May 2, 2024

ఐపిసి సెక్షన్ 174

రచన :  పసుపులేటి గీత


ఎండుటాకు నివురు కింద

నన్ను నేనే దాచుకున్న

నిప్పు పురుగును..

భయపడకు

తగలబడ్డమే తప్ప

తగలబెట్టడం తెలీనిదాన్ని!

అనాదిగా శూన్యాకాశపు రంధ్రంలో

మెరిడియన్ గూటి నల్లుతున్న

సాలీణ్ణి నేను

ఎన్నడూ గీత దాటలేదు.

గీతకవతలా, ఇవతలా చెరపడ్డ సీతనే

భయపడకు!

రొంటిలో దాచుకున్న

గవదబిళ్ళ్లల్ని మింగేశాను

నేనిక మట్లాడను.

రెప్పల్ని నిమిరి, ప్రాణాల్ని తివిరి

నా గుండెల్లోకి నేనే దిగబడ్డను

భయపడకు!

దిగుడుబావి లాంటి

లోకం నోరు మూసేందుకు

నీ నాలిక చివరెన్నో

అబద్ధాల బిరడాలున్నాయిగా,

చీరముక్క కొనలేదని

అలిగి ఎందులోనో

ములిగి చస్తాను కదా నేను!

కూర బావోలేదని

రెండు మాటలంటే

ఉడుక్కుని ఉరి బోసుకుంటాను కదా నేను!

నువ్వు దేంతోనో పడుకున్నా

ముసలి తండ్రి చచ్చినా

పెరట్లో బక్కటెద్దు బాల్చీ తన్నినా

కారణమేదైనేతేం..

నీ బ్లాటీంగ్ పేపర్ కింద సిరాచుక్కనవుతాను!

అల్లుకోవడం తప్ప

అల్లెత్రాటిని కాలేనిదాన్ని!

పుట్టగానే పుట్టి ములిగిందాన్ని

ముట్టుకుంటేనే

పుటుక్కుమనే మట్టిగాజును

నన్ను నేను చంపుకోవడానికే తప్ప

నన్ను నేను చదువుకోవడానికి తీరిందెన్నడు?

నా చితికి నేనే నిప్పయిందాన్ని

నా చావుకు

కర్త కర్మ క్రియ నేనేనంటూ

నీ నేరాల బాధ్యతను

నా మీదే వేసుకు మోసుకుంటున్నదాన్ని

ఇంకా భయమెందుకు…

నాలో బీజమై ఎదిగేదీ నువ్వే

నాలో రాచపుండు పిండమయ్యేదీ నువ్వే

అయినా, ఇప్పుడిక

నాకు శత్రువును నేనేనని నమ్మించు

నీ కుట్రనంతా నా చర్మం కిందే దాచేస్తాను

నీ మీసాలూ, అంగాలే

నా వాతబియపు కుండలో

బియ్యమై ఉడుకుతున్నాయి కదరా!

నన్ను నేను ముద్ద చేసి

నీ నోటికందిస్తూనే వున్నాను కదరా

భయపడకు!

తెల్లవారి వార్తల్లో

చెరువులో తేలిన శవాన్నవుతాను

నొసటిరాతని

ఛిద్రం చేసుకునే తూటానవుతాను

వంటగ్యాస్ సిలిండర్నై

భళ్ళున బద్దలవుతాను

ప్రేమ విఫలమై

నువాక్రాన్ మింగో, మింగకో

నీకు మింగుడుపడని

గండశిలనవుతాను

అదేం చిత్రమో

ప్రేమకి పక్షవాతమో

ప్రతిసారీ నేనే చచ్చి నువ్వు బ్రతికిపోతుంటావు!

నీకు నన్ను చూస్తే

కలర్ టీవీని చూసినట్టుంటుంది

డబుల్ డోర్ ఫ్రిజ్‌నై, మోటారు బైక్‌నై

నీ గబ్బు పెరట్లో డబ్బుల చెట్టునై

కాసింత అనురాగానికి మొహం వాచి మోడువారిపోతాను!

నా పాడెపక్కన

మార్కెట్ డ్రాగన్

స్వేచ్చగా రెక్కలు విప్పుకుని

సరళసరళంగా

చావు మోతవుతుంది.

అమెరికా నుంచి అనకాపల్లి దాకా

ఎక్కడెక్కడి రంధంతా నీకే

గజ్జికుక్క ఒంటిమీద పేనుకొరుకుల్లా

ఎంతకాలంరా  నీతో.

అందుకే అలిగేస్తున్నా.

శిక్షాస్మృతిలో విస్మృతిలో

నా అదృష్ట సంఖ్య ‘174’ !

నీ హత్యలన్నింటినీ

నా ఆత్మహత్యలుగా…

నిన్నే కాదు నీ కామెర్ల కళ్ళ ప్రపంచాన్నీ

నా శానిటరీ నాప్‌కిన్‌లా

విసిరేస్తున్నాన్రా, ఆత్మహీనుడా!!

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *