May 2, 2024

అన్నమయ్య – ఒక పరిచయం(2వ భాగము)

రచన : మల్లిన నరసింహారావు


4వ సంపుటం.

ఇది కూడా అన్నమాచార్యుల ఆధ్యాత్మిక సంకీర్తనల సమాహారమే. దీనిలో ఉన్న సంకీర్తనల సంఖ్య 531+77= 608. ఈ 77 నిడురేకులలోని సంకీర్తనలని వేరుగా ఇచ్చారు.

సౌరాష్ట్రం
వీధుల వీధుల విభుఁడేగీ నిదె
మోదముతోడుత మొక్కరొ జనులు IIపల్లవిII

గరుడధ్వజ మదె కనకరథం బదె
అరదముపై హరి యలవాఁడె
యిరుదెసల నున్నారు యిందిరయు భువియు
పరఁగఁ బగ్గములు పట్టరో జనులు IIవీధులII

ఆడే రదివో యచ్చరలెల్లను
పాడేరు గంధర్వ పతులెల్లా
వేడుకతో వీడె విష్వక్సేనుఁడు
కూడి యిందరునుఁ జూడరో జనులు IIవీధులII

శ్రీవేంకటపతి శిఖరము చాయదె
భావింప బహువైభవము లవే
గోవిందనామపు ఘోషణ లిడుచును
దైవం బితఁడని తలచరో జనులు. IIవీధులII 4-286

తిరుమలలో శ్రీ వెంకటేశ్వరస్వామిని పద్మావతీ దేవిని మాడవీధులలో ఊరేగింపుగా ఊరేగించే సందర్భాలలో గానం చేయబడ్డ సంకీర్తన ఇది. మాడ వీధులలో స్వామి ఊరేగి వస్తున్నాడు. భక్తులందరూ సంతోషంతో ఆయనకి నమస్కరింతురు గాక! అదిగో, ఆ కనపడేదే గరుడధ్వజం, స్వామివారు వేంచేపు చేసేదే ఆ బంగారు రథం. ఆ రథం పైన ఆసీనుడై ఉన్నాడు శ్రీహరి భూదేవీ శ్రీదేవులు ఇరువైపులా సేవిస్తుండగా. ఆ రథం పగ్గాలను పట్టుకొని లాగుదాం, జనులందరూ రండి.

అప్సరసలు నృత్యం చేస్తున్నారు, గంధర్వులు పాటలు పాడుతున్నారు. విస్వక్సేనుడూ ఆ ప్రక్కనే ఉన్నాడు, జనులందరూ కలసి వారిని చూద్దాం రండి. శ్రీవేంకటేశ్వరుని శిఖరపు నీడ అదిగో ఆ కనిపిస్తున్నదే, మనం భావించినచో బహువైభవములూ అవే, గోవిందా-గోవిందా అని ఘోషణ చేస్తూ ఇతడే దైవమని తలచండర్రా.

తరువాతి సంకీర్తన.

మాళవశ్రీ
శ్రావణబహుళాష్టమి సవరేత్రికాడను
శ్రీవిభుఁడుదయించెఁ జెలులాల వినరే.IIపల్లవిII

అసురుల శిక్షించ నమరుల రక్షించ
వసుధభారమెల్లా నివారింపను
వసుదేవునికిని దేవకీదేవికిని
అసదృశమగు కృష్ణుఁ డవతారమందెను. IIశ్రావణII

గోపికలమన్నించ గొల్లలనెల్లాఁ గావఁగ
దాపై మునులనెల్లా దయసేయను
దీపించ నందునికి దేవియైనయశోదకు
యేపున సుతుఁడై కృష్ణుఁడిన్నిటాఁ బెరిగెను IIశ్రావణII

పాండవుల మనుపఁగ పదారువేలఁ బెండ్లాడఁగ
నిండి శ్రీవేంకటాద్రిపై నిలుచుండఁగా
అండ నలమేల్మంగ నక్కునఁ గాఁగిలించఁగ
దండియైయుండఁ గృష్ణుఁడు తగ నుతికెక్కెను. IIశ్రావణII 4 -287

చెలియల్లారా వినండే! శ్రావణమాసం, బహుళ అష్టమినాడు అర్థరాత్రి పూట శ్రీవిభుడు అంటే లక్ష్మీదేవి భర్త అయిన శ్రీకృష్ణుడు జన్మించాడటనే! సాటిలేని మేటి అయిన శ్రీకృష్ణుడు దేవకీదేవికి వసుదేవునికి – రాక్షసులను శిక్షించటానికి, దేవతలను రక్షించటానికీ, భూభారాన్ని తగ్గించటానికీ అవతరించాడట, వినండే! గోపికలను మన్నించటానికీ, గొల్లలందరినీ కాపాడటానికి, మునులనందరినీ బ్రోవటానికీ శ్రీకృష్ణుడు గోకులంలో పెఱిగాడటనే. పాండవులను రక్షించటానికీ, పదహారువేల గోపికలను పెండ్లాడటానికీ, శ్రీవేంకటాద్రి కొండమీద వేంకటేశ్వరుని రూపంలో ప్రక్కన అలమేల్మంగ కౌగిలిలో ఉంటుండగా దండిమగడై శ్రీకృష్ణుడు ప్రఖ్యాతిని పొందాడర్రా!

ఇక మూడవ సంకీర్తన.

రామక్రియ
ఏమని పొగడవచ్చు నీతని ప్రభావము
వేమరు నోపుణ్యులాల వినరో యీకతలు.IIఏమనిII

అనంత సూర్యతేజుఁడట కాంతి చెప్పనెంత
దనుజాంతకుఁడట ప్రతాప మెంత
మనసిజగురుఁడట మరిచక్కఁదనమెంత
వనజుఁగనినట్టివాఁడట ఘన తెంత.IIఏమనిII

గంగాజనకుఁడట కడుఁ జెప్పేపుణ్య మెంత
చెంగట భూకాంతుఁడట సింగార మెంత
రంగగు లక్ష్మీశుఁడట రాజసము లెంచ నెంత
అంగవించు సర్వేశుఁడట సంప దెంత. IIఏమనిII

మాయా నాథుఁడట మహిమ వచించు టెంత
యేయెడఁ దా విష్ణుఁడట యిర వెంత
పాయక శ్రీవేంకటాద్రిపతియై వరములిచ్చే
వేయిరూపులవాఁడట విస్తార మెంత. IIఏమనిII 4-482

ఇది చాలా చాలా సుందరమైన సంకీర్తన. వేంకటేశ్వరస్వామి గొప్పదనాలను ఒక్కొక్కటిగా వర్ణిస్తూ ఆ గొప్పదనాలకు గల కారణాలను కూడా కూడా సహేతుకంగా వివరించిన అందం ఇందులో తేటతెల్ల మవుతుంది. ఓ పుణ్యులారా! ఆయన ప్రభావాన్నిఎన్నిసార్లు ఏ ఏ విధంగా పొగడటం? మనకు సాధ్యమేనా ?

ఆయన ప్రభావాన్ని గుఱించి చెప్పే ఈ కథల్ని విన రండే. ఆయన అనంతసూర్యతేజం కలిగినవాడట! ఆయన కాంతి ఇంతితా? రాక్షసులని మట్టుపెట్టాడట! ఆతని ప్రతాపమింతని చెప్పశక్యమా? మహా సౌందర్యవంతుడైన మన్మథునికే తండ్రియట! ఇక ఈయన సౌందర్యం ఎంతో చెప్పతరమా? బ్రహ్మంతటివానికే జన్మమిచ్చాడట! ఘనతెంతో కదా ? పుణ్యాలగని అయిన గంగాదేవికే జన్మ మిచ్చినవాడటకదా! ఆయన పుణ్యమెంతో చెప్పశక్యమా మనకు? భూదేవినే ప్రక్కన కలిగిఉన్నాడట! ఆయన సింగారం ఎంతో చెప్పశక్యమా? సాక్షాత్తూ లక్ష్మీదేవికే ప్రాణనాథుడట కదా! ఆయన రాజసం ఎంత గొప్పదో కదా? ఆయన సర్వేశ్వరుడేనట కదా! ఆయన సంపద అనంతమైనదే! ఆయన మాయా నాధుడు, ఆయన మహిమను మనం వర్ణించగలమా? ఆయన సాక్షాత్తూ ఆ శ్రీమహావిష్ణువే నట కదా! ఆయన స్థానం ఎంత గొప్పదో! విడిచి పెట్టకుండా వేంకటాద్రి కొండపై వేయి రూపులతో వెలసి భక్తులకు వరాలిస్తుంటాడట! ఆయన కరుణ విస్తారమెంతో ఎలా చెప్పగలను?

5వ సంపుటం

మొదటి నాలుగు సంపుటాలూ ఆధ్యాత్మ సంకీర్తనలు. మిగిలినవన్నీ శృంగార సంకీర్తనలే! వాటిలోనికి ప్రవేశిద్దాం, రండి. ఈ 5వ సంపుటంలో 380 సంకీర్తనలు ఉన్నాయి. వీటిలో చాలా చాలా ప్రసిద్ధి చెందిన కీర్తనలు ఎన్నో ఎన్నో ఉన్నాయి. వాటిలో మచ్చుకు ఉదాహరణ పూర్వకంగా మనం ఓ మూడు సంకీర్తనలను గుఱించి ముచ్చటించుకుందాం.

మొదటి కీర్తన.

నాదరామక్రియ
ఏమొకొ చిగురుటధరమున యెడనెడఁ గస్తురి నిండెను
భామిని విభునకు వ్రాసిన పత్రిక కాదుగదా. IIపల్లవిII

కలికి చకోరాక్షికిఁ గడకన్నులుఁ గెంపై తోఁచిన
చెలువంబిప్పుడిదేమో చింతింపరె చెలులు
నలువునఁ బ్రాణేశ్వరుపై నాఁటిన యాకొన చూపులు
నిలువునఁ బెరుకఁగ నంటిన నెత్తురు గాదు గదా. IIఏమొII

పడఁతికి చనుఁగవ మెఱుఁగులు పైపైఁ బయ్యెద వెలుపల
కడు మించిన విధమేమో కనుఁగొనరే చెలులు
ఉడుగని వేడుకతోఁ బ్రియుఁ డొత్తిన నఖ శశి రేఖలు
వెడలఁగ వేసవికాలపు వెన్నెల గాదు గదా. IIఏమొII

ముద్దియ చెక్కుల కెలఁకుల ముత్యపు జల్లుల చేర్పుల
వొద్దికలాగు లివేమో వూహింపరె చెలులు
గద్దరి తిరువేంకటపతి కామిని వదనాంబుజమున
అద్దిన సురతపుఁ జెమటల అందము గాదు గదా। IIఏమొII 5-82

ఈ సంకీర్తన నాకు చాలా బాగా నచ్చిన సంకీర్తనలలో ఒకటి।
ఏమొకొ (ఏమి+ఒకొ)=సందేహాస్పదమై,ఆశ్చర్యాన్నీ కలిగించే విషయాన్ని గురించి చెప్పేటప్పుడు వాడే పదబంధం.
చిగురువలె లేతదైన క్రింది పెదవిమీద అక్కడక్కడా కస్తూరి నిండెను (కస్తూరి అంటెను అనటం లేదు-నిండెను అంటున్నాడు) అంటే కస్తూరికా ముద్రలు చాలా సుస్పష్టంగా కనిపిస్తున్నాయన్నమాట. ఆ కస్తూరికా ముద్రలు ఎలా ఉన్నాయటా? భామిని(దేవేరి) విభునకు(శ్రీవేంకటేశ్వరునకు) వ్రాసి పంపించిన ప్రేమలేఖ కాదు గదా ? – అన్పించేట్టుగా ఉన్నాయటా కస్తూరికా ముద్రలు.
చకోరాక్షి యైన యీ కలికి కంటిచివరలు కెంపురంగులో ప్రకాశిస్తున్నాయట. దానికి కారణం ఏమైవుంటుందో వూహింపరె చెలులు. ఇలా అని చెలులు తమలోతాము అనుకొంటున్నట్లుగా చేసిన అందమైన ఊహ ఈ సంకీర్తనం. ప్రాణేశ్వరుని అంకసీమను ఒప్పిదముగా నాటిన దేవేరి యొక్కఆ కొనచూపులు(కంటి చివరిచూపులు) నిట్టనిలువునా పెరికివేయగా (వెనక్కు తీసుకోగా) ఆ చూపులకు అంటిన నెత్తురు కాదుగదా అనిపిస్తోందట! –ఎంత అందమైన ఊహ!
ఆ దేవేరికి చనుగవ మీద ప్రకాశించే చంద్రకాంతి మెఱుగులు పయ్యద వెలుపలికి కడుమించి కనుపిస్తున్న తీరు ఏవిధమైనదో, చెలులారా! కనుక్కోండే!…తొలగని లేక తక్కువకాని వేడుకతో ప్రియుడు చనుగవ మీద ఒత్తగా ఏర్పడిన చంద్రవంకల్లాంటి స్వామి చేతిగోళ్ళ గుర్తులా విధంగా బయటకు ప్రకాశాన్ని వెదజల్లుతున్నాయట! పైగా ఆ ప్రకాశం చూడగా చూడగా వేసనికాలపు వెన్నెల కాదుగదా అన్పిస్తోందట! –ఎంత అందమైన పోలిక?
ఆ ముద్దియ చెక్కిళ్లప్రక్కల చేర్చబడిన ముత్యాల జల్లుల అందములు ఎలా ఉన్నాయో ఊహించండే అని ఒకరు ఇంకొకరితో అంటున్నారట. ఆ ముత్యాల జల్లులు ఇంకోటీ ఇంకోటీ కాదట! శ్రీ వేంకటేశ్వరుడు కామిని ముఖపద్మం మీద అద్దిన రతికాలపు చెమటచుక్కల అందము కాదుగదా! అని ఆశ్చర్యపడుతున్నారట।–

ఇంక పరాకాష్టే.

శ్రీరాగం
పిడికిట తలఁబాల పెండ్లికూఁతురు కొంత
పెడమరలి నవ్వీనె పెండ్లికూఁతురు IIపల్లవిII

పేరుకల జవరాలె పెండ్లికూఁతురు పెద్ద-
పేరులముత్యాలమేడ పెండ్లికూఁతురు
పేరంటాండ్ల నడిమి పెండ్లికూఁతురు విభుఁ
బేరు కుచ్చ సిగ్గువడీఁ బెండ్లికూఁతురు IIపిడిII

బిరుదు పెండెము వెట్టెఁ బెండ్లికూఁతురు నెర-
బిరుదు మగనికంటెఁ బెండ్లికూఁతురు
పిరిదూ(పిరుఁదూ?) రినప్పుడె పెండ్లికూఁతురు పతిఁ
బెరరేఁచీ నిదివో పెండ్లికూఁతురు IIపిడిII

పెట్టెనె పెద్ద తురుము పెండ్లికూఁతురు నేఁడె
పెట్టెఁడు చీరలు గట్టెఁ బెండ్లికూఁతురు
గట్టిగ వేంకటపతి కౌగిటను వడి-
వెట్టిన నిధానమైన పెండ్లికూఁతురు। IIపిడిII 5-185

పిడికిట తలంబ్రాల పెండ్లికూతురు – ఈ సంకీర్తన అంటే నాకు చాలా ఇష్టం. దీనిని చాలా తఱచుగా కూడా వింటుంటాం. కాని దీని తఱువాతనే ఉన్న సంకీర్తన పెండ్లి కొడుకు గుఱించినది(5-186). ఎందుచేతో తెలియదు గానీ ఈ “పెట్టని కోటిందరికిఁ బెండ్లికొడుకు బొమ్మఁ, బెట్టె నసురులకెల్లఁ బెండ్లికొడుకు” అనే పెండ్లికొడుకు పేరనున్నసంకీర్తనని మటుకు నేను ఇంతవఱకూ ఒక్కసారికూడా వినలేదు. అందరికీ పెండ్లికూతురు పాటంటేనే ఇష్టమో ఏమో తెలియటం లేదు.

పిడికిటిలో తలంబ్రాలు ధరించిన అలమేలుమంగమ్మ ఆ తలంబ్రాలను స్వామివారి నెత్తి మీద పోయటానికి మందుగా కొంత పెడమరలీ (ప్రక్కకు తిఱిగీ) నవ్వినదట. ఆమె పెద్ద పేరున్న జవరాలట, అంతేకాదు పెద్ద పెద్ద పేరులున్న ముత్యాల మెడను కలిగిఉందట.( కీర్తనలో మేడ అని ఉన్నది, రేకులో ముత్యాల పెండ్లి అని ఉన్నదని అథోసూచికలో చెప్పటం జరిగింది, కాని అది మెడ అని ఉంటేనే బాగుండును అని నా కనిపిస్తున్నది). పెద్దపేరంటాండ్ల మధ్యను కూర్చుని ఉన్నదట. అమ్మలక్కలు తన భర్త పేరడిగితే చెప్పటానికి ఊర్కే సిగ్గు పడిపోతూందట పాపం. తన మగని గండపెండేరము కంటే పెద్దగండపెండేరాన్ని కాలికి తొడిగిందట ఈ పెండ్లికూతురు. పిరిదూరినప్పుడు(?) పతిని రెచ్చగొట్టే పెండ్లికూతురుట ఆపె. శిగలో పెద్ద తురుమే పెట్టిందట, ఈరోజు పెట్టెడుచీరలూ కడుతోందంట. వడివెట్టిన నిదానమైన పెండ్లికూతురు శ్రీవేంకటపతి కౌగిటిలో గట్టిగా చేరినదట.

దేసాళం
కులుకక నడవరో కొమ్మలాలా
జలజలన రాలీని జాజులు మా యమ్మకు। ॥పల్లవి॥

ఒయ్యనే మేను గదలీ నొప్పుగా నడవరో
గయ్యాళి శ్రీపాదతాఁకు కాంతలాలా
పయ్యెద చెఱఁగు జారీ భారపు గుబ్బలమీఁద
అయ్యో చెమరించె మా యమ్మకు నెన్నుదురు। ॥కులు॥

చల్లెడి గందవొడి మైజారీ నిలువరో
పల్లకి వట్టిన ముద్దుఁ బణఁతులాల
మొల్లమైన కుందనపు ముత్యాల కుచ్చులదర
గల్లనుచుఁ గంకణాలు గదలీ మా యమ్మకు। ॥కులు॥

జమళి ముత్యాలతోడి చమ్మాళిగ లిడరో
రమణికి మణుల నారతులెత్తరో
అమరించె కౌఁగిట నలమేలుమంగనిదె
సమకూడె వేంకటేశ్వరుఁడు మా యమ్మకు। ॥ కులు॥ 5-73

అన్నమయ్య- అలమేలు మంగ చెలులు మోస్తున్న పల్లకిలో ఊరేగుతూ వచ్చి శ్రీవారిని చేరే సన్నివేశాన్ని వర్ణిస్తున్నాడు।
పల్లకీ వెంట ఇరుపక్కలా నడచి వస్తున్న చెలికత్తెలు పల్లకీని మోస్తూన్న చెలులతో అలమేలు సౌకుమార్యాన్ని గురించి ఈ విధంగా అంటున్నారు!
ఓ కొమ్మల్లారా! మరీ అంత కులుకుతూ నడవకండే, మా అలమేల్మంగమ్మకు కురులలో పెట్టుకొన్న జాజులు జలజలా రాలిపోతున్నాయే! కొంచెంగానే శరీరాల్నికదలిస్తూ ఒప్పుగా నడవండే।మన గయ్యాళి శ్రీపాదాల్ని తాకుతున్నదే అమ్మల్లారా। ఆవిడకు భారమైన చనుగవ మీది పైటకొంగు క్రిందికి జారుతోందే! అంతేకాదు,అయ్యో! మా అమ్మ నెన్నుదురు కూడా చెమరిస్తోందే!
కొంచెం నిలవండే! ఆమె పైన చల్లిన మంచిగంధపు పొడి శరీరాన్నుండి జారిపోతుందే! ఓ పల్లకీ పట్టిన ముద్దు పణతుల్లారా కొంచెం ఆగండే! అధికమైన కుందనపు ముత్యాల కుచ్చులు అదురుతుండగా, మా యమ్మ చేతి కంకణాలు ఘలుఘల్లుమంటూ కదలుతున్నాయే!
మా యమ్మకు ముత్యాలు పొదిగిన పావుకోళ్ళని ఇవ్వండే।ఈ రమణికి మణిదీపాల హారతులెత్తండే!
శ్రీ వేంకటేశ్వరు డిదే అలమేల్మంగని కౌగిట చేరుస్తున్నాడే.

