని చేసేరని అతని మెదడులో విషం నూరి పోస్తారు. అసలే మానసికంగా బలహీనమైన ఆ వ్యక్తి వెంటనే చేతబడులు తీసే వ్యక్తిని ఆశ్రయిస్తాడు. అతడు కూడా ఇతని బలహీనతతో ఆడుకుంటాడు. దాదాపు ఇతన్ని తమ మాటలతో పిచ్చివాణ్ణి చేస్తారు. ఇదంతా మనిషి సైకాలజీ మీద ఆడుతున్న ఒక గొప్ప నాటకం”
“ఇప్పుడు మా నాన్నగారి సంగతి!”
“అక్కడికే వస్తున్నాను. ఈ రాష్ట్రంలో మూడు ప్రాంతాలలో ఇలాంటి వాళ్లున్నారు. ఒకటి మున్నార్ అడవిలో. రెండోది టేక్కాది ప్రాంతాలలో. మూడోది శబరిమలై వెళ్ళే త్రోవలో పంచా దాటి వెళ్టే అరన్ మూలా అనే చొట వీళ్ళు వున్నారని వినికిడి. నువ్వొక్కతివే ఆడపిల్లవి బయల్దేరేవు. ఎలా వెదుకుతావు?” అన్నాడాయన జాలిగా చూస్తూ.
“మీరాశీర్వదించండి. నా ప్రయత్నం నేను చేస్తాను” అంది లిఖిత అతని పాదాలకి నమస్కరిస్తూ.
కుట్టికారన్ ఆమెని ఆశీర్వదించి భగవతి దగ్గర కుంకుమ పొట్లం కట్టి తెచ్చి ఆమె చేతికిచ్చి “రోజూ ఈ బొట్టూ పెట్టుకుని పని ప్రారంభించు. నీకు జయం కల్గుతుంది. ఆడపిల్లవి జాగ్రత్త!” అన్నాడు.
లిఖిత అతనివైపు నిశితంగా చూసి “మీరు చేసిన సహాయానికి కృతజ్ఞతలు. మొదట మున్నార్ వెళ్తాను. కానీ వెళ్ళే ముందొక్క మనవి” అంది వినయంగా.
ఆయన ఏమిటన్నట్లుగా చూశాడు.
“మగవాడికి దారి చూపాల్సింది తల్లిగాని, భార్యగాని అన్నారు. అంటే స్త్రీయే మగవాడికి గురువులాంటిది. మీరు పూజించే అమ్మవారు కూడా స్త్రీమూర్తే. అలానే ఆదిశక్తి కూడా స్త్రీయే. ఈ ప్రకృతి కూడా స్త్రీగానే పరిగణింపబడుతోంది. అలాంటప్పుడు నన్నెందుకు మాటిమాటికి ఆడపిల్లనని జాలి చూపిస్తారు. తెలివితేటలకి, ప్రతిభకి, సమయస్ఫూర్తికి, వివేకానికి వివక్షత పాటిస్తారెందుకు? నేనీ పని తప్పక సాధిస్తాను. నా తండ్రిని కలుసుకొని తీరతాను. ఇంకెప్పుడు ‘ఆడ’ అన్న పదాన్ని చేతకానిదానికి పర్యాయపదంగా వాడకండి ప్లీజ్!” అంది ఒకరకమైన ఉద్వేగానికి గురవుతూ.
అంత వయసు పైబడి సదా అమ్మవారి సేవలో నిమగ్నుడయిన కుట్టికారన్ కూడా తెల్లబోయేడామె మాటలకు.
వివేకం, మంచితనం మూర్తీభవించిన అతను వెంటనే తేరుకొని గట్టిగా నవ్వి “నా కళ్లు తెరిపించేవమ్మా.. నాకు జన్మనిచ్చింది తల్లని మరిచిపోయేను తాత్కాలికంగా. ఎంతయినా మగాణ్ణి కదూ!” అన్నాడు తల మీద చెయ్యి పెట్టి నిమిరి.
లిఖిత మరోసారతనికి నమస్కరించి గుడినుండి బయటికొచ్చింది. తన ప్రయత్నానికి నాందిగా అడుగులు వేస్తూ.

ఇంకా వుంధి…

బ్రహ్మలిఖితం – 10

రచన: మన్నెం శారద

“రాగి వేడిని బాగా పీలుస్తుంది తొందరగా. దాని మీద వెలిగించిన కర్పూరపు వేడికి రాగి కాయిన్ వేడెక్కుతుంది. దాంతో ఆముదం కూడా వేడెక్కి దాని డెన్సిటీ (సాంద్రత) తగ్గి పలచబడుతుంది. పలచబడగానే ఆముదం ప్రవహించటం మొదలెడుతుంది వాలుకి. దాంతో పైన జ్యోతి వెలుగుతున్న రాగిబిళ్ళ కదిలి ప్రవాహానికనుగుణంగా నడుస్తుంది. మన అదృష్టం ఆ దిశనుందని.. మనకి భ్రమ కల్గిస్తాడు కోయదొర. నేను కూడా నిన్న జ్యోతి నడవడం గురించి ఆశ్చర్యపడ్డాను. కాని ప్రాక్టికల్‌గా ఆలోచించేను. మీరొక జర్నలిస్టు లోకాన్ని మేల్కొలపవలసిన బాధ్యత వుంది మీకు. ఏదో బ్రతుకుతెరువు కోసమే అయితే ఇంకా చాలా పనులున్నాయి తొందరగా సంపాదించుకోవడానికి” అన్నది లిఖిత.
జర్నలిస్టు ఆమెవైపు తెల్లబోయి చూశాడు.
వయసు చిన్నదయినా ఆమెలోని భావాలు మాత్రం చాలా పదునుగా వుండటమాతను గమనించి ఆశ్చర్యపోయేదు.

*****

కేయూరవల్లి మనసు మాటిమాటికీ స్థిమితం కోల్పోతుంది. దాదాపు ఇరవై సంవత్సరాలు భర్తను వదిలి, భావరహితంగా సముద్రంలో కెరటాలు తకిడికి కదలక నిశ్చలంగా పగలూ రాత్రి అలానే నిలబడి వున్న డాల్ఫిన్ నోస్‌లా కాలం గడిపిందామె.
కాని.. ఇప్పుడెందుకో ఆమె గడ్డకట్టిన హృదయంలో సంచలనం చెలరేగుతోంది.
లిఖిత ఊరు విడిచిన నాటినుండి ఆమె మనసు మనసులో లేదు. కూతుర్ని విడిచి ఎప్పుడూ వుండలేదామె.
దగ్గర వున్నప్పుడు ముద్దు చెసింది. ప్రేమ ప్రదర్శించింది కూడా ఏమీ లేదు.
కాని.. ఇప్పుడు లిఖిత లేకపోతే తెలుస్తున్నదామెకి. తనకి కూతురి పట్ల వున్న అనురాగము.
వెళ్లి ఒక ఫోను కూడా చెయ్యలేదు.
అసలెలా చేరిందో!
ఆయన.. కనిపించేరో లేదో!
ప్రతిక్షణం భారంగా కదిలి గతంలో వినీలమవుతుంటే నిలకడలేని హృదయం చేసే అలజడిని చంపుకోడానికి కేయూరవల్లి వెళ్ళి డ్రాయింగ్ టేబుల్ దగ్గర కూలబడింది.
పెన్సిల్ షార్ప్ చేసి గడులలో డిజైన్స్ నింపుతుంటే.. అవేవీ నచ్చినట్లనిపించిక ఎరేజ్ చేస్తూ కూర్చుంది తిరిగి.
తననవసరంగా లిఖితని పంపించింది.
తండ్రిలాగే ఆమెకూ తొందరెక్కువ. కొంపదీసి తను కూడా కేరళ వెళ్లిపోలేదు కదా..
అలా అనుకోగానే కేయూర గుండే ఒకడుగు క్రిందికి జారినట్లయింది.
కళ్ళలో నీళ్లు సుళ్లు తిరిగేయి.
“ఆంటీ!”
ఆ పిలుపు విని కేయూర కొంగుతో కళ్లు తుడుచుకుని గుమ్మంవేపు చూసింది.
ఎదురుగా ఎంకట్ నిలబడి వున్నాడు నవ్వుతూ.
అతన్ని చూడగానే ప్రానం లేచొచ్చినట్లయిందామెకు.
ఇదివరలో అతనికంత ప్రాముఖ్యమిచ్చేది కాదు. కేవలం లిఖిత స్నేహితుడిగానే గౌరవించేది. అదీ మనసులో మాత్రమే. పెద్దగా మాట్లాడే అవకాశమిచ్చేది కాదు.
కాని.. ఇప్పుడతనామెకు చాలా ఆత్మీయుడిగా గోచరించేడూ.
“వెంకట్, లిఖిత గాని ఫోను చేసిందా నీకు. అసలెలా వెళ్ళింది. ఆ రోజు ఫ్లయిట్ దొరికిందా?” అని అడిగింది కంగారుగా.
వెంకట్ ఆమెని నిశితంగా గమనిస్తూ “బ్రహ్మాండంగా దొరికింది.అసలు నేనెళ్ళకపోతే లిఖిత వెళ్లలేకపోయేది. నా బైక్ ఎక్కమంటే మొండికేసింది. నన్నిష్టం వచ్చినట్టు మాట్లాడింది. అయినా నేను పట్టించుకోలేదనుకోండి. జాగ్రత్తగా ఎయిర్‌పోర్టు చేర్చేను. ఈ పాటికి వాళ్ల డేడితో కబుర్లు చెబుతుంటుంది” అన్నడు.
“నిజంగానే లిఖిత జాగ్రత్తగా చేరుకుంటుందంటావా?” కేయూర సందేహానికి పకపక నవ్వాడు వెంకట్.
“లిఖితనింకా పసిపాపే అనుకుంటున్నారు మీరు. తనకన్నీ తెలుసు. మీకు చెబితే బాగుంటుందో లేదో కాని తను వెళ్తూ వెళ్తూ ఏం చెప్పిందో తెలుసా?” అంటూ కొద్దిగా సిగ్గుపడటానికి ప్రయత్నించేడు వెంకట్.
కేయూర అతనివైపు సందేహంగా చూసి “ఏం చెప్పింది?” అనడిగింది సౌమ్యంగా.
“మీక్కోపం వస్తుందేమో?”
కేయూర రాదన్నట్లుగా తలడ్డం ఊపింది.
“నన్ను వదిలి వెళ్ళలేనంటూ ఏడ్చింది. నన్నూ రమ్మంది. నేనాశ్చర్యపోయేను. తను నన్ను ప్రేమిస్తున్నట్లు చెప్పగానే నా కాళ్లలో వణుకు పుట్టింది. నా స్థానమెక్కడ? మీ అంతస్థెక్కడ? స్నేహానికవన్నీ లేకపోయినా… పెళ్ళికి చాలా అవసరం కదా ఆంటీ. అందుకే.. ఆ సంగతులు తర్వాత మాట్లాడొచ్చని తనని నచ్చచెప్పి పంపించేను.
అతను చెప్పింది విని నిజంగానే దిగ్ర్భాంతికి గురయింది కేయూర. లిఖితకి ఈడొచ్చింది. ఈడుతోపాటు వ్యక్తిత్వమొచ్చింది. ఒకవేళ లిఖిత మనసుకి వెంకట్ నచ్చితే కాదనడానికి తానెవరు?
కాని.. ఎందుకో ప్రతి రూపాయికి లిఖిత దగ్గర చేయి జాచే ఈ వ్యక్తిత్వం లేని పురుషుడు లిఖిత భర్త కావడానికి లోలోపల ఆమె మనసంగీకరించలేకపోయింది.
డోలాయమానంగా వున్న ఆమె మానసిక పరిస్థితిని గ్రహించేడు వెంకట్.
“లిఖితకి భర్త కావడానికి నేనర్హుణ్ణి కాదని మీరాలోచిస్తున్నది. ఆ సంగతి మీకన్నా నాకు బాగా తెలుసు. అందుకే మీరిచ్చి చేస్తానన్నా నేను చేసుకోను. ఆ విషయంలో వర్రీ కాకండి. అద్సరే! అసలింతకీ యింకా యింట్లో కూర్చున్నారేంటి? ఫ్యాక్టరీకి వెళ్లరా?” అన్నాడు నవ్వుతూ.
లిఖిత జాగ్రత్తగా వెళ్లిందని విని కేయూర మనసు ఒకింత ఊరట చెందింది.
“లిఖిత సంగతి తెలీక పిచ్చి పట్టినట్లయింది. నువ్వు చెప్పేవుగా. నాక్కాస్త రిలీఫ్‌గా వుంది. ఇంట్లో కూర్చుంటే చాలా బోర్‌గా వుంది. నేను ఫ్యాక్టరీకి బయల్దేరతాను” అంది కేయూర కాస్త తేలికపడిన మనసుతో.
“నన్ను కాస్త జగదాంబ సెంటర్లో వదిలేయండి” అన్నాడు వెంకట్.
కేయూర రేగిన జుట్టు సరిచెసుకుని, స్లిప్పర్స్ వేసుకుని బయటకొచ్చింది. ఆమెని వెంబడించేడు వెంకట్.
ఇంటికి తాళం వేసి డ్రైవింగ్ సీట్లో కూర్చుని అవతలి వైపు డోర్ తెరిచింది. వెంకట్ ఎక్కగానే డోర్ మూసి ఎ.సి. ఆన్ చేసింది. చల్లని పిల్లతెమ్మెరలాంటి గాలి కారంతా పరచుకొని మనసుకి, శరీరానికి ఆహ్లాదం కలుగచేసింది క్షణాల్లో. వెంకట్‌కి ఎంతో అసూయనిపించింది.
డబ్బుంటే ఎడారిలో సముద్రాన్ని, సముద్రంలో భవనాన్ని సృష్టించుకోవచ్చు కాని.. ఈ డబ్బు అందరికీ అందుబాటులో వుండదు. ఒక ఆడది గర్వంగా, నిటారుగా కూర్చుని డ్రైవ్ చేస్తుంటే ఏమీ చేతానివాడిలా పక్కన కూర్చున్నాడు తను.
ఎందుచేత?
డబ్బులేక!
డబ్బు వలన పొందే సదుపాయాలు లేక!
కేయూర స్టడీగా కారుని డ్రైవ్ చేస్తోంది.
కారు మెత్తగా కదులుతోంది. గతుకుల రోడ్డులోని కుదుపుల్ని మింగి.
కేయూరని క్రీగంట చూస్తున్నాడు వెంకట్. తనొచ్చిన పని కాలేదు. ఇరవై వేలు కావాలని అడగాలని వచ్చేడతను. కాని ఆమెని చూస్తుంటే గొంతు పెగలటం లేదు. ఒకవేళ అడిగినా “ఎందుకు, ఏం పని?” అని అడక్కుండా అంత డబ్బిచ్చే పిచ్చి ఆడదానిలా కనిపించడం లేదామె అతని కళ్ళకి.
ఆమెలో ఏదో గొప్ప మెజెస్టీ వుంది.
నిజానికామె తల కూడా సరిగ్గా దువ్వుకోలేదు. కట్టింది నేత చీర. మెడలో సన్నని చెయిన్. ఎడం చేతికి టైటన్ వాచి. కుడి చేతికి ఒక బంగారు గాజు మాత్రమే వున్నాయి.
కాని.. చాలా శ్రద్ధగా తీర్చి దిద్దుకున్న వాళ్లకన్నా ఆమెలో గొప్ప ఆకర్షణ వుంది. బహుశ అది ఆమె స్వయంగా తనని తాను తీర్చిదిద్దుకున్న వ్యక్తిత్వంలోంచి పుట్టుకొచ్చిన శక్తి కావొచ్చు.
వెంకట్ ఆలోచనల్లో వుండగానే కారు బ్రేకుపడింది.
వెంకట్ ఉలిక్కిపడ్డట్లుగా చూశాడు.
“నువ్వు జగదంబా సెంటర్‌లో దిగుతానన్నావు కదూ?” అంది కేయూర.
“అవునాంటీ!” అంటూ గాభరాగా దిగేడు వెంకట్.
అతను దిగగానే కారు ముందుకి నడవబోతు ఏదో గుర్తొచ్చినట్లుగా రెండడుగులు వెనక్కి నడిపి”వెంకట్!” అంది.
నిరుత్సాహంగా పేవ్‌మెంటెక్కబోతున్న వెంకట్ తన పక్కన నిలబడ్డ ప్రషియన్ బ్లూ కలర్ మారుతీ థౌజండ్‌ని చూసి ఆశ్చర్యపోయేడు.
కేయూరవల్లి డోర్ తెరచి “వెంకట్, ఈ పాతికవేలు కొంచెం ఎల్లమ్మతోట బ్రాంచి ఎస్.బి.ఐ లో డిపాజిట్ చెయ్యి. నేను తిరిగెళ్లాలంటే పూర్ణా మార్కెట్ దాకా వెళ్లి కారు రివర్సు చెయ్యాలి. అక్కదంతా వన్‌వే ట్రాఫిక్” అంటూ బాంక్ బుక్, కాష్ అతని చేతికిచ్చింది.
వెంకట్ మొహం లాటరీ కొట్టినట్లుగా ఆనందంతో కళకళ్లాడింది.
“విత్ ప్లెషర్!” అంటూ డబ్బందుకున్నాడు వెంకట్.
కేయూర ఎక్సిలేటర్‌ని బలంగా తొక్కి కారుని ముందుకి పరుగు తీయించింది.
కారు కనిపించినంత సేపూ చూసి కనుమరుగవ్వగానే హుషారుగా ఈల వేస్తూ, కాష్ తీసుకొని బాంక్ వైపు నడిచేడు వెంకట్. అతని పని కూడా అదే బాంక్‌లో వుండటం విశేషం.

