May 2, 2024

పౌంటేన్ హెడ్ – నా అభిప్రాయం

రచన : వెంకట్ హేమాద్రిబొట్ల

 

ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది. అలాగే కొన్ని పుస్తకాలు కూడా. అటువంటి వాటిలో ఐన్ రాండ్ రాసిన “ఫౌంటైన్ హెడ్” ఒకటి.
మొదటి సారి ప్రచురించి ఆరు దశాబ్దాలు కంటే ఎక్కువే అయినా ఈ రోజుకి ఈ పుస్తకం యొక్క ఆదరణ తగ్గక పోవడం ఇందుకు తార్కాణం. ఏ ఒక్క తరానికో, ప్రదేశానికో లేక అప్పటి పరిస్థితులకో పరిమితం కాకుండా, చదివిన అందరిని ప్రభావితం చేస్తుంది ఈ పుస్తకం. అందుచేతనే ప్రతీ తరం ఈ పుస్తకం చదువుతున్నప్పుడు ఇది వారి జీవితానికి అద్దం పట్టేదిగా ఉందని అనుభూతి చెందడంలో ఆశ్చర్యం లేదు. సిద్ధాంతాలు, అదే విధంగా మనుషుల ఆలోచనా సరళి అనే అంశాలు ఎప్పటికి నిత్యనూతనంగానే ఉంటాయి. అలాగే వాటిని కధా వస్తువుగా తీసుకున్న పుస్తకాలు కూడానూ. ఆ కోవకి చెందిందే ఐన్ రాండ్ “ఫౌంటేన్ హెడ్”.
కధాంశానికి వస్తే – ఇందులో హీరో ఒక ఆర్కిటెక్ట్. అతని పేరు హోవార్డ్ రోఅర్క్. తన సిద్ధాంతాల మీద ఎనలేని నమ్మకం ఉన్న ఓ యువకుడు. ఎన్నో ప్రతిభా పాటవాలు ఉన్న ఈ కధానాయకుడు తన చదువు ముగిసి పట్టా చేతికందుకునే తరుణంలోనే గట్టి సవాలు ఎదుర్కొనవలసి వస్తుంది.
కళాశాల నుంచి డిబార్ చేసే పరిస్థితులలో, ఆ కాలేజీ డీన్ అతనిని పిలిచి మాట్లాడే సన్నివేశంతో పుస్తకం మొదలవుతుంది. ఆ కాలేజీ డీన్ హోవార్డ్ తో తన డిజైన్ సరళిని మార్చుకోకపోతే పట్టా ఇవ్వనని బెదిరిస్తాడు. అందుకు ఏ మాత్రము జంకకుండా తను సబ్మిట్ చేసిన డిజైన్ లలో ఎటువంటి మార్పులు చేయనని బదులిస్తాడు హోవార్డ్. కాలం చెల్లిన భవనాల డిజైన్లు, వాటిలో పొందుపరిచే ప్రాకారాలు, అలంకారాల వల్ల ఎంతో స్పేస్ వృధా అవుతుందని, అవి అనవసరమని వాదిస్తాడు. ఓ కొత్త ఒరవడి, కొత్త ఆలోచనలతో, ఆ నివాసాల్లో ఉంటున్న వారికి సౌకర్యంగా వారికి ఉపయోగపడే ప్లాన్స్ మాత్రమే గీస్తానని చెబుతాడు. ఫలితంగా అతను కళాశాల నుంచి బహిష్కరింపబడుతాడు.
ఇక్కడ హీరో యొక్క పాత్రను ఎంతో క్లారిటీతో మనకి పరిచయం చేస్తుంది రచయిత్రి. తను నమ్మిన సిద్ధాంతాల కోసం ఎన్ని కష్టాలోచ్చినా ఎదుర్కొని, ప్రలోభాలకి లొంగకుండా, దేనికి వెరవకుండా ఉండే ఒక విశిష్టమైన వ్యక్తి ఒక్క పాత్ర ఇది. ఇదే నమ్మకం, ఇదే వ్యక్తిత్వం ఈ పాత్రలో పుస్తకం అంతటా కనిపించి మనల్ని అబ్బుర పెడుతుంది.