6వ సంపుటం

ఇప్పుడు 6వ సంపుటంలోనికి మీకందరికీ స్వాగతం. ఇదికూడా అన్నమాచార్యులవారి శృంగారసంకీర్తనల సంపుటి. దీనిలో మొత్తం సంకీర్తనల సంఖ్య 181 మాత్రమే.

మొదటి సంకీర్తన.

భూపాళం
విన్నపాలు వినవలె వింత వింతలు
పన్నగపు దోమతెర పైకెత్తవేలయ్యా.IIపల్లవిII

తెల్లవాఱె జామెక్కె దేవతలు మునులు
అల్లనల్ల నంతనింత నదివో వారె
చల్లని తమ్మిరేకుల సారస్యపుఁ గన్నులు
మెల్ల మెల్ల విచ్చి మేలుకొన వేలయ్యా. IIవిన్నII

గరుడ కిన్నర యక్ష కామినులు గములై
విరహపు గీతముల వింతతాళాల
పరిపరివిధములఁ బాడేరు రాగాల నిన్నదివో
సిరిమొగము దెరచి చిత్తగించవేలయ్యా.IIవిన్నII

పొంకపు శేషాదులు తుంబురు నారదాదులు
పంకజభవాదులు నీపాదాలు చేరి
అంకెల నున్నారు లేచి అలమేలుమంగను
వేంకటేశుఁడా రెప్పలు విచ్చి చూచిలేవయ్యా.IIవిన్నII 6-25

వింత వింతలైన ఎందఱో భక్తుల విన్నపాలను వినాల్సి ఉంది. ఆదిశేషునిపై పవళించిన ఓ విష్ణుమూరితీ! ఆ ఆదిశేషుని పడగ అనబడే దోమతెఱని కొంచెం పైకెత్తవయ్యా!(శేషుని పడగను దోమతెఱతో పోల్యాడన్నమయ్య! విష్ణుమూర్తికి కూడా ఈ దోమల బాధ తప్పలేదన్నమాట!) తెలవాఱి అప్పుడే జాముపైగా అయ్యింది. దేవతలూ మునులూ అందఱూ కలసి నీ దర్శనం కోరి అదిగో వచ్చేస్తున్నారయ్యా! ఇంకా పడుకుని ఉంటే మంచిది కాదు. చల్లని తామర పూరేకుల వంటి అందమైన నీ కనులను మెల్ల మెల్లగా విప్పి మేలుకొన వేమయ్యా!

గరుడ కిన్నర యక్ష కామినులు గుంపులుగా కూడి వింత వింత తాళాలతో విరహగీతాలలో అందమైన రకరకాల రాగాలతో పరిపరి విధాలుగా నిన్నుకీర్తిస్తూ వస్తున్నా రదిగో నయ్యా. నీ సిరిమొగాన్నితెఱచి చిత్తగించవయ్యా అంటే కనులు తెఱచి వారిని చూడవయ్యా!

బ్రహ్మ, శేషుడు మొదలైనవారు, తుంబురుడు నారదుడు మొదలైన తపస్వులు ఎందఱో నీ పాదాల దగ్గఱ వరుసగా నీ దర్శనం కోసం వేచి ఉన్నారయ్యా! మెల్లగా కనులు విప్పి అలమేలు మంగమ్మను చూస్తూ మేలుకొని వారందరినీ చూడవయ్యా!

రెండవ సంకీర్తన

సాళంగనాట ఱేకు 53

పలుకుఁ దేనెల తల్లి పవళించెను

కలికితనముల విభునిఁ గలసినది గాన. IIపల్లవిII

నిగనిగని మోముపై నెఱులు గెలఁకులఁ జెదర

పగలైన దాఁకఁ జెలి పవళించెను

తెగని పరిణతులతోఁ దెల్లవాఱినదాఁక

జగదేకపతి మనసు జట్టిగొనెఁగాన. II పలుకుII

కొంగుజాఱిన మెఱుఁగు గుబ్బలొలయఁగఁ దరుణి

బంగారు మేడపైఁ బవళించెను

చెంగలువ కనుఁగొనల సింగారములు దొలఁక

నంగజగురునితోడ నలసినదికాన. IIపలుకుII

మురిపెంపు నటనతో ముత్యాలమలఁగుపై

పరవశంబునఁ దరుణి పవళించెను

తిరువేంకటచలాధిపుని కౌఁగిటఁ గలసి

యరవిరై నునుఁ జెమట నంటినదికాన. IIపలుకుII 6-74

మూడవ సంకీర్తన

ఆహిరి
అపు డేమనె నేమను మనెను
తపమే విరహపుఁ దాపమనె.IIపల్లవిII

పవనజ యేమనె పడఁతి మఱేమనె
అవనిజ నిను నేమను మనెను
రవికులేంద్ర భారము ప్రాణంబనై
ఇవల యెట్లఁ దరియించే ననె.IIఅపుII

యింకా నేమనె యింతి మఱేమనె
కొంకక యేమని కొసరుమనె
బొంకులదేహము పోదిది వేగనె
చింకవేఁట యిటు చేసె ననె. IIఅపుII

నను నేమనె ప్రాణము మన కొకటనె
తనకు నీవలెనె తాపమనె
మనుకులేశ ప్రేమపు మన కూటమి
ఘనవేంకటగిరిఁ గంటి ననె.IIఅపుII 6-97

ఈ కీర్తన (లంకలో హనుమ సీతను చూచి వచ్చినతర్వాత)శ్రీరాముడు-ఆంజనేయుల మధ్య జరిగిన సంభాషణ.వాకోవాక్య రూపాన రచించబడిన సంకీర్తన ఇది.

రాముడు-అపుడు సీత ఏమనింది? ఏమని నిన్ను అనమంది?
హనుమ-తన తపమే విరహము తో కూడిన తాపమని అన్నది.
రాముడు-పవనజ(వాయుపుత్రుడు)యింకా నిను ఏమని చెప్పమనింది? సీత యింకా ఏమన్నది? అవనిజ(భూపుత్రి) నిను ఏమని అనమంది?
హనుమ-రవి కులేంద్ర(సూర్యకులానికి ఇంద్రుని వంటి వాడా!)ప్రాణము నిలుపుట భారమై ఇక్కడ ఏవిధంగా గడపగలను? అని అన్నదయ్యా.
రాముడు-ఇంకా ఏమంది? సీత మఱేమని అన్నది? సందేహించక యేమని కొసరు గా చెప్పింది?
హనుమ-అనిత్యమైన ఈ దేహము తొందరగా పోదు అన్నదయ్యా. జింక కోసమైన వేట యిలా చేసిందని అన్నదయ్యా!
రాముడు-నన్నింకా ఏమనంది?
హనుమ- ప్రాణము మీ ఇద్దరికీ ఒక్కటే నందయ్యా! తనకూ నీ వలెనే తాపమని చెప్పమందయ్యా! మనుకులేశ(మనువు యొక్క కులమునకు ఈశ్వరుని వంటి వాడా!) ప్రేమతోడి మీ యిద్దరి కలయికకై ఎదురు చూస్తున్నానని అన్నదయ్యా! ఘనవేంకటగిరి-అన్నమయ్య గారి శ్రీవేంటేశ్వరుల ముద్ర.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *