May 9, 2024

వాహ్ ! తాజ్!!!

భారతదేశంలోని వివిధ ప్రాంతాలు రాజరికపు పాలనలో ఉండేవి. బ్రిటీషువారి ఆక్రమణ తర్వాత ప్రజాస్వామ్యపు పరిపాలన వచ్చి రాచరికాలు కనుమరుగైనాయి. వారి విలాస రాజభవనాలు ప్రభుత్వ కార్యాలయాలు, హోటళ్లుగా మారిపోయాయి. అటువంటి ఒక అద్భుతమైన రాజభవనం హైదరాబాదులోని ఫలక్‌నుమా ప్యాలెస్ .. “ఫలక్‌నుమా” అంటే ” స్వర్గలోకపు నక్షత్రం” అని అర్ధం. నిజంగానే ఇది ఆకాశంలో నక్షత్రంలా ఉంటుంది. 1893 లో ప్రారంభించబడింది. హైదరాబాదులోని చార్మినార్‌కు ఐదు కిలోమీటర్ల దూరంలో ఒక కొండపైన తేలు ఆకారంలో కనిపించే ఈ భవనాన్ని వికార్ ఉల్ ఉమ్రా బహదూర్ నిర్మించారు. తర్వాత ఫలక్‌నుమా ప్యాలెస్ ను ఆరో నిజాంకు బహుమతిగా ఇచ్చేశాడు. 1911 నుండి ఈ భవనం ఖాళీగా ఉంది. 32 ఎకరాల స్థలంలో విస్తరించిన ఫలక్‌నుమా ప్యాలెస్ అంతర్జాతీయ ప్రమాణాలతో 7 నక్షత్రాల హోటల్ గా రూపొందించబడింది. ప్యాలెస్ లోని ప్రధాన భాగాన్ని అలాగే ఉంచి, వెనుక భాగంలోని గదులను మాత్రమే హోటల్ సూట్ లుగా మార్చారు. దేశవిదేశాలనుండి వచ్చే సంపన్న యాత్రికులకు హైదరాబాద్ నవాబుల సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ హోటల్ ని తీర్చిదిద్దారు.

ఒకప్పుడు నిజాం వాడిన ఆంతరంగిక గదులను సూట్లుగా మార్చారు. అలాగే స్విమ్మింగ్ పూల్స్, స్పా, రాచరికపు హుందా ఉట్టిపడే ఫర్నీచర్స్, మొదలైనవి అమర్చారు. ఈ భవనంలోని అమూల్యమైన కళాఖండాలు, చిత్రాలకు పూర్వ వైభవాన్ని, కళను తెచ్చేందుకు ప్రిన్సెస్ ఎస్రా నేతృత్వంలో పదేళ్లుగా శ్రమించారు. నిజాం సతీమణి ఉజలా బేగం కోసం అత్యంతా విలాసంగా నిర్మించబడి, వినియోగించిన పడక గది, స్నానాల గది, డ్రెస్సింగ్ రూం, నవాబుల అతిథి గృహాలను అదే రీతిలో పునరుద్ధరించి తీర్చిదిద్దారు. సుమారు వందేళ్ల క్రింద నవాబు కుటుంబీకులు ఉపయోగించిన వస్తువులను పోలిన వస్తువులనే దిగుమతి చేసుకుని ఇక్కడ వినియోగించారు.

ఫలక్‌నుమా ప్యాలెస్ లో ప్రధాన ద్వారం తర్వాత కాలుష్య కారక వాహనాలను అనుమతించరు. పార్కింగులో వాహనాలను నిలిపిన తర్వాత గుర్రపు బగ్గీ లేదా బ్యాటరీ వాహనాల ద్వారా ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ ప్యాలెస్ లో సుమారు ఆరువేల పుస్తకాలతో గ్రంధాలయం ఉంది. ఒకేసారి 101 మంది కూర్చుని విందు ఆరగించడానికి ఏర్పాటు చేయబడిన డైనింగ్ టేబుల్ ఈ ప్యాలెస్ కే మచ్చుతునక అని చెప్పవచ్చు. అతిధుల వినోదం కోసం ప్రత్యేకమైన హుక్కా గది, బిలియర్డ్స్ రూమ్ ఉంది. 36 విభిన్న ట్యూన్లను ఒకేసారి పలికించే ఆర్కెస్ట్రా కూడా ఉండడం మరో విశేషం. ఈ ప్యాలెస్ లో చెలెస్టా పేరిట ఇటాలియన్ రెస్టారెంట్, ఆదాబ్ పేరిట ఇండియన్ రెస్టారెంట్ ఏర్పాటు చేసారు. భవంతి లోపల ఖరీదైన ఇటాలియన్ ఫర్నీచర్, ఇటాలియన్ మార్బుల్ ఫ్లోరింగ్, అద్భుతమైన షాండిలియర్స్ మొదలైనవి నలువైపులా రాజరికపు వాతావరణాన్ని ప్రతిబింబిస్తాయి.

ప్రపంచంలోనే అద్భుత వాస్తు నిర్మాణంగా ప్రసిద్ధి చెందిన ఈ తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్ నవంబరు 13వ తేదీన ప్రారంభించబడింది. కళ్లు జిగేల్మనే నగిషీలు, అద్భుత నిర్మాణ నైపుణ్యం, అడుగడుగునా ఉట్టిపడే రాజసం, సుందర కళాఖండాలు, నిలువెత్తు చిత్రాలతో ఆకాశంలో నక్షత్రంలా మెరిసిపోయే ఈ హోటల్ భారత దేశంలోనే అతి ఖరీదైనది. ఇందులోని గదుల్లో బస చేసేందుకు ఒక్క రాత్రికి కనీసం రూ. 33 వేల నుండి రూ.5 లక్షలు చార్జి చేస్తున్నారు. ఇక మొత్తం ప్యాలెస్ మొత్తాన్ని తీసుకోవాలంటే ఒక్కరోజు అద్దె రూ. 1 కోటి మాత్రమేనండి..