May 9, 2024

తెలుగు సాహిత్యంలో హాస్యం

మన ప్రాచీనాలంకారికులు చెప్పిన నవరసాల్లో హాస్యం కూడా ఒకటి. హాసం అంటే నవ్వు. ఆ నవ్వును పుట్టించేదే హాస్యం. నవ్వు నాలుగందాల చేటని కొందరు నీరసవాదులు నిరసించినా, నేడు “నవ్వు” అన్నదానికి, ఆరోగ్యానికి చాలా మంచిదని గుర్తించడం వల్లే చాలా ఊళ్లలో ‘హ్యూమర్ క్లబ్స్’ వెలిసాయి. పనిగట్టుకుని రోజూ గంటసేపు నవ్వడం ఆరోగ్యం కోసమే అని ప్రకటన ఇచ్చేవాళ్లు ఎక్కువయ్యారు. అయితే ‘అతి సర్వత్ర వర్జయేత్’ కాబట్టి అదుపాజ్ఞలు లేని నవ్వు కూడా సమర్ధనీయం కాదు. ప్రసన్నమైన చిత్తవృత్తిని ప్రకటించే చక్కని సాధనం నవ్వు. వాగ్గతమైన హాస్యం ఆరోగ్య ప్రదాయిని..

నవ్వించడమనేది సృజనాత్మక కళ. సంస్కారయుతమైన పదజాలంతో ఇతరులను నొప్పింపక తన వాక్చాతుర్యాన్ని ప్రదర్శించడం సామాన్యమైన విషయం కాదు. హాస్యం హృదయాల్ని తేలికపరుస్తుంది కాని దాని సృష్టి మాత్రం అంత తేలికకాదని ఒక ఆంగ్ల కవి ఇలా అన్నాడు. It lightens the heart, But the process to arrive at it requires serious thinking .

మనిషి జీవితం పుట్టుక నుండి చావు వరకు దుఃఖమే. అయితే అందులోనే తనకు కావలసిన ఆనందాన్ని వెతుక్కోవడానికి, పదిమందికి పంచడానికి మనిషి సాహిత్య సృష్టి చేసాడనుకోవచ్చు. ఈ ఆనందాన్వేషణ మనిషిని మిగిలిన జీవరాసులనుండి వేరు చేస్తోంది.

ఒక మహాకవి నవ్వు గురించి ఎంత అందంగా చెప్పాడో చూడండి.

“నవ్వవు జంతువుల్ నరుడు నవ్వును, నవ్వులు చిత్త వృత్తికిన్
దివ్వెలు కొన్ని నవ్వులెటు తేలవు . కొన్ని విష ప్రయుక్తముల్
పువ్వుల వోలె ప్రేమరసముల్ వెలిగ్రక్కు విశుద్ధమైన లే
నవ్వులు సర్వదుఃఖదమంబులు వ్యాఖులకున్ మహౌషధుల్. “

జంతువులనుండి మనిషిని వేరు చేసే ‘నవ్వు’ విషపూరితం కాకుండా పువ్వుల మృదువైన ప్రేమరసాన్ని అందించి దుఃఖాన్ని, రోగాన్ని ఉపశమింప చేయాలని కవి సూచన. అలాంటి నవ్వే చిత్తవృత్తికి దివ్వె అవుతుంది. గాంధీగారు కూడా “If I had no sense of humor, I would long ago have committed suicide” అన్నారు. నవ్వగలగడం ఒక వరం. ఒక ఐశ్వర్యం. అందుకే కీ.శే.జంధ్యాల

“నవ్వడం ఒక యోగం
నవ్వించడం ఒక భోగం
నవ్వలేకపోవడం ఒక రోగం “ అన్నారు.

“A man is not poor if he can still laugh” అంటాడు హిట్లర్.

“Though the room is big if there is no place to humor , we can say it is congested” అని ఇంగ్లీషులో ఒక వాక్యముంది.

వాసనలేని పూవులా పరిహాస ప్రసంగం లేని వాక్యం వ్యర్ధమన్నాడు ఒక తెలుగు కవి. హాస్యం ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చి విషాద విచ్చేధకమవుతుంది. రోజూ ఓ గంటసేపు నవ్వితే అమృతపానం చేసినంత ఫలితం.

“Humor cures the people – both the one who gives it and the one who receives it” అని ఇంగ్లీషులో మంచి వాక్యం కూడ ఉంది.

తనివితీరా నవ్వినప్పుడు, శ్వాసకోశమంతా ప్రాణవాయుమయమవుతుంది. అతికష్టమైన యోగాభ్యాసాన్ని నవ్వు ధర్మమా అని అతి సులువుగా చేయగలరన్నమాట.

అసలు “నవ్వంటే” నిర్వచనాన్ని ఒక మహాశయుడిలా చెప్పాడు. “ఎదుటి విషయంలోని వైషమ్యం వల్ల మనసుకు కలిగే ఆశ్చర్యాన్ని సమన్వయం చేసుకోలేని వేళ కండరాల బిగింపువల్ల అప్రయత్న నిర్బంధకంగా నోట్లోంచి వెలువడే నిశ్వాసమే “నవ్వు”

“అయ్యబాబోయ్! నిర్వచనం నవ్వుని మింగేస్తోంది”. కాని నవ్వడం చేతనైనపుడు అసలు నవ్వెలా వస్తోందో అంటే పై విధంగా అన్నమాట.

నవ్వులో చాలా రకాలున్నాయి. మన ప్రాచీనులు నవ్వు ఆరు రకాలుగా విభజించారు.
1.స్మితం
2.హసితం
3.నిహసితం
4. అవహసితం
5. అపహసితం
6. అతిహసితం

శ్రేష్ఠులకు స్మిత హసితాలు, మధ్యములకు నిహసిత, అవహసితాలు అధములకు అపహసిత, అతిహసితాలు అని కేటాయించారు. ధూషణ లక్ష్యంగా పెట్టుకోక, మర్యాద మరువక, శ్రుతి మించనీయక చేసే హాస్యమే నిజమైన హాస్యం.

అనేక గ్రంధాలలో పరిచయం, శబ్దార్ధాలపైన విశేషమైన అధికారం, విశిష్ట ప్రతిభ, అన్నింటికి మించి సమయజ్ఞత (Presence of mind) సమకూరితే తప్ప హాస్యరసాన్ని సర్వాంగ సుందరంగా ప్రదర్శించడం సాధ్యం కాదు. ప్రతి రసానికి ఒక రంగు ఉంటుంది.

హాస్యం రంగు తెలుపు. నవరసాల్లో నవనవలాడే నిత్యనూతనమైనది హాస్యమే. సుకుమారమైన హాస్యానికి పూర్ణాయుర్ధాయమే.

అయితే ఆంధ్ర సాహిత్యంలో ఈ హస్య రసం కవులచేత ఎంతవరకు గౌరవింపబడిందో స్థూలంగా దర్శిస్తే….

కీ.శే. ఆచార్య తూమాటి దోణప్పగారు “తెలుగు సాహిత్యంలో ప్రాచీన సాహిత్యపు పేరోలగంలో హాస్యరసానికి వేసిన పీట మాత్రం చాలా చిన్నది. ఆ రోజులలో వాళ్లు చాలా రసాలకు పట్టాభిషేకం చేసారు కాని హస్యం దాస్యం చేసింది. విధూషకులు, చెలికత్తెల ఆశ్రయంలో కాలం గడుపుతూ వచ్చింది. అయితే ఆంధ్రులు హస్యప్రియులు కారని గట్టిగా అనలేము. వదినా మరదళ్ల సరసాలు, పెళ్లిళ్లలో ఇరుపక్షాలవారి పరియాచకాలు … ఒకటేమిటి అడుగడుగునా, అనుక్షణమూ తెలుగువారి బ్రతుకుదారుల్లో హాస్యరసం జాలువారుతూనే ఉంది. తెలుగునాట వినోదాత్మక ప్రదర్శనల నిండా హస్యమే కనిపిస్తుంది” అంటారు.

తెలుగు సాహిత్యంలో తొలి తెలుగు రచన ఆంధ్రమహాభారతం.. కురువంశపు వీరులు, వారి చుట్టాలు, స్నేహితులు అందరూ గంభీరమూర్తులే. వారు నవ్వడం చాలా అపురూపం. కాగా భారతంలో మనం హాస్యరసాన్ని వెతుక్కుంటే అక్కడక్కడ దర్శనమిస్తుంది. అదీ స్మితమే. ఆదిపర్వంలో గరుత్మంతునిచేత పీడింపబడిన దేవతల పరుగులు, బకాసురుని వృత్తాంతంలో పసివాడి మాటలు దుర్యోధనుని భంగపాటు ఎంతో కొంత నవ్విస్తాయి.