*****

సరిగ్గా సాయంత్రం ఆరుగంటల నలభై అయిదు నిముషాలకి హైద్రాబాద్ కొచ్చిన్ ఎక్స్‌ప్రెస్ జాలార్‌పెయిట్‌లో బయల్దేరింది.
ఎస్పీ హరిహరన్, మిగతా రైల్వే పోలీసు సిబ్బంది లిఖితకి దగ్గరుండి వీడ్కోలిచ్చేరు. ఆమె వద్దని వారించినా టిఫిన్ పాకెట్స్, ఫ్లాస్కులో కాఫీ ఆమె సీటు పక్కన పెట్టేరు. హరిహరన్ ఆమెని ఆప్యాయంగా కౌగలించుకుని “విష్ యూ ఆల్ ది బెస్ట్ బేబీ! రిటర్న్‌లో నాకు తెలియజేస్తే మళ్లీ ఇదే స్టేషన్‌లో నిన్ను కలుస్తాను” అన్నాడు.
అలా చెబుతున్నపుడు అతని కళ్ళు వాత్సల్యంతో తడయ్యేయి.
రైలు కదిలింది. అతని చేతిలోని ఆమె చెయ్యి చిన్నగా జారి విడివడింది.
కంపార్టుమెంటు దూరమవుతుంటే కనిపించినంత సేపూ చెయ్యి వూపుతూనే వున్నాడు హరిహరన్.
లిఖిత హృదయం ఆర్ద్రమైంది.
భారంగా వచ్చి తన సీట్లో కూర్చుంది.
మనసులో ఇంకా తిరుంబత్తూరు గెస్టు హవుసు, జలబంధారి, హరిహరన్ ప్రేమ.. ముద్ర వేసుకొని హత్తుకున్నట్లుగా గుర్తొస్తున్నాయి. అంతా కలిసి పన్నెండు గంటల అనుబంధం .. అంతే!
కాని జన్మజన్మల బంధంగా అనిపిస్తోంది.
తన తాతగారతనికేం చేసేరో తెలీదు కాని.. ఈ ఊరుకాని ఊర్లో భాషేతర ప్రంతంలో, తనకి ఎంతో ఆదరణ, ఆప్యాయతని అందించేరు హరిహరన్.
లేశమాత్రమైన సహాయానికి వంశపారంపర్యంగా కృతజ్ఞతని చూపించిన హరిహరన్‌ని చూస్తుంటే .. ఒక పక్క తన సహాయం అందుకుంటూనే విషాన్ని గుమ్మరిస్తూ, విశ్వాసరహితంగా ప్రవర్తిస్తున్న వెంకట్ గుర్తొచ్చేడామెకు.
ప్రతిక్షణం మరణం వైపు పయనిస్తూన్న ఈ చిన్న జీవితాన్ని కొందరు అకారణ ద్వేషంతో రెచ్చిపోతూ, అబద్ధాలతో మోసగిస్తూ, క్షణక్షణం తమ నీచ ప్రవర్తనతో ఎదుటివాళ్లకి చులకనవుతూ సిగ్గు విడిచి బ్రతుకుతారెందుకో..
“మేడం!”
లిఖిత ఆలోచనల్లోంచి బయటపడి పక్కకి చూసింది.
“ఏంటంత తెగ ఆలోచిస్తున్నారు?” అంటూ నవ్వేడు జర్నలిస్టు.
“హరిహరన్‌గారి గురించి. ఆయన మన గురించి చాలా శ్రమపడ్డారు కదూ!” అంది లిఖిత.
జర్నలిస్టు తీసి పారేసినట్లుగా నవ్వి “మీరు మరీ సెంటిమెంటు ఫీలయిపోతున్నారేంటి? ఆయన జేబులో డబ్బులేవన్నా తీసిపెట్టేడేంటి? గవర్నమెంటు కార్లు, గవర్నమెంటు గెస్టుహౌసు, గవర్నమెంటు సబార్డినేట్స్. అయినా మీ తాతగారి వల్ల ఉద్యోగం సంపాదించేడు కాబట్టి. ఏదో నామ్ కా సర్వీసు చేసినట్లు నటించేడు. వెంటనే ఆయన గురించి మనసులోంచి తీసి పడేసి మన లోకంలో పడండి” అన్నాడు.
లిఖిత అతనివైపు అసహ్యంగా చూసింది.
“ఎంత గవర్నమెంటువే అయినా మనకాయన సేవ చేసి తీరాలన్న రూలేం లేదు. పైగా మా తాతగారేం సర్వీసులో లేరు. చెయ్యారగానే అన్నం పెట్టిన మనిషిని మరచిపోవడం సృష్టిలో బహుశ ఒక్క మనిషికే చేతనవుననుకుంటాను” అంది సీరియస్‌గా.
జర్నలిస్టు మొహం మాడింది.
“ఏదో నేను సరదాకన్నానండి బాబూ! అలా అగ్గి మీద గుగ్గిలమై పోకండి” అన్నాదు నవ్వడానికి ప్రయత్నిస్తూ.
కోయదొర, అయ్యప్ప స్వాములు మళ్లీ ఎక్కేరు.
లిఖిత ఒక ఐ.జీ మనుమరాలని కంపార్టుమెంటంతా తెలిసిపోయి చాలా మర్యాదగా చూడటం ప్రారంభించేరు.
కోయదొర లిఖితని ఎగాదిగా చూసి “మాంచి ఘనమైన జాతకం పెట్టది. కలక్టెరవుద్ది” అన్నాడు.
లిఖిత అతన్ని చిరాగ్గా చూసి “నువ్వింక జాతకాలు చెప్పడం ఆపకపోతే నువ్వు నిన్న కంపార్టుమెంటులో చేసిన గారడీ విద్య రహస్యాలు బయటపెడ్తాను” అంది.
“గారడీ యిజ్జెలా? అట్లనకు పెట్టా కళ్లు పోతాయ్! సమ్మక్క కోపగించేను” అన్నాడు గంభీరంగా.
“నువ్వు నిన్న జ్యోతినెలా నడిపించేవో నేనిప్పుడు చెబితే నా కళ్లు పోతాయో.. నీ వళ్లు చీరబడుతుందో చూద్దాం” అంది సవాలుగా.
అందరూ చిత్రంగా లిఖిత వైపు చూశారు.
కోయదొర మొహం పేలవమైపోయింది.
అయినా దాన్ని కప్పిపుచ్చుకుంటూ “కోయదొరతో ఎకసెక్కాలాడకు”అన్నాడు.
“ఎకసక్కెం కాదు. ఎవరైనా ఒక కాపర్ కాయినుంటే ఇవ్వండి” అంది లిఖిత చాలెంజిగా.
అందరూ గబగబా జేబులు తడుముకున్నారు.
ఇక పరిస్థితి విషమిస్తుందని తెలిసి కోయదొర లేచి నిలబడి గుమ్మం దగ్గరకెళ్ళేడు.
“పారిపోతున్నట్లున్నాడు” అన్నాడు జర్నలిస్టు కంగారుగా.
“కొంపదీసి వెళ్ళే రైళ్ళోంచి దూకడు గదా, అన్యాయంగా చస్తాడు”అన్నాడొక అయ్యప్ప దీక్ష తీసుకున్న వ్యక్తి.
లిఖిత లేచి నిలబడి గుమ్మం వైపు చూసింది.
కోయదొర లిఖితకి రెండు చేతులెత్తి జోడించేడు.
లిఖిత తెల్లబోయినట్లుగా చూసిందతనివైపు.
“కూటికోసం కోటి విజ్జెలు తల్లీ. ఏదోమా పెద్దోల్లు మాకియి నేర్పి పొట్టపోసుకోమన్నారు. నువ్వంతోడివవుతావ్, ఇంతోడివవుతావని జెప్పి ఏదో నాల్గు పైసలు సంపాదించ్కుంటున్న. నా పొట్ట కొట్టమాకు. సదువుకొని, నేయాన్ని తల్లకిందులు జేసి, నీతిమాలి బతుకుతున్న మీ పట్టణాల్లోని జనం కన్నా నేను సెడ్డోణ్ణి కాదు” అన్నాడు చిన్నగా.
లిఖితకి అతను అన్న దాంట్లో అబద్ధమేమీ కనిపించలేదు. అతన్నల్లరి పెట్టడం వృధా అయిన పనిగా భావించి “వచ్చి సీట్లో కూర్చో” అంది తనెళ్ళి సీట్లో కూర్చుంటూ.
ఆమె రాగానే “నా దగ్గరొక రాగి బిళ్ల వుంది. జ్యోతిని నడిపించంది” అనడిగేడొక అయ్యప్ప భక్తుడు.
లిఖిత వైపు అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
లిఖిత చిన్నగా నవ్వి “ఊరికే సరదాకన్నాను. నాకేం రాదు.” అంది.
జర్నలిస్టు తెల్లబోయినట్లుగా లిఖితవైపు చూసి “అదేం, అలా వెనక్కు తగ్గిపోతున్నారు. జ్యోతెలా నడుస్తుందో నాకు చెప్పారు కదా~” అన్నాడు.
“అది నీలాంటివాళ్ల కోసం. చేతిలో పెన్నుంది కదాని.. రేప్పొద్దున పేపరు కొక మసాలా వార్తందించి పది రూపాయలు సంపాదించుకోవాలంటే నీలాంటి వాళ్ల కొసం వెలుగుని పంచే శక్తి లేకపోతే తప్పు లేదు కాని చీకటిని వ్యాపింపజేయడం మాత్రం క్షమించరాని నేరం” అంది లిఖిత.
వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారో మిగతా వారికి అంతుబట్టలేదు.
అందరి దృష్టి మళ్లించడానికి “అప్పుడే బాగా చీకటి పడిందే టిఫిన్ చేద్దామా?” అంది తన దగ్గరున్న టిఫిన్ పేకట్స్ అందరికీ పంచుతూ.
“ఒక్క మనిషికిన్ని పంపేరేంటి?” అన్నాడొకాయన ఆశ్చర్యంగా.
“ఆయన పెద్ద ఆఫీసరు. ఈవిడొక పెద్దాఫీసరు మనుమరాలు. అందుకే మర్యాదలు పెద్ద లెవెల్లోనే వున్నాయి” అన్నారు మరొకరు.
” ఆ మాటలన్నీ ఎందుకు? అన్నదాతా సుఖీభవ! అన్నారు మన పెద్దలు. ఈ టిఫిన్స్ తిని ఆయన ఆయురారోగ్యాలతో బాగుండాలని కోరుకోండి. అదే పదివేలు!” అంది లిఖిత.
అందరూ టిఫిన్స్ చేసి బెర్తులు వాల్చుకున్నారు.
ఎంత వద్దన్నా లిఖిత బెర్త్ కూడా పరచి మర్యాదలు చేసేరు.
లిఖిత బెర్త్ ఎక్కి పడుకొని నిద్రపోవాలని ప్రయత్నించింది కాని.. ఎంతకీ నిద్రపట్టలేదు. పదే పదే తండ్రి గుర్తొస్తున్నాడు.
ఇప్పుడాయన ఎక్కడున్నారో? ఎలా వున్నారో.
అసలు తనాయన్ని చేరుకోగలదా?
ఆ పరభాషా రాష్ట్రంలొ తనకెవరైనా సహాయపడతారా?
అప్పూడు గుర్తొచ్చిందామెకి తను కనీసం తండ్రి ఫోటో ఆయినా చూడనేలేదని ఎలా ఆయన్ని గుర్తించటం?
ఈ విషయం తనకి తల్లికూడా గుర్తు చేయలేదు.
లిఖిత మనసు ఎంతగానొ కృంగిపోయింది బాధతో.
ట్రెయిన్ కొచ్చిన్ చేరేసరికి అయిదు గంటలవ్వొచ్చు. అప్పటికింకా తెల్లావారదు. తను తిన్నగా భగవతి కోవెలకి వెళ్లాలా? ఎక్కడైనా బస చెయ్యాలా?
లిఖిత ఆలోచిస్తూ కళ్లు మూసుకుంది.
ఎక్కడో గుప్పున వాసన.
అది ఖచ్చితంగా లిక్కర్ వాసనే!
ఆమె క్రింద పడుకొన్న కోయదొర వైపు చూసింది.అతడు గాఢ నిద్రలో వున్నాడు. అయ్యపస్వామి దీక్షలో వున్న ఒక వ్యక్తి టాయిలెట్‌కి వెళ్లి వచ్చి క్రింద బెర్త్ మీద పడుకున్నాడు.
కాని.. అతన్ననుమానించడానికి భయమేసింది లిఖితకి
అయ్యప్ప దీక్ష చాలా కఠినతరమైందంటారు. చాలా నిష్టాగరిష్టమైందంటారు. అతనెందుకు తాగుతాడు. అని మనసులోనే లెంపలేసుకుంది లిఖిత.
మరి కొంతసేపటికామెకు కొద్దిగా నిద్రపట్టేసింది. ట్రెయిన్ అతి వేగంగా కదిలిపోతూ ఎక్కడ పట్టాలు తప్పుతుందోనన్నంత వేగంగా పరిగెత్తుతోంది.
ఒక్కసారి ఆమె మీద ఏదో పాకినట్లయి ఉలిక్కిపడి కళ్ళు తెరచింది. ఇందాక అయ్యప్ప దీక్షలో వున్న వ్యక్తి ఆమె మొహంలో మొహం పెట్టి చూస్తున్నాడు.
లిఖిత భయంతో కెవ్వున అరిచింది.
అంతే!
వెంటనే దాదాపు కంపార్టుమెంట్‌లో అందరూ లేచి పోయేరు. లైట్లు వెలిగాయి.
“ఏం జరిగింది?” అనడిగేరందరూ ఆందోళనగా.
“ఇతను.. ఇతను.. ” అంటూ వణుకుతూ నల్ల డ్రెస్సులో వున్న ఆ వ్యక్తిని చూపించింది లిఖిత.
“నేనా.. నేనేం చేషేను. బాత్రూంకి వెళ్దామని .. లేషానంతే!” అన్నాడతను.
అతను తాగి వున్నాడని అక్కడున్నందరికీ బాగా అర్ధమైపోయింది.
“అబద్ధం. నా మీద చెయ్యేసేడు. తాగాడు కూడా!” అంది లిఖిత్ ఔద్రేకమైన స్వరంతో.
దీక్షలో వుండగా అతను చేసిన అరాచకాన్ని చూసి అందరూ తెల్లబోయేరు. మిగతా అయ్యప్పలు తాము కూడా తప్పు చేసినట్లుగా తలలు దించుకున్నారు.
“నిన్ననే నన్ను ఆడోళ్ళని వశం చేసుకునే వేరుంటే ఇవ్వమని నా ఎంబడి పడ్డాడు. అప్పుడే అనుకున్నా ఈడి కళ్ళకి పొరలు గమ్మేయని” అన్నాడు కోయదొర అతనివైపు చీధరగా చూస్తూ.
అతని మాట విని అందరూ నిశ్చేష్టులయ్యేరు.
వెంటనే కోపంతో అతన్ని కంపార్టుమెంటులోంచి బయటకి నెట్టేయబోయేరు.
“ఈ చీకట్లో ఎక్కడికెళ్తాడులెండి. అతను దీక్షలో చేసిన పాపానికి ఇంతకంటే అవమానం, శిక్ష ఏం కావాలి. నలుగురిలో అతని పరువు తీసేడయ్యప్ప!” అన్నాడొక దీక్షలో వున్న స్వాములు.

ఇంకా వుంది…

బ్రహ్మలిఖితం 9

రచన: మన్నెం శారద

“లిటరరీ ఫ్లాక్” అనుకుంది మనసులో కసిగా లిఖిత.
చీకటి పడింది. రెండరటిపళ్ళు తిని బెర్తెక్కి పడుకుంది.
శరీరాన్ని వాల్చినా మనసుకి విశ్రాంతి లభించడం లేదు. కొన్ని గంటలుగా కంపార్టుమెంటులో కోయదొర చేసిన విన్యాసాలు మనిషి పల్స్ తెలుసుకొని ఆడుతున్న నాటకాలు గుర్తొచ్చి ఆశ్చర్యపడుతోంది.
ఒక చదువుకోని అడవి మనిషి .. అడవిలో దొరికే పిచ్చి పిచ్చి వేర్లు తెచ్చి వాటిని దగ్గర పెట్టుకుంటే శని విగడవుతుందని అదృష్టం పడుతుందని, అనుకున్న పనులు జరుగుతాయని నిముషంలో ఈ చదువుకున్న గొర్రెల మందకి అమ్మి డబ్బు చేసుకోవడం చాలా చిత్రంగా అనిపించింది.
మనిషి తన చదువుకున్న చదువుని పరీక్షా పత్రాల వరకే పరిమితం చేస్తున్నాడా? అందులోంచి మధించిన విజ్ఞానాన్ని జీవితానికన్వయించుకోలేనంత దీన హీనస్థితిలో వున్నాడా?
దేశానికి ప్రజలకి చీకటిలో జరిగే దారుణాల్ని ఉన్నదున్నట్లుగా తెలియజేసే బాధ్యత వున్న జర్నలిస్టు, అడవిలో అజ్ఞానంలో బ్రతికే ఒక కోయవాణ్ణి మహత్తర శక్తులున్న మనిషిగా చిత్రించి ప్రచారం చెయ్యడం ఎంతవరకు సమంజసం.
తన చేతిలో ఒక పేపరుందని కలముందని తన బుర్రలో పేరుకున్న అజ్ఞానన్ని వేలాదిమందికి పంచడం ఎంతవరకు క్షమార్హం.
అయితే జ్యోతి ఎలా నడిచినట్లు!
ఆలోచిస్తూనే పడుకుంది లిఖిత.
అకస్మాత్తుగా ఎవరో తట్టి లేపినట్లుగా మెలకువొచ్చి బెర్త్ మీద నుండి వంగి చూసింది. తెలతెలవారుతోంది. చలిగాలి జివ్వున వీస్తోంది.
అందరూ అప్పుడే లేచి కూర్చుని తర్జన భర్జన పడుతున్నాడు.
“ఏం చేస్తాం! చచ్చినట్లిక్కడ కూర్చోవాల్సిందే. సాయంత్రం కాని తిరిగి బయల్దేరదంట!” అంటున్నారెవరో.
“ఏం జరిగింది? ఆత్రంగా అడిగింది లిఖిత.
“తమిళనాడు బందట. రైలిక్కడాపేసేరు. తిరిగి సాయంత్రం వరకు ఇక్కడే మన జాగారం.” అన్నాడా జర్నలిస్టు.
లిఖిత నవనాడులూ కృంగిపోయినట్లయింది.
చాలామంది రైలు దిగి రిటైరింగ్ రూమ్స్‌కి వెళ్తున్నారు.
“ఏ వూరిది?”
జాలారిపేట అని చెప్పేడు జర్నలిస్టు.
లిఖిత ఉసూరుమంటూ బెర్త్ దిగింది.
తన తండ్రిని ఎంత తొందరగా కలుసుకోవాలని ప్రయత్నిస్తున్నదో అంతగానూ ఆలస్యమవుతోంది. ఇదంతా వెంకట్ చలవ. ఏడుస్తూ ట్రెయిన్ దగ్గర కొచ్చేడు. తన డబ్బు తీసుకుంటూ మరీ శాపాలు పెడ్తాడు. అని విసుక్కుంటూ బాగ్ తగిలించుకొని రైలు దిగింది లిఖిత.
ఏం చేయాలో తోచక నిస్సత్తువుగా ప్లాట్‌ఫాం మీదున్న బెంచి మీద కూర్చుంది.
ఇంతలో ఒక కానిస్టేబుల్ ఆమె దగ్గర కొచ్చి “మే అయ్ నో యువర్ నేం ప్లీజ్?” అనడిగేడు.
“లిఖిత”
“ఎక్కడ బయల్దేరేరు. ఎక్కడికెల్తున్నారు?”
“ఫ్రం సికిందరాబాద్ టు కొచ్చిన్”
“పర్పస్ అఫ్ ద జర్నీ?”
“టు విజిట్ కేరళ”
“అయిసీ! మీ ఫాదర్ పేరు?”
లిఖితకీసారి నిజంగానే కోపమొచ్చింది.
“అవన్నీ చాలా అవసరమా?” అనడిగింది విసుగ్గా.
“అవసరమే మాడం. ఏదైనా అనుకోని సంఘటనలు జరిగితే మొదట మీరు దుయ్యబెట్టేది పోలీసు డిపార్టుమెంటునేగా!” అంటూ నవ్వాడతను.
“అయితే బాగా రాసుకోండి. మా ఫాదర్ పేరు కార్తికేయన్. సైంటిస్టు. నా తల్లి పేరు కేయూరవల్లి. నా తాతగారి పేరు లేట్ భాస్కరన్. ఐ.జి ఆఫ్ ది పోలీస్.”
ఆ మాట విని అదిరిపడ్డట్టుగా చూసేడు కానిస్టేబుల్. వెంటనే గబగబా రైల్వే పోలీస్ స్టేషన్‌లో కెళ్ళేడు.
కాస్సేపటీలో ఒక అరడజనుమంది యూనీఫారంలో వున్న ఇన్స్పెక్టరుతో పాటు ఎస్పీ, రైల్వేస్ ఆమె దగ్గరగా వచ్చి సెల్యూట్ చేసేరు.
ఆ హఠాత్ చర్యకి లిఖిత తెల్లబోయి లేచి నిలబడింది. ప్రయాణికులంతా వింతగా చూస్తున్నారు.
“వీళ్లందరికీ మూకుమ్మడిగా పిచ్చిగానెక్కలేదు కదా” అనుకుంది మనసులో.
“నా పేరు హరిహరన్. మీ తాతగారే నన్నీ డిపార్టుమెంటులో రిక్రూట్ చేసింది. ఆయన చలవ వల్లనే ప్రమోషన్ సంపాదించేను. ఆయన్ పోయేక మీ వివరాలు తెలియలేదు. మీ అమ్మగారు బాగున్నారామ్మా” అనడిగేడూ వినయంగా.
లిఖిత తలూపింది.
“పదండి. మిమ్మల్నిక్కడ ఆర్ అండ్ బి గెస్త్ హౌస్‌లో వుంచుతాను. రెస్టు తీసుకుందురుగాని” అన్నారాయన.
“ఎందుకండి మీకు శ్రమ” అంది లిఖిత.
“నోనో! నాటెటాల్. ఇటీజే గ్రేట్ ఆపర్చునిటీ టు గెటే చాన్స్ టు సర్వ్ యూ. కమాన్ బేబీ!” అన్నారాయన లిఖిత భుజం చరుస్తూ.
ఇదంతా చూస్తున్న జర్నలిస్టు గబగబా ఆవిడ దగ్గరగా వచ్చి.”నేనూ మీతో వస్తాను మాడం. నేను మీ ఫ్రెండ్‌నని చెప్పండి” అనడిగేడు.
లిఖిత తలూపి “హీవిల్ ఆల్సో ఫాలో అజ్. ఎనీ అబ్జెక్షన్?” అడిగింది.
“లెట్ హిమ్ కమ్” అన్నారాయన ముందుకి నడుస్తూ.
అందరూ ఫ్లయోవర్ మీద నుండి దిగేరు.
అక్కడున్న అంబాసిడర్‌లో లిఖిత, జర్నలిస్టు ఎక్కేరు. డ్రైవరు పక్కన ఒక ఇన్స్పెక్టరెక్కేడు.
అందరు పోలీస్ ఆఫీసర్సు తమిళ సినిమాల్లో చూపించించే పోలీసాఫిసర్లలానే పెద్ద పెద్ద మీసాలతో వున్నారు.
కారు ముందుకి సాగిపోతుండగా జర్నలిస్టు కారు వెనుక గ్లాసులోంచి చూసి తెల్లబోతూ “మాడం! వెనక్కి చూడండి” అన్నాడు.
లిఖిత వెనక్కి తిరిగి చూసింది.
ఒక మెటడోర్ నిండా పోలీసులు తమ కారుని ఫాలో చేస్తున్నారు.
లిఖిత ఆశ్చర్యపోతూ “వాళ్లంతా ఎక్కడికొస్తున్నారు?” అనడిగింది ముందు సీట్లో కూర్చున్న ఇన్స్పెక్టర్ని.
“మిమ్మల్ని జాగ్రత్తగా చూడాలని చెప్పేరు ఎస్పీ సార్!” అన్నాడతను వినయంగా.
“నేను మీ గెస్టునా? క్రిమినల్నా?” అంది లిఖిత.
ఆ మాట విని జోక్‌గా తీసుకొని పెద్దగా నవ్వేడు ఇన్స్పెక్టర్.
“ఈ రోజు బంద్. ప్రభుత్వానికనుకూలంగా జరుగుతోంది. అందుకే ఎక్కడి రైళ్లక్కడాగిపోయేయి. మీకే ప్రమాదం జరక్కుండా చాలా జాగ్రత్తలు తీసుకోమని చెప్పేరు సార్!”
లిఖిత మరేం మాట్లాడలేదు.
కారు ఒక ప్రశాంతంగా చాలా పెద్ద గ్రవుండ్‌లో వున్న గెస్ట్ హౌస్ పోర్టికోలో కెళ్లి ఆగింది.
లిల్ఖిత, జర్నలిస్టు కారు దిగేరు. స్నానాలు ముగించగానే టిఫిన్స్ వచ్చేయి. ఇంతలో ఇన్స్పెక్తర్ వచ్చి ఒక కలర్ టీవీ అరేంజ్ చేసి క్రికెట్ మాచ్ వస్తోంది చూడండమ్మా” అన్నాడు.
“నాకు చాలా అయిష్టమైన ఆటల్లో మొదటిది క్రికెట్!” అంది లిఖిత.
అతను తెల్లబోయి చూసి “వ్వాట్ మాడం. ప్రపంచంలో తొంభయిశాతం క్రికెట్ అంటే పడి చస్తారు. క్రికెట్ మాచ్ చూడడం ఒక క్రెడిట్‌గా ఫీలవుతారు” అన్నాడు.
లిఖిత నవ్వి “నేను మిగతా పది శాతంలోకి వస్తాను. ఎక్కువమంది ఇష్టపడేదాన్ని నేను మనసులో ఇష్టం లేకున్నా ఇష్టమని చెప్పలేను” అంది.
“అయితే ఏదన్నా సైట్ సీయింగ్ చేస్తారా” దగ్గర్లో జలబంధారి అని వాటర్ ఫాల్స్ వుంది. అక్కడ మురుగన్ కోవెలుంది. రొంబ వ్యూటిఫుల్ ప్లేస్” అన్నాడతను.
లిఖిత కన్నా జర్నలిస్టు ఉత్సాహం చూపిస్తూ “వస్తాం. వస్తాం. సాయంత్రం వరకు ఇక్కడేం చేస్తాం?” అన్నడు.
అతను లిఖిత అనుమతి కోసం చూసేడు.
“చెప్పండి మాడం. వస్తామని” అని బ్రతిమాలేడు జర్నలిస్టు.
లిఖిత సరేనంది.