ఈ పుస్తకం రాయడానికి రచయిత్రి ఎంతో పరిశోధన చేసి, కధావస్తువు సమకూర్చుకొని, అర్కిటెక్చర్ గురించి అధ్యయనం చేసి, నిష్ణాతులైన అర్కిటెక్ట్స్ ఎందరినో కలిసి వారి ఆలోచనలను తెలుసుకొని, కధారూపంగా వాటినంతటిని ఒక పుస్తక రూపంలో పొందుపరచడం అపారమైన కృషితో కూడుకున్న పని. తీరా రాయడం పూర్తి అయిన తరువాత, ఏ ఒక్క ప్రచురణ సంస్థ దీనిని ముద్రించడానికి ముందుకు రాదు. అప్పట్లో పేరొందిన ఎన్నో ప్రచురణ సంస్థలు ఈ మాన్యుస్క్రిప్ట్ ని తిరస్కరించాయి.
ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, మనం నవలలో చదువుతున్న సన్నివేశాలు కేవలం కల్పితాలు – హీరో కాబట్టి ఎంతటి కష్టమైనా చిరునవ్వుతో ఎదుర్కుంటాడు అనుకుంటాం. కాని, నిజ జీవితంలో రచయిత్రి నవల రాయడానికి పడిన కష్టాన్ని, ప్రచురణ సమయంలో ఎదుర్కున్న ఒడిదుడుకులకు ప్రతిబింబంగా మనం కధానాయకుడి పాత్రను చూడొచ్చు. పరిస్ధితులకు తలవంచకుండా, తాను అనుకున్న దాని కోసం పడిన నిరంతర శ్రమ, అకుంఠిత దీక్ష మనకు ఇరువురిలోనూ కనపడుతాయి.
మళ్ళీ మనం కధాంశానికి వస్తే – అదే కళాశాలలో పీటర్ కీటింగ్ అనే విద్యార్ధి కూడా ఉంటాడు. అతడు అధ్యాపకులకి ప్రీతిపాత్రుడుగా, అందరి మన్ననలు పొందేవాడిగా ఉంటాడు. అదే విధంగా ఆ సంవత్సరపు గోల్డ్ మెడల్ కూడా అతని కైవసమవుతుంది. స్కాలర్ షిప్ కి కూడా ఎంపిక కాబడతాడు.
ఇక్కడ నుంచి వాళ్ళ ప్రస్ధానం మొదలవుతుంది. పీటర్ ఎంతో పేరున్న సంస్థలో చేరితే హోవార్డ్ మాత్రం ఎవరికీ పెద్దగా తెలియని, కాని తనకి ఇష్టమైన ఆర్కిటెక్ట్ దగ్గర చేరుతాడు.
పరాన్న జీవులు అని ప్రకృతిలో జీవాలున్నాయి. అవి ఎంతసేపు ఎదుట వారి నుంచి లాక్కు తింటూ ఉంటాయి. తను అంచెలంచెలుగా ఎదుగుతున్న కాలంలో ఎప్పుడు కష్టాలు ఎదురైనా, పీటర్ ఈ పరాన్నజీవుల మాదిరి హోవార్డ్ దగ్గరికి వచ్చి వాలిపోతూ ఉంటాడు. తన డిజైన్ల లో ఉన్న లోపాలను, ప్లాన్స్ లో ఉన్న తప్పులను సరి చేయమని హోవార్డ్ ని నిస్సిగ్గు గా ప్రాధేయపడుతాడు. అతనికి సహాయం చేయడానికి ఎప్పుడూ నిరాకరించడు హోవార్డ్. ఈ సన్నివేశం పుస్తకంలో పలుమార్లు పునారావృతమవుతూ ఉంటుంది.
ఇక హీరోయిన్ పాత్రలో మనకి డొమినిక్ ని పరిచయం చేస్తుంది రచయిత్రి. ఎంతో సంక్లిష్టమైన పాత్ర కల్పన డొమినిక్ ది. తను కలలు కన్న ప్రపంచంలో రాజీకి ఎటువంటి చోటు లేదని బలమైన అభిప్రాయం ఉన్న పాత్ర ఇది. తను ఎంచుకున్న మార్గంలో భాగంగా మొదట పీటర్ ని వివాహం చేసుకోవడం, తదుపరి గెయిల్ (ఇంకొక అధ్బుతమైన పాత్ర) తో వివాహం, ఇలా ఆమె పాత్ర మలచడంలో ఎంతో వైవిధ్యాన్ని ప్రదర్శించారు రచయిత్రి. అదే విధంగా డొమినిక్ అనుభవించిన అంతర్మధనాన్ని రచయిత్రి వివరించిన తీరు చదవడమే తప్ప చెప్పగలిగింది కాదు.