నన్నెచోడుని కుమారసంభవంలో మన్మధుని ప్రగల్భాల కన్నా రతీదేవి భర్తని వారించడం పఠితను నవ్విస్తాయి. పరమేశ్వరుని తపోభంగం చేయడానికి తాను సపరివారంగా వెడుతున్నానని పల్కిన భర్తతో రతీదేవి…

“పరమశివుని విల్లు కనకసిరి, నీ విల్లు చెఱకుగడ, ఆయన బాణం పాశుపతం, నీ బాణం కేవలం పుష్పం. చిన్న పిల్లలు కూడా తిని, పిప్పి ఉమిసెడి చెఱకుగడను గొప్పవిల్లని విశ్వసించి, క్షణాలలో నశించే పూలని బాణాలుగా తగిలించుకొని, వేసవి ఎండకి బెదిరిపోయే వసంతుని గొప్ప స్నేహితుడని వెంటబెట్టుకొని, కాకి పిల్లల్ని చూసి బెదిరిపోయే కోకిలలు, ఆడవాళ్లు అదిలిస్తేనే ఆకాశంలోకి ఎగిరిపోయే చిలుకలు పెద్ద సైన్యంగా గర్వించి, పరమేశ్వరునిపై దాడికి వెళ్లడం మంచిది కాదు. ” అని హెచ్చరిస్తుంది. ఇలాంటి మాటల్లోని హస్యం సున్నితంగా మనసుని తాకి నవ్విస్తుంది.

తిక్కన రచనలో వ్యంగ్యం ఎక్కువ. నర్తనశాలలో స్త్రీ వేషంలో ఉన్న భీముడు కీచకునితో “నన్ను ముట్టి నీవు చెండి యు వనితల సంగతికి పోవు వాడవె” అని గూఢంగా అంటాడు. ఇలాంటి వాక్యాలు చిరునవ్వుకి పుట్టినిళ్లవుతాయి. ఇక ఉత్తరకుమారుని ప్రగల్భాలు, తీరా కురు సైన్యాన్ని చూసాక “ప్రాణములు తీపి యన వినవే” అనే అతని గోల బాగా నవ్విస్తాయి. అంతే కాదు.” పసులదయ్య మెరుగు, పడతుల సంతోషమేల నాకు, యనికి జాల నేను” అని రధం మీదనుండి క్రిందికి ఉరికి పరిగెత్తడం కడుపుబ్బ నవ్విస్తుంది. తిక్కన తన పాత్రలచేత నవ్వించిన నవ్వులు లెక్కలేనన్ని. తిక్కన పేర్కొన్న నవ్వుల జాబితా తయారు చేయడం గొప్ప ఆసక్తికరంగా ఉంటుంది. ఇన్ని రకాల నవ్వులుంటాయా అని మనకు ఆశ్చర్యం కలుగుతుంది. అయితే ఏ నవ్వూ పాత్రోచిత్యాన్ని భంగం చేయదు. అదీ విశేషం.

గౌరన నవనాధ చరిత్రలో పురోహితుడు ఎలుగుబంటితో సరసాలాడడం, హరిశ్చంద్ర వాఖ్యానంలో కలహకంఠి, కాలకౌశికుల పోట్లాటలు, రోకళ్లతో కొట్టుకోవడాలు, విపరీతంగా నవ్విస్తాయి. కేయూరబాహు చరిత్రలో జంతు పాత్రౌచిత్యమైన మాటలు, చేష్టలు, విక్రమార్క చరిత్రలోని కొన్ని సన్నివేశాలు కొంత హాస్యరస స్ఫోరకాలే.

శ్రీనాధుని హరవిలాసంలో మాయా బ్రహ్మచారి పార్వతిని పరీక్షించాలని వచ్చి ఆమె ఎదుట శివుని నిందిస్తూ, వారి కళ్యాణాన్ని నిరసిస్తూ చేసిన ప్రసంగం,,

“రాయంచ యంచు చీరెక్కు జోకయగుగాక
పచ్చి మెనిక తోలు పచ్చ్చడంబు,”..

వంటి వ్యంగ్యాలు హాస్య రసాన్ని అందిస్తాయి. శ్రీనాధునివిగా ప్రసిద్ధి చెందిన చాటు పద్యాలలో కావలసినంత హాస్యం మనకు కనిపిస్తుంది.

ఒకసారి పల్నాడు వెళ్లిన శ్రీనాధునికి మంచి నీళ్లు కావలసి వచ్చి తన ఇష్ట దైవం శివుణ్ణి ఇలా దబాయించాడట.

సిరిగలవానికి చెల్లును
తరుణులు పదియారువేలు తన పెండ్లాడన్..
తిరిపెమున కిద్దరాండ్రా
పరమేశా గంగను విడుము పార్వతి చాలున్..

నీళ్లకోసం ఇలా గడుసుగా విసిరిన చమత్కారానికి ఎంత మాడుపు మొహమైనా వికసించక తప్పదు.
ఆయనదే మరో పద్యం..

పూజారి వారి కోడలు
తాజారగబిందె జారి దబ్బున పడియెన్
మైజారు కొంగు తడిసిన
బాజారే తొంగి చూసి ఫక్కుంజ నగియెన్…

ఎంత దగ్గరివారైనా ఇలాంటి సన్నివేశాల్లో దబ్బున జారిపడితే చూసినవాళ్లెవరికైనా ముందు వచ్చేది నవ్వే.. ఇలాంటి చాటువులు కోకొల్లలు..

శ్రీనాధుని యుగంలోనే అనంతామాత్యుడు భోజరాజీయమనే కథాకావ్యం వ్రాసాడు. సున్నితమైన హాస్యరసపోషణలో అనంతుడు సిద్ధహస్తుడు. మూషిక కన్య ప్రేమ వృత్తాంతం, ఎండ్రి పిల్ల కాశీ యాత్రకు ఉబలాటపడటం హస్య రసాన్ని చిందించే ఘట్టాలు. బ్రహ్మని హేళన చేస్తూ శివుడు విష్ణువుతో..

“వింటి కదా నీ తనయుని కొంటెతనము
..ఇటువంటివి పో పెక్కునోళ్ల వారల మాటల్” అంటాడు.

భక్త కవి పోతన శబ్దాలతో ఆడుకుంటాడు. ఆ శబ్దక్రీడ మన మనసుని తాకి హాయినిస్తుంది. శ్రీకృష్ణుని బాల్య చేష్టలు మనల్ని నవ్వించి పరవశింపచేసే హాస్యప్రసంగాలు.

ఇక రాయలకాలం అన్ని రసాలకి స్వర్ణయుగం. తెనాలి రామకృష్ణుడివిగా చెప్పబడే చాటుపద్యాలు హాస్యభాండాగారాలు. ఒకనాడు శ్రీకృష్ణదేవరాయలు సభలో

“కలనాటి ధనము లక్కర గల నాటికి దాత కమలగర్భుని వశమే” అని సమస్య ఇస్తే…

“నెల నడిమినాటి వెన్నెల యలవడునే గాదెవోయ యమవస నిశికీన్.. అని పెద్దన పూరించాడు.

‘అమవసనిసికి’నచ్చని రామకృష్ణుడు హేలనగా

“ఏమితిని సెప్పితివి కపితము
బెమపడి నెరి పుచ్చకాయ నడితిని సెపితో
ఉమెతక్కయ తినిసెపితో
అమవసనిసికి యనుమాడి అలసనిపెదనా!”

అన్నాడు వికటకవి.. ఈ వెక్కిరింతకు ఆనాటి సభలోనివారికే కాదు మనకూ నవ్వు రాక మానదు. రామకృష్ణ కవి అద్భుత కృతి పాండురంగ మాహత్మ్యం. అందులో నిగమశర్మ అక్క మరవలేని తెలుగింటి ఆడపడుచు. దుష్టసావాసాలు చేస్తున్న తమ్ముడిని బాగు చేయడానికి పుట్టింటికి వచ్చిన ఆవిడ తమ్ముణ్ణి దగ్గర కూర్చోబెట్టుకొని ఎన్నో నీతులు చెబుతుంది. వాడు అన్నీ విన్నట్లే విని ఒకరోజు రాత్రి ఇంట్లో వస్తువులు పట్టుకుపోతూ పనిలో పనిగా అక్కగారి ముక్కుపుడక కూడా పట్టుకు చక్కా పోతాడు. తెల్లవారిన తర్వాత విషయం తెలిసిన ఆవిడ తమ్ముడు తన మాటలు తలకెక్కించుకోలేదన్న బాధ కన్నా తన ముక్కుపుడక పట్టుకుపోయాడని గొల్లుమనడం రసాభావమై పఠితల్ని ఫక్కుమనిపిస్తుంది.

రాయలవారి స్వీయక్ర్తి ఆముక్తమాల్యద. అందులొ ఒక సొగసైన పద్యం ఉంది. విల్లిపుత్తూరు వర్ణనలోని క్రింది పద్యం..

తలఁ బక్షచ్చట గ్రుచ్చి బాతువులు కేదారంపుఁ గుల్యాంతర
స్థలి నిద్రింపఁగఁ జూచి యారెకు లుష స్స్నాతప్రయాతద్విజా
వలి పిండీకృత శాటిక ల్సవి దదావాసంబుఁ జేర్పంగ రే
వుల డిగ్గ న్వెస బాఱువానిఁ గని నవ్వు న్శాలిగోప్యోఘముల్

విల్లిపుత్తూరు చుట్టుపక్కల ఉన్న పొలాల్లో వరిమళ్లకు కాలువలు తీసారు. ఆ కాల్వల నడుమ వేకువ సమయంలో బాతులు తమ రెక్కల సందుల్లో తలలు దూర్చు పడుకున్నాయి. నగర రక్షకులు వాటిని చూసి “తెల్లవారుఝామున కాల్వకు స్నానానికి వచ్చిన బ్రాహ్మణులు స్నానం చేసాక తమ వస్త్రాలను నీళ్లలో ముంచి తీసి పిండివేసి ఆ తడి ముద్దల్ని అక్కడ మర్చిపోయి ఇంటికి పోయారు” అని భావించి వాటిని వారి వారి ఇళ్లకు చేర్చడానికి రేవులో దిగారు. ఆ చప్పుడుకి చటుక్కున లేచి వేగంగా పరిగెత్తుతున్న బాతులను చూసి వరిపైరుకు కాపలాగా ఉన్న స్త్రీలు నవ్వారట. ఈ భ్రాంతిమదాలంకారం మనల్ని నవ్వించక మానదు.

కళాపూర్ణోదయంలో పింగలిసూరన, వైకుంఠంలో నేత్రహస్తుల బెత్తపు దెబ్బలకు జడిసి బ్రహ్మగారే పారిపోయారని చేసిన వర్ణన హస్యరసస్ఫోరకమే.

క్షీణయుగంలోని హాస్యం తన ఔచిత్యాన్ని కోల్పోయిందనక తప్పదు. చేమకూర వేంకటకవి చమత్కారాలు మాత్రం చక్కిలిగింతలు పెడతాయి.

ఇక శతక కర్తలు చాలామంది హాస్యప్రియులు. తెలుగువారి హాస్యం శతకాల్లో ఎక్కువగా దర్శనీయమౌతుంది. వేకువలో సున్నితమైన సునిశితమైన హాస్యం ఉంది.

మచ్చుకి రెండు పద్యాలు…

కోతిని పట్టి తెచ్చి కొత్తపుట్టము గట్టి
కొండముచ్చు లెల్ల కొలిచినట్టు
నీతిహీనునొద్ద నిర్భాగ్యులుందురు
విశ్వదాభిరామ వినురవేమ. … అన్నా

పాల సంద్రమునందు పవ్వళించిన హరి
గొల్ల యిండ్లకు పాలుకోరనేల
యెదుటివారి సొమ్ము యెల్లవారికి తీపి
విశ్వదాభిరామ వినురవేమ… అన్నా

సునిశితమైన హాస్యం సంఘజీవనంతో ముడిపడి శాశ్వతత్వాన్ని సంపాదించుకుంది.

ఉన్నంతలో దానం చేయడం, ఇతరులచే దానమిప్పించడం పురుషలక్షణం. అటువంటి వారికే మీసం అలంకారం అంటూ కవి చౌడప్ప చెప్పిన పద్యం వాడిగా వేడిగా హాస్యాన్ని అందిస్తుంది.

ఇయ్యక ఇప్పించగలడు
అయ్యలకే కాని మీసమందరికేలా
రొయ్యకు లేదా బారెడు
కయ్యానికి కుందవరపు కవి చౌడప్పా…

నల్లి బాధను బాగా అనుభవించిన ఒక కవి చాటువు..

శివుడద్రిని శయనించుట
రవిచంద్రులు మింటనుండి రాజీవాక్షుం
డవిరలముగా శేషాద్రిపై
పవళించుట నల్లి బాధ పడలేక సుమీ…

అడిదం సూరకవి 18వ శతాబ్దంలో విజయనగర రాజుల సంస్థానంలో ప్రసిద్ధి కెక్కిన కవి. ఒకరోజు ఆయన భోజనం చేస్తుండగా ఆయన భార్య ప్రక్కన కూర్చును విసురుతూ గోముగా “అందరిమీదా పద్యాలు చెప్తున్నారు కదా? మన అబ్బాయి బాచన్న మీద ఒక పద్యం చెప్పవచ్చు కదా?” అని అడిగింది.

తరతమ బేధాలు లేని కవిగారు క్రింది పద్యంలో భార్య ముచ్చట తీర్చారట. పద్యం విని ఆవిడ ముఖం చిన్నబోయింది.

“బాబా బూచుల లోపల
బాచన్నే పెద్ద బూచి పళ్లున్ తానున్
బూచంటే రాత్రి వెరతురు
బాచన్నను జూచి పట్టపగలే వెరతురు”

కవి ఎంత నిరంకుశుడో చూడండి. ఎంత పళ్లెత్తైతే మాత్రం కన్నకొడుకు బూచి కన్నా భయంకరంగా ఉన్నాడని భర్త వర్ణిస్తే ఏ కన్నతల్లి మనసు చిన్నబోదు? అయినా మనకి జాలి కలగకపోగా కవిగారి చమత్కారానికి ఫక్కున నవ్వొస్తుంది.

అలాగే ఇంకో కవిగారు మహా పండితుడు. భోజనం చేసాక తాంబూలం వేసుకోవడానికి భార్యను సున్నం తెమ్మని సున్నితంగా పద్యరూపంలో అభ్యర్థించాడు.

“పర్వతశ్రేష పుత్రిక పతి విరోధి
అన్న పెండ్లాము అత్తను కన్నతండ్రి
ప్రేమతోడుత కన్నట్టి పెద్దబిడ్డ
సున్నంబుతేగదే సన్నుతాంగి..”

ఆయనకి భార్య మీద ఎంత అనురాగమో చూడండి.

పర్వత శ్రేష్ట పుత్రిక – హిమవంతుని కుమార్తె పార్వతియొక్క
పతి – భర్తయైన శివునియొక్క
విరోధి -శత్రువైన మన్మధునియొక్క
అన్నపెండ్లాము – అన్నగారైన బ్రహ్మదేవుని భార్య సరస్వతియొక్క
అత్తకు – అత్తగారైన లక్ష్మీదేవిని
కన్నతండ్రి – కన్నతండ్రైన సముద్రుని
ప్రేమతోడుత బిడ్డా – పెద్దకుమార్తె యైన జ్యేష్టాదేవి
సున్నంబు తేగదె సన్నుతాంగి – సున్నము తీసికొనిరా ( సన్నుతాంగి అనేది ఉత్తుత్తి సంబోధన)

“ఓ! దరిద్రపుగొట్టు పెద్దమ్మా! సున్నం పట్టుకురా” అన్నాడు. పాపం ఆవిడ చాలా పతివ్రత. పతిని అనుసరించే మాట్లాడుతుంది. అందుకే సున్నం తెస్తూ..

శతపత్రంబుల మిత్రుని
సుతు జంపిన వాని బావ సూనిని మామన్
సతతము తలదాల్చునాతని
సుతువాహన వైరి వైరి సున్నంబిదిగో…. అని అంటించింది.

శతపత్రంబుల మిత్రుని – సూర్యుని
సుతు – కర్ణుని
చంపినవాని – చంపిన అర్జునుని
బావ – శ్రీకృష్ణుని
సూనుమామన్ – కుమారునకు మేనమామయైన చంద్రుని
సతతము – నిత్యము
తలదాల్చునాతని – నెత్తిమీదమోసే శివునియొక్క
సుతు – కుమారుడైన వినాయకుని
వాహన – వాహనమైన ఎలుకకు
వైరి – శత్రువైన పిల్లికి
వైరి- శత్రువైన ఓ కుక్కా
సున్నంబిదిగో – ఇదిగో సున్నం తీసుకో.

“ఓ కుక్కా! సున్నమిదిగో అని వాత పెట్టింది. ఈ కొసమెరుపు చదివినవారందరికీ ఫక్కున నవ్విస్తుంది.

ఇలాంటి వెటకారపు పద్యాలు, వ్యంగ్య బాణాలు, చతురోక్తులు ఆధునిక తెలుగు సాహిత్యంలో కోకొల్లలు. వాస్తవానికి ఆధునిక యుగంలోనే హస్యప్రాధాన్యత ఆంధ్రులకు బాగా తెలియవచ్చిందనవచ్చు. ఇంగ్లండు, ఫ్రాన్స్, అమెరికా దేశాలు హస్యానికి నెలవుకాగా, ఆయాదేశాల్లో పుట్టిన సాహిత్యంలో హస్యం రాజ్యమేలింది. ఆంగ్లభాషతోనూ, ఆ సాహిత్యంతోనూ భారతీయులకు పరిచయమేర్పడ్డాక మన సాహిత్యంలో కొత్త ప్రక్రియలేర్పడ్డాయి. ఎక్కడ మంచి ఉన్నా గ్రహించి సాహిత్యం ద్వారా పఠితల కందించాలనే తపన మన కవులకున్న సుగుణం. అలాగే మార్క్ ట్వెయిన్ , డికెన్స్, మొలియర్ వంటి హాస్యవేత్తల మార్గంలో ఒకరిద్దరు తెలుగు రచయితలు హస్యాన్ని అందలమెక్కించే ప్రయత్నం చేసారు. ఏమైనా అంత గొప్ప హాస్యం మన సాహిత్యంలో ప్రవేశించలేదని ఒప్పుకుని తీరాలి.

కీ.శే. భమిడిపాటి, మొక్కపాటి, మునిమాణిక్యంగార్లు తెలుగులో హస్య కవిత్రయం. మునిమాణిక్యంగారి కాంతం కథలు, మొక్కపాటివారి బారిస్టర్ పార్వతీశం, చిలకమర్తివారి ప్రహసనాలు, పానుగంటి వారి సాక్షి వ్యాసాలు.. ఇలా ఎన్నో రచనలు హాస్యరసాన్ని పండించాయి. అయితే మన కవులు, రచయితలు తమ రచనలు ఏ రసప్రధానమైనవి అయినా వాటికి సాంఘిక ప్రయోజనం ఉండాలనే లక్ష్యంతో హాస్యాన్ని హద్దుల్లోనే ఉంచారు. మన నైతిక విలువలు హాస్యం పేరుతో దెబ్బతినకూడదనే భావన సుమారు పాతిక సంవత్సరాల క్రితం వరకు ఉన్నదనే చెప్పవచ్చు. ఆధునికయుగంలో సుప్రసిద్ధులైన కవి, రచయిత కీ.శే.చిలకమర్తివారు హస్యధోరణిలో పకోడీలను వర్ణిస్తూ పద్యాలు చెప్పారు. వాటి సారాంశం..

‘కోడి’ తినని శాకాహారులకు వాని రుచిలో సమానమైన ‘పకోడీ’ని బ్రహ్మ సృష్టించాడు. పెళ్లిళ్ల సమయంలో అక్షింతల వాడుక ఎక్కువగా ఉంటుంది కదా. పూజకి, ఆశీర్వచనానికి తలంబ్రాలకి ఇలా చాలా చోట్ల వాడతారు. అయితే మంగళ ప్రదమైన ఈ అక్షింతలు తల మీదనుండి క్రింది పడుటచే కాళ్లక్రింద పడి నలిగిపోతుంటాయి. కాబట్టి అక్షింతలకు బదులుగా మనం పకోడీలను వాడితే వచ్చినవాళ్లు వాటిని తొక్కకుండా జాగ్రత్తగా ఏరుకుని తింటూ హాయిగా కూర్చుంటారని, పెళ్లిపీటలమీద కూర్చున్న వధూవరులకు పకోడీల దండ వేయిస్తే వాళ్లు ఆ ఘుమఘుమలను ఆఘ్రాణిస్తూ అవకాశం వస్తే ఒకటి రెండు నములుకుంటూ కాలక్షేపం చేస్తారనే ఆయన సూచన హాస్యరసాన్ని పుష్కలంగా అందిస్తుంది.

అభ్యుదయ కవిగా, విప్లవ కవిగా ప్రసిద్ధి కెక్కిన శ్రీశ్రీ కూడా తన శతకాల్లో అక్కడక్కడ హాస్యాన్ని మెరిపించారు.

“దయ్యాలను చూపిస్తా
నయ్యారమ్మనుచు నొక్క ఆసామి నా
కయ్యో తన కూతుళ్లను
చెయ్యూపుచు పిలిచి చూపె సిరిసిరిమువ్వా ”

ఇక పేరడీ అనేది ఫక్కున నవ్వించే ప్రక్రియ
‘అప్పిచ్చువాడు వైద్యుడు’ అనే పద్యానికి శ్రీశ్రీ పేరడి ప్రసిద్ధమైనది.

“ఎప్పుడు పడితే అప్పుడు
కప్పెడు కాఫీ నొసంగ గలిగిన సుజనుల్
చొప్పడిన యూరకుండుము
చొప్పడకున్నట్టి యూరు చొరకుము మువ్వా ”

శ్రీశ్రీ రాసిన ‘ఏ దేశ చరిత్ర చూసినా’ కవితకు మచిరాజు దేవీప్రసాద్ గారి పేరడీ.

“ఏ రోడ్డు చూసినా ఏమున్నది గర్వకారణము
రహదార్ల చరిత్ర సమస్తం ధూళి ధూస పరివ్యస్తం. ”
ఆమోదయోగ్యమైన హాస్యాన్ని ఆనందంగా, అనుభవిస్తేనే ఆహ్లాదం, ఆరోగ్యం.

కీ.శే. జంధ్యాలవంటి రచయితలు హాస్యాన్ని అంగిరసంగా ఎన్నో రచనలు చేసారు. అగ్రస్థానంలో నిలబడ్డారు. ఆరోగ్యకరమైన హాస్యం అన్నివేళల అపురూపమే. ఆ ఆవశ్యకతను తెలిసికొని నిపుణులైన రచయితలు, కవులు తమ సృజనాత్మక శక్తితో రచనలు చేస్తే గొప్ప సంఘసేవ చేసినట్టే.

ఇది హస్యరసాన్ని గూర్చి కేవలం విహంగ వీక్షణం మాత్రమే. పద్యాలలో, వచనాలతో కవితలతో పరమాద్భుత విన్యాసాలు చేసి పఠితల్ని పరమానందభరితుల్ని చేసిన ఎందరో హస్యరస పోషకులు ఇంకా ఉన్నారు. అయినా ఇంకా మరెందరో వస్తేనే సమాజం సుహాసిని అవుతుంది.