*******

సంపెంగి అందించిన కబాబులు తింటూ, కల్లు తాగుతూ “మనం అనుకున్న దానికంటే బాగుంది మన గిరాకీ. కాని నువ్వప్పుడే చాలా తొందపడిపోతున్నావు నారాయణా! కొత్తమతం తీసుకుంటే గుర్తులెక్కువని ఆ బాంక్ పిల్లకేంటి.. రెండ్రోజుల్లో దాని పూర్వజన్మలోని మొగుడొచ్చి డబ్బిస్తాడని చెప్పేవు. నాటకమాడిద్దామన్నా మన దగ్గరంత డబ్బెక్కడిది? ఇవ్వకపోతే ఓంకారస్వామి ఉత్త నాటకాలరాయుడని పదిమందికి చెప్పి రామక్రిష్ణా బీచ్‌లోని ఇసకంతా మన నెత్తిన పోయిస్తది” అన్నాడూ రాజు విసుక్కుంటూ.
ఓంకార స్వామిగా అవతారమెత్తిన నారాయణ విలాసంగా నవ్వి సంపెంగి వైపు చూసేడు. సంపెంగి మొహం చిటపటలాడుతున్నట్లుగానే వుంది. మైక్రోస్కోపు పెట్టి పరీక్షించినా ఆవిడ మొహంలో నవ్వు మచ్చుకైనా కనిపించదు. కాని.. ఇదివరకులా చిరాకు పడకుండా వాళ్లడిగినంత కల్లు పోస్తున్నది. కారణం.. వాళ్లు ఆడుతున్న కొత్త నాటకం భవిష్యత్తులో బాగా లాభాలు సంపాదించి పెట్టగలదనే ఆశతో మాత్రమే.
“మరీ నన్ను సన్నాసోడిగా జమ కట్టేయకు. దానికి అగిన ఎరేంజ్‌మెంట్లు చేసేనేనప్పుడే. నిన్న వెంకట్ అని ఒక ఆడదాని సొమ్ము తిని బతికే ఏబ్రాసోడొకడు నా దగ్గరకొచ్చేడు. వాడు ప్రేమించిన పిల్ల వీడి ప్రేమని ఎడం కాలితో తన్ని కేరళ వెళ్ళిందంట. అదింక తిరిగి రాకూడదని వీడి ప్లాన్. అంతే కాదు ఆ పిల్ల అమ్మకున్న బట్టల మిల్లు వీడి చేతిలోకి రావాలని దానికి తనే వారసుడు కావాలని నా దగ్గర కొచ్చేడు. వాణ్ణి బుటలో పెట్టేను.
“ఎలా?” కుతూహలంగా అడిగేడు రాజు. నారాయణలో కొంత ఫోజు పెరిగింది.
గర్వంగా సంపెంగి వైపు చూసేడు.
సంపెంగి అర్ధం చేసుకున్న దాన్లా గూళ్ళెత్తి నడుస్తూ వెళ్లి మరొక కల్లు ముంత తెచ్చి నారాయణ కందించింది.
“కబాబులు?” అనడిగేడు నారయణ గర్వంగా.
సంపెంగి మళ్లీ వెళ్ళింది.
“నీ తస్సదియ్యా! రేగి కంపలాంటి నా పెళ్ళాం చేత పనులు చేయిస్తున్నవు. నువ్విన్ని పెళ్ళిళ్ళెలా మానేజ్ చేసేవో నాకర్ధమవుతున్నదిప్పుడు” అన్నాడు రాజు నవ్వుతూ.
“ఎవరికే బలహీనతలున్నదో దాని మీద ఆశ రేకెత్తిస్తే వాళ్లు కుక్కల్లా తోకలూపుతూ మన వెంబడి తిరుగుతారు. నీ పెళ్లానికి డబ్బు పిచ్చి. పూరి గుడిసె లెవలయినా ప్రీమియర్ పద్మినిలో తిరగాలని కలలు కంటుంటుంది. అద్సరే. ఆవిడ కబాబులు కాల్చుకొచ్చేలోపునే అసలు విషయం చెబుతాను. కొన్నావిడ వినకపోవడమే మంచిది. లేకపోతే నిముషానికోసారి మన గుట్టు బయట పెట్టే ప్రయత్నాలు చేస్తుంది.”
“అవునవును” అన్నాడు రాజు.
” ఆ వెంకట్ గాడికి రేపొక ఇరవైవేలు తీసుకెళ్ళి బాంక్‌లో ఈశ్వరి అనే పిల్లకివ్వమని, ఆ పిల్ల ముందు జన్మలో నీ భార్యని చెప్పేను”.
“వాడు నమ్మాడా?”
నారాయణ విలాసంగా నవ్వాడు.
“మన దగ్గర కొచ్చేరంటేనే సగం మానసికంగా మన మాటలు నమ్మడానికి సిద్ధపడొస్తారు. ఇక మనం సాగదీస్తూ, సంశయంగా కాకుండా దైవం పూని మాట్లాడుతున్నట్లుగా మాట్లాడాలి. అలౌకికంగా చూడాలి. చిరునవ్వులొలికించాలి. ఒక్కమాటలో చెప్పాలంటే.. వారి ఎదుట నున్నవాడు వాళ్లలాంటి మనిషి కాదని గొప్ప అద్భుత శక్తులున్న దైవాంశ సంభూతుడనే అభిప్రాయం కల్గించహలి. అప్పుడు మనం కొన్ని తప్పులు చెప్పినా వాళ్లు పదిమందిలో బయటపెట్టే సాహసం చెయ్యరు. మొన్నేం జరిగిందో తెలుసా?” అంటూ నవ్వేడు నారాయణ.
రాజులో ఉత్సాహం ద్విగుణీకృతమైంది.
“ఏం జరిగింది?” అనడిగేడూ.
“మల్లన్నని ఆంధ్రా యూనివర్సిటీలో రిటైర్డ్ ప్రొఫెసరట. దేవుడు లేదు. దయ్యం లేదని… మాయలూ మంత్రాలూ మోసమని, చేతబడులు, సింగినాదాలూ చీటింగని పాతికేళ్ళూ పుంఖాను పుంఖాలు కనిపించిన ప్రతి పేపర్లోనూ కలం తీసుకుని దూదేకినట్లు ఏకి పారేసేడు. కాని ఇప్పుడేం జరిగిందో సింహంలాంటి మనిషి చెవులేలాడేసుకొని పిల్లిలా మన వరండాలో మూడుగంటల సేపు నా దర్శనం కోసం పడిగాపులు పడ్డాడు.
వాది కులగోత్రలు, పుట్టు పూర్వొత్తరాలూ, మనవాళ్ళొచ్చి నా చెవిలో ఊదెళ్ళి పోయేరు. నేను చేతిలో ఒక ఏపిల్ తీసుకుని పైకెగరేసి పట్టుకుంటూ హాల్లో భక్తుల ముందు ఈ లోకంలో లేనట్లుగా నదుచుకుంటూ వాణ్ణి గమనించినట్లుగా వెళ్లి మళ్లీ వెనక్కొచ్చేసేను. భక్తులతోపాటు వాడు లేచి ఆశీర్వాదం కోసం ఆరాటపడటం నేను క్రీగంట గమనించేను.
నేను తిరిగొచ్చి మన ఓలంటీరుని పంపించి మల్లన్నని లోపలికి పంపమని చెప్పేను. మల్లన్న వెన్నెముకలేని మనిషిలా అతని వెంబడొచ్చి నా కాళ్ల మీద పడ్డాడు”.
“నిజంగానా?” ఆశ్చర్యపోతూ అడిగేడు రాజు.
“కావాలంటే మన ఓలంటీర్లనడుగు. మల్లన్నని పేరుతో పిలవగానే వాడు ఫ్లాటయిపోయేడూ. నీకేం సమస్యలున్నాయని వచ్చావు. అంతా బాగానే వుందిగా. ఆరోగ్యం కూడా ఫర్వాలేదు” అన్నాను.
“మీరన్నట్లు నాకేం లోటు లేదు. ఇల్లు కట్టేను. పిల్లల పెళ్ళిళ్ళు చేసేను. మనశ్శాంతి లేదు. ఇక ఆరోగ్యమంటారా.. మొన్నీమధ్యన కేన్సరొచ్చి తగ్గింది” అన్నాడతను.
“అదే చెబుతుంట. ఇంకే పెద్ద జబ్బులూ రావు నీకు. మొదట్నుంచీ దేవుణ్ణి తూలనాడేవు. అదే నీ అశాంతికి మూలమని చెప్పేను. ఇంకేం ఉంది. లైబ్రరీల్లో వేలాది పుస్తకాలు చదివిన మనిషి నా కాళ్ల మీద కుక్కపిల్లలా పడ్డాడు. వాడలాంటి ట్రాన్స్‌లో వుండగా నేను తగరపు వలసనుండి వచ్చి నాకు ముత్యం వుంగరం యిచ్చిన పాకాల సుబ్బమ్మగారి ఉంగరం గాల్లోంచి తెప్పించినట్లుగా తెప్పించి వాడిని పెట్టుకోమన్నాను. వాడికి మతి పోయింది. కాని దురదృష్టం. ఆ రింగు వాడి ఏ వేలికీ పట్టలేదు. నేనది తిరిగి తీసుకొని అటూ ఇటూ తిప్పి “నీ అదృష్టానికిది కుదరడం లేదు” అని చెప్పి ఇది అసలైన ముత్యమేనా, చూడు!” అంటూ మన ఓలంటీరుకిచ్చేను.
అతను “ఇది మేలిమి బంగారంలో ఇమిడిన స్వాతి ముత్యం స్వామి!” అంటూ దాన్ని తిరిగిస్తున్నట్లుగా కొంచెం పెద్ద సైజులో నా ఆకృతి గుద్దిన రాగి ఉంగరం నా చేతికిచ్చేడు. నేను గాలిలో చేతులు తిప్పి రాగి ఉంగరం తెప్పించినట్లు తెప్పించి అతనికిచ్చేను.
మల్లన్న మొహంలో ఆనందం తాండవించింది.
ఆ ఉంగరాన్ని మహాప్రసాదంగా స్వీకరించి నా ఫోటోలు అడిగి పట్టుకెళ్ళేడు. వచ్చే పౌర్ణమినాడు నా పుట్టినరోజు ప్రకటిస్తున్నాను. ఆ రోజుకి మల్లన్న నా మహత్యాల గురించి అన్ని పేపర్లలోనూ రాసేస్తాడు” అన్నాడు నారాయణ గర్వంగా.
రాజు నిజంగానే నారాయణ తెలివితేటలు చూసి చకితుడయ్యేడు.
విత్తనం నాటిన మూడో నాటికే పందిరంతా అల్లుకుపోయిన గుమ్మడి పాదులా అనిపించేడు నారాయణ అతని కళ్ళకి.
“నిజంగా నువ్వు చాలా తెలివ్వైనవాడివే నారాయణా! నీ మొహంలో ఆ పీడ కళ పోయి తేజస్సు వచ్చింది. కొంపదీసి దేవుడు నిన్ను నిజంగా ఆవహించలేదు కదా!” అన్నాడు సంభ్రమంగా చూస్తూ.
” నా బొంద! భక్తులు తెచ్చిన పళ్ళు, మిఠాయిలు, పంచామృతాలు తాగి నా బుగ్గలు వూరి రంగొచ్చింది. ఇలాంటి ఆహారం తినే పూర్వం మునీశ్వరులు దివ్యకాంతితో వెలిగిపోయేవారు. దాన్నే బ్రహ్మతేజస్సు అనుకునేవారు పిచ్చి ప్రజలు.” అంటూ నవ్వేడు నారాయణ.
“ఇంతకీ ఆ వెంకట్ గాడి సంగేంటి?”
“ఏవుంది. ఎక్కడో రేపటికల్లా ఆ డబ్బు సంపాదిస్తాడు వాడు. చూస్తుండు. అందులో కొంత డబ్బు బాంక్ పిల్ల కృతజ్ఞతతో మనకి సమర్పించుకుంటుంది. కథ అంతటితో ఆగదు. అద్సరే గానీ, రేపణ్ణుంచి నేనీ గుడిసెల దగ్గరకి రాను. మన రహస్యం బట్టబయలైపోతుంది. ఇప్పటికే తగినంత ప్రచారం జరిగింది కాబట్టి నువ్వా చిలకని గాలి కొదిలి నా దగ్గరే పి.ఏ గా చేరు” అన్నాడు నారాయణ.
రాజు సరేనన్నట్లుగా తల పంకించేడు.
“నువ్వు చెప్పిన సలహా బాగుంది. పరమాన్నం పెడతానంతే గంజికాసుకోటానికి గింజలడిగిపెట్టినట్లుగా.. ఆ ఎండలో నాకీ తిప్పలు దేనికి?” అంటూ రయ్యిన లేచి పంజరంలోని చిలకని బయటకొదిలేసేడు రాజు.
అది నిస్సహాయంగా కుంటుతూ బయటకొచ్చింది. చాలా సంవత్సరాలుగా యజమాని పంజరపు తలుపు తెరవగానే వచ్చి కొన్ని కార్డులు కెలికి ఒక కార్డు ముక్కును కరచి అతనికివ్వదానికి అలవాటుపడ్డది కావడంతో చుట్టూ కార్డుల కేసి చూసింది.
“నీ యవ్వ! నీతో నాకింక పని లేదు. ఎగిరిపో” అంటూ రాజు కల్లు తాగిన నిషాతో దాన్ని పట్టుకుని ఎగరేసాడు.
కాని చిలుక దబ్బున క్రిందపడింది.
ఎన్నో రోజులు మంచం మీద తీసుకున్న రోగిష్టి మనిషి లేచి నడవడానికి ప్రయత్నిస్తే ఎలా తూలిపోతాడో అలాగే చిలుక తన రెక్కల్ని సాచి ఎగరలేక నిస్సహాయంగా కూలబడిపోయింది.
అనేక సంవత్సరాలుగా అతనితోనే కలిసి బతుకుతున్నందువలన దాని మూగ హృదయంలో యజమాని పట్ల నమ్మకము, ప్రేమ కూడా బలంగా ఏర్పడ్డాయి. ఒకప్పుడు ఇతనే తన బ్రతుకు తెరవు కోసం, హాయిగా పసిడి రెక్కలు పరచి ఆకాశంలో ఎగిరే తనని నిర్దాక్షిణ్యంగా పట్టి రెక్కలు కత్తిరించి పంజరపు పాలు చేసేడన్న ఉక్రోషం, కక్ష మచ్చుకైనా లేవా మూగజీవిలో.
పైపెచ్చు అతన్ని వదులుకోడానికి సిద్ధంగా లేదు దాని హృదయం. తనని నమ్ముకొని అతను పొట్ట పోసుకుంటున్నాడన్న నిజం తెలీని ఆ అమాయకపు పక్షి అతను వేసే గింజలు తిన్నందుకే అతని మీద ప్రేమ పెంచుకుంది. ఒక్కసారిగా తన అవసరానికి వాడుకొని పని తీరేక పొమ్మని వదిలేసిన యజమానిని వదులుకోలేక దాని కంటిలో నీరు గిర్రున తిరిగింది.
కాని..దాని కన్నీరు చూసి కరిగిపోయే మానవత్వం అక్కడున్న ఇద్దరికీ లేదని దానికి తెలియదు.
“థూట్! పొమ్మంటే ఇక్కడే చస్తుంది. పాడు ముండ!” అంటూ ఒక కర్ర పుల్ల తీసుకొని అదిలించబోయేడు రాజు.
అప్పుడే కబాబులు తీసుకొస్తున్న సంపెంగి ఆ దృశ్యం చూసి తెల్లబోతూ “దాన్నొదిలేసేవేంటి?” అంది కంగారుగా.
“ఇక దాంతో పన్లేదే పిచ్చిముండా! మనం పట్టిందంతా బంగారమయ్యే రోజులు దగ్గరకొచ్చేసేయి!” అన్నాడు కర్రతో దాన్ని కొడుతూ.
సంపెంగి కబాబులు వాళ్ల మీదకిసిరి కొట్టి చిలకని ఒడిసిపట్టుకొని “నీకేవన్నా పిచ్చెక్కిందా? జోస్యాలు మానేసినంత మాత్రాన దీన్నొదిలేసుకుంటారా?” అంది కోపంగా మొగుడివైపు చూస్తూ.
నారాయణతో పాటు రాజుకూడా బ్రహ్మరాక్షసిలాంటి ఆ మనిషిలో ప్రేమ, దయ వున్నాయనే విషయం గ్రహించి ఆశ్చర్యపోయేరు.
“చిలక మాంసం ఎంత రుచిగా ఉంటుందో మీరెప్పుడైనా తిని చూశారా? దీన్నిప్పుడే బొచ్చు పీకి కాల్చుకొస్తాను. చూద్దురుగాని” అంది సంపెంగి దాన్ని తీసుకొని లోనికెల్తూ.
ఆ మాట విని నారాయణ ఉలిక్కిపడ్డాడు.
ఎన్నో మోసాలు చేసి అవినీతిగా బ్రతికే అతను కూడా చిలకని చంపబోతున్నదని తెలిసి చలించిపోయేడు.
“వద్దు సంపెంగీ దాన్ని చంపకు”అనరిచేడు కీచుగా.
సంపెంగి వెనక్కి తిరిగి నవ్వింది క్రూరంగా.
“ఏం జాలా?”
“పాపమది మూగజీవి!”
“ఏం కోడి మూగజీవి కాదా? మేకపోతు మూగ జీవి కాదా? వాటితో తయారుచేసిన కబాబులు చప్పరించి తినగా లేంది. చిలక మాంసం తింటే తప్పా! ఎదవ నీతులు చెప్పబోకు.” అంటూ రయ్యిన లోనికెళ్ళిపోయింది.
మరి కాస్సేపటిలో కత్తికి ఎరవుతూ చిలక చేసిన చివరి రొద వాళ్ల చెవిలో పడింది.
నారాయణ “హరిహరి” అంటూ చెవులు మూసుకున్నాడు. అవసరం తీరేక తోటి మనిషిని కూడా మానసికంగా కత్తి లేకుండానే హత్య చేసి అవతలకి విసిరేయగల శక్తి ఈ సృష్టిలో నికృష్టమైన మనిషికి మాత్రమే వుందని గ్రహించే శక్తి నారాయణలాంటి వాళ్లకుండదు.

***********

కారు మెల్లగా వెళ్తోంది.
రోడ్డు కిరువైపులా పెద్ద పెద్ద మర్రి, మారేడు, రావి వృక్షాలు చేతులు పెనవేసుకుని షేక్‌హేండిస్తున్నట్లుగా దట్టంగా పెరిగి దారిన వెళ్ళేవారికి చల్లని గాలిని, నీడని ఇస్తున్నాయి. రోడ్డు పక్కన పెరిగిన చెరకు తోట్టల్లోంచి తియ్యని వాసనలొస్తున్నాయి.
దూరంగా వలయాకారంలో వున్న కొండలు వాటి వెనుక దట్టమైన నీలి రంగులో క్రమ్ముకొన్న మేఘాల పంక్తులు , వాటి కావల దుప్పటిలో దాక్కున్న సూర్యుదు తన ఉనికి చాటుకునేందుకు చేస్తున్న ప్రయత్నానికి నిదర్శనంగా మేఘాల కొసల్ని వెండి అంచులు ఎంతో హృద్యంగా వుందా ప్రాంతం.
కృత్రిమంగా ఎత్తయిన కాంక్రీటు కట్టడాలతో క్రిక్కిరిసి పోతున్న జనారణ్యం నుండి కాలుష్యమెరుగని ఆ ప్రకృతి కాంత వడిలో పయనించడం మనసుకి ఎంతో సుఖాన్నిస్తోంది లిఖితకి.
తండ్రి గురించి తాత్కాలికంగా మరచిపోయి ఆ అరుదయిన అందమయిన దృశ్యాల్ని కంటి ఫ్రేములో కమనీయంగా బిగించే ప్రయత్నం చేస్తుందామె మనసు.
“మాడం!”
“నే రాసిన ఆర్టికలొకసారి చదువుతారా?”
“ఇప్పుడు కాదు” ఆమె చూపు తిప్పకుండానే జవాబు చెప్పింది జర్నలిస్టుకి.
మరో అరగంటలో కారు జలబంధారి చేరింది.
కారు దిగకుండానే లిఖిత చూపులు గుడి మీద పడ్డాయి.
ఆ గుడిని చూడగానే లిఖిత మనసు ఆనందంతో గండులేసింది.
కొండవాలులో కొంత ఎత్తునున్నదా దేవాలయం.
క్రింద విఘ్నేశ్వరుడు, ఆంజనేయస్వామి కోవెలలున్నాయి.
కొద్దిగా మెట్లెక్కేక హెక్టాగన్ షేపులో (పంచముఖాలు) వున్న మంటపం, అక్కణ్ణుంచి మరి కొన్ని మెట్లెక్కితే శివలింగాకృతిలో వున్న సుబ్రమణ్యస్వామి కోవెల, ఆ కోవెలకి నీడపడుతూ వేయి తలల శేషేంద్రుడి శిల్పం. తలతలకి ఎర్రని దీపాలు, చాలా గమ్మత్తుగా కట్టేరా గుడిని. గుడి వెనుక కొండమీద నుండి నాలుగయిదు ధారలలో జలపాతం క్రింది జారుతున్నది. దూరం నుండి చూస్తే రాతి కొంతమీద గట్టిగా నామసుద్దతో రాసినట్లు నిశ్చలంగా కనిపిస్తున్నాయి నీటి ధారలు.
“ముందు గుడిలో దర్శనం చేసుకుందాం” అన్నాడు ఇన్‌స్పెక్టర్.
లిఖిత తల పంకించింది.
ముగ్గురూ దేవుడికి అర్చన చేయించేరు
తులసి మాలలతో, గన్నేరు పూలదండలతో శోభాయమానంగా వున్నాడు శ్రీవళ్లీ సమేతుడయిన సుబ్రమణ్యస్వామి.
ఇన్‌స్పెక్టర్ బూట్ సాక్సు తీసి ఇన్‌షర్ట్ బయటికి లాగి చాలా వినయంగా లెంపలేసుకుని ముగురన్‌కి మొక్కుకున్నాడు.
పూజయ్యేక మంటపం దగ్గర కూర్చున్నారు. ఇన్‌స్పెక్టర్ బూట్లు వేసుకుని మళ్లీ టక్ చేసుకుంటుంటే “ఇందాక దేవుడి దగ్గర లెంపలేసుకున్నారెందుకు?” అని కొబ్బరి ముక్క తింటూ చిలిపిగా అదిగింది లిఖిత.
“తెలియకుండా ఎన్నో తప్పులు చేస్తుంటాం కదా మాడం!” అన్నాడతను నవ్వుతూ.
“అంటే తెలిసేం చెయ్యరన్న మాట!”
లిఖిత ప్రశ్నకతను ఇబ్బందిగా నవ్వేడు.
“మీతో మాటలడటం రొంబ కష్టం!” అన్నాడు అరవ యాసతో.
“మీ పోలీసు డిపార్టుమెంటు వాళ్లు తెలిసే చేస్తారు. నా ఫ్రెండ్ బస్సెక్కుతుంటే ఒకడు గొలుసు లాగేసేడు. ఆమె వెళ్ళి దగ్గరలో వున్న పోలీసు స్టేషనులో రిపోర్టిచ్చింది. ఆ గొలుసు లాగిన వాడెవరో, ఆ ఏరియాలో ఎవరా పనులు చేస్తారో వాళ్లకి తెలుసు. గొలుసు వెంటనే దొరికిపోయింది. నా ఫ్రెండ్ ఆ సంగతి తెలిసి తన అదృష్టానికి పొంగిపోతూ పోలీసు స్టేషనుకెళ్లింది. ఈ గొలుసు మీదేనా అంటూ ఆ గొలుసుని ఆవిడ మొహం మీడ ఆడించడమే గాని గొలుసు నా ఫ్రెండ్‌కివ్వలేదా ఇన్‌స్పెక్టరు. ఆవిడ విసిగి విసిగి చివరికి ఎవర్నో పట్టుకొని ఒక ఐ.జి.గారి చేత ఆ ఇన్‌స్పెక్టరుకి ఫోను చేయించింది. ఐ.జి.గారు చెప్పినప్పుడల్లా వాళ్లు ఫోనులోనే సాల్యూట్ కొట్టి ఇస్తాననడం, ఈవిడ వెళ్తే ఇవ్వకపోవడం. చివరికి ఆమె విసిగి వదిలేసింది. ఇలాంటివి తెలిసి చేసిన తప్పులు కావా?” అనదిగింది సూటిగా లిఖిత.
ఇన్‌స్పెక్టరు వెర్రిగా నవ్వాడు.
“అయిజీగారు చెప్పినా ఇవ్వలేదా మాడం!” ఆశ్చర్యంగా అడిగేడు జర్నలిస్టు.
“లేదు. కారణం ఆయన వీళ్లకి డైరెక్ట్ హెడ్ కాకపోవడమే. ఈ డిపార్టుమెంటులో హయ్య ర్ అథారిటీ పట్ల విపరీతమైన వినయవిధేయతలు చూపిస్తారు. సాల్యూట్స్ కొటడం, గంటలు గంటలు నిలబడడం, .. కాని ఇవన్నీ కేవలం వీళ్ల ఆఫీసర్సుగా ఉన్నంతవరకే!” అంది లిఖిత.
“ఎక్కడో కొంతమంది అలా ప్రవర్తించినంత మాత్రాన మొత్తం డిపార్టుమెంటుననడం భవ్యం కాదు మాడం!” అన్నాదు జర్నలిస్టు ఇన్‌స్పెక్టరుని వెనకేసుకొస్తూ.
లిఖిత నవ్వింది.
“నిజమే! ఒక లీటరు నీళ్లలో ఒక గ్లాసు పాలు కలిపితే నీళ్ళలో పాలు కలిపేరంటాం కాని పాలలో నీళ్ళు కలిపేరనం. అలానే వుంది. మన దేశంలో అవినీతి పర్సంటేజీ. ఇలాంటి విషయాలు రాయరు మీలాంటి జర్నలిస్టులు. ఏ తార ఏ తారడుతో తిరుగుతుందో, ఏ తార ముసల్దయిపోయిందో, అర్ధం లేని వ్యర్ధపు మాటల్ని బాక్స్‌లు కట్టి మరీ రాస్తారు పెద్ద డిస్కవరీ చేసినట్లుగా” అంది.
జర్నలిస్టు మొహం మాడింది.
లిఖిత అదేం పట్టించుకోనట్లుగా లేచి నిలబడి “పదండి ఆ జలపాతాన్ని దగ్గరగా చూద్దాం!” అంది.
అందరూ కొండెక్కేరు..
దూరం నుండి స్తబ్దంగా చలనం లేనట్లుగా కనిపించిన జలపాతం దగ్గరకు వెళ్తుంటే హోరున శబ్దంతో, తుళ్ళుతూ శక్తిలా క్రిందకి దూకుతోంది. సన్నని పాయలా కనిపించే ఆ జలపాతంలోని నీరు కొండ దిగువున ఒక పెద్ద టాంక్‌లా తయారయింది. దాని నుండి తీసిన కాలువలతో ఆ ప్రాంతంలోని పంటలన్నీ పండుతాయని తెలిసి లిఖిత ఆశ్చర్యపోయింది. రాయికి రాయికి మధ్య చెమ్మలా కనిపించే ఈ నీరెక్కడినుండి ఉద్భవిస్తుంది అనే నిజం సరిగ్గా ఎవరికీ తెలియదు.
కాస్సేపు నీటితో ఆడుకుని తిరిగి బయల్దేరేరు ముగ్గురూ. కారులో తిరిగి “నా ఆర్టికల్ చదవండి మాడం” అంటూ వెంటపడ్డాడు జర్నలిస్టు.
అతని పోరు భరించలేక ఆర్టికల్ తీసుకుని టైటిల్ చూసి మొహం చిట్లించింది లిఖిత.
“అక్షరం తెలీని అడవి మనిషి దగ్గరున్న అద్భుత శక్తులు” అని టైటిల్ పెట్టేడతను.
“ఇదంతా కోయదొర గురించేనా?”
“అవును మాడం. చదవండి.”
“అక్కర్లేదు. టైటిల్ చూస్తేనే పాఠకులకేం చెప్పదలుచుకున్నావో తెలుస్తున్నది. ఏ అద్భుత శక్తి చూశావ్ నువ్వు!”
“అదేంటి? మీరూ చూశారుగా జ్యోతి నడవటం”
“చూశాను.”
“మరింకేమిటి, అదద్భుత శక్తి కాదా? మీరు నడిపించండి చూద్దాం.”
“నడిపిస్తాను. కాస్త ఆముదం, ఒక రాగి బిళ్ళ, కర్పూరం తీసుకురా!” అంది లిఖిత.
“ఊరుకోండి. మీవల్ల కాదు”
“నా వల్లనే కాదు నీ వలన కూడా అవుతుంది కాస్త ఆలోచిస్తే”
“ఎలా?” ఆశ్చర్యపోతూ అడిగేడు జర్నలిస్టు.

ఇంకా వుంది..

బ్రహ్మలిఖితం – 7

రచన: మన్నెం శారద

తాత్కాలికంగా వచ్చిన పని మరచిపోయి లిఖిత దాని దగ్గర కెళ్లి మోకాళ్ల మీద కూర్చుని దాన్ని నిమరసాగింది.
పామరిన్ కుక్కపిల్ల లిఖిత ఏనాటి నుండో తెలిసినట్లుగా లిఖితని ఆనుకొని కూర్చుని ఆమె చేతుల్ని ఆబగా నాకుతూ తన ప్రేమని ప్రకటించుకోసాగింది. బహుశ గత జన్మలో ప్రేమరాహిత్యానికి గురయిన వ్యక్తులు పామరిన్ కుక్కలుగా పుడ్తారేమోననిపించింది లిఖితకి. ఎలాంటి కరకురాతి మనిషయినా వాటిని దగ్గరకు తీయకుండా వుండలేడు.
లిఖిత దాన్ని లాలిస్తుండగా పక్క గోడ మీంచి “డాలీ” అంటూ ఒక స్త్రీ గొంతు వినిపించింది.
లిఖిత ఉలిక్కిపడినట్లుగా లేచి నిలబడింది.
ఆవిడ ఆశ్చర్యపోతున్నట్లుగా చూసి “మీరు?” అంది.
“మీనన్ గారి గురించి” అంది లిఖిత.
“అయాన హాస్పిటల్లో వున్నారు. మీరేమవుతారాయనకి?”
“ఏం కాను. ఆయన ఫ్రెండ్ కూతుర్ని. ఆయనతో పనుండి..”
“సరే! అలా తిరిగి మా ఇంట్లోకి రండి” అందావిడ.
లిఖిత బాగ్ తీసుకుని పామరిన్‌ని మరోసారి బుజ్జగించి గేటు తీసుకుని ఆవిడింట్లోకి నడిచింది.
ఆవిద హాలు తలుపు తెరచి “రండి.. చూస్తే ఇప్పుడే వూరు నుండి వచ్చినట్లున్నారు. మొహం కడుక్కోండి. కాఫీ ఇస్తాను” అంది.
లిఖిత వెళ్ళి మొహం కడుక్కుని రాగానే ఆవిడ టవలందించింది. మొహం తుడుచుకుంటుండగానే ఆవిడ వేడి కాఫీ అందిస్తూ “నా పేరు శ్రీవల్లి. మావారు విజయబాంక్ మానేజరు. మీనన్‌గారు మా నైబర్. చాలా మంచి మనిషి. ఆయన భార్య కుట్టి కూడా మాకు బాగా తెలుసు. చాలా కలుపుగోలు మనిషి. కాని.. పాపం అనారోగ్యంతో పోయేరు. మీనన్‌గారికి ఆవిడంటే చాలా ప్రేమ. ఆవిడ చాలాకాలంగా మంచం మీదనే వుంటున్నా. అదే పదివేలనుకొని ఆవిణ్ణి కంటికి రెప్పలా చూసుకునేవారు. అవిడ పోయేక ఆయన చాలా డిప్రెస్సయ్యేరు. దానికి తోడు ఆయన స్నేహితుడు కూడా వెళ్ళిపోవడంతో..”
“ఎవరాయన?”
“కార్తికేయన్”
“ఆయనెక్కడికెళ్ళేరో తెలుసా?”
“కేరళ అడవులకని విన్నాను. వివరాలు సరిగ్గా తెలియవు. మీనన్‌గారికే తెలుసు.”
“ఆయనకిప్పుడెలా వుంది? అసలేంటి జబ్బు?” అని ఆత్రంగా అడిగింది లిఖిత.
“హార్టెటాక్. ఇంటెన్సివ్ కేర్‌లో వున్నారు”
“ఆయనతో ఒకసారి మాట్లాడవచ్చా?”
“లాభం లేదు. ఆయనకసలు స్పృహ రానేలేదు. ఇంతకీ మీరెవరో తెలుసుకోవచ్చా? ” అంటూ శ్రీవల్లి భర్త శ్రీనివాస్ వచ్చేడక్కడికి.
“నా పేరు లిఖిత. మీరంటున్న కార్తికేయన్ కూతుర్ని నేనే” అంది లిఖిత.
వాళ్లిద్దరూ మొహమొహాలు చూసుకుని “అయితే మీరర్జంటుగా బయల్దేరండి” అన్నారు వాళ్లు.
లిఖిత వాళ్లవైపు అయోమయంగా చూసి”ఎక్కడికి?” అంది.
“కొచ్చిన్. మీరొస్తే ఆ మాటే చెప్పమన్నారు మీనన్ మొన్న కొద్దిగా స్పృహ వచ్చినప్పుడు. కొచ్చిన్ దగ్గర చోటా నికరా అనే ఊరుంది. అక్కడ భగవతి ఆలయ ప్రధాన పూజారిని కలిసి మీనన్ పేరు చెబితే ఆయన కొన్ని వివరాలందిస్తారు. ఇంకేమాత్రం ఆలస్యం చెయ్యొద్దు. డబ్బు కావాలంటే నేనిస్తాను. పదకొండున్నరకి కొచ్చిన్ ఎక్స్‌ప్రెస్ సికిందరాబాదులో బయల్దేరుతుంది క్విక్!” అన్నాడాయన.
“మీనన్‌గారిని ఒక్కసారి చూడొచ్చా?”
“ప్రయోజనం లేదు. ఎవర్నీ లోపలికి రానివ్వడం లేదు. చూసి ఏం చేస్తారు? ఆయన మన లోకంలో ఉంటే కదా!”
“వల్లీ! ఆవిడకి భోజనమేర్పాటు చూడు. నే వెళ్లి ఒక టిక్కెట్ సంపాదించుకొస్తాను” అంటూ బయట కెళ్ళిపోయేడు శ్రీనివాస్ కారులో.
“భయపడకండి. మీ నాన్నగారికేం జరగదు. మీరు వెంటనే బయల్దేరుతున్నారు కదా!” అంది శ్రీవల్లి ఊరడింపుగా.
లిఖిత తేరుకున్నట్లుగా నవ్వి లేచి స్నానానికెళ్ళింది.
ఆసీల మెట్ట జంక్షన్‌లో అలవాటు ప్రకారం చిలక జోస్యం చెబుతున్న రాజు తన దగ్గరున్న కార్డుల్లో మరో వంద కార్డులు హెచ్చుగా కలిపాడు.
బాంక్‌కి వెళ్లడానికి బస్టాపు కొచ్చిన ఈశ్వరి ఎంతసేపు నిలబడ్డా తన బస్సు రాకపోవడంతో తనలోని చిరాకునణచుకుంటూ రాజు దగ్గరున్న చిలక కేసి చూసింది కాలక్షేపంగా.
చిలక కుంటుతూ పెట్టెలోంచి బయటకొచ్చి ముక్కుతో కొన్ని కార్డుల్ని తోసి ఒక కార్డుని బయటికి లాగి రాజు చేతికందించింది.
రాజు కార్డు చదివి “నీ రోజులు బాగున్నాయి. నువ్వెంటనే ఓంకారస్వామిని కలువు. అన్ని సమస్యలు పరిష్కారమవుతాయి.” అన్నాడు.
“ఓంకార స్వామా?” అన్నాడా జాతకం చూపించుకోడానికొచ్చిన వ్యక్తి.
“ఓంకారస్వామి తెల్దా? బీవుడిపట్నం ఎల్లే దార్లో మర్రిసెట్టు కిందుంటాడు. ఆయన చెప్పింది చెప్పినట్టు జరిగిపోద్ది. మగానుభావుడు. ఎవులికి పుట్టాడో తెల్దు. ఏ వూరో తెల్దు!” అన్నాదు మరో వ్యక్తి.
ఇంతలో ఒకతను వగర్చుకుంటూ వచ్చి “అయ్యా తవరన్నట్టుగా ఓంకారస్వామి దగ్గరకెళ్ళేను. ఆయన చెప్పినట్టే జరిగింది. మీ రుణం తీర్చుకోలేను. ఈ డబ్బుంచండి.” అంటూ కొన్ని వందల రూపాయల నోట్లు రాజు చేతిలో కుక్కి పరిగెత్తినట్లుగా వెళ్లిపోయేడు.
ఈశ్వరి అదంతా గమనిస్తూనే ఉంది.
నిన్న తన కాషియర్ శెలవు పెడితే ఆ సీట్లో కూర్చుంది. కొంత కాష్ మిస్సయింది. బాధ్యత తన మీదే నెట్టేసాడు మానేజరు. మర్యాదగా కట్టేస్తే పోలీసు రిపోర్టివ్వనని బెదిరించేడు. నిజానికి తనకేం తెలీదు. అతన్నడిగితే?
కొంచెం సిగ్గుగా అనిపించినా ఇది తన ఉద్యోగ సమస్య. అడిగితే తప్పేముందని మనసు మొండికేసింది.
తన బస్సొచ్చింది
అయినా ఈశ్వరి ఎక్కలేదు.
జనం రద్దీ తగ్గేక మెల్లిగా ఆమె అడుగులు రాజు దగ్గరకు పడ్డాయి.
రాజు ఆమెని క్రీగంట చూసి “చెప్పవే చిలకమ్మా కష్టాల్లో యిరుక్కున సీతమ్మొచ్చింది. దారి చూపించు” అన్నాడు చిలకని హుషారు చేస్తూ.
చిలక మాత్రం నీరసంగా బయటకొచ్చి ఒక కార్డు తీసి రాజు మొహాన విసిరి వెళ్లిపోయింది.
రాజు కార్డు చదివి “వెళ్లి ఓంకార స్వామిని కలవ్వే తల్లీ! నీ సమస్య పరిష్కారమవుతుంది” అన్నాదు రాగాలు తీస్తూ.
“ఆయనెక్కడుంటాడు?”
“బీవుడి పట్నం దారిలో, సాక్షాత్తు దేవుడాయన”.
ఈశ్వరి పర్సులో డబ్బు చూసుకుని ఆటో ఎక్కింది. యాంత్రికంగా వెళ్తున్నదన్నమాటే కాని మనసంతా గందరగోళంగా వుంది. ఈ సాముల్ని నమ్ముతున్నదేంటి తనింత చదువుకుని. వీళ్లలో చాలా మోసగాళ్లుంటారంటారు. బాంక్‌లో డబ్బు పోతే తనేం చేస్తాడు” వెయ్యి అనుమానాలతో మర్రిచెట్టు దగ్గరికి చేరుకుంది.
అక్కడ ఓ పాతిక ఆటోలున్నాయి. రెండు మూడు పందిళ్లు వెలిసేయి. జనం గుంపులు గుంపులుగా వచ్చి ఓంకారస్వామిని దర్శించి వెళ్తున్నారు.
ఇద్దరు ముగ్గురు వాలంటీర్లు, మంచినీళ్లు పోసేవారు, సోడా కొట్టులు, స్వామి తాయెత్తులు ఇచ్చేవాళ్లు, స్వామి పటాలు అమ్మేవాళ్లు, అదొక తీర్థంలా అనిపించింది ఈశ్వరికి.
టికెట్టు కొనుక్కుని కొబ్బరికాయ, పూలు తీసుకొని తన వంతు వచ్చేక లోనికెళ్ళింది ఈశ్వరి. “స్వామి ఎక్కువగా మాట్లాడరు. వెంటనే నీ సమస్య చెపుకో. పరిష్కారం చెబుతారు” అంది ఒకావిడ.
ఈశ్వరి ఆకుపచ్చ డ్రస్సులో వున్న ఆయన కాళ్లకి మొక్కింది. ఆయన తలంతా నిమిరేరు.
ఈశ్వరి దూరంగా జరిగి “బాంక్‌లో పని చేస్తున్నాను. డబ్బు పోయింది. నా మీద పెట్టేరు. నాకేం తెలియదు” అంది.
అలా చెబుతున్నప్పుడు కళ్ళు ఆత్మాభిమానంతో వర్షించేయి.
ఓంకారస్వామి చిరునవ్వు నవ్వేడు.
ఈశ్వరి అర్ధం కానట్టు చూసింది.
“గత జన్మ బంధం గట్టిగా పట్టుకొని లాగుతుంది. నీ జాడ కోసం నీ భర్త పూజలు చేస్తున్నాదు. రెండ్రోజుల్లో నీ దగ్గరకో మనిషొస్తాడు. వచ్చి నువ్వడక్కుండానే డబ్బిచ్చి వెళ్తాడు. అతనే నీ భర. కానుకో!” అన్నాదు.
ఈశ్వరి అతనివంక అయోమయంగా చూసి “నాకు పెళ్ళయింది. ఇద్దరు పిల్లలు. ఇతను నా భర్తేంటి?” అంది.
ఓంకారస్వామి ఫక్కున నవ్వేడు.
“నే మాట్లాడేది పూర్వజన్మ గురించి. పూర్వజన్మలో నీ భర్త నిన్ను చాలా ప్రేమించేడు గాని పైకి పట్టించుకునేవాడు కాదు. దాంతో నువ్వు నీ ఇంటి పెంపుడు కుక్కని బాగా చేరదీసేవు. అది నిన్ను ప్రేమించింది. వచ్చే జన్మలో నీ భర్త కావాలని ఆశించింది. ఫలితంగా నీ మేనమామ నీ భర్తయ్యేడు. ఇప్పుడు నీ అసలు భర్తకి తన పూర్వజన్మ గురించి తెలిసి నీకోసం తిరుగుతున్నాదు. నిన్నేవిధంగా గుర్తుపట్టాలో తెలియక అవస్థ పడుతున్నాడు. రెండ్రోజుల్లో నువ్వు తప్పు లెక్కపెట్టి ఎక్కువ ఇచ్చిన డబ్బు తీసుకొచ్చినవాడే నీ భర్త!”
ఓంకారస్వామి మాటలకి తల తిరిగిపోయింది ఈశ్వరికి. అతను చెప్పిన ఒక్క మాట కూడా నమ్మబుద్ధి కాలేదు. జన్మలేమిటీ, కుక్కలేవిటీ. అంతా కట్టుకథ. అని విసుక్కుంటూ బయటకొచ్చేసింది.
ఓంకార స్వామి మాత్రం చిద్విలాసంగా నవ్వి కళ్లు మూసుకున్నాడు.

*******
లిఖిత ఎక్కిన కొచ్చిన్ ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్ స్టేషన్ వదిలి అతివేగంగా ముందుకి పరుగెడుతోంది. ఆమె ఆలోచనలతో పోటీ పడుతూ. తను చాలా దురదృష్టవంతురాలు. తండ్రి వుండి కూడా అతని ప్రేమకి దాదాపు తండ్రి లేనట్లుగానే బ్రతికింది.
అకస్మాత్తుగా తన తండ్రి బ్రతికే వున్నాడని, అదీ అతనొక గొప్ప సైంటిస్టని తెలిసి తన మనసు ఉప్పొంగిపోయింది.
అతను కృతకృత్యుడు కావొచ్చు… కాకపోవచ్చు. కాని మనిషి జీవితంలో ఆఖరి విషాద ఘట్టమైన మృత్యువుని ఒక పెన్సిల్ గీతలా తుడిచేయాలని అతని స్వమకాల్ని, సంసారాన్ని దూరంగా నెట్టి తన జీవితాన్నే పణంగా పెట్టి ఒక ఘోర తపస్సులా నిరంతర కృషి చేసేడు.
కాని ఇపుడు అంత చదువుకున్న మనిషి.. అన్నీ తెలిసిన శాస్త్రవేత్త ఒక అతి సామాన్యుడిలా మాయలు, మంత్రాలతో మరణాన్ని అరికట్టాలనే విశ్వప్రయత్నంతో ఏ చదువూరాని వ్యక్తుల చేతుల్లో ఇరుక్కోబోతున్నాడు.
దీని అజ్ఞానమనాలా, అతి తెలివనాలా?
బహుశ మనిషి తన ప్రయత్నాల్లో అపజయం ఎదురై కృంగిపోయినప్పుడే తన మీద తనకి నమ్మకం పోయినప్పుడే జాతకాల్ని, బాబాల్ని, మాయల్ని, మంత్రాల్ని నమ్ముతాడేమో! శారీరకంగా మనిషి బలహీనంగా వున్నప్పుడే రోగాలు మన శరీరంలోకి తేలిగ్గా ప్రవేశించినట్లుగా మానసికంగా బలహీనులైన మనుషుల్నే ఈ మోసగాళ్ళు వశం చేసుకుంటారు.
“టికెట్ ప్లీజ్!” అనగానే లిఖిత ఈ లోకంలో కొచ్చి బాగ్‌లోంచి టీకెట్ తీసి టి.సి. కి అందించింది.
టి.సి సైన్ చెసి పక్క బెర్తుల వాళ్ల టికెట్స్ చెక్ చేస్తున్నాడు. ఆ బెర్త్ చివరికి వున్న కోయదొరని కూడా టికెట్ అడిగేడు యధాలాపంగా టి.సి.
“మాకు టికటేంటి దొరా.. లోకమంతా ఏకం చేసి తిరిగేటోల్లము” అన్నాడు కోయదొర నవ్వుతూ.
“నువ్వే లోకాలన్నా తిరుగు టికెట్టు కొని. లేకపోతే వచ్చే స్టేషన్‌లో దిగిపో” అంటూ ముందుకు సాగిపోయాదు టి.సి.
“సార్‌కి ముక్కుమీదుంది కోపం. మనసు మాత్రం ఎన్నపూసె. పెట్టల పెళ్ళిగాక దిగులేసుకున్నాడు.” అన్నాడు కోయదొర వెళ్తున్న టి.సి వైపు చూస్తూ.
వెంటనే అతని పక్కన కూర్చున్న వ్యక్తి కోయదొరతో మాటలు కలిపేడు.
“ఏ వూరు మీది?”
“ఖమ్మం దగ్గర”
“మీకివన్నీ ఎలా తెలుస్తాయి?”
“చెప్పకూడదు దొరా. చెబితే తల్లి పల్కదు”
“తల్లెవరు?”
“సమ్మక్క మా కులదేవత. మొన్నమాసకి వెయ్యి కోళ్ళు, వెయ్యి మేకపోతులు బలిచెసి రక్తం లేదూ, రక్తంతో అమ్మకి తానం జేయించేం. తానమంటె ఏంటనుకున్నావు. మీరు గుళ్లలో పాలతో జెయ్యరూ అభిషేకమని గట్లే మేమూ రక్తంతో జేస్తాం. గూడెంలో పిల్లా పాపా భయం లేకుండా జూస్తారు. ఇంక చాల చేస్తంలే. అవన్నీ జెప్పకూడదు. చెబితే పవర్ బోతది”
“అయితే నా చెయ్యి జూడు” అంటూ అతను తన చేతిని అందించేడు.
“చెయ్యి తిరగదిప్పు”
అతను వెనక్కి తిప్పేడు.
“కోయదొరలు రేకలు జూసి జెప్పరు. మణికట్టు ఎనక భాగంలో మాకు మీ జాతకం గీత గీసినట్లుగా కనిపిస్తుంది. కంచి కామాక్షి, మధుర మీనాక్షి, కాశీ ఇసాలాక్షి, కోనలపాడు సమ్మక్క మీన ఆన. నీకిద్దరు పెట్టలు ఒక పుంజు.. అర్ధం కాలే..” అన్నాడు.
“లేదయ్యా నాకు ఒక కూతురు.. ఒక కొడుకే.”
“అది నిజమే. నే జెప్పేది నీ చేతిలో వున్న సంతానం. నువ్వు బలవంతంగా కత్తిరేసి కనకపోతే నేనేం జేస్తాను”
అతను అవునన్నట్లుగా ఒప్పుకొని నవ్వాడు.
“పెట్టకి అక్షింతలేద్దామని అదే మ్యారేజి చెయ్యాలని తన్నుకులాడుతున్నవు. సంబంధాలొస్తున్నాయి గాని. కారణం లేకుండానే పుటుక్కుమని తుస్సుమంటున్నాయి. పెట్ట దిష్టి నీళ్లు తొక్కింది. అందుకే నువ్వు తలపెట్టిన పని జరగడంలేదు. సమ్మక్కని నమ్మితే ఒక పూజ చెసి తాయెత్తిస్తా. ఏంటి నమ్ముతావా?” అన్నాడు కోయదొర.
అతను సందిగ్ధంగా చూసేడు.
మనసులో పూజ చెయించుకోవాలని వున్నా చుట్టూ జనం ఏమనుకుంటారోనని కొద్దిగా సిగ్గు పడుతున్నాడు.
అదే బెర్తు మీద శబరిమలై వెళ్టున్న అయిదారుగురు అయ్యప్ప స్వాములున్నారు.
“చేయించుకోండి. వాళ్లకి చాలా మహిమలుంటాయి. ఇందులో పోయేదేముంది?” అన్నారు వాళ్లు. వాళ్లకి ఆ దూర ప్రయాణంలో కాస్త కాలక్షేపం కావాలి.
కోయదొర సంచిలోంచి ఒక ఫైలు తీసి బెర్త్ మీద పెట్టి తెరిచేడు. అందులో దుర్గాదేవిలాంటి ఆకారంలో ఒక ఫోటో వుంది. దాని మీద పసుపు, కుంకుమలు జల్లి వున్నాయి.
“అమ్మకి దణ్ణం పెట్టుకో . నమ్ముతాను తల్లి అను” అన్నాడు.
అతనలాగే అని దణ్ణం పెట్టుకున్నాడు.
వెంటనే కోయదొర జోలెలోంచి ఒక చిన్న చెక్కపీటలాంటిది తీసి దాని మీద ఆముదం రాశాడు. దాని మీద ఒక రాగి బిళ్ల వుంచి దానిపై కర్పూరపు బిళ్లలు , కేరం బోర్డు కాయిన్స్‌లా పేర్చేడు. వాటిని అగ్గిపుల్లతో వెలిగించేడు. జ్యోతి దేదీప్యమానంగా వెలుగుతోంది.
“సరిగ్గా జ్యోతివైపే చూడు. చెంపలు వాయించుకో. సమ్మక్కని తల్చుకో” అన్నాడు అతన్ని కంగారు పరుస్తూ.
అందరూ రెప్పవేయకుండా జ్యోతినే చూస్తున్నారు.
లిఖిత కూడా తాత్కాలికంగా తన తండ్రి గురించి మర్చిపోయి జ్యోతి వంకే ఆసక్తిగా చూసింది.
ఆశ్చర్యంగా జ్యోతి నడవడం ప్రారంభించింది.
“ఏం జరుగుతోంది?” అన్నాడు కోయదొర.
“జ్యోతి నడుస్తోంది” అన్నారంతా ముక్తకంఠంతో.
“నిజవేనా?”
“నిజమే,.”
“సమ్మక్కని నమ్ముతారా?”
“నమ్ముతాం”
“నీ పెట్టకి పెళ్ళికొడుకు జ్యోతి నడిచిన వైపునుండి వచ్చె మాఘమాసం లోపు నొస్తాడు. ఈ పూజ పదకొందువేలకి చేస్తాను. నువ్వు చిక్కుల్లో వున్నావు. వెంటనే వెయ్యి నూటపదార్లు పెట్తు. సమ్మక్కకి జాతర చెయిస్తాను” అన్నాదు కోయదొర దదదడా ఫైలు మీద కొడుతూ.
అతని గుండె గుభేలుమంది.'”అంతా?” అన్నాదు బాధగా.
“బేరాలాడకు తల్లిక్కోపమొస్తుంది. రోజులు బాగుంటే వచ్చే యీనాటికి లక్షలు జూస్తావు. దొంతర్లు దొంతర్లేరుకుంటావు డబ్బు” అన్నాడు కోయదొర.
అతను జేబులు తడుముకొని “అయిదొందలుంచు. ప్రయాణంలో వున్నాను. ఇదిగో నా విజిటింగ్ కార్డు. మా యింటికి రా. నువ్వడిగినంతా యిస్తాను” అన్నాడు బ్రతిమాలె ధోరణిలో.
కోయదొర అయిష్టంగానే అయిదొందలు తీసుకొని “సరే! శబరిమలై అయ్యప్ప దర్శనం తర్వాత తిరిగొస్తా. పిల్ల పెళ్లి కుదిరితే అయిదు వేలివ్వాలి. ఇస్తావుగా?” అన్నాడు.
అతను సరేనని తలూపేడు.
జ్యోతి నడవడంతో అందరికీ అతనిమీద చెప్పలేని గురి కుదిరింది.
అతని దగ్గర నిజంగానే మహత్తుందని నమ్మి తమ తమ బాధలు చెప్పుకోసాగేరు. అందులో టి.సి కూడా చేరేడు.
ప్రతి మనిషికి రకరకాల అనుమానాలు.. ఆశలు.
వాళ్ల వాళ్ల సైకాలజీని స్టడీ చేస్తూ వాళ్లాశించేది ఫలానా పూజ చేస్తే జరుగుతుందని అతను చెబుతున్నాడు. వాళ్లందరూ గొర్రెల్లా తలలాడిస్తున్నారు. చిత్రమేమిటంటే వారిలో డాక్టర్లు, ప్లీడర్లు, జర్నలిస్టులు, వ్యాపారస్థులూ అందరూ వున్నారు. అయ్యప్ప దీక్షలో ఉన్న ఒక జర్నలిస్టు తన దగ్గరున్న కెమెరాతో కోయదొర ఫోటో తీసి అతన్ని ఇంటర్వ్యూ చేసేడు. తను పని చేస్తున్న ఒక దినపత్రికలో ప్రచురించేందుకు.
టి.సి అతనికి ప్రత్యేకమైన బెర్తు కేటాయించేడు టిక్కెట్టు లేకుండానే.

(సశేషం)

బ్రహ్మలిఖితం 6

రచన: మన్నెం శారద

భగవంతుడు దుష్టులకెన్నడూ సహాయపడడని.. తాత్కాలికంగా కనిపించే విజయాలన్నీ తర్వాత శాపాలై వంశపారంపర్యంగా తింటాయని అతను గ్రహించే స్థితిలో లేడిప్పుడు. అదతని దురదృష్టం.
*****
లిఖిత ఎంతో అవస్థపడి హైద్రాబాదు చేరుకుంది. తల్లి ఇచ్చిన ఎడ్రస్ ప్రకారం ఆమె ఎలాగోలా జుబ్లీహిల్స్‌లోని కేయూర లాబరేటరీస్‌కి చేరుకుంది. అంతవరకు ఆమె పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలేదని ఆమెకి గుర్తు కూడా లేదు.
ఆమెకు ఆకలి, దాహం అన్నీ తండ్రిని చూడాలన్న ఆరాటంలోనే కలిసిపోయాయి.
దూరం నుండే కనిపిస్తున్న తల్లి పేరు చూసి ఆమె హృదయం ఆర్ద్రమైంది.
తల్లి మీద అతనికి ప్రేమ లేకపోతే ఆ పేరెందుకు పెడతారు. ఒక అవిరామ కృషిలో అతను బాంధవ్యాలు తెగ త్రెంచుకొని అంకితమైపోయేరు. అంతే” అనుకుంది మనసులో.
ఇంకొన్ని సెకండ్లలో తన తండ్రిని చూడబోతున్నానన్న ఆనందం ఆమెను ఉక్కిరిబిక్కిరి చేసింది.
గబగబా గేటువేపడుగులు వేసింది.
అక్కడంతా నిర్మానుష్యంగా వుంది. గేటుకి తాళం వేసుంది. లిఖిత హతాశురాలయి బాగ్‌ని క్రిందపెట్టి దిక్కులు చూసింది.
అడగటానిగ్గాని.. చెప్పడానిగ్గాని అక్కడసలెవరూ లేరు.
ఎలివేటెడ్ లాండ్ కావటాన చలిగాలి జివ్వున మొహానికి తగులుతోంది.
ఆర్కిటెక్ట్స్ తమ నైపుణ్యాన్నుపయోగించి కట్టిన అందమైన బిల్డింగ్స్ షోకేసులలోని కేకు ముక్కల్లా తళుక్కుమంటున్నాయి. కాని ఆ అందాల్లో ఏదో లోపముంది. జీవచైతన్యం లేదు వాటిల్లో. అలికి ముగ్గేసిన ఒక వూరి గుడిసెకున్న కళ కూడా వాటికి లేదు. కారణం మనిషి నానాటికి కోల్పోతున్న సంఘీభావమే. మనిషి తన సుఖాన్ని యంత్రంలా డబ్బు సంపాదించడంలోనే చూసుకొని ఆనందపడుతున్నాడు. వందలుంటే వేలు, వేలు, లక్షలు, కోట్లు కావాలని అంచులేని తీరాన్ని అందుకోవాలని ఆరాటపడుతున్నాడు. అందుతున్న ఆనందాల్ని కాలదన్నుతున్నాడు. గమ్యం లేని పరుగుతీస్తున్నాడు. అందుకే అతని ఆర్జనకి అందం లేదు. ఆ అందానికి కళ లేదు.
ఎన్నో ఖరీదైన కార్లు ఆ రోడ్డువెంట పరిగెడుతున్నాయి. కాని ఏ ఒక్కరూ ఒక ఆడపిల్ల ఎడ్రస్ దొరక్క నిలబడి వుందేమోననిగాని, లిఫ్ట్ కావాలని గాని ప్రశ్నించలేదు. కళ్లకి, కార్లకి కూలింగ్ గ్లాసెస్ బిగించి కృత్రిమంగా సృష్టించుకున్న చీకటిలో పరుగులు పెడ్తూనే వున్నారు.
లిఖిత అలాగే నిస్పృహగా చూస్తూ నిలబడింది నిస్సహాయంగా.
“ఏ అమ్మా! కౌన్ హోనా ఆప్‌కో?”
ఆ ప్రశ్నకి ఉలిక్కిపడీ చూసింది లిఖిత.
గూర్ఖా వాచ్‌మన్ బిల్డింగ్ వెనుకనుండి వస్తూ అడిగేడామెను.
ఆమెకి ప్రాణం లేచొచ్చినట్లయింది.
“కార్తికేయన్ సైంటిస్టు” అంది.
” ఓ షెహర్ మే నై!. బాహర్ గయే!” అన్నాడతను.
లిఖిత ఒక్కసారిగా పాతాళంలోకి కూరుకుపోయినట్లు ఫీలయింది.
“ఏ ఊరో తెలుసా?”
అతను గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించినట్లు గడ్డం గీక్కుంటూ”ముజ్‌కో నహీ మాలూం. మీనన్ సాబ్‌కో పూచో” అన్నాడు.
ఎక్కడుంటారాయన?”
గూర్ఖా వేలుపెట్టి దూరంగా చూపించాడు.
“ఓ పింక్ బిల్డింగ్. ఉదర్ జావో”
అక్కడ రకరకాల సైజుల్లో చాలా పింక్ బిల్డింగ్స్ ఉన్నాయి.
అయినా తన ప్రయత్నం తాను చెయ్యడానికి అటువైపు సాగిపోయింది.
తండ్రిని సకాలంలో చూడలేకపోయేనన్న వేదన రెండు కన్నీటి బిందువులుగా మారి ఎంత ఆపుకున్నా ఆగక ఆమె బుగ్గల మీదకి జారిపోయింది.
*****
నల్లని నైలాను దారాలతో అల్లిన దోమతెరలా చీకటి ఆకాశం నుండి జారుతూ భూమిని కప్పుతోంది.
పడమట సూర్యుడు నిష్క్రమించిన ఛాయల్ని చూపుతూ భూమికి, ఆకాశానికి మధ్య ఒక చిన్న అస్పష్టమైన రేఖ కనబడుతూనే వుంది.
విశాఖపట్నంలోని మాహారాణీ పేట అవతల వున్న పేదవర్గపు ప్రపంచంలోకి అడుగుపెట్టేడు రాజుతోపాటు నారాయణ.
నేల మీద బోర్లించిన ఒక పెద్ద కోళ్ళ గంపలా వుందతనిల్లు.
“నువ్విక్కడే కూర్చో” అని గుడిసె ముందున్న చిన్న విరిగిన బెంచి చూపించి, చిలక పంజరాన్ని తీసుకొని లోపలికెళ్ళేడు రాజు.
నారాయణ తటపటాయిస్తూ ఆ బెంచి మీద కూర్చున్నాడు.
కీచుమంటూనే నారాయణ బక్క శరీరాన్ని మోయడానికంగీకరించింది బెంచ్.
అయితే గరిమనాభి లేనట్లుగా వూగుతోన్న ఆ బెంచి మీద కూర్చోవడానికి నారాయణ చాలా అవస్థ పడుతున్నాడు.
జైలుకి వెళ్ళేముందు తను చేసుకున్న ఆఖరి పెళ్లి గుర్తొచ్చింది అతనికి.
ఏం వైభోగం! ఏం మర్యాద!
పెళ్ళికూతురు అతిలోక సుందరి కాకపోయినా అనాకారి మాత్రం కాదు.
“మా చెల్లెలు ఎం.ఏ మూడుసార్లు చదివింది” అన్నాడు పెళ్ళికూతురు అన్న గర్వంగా.
“ఏం ఫెయిలయిందా పాపం?” అని తనన్న మాటలని వాళ్లు హాస్యంగా తీసుకొని తెగ నవ్వేరు.
“ఇంజనీరింగ్ చదివి ఏం తెలీనట్లడుగుతున్నారు. మా చెల్లి ఒకసారి సోషియాలజీతో, మరోసారి సైకాలజీతో, ఇంకోసారి ఫిలాసఫీతో పాసయింది. ఇంత చదివినా దానికి గర్వమనే పదానికి అర్ధం తెలీదు. ఏంటొ పెళ్ళే ఎంతకీ కుదర్లేదు” అన్నాడు పిల్ల బావగారు
“ఆలస్యమైనా మాంచి కుర్రాడు దొరికేడు. మా మనవరాలిది అదృష్ట జాతకమే బాబూ. దాని పేరన పదెకరాల మాగాణి వుంది. వంద తులాల బంగారముంది. మంచి ఉద్యోగం చేస్తుంది. తెలిసీ తెలియని వయసులో ఒక ముదనష్టపు పెళ్లి చేసేం. వాడు శోభనం జరక్కుండానే పుటుక్కుమన్నాడు. అడ్డుపుల్లలేసేందుకే అయిన వాళ్లున్నారు. తెలిసినవారెవరూ దీనికి సంబంధాలు రాకుండా చేసేరు చుట్టాలు. ఇన్నాళ్లకి నువ్వొప్పుకుని దాని మెడలో మూడు ముళ్ళేసేవు. చల్లగా నూరేళ్ళు కాపురం చెయ్యండి” అంది అమాయకంగా పిల్ల నాయినమ్మ.
పేపల్రో ప్రకటన చూసి ఆ పిల్లనెందుకిచ్చి చేసేరో తనకర్ధమయింది.
పెళ్ళికూతురు అన్న మాత్రం పోయే ప్రాణం గొంతులో అడ్డం పడ్డట్లుగా చూశాడు తనవైపు.
“వెంటనే తను చిరునవ్వు నవ్వి లేచి బావమరిది భుజం తట్టి “నాకేదో తెలిసిపోయిందని మీ అమ్మాయిని వదిలేస్తానేమోనని బాధపడకండి. నాకిలాంటి మూర్ఖపు ఆలోచనలు లేవు. మీ అమ్మాయిని బంగారంలో పెట్టి చూసుకుంటాను” అన్నాడు సదరు పిల్ల వంటిమీద నగల్ని తలచుకుంటూ.
పిల్ల అన్న తన చేతులు పట్టుకున్నాడు ఆనందభాష్పాలతో. అంతా బాగానే జరిగిపోయింది.
రాజస్థాన్‌లో తన ఆస్తుల గురించి సింగపూర్‌లో తన షేర్లు గురించి చెప్పీ చెప్పనట్లు నిగర్వంగా అప్పుడో మాట, ఇప్పుడో మాటగా సాదాసీదాగా అన్నాడతను.
పెళ్ళికొడుకు నిరాడంబరుడని పెళ్ళికొచ్చిన వాళ్లందరూ చెప్పుకుని పొగుడుతుంటే విననట్లుగానే విన్నాడు.
పెళ్ళయిన మర్నాడు సినిమాకని బయల్దేరితే దారిలో కారాపింది పెళ్లికూతురు.
“నా వాచీ బాగా లేదు. కొత్తది కొనిపెట్టండి”అంది సరదాగా. జేబులో రూపాయి లేకపోయినా నవ్వుతూ షాపులోకెళ్ళేడు. అవీఇవీ తిరగేసి “ఈ ముష్టి ఇండియా వాచీలెందుకు, వచ్చేనెలలో సింగపూరెల్తాగా. తెస్తాలే” అన్నాడు.
ఆ అమ్మాయి అంగీకరించింది.
ఇద్దరూ కారెక్కేసి వెళ్ళిపోయేరు.
పదహార్రోజులు తనని నేల మీద నడవనివ్వలేదు. ఒకటే మర్యాదలు. విందు భోజనాలు. సరదాలు, సంతోషాలు.
ఆ మర్నాడే పెళ్లికూతురి బంగారం పట్టుకుని పారిపొవాలని ప్లాను చేస్తుండగా తన దురదృష్టం పండి పెళ్లికూతురి స్నేహితురాలు శైలజ వచ్చింది.
పెళ్లికి రాలేకపోయినందుకు విచారిస్తూ ఆవిడ మాకు కంగ్రాచ్యులేషన్స్ చెప్పి తన వైపు నవ్వుతూ చూసిందల్లా షాక్కొట్టినట్లయిపోయి “మీరేంటి?” అంది.
“వెంకటేశ్వరరావు” అన్నాడు తను తడుముకుంటూ.
“ఇది నీ కొత్త పేరా?” అడిగిందావిడ వెటకారంగా.
తనకి గొంతులో తడారిపోతున్నది. కొంపదీసి ఈవిడ గతంలో తను చేసుకున్న వాళ్లలో ఒకర్తి కాదు కదా. అనుకుంటున్నాడు భయంభయంగా.
“వీడు పెద్ద చీట్. వీడు రకరకాల పేర్లతో చాలామందిని పెళ్లిచేసుకొని ఆనక పెళ్లికూతురి నగలు కాజేసి ఉడాయిస్తాడు. గుంటూరులో నాజ్ థియేటర్ దగ్గర కల్యాణమంటపంలో ఒక అయినింటి పిల్లని పెళ్లి చేస్కుంటుంటే వీణ్ణి అరెస్ట్ చేసి జైలుకి పంపేను. రిలీజయ్యేడో లేదో వీడు మళ్లీ మీకు టోపీ పెట్టేసేడు” అంది శైలజ.
అప్పుడర్ధమయింది తనకి అవిడ ఆ రోజు తనని అరెస్టు చేసిన పోలీసాఫీసరని.
వెంటనే పెళ్ళిల్లు శవం వెళ్లిన యిల్లులా తయారయింది.
ఏడుపులు.. మొత్తుకోళ్ల మధ్య శైలజ ఫోను చెయ్యగానే పోలీసులొచ్చి తనను అరెస్టు చేసి పట్టుకుపోయేరు.
ఈసారి జైల్లో పోలీసులు తనని కుళ్ళబొడిచేరు.
ఆరోగ్యం చెడింది.
“ఏరా పెళ్లికొడకా! నీ మొహం అద్దంలో చూస్కోరా ఒకసారి. వెళ్లి మళ్లీ పెళ్ళి చేస్కుంటావురా బాడ్కో!” అంటూ పచ్చి బూతులు తిట్టి బూట్ల కాళ్లతో తన్నేరు.
అంతమంది పెళ్లికూతుళ్ల శాపాలు తగిలి పాపాలు పండినట్లుగా తనకి టి.బి. వచ్చింది. ఆ జబ్బుతో బాధపడుతున్నా పోలీసులు జాలి చూపించలేదు. మందిప్పించి మరీ తన్నేవారు.
ఎలాగో జబ్బు నయమైంది కాని పీనుగ రూపు పోలేదు. తనకి మరో వ్యాపారం, మోసం తెలీదు. ఇది తప్ప. కాని తన రూపం చూసి పిల్లనెవరూ ఇవ్వరు. ఏం చేయాలి తనిప్పుడు.
“ఏంటంత తీవ్రంగా ఆలోచిస్తున్నావు?” అనుకుంటూ రెండు ముంతలు తీసుకొని బయటకొచ్చేడు రాజు.
“ఏం లేదు.” అని ఈ లోకంలోకొచ్చి ముంతలకేసి చూస్తూ “ఏంటది?” అన్నాదు నారాయణ.
“సీసాలో ఉంటే బ్రాందీ, పేకట్‌లో వుంటే సారా, ముంతలో వుంటే కల్లు. తాగు” అంటూ ఒక ముంత నారాయణ కందించేడు రాజు.
చాలా రోజుల తర్వాత అలాంటి ద్రవం కనిపించటంతో ప్రాణం లేచొచ్చినట్లయింది నారాయణకి.
ముంతెత్తుకుని గడగడా తాగేసి “చాలా బాగుంది. ఏ కల్లిది?” అనడిగేడు.
“ఈతకల్లు. సరేగాని అలా గబగబా తాగేసేవేంటి.. నా పెళ్లామింకా కబాబులే తేలేదుగా..”అనడిగేడు రాజు అతని వంక ఆశ్చర్యంగా చూస్తూ.
నారాయణ సిగ్గుపడుతూ”ఇంకో ముంత తెప్పించరాదూ!” అనడిగేడు ఆశగా.
“దాందేవుంది. కాని, ఆ కల్లుకొట్టు నా పెళ్లాంది. అది రూపానికే కాదు గుణానిక్కూడా కీలుగుర్రంలో రాక్షసిలాంటిది. పైగా చెప్పలేని గర్వం. దాని బాబుకి ఇలాంటివి రెండు గుడిసెలున్నాయి.
పెళ్లికి నాకో వందరూపాయల కట్నం, రెండు పందులు, ఒక టెర్లీన్ చొక్కా కొనిపెట్టేడు. దీనికో నాలుగు ఈత చెట్లున్నాయి. అందుకే నన్నిది పురుగులా చూస్తది. సాయంత్రం నే తెచ్చిన చిల్లర లెక్కెట్టుకునే కల్లు పోస్తది”
అతని మాట పూర్తవుతుండగానే రయ్యిమంటూ రాజు పెళ్లాం కబాబులు తీసుకొని అక్కడికొచ్చి “ఈడెవడు?” అంది నారాయణని సీరియస్‌గా చూస్తూ.
“నాక్కావల్సినోళ్ళే. ఎల్లి ఇంకో ముంత కల్లిప్పించు” అన్నాడు రాజు గాంభీర్యంగా.
“ఏంటి ఇంకో ముంత కల్లా! తా దూర కంతలేదు మెడకో డోలంట. నువ్వు తాగిందే దండగ. బయటకి నడవండి” అంది కస్సున తోకమీద లేచిన త్రాచులా.
ఎన్నో వెధవ పనులు చేసిన నారాయణ కూడా ఆవిడ గొంతువిని అకారం చూసి అదిరిపడ్డాడు.
ఆవిడ నిజానికి చూడగానే బ్రహ్మరాక్షసిలా గోళ్ళూ, పళ్లతో లేదు.
సాదా నలుపు, సన్నం, గూళ్లెత్తు.. మామూలుగానే వుంది.
కాని ప్రత్యేకంగా ఆ మొహంలో ఎక్కడో చెప్పలేని ఒక హీనాతినీనమైన కళ వుంది. దుర్భర దారిద్యం చూపెత్తినట్లుగా కట్టగట్టుకు తరుముకొస్తాయనిపించింది. ఇలాంటి స్త్రీని రాజు పాపం ఎలా పెళ్లి చేసుకున్నాడో~” అని కొద్దిగా విచారించేడు కూడ.
రాజు లేచి ఆవిణ్ణి పిలిచి “ఊరికే అరవకు. అతను బాగా డబ్బున్న మారాజు. ఇద్దరం కలిసి ఓ వ్యాపారం పెట్టాలనుకుంటున్నాం” అన్నడు.
“డబ్బున్న మారాజుకి నీతో ఏంటి పని?” అందావిడ కోపంగా.
“సవాలక్షుంటాయి. డబ్బున్నోళ్లకి బుర్ర వుండదు. అందుకే నా దగ్గర కొచ్చేడు. నువ్వెళ్లి ఇంకో ముంత కల్లు పంపించు. మన పని సజావవుతుంది9” అన్నాడు.
ఆవిడ తలూపి లోనికెళ్లింది.
ఇంకాస్సేపటిలో ఆవిడ మరో ముంతకల్లు తెచ్చిపెట్టి వెళ్లింది.
ఆవిడ వెళ్తుంటే “సంపెంగీ!” అని పిలిచేడు రాజు.
సంపెంగి వెనుతిరిగి “ఏంటింకా?” అంది చిరాగ్గా.
“ఇంకో రెండు కబాబులు కూడా”
సంపెంగి లోనికెళ్లిపోయింది.
నారాయణ తెల్లబోయి చూస్తుంటే “ఏంటలా అశ్చర్యపోతున్నావు?” అనడిగేడూ రాజు నవ్వుతూ.
నారాయణ తేరుకుని “ఊహూ.. ఏం లేదు”అన్నాడు మొహమాటంగా.
“నువ్వు చెప్పకపోయినా నేనర్ధం చేసుకోగలను. రోజూ నా దగ్గరకొచ్చే జనాన్ని ఎంతమందినో చూస్తుంటాను. మొహాల్ని చూసి వాళ్ల భావాలు కనిపెట్టే తెలివి నాకుంది. దరిద్రపు పెద్దమ్మలా వున్న నా పెళ్లానికి సంపెంగి పేరేవిటా అని కదూ! ఇదే సందేహమొచ్చి నేను నా మావనడిగేను. ఈ పేరెందుకు పెట్టేవని ఆయన పెద్ద వేదాంతిలా నవ్వి లక్ష్మిదేవిని దరిద్రురాలని పిలిచినా కళకళ్ళాడుతూనే వుంటది. ఇది భూమ్మీద పడగానే దాని తల్లి దీన్ని చూసి గుండె ఆగి చచ్చింది. మంత్రసాని మూర్చపోయింది. నేను కూడా దాన్నెత్తుకోటానికి ఝడుసుకున్నాను. కాని.. తప్పలేదు. రక్తసంబంధం. ఇక అందమెలాగూ లేదని పిలుచుకోటానికైనా బాగుంటుందని సంపెంగి పేరు పెట్టుకున్నాను.. అన్నాడు” అంటూ నవ్వాడు.
“మరి నువ్వెలా పెళ్లి చేసుకున్నావీవిణ్ణి?” జాలిగా అడిగేడు నారయణ.
“ఏం చేయను. నేను మరీ అతీగతీ లేనివాణ్ణి కాదు. మా నాన్న గవర్నమెంటాఫీసులో జవానుగా పని చేసేవాడు. ఆయన అకస్మాత్తుగా చచ్చిపోయేడు.వెంక మాకు ఆస్తి లేదు. నేను ఎనిమిదో తరగతి చదువుతున్నాను. గతిలేక వీళ్ల పేటలో వీళ్ళ గుడిసెకే అద్దెకొచ్చేం. నా చెల్లెలి పెళ్ళికోసం మా అమ్మ ఇతని దగ్గర అప్పు చేసింది. అప్పు తీర్చలేకపోయెం. ఇక తన కూతుర్ని పెళ్లి చేస్కుని తీరాలని పట్టుబట్టేడు మా మామ. తప్పించుకోలేని పరిస్థితిలో దీన్ని కట్టుకున్నాను. ఆ బెంగతోనే మా అమ్మ చచ్చిపోయింది. రోజంతా ఎంతో సంపాదిస్తాను. అంతా ఎలా ఖర్చయిపోతుందో తెలియదు. తెల్లారి పది పైసల బిళ్లుండదు” అన్నాడు రాజు విచారంగా.
నారాయణ కూదా దిగులుగా మొహం పెట్టి చూసాడు.
“సరే! మధ్యలో దాని సంగతి దేనికి. నాకో బ్రహ్మాండమైన ఉపాయం తోచింది. ఆ పని చేస్తే మనం ఆర్నెల్లలో లక్షాధికార్లమైపోవచ్చు” అన్నాడు రాజు సంతోషంగా.
“ఏంటది?”
రాజు నారాయణ చెవి దగ్గర చేరు గుసగుసలాడేడు.
అది విని నారాయణ ఉలిక్కిపడి “అమ్మా దొరికిపోయేమంటే సున్నంలోకి ఎముకుండదు” అన్నడు భయంభయంగా.
“దొరకడడమంటూ జరగదు. నా దగ్గరికి చదువుకున్న బడాబడా బాబులొస్తారు. వాళ్ల బలహీనతలు నాకు తెలుసు. ఇప్పుడు మనం చేసేది కొంచెం పెద్ద ఎత్తులో జరుగుతుంది. అహోబిలంలో నా తమ్ముడున్నాడు. వాడు మనకి కలిసొస్తాడు. నే చూసుకుంటాగా! నువ్వు నే చెప్పినట్లుగా చెయ్యి” అన్నాడు రాజు.
నారాయణ సందేహంగా చూసేడు.
రాజు ఫర్వాలేదన్నట్లుగా నవ్వేడు.
******
ఆ ఇల్లు నిశ్శబ్దాన్ని కూడా భరించలేనంత నిశ్శబ్ధంగా వుంది.
అక్కడ కట్టిన కట్టడాలన్నింటిలోనూ ఆ ఇంటికొక ప్రత్యేకత వుండటం గమనించింది లిఖిత.
ఆ ఇల్లు హిప్‌డ్ రూఫ్‌తో సాంద్రతతో కూడిన ఆకుపచ్చని చెట్ల మధ్య విరిసిన ఒకే ఒక రోజాపువ్వులా వుంది. ఆ ఇంటిని గమనిస్తే ఆ ఇంటి యజమాని అభిరుచి ప్రస్ఫుటమవుతుంది.
లిఖిత గేటు తెరవగానే గుబురుగా వున్న మామిడి చెట్టులోంచి ఒక కోయిల కూతకూసింది.
చెట్ల నిండా పేరు తెలియని రకరకాల పిట్టలు వాసాలు చేసుకొని ధీమాగా చిగుళ్ళు మేస్తూ, తోకలాడిస్తూ, కొమ్మకొమ్మకి రెక్కలు టపటపలాడిస్తూ ఉత్సాహంగా గెంతుతున్నాయి. ఉడుతలు కొన్ని ఆకలి లేకపోయినా చిలిపిగా జామపిందెలు కొరికి క్రిందపడేసి దొంగచూపులు చూస్తున్నాయి.
గేటు చప్పుడు విని ఒక తెల్లని పిల్లి మ్యావ్‌మంటూ ముందుకొచ్చి నిలబడి లిఖితని తేరిపార చూసింది.
గోడ ప్రక్కన గిన్నెలో పాలు తాగుతున్న పామరిన్ కుక్కపిల్ల కుయ్‌కుయ్‌మన్నట్లుగా తలెత్తి భౌభౌమంది.
దాని కళ్లు నల్లనేరేడు పళ్లలా మెరిసేయి. వాటిలో కాపల గుణంకన్నా స్నేహగుణమే మిన్నగా అనిపించింది.లిఖిత చెయ్యివూపి చిన్నగా నవ్వింది.
ఆ మాత్రానికే కుక్కపిల్ల స్నేహపాత్రంగా తోకాడించింది.

ఇంకా వుంది..