ప్రేమ అనే పదానికి నిర్వచనం ఏమిటి? ఈ పదం మనం చాలా సార్లు విన్నాం. నిర్వచనాలు కూడా చాలా చదివాం. కాని హోవార్డ్ డొమినిక్ ల ప్రేమని ఎంతో హృద్యంగా మలిచి, ఇద్దరు విశిష్టమైన వ్యక్తులు, రెండు రాజీ లేని వ్యక్తిత్వాల అధ్బుతమైన అనుబంధం మనకి కళ్ళకి కట్టినట్టుగా చెపుతుంది రచయిత్రి.
ఇదిలా ఉండగా, ఎల్లోస్ వర్త్ టూహీ అనే పాత్రను పరిచయం చేసి, ఆ పాత్ర ద్వారా సమాజంలోని పోకడల గురించి మనకి చెప్పుకొస్తుంది రచయిత్రి. పరాన్నజీవులు అని చెప్పుకున్నాం కదా. అటువంటి వారికి సహాయ పడుతూ, వారితో సన్నిహితం గా మెలిగే పాత్ర ఇది. ఈ సమాజంలో రాజ్యమేలాలని, అందరూ తమ గుప్పిట్లో ఉండాలని కోరుకునే వ్యక్తిగా ఈ పాత్రను మలుచుతుంది. కాని దీని కోసం వారు ఎంచుకున్న మార్గం వేరు అని అంటుంది. సమాజ సేవ చేస్తున్నవారిలా, ప్రజల కోసం పాటు పడుతున్న వారిలా ఉంటూనే, నవ్యతకు నాణ్యతకు అడుగడుగునా అడ్డు పడే పాత్ర ఇది.
ఇక గెయిల్ వైనండ్ నవలలో ముఖ్యమైన మరో పాత్ర. అతి పేదరికంలోంచి, స్వశక్తితో, ఎన్నో న్యూస్ పేపర్స్ కి అధినేత గా ఎదిగిన పాత్ర ఇది. తన భావాలకి, సామాన్య పాఠకుడు కావాలనుకునే దానికి ఎంతో వ్యత్యాసం ఉందని గ్రహించి, తన ఆలోచనలను తనలోనే ఒక మారుమూల పొరలో దాచుకుంటాడు. సంచలన వార్తలు, సరుకు లేని వ్యాసాలూ, వదంతులు, వాటి మీద చర్చ – ఇలాంటివి మాత్రం ప్రచురిస్తూ ఉంటాడు.
కాని గెయిల్ – డొమినిక్ ని, అలాగే హోవార్డ్ ని – కలుసుకున్నప్పుడు వారితో తను మనసు విప్పి మెలగవచ్చు అని గ్రహించి ఎంతో సంతోషిస్తాడు. హోవార్డ్ కూడా అతనితో ఎంతో సన్నిహితంగా ఉంటాడు. హోవార్డ్ డొమినిక్ ని ఎంతగా ఇష్టపడుతాడో, గెయిల్ తో స్నేహాన్ని కూడా అంతే ఇష్టపడుతాడు. వీరి ముగ్గురి స్నేహం వారు ఎంచుకున్న జీవన విధానంతో ముడి పడి ఉండటం అనే అంశం ఎంతో అభిమానంగా చెప్పబడింది.
హోవార్డ్ తను ఎంచుకున్న దారిలో ఎన్ని కష్టాలు ఎదురైనా విజేతగా నిలవడంతో పుస్తకం ముగుస్తుంది.
ఇదే దృష్టాంతంగా, చివరికి ఒక ప్రచురణ సంస్థ ఈ పుస్తకం అచ్చు వేయడం, విడుదల అయ్యి ఈ పుస్తకం సంచలన విజయం సాధించడం నిజజీవితంలో జరిగిన అధ్బుతం.
మనిషికి ఉత్కృష్టమైన ఆశయాలు ఉండాలి, వాటిని సాదించుకోవడానికి అహర్నిశలు శ్రమించాలి, ఎన్ని అవరోధాలు ఎదురైనా అకుంఠిత దీక్షతో ముందుకు సాగాలి అని చెప్పడానికి రచయిత్రి ప్రతి పదంలోనూ, ప్రతి వాక్యంలోనూ పడిన తపన మనకి కళ్ళకి కట్టినట్టుగా కనిపిస్తుంది. ఆద్యంతము చదివిస్తుంది, మనల్ని ఆలోచింపచేస్తుంది. ఇది నా అభిప్రాయంలో ఐన్ రాండ్ “ఫౌంటైన్హెడ్”.