9 thoughts on “తెలుగు సాహిత్యంలో హాస్యం

  1. రాజమండ్రిలో అన్నీ అతిగానే స్పందిస్తున్నారు… శివరాత్రి పండుగ రోజున ప్రతి ఒక్కరూ పుణ్యం రావాలని పులిహోర మజ్జిగ పంపిణీ చేస్తున్నారు.. మరిక`ందరు ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నామని శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు.. ప్రచారానికి ఇచ్చిన విలువ దేనికీ ఇవ్వడం లేదు… నిజానికి చాలామంది భక్తులు ఉపవాస దీక్షలో ఉంటారు.. భక్తుల మనోభావాలు తెలుసుకోకుండా ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు.. జన్మానికో శివరాత్రి అన్న చందంగా వ్యవహరిస్తున్నారు.. మిగిలిన రోజులలో ఆకలితో అలమటించే అభాగ్యులు ఎందరో ఉన్నారు… బాలుర, బాలికల వసతిగ=హాలలో, అనాధ ఆశ్రమాలు, శరణాలయాల్లో చాలామందికి పట్టెడన్నం ద`రకదు…అలాంటి వారికి సాయం అందించడం మంచిది… ప్రభుత్వ ఆసుపత్రులలో సరైన వైద్య సేవలు అందుబాటులో ఉండవు… చాలామంది పేదలు మందులు క`నుగోలు చేయడానికి కూడా చేతిలో డబ్బులు ఉండవు… నిత్యం ఉండే సామాజిక సమస్యల పై ద=ష్టి పెట్టకుండా ఒక పూట బోజనం పెట్టి పదిమందికి ప్రచారం చేసుకునే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.. ఆకలిగా ఉన్నవారికి అన్నం పెట్టడం, దాహంగా ఉన్నవారికి మంచినీరు ఇవ్వడం, అనారోగ్యంతో ఉన్నవారికి సేవలు అందించడం భారతీయుల సంప్రదాయం… ఇది ఒక సామాజిక ధర్మం. భారతదేశ సంస్క=తి.. 9395146294. gudipudig@yahoo.com

  2. 1968లో వచ్చిన మునిమాణిక్యంగారి “మన హస్యం” అన్న పుస్తకం తప్పిస్తే వివరంగా రాసినవాళ్ళెవరూ లేరు.
    – —————–
    paruchuri srinivas garu

    ఉన్నారండి మాచర్ల రాధాకృష్ణ మూర్తి గారు హష్య ప్రపంచం పేరుతో చాలా వివరంగా ౫౮౮ పేజీల్లో హాస్యం పై రాశారు.( 2006 lo) హాస్యం పై అన్ని కోణాల్లో విశ్లేషించారు. హాస్యం పై నేను మరో పాత గ్రంధం కూడా చూశాను

  3. తెలుగు సాహిత్యంలో హాస్యం … చాలా చక్కగా వుంది…ముళ్ళాపూడి వారిని ప్రస్తావించినట్టులేదు. వారు హాస్యరచనల్లో లబ్ధప్రతిష్టులేకదా…అలాగే భానుమతీరామకృష్ణ వంటివారిగురింఛి సూచనప్రాయంగా తెలియజేస్తే బాగుణ్ణేమో. అయినా అనంతమైన విషయం కూడా కదా….మీరు సూచించినట్టు, చాలామంది భావిస్తున్నట్టు మోతాదు మించని హాస్యం
    అభినందనీయం, అభిలషణీయం…..ఆ నియమం పాటిస్తూ గత యేడు సంవత్సరాలుగా మేము ఇక్కడ రాజమండ్రిలో ‘హాసం’ క్లబ్ విజయవంతంగా నిర్వహిస్తున్నాము….ఆ నిర్వాహకుడిగా మీ వ్యాసం నాకు చాలా బాగా నచ్చింది…అయినా మిఠాయి ఎవరికి రుచించదు చెప్పండి….
    హాసాభినందనలు…హాస్యాభినందనలు….

  4. మంచి వ్యాసం. అంతకంటే ముందుగా మంచి ప్రయత్నం. తెలుగు, ఆ మాటకొస్తే భారతీయ సాహిత్యంలో, హాస్యాన్ని విశ్లేషిస్తూ వచ్చిన రచనలు బహు కొద్ది కాబట్టి. 1968లో వచ్చిన మునిమాణిక్యంగారి “మన హస్యం” అన్న పుస్తకం తప్పిస్తే వివరంగా రాసినవాళ్ళెవరూ లేరు.

    ఇంతకూ పై వ్యాసం రాసిందెవరో!

    భవదీయుడు,
    శ్రీనివాస్

    1. ఇంతకూ పై వ్యాసం రాసిందెవరో!
      _____________________

      Dr. Seetalakshmi Veluri

Comments are closed.


Notice: Trying to get property of non-object in /var/www/html/maalika/magazine/wp-content/plugins/jetpack/modules/gravatar-hovercards.php on line 238