5 thoughts on “పౌంటేన్ హెడ్ – నా అభిప్రాయం

  1. present nenu one sitting (2 days) lo 100 above pages chadivanu. poorthi cheyadaniki inko 7 or 8 sittings (15 to 20 days) padochhu. konadaru ee novel ni malli malli chadivaaru ani naku telusu. kani naku aa avasaram padakapovachhu. endukante nenu indulo unde conversations ni repeated ga 3 or 4 times chadivithe kani next conversation ki vella leka pothunnanu. idi katha kosamo, anubhoothi kosamo chadavalsina novel kadu. ayn rand rasina pachhi ghataina matala kosam chadavalsina novel. deeniki connect aithe matram… bhagavadgitha lo slokhala maadiri indulo unna chala lines nu parayanam chestharu anadamlo nakaithe sandehame ledu.

  2. నేను ఆఖరు భాగం లో ఉన్నాను. ప్రతీ పాత్ర చిత్రీకరణ అద్భుతంగా ఉంటుంది . పర్సనాలిటీ డెవెలప్మెంట్ కోసం ప్రత్యేకించి సెల్ఫ్ హెల్ప్ పుస్తకాల చదవడం అంటే చిరాకు నాకు. ఇలా తెలియకుండా పాత్రల ద్వారా, లోకం పోకడల ద్వారా, ఆలోచనల ద్వారా మన ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేసే పుస్తకాలంటే ఇష్టం. ఆ కోవలో ఈ పుస్తకం ముందు వరుస లో ఉంటుంది అని విన్నాను, నిజమే అని చదివి తెలుసుకున్నాను. ఎటొచ్చి పుస్తకం సైజు చూస్తె మాత్రం భయం వేస్తుంది. మామూలు నవలలా కేవలం చదవడమే కాకుండా, చదివి ఆకలింపు చేసుకోడానికి సమయం ఎక్కువ వెచ్చించాలి ఈ పుస్తకం కోసం. మళ్ళీ మళ్ళీ చదవాల్సిన పుస్తకం (మొదటిసారి పూర్తీ చేస్తే 🙂 ).

  3. మీ విశ్లేషణ మనసుతో చేసినట్టు నాకు అనిపించింది.అభినందనలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *